కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Burada' New Telugu Story Written By Vasundhara
రచన: వసుంధర
ఒక వ్యక్తి గురించి చెడుగా అనుకుంటున్నామంటే రెండు కారణాలు ఉండవచ్చు.
ఒకటి నిజంగా ఆ వ్యక్తిలో తప్పు ఉండటం
లేదా అతన్ని చూసే మన చూపులో దోషం ఉండటం.
మన దృష్టి దోషానికి ఇతరులని నిందించడం పొరపాటని తెలియజేసే ఈ చక్కటి కథను ప్రముఖ రచయిత్రి వసుంధరగారు రచించారు.
“దున్నపోతు ఈనిందంటే, రాటకి కట్టెయ్యమన్నాట్ట వెనకటికెవడో. అలాగుంది నేటి
తలిదండ్రుల వ్యవహారం” అన్నాడు దీక్షితులు నిరసనగా.
దీక్షితులుది మా పక్కిల్లే. చదువు, ఉద్యోగం, వయసుల్లో నా సరివాడు. అతడికీ నాకూ కూడా
ముందో అమ్మాయి, తర్వాత ఓ అబ్బాయి. అమ్మాయిలు ఇంటర్ ఫైనల్. అబ్బాయిలు
ఇంటర్ ఫస్టియర్. అంతా కాలేజిలో క్లాసుమేట్లు.
నిన్ననే జూనియర్ కాలేజిలో లెక్కల లెక్చరర్ కిషోర్ నుంచి ఫోనొచ్చింది. “మీ అమ్మాయి
ఉష లెక్కల్లో వీక్‍గా ఉంది. ప్రోబ్లం సీరియస్ కాదు కానీ, ఓరియంటేషన్ అవసరం. కాలేజిలో
ఇలాంటివాళ్లకి సాయంత్రాలు స్పెషల్ క్లాసెస్ తీసుకుంటున్నాం. దానికి వేరే ఫీజు కట్టాలి.
సీట్లు లిమిటెడ్. రెండ్రోజుల్లో మీ నిర్ణయం చెప్పాలి”- అదీ ఫోన్!
ఉషని పిలిచి అడిగాను. తనకి స్పెషల్ క్లాసులో చేరాలని లేదని ఠక్కున చెప్పింది.
“ఎందుకని?” అని నేనడిగానో లేదో- నా శ్రీమతి ముందుకొచ్చింది. ఉష అక్కణ్ణించి
వెళ్లిపోయింది.
“ఆడపిల్ల ఏం చెబుతుంది? ఆ కిషోర్ ఆడపిల్లల విషయంలో మంచాడు కాదుట. తన కన్ను
ఉషమీద పడిందిట. స్పెషల్ క్లాసెస్ ఓ వంకట. అందుకే వెళ్లనంటోంది” అంది శ్రీమతి.
తెల్లబోయాను.
కిషోర్ గురించి నాకెక్కువ తెలియదు కానీ దీక్షితులు ద్వారా చాలా విన్నాను. ఎప్పుడైనా
మామధ్య పిల్లల చదువుల ప్రసక్తి వస్తే చాలు- కిషోర్ పేరు ప్రస్తావించకుండా వదలడు.
లెక్కలు, సైన్సు సబ్జక్టుల్లో కిషోర్‍ని మించినవాడు ఆ ఊళ్లోనే లేడుట. అతడివల్లే ఆ కాలేజికి
అంత పేరొచ్చిందిట.
కిషోర్ అర్థబలానికీ అంగబలానికీ లొంగే ఘటం కాదు. ఇక్కడిచ్చేదానికి రెట్టింపిస్తామని వేరే
ఆఫర్లొచ్చినా కాలేజి మారలేదు. మారకపోతే అంతు చూస్తామని బెదిరించినా లొంగలేదు.
కిషోర్ మనసులో మాట నిష్కర్షగా, నిర్మొహమాటంగా చెబుతాడు. క్రమశిక్షణకి
ప్రాధాన్యమిస్తాడు. విలువల విషయంలో సద్దుకుపోడు. అందుకని ఆధునికత బాగా
వంటబట్టిన కొందరు విద్యార్థినీ విద్యార్థుల్లో అతడంటే అసంతృప్తి ఉంది. అతడిపై బురద
చల్లాలని కొన్ని ప్రయత్నాలు కూడా జరిగాయి.
కిషోర్ తప్పు చెయ్యడు. భయపడడు. అందువల్ల ఇంకా దుర్నిరీక్ష్యుడిగానే
కొనసాగుతున్నాడు.
“అలాంటి గురువు దొరకడం మన పిల్లల అదృష్టం. వాళ్ల చదువు గురించి మనకంటే
ఎక్కువగా తనే చూసుకుంటాడు” అన్నాడు దీక్షితులు నాతో చాలాసార్లు.
కిషోర్ నుంచి ఉష గురించి ఫోనొచ్చినప్పుడు నేను దీక్షిత్ మాటల్నే మననం చేసుకుని
పొంగిపోయాను. ఆ పొంగుపై నీళ్లు చల్లింది- ఉష కిషోర్ గురించి శ్రీమతి చేత చెప్పించిన
మాట!
వెంటనే దీక్షితులుకి విషయం చెప్పాను. తను వెంటనే, “దున్నపోతు ఈనిందంటే, రాటకి
కట్టెయ్యమన్నాట్ట వెనకటికెవడో. అలాగుంది నేటి తలిదండ్రుల వ్యవహారం” అన్నాడు
నిరసనగా.
“వాళ్లూ వీళ్లూ చెబితే ఏమో కానీ, స్వయానా నా కూతురు చెప్పిన మాటని
కొట్టిపారెయ్యలేనుకదా!” అన్నాను.
“ఐతే, తనన్నమాటకి ఋజువడుగు. ఋజువు లేదంటే సంపాదించమను. కిషోర్‍కి
బండారమంటూ ఉంటే- అది తనకు తెలిస్తే- నిస్సంకోచంగా బయటపెట్టమను. లేదూ,
స్పెషల్ క్లాసులకి వెళ్లాల్సిందేనని తేల్చేయ్. తన సేఫ్టీకి నాదీ హామీ. నామీదైనా నీకు
నమ్మకమే కదా!” అన్నాడతడు దృఢంగా.
“అతడిమీద నీకంత నమ్మకమేమిటి?” అన్నాను కొంచెం ఆశ్చర్యంగా, కొంచెం అసంతృప్తిగా.
ఆ కాలేజిలో క్లాస్‌రూమ్సులో, ఆఫీసు గదుల్లో సిసిటివి కెమేరాలున్నాయి. అవి పని చెయ్యని
క్షణమంటూ ఉండదు. విద్యార్థినీ విద్యార్థులే ఎంతో జాగ్రత్తగా ఉండక తప్పని పరిస్థితి. ఇక
టీచర్ల విషయం చెప్పాలా?
