top of page
Writer's pictureDasu Radhika

క్యాడ్బరీ బిస్కెట్


Cadbury Biscuit Written By Dasu Radhika

రచన : దాసు రాధిక


మహాలక్ష్మి గొంతు రెండు గంటలపైనయింది వినిపించి. ఇల్లు బావురుమంటోంది ఆ దెబ్బకు. శంకరం కు సాయంత్రం నాలుగింటికల్లా కాఫీ పడకపోతే తలనొప్పి తధ్యం. ఈ లోకము లోనే లేదు మహా. కంప్యూటర్ సబ్జెక్టు లో ప్రాక్టీకల్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నట్లు ఉంది.

"మహా మై డియర్" అని మెల్లగా పిలిచాడు .

ఉహూ. ఉలుకు పలుకు లేదు. ఇక లాభము లేదని మహాలక్ష్మీ కు టెక్స్ట్ మెసేజ్ పంపాడు శంకరం. కాఫీ కావాలని, ఒక కాఫీ జీ ఐ ఎఫ్ బొమ్మ పెట్టి.

రెప్ప పాటులో లేచి వచ్చి," "సారీ అండి మీ కాఫీ టైమ్ దాటిపోయింది కదూ" అని క్షణం లో వేడి కప్పు చేతికిచ్చింది. అంతే ఫోను తో సహా మళ్లీ కంప్యూటర్ లాబ్, అదే ఆ గదిలోకి వెళ్ళిపోయింది. లత అనుకుంటా అవతలి వైపు ఫోను లో. మహా, లత ల సంభాషణ విని ఖంగారేసి గది లోకి వెళ్ళాడు. "మళ్ళీ చేస్తా లతా" అని మహా ఫోను పెట్టేసి శంకరం వంక ప్రశ్నార్ధకంగా చూసింది. "ఫేస్బుక్ లో కూడా జాయిన్ అయ్యావా" అని అడిగాడు శంకరం.

"అయ్యో మీకు చెప్పలేదు కదూ" అని మహా మొదలెట్టింది. "అందులో మనకెంత మంది ఫ్రెండ్స్ ఉంటే మనమంత గొప్పటండీ. మన వాడికి రేపు సంబంధాలు కూడా అందులోనే చూస్కోవచ్చునని నా ఫ్రెండ్స్ చెప్పారు. ఇన్నాళ్లు అందుకే కుదరలేదో ఏమో వాడికి. గంటకో ప్రొఫైల్ పిక్చర్ పెడితే ఇంకా ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తాయిట. ఇంకా పరిచయాలు పెరుగుతాయిట. ఇందాకంతా అదే చేసాను. నా ఫోటోలన్ని ప్రొఫైల్ పిక్చర్ కోసము రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడే మీకు కాఫీ పెట్టిస్తూ సెల్ఫీ దిగాను. అది అప్లోడ్ చేస్తూ లత తో మాట్లాడాను".

శంకరంకు కోపం వస్తున్నా తమాయించుకొని లాలనగా మహాకు నచ్చ చెప్పాడు. "అదంతా ఒక కృత్రిమ ప్రపంచమని, పిచ్చి కళలుకు పోతే లేని పోని కష్టాలు కొని తెచ్చిపెట్టుకుంటామని చెప్పాడు. వేరే వ్యాపకమును పెట్టుకోమన్నాడు మహాలక్ష్మి ని. కానీ మంచి మాట అంత తొందరగా బుర్రకెక్కితే కదా. మర్నాడు శంకరం వారం రోజులకుగాను క్యాంప్ కు వెళ్లాడు.


ఆ రోజు పదకొండు గంటలకు రావాల్సిన ఫ్లైటు గంట లేటుగా రావటంతో శంకరం ఒంటిగంటన్నరకు ఇంటి బెల్లు కొట్టాడు. మహాను చూసి నివ్వెర పోయినాడు. "నీ జుట్టు కేమైంది మహాలక్ష్మీ అన్నాడు. కానీ ఆమె పట్టించుకోలేదు. చేతులో ఫోటోలు, ఫోనుతో లాబ్ లోకి నడిచింది భేతాళుడి పిశాచిలా. అర్ధరాత్రి వేళలో.

