top of page
Writer's pictureBVD Prasada Rao

చైతు బాబూ!


'Chaithu Babu' written by BVD Prasada Rao

రచన : బివిడి ప్రసాదరావు

"చైతు బాబూ!" అంది అమ్మ.

రాత్రి ఎనిమిది దాటింది. అప్పుడే ఇంటికి వచ్చాను.

నా కోసమే అమ్మ గుమ్మంలో వేచి ఉందని నేను గుర్తించాను.

"ఆలస్యమయ్యింది. ఏమమ్మా!" అడిగింది అమ్మ.

ఏమీ చెప్పలేదు. నా గదిలోకి వెళ్లిపోయాను.

తనకి అతి ఆపేక్ష ఐతే, అమ్మ నన్ను 'చైతు బాబూ' అంటుంది.

నా పేరు చైత్రమ్. చిత్తా నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న చైత్రమాసాన నేను పుట్టానని కోరి నాకీ

పేరు పెట్టింది అమ్మ. నాన్న నా చిన్నప్పుడే పోయారు గుండె పోటుతో. నేను ఏకైక సంతానంగా

పెరిగాను. అమ్మ పెంపకం నాకు వన్నెనిచ్చింది. నేను యంబిఏ చదవగలిగాను. బ్యాంక్

మేనేజర్ ఉద్యోగినయ్యాను.

"కాఫీ తాగు" అంటూ అమ్మ గది లోకి వచ్చింది - కాఫీ కప్పుతో. నేను ఆ కప్పుని పుచ్చుకున్నాను.

"ఏమమ్మా! ఇంకా రిప్రెష్ కాలేదు" అడిగింది అమ్మ.

అమ్మ ఏదీ సూటిగా అడగదు. తొలుత నుండి నన్ను ఇబ్బంది పెట్టేది ఏదీ అమ్మ చేపట్టేదేలేదు.

అందుకే అమ్మని నేను నిరుత్సాహపరచను. అలాగే హైరానా పెట్టను.

"అమ్మా!" అన్నాను. అమ్మకి 'మమ్మీ' అంటే అఇష్టం.

నేను చెప్పేది ఆలకించాలని అనుకున్నట్టు అమ్మ నన్ను చూస్తుంది.

"విషయం ఉంది. చెప్తాను. ఒక పావు గంట టైం ఇవ్వు. పద, నేను నీ వద్దకే వస్తాను" అని చెప్పాను.

అమ్మ వెళ్లిపోయింది. నేను కాఫీ తాగేసాను.

రిప్రెషయ్యాను. గదిలో ఫేన్ ఆన్ చేసాను. మంచం మీద కూర్చున్నాను.

నాకు పెళ్లి కుదిరింది - వారం క్రితం.

నాకు పెళ్లీడు మించపోతుందని అమ్మ తెగ నొచ్చుకునేది. నిజమే! నాకు ఇప్పుడు 29.

కానీ నా యోచన వేరు. నా పెళ్లితో ఇంటికి వచ్చే ఆమె, అమ్మకి 'సౌకర్యవతి' కాగలదా, లేదా

అన్నదే నా దిగులు. అమ్మకి చెప్పినా 'సర్దుకుపోతే పోలే' అనేసేది. అమ్మలా నేను తేలిగ్గా

తీసుకోలేక పోయాను. అందుకే నేను నా పెళ్లిని వాయిదాలు వేసుకుంటూ నెట్టుకు వచ్చాను

ఇన్నాళ్లు.

చిరవరాఖరికి లాభం లేక పోయింది. అమ్మ గట్టిగానే పట్టు పట్టింది ఆ మధ్య మొదలు. దాంతో

తగ్గాను. అమ్మ తెలిసినవారి ద్వారా పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టింది.

ఈ మధ్య వచ్చిన ఒక సంబంధం కుదిరింది. మాటలయ్యాయి. పెళ్లి కార్యక్రమాలు త్వరలో

మొదలవ్వబోతున్నాయి. ఈ వారం దినాలు మంచివి కావట.

అమ్మ దగ్గు వినిపిస్తుంది. తెములుకున్నాను. లేచాను. ఫేన్ ఆఫ్ చేసాను.

హాలులో ఉన్న అమ్మ దరికి వెళ్లాను. అమ్మ పక్కనే సోఫాలో కూర్చున్నాను.

అమ్మ ఏమీ మాట్లాడలేదు.

నేనే, "అమ్మా!" అన్నాను. 'చెప్పమ్మా' అన్నట్టు అమ్మ చూస్తుంది.

