#వసుంధర, #Vasundhara, #భువినుండిదివికి, #BhuviNundiDiviki, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు, #VasundharaKathalu, #JonnalagaddaRamalakshmi
Bhuvi Nundi Diviki - New Telugu Story Written By Vasundhara
Published In manatelugukathalu.com On 23/11/2024
భువి నుండి దివికి - తెలుగు కథ
రచన: వసుంధర
(ప్రముఖ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
భువి ఫినిష్మెంట్ కంపెనీలో పనిచేస్తోంది.
దివి ఎచీవర్స్ కంపెనీలో పనిచేస్తోంది.
ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్సు. సమవయస్కులు.
ఇంకా పెళ్లవలేదు కాబట్టి వవుహా- అంటే వర్కింగ్ వుమన్స్ హాస్టల్లో ఉంటున్నారు. ఇద్దరూ రూంమేట్సు.
ఇద్దరికీ ప్రేమకథలున్నాయి. అవి మాత్రం పూర్తిగా భిన్నం.
ముందుగా భువి కథలోకి వెడితే-
ఒకరోజు మల్టీప్లెక్సులో ఆమెకో యువకుడు ఎదురయ్యాడు. ఆమెను కన్నార్పకుండా చూస్తూ నిలబడి పోయాడు.
ఇబ్బందనిపిస్తే పట్టించుకోకుండా వెళ్లిపోవచ్చుగా, కుతూహలం భువిని ఆపింది.
ఒకటి, రెండు, మూడు నిముషాలు గడిచాయి. అతడింకా ఆమెనలా చూస్తూనే ఉన్నాడు.
భువి అతణ్ణి సమీపించి, “ఏమిటలా నన్నే చూస్తున్నావ్!” అనడిగింది.
అతడు తడుముకోలేదు, “ఐ లవ్యూ” అన్నాడు.
తెల్లబోయింది భువి, “ఏమన్నావ్!” అంది.
“లవ్ యట్ ఫస్ట్ సైట్” అన్నాడతడు.
కుర్రాడు బాగున్నాడు. హుందాగా ఉన్నాడు. ఒక అపరిచిత యువతికి లవ్ ప్రపోజ్ చేసినా సంస్కార హీనంగా అనిపించలేదు.
“ఇంట్రస్టింగ్” అంది భువి.
ఇద్దరూ ఐస్‌క్రీమ్ స్టాలుకి వెళ్లారు. అక్కడ ఓ బల్ల దగ్గర ఎదురెదురుగా కూర్చున్నారు. వెయిటర్ వస్తే అతడే బటర్ స్కాచ్ ఆర్డరిచ్చాడు.
“నాకు బటర్ స్కాచ్ ఇష్టమని నీకెలా తెలుసు?” అంది భువి.
“నిన్ను చూస్తే బటర్‌ని తాకిన ఆహ్లాదం కలిగింది. స్కాచ్‌లా కిక్కొచ్చింది” అన్నాడతడు.
ఆలోచించి అన్నట్లు కాక అప్రయత్నంగా పలికినట్లుంది ఆ మాట!
“అయాం భువి” అంటూ అప్రయత్నంగా ఆమె తనను తాను పరిచయం చేసుకుంది.
“అరుణ్!” అంటూ అతడు తనని పరిచయం చేసుకున్నాడు. అతడో ప్రముఖ బ్యాంకులో మేనేజరు.
అక్కడున్న పది నిముషాల్లోనే తమది పదేళ్ల పరిచయం అనిపించింది భువికి.
భువి తలిదండ్రులది ఆధునిక మనస్తత్వం. అన్నింటా ఆమెకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఇంతవరకూ ఆ స్వేచ్ఛనామె దుర్వినియోగం చెయ్యలేదు. ఇప్పుడు వినియోగించే సమయం వచ్చిందనుకుంది.
ఇద్దరూ కొన్నాళ్లు హోటళ్లలో, సినిమాలలో, పార్కుల్లో కలుసుకున్నారు.
