#అత్తగారికథలు #అత్తాకోడళ్ళకథలు, #LVJaya, #LVజయ, #BharyabharthalloGelupevaridi, #భార్యాభర్తల్లోగెలుపెవరిది
Bharyabharthallo Gelupevaridi - New Telugu Story Written By L. V. Jaya
Published in manatelugukathalu.com on 15/12/2024
భార్యాభర్తల్లో గెలుపెవరిది - తెలుగు కథ (అత్తగారి కథలు - పార్ట్ 10)
రచన: L. V. జయ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
రాధకి మహాగయ్యాళి అని పేరు. పెద్దగా చదువుకోకపోయినా, ఇంట్లో అన్ని నిర్ణయాలు రాధే తీసుకుంటుంది. ఇంట్లోవాళ్ళందరూ, ఇష్టమున్నా, లేకపోయినా రాధ మాటే వినాలి. వినకపోతే తగువులుపెట్టి, వినేటట్టుగా చేసుకుంటుంది. రాధ పెట్టే గొడవలకి, పరువుపోతుందేమోనన్న భయంతో, ఆమె భర్త మాణిక్యాలరావుతో సహా అందరూ ఆమె మాట వింటారు.
రాధ కొడుకు, సమర్థ్ పెళ్ళి విషయంలో మాత్రం రాధ మాట చెల్లలేదు. జాగృతి చదువుకున్న అమ్మాయి, మంచి పిల్ల. జాగృతిని పెళ్ళిచూపుల్లో చూసిన సమర్థ్, జాగృతిని తప్ప ఇంకెవ్వరిని చేసుకోనని చెప్పడంతో, వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోక తప్పలేదు రాధకి.
పెళ్లికిముందునుండే, సమర్థ్, జాగృతి మీద చూపిస్తున్న ప్రేమని చూసి, కుళ్ళిపోయింది రాధ. 'సమర్థ్, జాగృతికి లొంగిపోతాడేమో, పెళ్ళితరువాత, జాగృతి అందరి మీదా పెత్తనం చెలాయిస్తుందేమో' అనుకుంది రాధ. 'నా కొడుకు, నా చేతిలోనే ఉండాలి, నా మాటే వినాలి. ఎక్కడినుంచో వచ్చినదాని చేతిలోకి పెత్తనం వెళ్లిపోకూడదు.' అని నిర్ణయించుకుంది.
పెత్తనం చెయ్యడంవల్లే, అందరూ తనకి భయపడుతున్నారని, భర్తతో సహా, ఎవరి ప్రేమనీ పొందలేకపోయిందన్న విషయాన్ని తెలుసుకోలేకపోయింది రాధ.
***********************************************************************
సమర్థ్, జాగృతిల పెళ్ళిలో, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ అయ్యాక, పెద్దలందరి ఆశీర్వాదాలు తీసుకున్నారు కొత్తదంపతులు. "నూరేళ్లపాటు కలిసిమెలసి, చక్కగా కాపురం చెయ్యండని" ఆశీర్వదించారు అందరూ.
తరువాత జరగబోయే తలంబ్రాల కోసం, సమర్థ్, జాగృతి కజిన్స్, స్నేహితులు చుట్టూ మూగారు. ఎవరి తరపువాళ్ళని వాళ్ళు ప్రోత్సహిస్తూ, ఎంతో సరదాగా, నవ్వులతో, మొదలయ్యాయి తలంబ్రాలు.
జాగృతిని ఆటపట్టిస్తూ, జాగృతి మీద సమర్థ్ తలంబ్రాలు వేసాడు సమర్థ్. జాగృతి కూడా నవ్వుతూ, తిరిగి సమర్థ్ మీద తలంబ్రాలు వేసింది. సమర్థ్ గెలవాలని ప్రోత్సహిస్తున్న వాళ్ళని చూసి ఆనందించింది రాధ, కానీ, జాగృతి ఆనందాన్ని చూసి తట్టుకోలేకపోయింది.
జాగృతి దగ్గరికి వచ్చి, జడ సర్దునట్టు నటిస్తూ, జాగృతికి మద్దత్తునిస్తున్న వాళ్ళతో, "ఏమిటీ గోల? ఆడ, మగా తేడాలేకుండా, ఎందుకా నవ్వులు? వెళ్ళండి ఇక్కడనుండి." అంది కోపంగా. జాగృతి తరపువాళ్ళు, స్నేహితులు, రాధకి భయపడి, దూరంగా జరిగారు. తరువాత, జాగృతితో, "పెళ్ళిలో తలదించుకుని కూర్చున్న పెళ్లికూతుళ్లనే చూసానుగానీ, మొగాడితో సమానంగా, నేనంటే నేనని ఎగబడే ఆడదాన్ని నిన్నే చూస్తున్నాను. నీకసలు సిగ్గన్నది ఉందా?" అంది.