నిజానికి, నేను 'ఏం చెప్పుతానా' అనే ఆత్రమవుతున్నట్టు అమ్మ అగుపించింది.

నేను ఆలస్యం చేయక - "నేను బ్యాంక్ నుండి వస్తున్నాను. నా బైక్ అదుపు తప్పి ఓ సైకిలిస్ట్

ని ఢీ కొట్టింది. పడిపోతున్న బైక్ నుండి నేను పక్కకి గెంతేయగలిగాను" చెప్పడం ఆపాను.

అమ్మ గాభరా పడడం తెలుస్తుంది. నన్ను తేఱిపాఱ చూసింది.

మెల్లగా అన్నాను - "భయపడ్డంత ఏమీ కాలేదు. కానీ ఆ సైకిలిస్ట్ బేలన్స్ తప్పి కింది

పడింది ..."

"పడింది ... అంటే, ఆడదా?" అమ్మ అడిగింది నాకు అడ్డై.

"ఆఁ. అమ్మాయి. పాతికేళ్లు ఉంటాయి" చెప్పాను.

"పర్వాలేదా. ఆ అమ్మాయి బాగుందా" అని అడుగుతూన్న అమ్మని తొలుత కూల్

పర్చాలనుకున్నాను.

"ఏమీ కాలేదమ్మా ... అమ్మాయి బాగుంది" అన్నాను. అమ్మ ఏమీ అనలేదు, అడగలేదు.

నేను సర్దుకుంటూ -

"అమ్మా! మరేమో ... ఇది తలవని తలంపుగా జరిగినది. నువ్వు ... నువ్వు బెంబేలవ్వకు ... విను ..

జరిగింది చెప్పుతాను ..." తంటా పడుతున్నాను.

అమ్మ మౌనంగా ఉంది. కానీ నన్ను గమనిస్తుంది.

"ఆమె ... ఆ అమ్మాయి కాలు ... ఎడమ కాలు మీద నా బైక్ బలంగా ... బరువుగా పడింది ... ఆ కాలు

... ఆ అమ్మాయి ఎడమ కాలు ... విరిగిపోయింది" చెప్పేసాను.

అమ్మనే చూస్తున్నాను. అమ్మ మాట్లాడడం లేదు. కానీ ఆమె కళ్లల్లో నీళ్లు ... జరజరా

ఊరుతున్నాయి.

"అమ్మా! ... అమ్మా!" అన్నాను.

అమ్మ ఇంకా మాట్లాడడం లేదు. కాదు, కాదు, మాట్లాడలేకపోతుంది.

అమ్మ అర చేతుల్ని నా అర చేతుల్లోకి తీసుకున్నాను.

"అక్కడ పోగయ్యిన జనం తలో మాటన్నా, నేనే తేరుకొని, ఆమెను

హాస్పిటల్ లో చేర్పించగలిగాను." చెప్పాను.

"ఆమె వాళ్లు..." అంది అమ్మ.

"ఆమె స్పృహ తప్పి ఉందమ్మా. హాస్పిటల్ వారికి నా వివరాలిచ్చి, ఆమెకు వైద్యం మొదలు

పెట్టించాను. నువ్వు గాభరా అవుతావని ఫోన్ చేయలేదు. పర్మిషన్ తో స్వయంగా వచ్చాను"

చెప్పాను.

"పోలీస్ కేసవ్వుతుందిగా" అమ్మ అంది.

"అవునమ్మా. పోలీస్ లకు హాస్పిటల్ వారు తెలియపరిచారు. నేను ఉండగా వాళ్లు రాలేదు"

చెప్పాను.

"పద. హాస్పిటల్ కి వెళ్దాం" అమ్మ లేచింది.

"నువ్వు వద్దు. నేను వెళ్తాను" చెప్పాను.

"లేదు. పద, వస్తాను" అమ్మ అంది.

అమ్మ సంగతి తెలుసు. పైగా నేను అమ్మతో వాదించను. ఇద్దరం హాస్పిటల్ కి వెళ్లాం. పోలీస్

వాళ్లు ఉన్నారు. అమ్మ - పోలీస్ వాళ్లతో, హాస్పిటల్ వాళ్లతో మాట్లాడింది. నికరంగా

చెప్పింది - ఆ అమ్మాయి వైద్యం, బాధ్యత మాదేనని. ఆ అమ్మాయికి తెలివి వచ్చేక ఆమె గురించి

తెలిసింది.

