top of page
Writer's pictureLakshminageswara Rao Velpuri

క్యాష్ బాక్స్


'Cash Box' Written By Lakshminageswara Rao Velpuri

రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి


'సాగర అందాలతో, మిలమిలలాడే సూర్యుని వెలుగులో 'బంగాళాఖాతము సముద్రపు తీర ప్రాంతం' ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'విశాఖపట్నం బీచ్'.


అక్కడికి జనాలు తండోపతండాలుగా వస్తారు. శేషనాగు పడగల్లా విరుచుకుపడుతున్న సముద్రపు కెరటాలు, నురగలు కక్కుతూ , బుసలు కొడుతూ, కింద పడి మళ్లీ సెకండ్లలో నిలువెత్తు ఎత్తుకు వెళ్లి , మళ్లీ పడి తీరాన్ని తాకడం, విహార యాత్రికులకు కనువిందు చేయడం, ఇది రోజు జరుగుతున్న ప్రకృతి ప్రక్రియ.


అదే బీచ్ రోడ్ లో 'పాండురంగాపురం 'అనే వీధిలో, ఎంతో వైభవంగా కళకళలాడుతున్న 'పాండురంగ స్వామి వారి 'దేవాలయం ఉన్నందువల్ల, బీచ్ కి దగ్గరగా ఎన్నో బహుళ అంతస్తు భవనాలు, విల్లాలు ఏర్పడి శరవేగంగా ఒక 'ధనిక వర్గం ' నివసించే ప్రాంతం గా ప్రసిద్ధి చెందింది పాండురంగాపురం.


అందులోనే మన కథానాయకుడు 'పాండు రంగారావు ' గారిది ఒక సువిశాలమైన భవనం. ఆయన' విశాఖ స్టీల్ ప్లాంట్' లోని బీహెచ్ఈఎల్, లోని పోర్ట్ ట్రస్ట్ అనే ప్రభుత్వ సంస్థలకు A1 కాంట్రాక్టర్ గా 25 ఏళ్ల పాటు సుదీర్ఘంగా శ్రమించి, వైజాగ్ లోనే చెప్పుకోదగ్గ ఐశ్వర్యవంతుల జాబితాలో ఉన్నారు. ఇంటినిండా నౌకర్ల తో అత్యంత విలాసంగా జీవిస్తున్న కుటుంబం ఆయనది.


అది జనవరి నెల. పాండు రంగారావు గారు తన 'ఆఫీస్ స్టాఫ్ 'కి ఇవ్వవలసిన 'పండుగ బోనస్ లు, జీతాలు, ఇవ్వడానికి క్యాష్ సద్దుబాటు చేస్తున్నారు, 'సంక్రాంతి పండుగ రోజులు' దగ్గర పడటంతో అందులోనూ బ్యాంకు సెలవులు కావడంతో ఆరోజు 'స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ డబ్బులు' వచ్చిన కారణంగా "20 లక్షల నగదు" తెప్పించి, తన బెడ్ రూమ్ లోనే ఉన్న' గోద్రెజ్ సేఫ్ 'లో పెట్టి అత్యంత రహస్యంగా 'పాస్వర్డ్ 'పెట్టి దాన్ని లాక్ చేశారు. ఎందుకంటే ఆ మర్నాడు తన ఉద్యోగులందరికీ బోనస్ లు, జీతాలు పంచాలి కనుక , వాటి లెక్కలు రాసుకుంటూ పడుకొండిపోయారు.


.. ఆ మర్నాడు సరిగ్గా ఆఫీసుకు బయలుదేరుతున్న సమయంలో 'గోద్రెజ్ లాకర్, తెరిచి చూసేసరికి, గుండె ఆగినంత పని అయింది, పాండు రంగారావు గారికి. అందులో భార్యాబిడ్డల బంగారు నగలు ఉన్న పెట్టెలు, ఎక్కడ చెక్కుచెదరకుండా ఉన్నాయి, కానీ నిన్న తెచ్చిన' 20 లక్షల నగదు' మాయమయ్యే సరికి, నిలువెల్లా వణికి పోతూ, గొంతు తడారిపోయింది.

ఎంత గట్టిగా పిలిచినా తన శబ్దం తనకే వినబడక పోయేసరికి, పరుగు పరుగున మేడ మెట్లు దిగుతూ, కారుతున్న చెమటను తుడుచుకుంటూ,

“లక్ష్మి !! తొందరగా రా!”

“ఒరేయ్ వెధవల్లారా ! తొందరగా రండి. మన ఇంట్లో భారీ దొంగతనం జరిగింది, తలుపులు వేసేయండి, బయట ఉన్న 'సెక్యూరిటీ గార్డును' పిలవండి!” అని గుక్కతిప్పుకోకుండా అరుస్తున్న భర్తను చూస్తూ భయపడిపోయిన భార్య లక్ష్మి ఒక గ్లాసు మంచినీళ్ళు తెచ్చి “ముందు తాగండి! కూర్చోండి, కాస్త సేదదీరాక అసలు ఏం జరిగిందో చెప్పండి?” అంటూ భుజం రాస్తూ అడుగుతున్న భార్య ని చూస్తూ "ఏమీ లేదే , నా ఖర్మ కాలింది, ! మొన్న 'స్టీల్ప్లాంట్ డబ్బులు వచ్చాయి కదా!, మన ఆఫీస్ స్టాప్ కి పండుగ బోనస్లు జీతాలు ఇవ్వడానికి '20 లక్షల క్యాష్ 'తెప్పించాను, అవి నా బెడ్ రూమ్ లో ఎంతో రహస్యంగా 'పాస్వర్డ్ 'పెట్టీ దాచాను, అందులో మీ నగలు అన్నీ ఉన్నాయి, కానీ నేను పెట్టిన 20 లక్షలు నగదు కాజేశారు, ఇది మన ఇంట్లో పనా? కొంపతీసి' చెడ్డి గ్యాంగ్' పనా? నాకు అర్థం కావటం లేదు!” అంటూ తలపట్టుకుని, గోడకానుకొని చతికిలబడి పోయారు పాండురంగారావు గారు.


భర్తని ఓదారుస్తూ లక్ష్మీ గారు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు, అసలే' వీఐపీ ఏరియా' కాబట్టి అత్యంత వేగంగా పోలీసు బృందం వచ్చి, అన్ని విధాల పరీక్షలు చేసిన, ఎక్కడ అ క్యాష్ బాక్స్ దగ్గర క్లూ దొరకక, మాట్లాడుతూ' సార్ ! మీరు కంగారు పడకండి, మేము అన్ని రూట్లు మూసి వేసాము, దొంగలు పారిపో లేరు! అంటూ హడావుడి చేసి' Fir రాసి పాండు రంగారావు గారికి ధైర్యం చెప్పి వెళ్లిపోయారు.