మర్నాడు మార్నింగ్ న్యూస్ పేపర్ కూడా పక్కన పెట్టి, మహాలక్ష్మి కోసo ఇల్లంతా కలియ చూసాడు.

అప్పుడు పనిమనిషి కమల వచ్చి అమ్మగోరు ఈ టయానికి మేడ పైనుంటారు సార్ అంది. శంకరం ఏమి అడగకుండా పైకి వెళ్ళాడు . అయ్యో మహా, నా మహా అందమైన జడ ఏది? అని దగ్గరకెళ్లి సూటిగా ప్రశ్నించాడు శంకరం. "అదే నండి ప్రొఫైల్ పిక్ పోటీలున్నాయని లత చెప్తే, మోడరన్ గా ఉంటే గెలుస్తానని స్టయిల్ గా స్టెప్ కట్ చేయించాను. రెండు నెలల్లో జడ వచ్చేస్తుంది గా" అన్నది శంకరం వైపు అమాయకంగా చూస్తూ.

శంకరంకు దిగులు పట్టుకుంది ఈ పిచ్చిలో నించి మహాలక్ష్మిని ఎలా బయటకు లాగాలా అని.

అలా చూస్తూ చూస్తూ వైశాఖ మాసము నుండి మార్గశిరము దాకా గడిచిపోయింది. ఒక రోజు పాలు పొసే వాడితో పొద్దున్నే " ఒరేయ్ రమేశు, నీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టానురా, నువ్వు చూస్కోవా, యాక్స్ప్ట్ చెయ్యాలి వెంటనే. ఇప్పుడింటికెళ్లగానే చెయ్యి" అని ఇంకా నిద్దరమత్తు వదలకుండా ఆవలిస్తూనే మహా మాట్లాడటం విన్నాడు శంకరం. ఏమి చెయ్యలేక కమలను సూటి పోటీ మాటలన్నాడు. ఆ రాత్రి కొడుకు భాస్కర్ వారము తర్వాత ఫోను చేస్తే వాడితో కూడా పెడసరిగా మాట్లాడాడు. మహాలక్ష్మి కి శంకరం లో వచ్చిన మార్పు తెలియట్లేదు. సహనానికి మారు పేరు అతను. కమలకు అర్ధమైంది. అమ్మగోరుకు ఏదో ఫేస్బుక్ రోగముట అని, అది అక్కడ చుట్టుపక్కల పనిమనుషులతో పనికట్టుకోని మరీ చెప్పింది. దాని బాధ దానిది మరి. శంకరం అరిచాడు. ఇవాళా నిన్నా. పదేళ్ళ నుండి చేస్తోంది ఆ ఇంట్లో పని. అప్పుడే భాస్కర్ ఎం ఎస్ కు వెళ్ళాడు అమెరికాకు. రెండేళ్ల నుండి శంకరం సార్ కొడుక్కి పెళ్లి సంబంధాలు చూసినా కుదరట్లేదు. ఇంతలో అమ్మగోరికిలా.