భువికి అరుణ్ ప్రేమపై నమ్మకం కుదిరింది.
“మనం పెళ్లి చేసుకుందాం” అందామె ఒకరోజున.
“నావైపునుంచి అంతా ఓకే. మీ పెద్దవాళ్లకి ఏమభ్యంతరముండదుగా” అన్నాడు అరుణ్.
తనవాళ్లు అల్ట్రా మోడర్న్ అని చెప్పిందామె.
“మోడర్న్ అంటే పెళ్లికిముందు డేటింగుకి ఒప్పుకుంటారా?” అడిగాడు అరుణ్.
భువి అతడి ప్రేమను పూర్తిగా నమ్మింది. “అడగడానికి నాకిబ్బందేమో కానీ, ఒప్పుకుందుకు క్షణం తటపటాయించరు వాళ్లు” అంటూ పచ్చ జెండా ఊపింది భువి.
ఇద్దరూ మరింత తరచుగా కలుస్తున్నారు. వాళ్లు ఎప్పుడు ఎక్కడ ఎలా కలిసేవారో- రూంమేట్ దివికి కూడా తెలియదు.
వైజ్ఞానికంగా ఎంత ప్రగతిని సాధించినా, మనిషి ప్రకృతి ముందు పసిబాలుడే!
వరద భీబత్సాలు, భూ ప్రకంపనలని భరించడంలో- ఆఫ్రికా ఎంతో, అమెరికానూ అంతే!
అలాగే- చదువు, తెలివి, జాగ్రత్తలు కూడా- ఆడపిల్లను ప్రకృతి ధర్మంనుంచి కాపాడలేవు.
అరుణ్‌తో పరిచయానికో ఏడాది నిండేసరికి, భువికి కడుపు పండింది.
భువి భయపడలేదు. బెంగెట్టుకోలేదు.
ఆ విశేషాన్ని అరుణ్‌తో పంచుకున్నప్పుడు, “ఇక డేటింగు ఆపి మ్యారేజి గ్రీటింగ్సుకి రెడీ కావాలి” అంది.
అరుణ్ తెల్లబోయి, “ఇలా ఎలా జరిగింది?” అన్నాడు.
“ఏం జరిగింది, ఎలా జరిగింది అని కాక- జరగాల్సిందానికి పూనుకోవాలి” అంది భువి.
“కానీ నేనింకా మానసికంగా పెళ్లికి సిద్ధంగా లేను” అన్నాడు అరుణ్.
“పోనీ, సహజీవనానికి సిద్ధంగానే ఉన్నావుగా! మనం సహజీవనాన్ని పబ్లిక్ చేద్దాం” అంది భువి.
“నీతో సహజీవనాన్ని ప్రకటించడం నాకిష్టమే! కానీ, నువ్వంటే నువ్వే! నీ కడుపులో ఉన్నా సరే, మూడో మనిషిని నా మనిషిగా నేనామోదించలేను” అన్నాడు అరుణ్.
భువి దెబ్బ తింది. “నిన్ను మనస్ఫూర్తిగా నమ్మిన నన్ను అనుమానిస్తున్నావా?” అంది.
“ఇలాగంటున్నానని ఏమనుకోకు. నా ప్రపోజలుకు వెంటనే ఒప్పుకోవడం, ఆ తర్వాత సాన్నిహిత్యంలో నీ తీరు- వీటినిబట్టి మగాడు నీకు కొత్త కాదని నాకర్థమయింది” అన్నాడు అరుణ్.
షాక్ తింది భువి. “ఇదా మన డేటింగుకి నువ్విచ్చే రేటింగు” అంది బాధగా.
అరుణ్ మాట తప్పిస్తూ, “ఇవన్నీ ఎందుకు? అబార్షన్ చేయించుకో” అన్నాడు.
అప్పటికి తేరుకుంది భువి. “నా గురించి అర్థం చేసుకున్నానన్నావుగా, అది అపార్థమనడానికి డిఎన్‌ఎ టెస్టుంది” అంది.
