top of page

బోనులో నక్కిన నల్ల పిల్లులు

Writer: Pandranki SubramaniPandranki Subramani

#PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #బోనులోనక్కిననల్లపిల్లులు, #BonuloNakkinaNallaPillulu, #TeluguStories, #తెలుగుకథలు


Bonulo Nakkina Nalla Pillulu - New Telugu Story Written By - Pandranki Subramani Published In manatelugukathalu.com On 09/03/2025

బోనులో నక్కిన నల్ల పిల్లులు - తెలుగు కథ

రచన: పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



ఎట్టకేలకు గాజువాక నుండి రెండ్రోజల దీర్ఘ ప్రయాణం తరవాత కుటుంమంతా భాగ్యనగర్ లో దిగింది. మొదట సుమో జీపు నుండి దిగిన చలపతి పెండ్లి విడిది వేపు దీర్ఘమైన పదునైన చూపుతో పరికించి చూసాడు “పెళ్ళి కూతురు తరపువాళ్ళు యేర్పాటు చేసిన వివాహ మండపం పోష్ యేరియాలో పోష్ గానే ఉన్నట్లుంది!” మనసున అనుకున్నాడతను. స్వగతంలా-- 

అతడే పెండ్లికొడుకు. స్టేట్ రివెన్యూ డిపార్టు మెంటులో సెక్షన్ సూపర్ వైజరీ పోస్టులో ఉన్నాడు. అంతలో మగ పెండ్లి వారికి ప్రత్యుత్ధానం చేయడానికి వచ్చిన అమ్మాయి తరపు బంధుగణం హారతి చూపి ఆహ్వానించడానికి ఊరేగంపుగా రాసాగారు. అప్పటికి అన్నయ్య ప్రక్కకి చేరిన వివేక్ మెడన వ్రేలాడు తూన్న బైనా క్యులర్ తీసి వాళ్ళ ముందు పరచుకున్న ల్యాండ్ స్కేప్ ని పరీక్షంచ నారంభించాడు. 


అతడు సైకలాజీలో సెకెండ్ ఇయర్. బైటవీ లోనివీ అన్న వ్యత్యాసం లేకుండా అన్నిటినీ ఆమూలా గ్రంగా చూస్తే గాని నిమ్మళించడు. చలపతి షార్పుగా తిరిగి చూసాడు. పచ్చటి ఉసిరి మొక్కలా కళకళలాడుతూ నవ్వుల పువ్వులు వెదజల్లుతూ వస్తూన్న పెండ్లి కూతురి చెల్లెలు స్నిగ్ధ పైన తమ్ముడి చూపు పడిందేమోననుకుంటూ కొంటేగా చూసాడు తమ్ముడి వేపు. 


అన్నయ్య చూపులోని భావార్థాన్ని పసిగట్టి- “అదేమీ లేదురోయ్ అన్నయ్యా! ఇదేమిటి కాలేజీనా, లేక ఫుడ్ కోర్టా కొంటె చూపులు విసరడానికి? అటువంటివి యిక్కడ చేస్తే పరువు పోదూ! తెలిస్తే నాన్న వీపు చీల్చడూ! నాదిప్పుడు పాతాళంలోకి దూసుకుపోయే నర్మగర్భమైన నిగూఢమైన చూపు. అదేమిటో చెప్పనా!“ 


ఉఁ చెప్పమన్నాడు చలపతి, 

“ఇప్పుడు కాదు. ఇక్కడ కాదు. పలకరింపులూ ఆలింగనాల తతంగమూ పూర్తవనియ్యి. అప్పుడు నీకు షాక్ యిచ్చే న్యూస్ చెప్తాను” 


చలపతి చప్పున కళ్ళు పెద్దవి చేసుకుని చూసాడు లోలోన కంగారు అణచుకుంటూ-- థ్రిల్లింగ్ కిల్లింగుల పట్ల ఎనలేని ఆసక్తి పెంచుకున్న తమ్ముడు ఎటువంటి క్లష్టర్ బాంబు విడిచి పెట్టబోతున్నాడోనని మనసు మూలన బియ్యపు మూటంత దిగులు చెందుతూ— పరామర్శలు పన్నీటి చిలకరింపులు చిమ్మడం పూర్తయిన తరవాత అందరూ భాజా భజంత్రీల మధ్య మండపానికి అటాచ్ చేయబడ్డ విడిది చేరుకున్నారు. నిజంగానే విడిది పోష్ యేరియాకి తగ్గట్టు ఖరీదైన అమరికే! మొదట పానీయాలు ఆ తరవాత ఒకట్ తరవాత ఒకటిగా టీలు కాఫీలు స్నాక్స్ తీసుకోవడం జరిగిన తరవాత రివాజుగా లాంఛన ప్రాయంగా ఒకరికొకరి పరిచయాలు చేసుకోవడం వరసలు కలుపుకోవడం కూడా సమాప్తం ఐన తరవాత విడిదిలోని అలికిడి తగ్గడం గమనించి సోమనాధం భార్య మంగళంతో కలసి కొడుకు వద్దకు వచ్చాడు. 


