top of page

చదవాలి జట్టుగా!

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ChadavaliJattuga, #చదవాలిజట్టుగా, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 57


Chadavali Jattuga - Somanna Gari Kavithalu Part 57 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 13/04/2025

చదవాలి జట్టుగా! - సోమన్న గారి కవితలు పార్ట్ 57 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


చదవాలి జట్టుగా!

----------------------------------------

పుస్తకాలు పట్టుకుని

ఆశయాలు పెట్టుకుని

చదవాలోయ్! చక్కగా

ఎదగాలోయ్! గొప్పగా


వెలిగించును మస్తకాలు

వాస్తవమే పుస్తకాలు

బాగా చదువుకుంటే

బాగుపడును జీవితాలు


సమూహంగా చదివితే

సత్ఫలితాలు ఎక్కువ

ఈ సత్యం తెలుసుకుని

పెంచుకొనుము మక్కువ


పుస్తకాలు విలువైనవి

విజ్ఞానం పంచునవి

హస్త భూషణము నేస్తం!

తెలియజేయును సమస్తం!











పిల్లలుంటే గృహములు

----------------------------------------

కిలకిల నవ్వే పిల్లలు

మిలమిల మెరిసే తారలు

తళతళలాడే సరములు

ఇంటికి వారే వెలుగులు


మోసం ఎరుగని బాలలు

మన దేశ వృద్ధికి బాటలు

రేపటి భారత పౌరులు

మనసున్న మగధీరులు


గలగల పారే యేరులు

సందడి చేసే పిల్లలు

అమ్మానాన్నల ఆస్తులు

అందరికిలలో దోస్తులు


పిల్లలుంటే గృహములు

సిరిమల్లెల సువాసనలు

వారుంటే ఆనందము

హృదయాల్లో ఆహ్లాదము












మేలి ముత్యాలు

----------------------------------------

స్నేహితులకు ద్రోహము

ఆశ్రితులకు మోసము

ఎన్నడు చేయరాదు

ఆ తలంపు కూడదు


ఇతరులతో కలహము

అనునిత్యం వైరము

కాదు కాదు మంచిది

పోగొట్టును శాంతము


దుష్టులతో నెయ్యము

పెద్దలతో కయ్యము

హరిస్తుంది నెమ్మది

అనుచితమే కాదది


మితిమీరిన గర్వము

చేయునోయి పతనము

విలువైనది వినయము

మనిషికి ఆభరణము












అభిలాష

----------------------------------------

మొక్కల్లా ఎదుగుతాం

చుక్కల్లా వెలుగుతాం

మంచి మంచి పనులు చేసి

మహనీయులమవుతాం


మువ్వల్లా రవళిస్తాం

పువ్వుల్లా వికసిస్తాం

మితిలేని మోదంతో

గువ్వల్లా విహరిస్తాం


గురువుల్లా నినదిస్తాం

యేరుల్లా ప్రవహిస్తాం

దేశాభివృద్ధి కోసం

వీరుల్లా పనిచేస్తాం


చదువులెన్నో చదువుతాం

సంస్కారం చాటుతాం

మహాత్ముల అడుగుల్లో

ముందడుగు వేసేస్తాం


క్షమాగుణము చాటుతాం

ప్రేమపూలు రువ్వుతాం

వసుధైక కుటుంబముకై

అహర్నిశలు శ్రమిస్తాం


కలసిమెలసి బ్రతుకుతాం

చెలిమితోడ మెలుగుతాం

దేశ సమైక్యత కొరకు

చేయి చేయి కలుపుతాం












సత్యమేవ జయతే!

----------------------------------------

బహు గొప్పది సత్యము

నిలుస్తుంది నిత్యము

ఆయుస్సు తక్కువే

నిలువదోయ్! అబద్ధము


తేనె పూసిన కత్తి

పరికింప అబద్ధము

కొరుగుతుందోయ్! నెత్తి

చేస్తుంది నాశనము


శృతిమించిన కల్లలు

చివరికి చితిమంటలు

దూరంగా ఉంటే

ఎంతైనా క్షేమము


నష్టం వాటిల్లినా

పలకాలోయ్! సత్యము

కష్టం ఎదురైనా

వీడొద్దోయ్! సత్యము


జయిస్తుంది సత్యము

ఎప్పటికైనా మహిని

మరువకు ఈ సత్యము

విశ్వసించుము మదిని


-గద్వాల సోమన్న


Comments


bottom of page