రెండు రోజులు గడిచినా ఎంత వెతికినా దొంగల జాడ తెలియక, అటు పోలీసులు ఇటు పాండురంగారావు గారు, తలమునకలై పోయారు, కానీ ఏ ఆధారమూ లభించక ఆరోజు ఆఫీసు లో తను చేస్తున్న పెద్దపెద్ద కాంట్రాక్టుల నిఘు విషయాలు అనుక్షణం

కనస్ట్రక్షన్ పనులలో, దొంగతనాలు జరగకుండా, ఒకవేళ జరిగితే పరిశోధించడానికి , ఒక 'ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ డైరెక్టర్ శ్రీధర్ గారిని' పిలిపించారు పాండురంగారావు గారు.


ఆయన పిలిచిందే తడవుగా 25 ఏళ్ల 'డిటెక్టివ్ ఏజెన్సీ 'అనుభవమున్న డైరెక్టర్ 'శ్రీధర్ గారు', ఆయన అసిస్టెంట్ 'శేఖర్’ హుటాహుటిన పాండు రంగారావు గారి విల్లా కి వచ్చి తమ కారు పార్క్ చేసి బయట సెక్యూరిటీ గార్డ్ అనుమతి పొంది, లోపలి వచ్చారు.


విశాలమైన పెద్ద భవంతి ముందు, చక్కని పూల తోట, ఆకుపచ్చని లేత గడ్డి అప్పుడే ట్రిమ్ చేయబడి వుంది. మొట్టమొదటిసారిగా ఇంటికి వచ్చిన వాళ్ళు ఆ నీట్ నెస్ కు ఆశ్చర్య పడతారు! అలాగే చిన్న వయసు అయినా కూడా అసిస్టెంట్' “శేఖర్ సార్ !ఇంత పెద్ద భవంతి.. అది కూడా బీచ్ కి దగ్గరలో ఎంత సుందరంగా ఉందో ?” అంటున్న చరణ్, శేఖర్ ని ఉద్దేశించి మరి ఏమి అనుకున్నావ్, పాతికేళ్లుగా విశాఖ నగరంలోని అత్యంత ఐశ్వర్యవంతులలో ఒకరు మన పాండు రంగారావు గారు, పదా, లేట్ అయిపోతుంది” అంటూ లోపలికి రాగానే విశాలమైన పెద్ద హాలు మంచి' ఇంటీరియర్ డెకరేషన్ తో' ఎంతో కళ ఉట్టి పడుతూ ఉంది, డ్రాయింగ్ రూమ్, అందులో విశాలమైన పెద్ద సోఫాలో కూర్చున్న పాండురంగారావు గారు లేచి 'రండి, రండి శ్రీధర్ గారు!, కూర్చోండి అంటూ సాదరంగా ఆహ్వానించారు.


'గుడ్ మార్నింగ్ సార్! మమ్మల్ని రమ్మని పిలిచారు కారణం తెలుసుకోవచ్చునా? అని సగౌరవంగా అడిగారు శ్రీధర్ గారు, ఇంతకు మునుపు మా కంపెనీలో ఎన్నో కాంట్రాక్టు పనులలో, మీ సహాయం చాలా ఉంది, ముఖ్యంగా మా ఇంట్లో ఒక భారీ దొంగతనం జరిగింది, పోలీసులు కూడా చేతులెత్తేశారు, వారు ఎంత వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు , నా గోద్రెజ్ సేఫ్ లో మా స్టాఫ్ జీతాల కోసం , పండుగ బోనస్ల కోసం బ్యాంకు సెలవులు కాబట్టి, రెండు రోజుల క్రితం "20 లక్షల రూపాయిలు "డబ్బు తెచ్చి నా బెడ్ రూములో ఉన్న లాకర్లో దాచాను, ఎంతో సీక్రెట్ గా ఉన్న' పాస్వర్డ్ 'కూడా ఛేదించి , ఆ దొంగ ఒక్క డబ్బు మాత్రమే 20 లక్షలు తో పరారయ్యాడు, కానీ అందులో ఉన్న మా ఫ్యామిలీ బంగారు నగలు, ఒక్కటి కూడా తీయలేదు, అసలు ఇది ఇంటి దొంగతనమా, లేక పేరుమోసిన' చెడ్డి గ్యాంగ్ పనా, ' అన్నది అర్థం కాక మిమ్మల్ని పిలిచాను, మీరు నా కంపెనీలో ఎన్నోమార్లు క్లిష్టమైన కేసులు చేధించారు, ఎలాగైనా దయచేసి ఆ దొంగని పట్టుకొని డబ్బు రికవరీ చేయాలి, ఎందుకంటే పాపం మా ఆఫీస్ స్టాప్ జీతాల కోసం, పండుగ బోనస్ ల కోసం ఎంతో ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 'please solve the case immediately, 'అంటూ ఉద్వేగంగా డిటెక్టివ్ శ్రీధర్ గారికి వివరించారు పాండు రంగారావు గారు.


సార్! ఇంత పకడ్బందీగా 'ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ తో 'ఉన్న కాంపౌండ్ వాల్ దాటుకుని, దొంగ లోపలికి వచ్చి, మీ పాస్వర్డ్ తెలుసుకొని మీ లాకర్ ఓపెన్ చేయడం అసాధ్యం!! ఇంకా చెప్పాలంటే మీకు సెక్యూరిటీ గార్డు ఉన్నారు, రెండు పెద్ద 'బుల్ డాగ్స్ ', ఇన్ని దాటుకుని దొంగలు లోపటికి ప్రవేశించడం దుర్లభం! నా ఉద్దేశం ఏమంటే, ఇది ఇంటి లోపల ఎప్పటి నుంచో గమనిస్తున్న మీ బంధువులు కావచ్చు, మీ నౌకర్లు కావచ్చు , ఏది ఏమైనా నేను అందరినీ విచారించాలి! రేపు ప్రొద్దున 10 గంటల కల్లా ఇంట్లో ఉన్న అందరిని ఒక్కొక్కరుగా విచారిస్తాం! ముఖ్యంగా నౌకర్లను, దయచేసి ఈ రెండు రోజులు ఎవ్వరినీ బయటకు పంపించవద్దు, మరీ అవసరం అయితేనే తప్ప, ఈ లోపల మా అసిస్టెంట్ శేఖర్ అందరి మీద నిఘ ఉంచుతాడు, పరిసరాలను భూతద్దంతో పరిశీలిస్తాడు, సార్ !మీరు నిశ్చింతగా ఉండండి , నా అనుభవం అంతా రంగరించి ఈ కేసును చేధిస్తాను , ఒకసారి నాకు మీ బెడ్ రూమ్ ని చూపించగలరా! అని అడిగేసరికి రండి చూపిస్తాను, అంటూ పాండురంగారావు గారు, శ్రీధర్ గారు, అసిస్టెంట్ శేఖర్ ముగ్గురూ కలిసి ఆయన 'భూతలస్వర్గంలా 'ఉన్న బెడ్ రూమ్ లోకి తీసుకువెళ్లి చూపించారు.


