top of page

చల్లని కాపురం

#చల్లనికాపురం, #ChallaniKapuram, #KarlapalemHanumantha Rao, #కర్లపాలెంహనుమంతరావు, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Challani Kapuram - New Telugu Story Written By Karlapalem Hanumantha Rao

Published In manatelugukathalu.com On 18/03/2025

చల్లని కాపురం - తెలుగు కథ

రచన: కర్లపాలెం హనుమంతరావు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



ఉదయం భార్య శ్రద్ధకు సాయం చేయాలనే ఉదేశంతో అభిషేక్ గ్యాస్ స్టవ్ మీద పాలు పెట్టాడు. ఆ తర్వాత పేపర్ చదువుకోవడంలో మునిగిపోయాడు. ఆ ధ్యాసలో పడి పాలు పొంగటం గమనించినేలేదు. పక్క గదిలో అల్మారాలు శుభ్రం చేస్తున్న శ్రద్ధ పరుగెత్తుకుంటూ వచ్చి స్టౌవ్ ఆపేసింది. ఆతొందర్లో చీరె తలుపు గొళ్ళేనికి తగిలి రవ్వంత చిరిగింది. 


"నీ ఆత్రం బంగారం గానూ! చీర కాబట్టి సరిపోయింది. అదే చెయ్యికి తగిలితే.. ప్రాక్చరయ్యేది.. కాస్త చూసుకొని నడు బంగారూ!" అన్నాడు అభిషేక్ చిరు కోపంతో. శ్రద్ధ కళ్ళు తడయ్యాయి. 


మధ్యాహ్నం కూతురు స్మిత వంటింట్లో వంట చేస్తూ స్వాతి చదువుతుంది. పత్రిక చదివే ధ్యాసలో కుక్కర్ కూతలు కూడా చెవికెక్కటం లేదు. ఇంకో క్షణంలో కుక్కర్ మీది వెయిట్ ఎగిరిపడి గోలగోలయేది చివరి క్షణంలో శ్రద్ధ పరిగెత్తుకొచ్చి వెయిట్ తీసేయకపోతే! ఆకంగారులో ఆవిరి తగిలి ఆమె చేతివేళ్ళు బుసబుస పొంగాయి. ఉలిక్కిపడి తలెత్తి చూసిన స్మిత గభాలున తల్లి చేతివేళ్ళను నోట్లో పెట్టేసుకొంది. 


చెయ్యి బొబ్బలెక్కకుండా చూసుకొంది కానీ తల్లి మీద మాత్రం ఇంతెత్తున ఎగిరింది, "అన్నిటికీ ఆత్రమే మమ్మీ నీకు! చూడు చెయ్మెల్లా కాలిందో! ముందు నువ్వీ కిచెన్లోంచి బైటక్కదులు! రాత్రి దాకా గిన్నె ముట్టు కుంటే మర్యాద దక్కదు" అంటూ కూకలేసింది. కూతురు వంక గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది శ్రద్ధ. 


ఆ సాయంత్రం కొడుకు కుమార్ మర్నాడు ఇంటర్వ్యూ కి వేసుకెళ్ళే డ్రెస్ ఐరన్ చేసుకొంటున్నాడు. సెల్ రింగయింది. అటువైపు అతగాడి గర్ల్ ఫ్రెండ్ కాబోలు 'స్వీట్ నథింగ్స్' లో పడిపోయి ఇస్త్రీ పెట్టె కింద షర్ట్ పొగలు కక్కడం గమనించలేదు. ఇంకో క్షణంలో చొక్కాకు ఇంత బొక్క పడేదే.. టయానికి శ్రద్ధ గాని వచ్చి ఇస్త్రీ పెట్టె పక్కకు తీయకపోతే! షర్ట్ క్షేమంగానే ఉంది గానీ ఆ కంగారులో పెట్టె మీద పడి శ్రద్ధ కాలు మాత్రం ఇంత లావున వాచిపోయింది. బాధతో విలవిలలాడే తల్లి వంక చూసి జరిగింది అర్థమయింది కుమార్ కి. సెల్ ని టేబుల్ మీద గిరాటేసి తల్లిని రెండు చేతులతో ఎత్తుకెళ్ళి సోఫాలో కుదేశాడు. గబగబా టేబుల్ సొరుగు లాగి బెగాన్ ట్యూబ్ తీసి తల్లి కాళ్ళకు పట్టిస్తూ రామాయణం మొదలెట్టాడు. 


