top of page

భరోసా

Writer's picture: Sairam AlluSairam Allu

#AlluSairam, #అల్లుసాయిరాం, #Bharosa, #భరోసా, #సామాజికసమస్యలు, #StoryOnSocialProblems

వారం వారం బహుమతుల పథకంలో ఈ వారం ఉత్తమ కథగా (29/12/2024) ఎంపికైన కథ


Bharosa - New Telugu Story Written By Allu Sairam

Published In manatelugukathalu.com On 23/12/2024

భరోసా - తెలుగు కథ

రచన: అల్లు సాయిరాం

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



ప్రపంచంలో ఏ మూలనున్న తెలుగువారైనా మూడు నెలల ముందు నుంచి రిజర్వేషన్ల కోసం ప్రయత్నించి దొరికినా, దొరకకపోయినా, డ్యూటీలకి సెలవులు యిచ్చినా, యివ్వక పోయినా, ఉన్న ఫళాన తట్టబుట్ట సర్దుకుని, ట్రైనో, బస్సో, కారో, అవసరమైతే లారీలు ఎక్కైనా సరే, ఏదో విధంగా సొంతూరికి చేరి జరుపుకోవాలని ఆశపడే పండుగ సంక్రాంతి. 


అటువంటి సంక్రాంతి పండుగ వస్తుందంటే రైల్వేస్టేషన్లు, బస్టాండులు కిక్కిరిసిపోతాయి. ఎలాగోలా, డబ్బులు ఎంత ఖర్చు అయినా యింటికి చేరిపోవాలనే జనాల ఆశను చూసి టిక్కెట్ల ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. అంత కష్టపడి ఊరికి వచ్చాక, ఎప్పుడొచ్చారంటూ, యిదేనా రావడం అని అంటూ వూరిలో పలకరింపులు చేస్తుండే బంధువర్గం సందడితో మొత్తం మైమర్చిపోతారు. 


ప్రతి యింటి ముందు గొబ్బెమ్మ ముగ్గులతో, యింటి నిండా చుట్టాలతో, పిండి వంటల వాసనలతో, చిన్నపిల్లలు ఆడుకునే జెల్దీ-హౌసీ ఆటలతో, పెద్దోళ్ళు ఆడుకునే కోళ్లపందాలు, పేకాటలు, మందు శిబిరాలతో ఒక రకమైన సందడిగా ఉంటుంది. 


 సతీష్ హైదరాబాద్ నుంచి బయలుదేరి పార్వతీపురంలో ట్రైన్ దిగి ఊరు వచ్చేసరికి భోగి మంటలు కూడా కాలిపోయి నల్లని బొగ్గులు మిగిలాయి. ఆ మంటల దగ్గరికి వెళ్లి, నమస్కారం పెట్టి, యింటి వైపు వస్తున్న సతీష్ తో “ఏమిరా లేటు అయిపోయావు? అని కొందరు, “భోగి మంటల దగ్గర కనిపించకపోయేసరికి, యిసారి పండుగకి మరి రావేమో అనుకున్నాంరా!” అని ఫ్రెండ్స్ అంటుంటే, “ఉండండి! యింటి దగ్గర కనపడి వచ్చేస్తాను!” అని సతీష్ యింటి వైపుకి నడిచాడు. 


ఇంటి ద్వారాలకి రంగులతో ముగ్గులు వేసుకుంటున్న జానకమ్మ, యింటి వైపు నడుచుకుంటూ వస్తున్న సతీష్ ని చూసి, ఎదురుగా వచ్చి “ఏం యింతవరకు? తెల్లవారి వచ్చేస్తున్నా అన్నావు కదా!” అని అడిగింది. 


సతీష్ వచ్చి కాళ్లు చేతులు కడుక్కుంటూ “ట్రైన్లు ఫుల్ లోడ్ గా ఉన్నాయమ్మా. ఆ తర్వాత బస్సులు దొరకలేదు. లేట్ అయిపోయింది!” అని చెప్పాడు. 


“సరేలే! బయట ఏమైనా టిఫిన్ తిన్నావా?” అని అడిగింది జానకమ్మ. 


