top of page

భేతాళుడితో విక్రమాదిత్యుడు 2024

#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #BhethaludithoVikramadithyudu2024, #భేతాళుడితోవిక్రమాదిత్యుడు2024, #TeluguStories, #తెలుగుకథలు, #భేతాళవిక్రమార్క


Bhethaluditho Vikramadithyudu 2024 - New Telugu Story Written By - Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 06/11/2024 

భేతాళుడితో విక్రమాదిత్యుడు 2024తెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



ఎప్పటిలాగే విక్రమాదిత్యుడు ఎత్తయిన మోదుగ చెట్టు దగ్గరకు వచ్చి పైకి చూశాడు. శవం వేలాడుతూ ఉంది. శవంలోని బేతాళుడు విక్రమాదిత్యుడిని చూసి వెకిలిగా నవ్వాడు. మహారాజుకు కోపం వచ్చింది. వెంటనే ఆ శవాన్ని తన భుజం మీద వేసుకొని నడక ప్రారంభించాడు. శవంలోని బేతాళుడు ఇంకా గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. 


''ఈరోజు నిన్ను తీసుకెళ్లి ఆ సన్యాసి కి అప్ప చెప్పడం ఖాయం'' అన్నాడు విక్రమాదిత్య మహారాజు. 


''అలాగే జరుగుతుందని.. జరగాలని, నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే కథ ముగింపులో నేను వేసిన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పలేవు. దాంతో నేను నీ అధీనమైపోతాను. నువ్వు సమాధానం చెప్పేస్తే నేను మళ్ళీ చెట్టు ఎక్కేస్తాను. నీకు గుర్తుంది కదా.. తెలిసుండి నువ్వు సమాధానం చెప్పలేదనుకో... నీ తల వెయ్యి ముక్కలైపోతుంది. ఇది కూడా నీకు జ్ఞాపకమే కదా'' గతం లాగే విషయం అంతా గుర్తు చేశాడు విక్రమాదిత్య మహారాజుకు బేతాళుడు. 


'' అధిక ప్రసంగం మాని కథ మొదలు పెట్టు'' అన్నాడు విక్రమాదిత్య మహారాజు చిరాకుగా. 


''సరే! ఇప్పుడు మనం 2024వ సంవత్సరము లోనికి ప్రవేశిస్తున్నామన్నమాట. భాష కూడా మారుతుంది. అందుకు నువ్వు సిద్ధమే కదా?'' మళ్లీ అన్నాడు బేతాళుడు. 


''నీకు నా నుండి సమస్య రాదు. ఇన్ని వందల సంవత్సరాలుగా ప్రపంచంలో ఉన్న మొత్తం భాషలన్నీ మన ఇద్దరికీ అలవాటైపోయాయి కదా. నువ్వు ఏ భాషలో చెప్పినా పర్వాలేదు. నేను ఆ భాషలోనే నీకు సమాధానం చెప్పగలను. ఇకనైనా మొదలు పెట్టు'' అన్నాడు విక్రమాదిత్య మహారాజు. 


''సరే, నీకు గూగుల్ తెలుసు కదా?''


''తెలుసు. ఇంటర్నెట్ ను నడిపే అతిపెద్ద దిగ్గజ సంస్థ. ''


''హమ్మయ్య నాకు కొంత సమస్య తగ్గించావు. ఇప్పుడు దానిని మించిన ఉపయోగాలను అందించే టెక్నాలజీ ఆవిర్భవించ బోతుంది. ఒకలా చెప్పాలంటే ఆవిర్భవించింది. దాని పేరు జిపిటి. దానివల్ల ప్రపంచంలో సరికొత్త సమస్యలు వచ్చి పడేలా కనిపిస్తున్నాయి. వాటిని సమస్యలు అనడానికి వీలులేదు కూడా. ప్రపంచం కొన్ని వేల రెట్ల హై స్పీడ్ తో ముందుకు దూసుకు పోయే టెక్నాలజీ ఆవిర్భవించ బోతుంది. ''


''మంచిదే కదా! హై స్పీడ్ గా ప్రపంచం అభివృద్ధి చెందబోతుంటే ఇప్పుడు భయపడేది ఏముంది?''