ఆమె గొంతులో ధ్వనించిన నమ్మకం, తనలో మాత్రం లేకనా- “బిడ్డ నాదే కావచ్చు. కానీ నీకు నేను మాత్రమే అని తేల్చేదెలా?” అన్నాడు అరుణ్.
ఆమె దానికీ జవాబు ఇవ్వగలదు.
కానీ అతడిది జుట్టు పట్టుకొని బయటికీడ్చే మూడ్. తను చూరు పట్టుకొని వ్రేలాడ్డమెలా?
తప్పటడుగు వేసింది. వళ్లు కొవ్వెక్కి కాదు- అతడిపై నమ్మకంతో.
అతడితో భావి జీవితాన్ని ఊహిస్తూ ఎన్నో కలలు కంది.
అతడేమో- అనాదిగా జరుగుతున్న అన్యాయానికి పాల్పడ్డాడు.
ఊహించిన ఆఘాతాన్నయితే తట్టుకోగల నిబ్బరం భువికి ఉంది. కానీ ప్రేమికుడనుకున్న అరుణ్ చేసిన ద్రోహానికి తట్టుకోలేక- ఓ అర్థరాత్రి రూంలో ఫ్యానుకి ఉరేసుకోబోయి దివికి దొరికిపోయింది.
దివి వ్యక్తిత్వం భువికి భిన్నం.
భువి కథ విన్న దివి జాలిపడలేదు. జ్ఞానబోధ చెయ్యలేదు.
“నువ్వీ రూంలో ఉరేసుకుంటే, పోలీసుల చుట్టూ తిరగలేక నేను ఇబ్బంది పడాలి. పోనీ అంటే ఇప్పటి కిప్పుడు- అదీ ఈ రాత్రిపూట- బయటికెళ్లడం నీకూ కష్టమే మరి!” అంది.
భువి ఏడుస్తూ, “చాలా తేలిగ్గా మోసపోయాను. చావు తప్ప ఇంకో మార్గం లేదు నాకు. నీ కిబ్బంది లేకుండా నేను చావడానికి నువ్వే ఏదైనా ఉపాయం చెప్పు” అంది.
“మోసం మగాడికీ, మోసపోవడం ఆడదానికీ సహజగుణాలు. వాటితోనే ఎలా బ్రతకాలో చెప్పొచ్చేమో కానీ, చావుకి ఉపాయాలేముంటాయ్?” అంది దివి.
“పోనీ, ఎలా బ్రతకాలో చెప్పు” అంది భువి.
“నాకూ ఓ ప్రేమ కథ ఉంది. అది చెబుతాను. గడిచిపోయిందానికి ఉపయోగపడకపోయినా, ముందు జాగ్రత్తకి పనికొస్తుందేమో- విను!” అంది దివి.
దివి కథలోకి వెడితే-
‘ఎచీవర్స్’ కంపెనీలో ఉద్యోగానికి వెళ్లినప్పుడు ఆమెను ఇంటర్వ్యూ చేసి సెలక్ట్ చేశాడు వరుణ్.
అతడామెకు నాలుగేళ్లు సీనియర్.
ఉద్యోగంలో చేరిన మర్నాడే అతడామెను తన చాంబర్లోకి పిలిచి, “నాకు సూటిగా మాట్లాడ్డం అలవాటు. నిన్ను చూడగానే లవ్ యట్ ఫస్ట్ సైట్. అప్పుడే ఐ లవ్యూ చెప్పాలనిపించింది” అన్నాడు.
బాస్ ఇలాగంటాడని ఊహించలేదేమో, దివి తెల్లబోయింది.
ఏమనాలో తెలియక ఆమె తికమకపడుతోందని వరుణ్‌కి అర్థమైంది.
“నీకిష్టమైతే మావాళ్లు మీ వాళ్లని కంటాక్ట్ చేస్తారు” అంటూ నేరుగా పెళ్లికే ప్రపోజ్ చేశాడు.