“బయట టిఫిన్ చేస్తే మరొక గంట లేటవుతుంది. అలా ఉంది పరిస్థితి!” అని సతీష్ అంటే “సరే అయితే, అన్నం తిందువు. లోపలికిరా!” అని రంగు డబ్బాలకి మూత వేసి లోపలికి వెళ్ళింది జానకమ్మ. 


అన్నం తింటూ మధ్యలో “నాన్న ఎక్కడికి వెళ్లాడమ్మా?” అని అడిగాడు సతీష్. 


“నాన్న యింకెక్కడకి వెళ్తాడు. ఆ షావుకారు రమణబాబు దగ్గరికి వెళ్తాడు!” అని అంది జానకమ్మ. 


“వెళ్తాడులే. పండుగతో యిప్పుడెందుకు వెళ్లినట్టు?” అని సతీష్ అడిగితే, జానకమ్మ సతీష్ వైపు చూస్తూ “తీసుకున్నాం కదా ఒక భూమి కౌలు చెయ్యడానికి. ఈ భూమి కౌలు చేయడంలో పని ఎక్కువ ఉంటుంది. ఫలితం తక్కువ ఉంటుంది. ఈసారి నుంచైనా భూమి వదిలేద్దామని అంటే, మీ నాన్న వినట్లేదు. భూమి వదిలేసి ఏం చేస్తామంటున్నాడు. నువ్వు ఒక మాట చెప్పు! 


ఇప్పుడు రమణబాబు దగ్గరికి వెళ్ళిన విషయమైతే, యి పంట మొదటనుంచి మొన్న పంటకోత మిషన్ తోపాటు ధాన్యం తీసుకెళ్లడం కూడా మొత్తం వాళ్లే కదా. ట్రాక్టర్ రాజు, ఎరువుల షాపు సూరిబాబు బాకీల కోసం తెగ ఫోన్లు చేస్తున్నారని, రమణబాబుని మీ నాన్న డబ్బులు అడిగితే, ఒకసారి ఇంటికి వేస్తే, లెక్కలు చూద్దామన్నాడు. అందుకే మీ నాన్న వెళ్ళాడు. అదిగో, లెక్కలు తేలిపోయినట్టున్నాయి. మాటల్లోనే, మీ నాన్న వచ్చేశాడు!” అని యింటికి వస్తున్న గణపతికి ఎదురుగా వెళ్లి తలుపు తీసింది జానకమ్మ. 


గణపతి యింట్లోకి వస్తూ సతీష్ ని చూస్తూ “సతీష్ వచ్చేశావేంటి! ఇంకా రాలేదేంటి అని ఫోన్ చేద్దామనుకుంటున్నాను!” అని అంటున్న గణపతి ముఖంలో ఒక రకమైన నిరాశగా అసంతృప్తితో ఉండడం చూసి “నేను వచ్చేశాను గాని నాన్న, నీకు ఏమైంది? అలా ఉన్నావు?” అని అడిగాడు. 

“ఏం లేదు కానీ, నువ్వు తినేసిన తర్వాత, యి కాగితాలు చూడు!” అని అంటూ తన జేబులో దాచుకున్న కాగితాలు మంచం మీద పెట్టాడు. 


జానకమ్మ వైపు చూసి “నాకు యింత గంజి పోయ్యి!” అని గణపతి అనేసరికి, గణపతి మనసెరిగినవారిగా, ఏదో జరిగి ఉండొచ్చని అని అర్ధం చేసుకుని, జానకమ్మ వంటింట్లోకెళ్లి అన్నం పెట్టి తీసుకొచ్చింది. సతీష్ గబగబా తినేసి కడుక్కుని వచ్చాడు. వచ్చి ఆ కాగితాలు తీసి చూస్తున్నాడు. గణపతి తింటున్నాడు. 


గణపతే ఫోన్ మ్రోగుతుంటే, సతీష్ చూసి “ట్రాక్టర్ రాజు ఫోన్ చేస్తున్నాడు నాన్న!” అని అంటే, గణపతి ఫోన్ తీసుకుంటూ “ఈ రాజుగాడు ఆగలేకపోతున్నాడురా బాబు!” అని అంటూ ఫోన్ ఎత్తి “రాజు! గంట ఆగి యింటికి రా. డబ్బులు తీసుకెళ్దువు గాని!” అని అవతలివైపు ఉన్న రాజుకి మాట్లాడే అవకాశం కూడా యివ్వకుండా ఫోన్ కట్ చేసేశాడు. 