దీక్షితులు ఆ మాట చెప్పి, “అతడిపై నా నమ్మకానికి కారణం సిసిటివి కెమేరాలు కాదు.
అతడు గురువు కావడమే! గురువుని దేవుడిగా భావించి, గురుభ్యోనమః అనే గొప్ప
సంప్రదాయం మనది. అది మరుగున పడుతోందిప్పుడు. అదే నేడు మన సమాజంలోని
ఎన్నో అనర్థాలకు మూలం” అన్నాడు ఆవేశంగా.
దీక్షితులు తండ్రి హైస్కూల్ టీచరు. ఆదర్శప్రాయుడు. ముక్కుసూటి మనిషి. అలా ఆయన
ఎందరికో శత్రువయ్యాడు. ఎన్నో అభాండాల్ని భరించాల్సొచ్చింది. ఐనా తను
మారాలనుకోలేదు. ఏమాత్రం మారలేదు. అలాగే ఆదర్శ ఉపాధ్యాయుడుగా పురస్కారం
కూడా అందుకున్నాడు. మూడేళ్లక్రితం ఆయన రిటైరైనప్పుడు, ఆ సన్మానసభలో
పాల్గొనేందుకు కొందరు శిష్యులు విదేశాలనుంచి కూడా వచ్చారు.
“కిషోర్‌కింకా నలబై ఏళ్లే అనుకుంటాను. కానీ అతణ్ణి చూస్తే మా నాన్న గుర్తొస్తాడు” అన్నాడు
దీక్షితులు.
“మొత్తం గురువులందరూ మీ నాన్నలాగే ఉంటారనుకోకు. తప్పు చేసినవాళ్లమీద బురద
పడుతుంది. కడుక్కునే ప్రయత్నం చెయ్యకపోతే అది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది.
గురువు కూడా అందుకు మినహాయింపు కాదు” అన్నాను.
దీక్షితులు వెంటనే, “ఈ బురద చల్లడముందే- అదో బలహీనత. ఇప్పుడు సోషల్ మీడియా
ప్రాబల్యం పెరిగేక. ఆ బలహీనత వ్యసనంగా కూడా మారింది. మహానుభావుడు భారవి ఈ
ప్రమాదాన్ని ఆరో శతాబ్దంలోనే పసికట్టి హెచ్చరించాడు” అన్నాడు.
ఆ కథ నాకు తెలుసు. ఒక వర్తకుడు భార్యనీ, ఐదేళ్ల కొడుకునీ వదిలి ద్వీపాంతరం వెళ్లి,
పదకొండేళ్ల తర్వాత తిరిగి వచ్చాడు. అప్పుడాయన తన భార్య పడుకున్న గదిలోనే ఓ
యువకుడు పడుకుని ఉండడం చూశాడు. అతడు తన భార్యకు ప్రియుడన్న అనుమానం
కలిగి ఆవేశంతో ఆమెను చంపెయ్యాలని కూడా అనుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలో,
అనుకోకుండా అతడికి ఓ తాళపత్రంమీదః ‘సహసా విదధీత న క్రియాం, అవివేకః
పరమాపదాం పదం, వృణుతే హి విమ్మశ్యకారిణం, గుణలుబ్దాః స్వయమేవ సంపదాః” అన్న
భారవి శ్లోకం కంటబడింది. దాని భావంః ‘తొందరపాటు, అవివేకం అన్ని ఆపదలకూ
మూలం. ఏ పని చేసినా పూర్వాపరాలు ఆలోచించాలి’- అని! వర్తకుడప్పుడు కాస్త
నిదానించేసరికి- తన భార్య గదిలో నిద్రిస్తున్న యువకుడు తన కుమారుడే
అయుండొచ్చన్న నిజం స్ఫురించింది.
దీక్షితులిప్పుడా కథను ప్రస్తావించి, “నీలో బురద చల్లే బలహీనత ఉందనుకో. చల్లడానికి
సంకోచించకు కానీ కాస్త నిదానించు. లేదూ- ఆ బురదలో నువ్వే కూరుకుపోతావ్. ఇక
గురువంటే మనకి- రాముడు, కృష్ణుడు, శివుడు, ఇంద్రుడు- అలాంటి దేవుడనుకోవాలి. ఆ
దేవుళ్లమీద మాత్రం ఆరోపణలు లేవా? వాళ్లు దేవుళ్లు కాబట్టి, వాటికేవో సంజాయిషీలు
ఇచ్చుకుని, సమర్థిస్తున్నాం. అందుకని గురువు విషయంలో మరికాస్త నిదానించాలి”
అన్నాడు.
బహుశా ఆ మాట దీక్షితులు నాన్నే చెప్పి ఉంటాడు. ఆయనమీద ఎన్నో అభాండాలు
వచ్చాయంటే- నిప్పు లేందే పొగ రాదని కన్నకొడుకే అనుకోవచ్చు. అందుకని కొడుక్కి ఇలా
చెప్పి ముందరి కాళ్లకి బంధమేసి ఉంటాడని అనుకుని, “నువ్వన్న మాట- ఎవడో దారి
తప్పిన గురువు ఆత్మరక్షణకోసం అని ఉంటాడు” అన్నాను, అతడి తండ్రి ప్రసక్తి తేకుండా.
“ఆ మాటన్నది ధర్మయ్య మేస్టారు. నలబైఏళ్ల సర్వీసులో చిన్న మచ్చకూడా పడని
మహానుభావుడు. ఆయన హయాంలోనే మా నాన్నకి ఆదర్శ ఉపాధ్యాయుడు అవార్డు
వచ్చింది” అన్నాడు దీక్షితులు.
ధర్మయ్య మేస్టారి పేరు వింటూనే ఉలిక్కిపడ్డాను. “ధర్మయ్యగారంటే గాంధీ టోపీ
ధర్మయ్యగారేనా?” అడిగాను.
“ఔను. ఆయన నీకూ తెలుసా?” అని, “తెలియకుండా ఎలా ఉంటుందిలే! ఆయన ఏ
స్కూలుకి హెడ్మాస్టరుగా వెడితే ఆ స్కూలు స్వరూపమే మారిపోయేది. ఆయన
గొప్పతనంమీద పత్రికల్లో వ్యాసాలు కూడా వచ్చాయి” అన్నాడు దీక్షితులు.
“దొరికావులే” అనుకున్నాను. ఎందుకంటే- నాకు టీచర్లంటే గౌరవం పోవడానికి కారణమే
ధర్మయ్య మేస్టారు. నేను చెప్పింది వింటే, ఇప్పుడు దీక్షితులు కూడా గురువులపై బురద
చల్లే విషయంలో తన అభిప్రాయాన్ని సవరించుకోవడం ఖాయం.
“ధర్మయ్య మేస్టారు నాకెలా తెలుసో చెబుతాను, విను” అని గొంతు సవరించుకున్నాను.
-----
నాన్న మా ఊళ్లో స్టాంపు పేపర్లు అమ్ముతాడు. దస్తావేజులు రాస్తాడు. సంపాదన ఫరవాలేదు.