అన్నీ కూలంకుషంగా పరిశీలిస్తున్న శ్రీధర్ గారు, శేఖర్ ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో, ఓకే సార్! మేము రేపు మళ్ళీ వస్తాం, అందర్నీ రెడీ గా ఉండమని చెప్పండి , అంటూ సెలవు తీసుకుని వెళ్లిపోయారు.


.. డిటెక్టివ్ శ్రీధర్ గారు, తన ఆఫీసులో శేఖర్ తో మాట్లాడుతూ, ఇలాంటి కేసు నాకు ఎప్పుడూ ఎదురవ్వలేదు, ఒకవేళ పాండురంగారావు గారి కుటుంబ సభ్యులను అడుగుదాం అన్నా, అందరూ 'హై క్లాస్ మనుషులే, 'ఇకపోతే నలుగురు నౌకర్లు గత 15 ఏళ్లుగా పని చేస్తున్నారు, అందులో ఒక్కడు మాత్రమే వచ్చే సంవత్సరం అయింది, అంటూ తల పట్టుకొని ఆలోచిస్తూ, మంచి కాఫీ పట్రా శేఖర్ !బుర్ర పగిలిపోతుంది, అని ఆర్డర్ చేశారు.


శేఖర్ కూడా అత్యంత ఉత్సాహంగా కాఫీ తెచ్చి, తను తాగుతూ సార్ !నేను అన్ని విధాల పరిశీలించాను, అవుట్ సైడర్స్ ఎవరూ రాలేదు,

ఇది ఇంట్లో వాళ్ళ పని, " , ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు, " అన్న సామెతను, మీరు దొంగలను పట్టుకుని, ఆ సామెత అబద్ధమని రుజువు చేయాలి!, సార్ నాకు ఎందుకో ఏదో ఒక చిన్న క్లూ మనకి దొరకలేదు, అన్న భావన నాకు నచ్చడం లేదు, రేపు మరోమారు పాండురంగారావు గారిని పర్మిషన్ అడగండి , బెడ్ రూమ్ చెక్ చేయాలని, నాకైతే ఏదో ఒక క్లూ మన కంట పడకుండా ఉన్నది, అనిపిస్తుంది ముఖ్యంగా 'గోద్రెజ్ సేఫ్ మరోమారు క్షుణ్ణంగా పరిశీలించాలి, అనేసరికి ఓకే శేఖర్ !నీ పనిలో నువ్వుండు , ఇది మన పరువు ప్రతిష్ట లకు సంబంధించిన విషయం. రేపు సరిగ్గా 10 గంటలకల్లా పాండురంగారావు గారి ఇంటికి వచ్చేయ్! అంటూ వెళ్లిపోయారు శ్రీధర్ గారు.


.. ఆ మర్నాడు మరో సారి డిటెక్టివ్ శ్రీధర్ గారు , శేఖరు కలిసి పాండు రంగారావు గారి 'మాస్టర్ బెడ్ రూమ్ 'అనేక కోణాల్లో ఫోటోలు తీసి , గోద్రెజ్ సేఫ్ నీ కూడా లోపల బయట ఫోటోలు తీసి, డిటెక్టివ్ శ్రీధర్ గారు ఇంటిలోని సభ్యులందరినీ ఒక్కొక్కరుగా పిలిచి దొంగతనం ఎలా జరిగింది? ఆ సమయంలో మీరు ఏం చేస్తున్నారు? అన్న వివరాలు మొదట పాండు రంగారావు గారి భార్యని, కొడుకును, కూతురిని అడిగి తెలుసుకున్నారు. వారి వల్ల కూడా ఏ ఆధారాలు లభించక, ఇంట్లోనే ఉన్న నలుగురు నౌకర్లను ఒక్కొక్కరుగా పిలిచారు . మొదట ముసలివాడైన 'జోగయ్య 'నుంచి వివరాలు సేకరించారు, శ్రీధర్ గారు అడిగిన ప్రశ్నలకు 'సార్ నాకు ఏ పాపం తెలియదు! నేను 15 ఏళ్లుగా ఈ ఇంట్లోనే పనిచేస్తున్నాను, మొక్కలకు నీళ్లు పోయడం , కార్లు తుడవడం, లాన్ కట్ చేయడం, నా పనులు తప్ప ఇతర విషయాల్లో జోక్యం చేసుకోను, అంటూ కళ్ళనీళ్ళు తుడుచుకుoటున్న, జోగయ్య ను సరే, అని పంపించారు, రెండోవాడు రాము, 10 ఏళ్ళ నుండి పాండురంగారావు గారి కుటుంబాన్ని ఎక్కడికి వెళ్లాలన్నా , ఆయనే 'డ్రైవర్ గా పని చేస్తాడు, సార్ , నేను ఎన్నడు ఇంటిలో కి వెళ్ళలేదు !ఎందుకంటే నా డ్యూటీ అంతా కారు దగ్గర 'కార్ షెడ్ లోనే 'ఉంటుంది, అక్కడికే నాకు భోజనం పంపిస్తారు, బంగారం లాంటి మనసున్న అయ్యగారికి నేను అన్యాయం చేస్తాను సార్, అంటూ బాధతో చెప్పేసరికి డిటెక్టివ్ శ్రీధర్ గారు కూడా సరే నువ్వు వెళ్ళి పని చేసుకో, అంటూ పంపించేశారు.