“ఏంవిరా చలపతీ— నేకెన్ని సార్లు చెప్పాను మీ తమ్ముడితో మరీ క్లోజ్ గా ఉండకని? తెలుగు డిటెక్టివ్ నవలలు- అమెరికన్ రష్యన్ క్రైమ్ స్టోరీ కథలు తెగ చదివి బుర్ర బాగా పాడుచేసుకు న్నాడని! నిశ్శబ్దంగా ఉన్నచోట నల్లటి నీడ నడయాడుతుందంటాడు. దుష్ట శక్తులు కదులాడు తుంటాయంటాడు. అన్నిటినీ అనుమానపు చూపుతోనే చూస్తాడు. నువ్వేమో వాడి సంపర్కం వదులుకోవాయె-“ 


చలపతి అదోలా నవ్వుతూ అన్నాడు- “ఇప్పుడు నాకేమీ కాలేదు నాన్నగారూ!“ 


 “అబధ్ధం చెప్పకు- ఈపాటికేదో జరిగిందని నీ ముఖకవళికలు గమనిస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు మాతో చెప్పు వాడేమి చెప్పి కెంగారు పెట్టాడో! ” 


 “ఇంకా చెప్పలేదు నాన్నగారూ! ఏదో హాట్ న్యూస్ చెప్పబోతున్నాడట“


“చెప్పకముందే నీ మూడ్ యిలా తయారయిందంటే- విన్నతరవాత ఇంకెలా ఉంటుందో!”


ఈసారి మంగళం భర్త మాటకు అడ్డువస్తూ కలుగచేసుకుంది. వివేక్ ని దగ్గరకు పిలిచి అడిగింది “ఏదో సీరియస్ వ్యవహారం ఉందన్నావటగా! అదేదో నాకు చెప్పరా!”


“ఉఁ హూ! నీకు చెప్పను. వింటే నువ్వు జడుసుకుంటావమ్మా!”


“పర్వాలేదు. ఏమీ జరగదు. నాకూ మీ నాన్నకూ కలిపి చెప్పు. గుండెనిబ్బరంతో వింటాం”


 “సరే-- అలాగే! ” అని ఓసారి చుట్టు ప్రక్కల చూపులు సారించి చూసి చెప్పాడు- “ఇది పోష్ యేరియా మాత్రమే కాదు. మీ వియ్యంకుడూ వియ్యంకురాలు కూడా పోష్ ఫ్యామిలీకి చెందినవారు. వాళ్ళ వద్ద బోలెడంత డబ్బూ దస్కమూ ఉంటుందని అందరికీ తెలుసు. అంతేనా—మనం కూడా పెళ్ళికూతురికి వేయడానికి నగా నట్రా భారీగానే తెచ్చాం. ఔనా! ” 


దానికేమిటంట?- అన్నట్టు భార్యాభర్తలిద్దరూ చిన్న కొడుకు వేపు సూటిగా చూసారు. 

వివేక్ చెప్పసాగాడు- “చెప్తాను. బాగా వినండి. అప్రమత్తంగా ఉండండి. ఇక్కడ చుట్టుప్రక్కల తరచుగా దోపిడీలు దొమ్మీలు జరుగుతుంటాయని తెలుసుకున్నాను. దాడి చేసేది మామూలు దోపిడీ ముఠాకాదు. అంతర్రాష్ట్ర దోపిడీ గ్యాంగ్. వీళ్ళు జారి తప్పుకు పోవడానికి చమురు పూసుకుని వచ్చే అప్పటి సత్తెకాలపు దొంగలు కారు. ఏకే- 47 రైఫిళ్లుంటాయి. లేదా లైవ్ రౌండ్సుతో బోర్ గన్నో స్టెన్ గన్నో వాళ్ళ వద్ద ఉంటాయి. ఎవరైనా చూచి అరవడానికి నోరెత్తారో-- వెంటనే కాల్పులకు దిగుతారు. 

అంతెందుకు—మొన్న ఎన్ కౌంటర్ లో హతమైన కుయూమ్ గ్యాంగు వాళ్ళు కూడా కొందరు వీళ్ళలో కలసిపోయుండ వచ్చు. కావున— ఇక్కడ మనకూ పెళ్ళి కూతురు తరపు వాళ్ళకూ క్షణం క్షణం గండం- కన్నార్పితే ప్రాణ సంగటం!”