నా తమ్ముళ్లు నాకంటే బాగా చిన్నవాళ్లు. నేను ఐదు ప్యాసై ఆరులోకి వచ్చేసరికి,
పెద్దతమ్ముడు ఇంకా ఒకటో తరగతిలో ఉన్నాడు. రెండోవాడికి అక్షరాభ్యాసమే కాలేదు.
మా ఊళ్లో హైస్కూలుంది. కానీ ఏదో ఉంది. అక్కడ చదివేవాళ్లంతా కాలక్షేపానికో, వేరేచోట
చదివే గతిలేకో చేరినవాళ్లే!
అమ్మకి నేనా స్కూల్లో చదవడం ఇష్టంలేక, పట్నంలో అమ్మమ్మ ఇంట్లో ఉంచాలనుకుంది.
అది పుట్టింటి అభిమానం.
నేను పట్నం వెళ్లడం నాన్నకిష్టమే కానీ, అమ్మమ్మింట్లో ఉండడం ఇష్టం లేదు. అది
అల్లుడికుండే సహజ ద్వేషం. అందుకని తన పెదనాన్నగారి అబ్బాయింట్లో ఉండమని బాగా
నొక్కించాడు.
నాన్న పెదనాన్న, అంటే నాకు పెదతాత. వాళ్లు మాతో పోలిస్తే బాగా డబ్బున్నవాళ్లు. వాళ్లకి
మేమంటే బాగా చిన్నచూపు. అందుకని నన్ను వాళ్లింట్లో ఉంచడం అమ్మకి ఏమాత్రం ఇష్టం
లేదు.
ఆ విషయమై అమ్మకీ నాన్నకీ పెద్ద గొడవయింది. ఎటూ తేలక, ఇద్దరూ కలిసి నన్నడిగారు.
అడిగినప్పుడు నాన్న అమ్మమ్మని బాగా చిన్నబుచ్చుతూ మాట్లాడేడు. అమ్మ పెదతాత
ఎంత చెడ్డవాడో చెప్పింది.
నాక్కూడా పెదతాత ఇల్లు నచ్చదు. పైగా అమ్మమ్మంటే బోలెడిష్టం. అందుకని ఇద్దర్నీ
సంతృప్తి పరిచే సమతూకం మాటలు చెప్పకుండా, ఏకపక్షంగా అమ్మనే సమర్థిస్తూ
అమ్మమ్మకి ఓటేశాను.
నాన్నకి కోపం, ఉక్రోషం రెండూ వచ్చాయి. అయిష్టంగానే ఒప్పుకుని, “ఏ సబ్జక్టులోనైనా
మార్కులు ఎనబైకి తగ్గాయో, నిన్ను పెదతాతింటికి మార్చేస్తాను” అని షరతొకటి పెట్టాడు.
అమ్మమ్మ ఇంట్లోనే కొనసాగడంకోసం నేను కష్టపడి చదివేవాణ్ణి. ఏ సబ్జక్టులోనూ నా
మార్కులెప్పుడూ తొంబైకి తగ్గేవి కాదు.
పట్నం మా ఊరికి దగ్గరే. బస్సులో గంట ప్రయాణం. అందుకని తరచుగా మా ఊరొచ్చి
వెళ్లేవాణ్ణి. నా ప్రోగ్రెస్ రిపోర్టుమీద సంతకాలు నాన్నే పెట్టేవాడు.
అమ్మ నా మార్కులు చూసి, “మా అమ్మ ఇల్లు సరస్వతీ నిలయం” అని మురిసిపోయేది. ఆ
మాటనకపోతే ఏమో కానీ, నాన్న నా ప్రోగ్రెస్ రిపోర్టు చూసినప్పుడల్లా మొహం ముడుచుకుని,
“పరీక్షల్లో కాపీగానీ కొడుతున్నావా? మీ అమ్మమ్మింట్లో అలాంటివే నేర్పుతారు. పట్టుబడ్డావో
జీవితం నాశనమౌతుంది” అనేవాడు.
ఒకటి- నా మార్కులు చూసి సంతోషించలేదు. రెండు- నా తెలివిని మెచ్చుకోలేదు. మూడు-
నాకెంతో ఇష్టమైన అమ్మమ్మ గురించి తప్పుగా మాట్లాడాడు. అందుకని నాన్నంటే నాకు
కోపంగా ఉండేది.
ఇంటికొచ్చినప్పుడల్లా ఆయనకీ నాకూ ఏదో విషయమై గొడవలు ఔతుండేవి.
మాది పెద్ద ఇల్లు. ఇంట్లో ఓ వాటా అద్దెకి ఇచ్చేవారు.
అద్దెకొచ్చేవాళ్లలో అధికులు ఎలక్ట్రికల్ సూపర్వయిజర్లో, పంచాయతీబోర్డు గుమస్తాలో!
ఎవరొచ్చినా వాళ్లు ఇంట్లో మనుషుల్లా కలిసిపోయేవారు.
నేను ఎనిమిది పరీక్షలు వ్రాసేక, ధర్మయ్య మేస్టారు మా ఊళ్లో హైస్కూలుకి హెడ్మాస్టరుగా
వచ్చి, మా ఇంట్లో అద్దెకి దిగాడు.
ఆయన లాల్చీ, షరాయి వేసుకుని గాంధీ టోపీ పెట్టుకునేవాడు. అంతా గాంధీ టోపీ మేస్టారు
అనేవారు. నిలువెత్తు మనిషి. ఆయన భార్య కూడా ఆయనంత హుందాగానూ ఉండేది. ఆ
దంపతులకి పిల్లలు లేరు. నన్ను చూసి మహా ముచ్చట పడ్డారు వాళ్లిద్దరూ. వాళ్లతో,
ముఖ్యంగా మేస్టారితో గడపడం నాకు చాలా సరదాగానూ, ఇష్టంగానూ ఉండేది.
మేస్టారు నన్ను నా స్కూలు వివరాలడిగి తెలుసుకునేవాడు. మా స్కూల్లో నాకు నచ్చిన
అంశాలు, నచ్చనివి చెప్పమన్నాడు. అలాగే టీచర్ల గురించీ వాకబు చేశాడు.
“ఇవన్నీ నిన్నెందుకు అడుగుతున్నానంటే- మీ స్కూల్నించీ, నీనుంచీ నేర్చుకున్నవి-
ఇక్కడ మన స్కూల్లో మార్పులు తీసుకు రావడానికి ఉపయోగపడతాయి” అని ఆరంభంలోనే
చెప్పాడాయన.
మేస్టారది యథాలాపంగా అనలేదు. ఆయన తెచ్చిన మార్పులతో ఆరు నెలల్లో ఆ స్కూలు
రూపురేఖలు మారిపోయాయి.
