top of page
Writer's pictureNeeraja Prabhala

భీష్మేకాదశి విశిష్టత



'Bhishmekadasi Visishtatha' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 20/02/2024

'భీష్మేకాదశి విశిష్టత' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


ఈరోజు  భీష్మేకాదశి  పర్వదినం. 

శ్రీ విష్ణు సహస్ర నామ జయంతి.


అందుకే   దీన్ని  గురించి  నేను  సవిస్తరంగా  వివరిస్తున్నాను. 


మాఘ శుక్ల ఏకాదశినే  “భీష్మ ఏకాదశి” అంటారు. శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రం పాండవులకు  భీష్ముడు  చేసిన ఉపదేశం. 


కురుక్షేత్ర యుధ్ధంలో   భీష్ముడు  ఒకానొక  సందర్భంలో అస్త్ర సన్యాసం చేసి  గాయపడి  అంపశయ్యపైనే  ఉన్నాడు. సుమారు నెల రోజులు గడిచాయి. పాండవులు, శ్రీకృష్ణుడు  సల్లాపాలు ఆడుకొనే   సమయంలో ఒక నాడు హఠాత్తుగా  శ్రీకృష్ణుడు పాండవులతో  మాట్లాడుతూ ఆగిపోయాడు. పాండవులకు గాబరా వేసింది. “ఏమైంది?“ అని శ్రీకృష్ణుడిని  అడిగారు. 


శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ "మాంధ్యాతి  భగవాన్ భీష్మః తపోమే తద్గతం  మనః" కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి  ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు.  అందుకే నామనస్సు  అక్కడికి వెళ్ళి పోయింది.


 ఓ  పాండవులారా! భీష్ముడి వద్దకు  మీరు బయలుదేరండి. ఎందుకంటే భీష్ముడు  నా భక్తాగ్రేసరుడు,  ధర్మాలను  అవపోశన  పట్టినవాడు. సమస్త  శాస్త్రాలను  క్షుణ్ణంగా  ఎరిగిన  మహనీయుడు. మానవాళి తరించడానికి కావల్సిన మార్గాలను స్పష్టంగా తెలిసిన  మహనీయుడు. సులభంగా జీవకోటిని తరింపజేయడం  ఎలానో  అవగతం  చేసుకొన్న మహనీయుడు. 


ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా  తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. ఆయన  భౌతిక దేహం  ఈలోకం  నుండి  నిష్క్రమించే  సమయం ఆసన్నమవుతుంది.  ఆయన  నిర్యాణం పొందితే  ఇంక  లోకంలో ధర్మ సంశయాలని  తీర్చే  వ్యక్తులు  ఉండరు. అందుకే  ఆయన ద్వారా  లోకాన్నుధ్ధరించే  సూక్శ్మ విషయాలను  తెలుసుకుందురు రండి”   అని  భీష్మ పితామహుడి వద్దకు  వాళ్లను  తీసుకు వచ్చాడు  కృష్ణుడు. 


భీష్ముడు  సుమారు  నెలన్నర నుండి  భాణాలపైనే పడి ఉన్నాడు. దేహం నిండా బాణాలు,  ఆయనలో  శక్తి పూర్తిగా  క్షీణించిపోయింది, అసలే  మాఘమాసం. ఎండకు ఎండుతూ, మంచుకు  తడుస్తూ, నీరు లేదు, ఆహారం లేదు. స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలడు,  కాని  ఆయన ఇన్ని  బాధలను  భరిస్తూ  ఉండి  ఉత్తరాయణ పుణ్య కాల సమయం  వచ్చే వరకు  ప్రాణాలతో ఉండాలి  అని అనుకున్నాడు. 


ఒక  ఏకాదశి  నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకుంటున్నాడు. మనస్సులో  శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించు కోగలిగేవాడు ఆయన. ఆయన  తన మనోమందిరంలోనే   శ్రీకృష్ణుడితో  మాట్లాడగలిగే వాడు. అంత జ్ఞానులైన మహనీయులకు  ఈరోజు, ఆరోజు  అనే  నియమం ఉండదు  అని ఉపనిషత్తు చెబుతుంది. 

