ధర్మ సందేహాలు 2 - 'Buradananda Swamy Katha' New Telugu Story Written By Mallavarapu Seetharam Kumar
రచన : మల్లవరపు సీతారాం కుమార్
ధర్మ సందేహాలు 2: బురదానంద స్వామి కథ
(రోజూ దేవుడిని పూజిస్తున్నా మనశ్శాంతి లేదెందుకని?)
ఎప్పటిలాగే ఆ రోజు సాయంత్రం కూడా టీచర్స్ కాలనీ వాళ్ళు రామాలయం దగ్గర సమావేశమయ్యారు. భక్తుల సందేహాలు తీర్చడానికి రాధాకృష్ణమూర్తి గారు సిద్ధంగా ఉన్నారు.
రంగనాథం అనే భక్తుడు పైకి లేచి, "మాస్టారూ! నా మిత్రుడు ప్రతి రోజూ పూజలు చేస్తాడు. అన్ని దేవాలయాలకు వెడతాడు. కానీ తనకు ఎక్కడా మనశ్శాంతి లభించడం లేదని అంటూ ఉంటాడు. మీరేమైనా పరిష్కారం చెప్పగలరా?" అని అడిగాడు.
రాధాకృష్ణ మూర్తి గారు సమాధానమిస్తూ "ఇది మీ మిత్రుడికే కాక చాలా మందికి ఉన్న సమస్య. ఒకరిని ఉద్దేశించి కాక, అందరూ ఆలోచించుకునే విధంగా మీకు బురదానంద స్వామి కథ చెబుతాను" అన్నారు.
ఆ పేరు విచిత్రంగా ఉండడంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.
అది గ్రహించిన రాధాకృష్ణ మూర్తి గారు "ఆ పేరులో పరమార్థం కథ పూర్తిగా విన్నాక తెలుస్తుంది" అంటూ ఆ కథ చెప్పడం ప్రారంభించారు.
బురదానంద స్వామి కథ
అవంతీ పుర మహారాజు రిపుంజయుడికి ఎనభై ఏళ్ళు దాటాయి. కొడుకులు పెద్దవాళ్లయ్యారు. అయినా పదవీ కాంక్ష తీరక, ఆయనే ఇంకా రాజుగా కొనసాగుతున్నాడు. ఎన్ని భోగాలనుభవించినా ఆయనకు మనశ్శాంతి లేదు. అందుకోసం ఎంతోమంది సాధువులను , స్వామిజీలను కలిసాడు. కానీ ఆయనకు సరైన సమాధానం లభించలేదు.
అశాంతితో ఆయనకు నిద్ర పట్టేది కాదు. నిద్రలేమితో రాజ్య నిర్వహణ సక్రమంగా చేసేవాడు కాదు. దాంతో రాజ్యంలో అక్కడక్కడా తిరుగుబాట్లు మొదలయ్యాయి. దొంగతనాలు, దోపిడీలు పెచ్చు పెరిగాయి. రాజ్యాన్ని కుమారులకు అప్పగించి విశ్రాంతి తీసుకొమ్మని మంత్రులు, మహారాణి సలహాలు ఇచ్చారు. కానీ కుమారులు ఇంకా సమర్థులు కాలేదని, వారికి అధికారం ఇస్తే నిలుపుకోలేరని రిపుంజయుడు అందుకు అంగీకరించలేదు.
ఒకరోజు మహామంత్రి రాజుగారిని ప్రత్యేకంగా కలిసి, "మహారాజా! ఇన్నాళ్లకు మీ సమస్యకు పరిష్కారం దొరికింది. మన రాజ్యంలోకి కొత్తగా ఒక స్వామిజీ వేంచేశారు. అయన ఎంతటి సమస్యనైనా యిట్టే పరిష్కరిస్తారట. మనం ఒకసారి ఆయనను కలిస్తే, మీకు మనశ్శాంతి లభించే మార్గం చెబుతారట" అని చెప్పాడు.
"అలాగా! చాలా సంతోషం. ఇంతకీ ఆ స్వామి వారి పేరేమిటి?" అడిగాడు రిపుంజయుడు.
