top of page

బూమరాంగ్

Writer: Pandranki SubramaniPandranki Subramani

#PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #బూమరాంగ్, #Boomerang, #TeluguStories, #తెలుగుకథలు


Boomerang - New Telugu Story Written By - Pandranki Subramani

Published In manatelugukathalu.com On 14/03/2025

బూమరాంగ్ - తెలుగు కథ

రచన: పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



బూమరాంగ్ అన్న ఆంగ్ల వాడుక పదాన్ని మనం వినే వుంటాం, తరచూ వింటునే ఉన్నాం. దేనినైతే షార్పుగా ఎదుటివారి వేపు విసిరామో- అదే మళ్లీ గిరికీలు తిరుగుతూ మన వేపు దూసుకురావడమన్నమాట! అంటే- క్లుప్తంగా చెప్పాలంటే ఎదురు దెబ్బన్న మాట! నా జీవితంలో నాకెదురైన యిటువంటి బూమరాంగ్ దెబ్బను నేనెట్టికీ మర్చిపోలేను. ఎందుకంటే ఇది రస వంతం- అదే సమయాన దిగ్భ్రాంతికరం. ముఖ్యంగా ఇది నాకు వ్యక్తిగతమైనది కూడాను. 


ఇంతకూ అదెలా ఎదురైందంటే- రెండువేల ఐదులో మా ఉప ప్రాంతీయ కార్యాలయ పర్యవేక్షణా పర్యటనపై విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చింది. వాస్తవానికి ఆ పర్యటనకు వెళ్ళడా నికి నాకు సుముఖత లేదు. ఎందుకంటే నేనక్కడ నెరవేర్చవలసిన వ్యవహారం గురుతరమైనదేదీ కాదు. కాలయాపనకు గురవుతూ న్న మరణాననంతర దరఖాస్తులను(డెత్ కేసులు) పరీక్షించి వాటి కారణాంతరాలను వెలిక్కి తీసి కనుక్కోవడం- కనుక్కుని విశ్లేషిం చిడం. పిమ్మట నా పరిధిలో ఉన్నంత మేర పరిష్కార మార్గం సూచించడం. 


నిజానికి ఈపని ఆ ఊరి కార్యాలయ ప్రధానాధికారే చేయవచ్చు. కార్యాలయ ప్రధానాధికారిగా ఇటువంటి వ్యవహారాలపై, ముఖ్యంగా ఖాతా చెల్లింపుకి నోచుకోని వితంతు పెన్షన్ దరఖా స్తులపైన తక్షణ చర్యలు తీసుకోవచ్చు. న్యాయంగా తీసుకోవాలి కూడాను. అంతే కాదు, మరణాననంతర దరఖాస్తుల విషయంలో సెంట్రల్ క్యాబినెట్ సెక్రటేరిట్ వాళ్లు కన్నెర్ర జేస్తారని కూడా వాళ్ళకు బాగా తెలుసు. పని రద్దీవల్లనో మరెందు వల్లనో మరి- కొన్ని ప్రాంతీయ కార్యాలయాలలో ప్రధానాధికారులు పెద్దగా పట్టించుకోరు. 


మరింత లోతుకెళ్ళి సహేతుకంగా చెప్పాలంటే- అదే స్థాయి బాధ్యత ఆయనకు మాత్రమేకాదు, ఆయనతోబాటు పనిచేసే తదితర ఆఫీసర్లకూ ఉందనేది నిర్వివాదాంశం. ఇక్కడ మరొక మెలిక కూడా ఉంది. కొత్తగా ప్రవేశపెట్టిన శాసనబధ్ధ నియమానుసారం అకార ణమైన జాప్యానికి తావిస్తే, దానిపై లబ్దిదారు ఎవరైనా కోర్టుకి గాని వెళ్తే, జాప్యా నికి బాధ్యులైన సిబ్బంది మాత్రమే కూదు, విభాగాధిపతులు సహితం నష్ట పరిహారంయిచ్చుకోవలసొస్తుంది. ఇక నాచేతిలో ఉన్నపెండెన్సీ లిస్టు ప్రకారం గమనిస్తే ఈ అపరిష్కృత దర ఖాస్తులలో అత్యధికమైనవి వితంతువులకూ మైనారిటీ పిల్లలకూ మంజూరు చేయవలసిన పెన్షన్ వ్యవహారానికి చెందినవే-- 


పర్యాటక కార్యక్రమం ప్రకారం విశాఖపట్నం చేరుకున్న తరవాత నేను తెలుకున్నదేమిటంటే, అపరిష్కృత డెత్ కేసులు నాకు లిస్టులో చూపించిన వాటికంటే అక్కడి ఉప ప్రాంతీయ కార్యాలయంలో దాగుడు మూతలాడుతున్నవి మిక్కిలిగానే ఉన్నవని. ఇకపోతే-- విండో షాపింగులా చూపించే ఇటువంటి వాటినే జగ్లరీ ఆఫ్ స్టాటిస్టిక్సు అంటారు. ఇటువంటి అగోచరమైన పెండెన్సీనే తు మ్మెదల రాక కోసం అటకెక్కించిన జుంటుతేనె అనికూడా అంటారు. 