స్కూలు నిర్వహణలో తను తీసుకునే నిర్ణయాలను ముందు స్టాఫ్ రూంలో చర్చకు
పెట్టేవాడు. అందరి అభిప్రాయాలకీ విలువనీ, గుర్తింపునీ ఇచ్చేవాడు. తర్వాత వాటిని క్లాస్
రూంలో విద్యార్థులతో చర్చకు పెట్టేవాడు. వారి అభిప్రాయాలకీ విలువ, గుర్తింపు
లభించడంతో- అందరికీ స్కూలు తమది అన్న అభిప్రాయం ఏర్పడింది.
కవిత్వంతో కాస్త పరిచయమున్న ఓ టీచర్ని ప్రోత్సహించి, స్కూలుకోసం ఒక ప్రత్యేక గీతం
వ్రాయించాడు. దానికి తనే వరస కట్టాడు. పిల్లలా గీతాన్ని ప్రతిరోజూ ప్రార్థన సమయంలో
ఉత్సాహంగా పాడేవారు.
బడిలో ఆటపాటల పోటీలతోపాటు- కథారచన వంటి సృజనాత్మక పోటీలు కూడా జరిగేవి.
అసెంబ్లీ, పార్లమెంటులని అనుకరిస్తూ, వాటి నిర్వహణపట్ల అవగాహన కలిగిస్తూ-
రాజకీయాలకు అతీతమైన ఆదర్శసభలు నిర్వహించేవారు. వాటిలో ప్రధానమంత్రి,
ముఖ్యమంత్రి, ప్రతిపక్షనాయకుల పాత్రల ఎంపికకోసం పోటీలు పెట్టేవారు.
ఆ సభలను ఒకోసారి గ్రామస్థులముందు కూడా ప్రదర్శించేవారు.
మేస్టారి శిష్యుల్లో కొందరు దేశంలోని వివిధ నగరాల్లో ఉన్నతాధికారులు. కొందరు, గ్రామాల్లో
స్థిరపడిన వ్యవసాయదారులు. కొందరు వ్యాపారస్థులు. కొందరు కళాకారులు. అంతా తమ
తమ రంగాల్లో రాణిస్తున్నారు. వారిచేత మేస్టారు అప్పుడప్పుడు బడికి ఆహ్వానించి
ఉపన్యాసాలిప్పించేవాడు. చదువుంటే జీవితంలో ఎన్ని రకాలుగా ఎదగొచ్చో పిల్లలకు
తెలిసేది. ధనసంపాదనకంటే- ఆదర్శప్రాయమైన జీవితమే ప్రధానమన్న సందేశమూ
అందేది.
అంతే కాదు- ఆయన ఇతర స్కూళ్లలోనూ చదివే సాటి విద్యార్థుల్ని రప్పించి, ఇంటరాక్టివ్
సమావేశాలు నిర్వహించేవాడు.
అన్నింటికీ మించిన ఆయన ముఖ్యప్రబోధం- చదువు విద్యార్థులకి భారంగా
పరిణమించకూడదని! ‘రోజులో కొంత సమయాన్ని మాత్రమే చదువుకి కేటాయించాలి. ఆ
కాస్త సమయాన్నీ శ్రద్ధగా వినియోగించుకోవాలి’ అనేవాడాయన.
ధర్మయ్య మేస్టారొచ్చేక పిల్లలు బడికి ఉత్సాహంగా వెడుతున్నారు. వారికి చదువుమీద ఆసక్తి
పెరిగింది. టీచర్సు ఉత్సాహంగా పాఠాలు చెబుతున్నారు. ఆ ఏడాది టెన్తు క్లాసులో ఆ
స్కూలు అంతవరకూ ఎన్నడూ ఎరుగని సత్ఫలితాలు సాధించింది.
మేస్టారికి నేనంటే చాలా ఇష్టం. ఒకసారి నన్ను మా ఊరిబడికి పిలిచి నా గురించి గొప్పగా
చెప్పాడు. పిల్లలు నన్ను ఆరాధనా పూర్వకంగా చూస్తుంటే- నాకు గర్వంగా అనిపించింది.
ఐతే మేస్టారు నన్ను మందలించిన సందర్భాలూ ఉన్నాయి. ముఖ్యంగా నేనూ, మా నాన్నతో
గొడవపడ్డం గురించి!
నాన్న నన్ను పెద్ద గొంతుతో తిట్టేవాడు. పక్క వాటాలోనే ఉన్న ఆయనకు వినపడకుండా
ఉండదు కదా!
బహుశా నా ఎదురు సమాధానాలూ అదే స్థాయిలో ఉండేవనుకుంటాను.
“తల్లి, తండ్రి, గురువు దైవసమానులు. వాళ్లని ఎదిరించి మాట్లాడ్డం తప్పు” అన్నాడాయన
ఓసారి నాతో.
తల్లి, గురువు విషయంలో నేనూ ఒప్పుకున్నాను. కానీ తండ్రి విషయంలో ఎలా
ఒప్పుకుంటాను? అందుకని నేనాయనకి మా గృహ రాజకీయాల్ని ఆయనకి వివరించడానికి
సంకోచించలేదు. దానికి తోడు- నన్ను నేను సమర్థించుకోవాలన్న తాపత్రయమే తప్ప
ఇంటిగుట్టు దాచాలన్న లౌక్యం ఇంకా తెలియని వయసు!
మేస్టారు నవ్వి, “సైన్యంలో పని చేసేవాళ్లు- పై అధికారి ఏంచెప్పినా అక్షరాలా పాటించాలనీ,
ఎదురు చెప్పరాదనీ నియమం. అప్పుడే యుద్ధంలో విజయం సుకరమౌతుంది. జీవితమొక
యుద్ధం. నువ్వో సైనికుడివి. మీ నాన్న నీ పై అధికారి. ఆయన ఏమన్నాసరే, బదులు
చెప్పకుండా మౌనంగా భరించు. అదే నీ విజయ రహస్యమౌతుంది” అన్నాడు.
నాకా సలహా నచ్చలేదు. కానీ నాన్నని ఎదిరిస్తే ఆయన నొచ్చుకుంటాడనిపించింది.
అందుకని ఇంటికొచ్చినప్పుడు నాన్నకి ఎదురు పడకుండా తప్పించుకునేవాణ్ణి. ప్రోగ్రెస్
రిపోర్టుకూడా అమ్మకే ఇచ్చేవాణ్ణి.
“మా అమ్మమీద కోపంతో మీరు వాణ్ణి దూరం చేసుకుంటున్నారు” అని అమ్మ ఓసారి నాన్నని
మందలించడం విన్నాను.
“కన్నకొడుకుని నేనెందుకు దూరం చేసుకుంటాను? మీ అమ్మే వాడికేవేవో నూరిపోసి వాణ్ణి
నాకు దూరం చేస్తోంది” అని నాన్న బదులివ్వడమూ విన్నాను.
అమ్మమ్మ నాన్న గురించి ఎంతో మంచిగా చెబుతుంది. ఆ మాట నాన్నకి చెబితే నమ్మడు.