"అయన పేరు బురదానంద స్వామి" అని బదులిచ్చాడు మహామంత్రి.
తాను సరిగ్గా వినలేదేమోనని మరో సారి చెప్పమన్నాడు రిపుంజయుడు.
"మహారాజా! మీరు సరిగ్గానే విన్నారు. అయన పేరు బురదానంద స్వామి.పేరును బట్టి ఆయన్ని తక్కువగా అనుకోవద్దు. అయన చాలా గొప్ప స్వామీజీ. ఆ పేరులో ఏదో మర్మం ఉండే ఉంటుంది" అని చెప్పాడు మహామంత్రి.
"అయన పేరేమైతే మనకెందుకు? నా సమస్యకు పరిష్కారం చూపితే అంతకంటే కావలసిందేముంటుంది? ఆయనను కలవడానికి ఏర్పాటు చేయించండి" అన్నాడు మహారాజు రిపుంజయుడు.
ఒక మంచి రోజు చూసి, మహారాజును బురదానంద స్వామీజీ ఆశ్రమానికి తీసుకొని వెళ్ళాడు మహామంత్రి.
ఒంటినిండా బురద పులుముకొని చూడడానికి చాలా వికృతంగా ఉన్నాడు ఆ స్వామీజీ.
ఆయనను చూడగానే అసహ్యించుకున్నాడు మహారాజు.
కానీ తన అసహ్యాన్ని మనసులోనే దాచుకొని స్వామీజీకి నమస్కరించాడు.
మంత్రిని బయటకు వెళ్ళమని సైగ చేసాడు స్వామీజీ.
అయన బయటకు వెళ్ళాక మహారాజు వైపు తిరిగి "దేవుడిని ఎంత వేడుకున్నా మనశ్శాంతి దొరకలేదా?" అని అడిగాడు.
మహారాజు ఆశ్చర్యంగా అయన వైపు చూస్తూ, "నేను చెప్పకుండానే నా మనసులో ఉన్నది కనిపెట్టారు మీరు. కాబట్టి నా సమస్యకి మీ దగ్గర పరిష్కారం లభిస్తుందని నాకు నమ్మకం కుదిరింది" అన్నాడు.
"ఖచ్చితంగా లభిస్తుంది. ఏమిటంత మురిగ్గా ఉన్నావు? ముందు శుభ్రంగా స్నానం చేసి రా. భగవంతుడిని వేడుకుందాం" అన్నాడు ఆయన, మహారాజు వంక ఎగాదిగా చూస్తూ.
మహారాజుకు కోపం వచ్చింది.
నానావిధ పరిమళ ద్రవ్యాలు కలిపిన స్వచ్ఛమైన కొలను నీటిలో స్నానం చేసి వచ్చాడు తను. ఈ స్వామీజీ ఒంటి నిండా బురద నింపుకొని ఉన్నాడు. కానీ తననే ఆక్షేపిస్తున్నాడు.
తన పని ముగిశాక ఈయన్ని కఠినంగా దండించాలి అని మనసులో అనుకున్నాడు.
స్వామీజీ మహారాజు వంక నవ్వుతూ చూస్తూ "మురికి వదిలించుకోమన్నందుకే నన్ను దండించాలనుకుంటున్నావా.." అని ప్రశ్నించాడు.
మహారాజు ఉలిక్కి పడ్డాడు.
"ఈయన మనసులో ఉన్నది కనిపెట్టేస్తున్నాడు. కాస్త జాగ్రత్తగా ఉండాలి" అనుకుంటూ, పైకి మాత్రం నవ్వుతూ "నేను పరిశుభ్రంగా స్నానం చేసి వచ్చాను. అయినా మీ మాట ప్రకారం మళ్ళీ స్నానం చేసి వస్తాను" అన్నాడు.
"త్వరగా ముగించుకుని రా" అంటూ స్వామీజీ తన శిష్యుడిని పిలిచి మహారాజును స్నానాల గదికి తీసుకొని వెళ్ళమన్నాడు.
స్నానం ముగించుకొని మహారాజు స్వామీజీ ఎదురుగా నిలుచున్నాడు.