 

మరి  అలాంటి మహనీయులైన   వారు  ఏ రోజు  నిష్క్రమించినా పరమపదం  లభిస్తుంది. తర్వాత  ఎవరు కర్మ చేస్తారు?  అనే  నియమం కూడా లేదు. భీష్ముడు  తనకి "మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం  సర్వం నారాయణః"  అని  అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం  శ్రీకృష్ణుడే  అని విశ్వసించేవాడు.  అందుకు ఆయన  ఏనాడు  మరణించినా భగవంతుని   సాయుజ్యం  లభిస్తుంది. 


“మరి  అన్ని రోజులు  అంపశయ్య పై  ఎందుకు ఉండి పోయాడు ?” అని  మనకు సందేహం  కలుగకమానదు. 

ఆయనకు  తను చేసిన  దోషం ఒకటి  స్పష్టంగా  జ్ఞాపకం ఉంది. చేసిన  ప్రతి దోషానికి  ఎవరైనా  ఫలితం అనుభవించక  తప్పదు.  అది  తొలగితే తప్ప  సద్గతి ఏర్పడదు. 


“ఏ దోషం చేసాడాయన ?” సాధ్వీమణి, భగవత్ భక్తురాలైన  ద్రౌపదికి   సభామధ్యంలో  అవమానం జరుగుతుంటే  ఏం చేయలేక  చూస్తూ  ఉండి  పోయాడు.  ఆమెకి శ్రీకృష్ణుడంటే  అత్యంత ప్రేమ. తన గురువు వసిష్ఠులవారు చెప్పారట "మహత్యాపది  సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః" హే ద్రౌపదీ! ఇతరులు  ఎవరూ  తొలగించని  ఆపద వచ్చినప్పుడు నీవు  శ్రీహరిని స్మరించుకో! అని. 


ఆనాడు  సభామధ్యంలో  తన అయిదుగురు  అతి పరాక్రమమైన  భర్తలు ఉన్నా,  వాళ్లు  ఏమీ  చేయలేక పోయారు. వారు  కౌరవులకి బానిసలై పోయారు. కౌరవులను ఎదురించడానికి  వీలులేని నిస్సహాయులు. వారు  కేవలం సామాన్య ధర్మాన్నే  పాటించారు, కాని  సాటి మనిషిగా  ఆమెను కాపాడాలనే  విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టారు.

 శ్రీకృష్ణుడు  తన భక్తులకి  జరిగే అవమానాన్ని  సహించలేడు. అలా చేసినందుకు  మొత్తం  వంద మంది కౌరవులను  మట్టు పెట్టాడు. 


ఆ దోషంతో  పాండవులకూ  అదే గతి పట్టేది. కానీ  అలా చేస్తే  చివర తను  ఎవరిని రక్షించాలని అనుకున్నాడో  ఆ ద్రౌపతికే  నష్టం వాటిల్లుతుందని  వారిని అట్టే ఉంచాడు.  ఈ విషయం భగవంతుడే  అర్జునుడితో చెప్పాడు.  

భీష్మ పితామహుడు  ఆనాడు ధర్మరాజుకు  తలెత్తిన  సందేహాలను  తీరుస్తుంటే,  ప్రక్కనే ఉన్న  ద్రౌపది  నవ్వుతూ  “తాతా! ఆనాడు  నాకు అవమానం జరుగుంటే  ఏమైనాయి ఈ  ధర్మసూక్షాలు?”'  అని అడిగింది. 


అందుకు  భీష్ముడు ' ద్రౌపదీ ! నా దేహం  దుర్యోదనుడి  ఉప్పు తిన్నది.  నా ఆధీనంలో లేదు.  నాకు  తెలుసు  నీకు  అవమానం జరుగుతుందని.   కానీ  నా దేహం నా మాట  వినలేదు. అంతటి  ఘోర పాపం  చేసాను కనుకనే  ఆ పాప ప్రక్షాళన కోసం  ఇన్నాళ్లూ  అంపశయ్యపై  పడి ఉన్నానమ్మా!' అని  చెప్పాడు. 