జాగృతి కి, తను చేసిన తప్పేమిటో అర్ధంకాలేదు. 'పెళ్ళిలోనే ఈ రకంగా మాట్లాడుతున్నావిడ, పెళ్ళి తరువాత ఇంకెలా ఉంటుందో?' అన్న ఆలోచనవచ్చి, కళ్ళలో నీళ్లు తిరిగాయి జాగృతికి. ఎవరికీ కనపడకుండా, కన్నీళ్లు తుడుచుకుంది.
'రాధ రాగానే, జాగృతి మొహం ఎందుకు మాడిపోయినట్టుంది? ఏమయ్యింది?' అన్నట్టు రాధని అనుమానంగా చూసాడు సమర్థ్. "ఏమిలేదు. నువ్వే గెలవాలని జాగృతి అనుకుంటోంది. ఎక్కడా తగ్గకు." అని సమర్థ్ తో చెప్పింది రాధ.
రాధ ప్రవర్తనని, జాగృతి ఏడవడాన్ని,పెళ్ళి చేయిస్తున్న పురోహితుడు చూసాడు.
ఎంతో సంతోషంగా, నవ్వులతో, మొదలైన తలంబ్రాలు, సమర్థ్ గెలుపుతో, జాగృతి కళ్ళలో నీళ్ళతో ముగిసాయి.
తలంబ్రాలు తరువాత, ఉంగరాల బిందె ఆట మొదలయ్యింది. చక్కగా అలంకరించిన బిందెలో, నీళ్ళు పోసి, కొత్తదంపతుల ఎదురుగా పెట్టారు. ఈ ఆటలో ఎవరు గెలుస్తారా, అని అందరూ ఆతృతగా ఎదురుచూసారు.
పురోహితుడు మైక్ తీసుకుని, అందరినీ నిశబ్దంగా ఉండమని చెప్పి, "పెళ్ళిలో జరిగే ప్రతీ తంతుకి అర్థముంది. తలంబ్రాలు, కొత్తదంపతుల మధ్య ప్రేమ, సామరస్యం పెంచడమే కాకుండా, దైవ ఆశీర్వాదాన్ని కూడా ఇస్తాయి. ఇక, ఈ ఉంగరాల బిందె, సరదా ఆటలా కనిపించినా, దీనిలో కూడా అర్థముంది. కుండలోని నీరు, జీవిత అనుభవాలని సూచిస్తుంది. జీవితంలోని రాబోయే కష్టసుఖాలని, హెచ్చుతగ్గుల్ని, మలుపులని, భార్యాభర్తలు కలిసి దాటాలి. వివాహం, విజయవంతం కావాలంటే, అనవసరమైన అహంకారాలు, ఎక్కువతక్కువలకి చోటివ్వకూడదు. అంతేకాకుండా, ఈ బిందెలోనుండి ఉంగరాన్ని తీయడమనేది, జంట యొక్క భాగస్వామ్య బాధ్యతలు, లక్షణాల్ని సూచిస్తుంది. ఇందులో ఎవరు గెలిచినా, ఇద్దరూ గెలిచినట్టే." అని చెప్పాడు. విన్నవాళ్ళందరూ, గట్టిగా చప్పట్లు కొట్టారు.
"వివాహబంధాన్ని గురించి చాలా బాగా చెప్పారండి. ' అని పురోహితుడికి నమస్కరించింది జాగృతి.
"జాగ్రత్త తల్లీ. తలంబ్రాలు జరుగుతున్న సమయంలో జరిగినవన్నీ చూసాను. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలని దీవిస్తున్నాను." అని జాగృతిని ఆశీర్వదించారు పురోహితుడు.
పురోహితుడు చెప్పిందంతా విన్నా కూడా, రాధాలో ఏ మార్పు రాలేదు. సమర్థ్ తో, "పురోహితుడు చెప్పినదేమీ పట్టించుకోకు. ఈ ఆటలో నువ్వు గెలిస్తే, జీవితం మొత్తం నీ చేతిలోనే ఉంటుంది. నీ మాటే నెగ్గుతుంది. అందుకని, ఏం చేసైనా సరే, నువ్వే గెలిచి తీరాలి." అని చెప్పింది. తప్పకుండా గెలుస్తానని, రాధకి భరోసా ఇచ్చాడు సమర్థ్. పురోహితుడు చెప్పిందేమీ సమర్థ్ కి అర్ధం అవ్వలేదని, అర్ధం అవ్వనివ్వకుండా రాధ చేస్తోందని తెలిసింది జాగృతికి.