గణపతి చిరాకు చూసి “ఇంతకీ ట్రాక్టర్ కి ఎంత యివ్వాలి నాన్న?” అని అడిగాడు సతీష్. “ ట్రాక్టర్ రాజుకే కాదు, ఎరువుల షాపు సూరిబాబుకి, పంటకోత మిషన్ వాళ్ల వరకు, ఎవరెవరికి ఎంత యివ్వాలనేదే, ఆ కాగితాల్లో ఉన్నాయి‌. అవి చూడమంటున్నాను నీకు. షావుకారు డబ్బులు మనకి యిచ్చాడనేది వాళ్లకి తెలిసిపోతుంది. ఈరోజు అందరూ వస్తారు. విత్తనాలు దగ్గర నుంచి పంట ధాన్యం అమ్మినంతవరకు అన్ని లెక్కలు రాశాను. తొందరగా లెక్కలు చూడు!” అని గణపతి అదే చిరాకులో అంటే సతీష్ మౌనంగా కాగితాలన్ని చూస్తున్నాడు. 


సతీష్ ఒక్కొక్క కాగితం చదువుతూ “ఇది నాయుడుగారి దగ్గర ఎకరా పొలానికి 11 బస్తాలు కౌలు యివ్వడానికి ఒప్పుకుంటున్నట్టు రాసిన పత్రం. ఇది షావుకారు దగ్గర 15000 రుపాయిలు అప్పు తీసుకున్న పత్రం. విత్తనాలు కొనడానికి 1000 అయ్యింది. నారుమడి దుక్కిలు మూడుసార్లు, పొడి దుక్కిలు రెండుసార్లు, తడి దుక్కిలు రెండుసార్లు దున్నడానికి మొత్తం ఐదు గంటలయింది. గంటకి 1100 లెక్కన 5500 ట్రాక్టర్ రాజుకి యివ్వాలి. పొలంలో పారపనులు కూలీవాళ్లని పెట్టుకుండా, మనం సొంతంగా చేసుకున్నాం. కాబట్టి, ఒక 1500 మిగిలింది. ఎకరా ఆకుతీతకి ఎకరాకి 1500, పంట నాట్లేయడానికి 2500 అయ్యింది. ఎరువులకి యూరియా, 28-28-0-13, పొటాష్, మొత్తం కలిపి పదివేలు అయ్యిందంట. 


ఎరువుల షాపు యజమాని ఒక కాగితం రాసిచ్చాడు. పంట పండింది. పంట కోత మిషన్ గంటకి 3200. ఇదేంటి, ఎకరాకి గంట నలభై ఐదు నిమిషాలు పట్టింది నాన్న! పొలమంతా మిషన్ ని లాక్కుని వెళ్లాడా ఏంటి?” అని సతీష్ ఆశ్చర్యంగా అడిగాడు. 


గణపతి కోపంగా “వాళ్ల యిష్టం నాయనా! మన వరి చేను నిలువుగా ఉంది కాబట్టి, వేగంగా అయిపోయిందంట‌. గాలికి ఏమైనా పడిపోయి ఉంటే, యింకా టైం ఎక్కువ పడుతుందంట! మెషిన్లు వచ్చినట్టుగా తిప్పుతారు. టైం నచ్చినట్టుగా చెప్తారు! మన దగ్గర ఎద్దులు లేవు. బండి లేదు. మనకి చేతకాకపోతే, ఎవడు ఏం చెప్పినా చెయ్యాలి మరి!” అని నిస్సహాయంగా అన్నాడు. 