“ఇక ఈయన మారడు. అన్నింటికీ అమ్మమ్మదే తప్పంటాడు” అనుకున్నాను.
అలా మా ఇద్దరిమధ్యా కోల్డ్ వార్ నడుస్తోంది.
నాకూ నాన్నకూ ఉన్న అనుబంధం పూర్తిగా తెగిపోయే సంఘటన ఒకటి టెన్త్ సెలవుల్లో
ఇంటికొచ్చినప్పుడు జరిగింది.
ఇంటర్లో సీటు గురించి నాకు బెంగలేదు. ధర్మయ్య మేస్టారి శిష్యుడొకడు పట్నంలో కాలేజిలో
లెక్చరరుట.
అడ్మిషనుకి తను సాయ పడతాడని చెప్పాడు మేస్టారు.
అంతవరకూ పొట్టినిక్కర్లు వేస్తున్నాను. కాలేజి కుర్రాడు పొడుగు లాగుల్లోకి మారాలని, నాకు
కొత్త బట్టలు కుట్టించమని అమ్మ నాన్నని వారం రోజులుగా అడుగుతోంది. రేపు, ఎల్లుండి
అంటూ ఆయన వాయిదా వేస్తున్నాడు.
ఆ రోజు ఉదయం, “అడిగితే ఇచ్చేలా లేరు. ఇలాగైతే, నేనే చెప్పకుండా డెస్కు పెట్టిలోంచి
డబ్బు తీసుకుని, బాబుకి బట్టలు కుట్టిస్తాను” అంది అమ్మ కొంచెం కోపంగా, కొంచెం చిరాగ్గా.
మా ఇంట్లో పూర్వీకులది చిన్న టేకు పెట్టె ఉంది. చూడముచ్చటైన ఆ పెట్టెని చేత్తో
ఎక్కడికైనా మోసుకెళ్లొచ్చు. నాన్న దాన్ని ముందేసుకుని వీధరుగుమీద కూర్చుని, దానిమీద
కాగితాలు పెట్టి దస్తావేజులు రాసేవాడు. అందుకే అది డెస్కుపెట్టి అయింది. ఉత్తప్పుడు
దాన్ని వేరే గదిలో ఉంచేవాడు నాన్న. దాని తాళం, పెట్టె మూతకే అమర్చి ఉంటుంది.
తాళంచెవి లేకపోతే పెట్టె బద్దలు కొట్టాలి తప్పితే, మరో దారి లేదు. తాళం చెవి ఉన్నా మూత
తెరవడం అంత సులభం కాదు. దానికో ఒడుపుంది. అది నాన్నకి మాత్రమే తెలుసు. నాన్న
నేర్పడానికి ప్రయత్నించినా ఆ ఒడుపు అమ్మకి రాలేదు. రెండేళ్లనుంచి నాకది పట్టుబడితే,
నాన్న నన్ను మెచ్చుకున్నాడు కూడా.
నాన్న డబ్బు అందులో ఉంచుతాడు. నాన్న వేరే ఊరెడితే తప్ప, సాధారణంగా తాళం చెవి
ఆయన దగ్గరే ఉంటుంది.
ఆ మధ్యాహ్నం నాన్న డెస్కు పెట్టె తెరిచి చూస్తే, అందులో వెయ్యి రూపాయలు
తక్కువయ్యాయిట. వెంటనే అమ్మని పిలిచి అడిగాడు.
అమ్మ వెంటనే, “నన్నడిగితే నేనేం చెబుతాను? ఎవరికైనా ఇచ్చి మర్చిపోయారేమో” అంది.
“కొడుక్కి బట్టలు కుట్టించడానికి నేనివ్వకపోతే నువ్వే తీసుకుంటునన్నావుగా, అందుకని
అడిగాను” అన్నాడు నాన్న.
“బాగుంది, ఇన్నేళ్లు మీతో కాపురం చేసినందుకు, దొంగతనం అంటగట్టడం ఒక్కటే
తక్కువయింది. ఆ వాలాయితీ కూడా తీర్చేశారు” అని, “ఐనా ఆ తాళం తియ్యడం నావల్ల
కాదని మీకూ తెలుసుగా” అంది అమ్మ.
“నీ కొడుక్కి తెలుసుగా” అన్నాడు నాన్న.
ఉలిక్కిపడ్డాను. ఇంటా బయటా ఇంతా అంతా కాని బుద్ధిమంతుణ్ణని పేరు తెచ్చుకున్నవాణ్ణి.
నాన్న మాటలో నేను దొంగనన్న భావం ధ్వనించి ఉలిక్కిపడ్డాను.
అమ్మ చలించలేదు. “తెలిస్తే మాత్రం మీ కొడుకు దొంగతనం చేస్తాడా?” అంది ‘మీ’ అన్న
పదాన్ని ఒత్తి పలుకుతూ.
“వాడిదలాంటి బుద్ధికాదని నాకూ తెలుసు. కానీ ఉందిగా ఆ మహాతల్లి, మీ అమ్మ! వాళ్లింట్లో
ఉండొస్తే సాక్షాత్తూ శ్రీరాముడి కైనా దొంగతనమేమిటి- ఎలాంటి అవలక్షణమైనా
అలవడొచ్చు” అన్నాడు నాన్న.
వాళ్లిద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. చివరికి నాన్న, “తుక్కు మనుషులు, తుక్కు జాతి.
మీతో మాట్లాడ్డం వృథా. నా వెయ్యి రూపాయలూ తిరిగొచ్చేదాకా, నేను నీతోకానీ, నీ
కొడుకుతోకానీ మాట్లాడను” అని విసురుగా వీధిలోకెళ్లిపోయాడు.
నాన్న నన్ను దొంగ అన్నందుకు ముందు నాకు దుఃఖమొచ్చింది. తర్వాత కోపమొచ్చింది.
నాన్నని దెబ్బలాడాలనుకున్నాను. కానీ నాకా అవకాశమేదీ?
ఆ క్షణంనుంచీ నాన్న అమ్మతోటీ, నాతోటీ మాట్లాడ్డం మానేశాడు. మమ్మల్ని చూస్తే చాలు
మొహం తిప్పేసుకుంటున్నాడు.
తిట్టినా కొట్టినా బాగుండేది. అమ్మకెలాగుందో కానీ ఆ మౌనం నాకు దుర్భరమయింది.
ఇల్లు నిశ్శబ్దమైపోయింది. నాన్న తనకేం కావాల్సినా తమ్ముళ్లిద్దర్నీ అడుగుతున్నాడు.
అప్పుడు ఆయనకేం కావాలో అమ్మకి తెలిసేది. తనని అడగలేదుగా, తనకేమని ఊరుకోక,
అడిగినవి ఆయనకి సమకూర్చేది.