ఇప్పుడు నేను చేయాల్సిందల్లా ఒక్కటే- చూపించిన వాటినీ, చూపించని వాటినన్నిటినీ తవ్వాలి. తవ్వి బయటపెట్టాలి. బయటపెడ్తే చాలదు. వాటి చెల్లింపు అవరోధాలను అధిగమించి వాటిని సెటి ల్ చేయించి ఒక కొలిక్కి తేవాలి. అదే సమయాన తానొవ్వక- నొప్పించక- అన్నరీతిన ముగించాలి. మొత్తానికి చేతిలో చాలాపనే ఉంది. 


జీవితంలో కొన్ని బరువైన సత్యాలు ఎదురువుతుంటాయి. అటువంటివే ప్రభుత్వయంత్రాంగంలోనూ ఉంటాయి. ఇష్టమున్నా లేకపోయినా సైకలాజికల్ వార్ ఫేర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నాకంతటి ఓపిక లేదు; ప్రయాణ బడలిక వల్లనో మరెందువ ల్లనో! అయినా నేను పనిగట్టుకొని అదే చేసాను. అన్ని అపరిష్కృత డెత్ కేసులు ఉంచుకున్నందుకు ధూం ధాం అని ఎగిరాను. కొందరు సెక్షన్ ఆఫీసర్లకు నోట్టాఫ్ డిస్ ప్లెజర్ పంపించాను. ఇద్దరి ముగ్గురికేమో ఏకంగా అడ్వర్సు మిమోలే పంపించాను. 


మనసున ఎలాగున్నా పౌరసేవా కార్యాలయంలోని దుమ్మూ ధూళీ దులపాలంటే అప్పుడప్పుడు దానిని ఒక కుదుపు కుదుపే తీరాలి కదా! పులి వేషం వేస్తే పులిలాగానే కదా హుంకరించాలి! ఈ లోపల మరొక ఉదంతం నా దృష్టికి వచ్చింది. అదేమంటే- నా రాక గురించి తెలుసుకున్న చుట్టుప్రాంతాల నుండి- ముఖ్యంగా విజయ నగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, గజపతి నగరం, ఒడిష్షాకి అంచున ఉన్న ఇఛ్ఛాపురం నుండి పెన్షన్ కేసుల సెటిల్ మెంట్ల కోసం వితంతు స్త్రీలు పెట్టే బేడాతో వచ్చి ఉన్నారని, నన్ను త్వరగా చూడాలను కుంటున్నారని- 


పరిస్థితిని పసిగట్టిన పత్రికల వాళ్ళు అదే అదనుగా ఆఫీసు చుట్టూ గుమికూడారని అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ వాళ్ళు కబురందించి వెళ్ళారు. వాళ్ళను చూసే మాట తరవాతి సంగతంటూ- వచ్చిన వాళ్ళను వచ్చినట్లే కూర్చోబెట్టమని, వాళ్ళకు మంచి నీళ్ళు- తేనీరు గట్రా యివ్వమని ఆదేశాలందిచ్చి కేసుల్ని పరిష్కరిస్తూ అక్కడికక్కడ నోట్ ఆర్డర్స్ జారీ చేయడంలో నిమగ్నుడినయాను.


ఇక విషయానికొస్తే ఇక్క డ వేళ్ళూనిన అసలు సమస్యేమిటి- పెన్షన్ కేసులు సెటిల్ కాక పోవడం. అంతేకదా! మరి పెన్షన్ కేసుల సెటిల్ మెంట్సుతో బాటు పనిలో పనిగా పెన్షన్ పేమెంట్ ఆర్డర్సూ కూడా వెలువడించి, వాటితో బాటు చెక్కులు కూడా పంపించే యేర్పాటుచేస్తే వాళు వద్దంటారా యేమిటి! నాకూ మాఆఫీసు సిబ్బందికీ మనసార పొగడ్తలిస్తూ వెళ్ళరూ! 