''విక్రమాదిత్య మహారాజా, అసలు కథ విను. అంతకు ముందు జిపిటి ఉనికి ఎలా బయటపడిందో వివరిస్తాను. అది కూడా విను. 


ఒక స్టూడెంట్ తనకు ఇచ్చిన ప్రశ్న పత్రంలో ఒక ప్రశ్న కూడా అర్థం కాకపోయినా దానికి రాయవలసిన జవాబు అర్థం కాకపోయినా.. చకచకా పరీక్ష రాసి నూటికి నూరు మార్కులు పొందాడు. అతనితో పరీక్ష రాసిన సహచరులు ఎవరికి 20 మార్కులు మించి రాలేదు. జవాబు పత్రాలు కంప్యూటర్లు లో పరిశీలిస్తున్న పరిశీలకులకు అనుమానం వచ్చి ఆ విద్యార్థిని పిలిపించి నిలదీసి అడిగారు. 


చివరికి అతను విషయం చెప్పాడు.. ఒక గొప్ప సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచంలో రాబోతున్న జిపిటి అనేటటువంటి మహోన్నతమైన మానవమేధ కలిగిన రోబో కంప్యూటర్ సహాయం వల్ల ఇది సాధ్యమైంది అని చెప్పాడు.. జవాబు పత్రాల పరిశీలకులు ఆశ్చర్య పోయారు. 


అతను ఇంకా చెబుతూ.. దాని గొప్పదనం నిరూపణ కోసం.. తనకు తానుగా అది తన నిజాయితీని నిరూపించుకోవడం కోసం దాని సృష్టికర్తలు మరియు దానిని పరీక్షించాలి అనే ఉత్సాహం కలిగిన వారు కూడా అతి భయంకరమైన కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన పరీక్షలు ఎన్నో పెట్టారు. అయితే అది అన్ని పరీక్షల లోనూ నూటికి నూరు మార్కులతో విజయం సాధించింది. అది ప్రపంచంలో ప్రతి గ్రామంలోకి రాబోతుంది. '' అంటూ సవివరంగా వివరించాడు. 


చెప్పడం ఆపి విక్రమాదిత్య మహారాజు కళ్ళల్లోకి చూస్తూ ఇలా అన్నాడు భేతాళుడు. 


''మహారాజా.. నీ ముఖం చూస్తుంటే ఈ కథ అర్థం అవుతున్నట్టు లేదే.. , '' అన్నాడు. 


విక్రమాదిత్య మహారాజు పకపక నవ్వి.. 'భేతాళా! ప్రపంచంలో నువ్వొక్కడివే తెలివైనవాడివి అనుకోకు. కబుర్లు ఆపి కథ కొనసాగించు, '' అన్నాడు. 


''ఈ జి పి టి మహా రోబో మానవ మేధవ్యవస్థ వల్ల ఏం జరుగుతుందో చెప్పమంటావా? నువ్వు ఎంత మహా రాజువైనా ఆశ్చర్యంగా వినక తప్పదు. అది ఒక ప్రేమ కవిత రాయమంటే రాసేస్తుంది. అదే ప్రేమ కవిత మరో విధంగా రాయమంటే ఐదుసెకండ్లలో రాసి పడేస్తుంది. దానికి తగిన బొమ్మ కూడా వేసి చూపించమంటే అర సెకనులో వేసి చూపిస్తుంది. 


అలాగే ఏదైనా ఒక సబ్జెక్టు మీద మహోన్నతమైన సినిమా కథ తయారు చేయమంటే చేసి పడేస్తుంది, కొన్ని సెకండ్లలో. దానినే హాస్య ధోరణిలో మార్చమంటే మార్చేస్తుంది 10 సెకండ్లలో. 


అంతేకాదు, ఒక సైన్స్ ఫిక్షన్ స్టోరీ రాయమంటే రాసేస్తుంది. దెయ్యాలతో నిండిన ఒక కథ రాయమంటే రాసి పడేస్తుంది. బ్రహ్మాండమైన నేటి యుగపు లవర్స్ స్టోరీ రాయమంటే రాస్తుంది. ఔరంగజేబు ప్రధాన పాత్రతో సినిమా కథ రాయమంటే రాసేస్తుంది... 


ఇదంతా 30 సెకండ్లలో. మరోవిషయంచెప్పమంటావా. 

