అత్తగారి కథలు - పార్ట్ 1
'Car Peru Ramani' - New Telugu Story Written By L. V. Jaya
Published in manatelugukathalu.com on 05/05/2024
'కార్ పేరు 'రమణి'' తెలుగు కథ (అత్తగారి కథలు - పార్ట్ 1)
రచన: L. V. జయ
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
సమర్థ్ కి కార్లంటే చాలా ఇష్టం. వాళ్ళ అమ్మ రాధని ఎన్ని సార్లు కార్ కొనుక్కుంటాను అని అడిగినా, "ఒక్కడివే కదా ఉంటావ్. నీకెందుకు ఇప్పుడు కార్" అంటూ ఒప్పుకోలేదు.
సమర్థ్ కి పెళ్లి నిశ్చయం అయ్యాక, భార్య ఇంటికి వచ్చేలోగా, ఎలాగైనా కార్ కొనుక్కోవాలని అనుకున్నాడు. అమ్మ రాధని, తండ్రి మాణిక్యాలరావుని మళ్ళీ అడిగాడు.
"పెళ్లి నిశ్చయం అయ్యింది కదా. పెళ్లి అయ్యే లోపల కార్ కొని, వచ్చిన అమ్మయిని కార్ లో తిప్పుతావ్. అందుకేగా? " అంది రాధ కోపంగా.
"అది కాదమ్మా. మీ కోసమే కొనాలనుకుంటున్నాను. ఆ అమ్మాయి వచ్చేటప్పటికే, మన దగ్గర కార్ ఉందనుకో, కార్ మీ ఇద్దరిది అనుకుంటుంది. అదే పెళ్లి అయ్యాక, కొన్నాను అనుకో.. తనకోసం కొన్నాను అనుకుంటుంది" అని ఏదో ఒకటి చెప్పి, ఒప్పించటానికి ప్రయత్నించాడు సమర్థ్.
సమర్థ్ తన కోసం కార్ కొంటాను అనడం నచ్చింది రాధ కి. 'నిజమే, పెళ్లి అయ్యాక కొంటే, తన కోసమే కార్ కొన్నాడు అనుకుంటుంది ఆ వచ్చే అమ్మాయి. నన్ను ఎక్కనిస్తుందో లేదో?'. "సరే. కొను" అని చెపుదాం అనుకుంది.
కొడుకుని కార్ కొనమని చెప్పాలని మాణిక్యాలరావు కి ఉంది. ఇంటికి కార్ వస్తే, తను కూడా అందులో తిరగచ్చు, నడపచ్చు అనుకున్నాడు. కానీ భార్య కి భయపడి, "ఇప్పటికే ఇంటి కోసం లోన్ తీసుకున్నావ్. కార్ కోసం కూడా తీసుకుంటే అప్పుల అప్పారావు అయిపోతావ్ రా. వద్దు" అని చెప్పాడు.
"కార్ కొను" అని చెపుదాం అనుకున్న రాధ చెప్పలేక పోయింది. భర్త, లోన్ ల గురించి గుర్తు చేసేటప్పటికీ, కొడుకుకి లోన్లు ఎక్కువ అయిపోతాయని అలోచించి వద్దంది.
సమర్థ్ కి పెళ్లి అయ్యి, భార్య ఇంటికి వచ్చింది. తనకున్న బైక్ మీద భార్యతో తిరగడం బాగుంది కానీ, కార్ కొనుక్కోవాలన్న కోరిక మాత్రం ఇంకా అలానే ఉంది సమర్థ్ కి. ఇక, ఎలాగైనా కార్ కొనాలని నిర్ణయించుకున్నాడు. తన భార్య జాగృతి పుట్టినరోజున, "పద. నీకో మంచి గిఫ్ట్ కొంటాను. " అని, కార్ షోరూం కి తీసుకుని వెళ్ళాడు.
"బర్త్డే గిఫ్ట్ గా, కారా!!! " నమ్మలేకపోయింది జాగృతి.
"పెళ్లి అయిన తరువాత, ఇదే నీ మొదటి పుట్టినరోజు. ఎప్పటికీ గుర్తు ఉండిపోవాలి మరి. " అన్నాడు. జాగృతి మురిసిపోయింది.
కార్లు అన్నీ చూసి, " నీకు ఏది నచ్చిందో చెప్పు. అది కొంటాను. " అన్నాడు జాగృతి తో.
'తెలుపు రంగు అంటే నాకు ఇష్టం' అని చెప్దామనుకుంది. కానీ, అప్పటికే, ఒక తెల్ల రంగు కార్ చూపించి, "మనుషులు తెల్ల రంగు కార్ ఎలా కొంటారో. అంబులెన్సు లో తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది నాకు" అని అనడంతో చెప్పలేకపోయింది. "మీ ఇష్టం" అంది.
ఎర్ర రంగు కార్ కొని, కీస్ తెచ్చి, జాగృతి చేతిలో పెట్టాడు సమర్థ్. "ఇదిగో. నీ బర్త్డే గిఫ్ట్. నచ్చిందా? ఇప్పుడు, నువ్వు కార్ ఓనర్ వి" అని అన్నాడు సమర్థ్.
"కార్ ఓనర్ ని నేను కాదు. మనం" అంది జాగృతి. పెళ్లి అయిన కొన్ని నెలలలోనే, అంత పెద్ద గిఫ్ట్ ని భర్త ఇచ్చినందుకు చాలా సంతోషపడింది.