క్రిస్టమస్ సెలవు రోజున శంకరం చిన్న నాటి స్నేహితుడు ఒకడు తన భార్య తో వీళ్ళ ఇంటికోచ్చాడు. అతను ఫలానా అని మహాలక్ష్మికి తెలీదు. మహాలక్ష్మిని చూస్తూనే "మీరు.. ఇక్కడ.." అని ఆగిపోయాడు. శంకరం వివరం అడిగితే "ఏమీ లేదు. ఈవిడ ఫోటోలు మన లాంటి కుటుంబాల ఆడవాళ్ళ ఫోటోలు ఉండ కూడని వెబ్ సైట్ లో చూసాను. అందుకని..." అని సణిగాడు. మహాలక్ష్మికి కన్నీళ్లు వచ్చాయి. శంకరం వైపు తిరిగి "నాకేమీ తెలీదండి, నేనే తప్పు చెయ్యలేదు" అన్నది. శంకరం తన భార్యను ఓదార్చి, వచ్చిన తన మిత్రుడి తో హెచ్చు స్వరము లో అన్నాడు, "చూడు రవి, మా మహాలక్ష్మి అంటే ఏమనుకున్నావు? నిప్పు, ఎవర్ని చూసి ఎవరనుకొన్నావో. "

రవి వెంబడే అన్నాడు, "సరేలే రా! చూశాననిపించింది. నీ మాట నమ్మనా... వచ్చిన పని చెప్తాను.

వాళ్ళావిడను పరిచయం చేశాడు ఇరువురికి. "సంధ్యా ! మనమ్మాయి వివరాలు, జాతకం మహాలక్ష్మి గారికివ్వు" అన్నాడు. ఈ ఊరొచ్చాను పని మీద. ఇదంతకన్నా ముఖ్యమైన పని అని ఇలా వచ్చాను రా. మా అమ్మాయిని మీ భాస్కర్ కు అడుగుదామని.రవి వాళ్ళు సాయంత్రం ఫ్లైటు కు విజయవాడ వెళ్లిపోయారు. అప్పుడు మహాలక్ష్మికి శంకరం చెప్పాడు. వాళ్ళు శ్రీమంతులని, ఒక్కతే అమ్మాయని, మంచివాళ్ళని.

ఈ లోపల లత ఫోను వచ్చింది. "మహా ఆ ఫోన్ తీసుకోలేదు. ఫేస్బుక్ లో నుండి ఎగ్జిట్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా తీసివేసింది. శంకరం హాయిగా ఊపిరి పీల్చాడు. దెబ్బకు దయ్యం దిగిందనుకున్నాడు.

" లత మాయ మాటల్లో పడి నేను బిస్కెట్ అయిపోయాను కదా" అన్నది మహా తన మూర్ఖత్వానికి.

"నిన్ను పెళ్ళి చేసుకొని నేనెప్పుడో బిస్కెట్ అయ్యానుగా" అన్నాడు శంకరం నవ్వుతూ.

మహాలక్ష్మి బుగ్గలు కందిపోయాయి. చిరుకోపము నటించింది.

"అయినా నీకు ఈ బిస్కెట్ భాష కూడా అంటించిందా ఆ మహాతల్లి లత??" అని వాపోయాడు శంకరం.

"ఇది సుపుత్రుడి పుణ్యమా అని అంటుకుంది" అని నవ్వేసింది.


భాస్కర్ ఫోను చేసాడు ఆ రోజు రాత్రి. బాంబు లాంటి వార్త చెప్పాడు. ఒకమ్మాయిని తను ప్రేమించానని, పెళ్లిచేసుకోవాలనుకుంటున్నానని.ఆ రోజు నుండి మహాలక్ష్మికి నిద్ర పట్టలేదు. న్యూ ఇయర్ కు భాస్కర్ వచ్చాడు. రవి గారి కూతురు మాధవి జాతకము భాస్కర్ జాతకముతో కలిసింది.

ఇప్పుడెలా అని లోలోపల మధన పడింది మహాలక్ష్మి.


వారములో భాస్కర్ ప్రయాణం అనగా శంకరం మహాలక్ష్మి పోరు పడలేక పెళ్ళి విషయమై కొడుకుని కదిలిచ్చాడు . ఫేస్ టైం ఫోను చేసి మాధవిని పరిచయం చేశాడు భాస్కర్ తన తల్లి తండ్రులకు. మాధవి కూడా అదే పని చేసింది. అక్కడ రవిగారు, సంధ్య ప్రత్యక్షమైనారు. మహాలక్ష్మికి ఏమి అర్ధం కాలేదు. శంకరంతో సహా అందరూ ఒక చిన్న నాటకము ఆడారని మెల్లగా తెలుసుకుంది.