దానికి ఒక సినిమా కథను ఇచ్చి తగిన డైలాగులు రాయమంటే రాసేస్తుంది. ఆ యొక్క డైలాగులకు సందర్భోచితమైన పాటలు రాయమంటే రాసి పడేస్తుంది. 


ఇదంతా ఎవరో ఎప్పుడో ఎక్కడో తయారు చేసే ఉంచింది ఆ రోబో మానవ మెదడు లో ఫీడ్ చేసింది మాత్రమే చూపిస్తుంది అనుకోవడానికి వీలు లేదు. అది మనకు అందించే వెర్షన్ సరికొత్తది.. మహా కళాత్మకమైనదిగా కూడా ఉంటుంది. 


ఇప్పుడు చెప్పు. ఇలాంటి విపరీత విపత్కర పరిస్థితి వల్ల సాహిత్య ప్రపంచం సినిమా ప్రపంచం ఏమై పోతుంది? గొప్ప గొప్ప మార్పులు సంభవిస్తాయి. దానిని అంటిపెట్టుకొని ఉన్న ఎందరో కళాకారులు.. వాళ్ల పరిస్థితి ఏమవుతుంది?.. మానవ మేధా రోబో విజృంభణ వ్యవస్థ వల్ల మానవ శక్తి సన్నగిల్లిపోయి మనిషి నిర్వీర్యుడు కాబోతున్నాడా? అలాంటప్పుడు ప్రపంచ భవిష్యత్తు ఏమిటి? అసలు ఈ రచయితలు కవులు కళాకారులు, ఇంజనీర్సు డాక్టర్స్.. వీళ్ల భవిష్యత్తు ఏమిటి?


పైగా ఇది ఒక్క ఇంగ్లీషు భాషలోనే కాదు ప్రపంచంలో అన్ని భాషలలోనూ చుట్టుముట్టెయ్యబోతుంది. 


ఓ విక్రమాదిత్య మహారాజా.. ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. ఈ కథ ఇంకా ఉంది విను. 


ఒక రంగంలో జరిగే మార్పుల గురించి మాత్రమే నేను నీకు ఇప్పుడు చెప్పాను. ఇదే రకంగా ప్రతి రంగంలో జరగబోతుంది. 


ఇలాంటి మానవ మేధా రోబో వ్యవస్థ పరిస్థితి అన్ని రంగాలలో అభివృద్ధి చెందినప్పుడు ఆయా రంగాలలో పనిచేసే ఉద్యోగస్తుల మాటేమిటి? ఇప్పటికే అమెరికా లాంటి చాలా దేశాలలో చాలా మంది ఉద్యోగస్తులను ఏదో వంక పెట్టి తప్పిస్తున్నారు కదా. వాళ్లందరి జీవిత విధానం ఎలా మారి పోతుంది?


open.. AI అభివృద్ధి చేసిన దీనిని ఆర్టిఫిషియల్ ఇంటె లిజెన్స్ అనవచ్చు. శాస్త్ర సాంకేతిక రంగంలో ఇదొక మైలురాయి. కృత్రిమ మేధా ఆవిష్కరణ చారిత్రాత్మక మైనదని విశ్లేషకులు చెబుతున్నారు. దీనితో మాట్లాడ వచ్చు. సరదాగా జోకులు వేయవచ్చు. ప్రపంచంలో ఏ సమస్య గురించి అయినా ప్రశ్న వేస్తే ఖచ్చితమైన ఒకే ఒక జవాబు చెబుతుంది అంతేకానీ 10 జవాబులు ఇచ్చి మీకు నచ్చిన జవాబు ఎంచుకోండి అని చెప్పదు. అంతులేని డాటా అపరిమితమైన నాలెడ్జ్ దీనిలో ఇమిడి ఉంటుంది. ప్రపంచంలో అన్ని భాషలు, సంస్కృ తి, చరిత్ర, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పరిశోధనలు, శాస్త్ర సాంకేతిక అంశాలు కోడింగ్ కలిగిన ఇది ప్రపంచంలో ఉన్న అన్ని చాట్ బోట్ ల కన్నా అదునాతనమైనది. 