మొత్తానికి నాకున్నకొద్ది పాటి విశేషాధికారాల్ని ఉపయోగించి, డెత్ కేసులన్నిటినీ పరిష్కరించ గలిగాను. పిదప తాపీగా కుర్చీలో జేరబడి, క్రింది వాళ్ళను మరీ ఎక్కువగా దనుమలాడటం ప్రతికూల ప్రభానికి దారితీస్తుందని- వాళ్ళలో చాలా మంది కష్ట పడి పని చేసేవాళ్ళున్నారని, ఆ విషయం నాకు బాగా తెలుసని కితాబునిచ్చి, ఆఫీసు వ్వవహారాలలో నాకు కనిపించిన సకారాత్మక అంశాలను రికార్టుచేసి వాళ్ళ ప్రదానాధికారికి పంపించి నిదానంగా అడిగాను- “మీరందరూ మిగతా వర్కు ఏరియాలలో బాగానే పని చేస్తున్నారు కదా- మరి మీరీ డెత్ కేసులలో మాత్రం ఎందుకు వెనుకబడుతున్నారు? “


అప్పుడు మహరాష్ట్ర ప్రాంతం నుండి వచ్చిన అసిస్టెంట్ కమీషనరు గాండేకర్ భవ్యంగా ముందుకొచ్చి”పర్సనల్ రిమార్కు అనుకోకపోతే ఒక మాట చెప్పేదా సార్ ? “అని అడి గాడు. 


చెప్పమని తలూపాను. ”నిజం చెప్పాలంటే—మాకు ఎక్కడా లేని చిక్కులు విజయనగరం జిల్లానుండే వస్తున్నాయండి“ 


నేను తెల్ల బోయినట్లు చూసి- “ఎలాగ? ”అని అడిగాను. 


“చెప్తానండి. నేను చెప్పకపోయినా మీకు ఏదో ఒకరోజు తెలిసే తీరుతుంది కదండీ! అదేం విచిత్రమో మరి- విజయనగరం నేలలోని సారం ఎటువంటిదో మరి- ఎడ్యుకేటడ్ ఆర్ అన్ ఎడ్యుకేటడ్ అన్న తేడా లేకుండా చాలా మందికి ఎక్కడో ఒక చోట ఓ చిన్నిల్లుంటుంది సార్”


ఇది విని నాకు అసహనం కలిగింది. ”మీరు మరీనూ! దీనికీ దానికీ యేం సంబంధమండీ? ” విపరీతమైన విసుగు చూపించాను. 


“లెట్ మీ కమ్ టు ది పాయింట్ సార్! ఉందండి. అక్కడున్న చాలామంది మొగాళ్ళు రిజర్వులా రెండో ఆడది లేకుండా ఉండలేరండీ. ఎందుకంటే- వాళ్లకా ఉద్దీపన ఎక్కువండి. కొందరేమో ధ్యెర్యంగా మొండిగా రెండో దానికి మూడుముళ్ళూ వేసేస్తారండి. కాని ఎక్కడేమి జరిగినా చివరి వరకూ గుట్ఠురట్టు కాకుండా చూసుకుంటారండి. విషయం ఎప్పుడు బైటకొస్తుందంటే- మగాడు పాడెపైన వాలినప్పుడు. 


అప్పుడు ఆస్థి పంపకాల కోసం చిన్నపెళ్ళాం పిల్లల్ని చంకను ఉంచు కుని ఊరు ఊరంతటినీ తరలించుకొస్తుందండి. అప్పుడేనండి రగడ ఆరంభమవుతుంది. ఆ గొడవ మా తలకుచుట్టు కుంటుంది. అప్పట్నించి కోర్టుకేసులు తామర తంపరగా వస్తుంటాయి. ఈ కోర్టుకేసుల్ని టేకప్ చేసేదా- చేతిలో ఉన్న పెన్షన్ కేసుల్ని సెటిల్ చేసేదా అన్నది తెలియక మేం జత్తుపీక్కుంటామండి. 


చాలా కేసుల్లో మీకిప్పుడు కనిపించేది మా స్టాఫ్ గాని మేం గాని కావాలని చేసిన డిలే కాదండి. కోర్టుకేసుల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేక, సమయానికి లీగల్ సలహా యివ్వగల అసిస్టెంట్ ప్రోసిక్యూటర్ దొరక్క చేష్ట లుడిగి పోతుంటామండి. మొన్ననేమో ఒక సీరియస్ వ్యవహారం చోటుచేసుకుందండి. ఎవరు చెప్పి ఎసరు పెట్టారో గాని, ఒకామె- అంటే ఒకతని రెండో భార్య, పీ. ఎమ్ గారికి రాసేసిందండి. 