అంత మర్యాదగా పెళ్లికి- అదీ అరేంజ్డ్ మ్యారేజి తరహాలో ప్రపోజ్ చేసిన అతడి సంస్కారానికి ఆమె ముగ్దురాలైన మాట నిజం. ఐతే ఈ కాలపు కొందరు అమ్మాయిల్లాగే దివి కూడా ఆలోచిస్తోంది.
“కనీసం రెండేళ్లు జాబ్ చేస్తూ జాలీగా గడపాలనుంది. ఆతర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తాను” అందామె.
అతడు నొచ్చుకోలేదు, “ఇప్పుడాడపిల్లలు ఇలాగే ఆలోచిస్తున్నారు. నా చెల్లెలు కూడా ఇంట్లో ఇదే మాట చెప్పింది. సో, ఐ కెన్ అండర్‌స్టాండ్. ఐతే అందాకా మనం ఫ్రెండ్సుగా ఉండొచ్చుగా” అన్నాడు.
సరేనంది దివి.
ఇద్దరూ ఆఫీసులో వీలు దొరికినప్పుడల్లా కబుర్లు చెప్పుకునేవారు. బయట హొటళ్లకూ, సినిమాలకూ, పార్కులకూ వెళ్లేవారు. సాన్నిహిత్యంలో సంప్రదాయపు పరిమితులు దాటేవారు కాదు.
వరుణ్ మిత్రుడు తరుణ్. ఏకకాలంలో ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్సుని మెయింటైన్ చేస్తున్న రసికుడు.
“సైమల్టేనియస్‌గా ముగ్గురా? నీకు తప్పనిపించడంలేదా?” అని వరుణ్ అతణ్ణి మందలించాడు.
రిటార్టివ్వడంలో నేర్పరి కాబట్టే తరుణ్ అంతలా అమ్మాయిల్ని ఆకర్షిస్తున్నాడు.
“పెళ్లి కాకుండా అమ్మాయిలతో స్నేహం ఒప్పయితే, ఆ స్నేహం ఒకరితో ఐతేనేం, పదిమందితో ఐతేనేం?” అన్నాడతడు.
అతడు దివితో తన స్నేహాన్ని ఎత్తిపొడుస్తున్నాడని అర్థమై, “నీకు తెలియదేమో- దివి నాకు గర్ల్‌ఫ్రెండ్ కాదు. ఫ్రెండ్- అంతే!” అన్నాడు వరుణ్.
“ఫ్రెండే కావచ్చు. కానీ కాబోయే భార్యగా ఊహించుకుంటున్నావుగా! అలాంటప్పుడు ఎన్నాళ్లీ స్నేహం? అలా మరికొన్నాళ్లు కేవలం స్నేహం అనుకున్నావో, నీకా అమ్మాయి దక్కదు. ఈరోజుల్లో అమ్మాయిలు చాలా ఫాస్ట్. పైకి చెప్పరు కానీ, వాళ్లకి మనమీద చాలా ఎక్స్‌పెక్టేషన్సుంటాయి. మీటవలేదో- లేటైపోతాం” అన్నాడు తరుణ్.
తరుణ్ తీరును అనుసరించకపోయినా, అతడి అనుభవంపై వరుణ్‌కి నమ్మకముంది. దివి తన చేయి దాటిపోవచ్చునని అనుమానం కలిగి, ఏంచెయ్యాలని తరుణ్‌ని సలహా అడిగాడతడు.
అంతే- తరుణ్ రెచ్చిపోయి కొన్ని సలహాలిచ్చాడు.
అతడి సలహామీద దివితో ఉన్నప్పుడు మాటల్లో చొరవ పెంచాడు వరుణ్. ఆమె కూడా మాటల్లో తన చొరవ పెంచింది.
ఒకసారి పార్కులో కూర్చునుండగా, అతడామె బుగ్గమీద వేలితో రాసి, “పుట్టు మచ్చా, ఏదో మరక అనుకున్నాను” అన్నాడు.