ఇక మూడో నౌకరు వంటమనిషి, శ్రీధర్ గారు పిలిచిన వెంటనే వంట ఇంటిలో నుంచి తన ముఖం , చేతులు తుడుచుకుంటూ నడివయస్సులో ఉన్న 'కనకమ్మ 'వచ్చి చెప్పండి అయ్యా !వినయంగా అడిగేసరికి శ్రీధర్ గారు వేసిన ప్రశ్నలకు నాకేం తెలీదు , అయ్యా నా బిడ్డలు, నా భర్త నన్ను వదిలి వెళ్ళిపోయిన రోజు నుంచి అయ్యగారు చేరదీసి, నిలువనీడ నిచ్చారు , వారి కుటుంబానికి నేనెంతో రుణపడి ఉన్నాను , కనుక దొంగతనం ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు, అంటూ ఒక్కసారి ఏడ్చేసరికి, పోనీలే అమ్మా!, పోయి పని చేసుకో, అని పంపించేశారు. ఆ తర్వాత ఆ ఇంట్లో ఆఖరి నౌకరు 'నాగయ్య ' కొంచెం బలిష్టంగా ఉంటాడు, నాగయ్య పని, వంట పనిలో కనకమ్మ సాయం చేస్తు, బయటనుంచి కూరగాయలు, వంట సామాగ్రి , నెలవారి సామాన్లు, మార్కెట్ నుంచి తేవడం, వంట చేసిన తర్వాత మొత్తం శుభ్రం చేయడం , అంట్ల గిన్నెలు , కంచాలు ఎప్పటికప్పుడు తళతళా మెరిసే టట్లు చేయడం వంటివి, శ్రీధర్ గారు పిలిచిన వెంటనే తన బనియన్ సర్దుకుంటూ వచ్చి నమస్కారమండి !అంటూ చేతులు కట్టుకుని నిలబడ్డాడు, ఏమోయ్ !మీ ఇంట్లో దొంగతనం జరిగింది నీకు తెలుసా? నాకు నిజం చెప్పకపోతే 'పదేళ్ల జైలు శిక్ష ' అనుభవిస్తారు.


ఒకవేళ నిజం చెప్తే ఆ డబ్బు తెచ్చి ఇచ్చి, పాండు రంగారావు గారి 'క్షమాభిక్షకు ', పాత్రులవుతారు, అంటూ గట్టిగా అడిగేసరికి, నాకేం తెలీదు అయ్యా! నాకు ఈ ఉద్యోగం ఇచ్చిన అయ్యగారి ఉప్పు తిని నేను నా భార్య, ఇద్దరు పిల్లలు బతుకుతున్నాము, అంటూ మొహం దీనంగా పెట్టేసరికి , సరే మీ అందరికీ రేపటి వరకు టైం ఇస్తున్నాను! నిజం చెప్పి బయట పడతారో, లేదా నేను నిజం కక్కించి, అసలైన దొంగను చావగొట్టి జైలుకు పంపుతాను, ఈరోజు నుంచి రెండు రోజులపాటు మీ నలుగురు ఈ ఇంటి గుమ్మం దాటకూడదు, ఈ లోపల అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలి! అంటూ నిరుత్సాహంగా లేచి, సార్ !మాకు రెండు రోజుల వ్యవధి ఇవ్వండి, అసలైన దొంగ ఈ ఇంటిలోని వాడే, మీకు నిజానిజాలు సాక్షాలతో సహా మేము పరిశోధించి మీ ముందుంచుతాను, ఇక సెలవు ఇప్పించండి అంటూ పాండు రంగారావు గారికి షేక్ హ్యాండిచ్చి, వెళ్లిపోయారు శ్రీధర్ గారు శేఖర్.


శ్రీధర్ గారు ఆరోజు పోలీస్స్టేషన్కు వెళ్లి వాళ్ళు రాసిన' Fir 'మరోమారు పరిశీలించారు,

అందులో ఏముందంటే! పాండు రంగారావు గారు తన కంపెనీ స్టాప్ కోసం' సంక్రాంతి పండగలు 'దగ్గర పడుతున్నందున వల్ల' స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కంప్లీట్ 'అయినందువలన వచ్చిన డబ్బు' 20 లక్షల రూపాయలు' బ్యాంకు నుంచి డ్రా చేశారు, ఎందుకంటే వరుసగా నాలుగైదు రోజులు బ్యాంకు సెలవులు కాబట్టి, తన ఆఫీసు సిబ్బంది ఇబ్బంది పడకూడదు అన్న భావంతో, డబ్బు తెచ్చి ఎంతో సురక్షితం అని తన 'గోద్రెజ్ సేఫ్ లాకర్ 'లో పెట్టి, ఆ మర్నాడు ఆఫీస్ స్టాఫ్ కి అందజేద్దామన్న సదుద్దేశంతో, తన ఇంట్లోనే దాచారు. ఆ రాత్రి అందరూ పడుకున్నాక ఏమైందో తెలియదు? గానీ సేఫ్ లో ఉన్న కుటుంబం యొక్క' బంగారు నగలు' అన్ని చెక్కుచెదరకుండా ఉన్నాయి, కానీ 20 లక్షల నగదు మాయమైంది, మేము అన్ని విధాల దర్యాప్తు చేస్తున్నాము. అన్న వివరాలు fir లో పొందుపరచబడ్డాయి.

' డిటెక్టివ్ శ్రీధర్ గారు' కాసేపు పోలీస్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడి , ఒక నిర్ణయానికి వచ్చి తన ఆఫీస్ కి వచ్చారు.


అప్పటికే 'అసిస్టెంట్ శేఖర్ 'టేబుల్ మీద కూర్చుని, పాండురంగారావు గారి 'మాస్టర్ బెడ్ రూమ్' లో తీసిన ఫోటోలు అన్ని కూలంకుషంగా పరిశీలించ సాగాడు. ఎక్కడ ఎలాంటి క్లూ దొరకక సతమతమవుతూ, ఉన్న సమయంలో, శ్రీధర్ గారు రాగానే లేచి నిలబడి 'సెల్యూట్ చేస్తూ, గుడ్ మార్నింగ్ సార్! రండి మీకు మంచి వేడి కాఫీ ఇస్తూ, కూర్చోండి అంటూ పొగలు కక్కుతున్న వేడి కాఫీ ఆయన ముందు ఉంచాడు, . హాయ్ గుడ్ మార్నింగ్ ఎంతవరకు వచ్చింది, ? నీ పరిశోధన, నేను పోలీస్ స్టేషన్ కి వెళ్లి వాళ్ల రిపోర్టు కూడా చూశాను , ఎక్కడ ఎలాంటి ఆధారాలు కనిపించలేదు, అసలు ఆ ఇంటి దొంగ ఇంత పకడ్బందీగా ఎలా ప్లాన్ చేశాడు? ఇంతమంది వెతుకుతున్నా చిన్న ఆధారం కూడా కనబడట్లేదు, అంటూ తలపట్టుకుని మాట్లాడసాగాడు శ్రీధర్.

