top of page

భవ్యమనోజం



'Bhavyamanojam' - New Telugu Story Written By Mallavarapu Seetharam Kumar

Published In manatelugukathalu.com On 04/05/2024

'భవ్యమనోజం' తెలుగు కథ

రచన: మల్లవరపు సీతారాం కుమార్

కథా పఠనం: మల్లవరపు భవ్య



కె. జ్ఞానేశ్వర్, సైకియాట్రిస్ట్ 


బోర్డు చూసి లోపలి నడిచారు బాలసుబ్రమణ్యం, కస్తూరి దంపతులు. 


రిసెప్షన్ లో ఉన్న అమ్మాయి వాళ్ళ వంక చూసి "అపాయింట్మెంట్ తీసుకున్నారా" అని ప్రశ్నించింది. 


"అవునండి. ఉదయం ఫోన్ చేశాను. ఒంటిగంటకు రమ్మన్నారు" చెప్పాడు బాలసుబ్రమణ్యం. 


ఆ అమ్మాయి, దంపతులిద్దరినీ మార్చి మార్చి చూసి "మీలో పేషంట్ ఎవరు?" అని అడిగింది. 


"పేషేంట్ మా అమ్మాయి. ఆమెను తీసుకొని రాలేదు. ముందుగా డాక్టర్ గారిని కలిసి.. " బాలసుబ్రమణ్యం చెబుతుండగానే "అవునులెండి. కొందరు పేషంట్ లు మరీ వైల్డ్ గా రియాక్ట్ అవుతారు. పక్కనున్నవారిని కరవడం, గోళ్ళతో రక్కడం చేస్తుంటారు. అలాంటి కేసుల్లో ఫ్యామిలీ మెంబర్స్ చెప్పేదాన్ని బట్టి కొన్నిసార్లు ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు డాక్టర్ గారు" అంది ఆ అమ్మాయి. 


"మా అమ్మాయికి అలాంటి అవలక్షణాలు ఏమీ లేవు లెండి. కట్టు, బొట్టు, మాట, మన్నన అనీ సవ్యంగా ఉంటాయి" కాస్త కోపంగా అంది కస్తూరి. 


"అన్నీ సరిగ్గా వుంటే ఇక్కడికెందుకు వచ్చారో.. " కాస్త ఈసడింపుగా అంది ఆ అమ్మాయి. 


కోపంతో ఉన్న కస్తూరి బదులివ్వలేదు. 


"జవాబు చెప్పరేం?" అంటూ రిసెప్షనిస్టు రెట్టించడంతో "మీకు మీరాబాయి తెలుసా?" అని బదులు ప్రశ్నించాడు బాలసుబ్రమణ్యం. 


"ఎవరూ.. ఈ వార్డు కౌన్సిలర్ గారేనా.. వారు మీకు తెలిసిన వారా.. ఆ మాట ముందుగా చెప్పి ఉండొచ్చుగా.. ఉండండి" అంటూ డాక్టర్ గారి గదిలోకి వెళ్ళింది. కాసేపటికి బయటకు వచ్చి, "లోపలికి వెళ్ళండి" అని చెప్పింది. 

గది లోపలికి ప్రవేశించారు బాలసుబ్రమణ్యం దంపతులు. 


సైకియాట్రిస్ట్ జ్ఞానేశ్వర్ కి యాభై ఏళ్ళుంటాయి. చక్కటి ముఖ వర్ఛస్సుతో గంభీరంగా ఉంటాడు. 


లోపలికి వచ్చిన బాలసుబ్రమణ్యం దంపతులను కూర్చోమన్నాడు. తరువాత వాళ్ళవంక ప్రసన్నంగా చూసి "సమస్య ఏమిటో వివరంగా చెప్పండి" అన్నాడు. 


‘ఎలా మొదలు పెట్టాలా’ అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఆ దంపతులు. 


వారి తటపటాయింపు చూసిన జ్ఞానేశ్వర్ "మా దగ్గరకు రకరకాల పేషంట్స్ వస్తూ ఉంటారు.." అంటూ ఏదో చెప్పబోయాడు. 