"చెల్లెమ్మా, ఇందులో మేము పాత్రధారులము మాత్రమే, సూత్రధారి మీ ఆయనేనమ్మా", అన్నాడు రవి. "ఆ రోజు మీ ఇంట్లో నేను అలా మాట్లాడినందుకు క్షమించమ్మా" అన్నాడు రవి.

తనకు బుద్ది చెప్పటం కోసమేనని మహాలక్ష్మి తెలుసుకుంది. శంకరం తదేకంగా మహానే చూస్తూ ఇలా చెప్ప సాగాడు. "భాస్కర్కు మాధవితో ఫేస్బుక్ లో పరిచయం. అది పెళ్లి దాకా వచ్చింది. రెండేళ్ల నుండి సాగుతోంది వాళ్ళ ప్రేమాయణం. ఇది తెలిసినప్పుడు నాకు మతి పోయింది. తల్లీ కొడుకుల పిచ్చిని కుదర్చబోయి నేనే పిచ్చివాడిని అవుతానేమో అనుకున్నాను. అప్పుడే తెలుసుకున్నాను మాధవి వివరాలు. మిగిలిన కథ సుఖాంతమయ్యేందుకు జాగ్రత్త పడ్డాను."

మళ్ళీ రవి అందుకుని, "నిజానికి మన పిల్లలు మనలను బిస్కెట్ చేశారు, కదరా శంకరం?? అన్నాడు నవ్వుతూ.

"మామూలు బిస్కెట్ కాదు అన్నయ్యగారు, క్యాడ్బెరీ బిస్కెట్" అని మహాలక్ష్మి అన్నది.

పిల్లలతో సహా అందరూ హాయిగా నవ్వుకున్నారు.

శంకరం గుండె లో బరువు దిగిపోయింది.

కొడుకు పెళ్ళి కోరుకున్న అమ్మాయి తో చేసాడు.

తన ప్రియమైన మహాలక్ష్మి సోషల్ మీడియాలో గ్రేస్ మార్కులతో పాస్ అయితే చాలు, డిస్టింక్షన్ రావఖ్ఖర్లేదనేది తనదైన తరహాలో తెలియచెప్పాడు.

గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి



రచయిత్రి పరిచయం

పూర్తి పేరు: శ్రీమతి దాసు రాధిక

వయసు: 52 సం.

నివాసం: బెంగుళూరు ( ప్రస్తుతము)

స్వస్థలం: తెనాలి

చదువు: BA English Litt., B.Ed

వృత్తి: గృహిణి. 1993-1997 హై స్కూల్ టీచర్ గా పని చేసిన అనుభవం.

ప్రవృత్తి: సంగీతం వినటం, పాటలు పాడటం

పాడుతా తీయగా ETV లో రెండో బ్యాచ్ 1997 లో క్వార్టర్ ఫైనలిస్ట్.

స్కూల్, కాలేజి లో పాటలు, నాటకాల( ఇంగ్లీషు, తెలుగు) అనుభవం.

కథలు వ్రాయటం, ఇంగ్లిష్ - తెలుగు భాషా అనువాదాలు,


294 views3 comments

3 Comments


Chala baagundi...rachayitha vastavaanni chala asakthikaramgaa vivarincharu...


Like

Vasu Dasu
Vasu Dasu
Dec 29, 2020

చాలా తేలికైన మరియు వినోదాత్మకంగా వ్రాయబడింది.అభినందనలు

Like

dasutrivikram
dasutrivikram
Dec 23, 2020

Cadbury biscuit kadhalo Neti antarjala vyapakam and yuvataram bhasha prayogam gurunchi chamatkaramuga varninchaaru. Chawla bagundi.

Like
bottom of page