లేచేక పళ్లు తోముకోవడంనుంచి, రాత్రి భోజనాలదాకా అన్నీ ఠంచనుగా అమిరిపోతుంటే
నాన్నకి ఏ లోటూ రావడం లేదు. కానీ తను మాట్లాడకపోవడం అనే శిక్ష అమ్మనీ, నన్నూ
మానసికంగా రగిల్చేస్తోంది.
ఇంట్లో భయంకర నిశ్శబ్దం.
నా బాధని ఎవరితో పంచుకోవాలో తెలియక ధర్మయ్య మేస్టారికి చెప్పుకుందామనుకున్నాను.
కానీ ఆ రోజు ఉదయమే ఆ దంపతులిద్దరూ ఊరికెళ్లారని తెలిసింది. వెళ్లే ముందు
మాటమాత్రమైనా మాతో అనలేదు.
రెండ్రోజుల తర్వాత మేస్టారు, భార్య ఊర్నించి వచ్చారు. అమ్మ అదోలా ఉండడం
గమనించిన మేస్టారి భార్య అమ్మని పలకరించి విషయం తెలుసుకునే ప్రయత్నం చేసింది.
కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందంటారు. అమ్మ ఏమని చెబుతుంది? మాట
దాటేసింది.
భార్య ఏంచెప్పిందో కానీ, ఆతర్వాత కాసేపటికి ధర్మయ్య మేస్టారు నన్ను పలకరించి
విషయమేమిటని అడిగాడు.
నాకు దుఃఖం ఆగలేదు. భోరుమని ఏడ్చేశాను. కాస్త తేరుకున్నాక జరిగింది చెప్పి నాన్నని
కసితీరా తిట్టాను.
ఆయన నన్ను వారించి, “మనలాంటి మధ్యతరగతివాళ్లకి వెయ్యి రూపాయలంటే మాటలు
కాదు. అంత డబ్బు పోయిందన్న బాధలో మీ నాన్నకి వివేకం నశించి అలా అన్నాడు కానీ
నీమీదా, మీ అమ్మమీదా అనుమానం ఉండదు” అన్నాడు.
“అనుమానించడానికి అసలు డబ్బంటూ పోతే కదా! నన్ను అవమానించడానికి- జరుగని
దొంగతనాన్ని సృష్టించాడని నా అనుమానం” అన్నాను.
మేస్టారు ఓ క్షణం ఆలోచించి, “నువ్వూహించినదాంట్లో కొంత నిజముంది. నిజానికా డబ్బు
పోయుండదు. మీ నాన్న ఎవరికో ఇచ్చి మర్చిపోయుంటాడు” అన్నాడు.
“ఏ రాయైతేనేం పళ్లూడగొట్టుకుందుకు? మొత్తానికి ఆయన నన్ను దొంగని చేశాడు. చేసి
ఊరుకున్నాడా- నాతో మాట్లాడ్డం మానేశాడు. ఈ అవమానం భరించలేకపోతున్నాను”
అన్నాను.
“రాముడంతటివాడు సీతాదేవిని అనుమానించి అడవులకు పంపేశాడు. ఇప్పుడు జరిగింది
అంతకంటే ఎక్కువ కాదు. నేడో రేపో అసలు విషయం మీ నాన్నకి గుర్తుకొస్తుంది. నేనీరోజు
చెబుతున్నాను, చూడు. ఇవేళో రేపో ఆయన మీ దగ్గరికొచ్చి అనవసరంగా
అనుమానించినందుకు సారీ చెబుతాడు. కానీ ఈలోగా నువ్వాయనమీద కక్ష
పెంచుకోకూడదు. ఆయన మనఃస్థితిని అర్థం చేసుకుని సహనంతో ఉండాలి” అని హితబోధ
చేశాడు.
నాకా సలహా నచ్చలేదు కానీ, పాటించక తప్పని అసహాయత నాది. కానీ ఆ మధ్యాహ్నమే నా
సహనం పూర్తిగా చచ్చిపోయే సంఘటన జరిగింది.
పేపరు వాడు పేపరుతో పాటు చందమామ పత్రిక ఇచ్చి వెళ్లాడు. నాన్న పేపరు చూస్తుంటే,
నా పెద్ద తమ్ముడా పత్రిక తీసుకుని కాసేపు బొమ్మలు చూసి పక్కన పెట్టాడు. అప్పుడు నేనా
పత్రిక తీసుకున్నాను.
అది నాన్న చూశాడు. ఒక్క అంగలో నావద్దకు వచ్చాడు. విసురుగా నా చేతిలోని పత్రిక
లాక్కుని పర్రున చించాడు.
ఊహించని సంఘటన అది. తమ్ముడు చూసినప్పుడు ఏమీ అనలేదు. నేనిలా ముట్టుకోగానే
ఆ పుస్తకాన్ని అలా విసురుగా లాక్కోవడమే కాదు- పర్రున చింపేశాడు.
అప్పుడాయన మనసులో నాకున్న స్థానమేమిటో స్పష్టమైంది. నా ఆత్మాభిమానానికి పెద్ద
దెబ్బే తగిలింది.
తిట్టినా కొట్టినా అప్పటి నా స్పందన ఎలాగుండేదో ఏమో! ఆ క్షణంలో నాలో ఆవేశం కట్టలు
తెంచుకుంది. ఒక్కసారి నాన్నవైపు కసిగా చూసి వీధిగుమ్మంలోంచీ బయటికి పరుగెత్తాను.
శరవేగంతో నడుచుకుంటూ ఊరి కాలవగట్టు ఎక్కాను. ఆ రోడ్డుమీద సుమారు కిలోమీటరు
దూరం నడిచేక గట్టుమీంచి కాలవలోకి దిగాను.
వేసవికాలం కావడంతో కాలవ కట్టేశారు. అంతా ఇసుక.
ఆ ఇసుక మధ్యలో కూర్చుని కాసేపు వెక్కివెక్కి ఏడ్చాను. తర్వాత ఇసుకమీదకు వాలి
చేతులు తలకిందకు చేర్చి ఆకాశంలోకి చూస్తూ కళ్లు మూసుకున్నాను.
అప్పుడు ఆవేశంలో వెంటనే కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాను.
ఇక ఇంటికి వెళ్లను. చస్తే చస్తాను కానీ ఆ ఇంటి మొహం చూడను. ఎవరికీ తెలియని చోటకి
వెళ్లిపోతాను. అవసరమైతే- హొటల్లో కప్పులు కడిగే పని చేసైనా పొట్ట పోషించుకుంటాను.
ఒకవేళ మావాళ్లు నన్ను వెదికి పట్టుకుని బలవంతాన ఇంటికి తీసుకెడితే కనుక ఈ జన్మకు
నాన్నతో మాత్రం మాట్లాడను.
ఇవీ నా నిర్ణయాలు. ఇవి తీసుకున్నాక మనసు కాస్త శాంతించింది. చిన్న కునుకు పట్టింది.
అలా ఎంతసేపుడుకున్నానో తెలియదు. ఎవరో కుదుపుతున్నట్లై కళ్లు తెరిచి చూశాను.