“నువ్వు మరక అన్నావ్. మిగతావాళ్లు దాన్ని బ్యూటీస్పాట్ అంటారు” అని నవ్వింది దివి.
ఆమె స్పందనే కాదు, ఆ నవ్వుకూడా ఆమెకు కోపం రాలేదనీ, అసలు నొచ్చుకోనేలేదనీ అతడికర్థమైంది. ఐనా ఎందుకైనా మంచిదని- “సారీ” అన్నాడు.
“స్వీట్ నథింగ్సుకి సారీ ఎందుకు?” అందామె తేలికగా.
స్వీట్ నథింగ్స్- అవి ప్రేమికులమధ్యనే కదా ఉండేవి!
జరిగింది తరుణ్‌కి చెప్పాడు.
తనకి ప్రేమ గురువు హోదా వచ్చేసిందని బ్రహ్మానందపడ్డాడు తరుణ్.
“వెరీ గుడ్ జాబ్” అని వరుణ్‌ని మెచ్చుకుని, “సందేహం లేదు. తను పడిపోవడానికి రెడీగా ఉంది. నువ్వు అడుగు ఇంకాస్త ముందుకెయ్యాలి” అన్నాడు.
పడిపోవడం లాంటి మాటలు సభ్యంగా అనిపించవు వరుణ్‌కి. కానీ అమ్మాయిలే, “నీ నవ్వుకి పడిపోయా” అని నిస్సంకోచంగా అంటున్న రోజులివి.
“తరుణుల పదప్రయోగంబులు గ్రాహ్యంబులు” అని అటు తరుణ్‌నీ, ఇటు తరుణుల్నీ స్మరించుకుని సరిపెట్టుకున్నాడతడు.
“అడుగు ముందుకంటే ఏం చెయ్యాలి?” అన్నాడు వరుణ్.
“ఆమెకి ‘జడ్‌కపుల్’ యాప్‌కి లింకు పంపి డౌన్లోడ్ చేసుకోమను. అనుభవం మీద చెబుతున్నాను. వర్కౌటవడం గ్యారంటీ” అన్నాడు.
జడ్‌కపుల్ యాప్‌లో ప్రేయసీ ప్రియులు ఏకాంతంలో అరమరికలు లేకుండా సన్నిహితంగా మసిలే విడియో క్లిప్సు ఉంటాయి. ముఖ్యంగా వయసులో ఉన్నవాళ్లని బాగా రెచ్చగొట్టేలా ఉంటాయి. ఆ లింకు దివికి పంపడం, ఎంతవరకూ సమంజసమని వరుణ్ తటపటాయించాడు.
“కాబోయే భార్యకి- ఆ లింకు పంపడానికి ఆలోచించేవాణ్ణి నిన్నే చూస్తున్నాను” అన్నాడు తరుణ్.
“దివి స్వచ్ఛమైన అమ్మాయి. జడ్ కపుల్‌తో ఆమె మనసులో కాలుష్యాన్ని నింపడం సబబు కాదన్న సంకోచంలో ఉన్నాను” అన్నాడు వరుణ్.
“మనం పీల్చే గాలిలో కాలుష్యం. త్రాగే నీటిలో కాలుష్యం. సమాజం ఆమోదించిందని భరిస్తున్నామా, లేదా? మరి మనసులో కాలుష్యాన్ని ఆమోదించడానికేం? ఐనా జడ్‌కపుల్ విడియో క్లిప్సు- పఠాన్ సినిమాలో దీపిక- షారూక్‌ల ‘బేషరమ్ రంగ్’ స్థాయిలోనే ఉంటాయి కాబట్టి అవి సెన్సార పక్షం కూడా. ఇక కాబోయే దంపతులు. మీకు సెన్సారింగేమిటి?” అని ప్రోత్సహించాడు తరుణ్.
బంగారానికైనా గోడచేరుపు కావాలంటారు. వరుణ్ ఊహలు బంగారానికి సాటొస్తాయో లేదో తెలియదు కానీ- అవి తరుణ్ ప్రోత్సాహాన్ని చేరుపుగా తీసుకున్నాయి.