సతీష్ కాసేపు మౌనంగా ఉండి “పంటకోతకి మనకి 5600 అయ్యింది. ఇది షావుకారు యిచ్చిన కాగితం. ఈసారి పంట 31 బస్తాలు పండింది. అందులో 11 బస్తాలు నాయుడుగారికి కౌలు యివ్వాలి. అవి పోతే, 20 బస్తాలు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు 2320 రుపాయిలు. అంటే 80 కేజీల బస్తాకి 1856 రుపాయిలు పడుతుంది. కానీ, మన వర్తకుడు వంద కొట్టేసి, 1750 రుపాయిలు లెక్కన వేశాడు. అంటే 35000 రుపాయిలు. అందులో 15000 అప్పు తీసేస్తే 20000. మన కష్టం కలపకుండా, మనం పెట్టిన పంట ఖర్చులే 25000 దాటిపోయింది. మరింకేం మిగులుతుంది కౌలు రైతులకి?


ఆరునెలలు అప్పులు పాలయ్యిపోయి వ్యవసాయం చేస్తే, ఏం మిగలకపోతే ఎందుకు చేస్తున్నట్లు?” అని కోపంగా అడిగాడు. గణపతి సతీష్ ఆవేదనని అర్ధం చేసుకుని “వ్యవసాయమేమి జూదం కాదు కదా. రాత్రికి రాత్రే లాభాలు వచ్చేయడానికి! ఇంకా మన షావుకారు కాబట్టి, 1750 అంటున్నాడు. మిగతా వర్తకులు 1720 అని, 1730 అని ఒక్కొక్కళ్ళు ఒక్కో రేట్లు చెప్తారు. పైగా 80 కేజీల బస్తా అయితే, అది బాగాలేదు, రంగు బాగాలేదు, మచ్చ వచ్చేసింది అని చెప్పి రెండు కేజీలు పెంచి 82 కేజీలకు తూస్తారు. కానీ, 80 కేజీలకే డబ్బులు యిస్తారు. 


ఏదోలాగా ధాన్యం అమ్ముడైపోతే చాలు అనే స్థాయికి విసిగి వేసారిపోయిన రైతులు, ఎవరు ఎంతచెప్పినా ఊకొడుతున్నారు. ట్రాక్టర్ వాళ్ళని, వ్యాపారస్తులని, కూలీలను పెంచడానికే రైతులు వ్యవసాయం చేస్తున్నట్టున్నాం!” అని అన్నాడు. తన పని చేసుకుంటూ, తండ్రికొడుకుల మాట్లాడుకుంటున్న మాటలని వింటుంది జానకమ్మ. 


సతీష్ “అదేంటి నాన్న! ఏం మిగిలినా, ఆ రెండో పంటలోనేనా! ఆ పంటలో మాత్రం ఏం మిగిలిపోతుంది. కౌలుకి యివ్వాల్సిన ఆ పది బస్తాలే కదా మిగులుతుంది. మిగతా ఖర్చులైతే సేమ్ అలాగే ఉంటాయి కదా. ఒక కుటుంబం సంవత్సరం మొత్తం సంపాదన పది, పదిహేనువేలు కుడా కనిపించట్లేదు. ఆ కుటుంబానికి మిగతా ఖర్చులకు గాని, హాస్పిటల్ ఖర్చులకుగాని ఎక్కడనుండి డబ్బులు వస్తాయి! ముఖ్యంగా, కౌలు రైతులు భూమి వేరేవాళ్ళ యొక్క భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తుంటారు. 


వీళ్ళకి పంట మదుపులకి లోన్ తీసుకుందామంటే, భూమి సొంతది కాదు కాబట్టి బ్యాంకు లోన్ యివ్వరు. కాబట్టి, ప్రైవేటు వర్తకులు, వ్యాపారుల దగ్గర అప్పులు చేసి పంట మదుపులకి వాడతారు. చివరికి ఆ పంట మీద వచ్చిన పంట సాయం కూడా వారికే అమ్మాల్సివస్తుంది. వాళ్లు అసలు అప్పు, దాని మీద వడ్డీలు కోసేసి పదో, పావలా వాటా యిస్తారు. అందుకే అప్పుల బాధలు పడలేక చాలామంది రైతులు ఏదోక అఘాయిత్యం చేసుకుంటున్నారు. పండుగ పూట కూడా ముఖంలో సంతోషం లేకుండా ఒక రైతు ఉన్నాడంటే, యింతకన్నా అద్వాన్నమైన పరిస్థితి యింకొటి లేదు!” అని ఆవేశంగా సతీష్ మాట్లాడుతుంటే గణపతి, జానకమ్మ లు చూస్తున్నారు. 