రెండు సంవత్సరాల క్రితమే దీనిపై పరిశోధనలు మొదలుపెట్టారు గత సంవత్సరము నుండి అందు బాటు లోకి వచ్చింది ఉచితంగా. విద్యార్థులు రాసిన గ్రామర్ లో ఏమైనా తప్పులుంటే సరిదిద్దుతుంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఇది పిల్లలు ఆలోచించుకునే శక్తిని తగ్గించి పిల్లల భవిష్యత్తు మీద దెబ్బ వేస్తుంది కదా. రహస్యంగా విద్యా ర్థులు దీనిని ఉపయోగించి పరీక్షలు రాస్తున్నారట. ఇది పిల్లల హోంవర్కులు కూడా చేసి పడేస్తుంది. దీనివల్ల టీచర్ల అవసరం పూర్తిగా తగ్గిపో వచ్చు. చాలా శక్తివంతమైన ఎడ్యుకేట్ టూల్ గా ఇది మారుతుంది. 


గూగుల్ ని ఒక ప్రశ్న అడిగితే.. వెబ్సైట్లోంచి కానీ యూ ట్యూబ్ లో ఎవరో ఒకరు అప్లోడ్ చేసిన వీడి యోలు నుంచి జవాబుని తీసి అది చెప్తుంది. ఇది అలా కాదు దీని వెబ్సైట్లో దానికి డిస్క్రిప్షన్ ఇస్తే చాలు అది మనకు ఒక కొత్త రకం జవాబు తనంత తాను తయారు చేసి ఇస్తుంది. దాంతో మానవులు తమ క్రియేటివిటీ నిరూ పించుకునే శక్తి పూర్తిగా నశించిపోతుంది. 


క్రియేటివ్ ఫీల్డ్ లో ఎకనామిక్స్ లో యానిమేషన్ లో పెను విప్లవాలను సృష్టించి ఆయా రంగాలలో దాని మీదే ఆధారపడిన వాళ్ల బ్రతుకులు శూన్యం చేస్తుంది. అన్ ఎంప్లాయిమెంట్ పెరిగి లీగల్ ఇష్యూ ప్రారంభ మవుతాయి. 


దీని ద్వారా అమ్మాయిల వ్యక్తిగత విషయాలను సేక రించి మహిళలను మోసం చేస్తున్న ఘటనలు కూడా జరగబోతాయి. హ్యాకర్లకు కూడా సులభంగా కోడింగ్ చేసి ఇస్తుందట.. దాంతో అరాచకాలు.. 


ఇకముందు దెయ్యాలు రాక్షసులు మాలాంటి బేతాళ పిశాచ గణము ఈ ప్రపంచాన్ని పరిపాలించే రోజు అతి దగ్గరలోనే ఉంది కదూ. భయపడుతున్న ఓ విక్రమా దిత్య మహారాజా ఈ నా ప్రశ్నలన్నిటికీ సమాధానం ఉంది.. ఉంటుంది ఉండాలి కూడా. అది పూర్తిగా నీకు తెలుసు కూడా. అందుకనే నేను కథ చెబుతున్నప్పుడు నువ్వు లోపల నవ్వుకుంటున్నావు. ఓరి పిచ్చి పిశాచి బేతాళ.. నీ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం నేను చెబు తాను రా.. అన్నట్టు నీ యొక్క ముఖంలో కళ నాకు అర్థం అయిపోతుంది. 


నీకు తెలిసిన ఆ సమాధానాలు మరుగున పెట్టి నన్ను లోబరుచుకోవడం కోసం నువ్వు సమాధానం తెలి యదు అని చెప్పావు అనుకో నీ తల వేయి ఖండికలు అయిపోతుంది. ఒకవేళ సమాధానం నా మనసు తృప్తి పడేలా చెప్పావు అనుకో.. నేను మళ్ళీ చెట్టు ఎక్కేస్తాను.


నీకు నిజంగా తెలియదు అనుకో.. నీకు నేను వశం అయిపోతాను. అప్పుడు నన్ను తీసుకెళ్లి ఆ సన్యాసికి అప్పజెప్పి మిగతా పని నువ్వు పూర్తి చేసుకోవచ్చు. సరే, ఇక ఇప్పుడు నేను చెప్పిన సమస్యలు, ప్రశ్నలు అన్నింటికీ నా మనస్సు తృప్తి పడేలా సమాధానం చెప్పడానికి ప్రయత్నించు మహారాజ'' అంటూ తను కథ చెప్పడం ముగించాడు బేతాళుడు. 