ఎదురుగా ధర్మయ్య మేస్టారు.
“నువ్వు ఇక్కడున్నావా? ఎక్కడికెళ్లావో తెలియక నీ గురించి మీ నాన్న తెగ కంగారు
పడిపోతున్నాడు. మీ అమ్మయితే భోరున ఏడుస్తోంది. పద. ఇంటికెడదాం” అన్నాడాయన.
కాసేపటి క్రితం ఐతే ఏమో కానీ, నిద్ర పోవడంవల్ల- నాలో ఆవేశం తగ్గి, వివేకం పని చెయ్యడం
మొదలెట్టింది.
ఇల్లొదిలి ఏంచేస్తాను? ఇప్పుడు కాకపోతే కాసేపటికి- ఈ రోజు కాకపోతే రేపు ఎలాగూ
ఇంటికెళ్లాలి. నా అంతట నేను కాకుండా ధర్మయ్య మేస్టారి బలవంతమీద వెనక్కెడితే
నాకూ కాస్త పరువుగా ఉంటుంది. అదీకాక మేస్టారి మాటల్ని బట్టి- ఇప్పటికే జరిగిందానికి
నాన్న పశ్చాత్తాపపడుతున్నాడు.
అన్నింటికంటే ఎక్కువగా అమ్మ నాకోసం ఏడుస్తోందంటే తట్టుకోలేకపోయాను. ఇల్లొదిలి
కొన్ని గంటలే ఐనా, అమ్మని చూసి ఎన్నో రోజులైనట్లుంది. వెళ్లి తనని చూడాలి.
మేస్టారితో కలిసి ఇంటికెళ్లాను.
అప్పటికి ఇల్లంతా హడావుడిగా ఉంది. ఇరుగుపొరుగులు చాలామంది ఇంట్లో ఉన్నారు.
నన్ను చూడగానే నాన్న మొహం ఇంతయింది. అమ్మ పరుగున వచ్చి నన్ను గట్టిగా
హత్తుకుంది.
“మంచి కుర్రాడు. బుద్ధిమంతుడు. ఊళ్లో పిల్లలకి ఆదర్శంగా చెబుతుంటాం. పాపం,
తనమీద నింద పడితే తట్టుకోలేక పోయినట్లున్నాడు” అని ఇరుగుపొరుగులు నా
గుణగణాల్ని ఆకాశానికెత్తేస్తున్నారు.
ఊళ్లో నాకంత మంచిపేరుందని నాకు తెలియదు. దుంఖం మళ్లీ పొంగుకొచ్చి భోరున
ఏడ్చాను.
అంతా వెళ్లి, హడావుడి సద్దు మణిగేక- నాన్న నా దగ్గరకొచ్చి, “అనవసరంగా నిన్ను చాలా
బాధ పెట్టాన్రా! డబ్బు పోయిందన్న బాధలో వివేకం కోల్పోయి ఏదో అనేశాను కానీ, నా
ప్రాణానికి ప్రాణానివి, నిన్ను అనుమానిస్తానా?” అంటూ సారీ చెప్పాడు.
ఆయన నన్ను తిట్టినప్పటి కోపం కంటే ఈ సారీ ఇచ్చిన సంతోషం ఎన్నో రెట్లు గొప్పది.
“అంతా ఆ ధర్మయ్య వల్ల వచ్చింది. అర్జంటుగా ఊరికెళ్లాల్సొచ్చిందిట. డబ్బవసరమై
అప్పడగడానికి మనింటికొచ్చేట్ట. అక్కడ డెస్కు పెట్టి తెరిచుంటే, అందులో కనబడ్డ వెయ్యి
రూపాయలు తీసుకుని అవసరం తీర్చుకుని ఊరికెళ్లి వచ్చాడు. రాగానే చెప్పొచ్చుగా, ఆ
డబ్బు గురించి ఇంత గొడవౌతుంటే గప్‌చిప్‌గా ఊరుకున్నాడు. విషయం నువ్వు ఇల్లొదిలి
పారిపోయేదాకా వచ్చేసరికి, ఏమనుకున్నాడో- జరిగింది చెప్పేసి ఈ నిజం ఎవరికీ చెప్పొద్దని
కాళ్లావేళ్లా పడ్డాడు” అన్నాడు నాన్న.
జరిగింది ఆకళింపుకి వచ్చేసరికి నాకు ధర్మయ్య మేస్టారిమీద పట్టరాని కోపం వచ్చింది.
గాంధీ టోపీ పెట్టుకుని, నీతులు వల్లిస్తూ, నలుగురిలో ఆదర్శవాదిగా చెలామణీ ఔతున్న
ఆయనలో ఎంత కపటం?
ఆయన్ని నమ్మి నా మానసిక వ్యధని చెప్పుకున్నప్పుడు కూడా నిజం చెప్పలేదే! ఆయన
గురించి ఏమనుకోవాలి?
“మేస్టార్నోసారి కలుసుకుని కడిగెయ్యాలనుంది” అని ఆ రాత్రి అమ్మకి చెప్పాను.
అమ్మ వెంటనే, “నీకెందుకురా ఈ పెద్దాళ్ల గొడవలు! ఎవరి పాపాన వాళ్లే పోతారని ఊరుకో.
పైగా మేస్టారలా చెయ్యడంవల్ల మనకి మేలే జరిగింది. నాన్నలో మంచి మార్పొచ్చింది.
ఆయనిక నిన్నే కాదు, అమ్మమ్మని కూడా ఏమనరు?” అంది.
అని ఊరుకోలేదు. ఆయన దగ్గర ఈ ప్రసక్తి తేకుండా తనమీద ఒట్టేయించుకుంది.
ఆ రోజునుంచీ నాన్న నాకు మంచి మిత్రుడైపోయాడు. అది నాకు ఎంతో బాగుంది.
అమ్మపై వేసిన ఒట్టుకి కట్టుబడ్డాను కానీ మేస్టార్ని చూస్తే చాలు నాలో కసి పొంగేది. ఆయన
నవ్వుతూ పలకరిస్తే వళ్లు మండిపోయేది. చేసిన తప్పుకి ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా
నాతో ఎప్పటిలా ఉండాలని చూసే ఆయనపై కలిగే అసహ్యాన్ని ప్రకటించకుండా
నిగ్రహించుకుందుకు ఎంతో కష్టపడేవాణ్ణి.
ఆతర్వాత ధర్మయ్య మేస్టారు బదిలీమీద వెడుతుంటే, గ్రామస్థులాయనకు ఘనసన్మానం
చేశారు. అది తెలిసి, వీలున్నా కూడా పట్నంలోనే ఉండిపోయాను తప్ప, ఆ సభలో
పాల్గొనడానికి వెళ్లలేదు నేను…..
