top of page
Writer's pictureMangu Krishna Kumari

బుజ్జి తల్లి



'Bujji Thalli' written by Mangu Krishna Kumari

రచన : మంగు కృష్ణకుమారి


తొమ్మిదేళ్ల బుజ్జి ఆశ్చర్యంగా చూస్తున్నాది.‌ తన చదువుల బడిలోకి నీరు వడి వడిగా వచ్చేస్తున్నాది.‌ చాలా మంది పిల్లలు కేరింతలు కొడుతున్నారు బడికి సెలవని. బుజ్జికి ఎందుకో దిగులుగా అనిపించింది. వెనక్కి తిరిగి ఇంటికి పరుగున వచ్చింది. ‌వాన ఆగకుండా కురుస్తున్నాది. ఇంటికి వస్తూనే "అమ్మా! మా స్కూల్ అంతా నీరే! సెలవట" అంది.‌ తల్లి జానకి గాభరాగా “బుజ్జమ్మా! ఎక్కడికీ వెళ్లకు అంటూనే అన్నా,అక్కా కనపడ్డారే!" అంది.

"లేదమ్మా! నా పుస్తకాలు తడవకుండా పరికిణీలో ఉంచి గబగబా వచ్చేసాను" అంది.

అయిదు నిమిషాల్లో అన్న గోపాలం, అక్క దేవిక వచ్చేసారు. దేవిక కాస్త పెద్దది. కాలేజ్ లో చదువుతోంది.

" అమ్మా! ఇవాళ ఏరు పొంగుతుందో, ఏమో అని అందరూ అనుకుంటున్నారు". అంది.

జానకి భయంగా " మీ‌ నాన్న గానీ కనపడ్డారే" అంది.

లోపల గదిలో మంచం మీద పడుకున్న ఎనభై ఆరేళ్ల అత్తగారు రాముడమ్మ దిగ్గున లేచి "జానకీ ఏమయిందే!" అని ఒక కేక పెట్టింది.

"ఏమీ లేదు, మీరు పడుకుందురూ" విసుగ్గా అరిచింది.

గంటలో ఆ ఇంటి యజమాని రంగారావు గొడుగు మూసి లోపలకి వచ్చాడు.

" పిల్లలందరు ఇంట్లోనే ఉన్నారా". ఆత్రంగా అడిగాడు.

బుజ్జి ఎగురుకుంటూ వచ్చి "నాన్నోయ్, మా బడి..." అంటూ అంతా చెప్పేసింది.

"జానకీ.. కొన్ని దుప్పట్లు, బట్టలు, కొంచెండబ్బు, బియ్యం, పప్పులు లాటివి సర్ది ఉంచు. ప్రళయం వచ్చే సూచనలు ఉన్నాయి" అన్నాడు.

గంట తిరక్కుండానే నీరు ఇంట్లోకి రాడం మొదలైయింది. బుజ్జి నాయనమ్మ ఒళ్లోకి దూరింది. నీరు ఆగితేగా! అంతకంతకీ నీటి మట్టం పెరిగి పోతున్నది.

రంగారావు లేచి,"పదండి. అందరం డాబా మీదకి వెళ్లి పోదాం" అంటూ తల్లిని లేపి చెయ్యిపట్టుకొని మెట్ల దగ్గరకి తీసుకెళ్లేడు. గోపాలం, దేవిక కలిసి ఇంట్లో ఉన్న కొయ్య కుర్చీలు, బల్లలు లాటివి డాబా మీదకు చేరవేసేరు. ఇంట్లో ఉన్న గొడుగులు కూడా తెచ్చేరు.

మీదనుంచి వాన, క్రిందనుంచి పెరుగుతున్న నీరు. దైవ ప్రార్థన చేస్తూ ఓ‌ బల్ల మీద కూచుంది రాముడమ్మ. రోడ్లన్నీ జల ప్రళయంలా ఉన్నాయి. పక్కింటి కుటుంబం అందరూ వాళ్ల డాబా మీదే ఉన్నారు. ఊరు ఏమవుతోందో అని ఆలోచించే మానసిక స్థితి ఎవరికీ లేదు.

జానకి ఆందోళనగా అత్తగారి పక్కా, బుజ్జి పక్కా చూస్తున్నాది. నిజానికి అందరూ ప్రమాదంలో ఉన్నారు. వంటింట్లో ఉన్న ఆవకాయ కుండ, కింది నుంచి నీళ్ల మీద తేలుకుంటూ డాబా మీదికి వచ్చేసింది. చీకటి పడ్డా వాన తగ్గ లేదు. హఠాత్తుగా పక్క డాబా మీద నుంచి వాళ్ల పదహారేళ్ల కూతురు సుమతి ఘొల్లుమని ఏడుస్తూ‌ తల్లిని పట్టుకొని " అమ్మా నాకు ఇప్పుడే.." అంటూ ఏదో చెప్తున్నాది.అనుభవజ్ఞురాలైన జానకి‌కి విషయం బోధపడిపోయింది.