“హస్తినాపుర  రాజ సింహాసనాన్ని కాపాడుతాను’  అని  తాను తన తండ్రికి  ఇచ్చిన  వాగ్దానానికి కట్టుబడి  ఉండిపోయాడు భీష్ముడు. కానీ  పరిస్థితుల ప్రభావంచే  విశేష ధర్మాన్ని  ప్రక్కన పెట్టాడు. ' హే ద్రౌపదీ!  నీ కృష్ణ  భక్తిలో ఎలాంటి  కల్మషం  లేదు, కానీ  నేను తప్పుచేశాను . దాన్ని  పరిశుద్ధం  చేసుకోవాలనే అంపశయ్యపై  పడి ఉన్నాను, అందుకు  ఈనాడు  నేను ధర్మాలను  చెప్పవచ్చును.' అని పాండవులకు ఎన్నో నీతులను,ధర్మ సూక్షాలను  క్షుణ్ణంగా  బోధించాడు. 


ఆ సమయంలో  శ్రీకృష్ణుడు  భీష్మపితామహుడికి  దేహబాధలు  కలగకుండా వరం ఇచ్చి  చెప్పించాడు.” కృష్ణా! నాకెందుకు శక్తినిచ్చి  చెప్పిస్తున్నావు?  నీవే  వాళ్లకి   చెప్పవచ్చుకదా? “  అని భీష్ముడు  కృష్ణుని   అడిగాడు. 


అందుకు  కృష్ణుడు  నేను చెప్పవచ్చు. కానీ, నీలాంటి  భక్తుడు  చెప్పడమే ధర్మం. నేను చెబితే అది తత్వం , నీవు చెబితే అది  తత్వ దృష్టం. తత్వాన్ని  చూసినవాడు తత్వాన్ని  చెప్పాలే  తప్ప తత్వం తన  గురించి  తాను చెప్పుకోడు. నేల,  ‘నేను ఇంత సారం’ అని చెప్పగలదా! ఆ నేలలో పండిన మ్రొక్క   ఆ నేల  ఎంత సారమో?  తెలియచెపుతుంది. అలాగే నీవు అనుభవజ్ఞుడవి, నీవు ఉపదేశంచేస్తే  అది లోకానికి శ్రేయస్సు. జయము. 

భగవంతుడు సముద్రం వంటి  వాడు, నీరు ఉంటుంది కానీ  పాన యోగ్యం కాదు.అదే నీటిని  మేఘం వర్షిస్తే  పానయోగ్యం. అందుకే భగవత్  జ్ఞానం నేరుగా కాకుండా భగవత్  తత్వం తెలిసిన  భీష్ముడి ద్వారా  అది అందితే  లోకానికి హితకరం.శుభం’. 


 అలా   శ్రీకృష్ణుడు  వరం ఇచ్చి, భీష్ముడి  ద్వారా  ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీతను   శ్రీకృష్ణుడు  నేరుగా చెప్పాడు, శ్రీవిష్ణు సహస్రనామాల్ని  భీష్ముడి ద్వారా చెప్పించాడు. అందుకే శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం  వలన  మానవజాతి  సులభంగా  తరించ  వీలు ఉంది.


ముఖ్యంగా  విష్ణు సహస్ర నామ జపం, ధ్యానం  వలన భయం తొలగుతుంది, శుభం కలుగుతుంది. గణపతిని, వ్యాస భగవానుని, పితామహుని, పాండవులను, తల్లి తండ్రులను, గురువులను  భక్తి పూర్వకంగా స్మరించి  తదుపరి, ఈ దివ్య నామములను  జపిస్తూ  తేజో మయుడైన, పరమాత్ముని ధ్యానించి   ఇహపర బాధల నుంచి  మనం   విముక్తుల మవుదాం.

***

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


 మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి  బిరుదు పొందారు



"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏




43 views0 comments

Comments


bottom of page