ఆ మాట విన్నంతనే భార్యాభర్తలిద్దరి ముఖాలు వెలవెలపోయాయి. చలపతి ముఖం వివర్ణ మయింది. నుదుట చోటు చేసుకున్న చెమట చుక్కల్ని తుడుచుకున్నాడు. శుభమా అని కళ్యాణోత్సవం జరగబోతుంటే— ఇప్పుడీ యమగండం దాపరించడమెందుకో! 

“సరే- ఇప్పుడు మనమేం చేద్దాం? పోలీసులకి ముందస్తు కబురు యిద్దామా!“ ఏక కంఠంతో అడిగారు ముగ్గురూ-


“వద్దంటే వద్దు. పెళ్ళి కళ తప్పుతుంది. రథోత్సవం వంటి వాతావరణ చెదరిపోతుంది. పిల్లలతో ముత్యయిదువులతో కన్నెపిల్లల నవ్వులతో ఉత్సవంలా శోభిల్లుతూన్న మండపం బోసిపోతుంది. అంచేత నాకు తెలిసిన లాయర్ మిత్రుడితో ఎదురవబోయే దుర్భటన గురించి వివరించి స్పెషల్ సైబర్ క్రైమ్ బ్రాంచీవాళ్ళతో ఒక సీక్రెట్ ఆపరేషన్ జరిగేలా యేర్పాటు చేసాను” 


“అదేం వంకర టింకర మాటల్రా! ఇంతకు ముందు పోలీసుల ప్రమేయం వద్దన్నావు. వాళ్ళ ప్రమేయం కల్లోలపరుస్తుందన్నావు. ఇప్పుడేమో స్పెషల్ బ్రంచీ వాళ్ళకు-- “ అని చలపతి వాక్యం పూర్తి చేసేలోపల వివేక్ అడ్డువచ్చాడు. “ఆ పోలీసు వేరు. ఈ పోలీసు వేరు”


 ఎలా అన్నట్టు ముగ్గురూ వివేక్ వేపు షార్పుగా చూసారు. 

”ఎలాగంటే—స్పెషల్ బ్రాంచీ వారు క్లిష్టతరమైన దారుణమైన నేరస్థుల ఆచూకీ తీసి చాప క్రింది నీళ్లలా చప్పుడు లేకుండా యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళకు తగినంత మోతాదులో అత్యాధునిక టెక్నికల్ వస్తు సామగ్రి ఉంది. ” 


“ప్రత్యేకమైన పని ముట్లున్నాయంటే చాలదు- ఎడాపెడా తెలుగు ఇంగ్లీషు రష్యన్ క్రైమ్ నవలా సాహిత్యం చదివి తెగ ఉక్రోశంతో ఊహిస్తున్నట్టున్నావు. మా అందరి బుర్రా వేడెక్కెస్తున్నావు. కమ్ క్వక్! ” 


“ఉష్! రహస్యం-- విషయానికి వచ్చే ముందు దీనికి- అంటే పోలీసులతో సంపర్కం పెంచుకోవడానికి తగినంత భోగట్టా కావాలి. అమ్మాయి తరపున యెవరెవరు వచ్చారు?“ 


“వచ్చిన వాళ్ళందరూ ఈ ఊరి వాళ్ళే— వియ్యంకుడు యేర్పాటు చేసిన ఈవెంట్ మేనేజరూ అతడి సహాయకులు తప్ప-” 


సోమనాథం బదులిచ్చాడు. దానికి వివేక్ స్పందించాడు- “అంతేనన్నమాట. ఇక విషయానికి వస్తాను. సర్వమూ రహస్యమన్నది గుర్తుంచుకుని వినండి. అమ్మాయి అమ్మానాన్నలు బాగా ఉన్నవాళ్ళు కాబట్టి కనీసం రెండు కిలోల బంగారం ప్లస్ కొన్ని లక్షల క్యాష్ తెచ్చుంటారు, మన తరపున, మనతో వచ్చిన బంధువులు తొడుక్కున్న నగలన్నీ చేర్చి చూస్తే కిలో బంగారం ప్లస్ రెండు లక్షల క్యాష్ ఉంటుంది. ఔనా! ”


తలూపారందరూ- 

“ఈపాటికి దీనిగురించి ఆరితేరిన దోపిడీ గ్యాంగ్ వాటి విలువ గురించిన లెక్కలు తేల్చే ఉంటా రు. అందువల్ల నేనూ మా లాయర్ ఫ్రెండూ కలసి యేమి చేసామంటే—పోలీసు హేడ్ క్వార్టర్సులోని ఆపరేట్ చేస్తూన్న సిసి కెమారాలతో ఇక్కడ వివిధ గదుల్లో ఉన్న హోమ్ సిసీ కెమారాలతో అనుసంధానం చేయడానికి స్పేషల్ ఆపరేషన్ యేర్పాటు చేసాం”


ఇది విని చలపతి అసహనంగా చూసాడు. “అదేలా వీలవుతుందిరా వివేక్! పోలీసుల ఇంటర్నల్ సిసీలతో ఇక్కడి వాటితో అనుసంధానం యెలా యేర్పాటవుతుందిరా?” 