సార్! మనం ఎక్కడో 'పప్పులో కాలేస్తు ఉన్నాము', మనం అనుకున్నంత ఆ ఇంటి దొంగ తెలివైన వాడేమీ కాదు, ఎక్కడో అక్కడ ఆధారం జరుగుతుందేమోనని, ఈ ఫోటోలన్నీ చూస్తున్నాను, సార్, ఫోటో మరొకమారు చూడండి, 'గోద్రెజ్ సేఫ్ లాకర్' లోపల కూడా ఫోటో తీశాను, అందులో అన్ని బాగానే ఉన్నాయి గాని , డోరు తీసుకునే దగ్గర ఉన్న బందీల మధ్య , ఒక చిన్న 'పింక్ కలర్ 'గీతలా కనబడుతున్నది, ఆ మరక' పెయింటింగ్ వేస్తున్నప్పుడు అయినా పడి ఉండవచ్చు'! లేదా ఏదైనా కాగితం ముక్క అయి ఉండవచ్చు, మీరు కూడా చూడండి! అని ఆ ఫోటో ని శ్రీధర్ గారికి చూపించాడు శేఖర్. ఆయన కూడా ఎం తో నిశితంగా పరిశీలించిన మీదట, శేఖర్ !ఒకసారి పాండురంగారావు గారి కి ఫోన్ చెయ్, వెంటనే పర్మిషన్ తీసుకో, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి !అని చెప్పగానే ఎస్ సార్, అంటూ ఫోన్ చేసి చెప్పగానే, వెంటనే పాండు రంగారావు గారు మీరు ఎప్పుడైనా నా ఇంటికి వెళ్ళవచ్చు! కాస్త తొందరగా కేసు సాల్వ్ చేయండి , అంటూ ఫోన్ పెట్టేసారు.


'డిటెక్టివ్ లిద్దరూ' హుటాహుటిన తమ జీపులో ఇంటికి వచ్చేసరికల్లా, పాండు రంగారావు గారి భార్య 'లక్ష్మీ గారు 'వారిని సాదరంగా ఆహ్వానించి, చల్లని కూల్ డ్రింక్ ఇచ్చి కూర్చోగానే, శ్రీధర్ గారు మాట్లాడుతూ 'నమస్తే మేడమ్, సార్ పర్మిషన్ ఇచ్చారు, మీ మీ బెడ్ రూమ్ మరోసారి చెక్ చేయాలి, మీరు కూడా రండి! అని అనగానే పదండి , అంటూ మేడ మీద ఉన్న మాస్టర్ బెడ్ రూం లోకి తీసుకువెళ్ళారు.


'మేడం మీ దగ్గర ఉన్న సేఫ్ తాళాలతో ఓపెన్ చేసి, దానిలో ఉన్న వస్తువులను తీసి జాగ్రత్త పరిచి , మాకు చూపించండి !ఒక చిన్న అనుమానం ఉన్నది, ఏమీ అనుకోవద్దు ప్లీజ్! అని అనగానే' అయ్యో, అయ్యో తప్పకుండా తీస్తాను అండి, మీరు ఇంతగా అడగాలా! అది మా విధి 'అంటూ తన బొడ్డు దగ్గర కుచ్చెళ్ళ మీదగా 'బంగారంతో లాకెట్ తో వేలాడుతు ఉన్న ఒక 'చిన్న తాళం గుత్తి తీసి' సేఫ్ దగ్గరకు వచ్చి నాలుగు నెంబర్లు' కీబోర్డు 'మీద టైప్ చేసి తాళం తిప్పగానే, 'డిజిటల్ లాకర్' చిన్న శబ్దంతో ఓపెన్ అయ్యింది, అందులో బంగారు ఆభరణాలు ఉన్న 'ఆరు బాక్స్ 'లను తీసి వేరే చోట దాచారు లక్ష్మీ గారు.

' శేఖర్ ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించండి, అంటూ చెప్పగానే, శేఖర్ ఆతృతగా మొత్తం 'గోద్రెజ్ సేఫ్ �� �� ని' వెతకసాగాడు, అదే ఆతృతతో శ్రీధర్ గారు లక్ష్మిగారు కూడా ఆశ్చర్యంగా చూడసాగారు.


శేఖర్ 'క్యాష్ బాక్స్ 'అంతా కూలంకషంగా పరిశీలిస్తూ, సార్ ఇదిగో చూడండి !అంటూ డోర్ ఓపెన్ చేసి, దాని బందీల దగ్గర ఒక చిన్న 'పింక్ కలర్ గీతలా' ఉన్న దగ్గర 'భూతద్దం 'పెట్టి చూపిస్తూ, సార్ !ఇదే ఫోటో లో కనబడింది, మీరు కూడా పరిశీలించండి , అంటూ భూతద్దం శ్రీధర్ గారికి ఇచ్చాడు, "వెరీగుడ్ శేఖర్" ఏదో మంచి క్లూ లా ఉంది, నీ దగ్గర ఉన్న చిన్న P తో దాని పైకి లాగు, అని చెప్పగానే, శేఖర్ ఎంతో జాగ్రత్తగా ఎక్కడ గీతలు పడకుండా, ఆ పింక్ కలర్ మరకను గో కాడు, అలా రెండు మూడు సార్లు చేసేసరికి ఒక 'చిన్న లేత గులాబీ రంగు చేతి వేలి గోరు ముక్క 'కింద పడింది, వెంటనే శేఖర్ అతి జాగ్రత్తగా చిన్న ప్లాస్టిక్ కవర్లో ఆ గోరు ముక్కను వేసి, ఇదే సార్ , అంటూ శ్రీధర్ గారికి చూపించాడు.