కాసేపు తర్వాత సతీష్ “నాన్న! నాయుడుగారితో మాట్లాడడానికి వెళ్తావు కదా. వెళ్లి ఏం చెప్తావు? ఇంతకీ భూమి కౌలుకి ఉంచుతున్నామా లేదా వదిలేస్తున్నామా?” అని అడిగాడు. ఇంతకుముందు సతీష్ మాట్లాడిన మాటలతో ఆలోచనలో పడిన గణపతి “అదే ఆలోచిస్తున్నాను. ఇన్ని ఖర్చులు, యింత నష్టం చూసిన తర్వాత, వ్యవసాయమే చేయకూడదు అనిపిస్తుంది. కానీ, మరి మనకి అలవాటైపోవడం వలనో లేక ఒక రైతుగా జనాలకి అవసరమైనది వదలకూడదనో, మరి ఎందుకో తెలియదు గాని, నాకైతే వదలాలి అనిపించట్లేదు. ఉన్నమాట చెప్పేస్తున్నాను!” అని అన్నాడు గణపతి. 


జానకమ్మ కోపంగా “మళ్లీ ఎందుకయ్యా! ఇప్పుడే తండ్రికొడుకులిద్దరు లెక్కలు వేసుకున్నారు కదా. మళ్లీ ఎందుకు?” అని గట్టిగా అడిగింది. 


“నాకు తెలుసే! నష్టమే! చెయ్యడం కష్టమే! వ్యవసాయం అనేది అవసరం. అది గుర్తించకుండా, ప్రభుత్వాలనుంచో, జనాలనుంచో ఆపదలో రైతుల్ని ఆదుకుంటారని భరోసా ఉండకపోవచ్చు‌. కానీ, అదే ప్రభుత్వానికి, అదే జనాలకి, రైతు అనేవాడు ఉన్నాడు. తాను పస్తులుండైనా, ఎదుటివారికి అన్నం పెడతాడనే భరోసా ఎప్పటికీ ఉండాలి!” అని చెప్పేసరికి సతీష్, 


జానకమ్మ నిజమే కదా అని అనిపించింది. సతీష్ ఆలోచిస్తూ “భూమిని వదలొద్దు. కౌలుకి చేద్దాం!” అని అంటుంటే, గణపతి ఆనందంగా, జానకమ్మ ఆశ్చర్యపోతూ “ఇదేంటి! సతీష్ కౌలుకి చేద్దాం అంటున్నాడు!” అని చూస్తున్నారు.


సతీష్ కొనసాగిస్తూ “కానీ నాన్న! మన కుటుంబానికి కూడా ఆదాయం కావాలి కదా. సిటీలోకి వచ్చి ఏదో పని చేసుకుని, అవసరమైనప్పుడు, అంటే, పంట పండించడానికి ఎలాగో మనం మెషిన్లు వాడుతున్నాం కాబట్టి, అవసరమైనప్పుడు ఉంటే సరిపోతుంది. ట్రాక్టర్ కి చెప్తే దున్నుతాడు. కూలీలకి చెప్తే ఎరువులు కొడతారు. నేనేమంటున్నానంటే, వ్యవసాయం వదలొద్దు. అలాగని కుటుంబ పరిస్థితి చూసుకోవాలి కదా!” 


సతీష్ అంటే అదే గణపతికి, జానకమ్మకి సమ్మతంగా అనిపించింది. “సరే అయితే! ఇప్పుడే నాయుడుగారి యింటికెళ్ళి, యిదే విషయం చెప్పి వస్తాను!” అని ధైర్యంగా బయలుదేరాడు గణపతి. 


***

అల్లు సాయిరాం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: పేరు అల్లు సాయిరాం


హాబీలు: కథా రచన, లఘు చిత్ర రూపకల్పన

ఇప్పటివరకు పది కథల దాకా ప్రచురితమయ్యాయి.

ఐదు బహుమతులు గెలుచుకున్నాను.


 


 



 
 
 

Komentar


bottom of page