ఇందాకటి అమ్మాయిలాగా ఈయన కూడా రకరకాల మానసిక రోగుల గురించి చెబుతాడని ఊహించిన కస్తూరి "మా అమ్మాయి చక్కగా కుందనపు బొమ్మలాగా ఉంటుంది. పేరు భవ్యక్రిష్ణ. టెన్త్ నుండి అన్నిట్లో స్టేట్ లెవెల్ ర్యాంకులు తెచ్చుకుంది" అంది. 


"అమ్మాయి ఫోటో ఉందా?" ఆసక్తిగా అడిగాడు జ్ఞానేశ్వర్. 


వెంటనే తన మొబైల్ లో ఉన్న కూతురి ఫోటో చూపించింది కస్తూరి. 


ఫోటోని పరిశీలనగా చూసి, "నిజమే. చాలా చక్కగా ఉంది మీ భవ్యక్రిష్ణ.. జాబ్ చేస్తోందా? పెళ్లి సంబంధాలు చూస్తున్నారా.. " ఆతృతగా అడిగాడు జ్ఞానేశ్వర్. 


"ఈ సమస్య లేకుంటే ఈ పాటికి పెళ్లి చేసేసే వాళ్ళం" దిగులుగా చెప్పింది కస్తూరి. 


"మరి సమస్య ఏమిటో చెప్పండి. మా దగ్గరికి.. " చెప్పబోతున్న డాక్టర్ గారిని ఆగమన్నట్లు సంజ్ఞ చేసాడు బాలసుబ్రమణ్యం. 


"మీరు చెప్పాలనుకున్న తీవ్రమైన సమస్యలు మా అమ్మాయికి లేవు. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. మీకు మీరాబాయి.. అదే.. భక్త మీరాబాయి తెలుసుగా?" అన్నాడు డాక్టర్ గారి వంక చూస్తూ. 


"తెలుసు. శ్రీకృషుడిని అమితంగా ఆరాధించిన భక్తురాలు. ఆమె ఆలపించిన భజన గీతాలు, భక్తి గీతాలు ఎన్నో ఉన్నాయి" చెప్పాడు జ్ఞానేశ్వర్. 


"మా అమ్మాయి భవ్య కూడా అపర కృష్ణ భక్తురాలు. ‘నా కృష్ణుడు నాకోసం ఎక్కడో పుట్టే ఉంటాడు. నాకు కనిపిస్తే తప్పకుండా చేసుకుంటాను. అంతవరకు నా పెళ్లి మాట ఎత్తవద్దు’ అంటోంది" బాధగా చెప్పాడు బాలసుబ్రమణ్యం. 


"తప్పకుండా మీ అమ్మాయికి ఆ శ్రీకృష్ణుడు కనిపించాలని కోరుకుంటున్నాను. మీ అమ్మాయి ఫోటోని నాకు వాట్సాప్ లో పంపండి" అన్నాడు జ్ఞానేశ్వర్. 


డాక్టర్ గారి నంబర్ తీసుకొని ఆ నంబర్ కు తన కూతురు భవ్య ఫోటోలు కొన్ని పంపింది కస్తూరి. 


తరువాత, "ఓ వారం తరువాత నన్ను కలవండి" అన్నాడు జ్ఞానేశ్వర్. 


ఆయన దగ్గర సెలవు తీసుకొని బయటకు నడిచారు ఇద్దరూ. 

***

ఒక వారం తరువాత ఇద్దరూ తిరిగి డాక్టర్ గారిని కలిశారు. 

జ్ఞానేశ్వర్ వాళ్లకు ఒక శ్రీకృషుడి ఆయిల్ పెయింటింగ్ చూపించాడు. 


గోకులంలో ఒక చెట్టు కింద కూర్చొని వేణువు ఊదుతున్న శ్రీ కృషుడి చిత్తరువు అది. చూస్తూ వుంటే చూపు తిప్పుకోలేనంత చక్కగా ఉంది. ముఖ్యంగా శ్రీకృషుడి ముఖంలో జీవకళ ఉట్టిపడుతోంది. చూసేవారు ఎటునుంచి చూసినా ఆ చూపులు వెంటాడుతున్నట్లే ఉంటాయి. 