వరుణ్ దివికి ‘జడ్ కపుల్’ యాప్‌కి లింకు పంపాడు.
‘జడ్ కపుల్’ యాప్ గురించి ఆమెకు తెలుసు. దానిపై నిషేధం లేదు కాబట్టి చూడాలనుకుంటే చూడొచ్చు. కానీ ప్రతి అమ్మాయీ ఓ సీత అనుకుంటే- సమాజ నియమాలు లక్ష్మణుడిలా ఆమె ముందు కొన్ని గీతలు గీస్తాయి. ఎక్కువమంది ఆ గీత దాటరు. ఆ ఎక్కువమందిలో దివి కూడా ఉంది.
వరుణ్ పంపిన యాప్ దివిని మాయ లేడిలా ఆకర్షించింది. ఆమె గీత దాటి ఆ యాప్‌లో ఓ విడియో ఆన్ చేసింది. మొదలవగానే ముందు తడబడి పాజ్ నొక్కి విడియో ఆపింది.
అలా ఓ క్షణం గడిచింది. ఆమె విడియాను మళ్లీ ప్లే చేసింది.
“కట్టెయ్” అంది మనసు.
“వద్దు, వద్దు “ అన్నాయ్ కళ్లు.
చేతులు కళ్ల మాట విన్నాయి. మనసు మాట వినలేదు.
కాసేపటికి దివికి వళ్లు బాగా వేడెక్కింది. చల్లబడ్డానికి స్నానం కూడా చేసింది.
ఆ యాప్ వరుణ్ ఎందుకు పంపాడూ అని ఆలోచించలేదామె. అతడిపై కోపం కూడా రాలేదు.
“నీకిప్పుడు పెళ్లికి చాలా తొందరగా ఉన్నట్లుంది. ఒకసారి నీతో మాట్లాడాలి. ఎక్కడ కలుసుకుందామో మెసేజి పెట్టు” అని వరుణ్‌కి మెసేజి పెట్టింది.
మామూలుగా ఐతే ఫోన్ చేసి మాట్లాడేది. కానీ ఆ క్షణంలో తటపటాయించింది.
వరుణ్ ఆ మెసేజ్ చూశాడు.
ఏం మాట్లాడుతుంది?
“దివి వచ్చేది నాకు క్లాసు పీకడానికేనని భయమేస్తోంది” అన్నాడు వరుణ్ తరుణ్‌తో.
అతడి గొంతులోని వణుకుని బట్టి, అతడి భయం ఏ రేంజిలో ఉందో అర్థమైంది తరుణ్‌కి.
“స్నేహమని అంటున్నా ఆమె నీ ప్రియురాలు. ఆపైన కాబోయే భార్య. ఇంకా భయమెందుకు? ఐనా, అమ్మాయిలేం ఉప్పూ కారం తినరా! ఇప్పుడు దివి నేననుకున్నట్లే స్పందించింది” అన్నాడు తరుణ్.
వెంటనే కాకపోయినా కాసేపటికి వరుణ్‌లో ధైర్యం పుట్టింది.
ఆఫీసు పేరిట ఓ రూం బుక్ చేశాడు. రూం అడ్రసు, అక్కడికి రావాల్సిన టైం నిర్ణయించి- దివికి ఫోన్ చెయ్యబోయి ఆగిపోయాడు. తరుణ్ మాటలు గుర్తొస్తున్నా- అతడికి ధైర్యం చాలలేదు.
చివరికి తను ఫోన్లో చెప్పదల్చుకున్న వివరాలు మెసేజిగా పంపాడు…..
దివి ఇంతవరకూ చెప్పేక, “తర్వాతేమయింది?” అంది భువి ఆత్రుతగా. ఆ కథ ధ్యాసలో తన ఆత్మహత్యా ప్రయత్నం విషయమే మర్చిపోయిందామె.