డాబా పిట్ట గోడ‌ దగ్గరగా వచ్చి "‌వదినగారూ!" అంటూ అరిచింది. తనతో మేడమీదకి తెచ్చిన చినుగు పట్టిన తువ్వాలు ఆవిడ‌కి చూపించి ఆమెకి అందేలా విసిరింది.

"మొహమాటం పడే సమయం కాదు. మీరందరూ గుండ్రంగా మొహాలు ఇటు పెట్టుకొని నిలబడండి. సుమతిని మధ్యలోకి వెళ్లమనండి. మీ భారతిని దానికి సాయంగా ఉంచండి." అంటూ కేకలు పెట్టింది.

పక్కింటి రమణమ్మ ఏడుస్తూ, జానకి చెప్పినట్టే చేసింది. పావుగంట‌‌ తరవాత సుమతి మొహంలో కొంత రిలీఫ్!

బుజ్జికి ఏమీ బోధపడక, "అమ్మా! సుమతక్క‌కి ఏమయింది" అంటూ ప్రశ్నలు‌ వేసింది. దేవిక బుజ్జిని చుట్టేసి “ఏం లేదమ్మా! చీకటి కదూ, భయపడింది అంతే!” అంది. ఒకళ్లకి ఒకళ్లు ధైర్యం చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారు. మెట్లకి సగం దాకా వచ్చిన నీరు అక్కడితో‌ ఆగింది. వాన కాస్త తగ్గింది. అప్పటికే రాముడమ్మ గజగజ వణుకుతున్నాది.

"బుజ్జీ బుజ్జమ్మా" అంటూ పిల్లల కోసం తల్లడిల్లి పోతున్నాది. తెల్లారిన తరవాత రెండు గంటల కాలం తరవాత నీరు తీసింది. రంగారావు జాగ్రత్తగా మెట్లు దిగి ఇంట్లోకి వెళ్లి చూసేడు. ఇల్లంతా బురద! మళ్లీ కాళ్లీడ్చుకుంటూ మేడ మీదకి వెళ్లి భార్యనీ, దేవికనీ కిందకు రమ్మని, వాళ్ల సాయంతో కష్టపడి ఒక గది కొంత వరకూ కడిగారు. తరవాత తల్లినీ, బుజ్జిని ఆ గదిలోకి తెచ్చి ఉంచారు. ఇంక తరవాత జరిగిన ప్రహసనాలు సామాన్యమయినవి కావు. త్రాగడానికి నీళ్లు కూడా లేవు. దేవిక తెగించి గోపాలం సాయంతో, తన స్నేహితుల ఇళ్లు ఎలా ఉన్నాయో అని చూసేందుకు వెళ్లింది.

ఊరంతా బురదా, కంపు భయంకరంగా ఉన్నాయి. ఒక్క పట్నాయక్ గారిల్లు కాస్త నయం. వాళ్లమ్మ సుబ్బమ్మ గారు కర్రల పొయ్యి మీద అన్నం వండుతోంది.

వీళ్లని చూడగానే "దేవమ్మా! అన్నం, పులుసు గిన్నెల్లో ఇస్తాను. మీ‌ బుజ్జికీ, నాయనమ్మకీ పెట్టు. మిగిలిన వాళ్లు ఇక్కడకి ఎలాగోలాగ రండి. పులుసూ అన్నమే ఉన్నాయి. తిందురుగాని" అంది.


దేవిక దండం పెట్టడం కూడా మరచిపోయి గిన్నెలు తీసుకొని వడివడిగా ఇంటికి వచ్చింది. మడిగా తప్పితే ఏనాడూ తినని రాముడమ్మ, ఆ మాటే మరచి ఆత్రంగా పులుసన్నం తిన్నాది. తరవాత అందరు పట్నాయక్ గారింటికి వెళ్లి కొంచెం కతికి వచ్చారు.


దేవతలాగ సుబ్బమ్మ గారు చాలా మందికి రెండు రోజుల పాటు అన్నదానం చేసింది.‌ అప్పటికి కొంత ఎండ వచ్చి బావి నీళ్లు తేట పడ్డాయి. వరద వచ్చిన రెండో రోజు ఓ మంత్రిగారు తాపీగా ఒట్టి చేతులు ఊపుకుంటూ వచ్చి ప్రజల ఆగ్రహానికి తన్నులు తిని గన్ మేన్ ల సాయంతో హెలికాఫ్టర్ ఎక్కి వెళ్లిపోయారు. లయన్స్ క్లబ్ వాళ్లు రెడ్ క్రాస్ సొసైటీ వారు, ఆర్ ఎస్ఎస్ వారూ ఎలాగో వచ్చి సహాయపడతారన్న కబుర్లు తెలిసేయి. ఆ తరవాత ఒక రోజంతా ఆకాశంలోంచి పేకెట్ లు పడ్డాయి. ఒక పేకెట్టు లో నాలుగు పూరీలు పంచదార, ఒక నిమ్మకాయ, ఒక బన్, ఒక మంచి నీళ్ల పేకెట్, ఒక కొవ్వొత్తి అగ్గిపెట్టె ఉండేవి.