'డిటెక్టివ్ శ్రీధర్ గారు 'ఆ ప్లాస్టిక్ సంచిలో ఉన్న' చిన్న గోరు 'ను ల్యాబ్ కు వెళ్లి టెస్ట్ చేయించగా, ఇది ఒక 'ఆడ మనిషి చేతి వేలు ' గోరు అని నిర్ధారణ జరిగాక , అది కూడా లేత గులాబీ రంగు నెయిల్ పాలిష్ తో ఉన్నది, కనుక శ్రీధర్ గారు ఎగిరి గంతేసారు, శేఖర్ ఈ గోరు ముక్క ఎవరిది అనేది మనం నిర్ధారించాలి, ముఖ్యంగా డాక్టర్ ఎనాలసిస్ బట్టి 40, 45 సంవత్సరాల వయస్సు గల ఆడవారిది అని చెప్పారు, కనుక పాండురంగారావు గారి ఇంట్లో వారి భార్య వయసు 30, 35 మించదు, వారి అమ్మాయిది 20 ఏళ్ళ లోపే, కనుక వారిది కాదని తెలుసు, ఇకపోతే ఒకే ఒక్క ఆడ మనిషి ఆ ఇంటి వంట ఆవిడ 'కనకమ్మ 'వయసు సరిగ్గా సరిపోతుంది పద వెళ్లి మనం విచారిద్దాం, అంటూ సత్వరం బయలుదేరి పాండురంగారావు గారి ఇంటికి వచ్చారు.


ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు కూడా రంగ ప్రవేశం చేశారు, శ్రీధర్ గారు పోలీసులతో కలిసి , ఒకేసారి ఇంట్లోకి ప్రవేశించడం, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ముందుగా కనకమ్మ ని పిలిపించారు, ఏమ్మా !ఒకసారి వచ్చి నీ చేతి వేళ్లు చూపించు, అంటూ శ్రీధర్ గారు అనేసరికి ఎంతో అమాయకంగా, అయోమయంగా ఏమిటయ్యా ఇది? నాతో మీకేం పని, నేను ఏ పాపము ఎరుగను అని మొత్తుకుంటున్నా నన్ను అడుగుతున్నారు! నాకు జీవితాన్ని ఇచ్చిన అయ్యగారి ఇంట్లో నేను చేసిన పాపం ఏంటి ?అంటూ ఏడుస్తూ తన చేతి వేళ్ళను చూపించింది కనకమ్మ, అదే క్షణంలో శేఖర్ ముందుకు వచ్చి ఆమె చేతి వేళ్ళు పట్టుకుని పరీక్షించి, సార్, నా అనుమానం నిజమైంది, ! ఈమె చూపుడు వేలు గోరు, అదే రంగులో ది కత్తిరించ బడింది, అని అనగానే, కనకమ్మ నువ్వు అన్ని వేళ్ళ గోళ్ళు కత్తిరించకుండా, ఒక్క వేలిదే ఎందుకు కత్తిరించావు, ? అని అడగగానే ఆశ్చర్యంగా తన గోళ్ళు చూసుకుంటూ , నాకేం తెలీదు బాబయ్యా! అది ఎప్పుడు విరిగి పడిందో? దేవుడు సాక్షిగా చెప్తున్నాను అంటూ వలవలా ఏడ్చింది.


పాండురంగారావు గారు ఆయన కుటుంబం ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు, ఏంటండీ ఇది? చదువురాని వంటమనిషి నా 'పాస్వర్డ్ 'తెలుసుకుని సేఫ్ తెరిచి డబ్బులు దొంగలించినదా, ఇది అసాధ్యం! అని పాండురంగారావు గారు అన్న వెంటనే, శ్రీధర్ గారు కల్పించుకుని ఇది ఒక అనుమానం సార్! ఇంకా దీనిమీద రీసెర్చ్ చేయాలి వెళ్లి వస్తాం, అంటూ అందరూ వెళ్ళిపోయారు.


అదే రోజున, శేఖర్ కనకమ్మ ఇంటిదగ్గర రాత్రి ఒక గంట నిరీక్షించి చూశాడు, ఎలాంటి అనుమానమైన కదలికలు లేవు , నడి వయస్కురాలు అయిన ఆమె ఇంటిదగ్గర ఎవరూ లేరు , అన్ని విధాల ఎంక్వైరీ చేసిన ఎలాంటి అనుమానం రాలేదు, ఇదే విషయం శ్రీధర్ గారికి చెప్తు, సార్! నిన్నటి నుంచి, పని మనుషులను ఇంటికి పంపించారు కదా, నేను ఈరోజు కనకమ్మ ఇంటిదగ్గర నిఘు వేశాను, ఎలాంటి క్లూ దొరకలేదు, కనకమ్మ ఎప్పటిలాగానే తన వంట తన చేసుకుని సాదాసీదాగా ఉంది, ఆవిడ మీద ఉన్న అనుమానం నిజం కాదని , దొంగ మరెవరో !అని నిర్ధారణ చేసుకున్నాను, అని చెప్పగానే శ్రీధర్ గారు ఆలోచిస్తూ, మరొక రోజు నాగయ్య ఇంటి దగ్గర మారువేషంలో ఒక రోజంతా నిఘు వెయ్యి, నాకు అతని మీద అనుమానం ఉంది అని చెప్పి వెళ్లిపోయారు శ్రీధర్ గారు.


ఆ మర్నాడు మారువేషంలో శేఖర్ నాగయ్య ఇంటి దగ్గర తచ్చాడుతూ, అటు పక్కగా పోయేవాళ్ల నీ అన్ని విషయాలు అడుగుతూ, బాబు నాగయ్య, నా దూరపు చుట్టం, నేను పై ఊరు నుంచి వచ్చాను, వాడు నాతో మాట్లాడటం లేదు, వాడు నాకు డబ్బులు ఇవ్వాలి, ఆ పక్కనే ఉన్న ఇంటి వాళ్లని అడిగాడు, వాళ్లు కూడా మాట్లాడుతూ 'ఓరి బాబు, !నాగయ్య ఏంటయ్యా, ఒక పెద్ద ఇంట్లో పనికి కుదిరాడు, రోజు పని చేసుకుని వచ్చి విపరీతంగా తాగి , పెళ్ళాన్ని బిడ్డల్ని కొడుతూ ఉండడం , రోజు ఉన్న నాటకమే మా వీధిలో నాగయ్య ఆగడాలు భరించలేకపోతున్నాము, అన్న మాటలు ఇంటి చుట్టుపక్కల అందరూ చెప్పగా, రెండు రోజుల పాటు నాగయ్య ప్రతి కదలిక గమనించసాగాడు శేఖర్.