”ఎలా చేసారని అడుగు—ఎలా వీలవుతుందని అడక్కు. నేర నియంత్రణ కోసం అమర్చిన పలు సీసీ కెమేరాలను పోలీస్ స్టేషన్ వ్యూయింగ్ సెంటర్ ద్వారా అనుసంధానం జరిగేలా చేసాం- విషయం అప్పటికిప్పుడు పొక్క నీయకుండా-- వ్యూయింగ్ సెంటర్ లో ముఠాదొంగల అలికిడి తెలిసిన వెంటనే ఇక్కడ చుట్టు ప్రక్కలున్న పెట్రోలింగ్ పోలీసులు మెసేజ్ అందుకుంటారు. వాయు వేగంతో వచ్చి మండపాన్ని- మండపంలోని విడుదుల్నీ చుట్టు ముట్తారు. ఆ తరవాత బాత్ కతమ్!” 


వాళ్ళలా గుసగుసలు పోతూ చర్చించుకుంటున్నప్పుడు సరిగ్గా అక్కడకు వియ్యంకుడు శివయ్య వియ్యంకురాలు పార్వతమ్మ వచ్చారు. వచ్చి ముక్త కంఠంతో అన్నారు- “చెప్పాలను కుంటూనే బాదర బందీలో పడి చెప్పడం మరచిపోతున్నాం. దయచేసి కలవర పడకుండా వినండి. ఇది ధనవంతుల అలికిడి గల ప్రాంతం. ఇక్కడ దోపిడీ దొంగలు తిరుగుతుంటారు, కావలసిన దానిని దోచుకోవడానికి దేనికైనా తెగిస్తారు.” 


ఆ మాటవిని అంద రూ “అలాగా!” అన్నట్టు తలలూపారు మనసున అబ్బురపడ్తూ-- . మరి- అంతవరకూ పెళ్ళి కొడుకు తరపువాళ్ళు బుర్రలు బ్రద్లలు గొట్టుకుంటూ ఆలోచిస్తున్నదేమిటంట! ఎందుకంట-- 

----------------------------------------------------------------------- 

ఇంటా బయటా, ఇరుగు పొరుగునా అంటుంటారు- అనుకున్నదొకటీ— జరగబోయేది మరొకటీను- అని. అటువంటిదే పెండ్లి మండపంలోనూ జరిగింది ఆరోజు రాత్రి. దొంగలు పడ్డారు. కాని— బయట నుంచి కాదు. మండపంలోపలే ఈవెంట్ మేనేజరు రూపంలోనూ అతగాడి సహాయకుల రూపంలోనూ వచ్చి తిష్ఠ వేసిన దొంగల గుంపుని వేయి కళ్ళతో అడుగ డుగున పచార్లు చేస్తూ పహరా కాసి తిరిగిన వివేక్ తన లాయర్ మిత్రుడి సహకారంతో ఆ దుష్ట చోరులు హస్త లాఘవం చూపించబోతూన్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా చుట్టు ముట్టి పట్టుకున్నారు. 


ఎలాగని—హావభావాలు కనిపించనీయకుండా పెండ్లికి వచ్చిన ఆహ్వానితులుగానే కనిపిస్తూ బీరువాలు చక్కబెడ్తూన్న తరుణంలో చిరుతల్లా దూకి దొంగలందర్నీ లోపలకు జోరుగా ఉక్కమ్మడిగా తోసి ప్రతి చర్యకు తావివ్వకుండా చేసి బయట తలుపులకు గొండెం పేట్టారు. పోలీసుల్ని పిలిచి సరండర్ చేయించి బేడీలు వేయించారు. పెళ్ళికి కళ కట్టించారు. 


ఆట గదరా! దొంగాట కదరా! క్రైమ్ అండ్ క్రిమినల్స్ ట్రాకింగ్ సిస్టమ్ లోని మహత్తు అదే కదా! విడిదిలోకి నీడల్లా ఈవెంట్ మేనేజర్లలా ఫేజ్ త్రీ అమ్మాయిల్లా చొరబడ్డ నల్లపిల్లుల కుప్పి గెంతులకు బాత్ కతమ్—తాడి తన్నువాని తల తన్నువాడొకడుంటాడు కదా!  


శుభం

  

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.






 
 
 

コメント


bottom of page