అవి దొరికిన‌ వాళ్లకి‌ దొరికేయి. లేని వాళ్లకి లేదు. అవి రెడ్ క్రాస్ వాళ్లు పంపేరని ముద్ర ఉండేది.

తనకి దొరికిన పేకెట్టు దేవిక బుజ్జికి ఇచ్చేసింది. పక్కింటి రమణమ్మ ఒక పేకెట్టు కొంగు చాటున ఉంచి తెచ్చి "వదిన గారూ, పిన్నిగారికి ఈ పూరీలు ఇవ్వండి" అంటూ జానకి చేతిలో ఉంచింది. "అయ్యో! మీ పిల్లలకి ఉంచండి" అంటే "ఇంకో రెండు మా వాడికి దొరికేయండీ ఫరవాలేదు, మీ ఋణం తీర్చుకోగలనా" అంది.


ఆ మర్నాటికి సిటీలో ఉద్యోగాలు చేస్తున్న జానకి, రంగారావుల పెద్ద కూతుళ్లు‌ జయలక్ష్మి, కుమారి, తమ్ముడు సుదర్శన రావు ఎలాగో తెప్పలు పట్టుకొని ఊరికి చేరేరు.

అక్కలని చూస్తూనే దేవిక వెక్కి వెక్కి ఏడిచింది. లారీలో ఎవరో ఉప్పు పంచుతూ ఉంటే, ఆమె కొంగులో ఉప్పు పోయించుకొని తెస్తున్నాది.

బుజ్జి మాత్రం హుషారుగా ఉంది. తమ‌ బడి దగ్గర రొట్టెలు పంచుతున్నారని తెచ్చుకొని వచ్చింది.

జయలక్ష్మి , సుదర్శనరావు ఎవ్వరినీ ఆ ఊళ్లో ఉంచడానికి ఒప్పుకోలేదు. రంగారావుని ఒప్పించి, ఇల్లు తాళం పెట్టించి, ముసలామెని వంతుల వారీగా ఎత్తుకొని మోస్తూ పడవలో కూచోబెట్టేరు. పడవ దాటించి, బస్సెక్కించీ అందరినీ సిటీ చేర్చేసరికి, రాముడమ్మ తెలివి తప్పి పడిపోయింది. ఒక నెల రోజులు ఎవ్వరినీ కదలనివ్వకుండా అక్కడే ఉంచేసారు.


నలభయ్యో పడిలో ఉన్న కమలిని (ఆనాటి బుజ్జి)‌ తల్లి పక్కనే కూచొని తాటాకు విసనకర్రతో విసురుతోంది. హుద్ హుద్ తుఫాను తీవ్రంగా ఉంది. ఇల్లంతా నీరే ! తన చిన్నతనం గుర్తొస్తోంది.

‌ఆనాటి రాముడమ్మలా ఈనాడు తన తల్లి. తండ్రి ఇప్పుడు లేడు. తల్లికి బాగాలేదని చూడడానికి వచ్చి, ఈ తుఫాను బారిన పడింది. అప్పటిలా మేడ మీదకి వెళ్లి తడిసే అవసరం లేకపోయినా, కరెంట్ లేదు. నీళ్లు తోడుకోడం, రుబ్బురోలు ఎప్పుడో మర్చిపోయింది. అన్నీ గుర్తు చేసుకుంటూ వారం పాటు తల్లిని కంటికి రెప్పలాగ చూసింది.

జానకి దిగాలుగా "అయ్యో బుజ్జమ్మా! నిష్కారణంగా వచ్చేవే! ఎంత ఇబ్బంది పడుతున్నావో!" అంది.

బుజ్జి ప్రేమగా తల్లిని‌ చుట్టేసింది. "అమ్మా‌! అప్పుడు వరదల్లో నన్ను, మామ్మనీ ఎంత బాగా‌ చూసేవమ్మా! ఒక రోజు నువ్వు ఏమీ తినకుండా నాకు, మామ్మకే పెట్టీ లేదా! అప్పుడు‌ చిన్నదాన్ని, తెలీలేదు. ఇప్పుడు చేయించుకోడం నీ‌ హక్కు” అంది.

బుజ్జి గుండెల్లో జానకి పసిపాపలా ఒదిగిపోయింది.

**********


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


రచయిత్రి పరిచయం :

నా పేరు మంగు కృష్ణకుమారి. విశాఖపట్నం నేవల్ బేస్ లో ఆఫీస్ సూపరింటెండెంట్ గా చేసి రిటైరయ్యాను. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాము. విద్యార్ధి దశలో ప్రారంభించి వదిలేసిన రచనావ్యాసంగాన్ని ఈ మధ్యనే మళ్లీ ప్రారంభించాను. నా రచనలు ప్రచురించి ప్రోత్సహిస్తున్న మన తెలుగు.కామ్ వారికి ధన్యవాదాలు.


26 views0 comments

Comments


bottom of page