“మర్నాడు ఆఫీసుకెళ్లాను. వరుణ్ కానీ నేను కానీ ఒకరితో ఒకరం మాట్లాడుకోలేదు. ఆరోజే వరుణ్ రెండునెల్లకి టూరుమీద వెడుతూ మాటమాత్రం నాకు చెప్పలేదు. తర్వాత ఇద్దరం ఫోన్లు కూడా చేసుకోలేదు. ఉన్నట్లుండి పరాయివాళ్లమైపోయాం ఇద్దరం. రెణ్ణెల్ల తర్వాత వరుణ్ టూర్నించి ఆఫీసుకొస్తే నేనే అతడి చాంబరుకెళ్లి పలకరించాను”
“ఔన్లే, ఎలాగైనా ఆడవాళ్లం మనమే దిగిరావాలి” అంది భువి.
“నేనేం దిగి రాలేదు. నాకు మూడో నెలని నేను చెప్పందే అతడికెలా తెలుస్తుందని వెళ్లాను” అంది దివి.
“ఔనా, నిజంగా నీకు నెల తప్పిందా?” అంది భువి ఆశ్చర్యంగా.
దివి చెప్పింది.
వరుణ్ కూడా అప్పుడలాగే ఆశ్చర్యపడ్డాట్ట.
“మెసేజ్ పెట్టాను కానీ రూంకి రావడానికి నాకు ధైర్యం చాలలేదు. తరుణ్‌ని రూంలో ఉండమన్నాను. నువ్వు రూంకొస్తే- ఏదోఒకటి చెప్పి పంపించెయ్యమని తరుణ్‌కి చెప్పి అక్కణ్ణించి వెళ్లిపోయాను” అన్నాట్ట వరుణ్.
ఇది విన్న భువి, “అంటే, వరుణ్ కూడా అరుణ్‌లాగే చేతులు దులిపేసుకున్నాడన్న మాట. ఈ మగాళ్లంతా ఇంతే!” అంది భువి.
“అనుమానానికి- నీ అరుణ్ కంటే నా వరుణ్‌కి బలమైన కారణముందిలే! ఎందుకంటే- వరుణ్ తను రాలేదు సరికదా, నన్ను తరుణ్‌కి వదిలి వెళ్లాడుగా! తరుణ్‌కేమో ఉప్పూ కారం తినే ఆడపిల్లల గురించి బాగా తెలుసు. ఆపైన ఉచ్ఛనీచాలు లేవు…..” అంది దివి.
“అంటే?” అంది భువి షాక్ తిని. అడిగింది కానీ ఆమెకు అర్థమైంది. వరుణ్ ఇచ్చిన అవకాశాన్ని- దివిని వశపర్చుకుందుకు ఉపయోగించాడు తరుణ్. వయసు, ఏకాంతం, ఉప్పూకారం ఆ క్షణంలో ఆమెను లొంగదీశాయి.
దివి నవ్వి, “నేను వరుణ్‌కి ఏం చెప్పలేదు. నో సంజాయిషీ. నో అపాలజీ. నో బెగ్గింగ్. ఏంజరిగిందో, ఎలా జరిగిందో, అందుకు బాధ్యులెవరో తననే ఊహించుకోమన్నాను. నేనింకా అతణ్ణి ప్రేమిస్తున్నానని చెబుతూనే- నానుంచి అతడిపై నో ప్రెషర్ అని హామీ ఇచ్చాను” అంది.
“ఏమన్నాడు?” భువి గొంతులో చెప్పలేనంత ఆత్రుత.
“ఇన్ని మాటలు నాకెందుకు? మన పెళ్లికి డేటివ్వు. అది చాలు- అన్నాడు వరుణ్” అంది దివి.
“నిజమా?” అంటూ ఆశ్చర్యంతో నోరు తెరిచింది భువి.
“వరుణ్‌నే నమ్మించడానికి ప్రయత్నించనిదాన్ని- నిన్నెందుకు నమ్మించాలనుకుంటాను? జరిగింది చెప్పాను. నమ్ము, నమ్మకపో- అది నీ ఇష్టం” అంది దివి.