"ఈ పెయింటింగ్ ని మీ అమ్మాయి గదిలో ఉంచుకోమనండి. ఆ కృష్ణుడి దయవల్ల మీ అమ్మాయికి తొందర్లో వివాహం జరుగుతుంది" అన్నాడు జ్ఞానేశ్వర్. 


అయన వంక తెల్లబోయి చూసారు దంపతులిద్దరూ. 


'ఇదేమిటి.. ఏవో మాత్రలు రాసిస్తాడనుకుంటే కృష్ణుడి పెయింటింగ్ అమ్మాయి గదిలో తగిలించమంటాడేమిటి? ఈయన అమ్మాయి కంటే ఎక్కువ భక్తుడిలాగా ఉన్నాడు' అనుకున్నారు. 


"భయపడకండి. కృషుడిని నమ్ముకోండి. నెల లోపల పెళ్లి కుదురుతుంది" చెప్పాడు సైకియాట్రిస్ట్ జ్ఞానేశ్వర్. 


ఆయనకు నమస్కరించి సెలవు తీసుకున్నారు బాలసుబ్రమణ్యం దంపతులు. 

***

ఓ ఇరవై రోజుల తరువాత డాక్టర్ జ్ఞానేశ్వర్ నుండి కస్తూరికి ఫోన్ వచ్చింది. 


"మా అన్నయ్యగారి అబ్బాయి మనోజ్ కృష్ణ మీ వీధిలో కొత్తగా కట్టిన అపార్ట్మెంట్ కొనాలని వచ్చాడు. ఇల్లు చూపించేవారు మరో రెండు గంటలకు గానీ రారట. మళ్ళీ తిరిగి రావడమెందుకని కాస్సేపు మీ ఇంట్లో ఉండమన్నాను. మీకు అభ్యంతరం లేదుగా" అని అడిగాడు. 


"భలేవారే డాక్టర్ గారూ! తప్పకుండా రమ్మనండి" అంది కస్తూరి. 


అంతలో డోర్ బెల్ మోగింది. 

తలుపు తీసింది కస్తూరి. 

ఎదురుగా ఓ పాతికేళ్ల అందమైన యువకుడు చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు. 


"రండి బాబూ! మీ బాబాయిగారు ఫోన్ చేశారు. కూర్చోండి" అందామె లోపలికి ఆహ్వానిస్తూ. 


"అండీ ఎందుకు ఆంటీ! నా పేరు మనోజ్ కృష్ణ. మనోజ్ అని పిలవండి చాలు" అన్నాడా యువకుడు. 


"ఎంత చక్కగా ఉన్నాడో.. డాక్టర్ గారితో మాట్లాడి తన కూతురితో పెళ్లి జరిగేలా చూడాలి" అని మనసులో అనుకుంది కస్తూరి. 


"మనోజ్.. అలా సోఫాలో కూర్చో. నేను కాఫీ పెట్టుకొని వస్తాను. ఈలోగా మా అమ్మాయి భవ్య కృష్ణ మాట్లాడుతూ ఉంటుంది" అని అతన్ని కూర్చోబెట్టింది. 


గదిలో ఉన్న కూతురిని పిలిచి "అమ్మాయ్ భవ్యా! ఈ అబ్బాయి పేరు మనోజ్ కృష్ణ. మనకు తెలిసిన వారి అబ్బాయి. నేను కాఫీ పెట్టుకొని వచ్చేవరకు కాస్త మాట్లాడుతూ ఉండు" అని చెప్పి లోపలికి వెళ్ళింది కస్తూరి. 


కాఫీతో బాటు కొన్ని బిస్కెట్లు కూడా ఒక ట్రే లో పెట్టుకొని వచ్చిన కస్తూరి ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. 


సోఫాలో భవ్య, మనోజ్ లు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ మరో లోకంలో విహరిస్తున్నట్లు ఉన్నారు. 

తను వచ్చినట్లుగా గొంతు సవరించుకుంది కస్తూరి. 


ఏమాత్రం చలించలేదు వాళ్ళు. 


టీపాయ్ పైన కాస్త శబ్దం చేస్తూ ట్రే ని ఉంచింది. 

అయినా వాళ్ళు అలానే చూసుకుంటున్నారు. 