"ముందు, గుడిలో పూజ చేయించి, తరువాత హోటల్ కి వెళ్దాం" అన్నాడు సమర్థ్.
గుడికి వెళ్తూ, రాధ, మాణిక్యాలరావు లకు ఫోన్ చేసాడు సమర్థ్. "అమ్మా, నాన్నా. ఈ రోజు ఒక కొత్త కార్ కొన్నాను. " అని సంతోషంగా చెప్పాడు.
"నీ కోసమే కొనుక్కుని ఉంటావ్. కొన్నది నీకు ఇష్టమైన ఎర్ర కారేనా?" అడిగాడు మాణిక్యాలరావు. ఆశ్చర్యంగా, భర్తని చూసింది జాగృతి. 'తన కోసం ఎర్ర కార్ కొనుక్కుంటూ, నా కోసం కొన్నాను అని ఎందుకు చెప్పాడు ?' జాగృతి కి వాళ్ళ సంభాషణ అర్ధం కాలేదు.
"నాకు తెలుసు. వీడు మన కోసం కొనలేదు. వాళ్ళ ఆవిడ కోసం కొన్నాడు. ఈ రోజు ఆవిడ పుట్టినరోజు కూడా కదా. అందుకే పెళ్ళాం, బెల్లం అన్నారు " అంది రాధ.
'కార్ కొనమని నేనేమి అడగలేదు కదా? ఈవిడ నన్ను ఎందుకు అంటున్నారు?' అని బాధపడింది జాగృతి.
సమర్థ్ పక్కనే జాగృతి కూర్చుని ఉందని, అంతా వింటోందన్న విషయం వాళ్ళకి తెలియదు. ఇంకా ఏదో చెప్పబోతుంటే, ఇంకేం అనేస్తారో అన్న భయంతో, "పూజ చేయించటానికి తీసుకుని వెళ్తున్నాను. ఇంక ఉంటాను" అని ఫోన్ పెట్టేసాడు సమర్థ్.
పూజ చేయించిన తరువాత, హోటల్ కి వెళ్లారు. ఇద్దరూ ఒకరితో ఒకరు ఏమి మాట్లాడుకోలేదు. ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ చేసుకుని, తిని వచ్చారు.
తనకి ఇష్టమైన కార్ కొన్న ఆనందం సమర్థ్ కి, పుట్టినరోజున గిఫ్ట్ వచ్చిన ఆనందం జాగృతి కి కాసేపు కూడా మిగలలేదు.
మర్నాడు, ఉదయం ఇద్దరూ కొత్త కార్ లో ఆఫీస్ లకి వెళ్లారు. ఇద్దరూ ముభావంగానే ఉన్నారు. ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు, కార్ వెనక రాసి ఉన్నది చూసింది జాగృతి.
ఇంగ్లీష్ లో రమణి అని రాసి ఉంది. 'ఆర్', 'ఎమ్' పెద్ద అక్షరాల్లో, మిగిలినవి అన్నీ చిన్న అక్షరాల్లో ఉన్నాయి. జాగృతి కి విషయం మొత్తం అర్ధం అయ్యింది. రమణి అని ఎందుకు కార్ మీద రాసుందో కూడా తెలిసింది.
కార్ లో కూర్చుని, "ఇంతకీ కార్ ఎవరి కోసం కొన్నానని చెప్పారు?" అని సమర్థ్ ని అడిగింది జాగృతి.
"నీ కోసమే. " అన్నాడు సమర్థ్. 'ఈయనకి నారదముని అని పేరు పెట్టాల్సింది. అనవసరంగా సమర్థ్ అని పెట్టారు. ' అని మనసులో తిట్టుకుంది.
"ఈ రోజు అత్తయ్యతో, మావయ్యతో మాట్లాడారా?" అని అడిగింది. అవునని చెప్పాడు సమర్థ్.
"అవునూ. రమణి ఎవరు? " అని అడిగింది జాగృతి. రమణి ఎవరో తనకి తెలిసినా, సమర్థ్ ఏంచెప్తాడో అని అడిగింది.
"వెనక ఉన్న స్టిక్కర్ చూసేసావా? రమణి, నా పాత ఫ్రెండ్ పేరు. కార్ కి పెట్టుకున్నాను?" అన్నాడు జాగృతిని ఏడిపిస్తూ.
"ఓహ్. మీ పాత ఫ్రెండ్ పేరు రమణి. అంటే రాధ + మాణిక్యాలరావు. అంతేగా" అంది జాగృతి.
జాగృతి ని దగ్గరకి తీసుకుని, కళ్ళలోకి చూస్తూ, "అవును. కొత్త ఫ్రెండ్ పేరుని కార్ మీద రాయక్కరలేదు. తనని చూసిన మొదటి రోజే, నా గుండెల్లో రాసుకున్నాను తన పేరుని". అన్నాడు సమర్థ్.
"ఏ సినిమాలో డైలాగు ఇది?" అంది జాగృతి కోపంగా.
కొన్ని నెలల తరువాత, 'రమణి' అని పేరుగల కారు 'ర'మణి' దగ్గరికి వెళ్ళిపోయింది.
అత్తగారి కథలు - పార్ట్ 2 త్వరలో
L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : LV జయ
నా పేరు LV జయ.
https://www.manatelugukathalu.com/profile/jaya
నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం.
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు
Comments