నిన్ను నమ్ముతాననలేదు భువి. “మగాళ్లంతా ఇలా ఉంటే ఎంత బాగుణ్ణు?” అని గొణుక్కుంటున్నట్లుగా అని నిట్టూర్చింది.
దివి మాటలపై ఆమెకు నమ్మకం కుదిరిందని ప్రత్యేకంగా చెప్పాలా?
“చద్దన్నం తిన్నమ్మ మొగుడాకలెరుగదని సామెత. మగాళ్లెందుకు అలా ఉంటారు? మనమే ఇంకోలా ఉండాలి. ఆడా, మగా కలిసి తప్పు చేస్తే- ఆ ఇద్దరిలో ఒకర్ని మాత్రమే తప్పుపట్టేవారిపై తిరగబడాలి. తలొంచుకోమని శాసించేవాళ్లని తలొంచుకునేలా చెయ్యాలి. అప్పుడే అనాదిగా జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి పునాది పడుతుంది” ఆవేశంగా అంది దివి.
ఆ ఆవేశం భువిలో ఉత్తేజాన్ని కలిగించింది.
“నీ మాటలతో నా కళ్లు తెరుచుకున్నాయి. ఆలోచనలు మారుతున్నాయి. కానీ నీ కథలో నీ వ్యక్తిత్వంతో పాటు వరుణ్‌కీ కొంత క్రెడిట్ ఇవ్వాలి! ఎందుకంటే- అతడి మిత్రుడు తరుణ్‌నే తీసుకో. అతడిపై అటు వరుణ్ ప్రభావం లేదు. ఇటు నీ ప్రభావం లేదు. నా అరుణ్ కూడా ఆ తరుణ్ లాంటివాడే! తమకి ఏ నష్టం లేకుండా- నానుంచీ, నీనుంచీ- తమక్కావాల్సింది సాధించుకున్నారిద్దరూ. ఏమంటావ్!” అంది భువి.
దివి నవ్వి, “నా కథ విని నువ్వర్థం చేసుకున్నదిదా! ఉప్పూ కారం తినే ఆడపిల్లని ఆ తరుణ్ కోరితే, ఉప్పూ కారానికి మించి ఇంకేమైనా నానుంచి అందనిస్తానా! దివి ఇక్కడ!” అంది.
“మరి నువ్వు వరుణ్‌కి నీకు మూడో నెల అని…..”
“అది నేను వరుణ్‌కి పెట్టిన పరీక్ష! నామీదున్న ప్రేమ, నమ్మకం- అతడిని ఆ పరీక్షలో నెగ్గించాయి”
“అదేం పరీక్ష! లేని గర్భాన్ని సృష్టించి ప్రియుడికి చెప్పడం చాలా పెద్ద రిస్కు. అతడు పరీక్షలో నెగ్గడం నీ అదృష్టం. నెగ్గకపోతే- ఓ మంచి ప్రియుణ్ణి చేజేతులా దూరం చేసుకునేదానివి” అంది భువి.
“నెగ్గకపోతే తనింకా మంచి ప్రియుడెలాగౌతాడు? జీవితంలో పెళ్లి కాకపోయినా, ఐ డోంట్ కేర్….” అని దివి ఇంకా ఏదో అనబోతుండగా-
“నా సమస్యకు పరిష్కారం దొరికింది. నేను భువి నుండి దివికి మారాలి!” అంది భువి దృఢంగా.
---0---
వసుంధర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
వసుంధర పరిచయం:మేము- డాక్టర్ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత్రి బిరుదు పొందారు.
ఈ కథ ప్రేమకు సంబంధించిన అనుభవాలను తీపి, చేదు కోణాల్లో చూపిస్తుంది. అయితే చివరకు, వ్యక్తిత్వ అభివృద్ధి, ఆత్మాభిమానం, నమ్మకమే కీలకంగా మారతాయి.)