''ఓ బేతాళ నువ్వు మానవాళిని భయపెడుతున్నావు పిశాచివి కనక అది నీ ధర్మం. నీ అపోహలకు అనుమా నాలకు ప్రశ్నలకు సమాధానం నా దగ్గర ఉంది. 


జి పి టి వ్యవస్థ అన్ని రంగాలలో సృష్టించే సవాళ్లు నిజమే. సవాళ్లు అన్ని అధికమించగలిగితే దీని ద్వారా అమోఘమైన విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం కూడా ఉంది. నువ్వు గంటన్నర చెప్పావు కానీ నేను ఐదు నిమిషాలలో సమాధానం చెప్పగలను. 


సమస్య అంటూ పుడితే అంతకుముందే పరిష్కారం పుట్టబడి ఉంటుంది. దెయ్యం అంటూ ఉంటే దేవుడు తప్పకుండా ఉండి తీరుతాడు. జి పి టి ని సృష్టించింది దేవుడు కాదు కదా మనిషి. దాని నుండి నష్టం కలగ కుండా ఎదుర్కొనే ప్రత్యామ్నాయ శక్తి మనిషికి తప్ప కుండా ఉండే తీరుతుంది. మానవ శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నావు. అనాదిలో ఖండాలను సముద్రా లను గ్రహాలను భూమి ఆకాశాలను తెలుసుకో కలిగి నప్పుడు ఈ జి బి టి పుట్టిందా? అమెరికాను మా మనిషి కనుక్కున్న ప్పుడు ఈ జిపి టి పుట్టిందా?


ఒక రోబోకి ఆలోచించే విధానం నేర్పిస్తే అది ఎన్నో అద్భుతాలు చేసి చూపిస్తుంది. అదే ఆలోచన విధానం మనం నేర్చుకుంటే అంతకన్నా గొప్ప అద్భుతాలు చేయవచ్చు. దీనికోసం థింక్ స్ట్రైట్ అనే పుస్తకంలో మనిషి తనకు కావలసిన దాని గురించి కొత్త ఆలోచ నలు ఎలా చేయవచ్చో చదివి తెలుసుకోవచ్చు కదా. మహామహులు తాత్వికులు ఋషులు ఇచ్చిన ఇన్స్పిరేషన్లు మాకు చాలా ఉన్నాయి. మా బ్రతుకేదో మేం బ్రతకగలం. నీ పిచాచి మాటలకు మేము భయం పడం. 


చివరి విషయం విను.. చెడును కూడా మంచిగా మలుచుకునే శక్తి మా మానవులకు ఉంది. 


నువ్వు చెప్పినట్టు నిజంగా జి పి టి వల్ల ప్రమాదమే సంభవిస్తే మొత్తం అందరి ఉద్యోగాలు హుష్ కాకి అయిపోతే చాలా మంచిది. వాళ్లంతా తమ తమ ప్రాంతాలకు వెళ్ళిపోయి భూ తల్లిని నమ్ముకొని వ్యవ సాయం చేసుకుంటారు. దానివల్ల ఆత్మస్థైర్యం ఆరో గ్యo పెరుగుతుంది ప్రపంచమంతా పచ్చదనం ఏర్పడి ఆక్సిజన్ కావలసినంత దొరుకుతుంది. ఆక్సిజన్ సమృద్ధిగా ఉంటే అనారోగ్యం కాలు మోపడానికి స్థానమే ఉండదు. మా వ్యవసాయం జీపిటీ చేయలేదు కదా. ఏది జరిగినా మా మంచికే అనే తీసుకునే తత్వం మాది. 


 ఓ బేతాళుడా ఇప్పటికైనా నువ్వు తృప్తి పడ్డావా.. అయితే బుద్ధి తెచ్చుకుని చేతులు కట్టుకొని పూర్తిగా నీ స్థానంలోకి వెళ్ళు. '' అంటూ గర్జించాడు విక్రమాది త్యుడు. 


 బేతాళుడు భయపడి తాను ఆవహించిన శవంతో సహా మళ్ళీ మోదుగచెట్టు కొమ్మకు వేలాడబడ్డాడు. 


సమాప్తం


నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు 






47 views0 comments

Commentaires


bottom of page