ఆ అమ్మాయి - రచనామృత. తనే ఆ పేరు పెట్టుకుందట. తను ఒక అనాథ. యాక్టర్ కాలేక, సేల్స్

గర్ల్ గా పని చేస్తూ బతుకుతుంది. పోలీస్ వాళ్లు, హాస్పిటల్ వాళ్లు మా తీరును విశ్వసించారు.

అమ్మ చొరవ, చేదోడు వాదోడులకు రచనామృత స్తిమితమయ్యింది, సహకరిస్తుంది.

నేను బ్యాంకుకి సక్రమంగా వెళ్లగలుగుతున్నాను.

అమ్మ ఇంటి పనులతో పాటు హాస్పిటల్ లో రచనామృత సేవలు చక్కగా నిర్వహిస్తుంది.

కాలం సాఫీగా సాగిపోతుంది.

ఉదయం - నా పెళ్లి సంబంధం వారి నుండి అమ్మకి ఫోన్ కాల్ వచ్చింది.

ఆదివారం కనుక నేను ఇంట్లోనే ఉన్నాను.

ఆ ఫోన్ కాల్ కట్ చేసాక, నాతో -

"బుధవారం వాళ్లు వస్తారట. ముహూర్తాలు తీద్దామని చెప్పారు" చెప్పింది అమ్మ.

నేను ఏమీ అనలేదు. అమ్మ నా పక్కనే సోఫాలో కూర్చుంది. నేను చేతి లోని డైలీని

టీపాయ్ మీద పెట్టాను.

"చైతు బాబూ!" అమ్మ ఏదో చెప్పబోతుంది.

ఆ లోపే నేనే మాట్లాడాలని - "అమ్మా!" అనేసాను.

అమ్మ చెప్పడం ఆపి, "చెప్పమ్మా" అంది. అమ్మ చాలా ప్రశాంతంగా ఉందనిపించింది.

అమ్మ వాటంకి నాకు ధైర్యం వచ్చింది. ఈ మధ్య నాలో నేనే తర్జనభర్జనలు పడి, తీసుకున్న నా

నిర్ణయాన్ని అమ్మ చెంతన పెట్టే సమయం ఇదేనని అనుకుంటూ -

"ఈ పెళ్లి సంబంధం కేన్సిల్ చేసేయమ్మా" చెప్పేసాను.

అమ్మ ఏమీ అనలేదు. అలాగే అమ్మలో ఏ మార్పూ నాకు కానరాలేదు.

"ఏమంటామమ్మా" నేనే అడిగాను.

అమ్మ నిమిషం లోపే, "ఏమమ్మా" అంది. అమ్మ కూల్ గా ఉన్నట్టే తోస్తుంది.

"పెళ్లికి మాటలే అయ్యాయి. తప్పించడంకై ఒప్పించడం తప్పు కాదనుకుంటున్నానమ్మా ..."

చెప్పుతున్నాను.

"ముందు నువ్వు చెప్పాలనుకున్నది చెప్పమ్మా" అమ్మ అంది అడ్డై.

నేను సర్దుకున్నాను.

"రచనామృతకి మనం ఎంత నీడ నందించగలిగినా సరైన తోడు నివ్వలేమమ్మా." చెప్పాను.

అమ్మ 'ఇంకా చెప్పు' అన్నట్టు నన్నే చూస్తుంది.

"పైగా, రచనామృత విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. అపరాధ భావం నన్ను

నలిపేస్తుంది. ఆమె ప్రస్తుత స్థితికి నేనే కారణం కదమ్మా" చెప్పాను.

"చెప్పమ్మా! నీ ఆలోచన ఏమిటి?" అంది అమ్మ.

"రచనామృతకి ఆసరా కావాలని అనుకుంటున్నాను ... రచనామృతని పెళ్లి చేసుకోవాలని

అనుకుంటున్నాను. " చెప్పేసాను.

అమ్మ తనివితీరా నన్ను చూస్తున్నట్టు నాకు తోస్తుంది.

"ఏమంటావమ్మా" అడిగాను.

"ముందు ఆ అమ్మాయితో మాట్లాడతాను" చెప్పింది అమ్మ.

లంచ్ కేరియర్ పట్టుకొని అమ్మ హాస్పిటల్ కి బయలుదేరింది.

రచనామృతకి నా ప్రతిపాదనని గట్టిగానే వినిపిస్తానని కూడా చెప్పింది.

రచనామృత ఏమంటుందో?!

కానీ అమ్మ మీద నాకు నమ్మకం ఉంది.

***శుభం***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి

రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.

రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.



203 views0 comments

Commentaires


bottom of page