ఆయన ఏదో ధ్యానిస్తూ కళ్ళు మూసుకొని ఉన్నాడు.
రాజుగారికి ఆగ్రహం కలిగింది.
తాను వచ్చినట్లుగా గొంతు సవరించుకుని శబ్దం చేశాడు.
స్వామీజీ చలించలేదు.
దాంతో మహారాజు తన కాలికి దగ్గరగా ఉన్న రాగి పాత్రని కాలితో తన్నాడు.
స్వామీజీ కళ్ళు తెరిచి, "నీ కోసమే ధ్యానం చేస్తున్నాను. ఇంతలో అంతరాయం కలిగించావు" అన్నాడు.
"నేను వచ్చి చాలా సేపు అయింది. కాళ్ళు తిమ్మిరెక్కి కదిలిస్తూ వుంటే చెంబు దొర్లింది" అన్నాడు సంజాయిషీ ఇస్తున్నట్లుగా.
"అది చెంబు కాదు. నేను కలశానికి ఉపయోగించే రాగి పాత్ర. సరేగానీ నువ్వింకా స్నానానికి వెళ్లలేదా? మురికి అలానే ఉంది?" అని ప్రశ్నించాడు స్వామీజీ.
రాజుగారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
"సాధువులని ఉపేక్షిస్తున్నాను. లేకుంటే మిమ్మల్ని దండించేవాడిని. నిజానికి నేను చాలా శుభ్రంగా ఉన్నాను. మీరే ఒంటినిండా బురద పులుముకొని ఉన్నారు. ఇప్పటికే ఆలస్యం అయింది. ఇక దేవుడి దగ్గరకు వెడదాం" అన్నాడు కోపంగా.
"వృద్ధాప్యంతో నాకే దృష్టి దోషం వచ్చినట్లుంది. అయినా దేవుడి గది ముందే అంతరంగ దర్పణం ఉంది. ఏ మాత్రం మురికి ఉన్నా యిట్టే కనిపెడుతుంది" అంటూ తన ఆశ్రమంలోనే ఉన్న మందిరం వైపు నడిచాడు స్వామీజీ.
ఆయన వెంటే వెళ్ళాడు మహారాజు.
మందిరంలోని గోడకి ఒక పెద్ద అద్దం తగిలించి ఉంది.
మహారాజును ఆ అద్దం దగ్గరకు తీసుకొని వెళ్ళాడు స్వామీజీ.
అద్దంలో బురదానంద స్వామి కిరీటం పెట్టుకుని ఉన్నట్లు కనిపించింది రాజుకు.
ఒకసారి కళ్లు నులుముకుని చూసాడు.
అది స్వామీజీ కాదు.
తన ప్రతిబింబమే.
మరి అదేమిటి? తన వంటినిండా ఆ బురద?
బురదే కాదు. తన వంటి నిండా రకరకాల మలిన పదార్థాలు ఉన్నాయి.
ఆశ్చర్యకరంగా దుర్గంధం అతని ప్రతిబింబం నుండి వచ్చి అతని ముక్కుకు తగిలింది. దాంతో డోకు వచ్చినట్లయింది రాజుగారికి.
కానీ ఆ అద్దంలో స్వామీజీ ధవళ కాంతులతో మెరిసిపోతున్నాడు.
అతని చుట్టూ దివ్యమైన తేజస్సు వ్యాపించి ఉంది. అప్రయత్నంగా బురదానంద స్వామి వైపు తిరిగాడు మహారాజు.
ఆయన ఒంటినిండా మునుపటి బురదే ఉన్నా ఇప్పుడు రాజుగారికి అసహ్యం కలగలేదు.
స్వామీజీకి సాష్టాంగ నమస్కారం చేసి, బురదతో ఉన్న అయన కాళ్ళను కళ్ళకద్దుకున్నాడు.
మహారాజును పైకి లేపి ఆలింగనం చేసుకున్నాడు స్వామీజీ.
ఆయన వంటి మీది బురద మహారాజుకు అంటుకుంది. కానీ ఇప్పుడు రాజుగారికి ఏవిధమైన అసహ్యం కలగలేదు.