ఆ మర్నాడు కూడా శేఖర్ కొన్ని వింత విషయాలు కనుక్కొన్నాడు, నాగయ్య ప్రతిరోజు ఎక్కడో ఒక సారా కొట్టు లో కూర్చుని మందు తాగే అలవాటు ఉండేది, ఒకప్పుడు కానీ ఇప్పుడు ఒక కాస్ట్లీ బార్ కి వెళ్లి, ఎంతో దర్జాగా వివిధ రకాల కాస్ట్లీ మందు తాగుతూ, ఇంటికి టాక్సీలో వచ్చి , పెళ్ళాం పిల్లలకు రోజుకు ఒక పెద్ద హోటల్ నుంచి 'చికెన్ బిర్యానీ లు , పన్నీర్ కూరలు', ఎన్నో రకాల తినుబండారాలు ఇంటికి తేవడం, మరొక విషయం ఏమిటంటే డిగ్రీ చదువుతున్న కొడుక్కి, ఒక 'స్టైలిష్ బుల్లెట్ బైక్ ఆర్డర్' చేయడం వంటి వన్నీ కూలంకుషంగా పరిశీలిస్తూ, ఒక సాధారణ వ్యక్తి, జీతంతో నెల గడవడమే కష్టమైన కాలంలో , ఇలాంటి విలాసవంతమైన జీవితం గడపడం అది కూడా గత వారం రోజుల నుంచి మొదలైంది,


శేఖర్ ఇవన్నీ విషయాలు రూఢి చేసుకుంటూ, పక్కా సమాచారంతో డిటెక్టివ్ శ్రీధర్ గారికి స్వయంగా తెలియజేశాడు అసిస్టెంట్ శేఖర్.


'శ్రీధర్ గారు అన్ని విషయాలు పరిశీలించిన మీదట, పాండు రంగారావు గారి పర్మిషన్ తీసుకుని , పోలీసులకు సమాచారం అందించారు. వెనువెంటనే పోలీస్ వారు వచ్చి నాగయ్య ని అరెస్ట్ చేసి తమదైన శైలిలో 'నరనరాలు నొప్పి పుట్టేలా గొడ్డు ని బాదినట్టు బాది తే, 'అసలు విషయాలు బయటపడ్డాయి.


శ్రీధర్ గారు, ఆరోజు పాండు రంగారావు గారి ఇంట్లో దొంగతనం ఎలా జరిగిందో? ఒక్కొక్క సీను, సినిమా కథలా వివరించ సాగారు, సార్ మొట్ట మొదట మీరు' 20 లక్షలు డబ్బు' పట్టుకు రావడం, మీరు కారులోంచి దిగి క్యాష్ బ్యాగు పట్టుకుని ఇంట్లోకి రావడం, నాగయ్య చూశాడు ఎందుకంటే 'క్యాష్ బ్యాక్ జిప్ 'సరిగ్గా వేయకపోవడం వల్ల, అక్కడి నుంచే వెళ్తున్న నాగయ్య త్వరగా త్వరగా వచ్చి మీ చేతిలోని బ్యాగ్ అందుకో బోయాడు, నౌకరి తరహాలో కానీ మీరు వద్దనీ వారించడం, అదే తొందరలో నాగయ్య కంట పడ్డాది క్యాష్ బ్యాగ్ లోని నోట్ల కట్టలు, అంతే అతనిలోని అత్యాస, దొంగతనం అనే వక్రబుద్ధి మొదలైంది, మీరు రాత్రి పడుకోబోయేముందు ఆ గదిని శుభ్రం చేయడానికి, వేరే నౌకరు లేక నాగయ్య శుభ్రపరుస్తు, మీ మాస్టర్ బెడ్ రూం కిటికీని కొంచెం గా తీసి, మీకు తెలియకుండా బయటకు వచ్చేశాడు. ఆ రాత్రి భోజనాలయ్యాక , మీరు ఆ డబ్బును 'గోద్రెజ్ సేఫ్ లాకర్లో నాలుగు నంబర్ల పాస్వర్డ్ పెట్టి' అందులో దాచడం, అన్నీ క్షుణ్నంగా గమనించాడు, ఎలాగంటే తన డ్యూటీ అయిపోయాక , ఇంటికి వెళ్ళి పోతున్నా , అని చెప్పి మీ మాస్టర్ బెడ్రూం పెరట్లో నుంచి కిటికీ లోంచి దూకి, మీ బెడ్ కింద చప్పుడు చేయకుండా పడుకున్నాడు, మీకు ఆ విషయాలు తెలియక,


రోజులాగే ప్రొద్దున అంతా కష్టపడిన మీ రు మగత నిద్రలో జారిపోయే సమయంలో అత్యంత చాకచక్యంగా 10 నిమిషాలలో చప్పుడు కాకుండా మీ 'గోద్రెజ్ సేఫ్ లాకర్' తెరిచి , అందులోని' 20 లక్షల రూపాయలను' తీసుకుని , అందులో ఉన్న నగలను ముట్టకుండా, మళ్లీ అదే రకంగా క్లోస్ చేసి చప్పుడు కాకుండా వచ్చిన కిటికీలోంచి బయటకు పారిపోయి, అదే పెరట్లో చిన్న మట్టి గోయ్యి తీసి, ఎవరికీ కనబడకుండా పెరట్లో లోనే పడుకొని, తెల్ల వారి ఏడు గంటలకల్లా మళ్లీ డ్యూటీ కి వచ్చేశాడు, ఆ తర్వాత రోజు లాగా అనుమానం రాకుండా డ్యూటీ చేసి ఇంటికి వెళ్ళిపోతు డబ్బులు తీసుకొని పోయాడు, పాండురంగారావుగారు, కుటుంబ సభ్యులు శ్రీధర్ గారు చెప్తున్న విషయాలు వింటూ, సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు, ఇది ఎంతో తెలివితేటలతో 'నాగయ్య చేసిన పని, మాకు చెమటలు పట్టించింది, అసలు దొంగ దొరికిన విధానం ఏమనగా !అంటూ ఏకబిగిన చెప్పసాగారు డిటెక్టివ్ శ్రీధర్ గారు.