జరిగిందేమిటో సరిగ్గా తెలుసుకోకుండా పీ ఎమ్ ఆఫీసు వాళ్ళేమో సెంట్రల్ కమీషనరుకి సీరియస్ గా రిఫర్ చేసేసారండి. దానిని యథాతథంగా తీసుకొని చీఫ్ కమీషనరేమో ఆర్డర్సు ఇష్యూ చేసేసారండి. దాని పర్యావసానం- ఒక సీనియర్ క్లర్కు, ఒక సెక్షన్ సూపర్ వైజర్ మరొక బ్రాంచాఫీసరూ సస్పెండయ పోయారండి. చీఫ్ కమీషనర్ ఆర్డ ర్సు ప్రకారం సస్పెండవటం అంటే మాటలు కాదు కదండీ- ముగ్గురూ ఉద్యోగోలు పోతాయన్న దిగులుతో మంచమెక్కేసారండి. ఆ కేసు విషయమై ఇంక్వయిరీ యింకా నడుస్తూనే ఉందండి. ఇదండీ ఇప్పుడిక్కడున్న పరిస్థితి! ”

 

 ఇక నేనేమీ మాట్లాడలేదు. నీరు గారిపోయి, నిర్వీర్యమైపోయి లేచి నిల్చున్నాను. జేవురించిన ముఖాన్ని చేతి గుడ్డతో తుడు చుకుంటూ ఫైళ్ళను యిరుపక్కలకూ నెట్టుకుంటూ నడి సముద్రాన ఈదు తున్నవాడిలా బైటికి నడిచాను. 


“ఏమైంది సార్? సుస్తీగాని చేసిందా సార్! క్లీనిక్కుకి వెళ్దామా సార్“ అంటూ అందరూ లేచి నన్ను చుట్టు ముట్టారు. అదేమీ అవసరం లేదన్నట్లు చేతితో సైగ చేస్తూ గెస్టుహౌస్ వేపు నడిచాను.


అక్కడున్న చాలామందికి తెలియక పోవచ్చు, నేను కూడా విజయనగరానికి చెందిన వాణ్ణేనని. నేను సహితం మా తండ్రి గారి రెండవ భార్య కడుపున పుట్టిన వాణ్ణేనని. ఉప ప్రాంతీయ కార్యాలయం వాళ్ళు చెప్పింది విన్న తరవాత యిప్పుడు నాకూ అనిపిస్తుంది- విజయనగరం భూమిలోనున్న సత్తా యేమిటోనని--


ఇక అసలు విషయానికి వస్తే-- మా తండ్రిగారికి మాత్రమే కాదు, మామేనమామగారికి కూడా యిద్దరు. ఇక మా పెద్దమ్మగారి పెద్ద కొడుకు విషయానికి వస్తే ఒకరిద్దరు కాదు- మొత్తం ముగ్గు భార్యలు. రేపు నా విషయం ఏమవుతుందో మరి! 


అలా ఆలోచిస్తున్నప్పుడు మొన్న జరిగిన ఒక ఉదంతం మెరుపులా పెళ్ళున కళ్ల ముందు మెదిలింది. మార్కె ట్టు నుండి కాయగురలు తెస్తున్నప్పుడు మా రీజనల్ ఆఫీసులో నాతో బాటు పని చేస్తున్న ఒక లేడీ ఆఫీసరుతో మాట్లాడుతూ రావడం మా ఆవిడ స్టాఫ్ క్వార్టర్స్ మేడపైనుంచి చూసింది. ఇంటికొచ్చిన తరవాత గిల్లికయ్యం పెట్టుకోవ టానికి ఉబలాట పడుతూ అడిగింది- “ఎంతైనా మీ వంశం పుట్టుబుధ్దుల్ని పోనిచ్చుకున్నారు కాదు! ”


ఆవిడామాటను సరదాగా అని ఉన్నా గుండెలో మాత్రం యేదో కెలికినట్లయింది. అయితే- ఇప్పుడు మాటకు మాట చెప్పుకోవాలే గాని, నా కటువంటి పరిస్థితి- రాదు- అటువంటి ప్రమాదం కచ్చితంగా ఎదురవకపోవచ్చు, ఎందుకంటే- నేను మరుసటి సంవత్సరం ఎలాగూ రిటైర్ కాబోతున్నాగా! 


మెదడులో మసాలా ఉన్న ఏ స్త్రీ అయినా ఫ్యూజు ఊడిన బల్పులా మారబోతూన్న నావంటి వాడి చెంతకు చేరి సరసాలడానికి సాహసిస్తుందా! 


శుభం

  

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.






 
 
 

Comments


bottom of page