top of page

బొట్టు

Writer's picture: Pandranki SubramaniPandranki Subramani

'Bottu' - New Telugu Story Written By Pandranki Subramani

Published In manatelugukathalu.com On 28/10/2023

'బొట్టు' తెలుగు కథ

రచన: పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

నేనీమధ్య అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. నిజానికి నేను అమెరికా వెళ్ళడం కాదు అసలు విషయం; వాస్తవానికి నేనక్కడ కు పిలక పట్టుకుని లాక్కెళ్ళబడ్డాను. అంటే నేనక్కడకు వెళ్ళింది ఇష్టాపూర్వకంగా కాదనన్నమాట, కారణాంతరాల వల్ల వెళ్ళాల్సి వచ్చింది. అమెరికా వెళ్ళడానికి అయిష్టత యేర్పడటానికి రేండే రెండు కారణాలు. మొదటిది- అక్కడి వాతావరణాన్ని తలచుకుం టేనే మంచు తుఫాను గుర్తుకొస్తుంటుంది. జలుబు పట్టుకున్నట్లుంటుంది. అంతెందుకు- నా శరీర తత్వానికి ఏ సీ సహితం పడదు.


ఇకపైన చెప్పాలంటే ఆదినుంచీ చలికాలమైనా వేసవి కాలమైనా తీక్షణత తీవ్రత గల వాతావరణమయితే ఒంటికి ససేమిరా సరిపడదు. అలర్జీ అంటారే— అటు వంటిదన్నమాట. రెండవ కారణం- నేనింతకు ముందే అమెరికా రాష్ట్రమైన నార్త్ కరోలినాలో సుమారు ఆరునెలల పాటు ఉండి వచ్చాను. ఆ ఊపున వాషింగ్టన్, న్యూయార్క్- తదితర ప్రాంతాలన్నీ వణికే చలిలో భారీ దళసరి దుస్తులు వేసుకుని మా అబ్బాయి మార్గదర్శకత్వాన తిరిగొచ్చాను.


ఇక్కడి వాళ్ళు ఆ దేశాన్ని తలచుకుని యేమేమో అనుకుంటారు గాని; నాకు మాత్రం అక్కడి వాళ్లను చూసి నిజంగా పాపం అనిపించింది. ఇంతటి చలిలో- ఎడతెరపి లేకుండా కురుస్తూన్న మంచులో వీళ్లెలా మనుగడ సాగిస్తున్నారో కదా! అటువంటి చోటుకి మళ్లీ మరొక సారా! ఇక యేది యేమైతేనేం- అమెరికాలో భారతీయుల అలికిడి యెక్కువగా ఉన్న న్యూజెర్సీకి వెళ్ళాల్సి వచ్చింది, మా ఆవిడ ప్రోద్బలం వల్ల- ఆమెకు మనవరాలి పట్ల ఉన్న మమకారం వల్ల--

ఇక ముందుకు సాగితే న్యూజె ర్సీలో మన్రోటౌన్ షిప్పుకి చేరుకున్న పది రోజుల్లోపల రెండు అద్భుతమైన (నిజంగా అద్భుతమైనవే)హైందవ దేవాలయాలను దర్సించ గలిగాను. ఒకటి గురవాయురప్ప ఆలయం. మరొకటి స్వామి నారాయణ మందిరం.


ఆ ఇరు ఆలయాలలోనూ ప్రదక్షిణ చేస్తున్నంతసేపూ స్వంతూరులో ఉన్నటువంటి అద్భుతమైన అనుభూతి కలిగింది. అక్కడి వాళ్లు ఆ ఆలయ నిర్మాణానికి చాలా డాలర్లే ఖర్చుచేసి ఉంటారు. కాని అంతకంటే ముఖ్యం- చాలా శ్రమ పడి ఉంటారు. పట్టుదలతో ఆధ్యాత్మిక భక్తితో ముగించి ఉంటారు.