సార్! దొంగతనం అనేది చేసేటప్పుడు దొంగ ఏదో విధమైన తనకు తెలియకుండానే ఒక ఆధారం వదులుతాడు, అది పట్టుకోలేని మేము , పోలీసులు ఎంతో శ్రమపడి చివరికి మా అందరి మతులు పోయేటట్టు అతి తెలివి తేటలు ప్రదర్శించాడు, కానీ ఇవన్నీ ముందే ఆలోచించిన తెలివైన దొంగ నాగయ్య, ఎందుకంటే మీ 'మాస్టర్ బెడ్ రూమ్ లో సేఫ్' తెరిచినప్పుడు, వంటమనిషి 'కనకమ్మ కిచెన్ లో వంట చేసేటప్పుడు, విరిగిపోయిన గోరు దొరికితే, అదే గోరు ముక్కను దాచి , తన ప్లాన్ లోని భాగంగా , ఒకవేళ పోలీసులుకు దొరికితే, అనుమానo అంతా వంటమనిషి కనకమ్మ మీదకి పోతుందన్న ధైర్యంతో, ఆమె చేతి వేలి గోరు ను 'గోద్రెజ్ సేఫ్ లాకర్ లో 'పెట్టేసాడు, అందుకే మేము కనకమ్మ ని అనుమానించి ప్రశ్నించే సరికి, నాగయ్య తన ప్లాన్ సఫలం అయినందుకు సంతోషిస్తూ, రోజు ఇంటి దగ్గర పండగ చేసుకుంటున్నాడు, కానీ ఒక్క విషయం మర్చిపోయాడు, దొంగతనం చేసే రోజు రాత్రి , త్వరగా అంట్లు తోముతూ, తన తన చేతులు శుభ్రంగా కడుక్కున్న, సమయం మించిపోతుంది అన్న తొందరలో, దొంగతనానికి పాల్పడ్డాడు, మేము ఎంతో పరిశీలించిన మీదట, కనకమ్మ చేతి వేలు గోరుతో పాటు , అదొక రకమైన అంట్లు తోమే సబ్బుల వాసన, అక్కడ అక్కడ ఆ సబ్బు యొక్క 'చిన్న చిన్న రేణువుల' మా అసిస్టెంట్ శేఖర్ గుర్తించి , వాటిని సేకరించి మా 'ఎనాలసిస్ ల్యాబ్ ' కి పంపాడు, ఆ రిపోర్టులు మా అనుమానాన్ని ధృవీకరించాయి, ఆ తర్వాత రెండు రోజులపాటు కనుకమ్మ ఇంటి దగ్గర, నాగయ్య ఇంటి దగ్గర మా శేఖర్ మారువేషంలో నిఘు వేశాడు.


మొదటి శేఖరు కనకమ్మ ఇంటిదగ్గర కాపలా కాసి, ఆవిడ రాకపోకలు గమనిస్తూ, ఏదో చాలీచాలని జీతంతో అష్టకష్టాలు పడుతూ, ఉన్నదాంట్లో పరులకు సహాయపడుతూ, ఆ కాలనీ లోనే మంచి పేరు ఉన్నది కావడం వలన, ఆమె మీద ఉన్న అనుమానాలు పటాపంచలై పోయాయి.


ఆ తర్వాత' నాగయ్య 'ఇంటి పరిసరాలు దగ్గర తచ్చాడుతూ, ఇరుగుపొరుగు వారిని సంప్రదిస్తూ, చాలా విషయాలు కనుక్కున్నాడు, అన్ని విధాల చెడు అలవాట్లతో ఆ వీధిలోనే చాలా చెడ్డ పేరు ఉన్నవాడు నాగయ్య, అకస్మాత్తుగా డబ్బు వచ్చేసరికి, ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోయి, ఒక జమీందారు లాగా మూడు రోజుల నుంచి చాలా విలాసంగా బతుకుతున్నాడు, అదే కోణంలో' డిటెక్టివ్ శేఖర్ 'అన్ని విషయాలు సేకరించి నాకు తెలియ జేశాడు, ఆ విధంగా పోలీసులు పరిశోధించి, నాగయ్య ను అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఇంటిలో సోదా చేయగా, మాసిన బట్టలు పెట్టె లోపల, ఉన్న ఒక అరలో" 19 లక్షలు "దాచాడు, ఈ మూడు రోజుల్లోనే' లక్ష రూపాయలు 'విలాసమైన జీవితానికి, వస్తువులకు, ఖర్చుపెట్టి ఆనందించ సాగాడు.


'పాండురంగారావు గారు' ఇది యాక్చువల్గా జరిగిన కథ, దీన్ని పరిశోధించడానికి చాలా యాతనలు, ఇటు పోలీసులు , మరోవైపు మేము మా తరహాలో పరిశోధించి , అసలు దొంగను పట్టుకున్నాము, ఇదిగో మిగిలిన "19 లక్షల డబ్బు" మీకు అందజేస్తున్నాను, అది కూడా పోలీస్ సూపర్డెంట్ గారి ఆధ్వర్యంలో, కనుక " "దేవుడు మంచివాళ్ళకు మంచే చేస్తాడు"! అన్న సామెత మీకు బాగా వర్తిస్తుంది, ఎందుకంటే 'సంక్రాంతి పండుగకు' తమ వద్ద పనిచేసే కార్మికులకు ఎలాంటి కష్టం రాకూడదని, ముందుగానే ఆలోచించి, వారికి సమయానికి డబ్బు అందజేస్తా మన్న సదుద్దేశం మీకు కలగడమే, ఇకపోతే ఆ వెధవ 'నాగయ్య 'పోలీస్స్టేషన్లో చిత్రహింసలు పెట్టిన తర్వాతే , అసలు నిజం బయట కక్కాడు, అని డిటెక్టివ్ శ్రీధర్ గారు చెప్పగానే , 'పాండు రంగారావగారు , ఆయన కుటుంబ సభ్యులు ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా, 'శ్రీధర్ గారు! రేపు సంక్రాంతి పండగ కాబట్టి, మా ఆఫీస్ కి వచ్చి, 'పోలీసు సూపరింటెండెంట్ గారితో' కలిసి మా ఆతిథ్యం స్వీకరించి, మీ చేతుల మీద గా మా స్టాఫ్ మొత్తానికి 'జీతాలు, బోనస్ లు పంచాలని, మిమ్మల్ని కోరుతున్నాను! అంటూ కళ్ళనీళ్ళు తుడుచుకుoటూ, డిటెక్టివ్ శ్రీధర్ గారికి , శేఖర్ కి, పోలీసు సూపరింటెండెంట్ వారికి మర్యాదపూర్వకంగా నమస్కరిస్తూ ఆహ్వానించారు.


ఆ మర్నాడు 'పాండురంగారావు గారి ఆఫీసు లో 'డిటెక్టివ్ శ్రీధర్ గారు, పోలీస్ సూపరిండెంట్ గారిని, ఉత్సాహవంతుడైన శేఖర్ ని సత్కరించి, వారి చేతుల మీదగా ఆఫీస్ స్టాఫ్ అందరికీ జీతాలు , బోనస్ లు ఇప్పించ గానే, పాండు రంగారావు గారి 'ఆఫీస్ స్టాఫ్ 'ఆనందంతో, కరతాళధ్వనులతో, తమ కృతజ్ఞత చాటుకున్నారు.

*******************

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం :

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.


51 views0 comments

Comments


bottom of page