పురోహితుడు, బిందెలో ఉంగరం వేసి, సమర్థ్ ని, జాగృతిని వెతకమని చెప్పాడు. గెలవాలన్న కోరికతో, వెంటనే బిందెలో చెయ్యి పెట్టి వెతికాడు సమర్థ్. సమర్థ్ కి ఉంగరం దొరకలేదు. జాగృతి చెయ్యి పెట్టిన వెంటనే దొరికింది. తనకి దొరికిన ఉంగరాన్ని, బయటకి తీసి చూపించింది. చుట్టాలందరూ చప్పట్లు కొడుతుంటే, రాధ తట్టుకోలేకపోయింది.
"ఇక రెండు అవకాశాలే మిగిలాయి. ఈ రెండిట్లో, నువ్వే గెలవాలి. అర్ధం అయ్యిందా?" కోపంగా అంది రాధ, సమర్థ్ తో. గెలవాలన్న కోరిక పెరిగింది సమర్థ్ కి. 'ఇప్పుడు గెలవకపోతే, పరువుపోతుంది.' అనుకున్నాడు సమర్థ్.
పురోహితుడు, మళ్ళీ, ఉంగరాన్ని బిందెలో వేసి, వెతకమన్నాడు. రెండోసారి కూడా జాగృతికే దొరికింది ఉంగరం. జాగృతి బయటకి తీసి, చూపించేలోపు, జాగృతి చేతిలోని ఉంగరాన్ని తీసుకుని, తానే వెతికినట్టుగా, బయటకి తీసి చూపించాడు సమర్థ్. "ఆఖరిసారి కూడా నువ్వే గెలవాలి." అని సమర్థ్ ని ప్రోత్సహించింది రాధ. సరేనన్నాడు సమర్థ్.
కానీ, మూడోసారి కూడా, జాగృతికే ఉంగరం దొరికింది. బయటకి తీసి చూపించాలా వద్దా అని జాగృతి ఆలోచిస్తుండగా, జాగృతి చేతిని గిల్లాడు సమర్థ్. జాగృతి చేతిలోంచి జారిన ఉంగరాన్ని, తన చేతిలోకి తీసుకుని, బయటకి తీసి చూపించాడు. సమర్థ్ గెలిచినందుకు,
రాధ ఆనందానికి హద్దులులేవు.
*********************************************************
ఉంగరం బిందె ఆటలో అసలు జరిగిందేమిటన్నది, జాగృతి ఎప్పటికీ, ఎవరికీ చెప్పలేదు. జీవితమంతా, సమర్థ్ గెలుపులో, తన గెలుపుని చూసుకుంటూ, సమర్థ్ ప్రేమని సంపాదించుకుంది.
ఇంతకీ గెలుపెవరిది? ప్రపంచానికి కనపడే గెలుపు సమర్థ్ ది అయితే, అసలు విజయం జాగృతిదా?
భార్యాభర్తల్లో, ఎవరు గెలుస్తే ఏమిటి? ఆ విజయం ఇద్దరిదీ కదా. భార్యాభర్తలు, ఇద్దరు కాదు, ఒక్కరే. ఎవరు గెలిచినా, ఇద్దరూ గెలిచినట్టే కదా.
ప్రేమని కాకుండా, పెత్తనాన్ని కోరుకునే, రాధలాంటివాళ్ళకి ఇది అర్ధమవుతుందా?
***
L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : LV జయ
నా పేరు LV జయ.
https://www.manatelugukathalu.com/profile/jaya
నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం.
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు
భార్యాభర్తల్లో గెలుపెవరిది? - ఈ కథ కుటుంబ బంధాలు, ప్రేమ, ఆధిపత్యం మధ్య సమతుల్యత గురించి. కథలో రాధ తన కోడలు జాగృతిపై ఆధిపత్యాన్ని చెలాయించాలనుకుంటుంది, కానీ జాగృతి తన ప్రేమతో పరివారాన్ని సమానంగా చూస్తుంది. పురోహితుడు వివాహ క్రీడల ద్వారా జీవన తత్వాన్ని వివరిస్తూ, భార్యాభర్తలు పరస్పర సహకారం, ప్రేమతో జీవితం ముందుకు నడపాలన్న సందేశం ఇస్తాడు.
సారాంశం: ప్రేమే గెలుస్తుంది, పెత్తనం కాదు.