#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #BulusuRavisarma, #బులుసురవిశర్మ, #BhavishyathPranalika, #భవిష్యత్ప్రణాళిక

Bhavishyath Pranalika - New Telugu Poem Written By - Bulusu Ravi Sarma
Published In manatelugukathalu.com On 25/01/2025
భవిష్యత్ ప్రణాళిక - తెలుగు కవిత
రచన: బులుసు రవి శర్మ
దూరంగా రోడ్డు ప్రక్క ఆ భవనం
శిథిలమైన కోటలా నిలబడి నిట్టూరుస్తూ వుంటుంది
గేటు కిర్రు చప్పుడు మరీ మరీ చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది
చుట్టూ వున్న చెట్లు పరాభవం చెందిన సైనికుల్లా
సిగ్గుతో తలలు వంచుకొని వుంటాయి
గోడమీద పిల్లులు ఇంకా బల్లులు
పెరట్లో కుక్కలూ ఒకే రకమైన చూపులతో వుంటాయి
ఒక గదిలో బామ్మ మూలుగులు
మరొ గదిలో తాతగారి గురక
వరండాలో పిన్నిగారి ప్రేలాపన
నిశ్శబ్దాన్ని రెండుగా చీలుస్తూ వుంటాయి
మళ్ళీ నిశ్శబ్దం జరాసంధుడిలా రాజ్యామేలుతుంది
రోజు ఒకే రకం వంటలు వండి వండి
విసిగిన వంటవాళ్లు కాల్చిన బీడీ పొగ మాత్రం
పెరటి వారండాలో పచార్లు చేస్తూ వుంటుంది
గదుల్లో మంచాల మీంచి లేచిన గబ్బు కంపు
గర్వంగా తిరుగుతూ వుంటుంది
మంచాలు కుర్చీలు ఫ్యాన్లు మాత్రం
చివరి మజిలీ చేసినా వాళ్ళ కథలు
మననం చేసుకుంటూ సంతాప సభలు చేస్తాయి
గేటు కిర్రు చప్పుడయినప్పుడల్లా
అందరి కళ్ళలో దీపాలు ఒక్కసారిగా వెలుగుతాయి
కన్నీళ్ళ కోసం కట్టిన కాలువ
రోజు నిండిపోయి వుక్కిరి బిక్కిరి అవుతుంది
ఆశలు గుండెల్లో వెలుగుతూ రాత్రి వెలుగుని ఇస్తాయి
మనిషి ప్రగతితో పాటు పెరిగే వృద్ధాశ్రమాలు
ఊరు ఊరికి వీధి వీధికి వెలిసి తమ ఉనికి
విశ్వమంతా చాటి చెప్తున్నాయి
ఇది కూడా ప్రగతేనని
మనుషుల ఛాతీలు మరి కొంచెం పెరిగాయి
రండి! అందరం తలా ఓ మంచం రిజర్వు చేసుకుందాం
ప్రగతి ముసుగులో మనం చంపేసిన
మానవ సంబంధాల శ్మశాన వాటికల్లో
మరిన్ని వృద్ధాశ్రమాలు నిర్మించు కుందాం!
మనందరి భవిష్యత్ ప్రణాళికకి రంగం
ఇప్పటి నుండే సిద్ధం చేద్దాం!!
-బులుసు రవి శర్మ
Comments