-----
ఈ కథ విన్న దీక్షితులు ఆశ్చర్యపడ్డట్లు కనిపించాడు. తర్వాత నెమ్మదిగా, “నువ్వు
చెప్పిందాన్నిబట్టి- నీ విషయంలో ధర్మయ్య మేస్టారి దొంగబుద్ధి గురించి మీ అమ్మానాన్నలకి
తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మా నాన్నమీద వచ్చిన ఆరోపణలు అంతకంటే
ఎక్కువమందికే తెలిసేటంత ప్రాచుర్యం పొందాయి. కానీ ధర్మయ్య మేస్టారు- వాటిని
అపవాదులుగా స్వీకరించి నిరూపించ గలిగారు. నువ్వు కూడా నేరుగా ఆయన్నే నిలదీసి
ఉంటే, జరిగిందానికి ఆయన సంజాయిషీ ఏమిటో తెలిసేది!” అన్నాడు.
“నిలదీసేవాణ్ణే- కానీ అమ్మ ఒట్టేసింది” అన్నాను సంజాయిషీగా.
“కన్నకొడుకుని దొంగగా అనుమానించడానికి వెనకాడని మీ నాన్న, ఆ అనర్థానికి కారణమైన
మేస్టారి దొంగతనాన్ని బయటపెట్టలేదు. కన్నకొడుకుని ఇల్లొదిలి పారిపోయేలా చేసిన
మనిషిని నిలదీయొద్దని మీ అమ్మ ఒట్టేసింది. అంటే అర్థమేమిటి? ఆయనపై బురద
చల్లడానికి వాళ్లు వెనుకాడారనే కదా! అంటే వాళ్లకి ఆయనంటే గౌరవం ఉన్నట్లే కదా!
దొంగబుద్ధి చూపించిన ఆయనమీద వాళ్లకి గౌరవమెందుకని ఎప్పుడైనా ఆలోచించేవా?”
అన్నాడు దీక్షితులు.
ఈ కోణంలో నేనెప్పుడూ ఆలోచించలేదు.
అమ్మ, నాన్న స్వగ్రామంలోనే ఉంటున్నారు. ఆ సాయంత్రమే అమ్మకి ఫోన్ చేసి ధర్మయ్య
మేస్టారి కథ గుర్తు చేసి, తనలా ఒట్టెయ్యమన్నందుకు సంజాయిషీ అడిగితే, అమ్మ నవ్వి,
“ఒట్టెయ్యక ఏంచెయ్యను? అప్పటి పరిస్థితి అలాంటిది?” అంది.
ఆ రోజు నేను ఇంట్లోంచి పారిపోయేక మేస్టారు నాన్నని కలుసుకుని, “మీ అబ్బాయిలాంటి
వాళ్లు లక్షల్లో ఒకరుంటారు. అది మీ అదృష్టం. అలాంటివాడి మనసులో తండ్రిమీద ద్వేషం
పుట్టేలా ఉంటోంది మీ తీరు. ఇక పోయిన డబ్బు విషయానికొస్తే, మీరది ఎవరికో ఇచ్చి
మర్చిపోయుండొచ్చు. లేదా పెట్టెలో కాకుండా వేరెక్కడో పెట్టిఉండొచ్చు. ఆ నిజం
బయటపడ్డాక, మీరెన్ని సార్లు సారీ చెప్పినా నూనూగు మీసాల లేత వయసులో ఉన్న
మీవాడికి మీమీద ఇప్పుడు కలిగిన ద్వేషం ఎప్పటికీ పోదు. కాబట్టి నా మాట విని, వెంటనే ఆ
నేరాన్ని వేరెవరిమీదో తోసేయండి. మీవాడికి సారీ చెప్పి తన మనసు గెల్చుకోండి. ఆ
వయసు పిల్లలతో తండ్రి కూడా స్నేహితుడిలాగే మసలాలని ఇకమీదట అనుక్షణం
గుర్తుంచుకోండి” అని చెప్పేట్ట.
అప్పుడు నాన్నకి గుర్తొచ్చింది. అమ్మ డబ్బు తనే తీసుకుంటాననగానే, ఆమెకా
అవకాశమివ్వకూడదని ఆయన బీరువాలో బట్టల అడుగున దాచేట్ట ఆ డబ్బుని. ఆ పని
క్షణికావేశంలో చేశాడేమో, ఆయన బుర్రలో నమోదు కాలేదు. దాంతో ఇంత అనర్థం
జరిగింది. ఇప్పుడు మేస్టారు చెప్పింది వినగానే ఆ విషయం గుర్తుకి రావడమే కాదు, నేను
తనని శాశ్వతంగా ద్వేషిస్తాననే భయం కూడా కలిగింది. ఆయన సలహానే పాటించి, ఆ
నేరాన్ని ఆయనమీదే తోసేశాడు.
నిజం తెలిస్తే నేను నాన్నని శాశ్వతంగా ద్వేషిస్తానన్న భయంతో అమ్మ నాచేత అప్పుడలా
ఓటేయించుకుంది. ఇప్పుడా భయం లేదన్న ధైర్యంతో ఈ నిజాన్ని బయటపెట్టింది- అదీ
నేను నిలదియ్యడంవల్ల!
నాకిది పెద్ద షాక్.
చేతులెత్తి మ్రొక్కాల్సిన ఓ మహానుభావుణ్ణి, దశాబ్దాలుగా ద్వేషిస్తూ మనసుని బురదతో
నింపుకున్నాను. ఈ కథలో ఒక పాత్రనైన నేను ఇప్పటిదాకా తెలుసుకోలేని నిజమిది!
నిజం నేననుకున్నది కాక వేరే ఉండొచ్చునని- కథను విన్న మరుక్షణమే
అనుమానించగలిగాడు దీక్షితులు. స్పెషల్ క్లాసు విషయంలో లెక్చరర్ కిషోర్‌ని కాక,
ముందు మా అమ్మాయి ఉషని నిలదీయాలన్న అతడి సూచన నాకిప్పుడు శిరోధార్యం.
‘నీలో బురద చల్లే బలహీనత ఉందనుకో. చల్లడానికి సంకోచించకు కానీ కాస్త నిదానించు.
లేదూ- ఆ బురదలో నువ్వే కూరుకుపోతావ్’ అన్న విషయాన్ని ఎప్పుడో గుర్తించడంవల్ల
దీక్షితులనెప్పుడూ బురద అంటలేదు. ఇప్పుడే గుర్తించడంవల్ల నేను ఇప్పటికైనా
బురదనుంచి విముక్తుణ్ణి అయ్యాను. కానీ నాలాంటి ఎందరున్నారో ఇంకా?
సమాధానానికి తడుముకో నక్కర్లేదు. మనముంటున్న సమాజమే బురదతో
నిండిఉన్నదిప్పుడు. కారణం వెతుక్కోనక్కర్లేదు. టివిలో ఏ న్యూస్ ఛానెల్ చూసినా
అర్థమౌతుంది!
---౦---
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
వసుంధర పరిచయం మేము- డాక్టర్ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.
Comments