స్వామీజీ మహారాజును అద్దంలోకి చూడమన్నాడు.
ఇప్పుడు మహారాజు వంటి మీద ఏ విధమైన బురద లేకుండా సాధారణంగా ఉన్నాడు.
ఆనందించాడు మహారాజు.
"స్వామీ! ఇక దేవుడి దర్శనం చేసుకుందామా" అని వినయంగా అడిగాడు.
"ఇక్కడ వేరే దేవుడి విగ్రహం లేదు నాయనా. ఈ అంతరంగ దర్పణంలో నీకు కనిపించే నీ ప్రతిబింబమే దేవుడు" చెప్పాడు స్వామీజీ.
అర్థం కానట్లు చూసాడు మహారాజు.
"చూడండి మహారాజా! మీరు పాతికేళ్ల వయసులో రాజ్యాధికారం చేపట్టారు. ఇప్పుడు మీ పిల్లలకు యాభై దాటినా మీరే రాజుగా ఉండాలనుకుంటున్నారు. కారణం మీకు విషయం వాంఛల పట్ల వ్యామోహం తీరక పోవడమే.
పిల్లలకు అధికారం అప్పగించమని మహామంత్రి లాంటి శ్రేయోభిలాషులు చెప్పినా మీ మూర్ఖత్వం తో వినలేదు. రాజ్యంలో తిరుబాట్లు మొదలవుతున్నా మీ నిర్లక్ష్యంతో పట్టించుకోలేదు.
నేను ధ్యానంలో ఉండగా కొద్ది క్షణాలే యుగాలుగా భావించి, ఆలస్యమైందని ఆగ్రహం పొందారు మీరు.
కానీ పాతిక సంవత్సరాలుగా మీ పిల్లలు మీ అనుజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు గానీ, మిమ్మల్ని ఎదిరించి అధికారం పొందాలనుకోలేదు.
మిమ్మల్ని తొలగించి అధికారం చేబట్టే తెగువ మీ మంత్రికి ఉన్నా ఎన్నో యేళ్లుగా మీలో మార్పు కోసం ఎదురు చూస్తున్నారు.
కరువుతో, అరాచకాలతో బాధలు పడుతున్న మీ ప్రజలు కూడా మంచి రోజులకు ఎదురు చూస్తున్నారు కానీ తిరగబడలేదు.
మీలో స్వార్థం, మూర్ఖత్వం, క్రోధం, అహంకారం, అలసత్వం లాంటి దుర్గుణాలు వుంటే మీకు మనశ్శాంతి ఎలా ఉంటుంది?
ఇందాక ఈ అంతరంగ దర్పణంలో మీ ఒంటినిండా బురద కనిపించింది. అది మీ మానసిక స్థితికి దర్పణం. అలాంటి స్థితిలో మీకు మనశ్శాంతి ఎలా దొరుకుతుంది?
మీలో మార్పు కలిగాక మీ ప్రతిబింబం మెరుగుపడింది. అది చాలదు. నన్ను మించిన తేజస్సు మీరు పొందవచ్చు. మిమ్మల్ని మీరు సరి చేసుకోవడమే భగవద్దర్శనం, భగవదైక్యం.
అప్పుడు మీలోనే భగవంతుడు ఉంటాడు. అనిర్వచనీయమైన ఆనందం అప్పుడే లభిస్తుంది" చెప్పాడు స్వామీజీ.
స్వామీజీకి భక్తితో నమస్కరించి సెలవు తీసుకున్నాడు మహారాజు.
రాజ్యాధికారాన్ని పిల్లలకు అప్పగించి ఆశ్రమ జీవితాన్ని స్వీకరించాడు.
తన అనుభవాలతో కలిగిన జ్ఞానాన్ని నలుగురికీ పంచుతూ ఆనందంగా జీవించాడు.
బురదానంద స్వామి కథను ముగించారు రాధాకృష్ణ మూర్తి గారు.
విన్నవారందరు చప్పట్లతో తమ ఆనందాన్ని తెలిపారు.
***శుభం ***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
కొత్త బంగారు లోకం ఎక్కడుంది? (కవిత)
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
Comments