"కాఫీ తాగండి ఇద్దరూ" అని కస్తూరి కాస్త గట్టిగా అనడంతో ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చారు. 


కాఫీ తాగాక, "ఆంటీ! ఇక నేను బయలుదేరుతాను. బై భవ్యా" అంటూ పైకి లేచాడు మనోజ్. 


"ఏదో పనిమీద వచ్చామన్నారు.. " అంది కస్తూరి. 


"ఆ పని సక్సెస్ ఫుల్ గా ముగిసింది" అంటూ బయటకు నడిచాడు మనోజ్. 


అర్థం కానట్లు కూతురి వంక చూసింది కస్తూరి. 


"నేను ఎదురు చూస్తున్న కృష్ణుడు ఈ రూపంలో వచ్చాడు" సిగ్గుపడుతూ చెప్పింది భవ్య. 


ఆ సాయంత్రం భర్తతో కలిసి హాస్పిటల్ కి వెళ్ళింది కస్తూరి. 

డాక్టర్ కి విషయం చెప్పి "అమ్మాయిలో మార్పు ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు" అన్నారు. 


సైకియాట్రిస్ట్ జ్ఞానేశ్వర్ చిన్నగా నవ్వి, "మీరు రావడానికి వారం రోజుల ముందు నాకు వరసకు అన్నయ్య అయ్యే రామకృష్ణ, తన కొడుకు మనోజ్ కృష్ణని తీసుకొని నా దగ్గరకు వచ్చాడు. తన కొడుకు పెళ్లి చెయ్యాలని చాలా ప్రయత్నాలు చేశాడట. కానీ ఆ అబ్బాయి ఏ సంబంధమూ ఓకే చెయ్యడం లేదు” అని చెప్పాడు. 


కారణమేమిటని మనోజ్ ని అడగ్గా తన కలల్లో కనిపించే ప్రబంధ నాయికలా, రవి వర్మ చిత్రంలా ఉండే అమ్మాయి దొరికితేనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. 


అతన్ని ఎలా ట్రీట్ చెయ్యాలా అని ఆలోచిస్తున్న సమయంలో మీరు వచ్చి మీ అమ్మాయి గురించి చెప్పారు. 

వెంటనే నాకు ఒక ఐడియా వచ్చింది. 

నా స్నేహితుడు, చిత్రకారుడు ఐన మాధవ్ అనే అతన్ని కలిసాను. 


అతని చేత మనోజ్ పోలికలతో శ్రీకృష్ణుడి చిత్రాన్ని గీయించి, మీ అమ్మాయికి ఇవ్వమని మీకు చెప్పాను. 


అలాగే భవ్య పోలికలతో ఒక కావ్యనాయిక చిత్రాన్ని గీయించి, మనోజ్ కి ఇవ్వమని వాళ్ళ నాన్నకు చెప్పాను. 


పిల్లలిద్దరూ వాళ్లకు నచ్చిన ఆ చిత్రాలు ఇష్టంగా రోజుల తరబడి చూసుకున్నారు. తరువాత ఏదో నెపంతో ఆ అబ్బాయిని మీ ఇంటికి పంపించాను. 


తన కృష్ణుడే మనిషిగా తనకోసం వచ్చినట్లు భవ్య, తన కలల రాజకుమారి వాస్తవ రూపంలో ఎదురైనట్లు మనోజ్ భావించి దగ్గరయ్యారు. ఇక మీరు ఆ అబ్బాయి పేరెంట్స్ తో మాట్లాడి పెళ్లి ఏర్పాట్లు చేయండి"


విషయం వివరించాడు జ్ఞానేశ్వర్. 

అతనికి కృతజ్ఞతలు చెప్పి బయటకు వచ్చారు బాలసుబ్రమణ్యం దంపతులు. 


రిసెప్షనిస్ట్ గా ఉన్న అమ్మాయి వీళ్ళను చూసి, "కౌన్సిలర్ మీరాబాయి తో చిన్న పని పడింది, సహాయం చేస్తారా" అని అడగ్గానే ఇద్దరూ బిగ్గరగా నవ్వేశారు.. 


సమాప్తం


మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము.

 (అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).







100 views0 comments

Comments


bottom of page