ఆలయ దర్శనం పూర్తయిన నాల్గవ రోజున మా మనవరాలి పుట్టిన రోజు పండగ జరిగంది. చుట్టు ప్రక్కల వాళ్లు భాషలకూ ప్రాంతాలకూ అతీతంగా పిల్లా పాపలతో వచ్చారు. ఇటువంటి సందర్భాలను అక్కడి భారతీయులు సామాజిక కలయికగా(కమ్యూనిటి గేదరింగ్) జరుపుకుంటారు; సాధ్యమైనంత మేర అట్టహాసంగా, భారతీయత ఉట్టిపడే వస్త్రధారణ గావించుకుని.


నా వరకు నాకు ముచ్చట గొల్పింది ఒకటి చెప్తాను. మా మనవరాలి వయసున్న ఒక అమ్మాయి వచ్చి- ”ఆర్ యూ వన్- ఆర్ యూ టూ- ఆర్ యూ త్రీ“ అంటూ యేడు వద్దకు వచ్చి ఆగిపో యింది. అప్పుడు పిల్లలందరూ ఒకటే చప్పట్లు- సెవెన్- అంటూ-- నాకు చాలా సంతోషం కలిగింది అమ్మాయిల కలివిడితనానికి.


మా మనువరాలి పుట్టిన రోజు పండగ జరుపుకున్న వారం తరవాత మా అబ్బాయీ కోడలూ వచ్చి ఎడిసన్- ప్రాంతంలో జరగబోయే మరొక బర్త్ డే కి బయల్దేరదీసారు. మా ఆవిడ ఉబలాట పడింది గాని- నా వరకు నేను విముఖత చూపించాను. బర్త్ డే పార్టీలకు వెళ్లి సందట్లో సడేమియాలా కేరింతలు కొట్టడానికి ఒక వయసూ ఒక పొందికా ఉండ వద్దూ! పూజా కార్యక్రమాలకు పుణ్య శుభకార్యాలకు వెళ్లడానికి వయసుతో నిమిత్తం లేక పోవచ్చు, మరి- పిల్లల బర్త్ డేలకు మా బోటి పెద్ద వయస్కులు వెళ్ల డం యేమిటి?


కాని కొడుకూ కోడలూ పట్టు సడలించలేదు. మా ఆవిడతో బాటు నన్ను కూడా కారులోకి యెక్కించుకున్నారు.


పరదేశం కాబట్టి పర సాంస్కృతిక వాతావరణం కాబట్టి లోపలి సంగతి యెలా ఉంటుందో గాని- సాధారణంగా ఇక్కడ అంద రూ జమిలిగా ఉంటారు. హాయ్ లు పుష్కలంగా చెప్పుకుంటూ- అమెరికన్ రీతిన ఒకర్నొకరు కౌగలించుకుంటూ మాట్లాడుకుంటారు.


పరస్పరావగాహనతో మనుగడ సాగించడానికి శత విధాలా ప్రయత్నిస్తారు. హాల్లోకి వెళ్ళి కూర్చున్న వెంటనే నాకు మహా ముచ్చటేసింది. గగనంలో విహరిస్తున్నట్లనిపించింది. పాప పుట్టిన రోజు జరుపుకునే ఆ తెలుగు కుటుంబం యెంత సంప్రదాయ సిధ్దంగా ఉన్నారంటే- వాళ్లు దైవ ప్రార్థనలు జరుపుకునే గదిని మామూలు పూజా గది అనలేం. నా వరకు దానిని ఉపాలయం అంటాను. చాలా అరుదైన విషయమే మరి! ఇక విషయానికి వస్తే- భార్య భర్తలిద్దరూ తెలుగు వారే-- కాని ఒక వ్యత్యాసం ఉంది. అమ్మాయి అమెరికాలో పుట్టి అక్కడే పెరిగిన అమ్మాయి. ఆబ్బాయేమో తెలుగు రాష్ట్రం నుండి వెళ్లి చదువు సాగించి అక్కడే స్థిరపడిన అబ్బాయి. ఒకర్నొకరు ఇష్టపడి చేసుకున్న వివాహం.


పాప పుట్టిన రోజు సంరంభం ముగిసిన గంటతరవాత మేం అక్కణ్ణించి కదలడానకి సిధ్దమవుతూన్న తరుణాన హాలు మధ్య నేను కూర్చున్న చోటుకి వచ్చి చెవి దగ్గర వినిపించేలా మా ఆవిడ ఒక విచిత్రమైన కబురొకటి అందించింది. నిజంగా ఇది చిత్రాతి చిత్రమైన కబురే! అదేమంటే—పాప తండ్రి(న్యూజెర్సీలో శాస్త్రవేత్తగా ఉంటున్నాడు)కంటనీరు పెట్టుకుని మాటా మంతీ లే కుండా లోపలి గదిలో కూర్చున్నాడట. కూతురి పుట్టిన రోజునాడు కంటనీరు పెట్టుకోవడం యేమిటి? రేపు కూతురు మెట్టింటికి వెళ్తున్నప్పుడు ఆ మహానుభావుడు ఇంకెంత కన్నీరు పెట్టుకుంటాడో!


అర్థరాత్రి మద్దెల మేళం అన్నట్టు కూతురి పుట్టిన రోజు నాడు ఈ అర్థంకాని తతంగం యేమిటి? అంతమంది మధ్య ఉద్వేగానికి లోనవకూడదని తలపోస్తూ సాధ్యమైనంత మేర గొంతు తగ్గించుకుంటూ తాపీగా అడిగాను- “ఎందుకంట? “


“మిమ్మల్ని తలచుకునే యేడుస్తున్నట్టున్నాడు ఆ అబ్బాయి! “


ఆ మాటతో ఉలిక్కిపడి లేచి నిల్చున్నాను. నన్ను తలచుకుని కన్నీరు కారుస్తున్నాడా! ఇదెక్కడి సోదె? అసలు అంతవరకూ ఆ అబ్బాయి ముక్కూ మొహం చూసి కూడా యెరగను. ఇప్పుడిప్పుడే చేతులు కలిపి పలకరింపుతో సరి-- నాకు బుర్ర తిరుగుతున్నంత పనయింది.


అప్పుడు మా ఆవిడ బదులివ్వక ముందు పాప తల్లి (ఐ టీ ప్రొఫెషనల్) మా వద్దకు వచ్చి ఇబ్బందిగా ముఖం పెట్టి దీనంగా చూస్తూ అంది- “ఔనండీ! మావారు కొంచెం ఎమోషనల్. మిమ్మల్ని తలచుకుని- “


“మళ్లీ అదే మాటా! అసల మీ వారి ముఖం చూడటం ఇదే మొదటి సారి. అలాంటప్పుడు నా నెపం పైన ఆయన కన్నీరు కార్చడం యేమటి?”


“సారీ సార్! మీరు కారణమని యెవరూ అనడం లేదు. మీరు నుదట కుంకుమ బొట్టు పెట్టుకున్నారు కదూ! ”


“ఔను. కుంకుమ బొట్టు పెట్టుకున్నాను. ఇది నాకు చాలాకాలంగా అలవాటు. దానికేమిటంట? ”


“ఒక నిమిషం గాని టైమిస్తే మేటర్ యేంవిటో చెప్తాను సార్. మా మాఁవగారు అచ్చు మీలాగే కుంకుమ బొట్టు పెట్టుకునేవారు. ఒడ్డూ పొడవూ మీలాగే కనిపిస్తారు. ఆయన పోయి మూడేళ్లవుతూంది. తండ్రంటే మా వారికి చాలా అభిమానం. మిమ్మల్ని చూసి మీ బొట్టు చూసి ఆయనకు వాళ్ల దివంగత నాన్నగారు గుర్తుకు వచ్చి-- “


అది విని నేను కళ్లు తేలేసాను. అమెరికన్ భారతీ యులకు కూడా సెంటిమెంట్స్ మెండుగా ఉంటాయన్నమాట! అందులో అతడు సుప్రసిధ్ధ ఆమెరికన్ ప్రభుత్వ సంస్థలో పని చేస్తూన్న సెంటిస్టు కూడాను—


ఇప్పుడు నేనేమి చేయాలో మీరే చెప్పండి-- ఆ యువ అమెరికన్ సైంటిస్టుని యెలా ఓదార్చాలో మీరే చెప్పండి!

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.




48 views0 comments

Comentários


bottom of page