"ఎందుకే అమ్మా నీకీ కంగారూ? మీసాలూ గడ్డాలూ బారెడంత పెరిగినా నేనింకా చంటాడినేనా? చూడిప్పుడు కాళ్ళింత లావున వాచిపోయాయ్! రేపిట్లాగే కుంటూ కుంటూ నాకెదురొస్తావేమో ఇంటర్వ్యూ కెళ్ళే టప్పుడు" 


చివాట్లేసే కొడుకు వంక కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది శ్రద్ధ. 


రాత్రి బెడ్ రూంలో గురకలు పెడుతూ గాఢ నిద్రలో ఉన్న భర్త గుండెల మీద తలవాల్చి పడుకున్న శ్రద్ధ మనసు గతంలోకి కెళ్ళిపోయింది. పాతికేళ్ళ కిందటి పెళ్ళినాటి రోజులు గుర్తుకొచ్చాయి. పజ్జెనిమిది ఏళ్ళయినా నిండని పల్లెటూరి పిల్ల తను అప్పుడు. బ్యాంకులో చేస్తున్నాడని అభిషేక్ కి ఇచ్చి చేశారు. సిటీలో పెరిగిన పెళ్ళికొడుకు.. ఆ సిగిరెట్లూ అవీ తాగటం చూసి బామ్మ బెంబేలెత్తిపోయింది. అత్తగారి చేతికింద ఆరళ్ళు అనుభవించిన ఆమెకు మనమరాలి సంసారంలో కడగండ్లు మాత్రమే కనపడ్డాయి. 


పెళ్ళి మూడు రోజులూ ఆమె ముఖంలో సంతోషం పొడచూపలేదు. నాన్నగారిది మొదట్నుంచి బైట గాంభీర్యమే. పెళ్ళి జరిగిన రోజు ఏదో పనుండి స్టోర్రూములో కెళితే ఓ మూల ధాన్యం బస్తా మీద కూర్చొని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు నాన్నగారు. హఠాత్తుగా తను కంటబడేసరికి దుఃఖం ఆపుకోలేక దగ్గరకు తీసుకొని ముద్దుల వర్షం కురిపించారు. అప్పటి ఆయన ఆర్తిలో ఉన్నది కూడా కూతురి కాపురం మీద బెంగే. 


అప్పగింతలప్పుడయితే అమ్మను పట్టలేక పోయారెవరూ! ఆమె తన అత్తగారికి ఏదేదో చెప్పి కళ్ళు తుడుచుకుంటూనే ఉంది ఆ పూటంతా! మెట్టినింటి ఆరళ్ళు తట్టుకోలేక బావిలో దూకింది మేనత్త. ఆ దిగులే అప్పట్లో ఇంటిల్లి పాదిదీ! లోకం పోకడ అంతగా తెలీని తను కూడా అమ్మానాన్నలు అట్లా కన్నీళ్ళు పెట్టుకుంటే తట్టుకోలేక బావురుమనేసింది. చాలా భయమేసింది. 


తడికళ్ళతో తను కారెక్కితే ఈ అభిషేక్ ఎంతో అనునయంగా తన చేతుల్ని ఆయన చేతుల్లోకి తీసుకొన్నాడు. వెనక సీట్లో కూర్చున్న అత్తగారు, ఆడపడుచు ముసిముసి నవ్వులు చిందించారు. 


తన అదృష్టం. మేనత్తలా కాకుండా తల్లిలాంటి అత్తగారి అండన తన కాపురం ఆకుచాటు పూవులా ఆనందంగా గడిచి పోయింది. ఆడపడుచు స్కూలు ఫ్రెండులా కలిసిపోయింది. 


పాతికేళ్ళు చెల్లిపోయాయి. లోకంలో ఎన్నో మార్పులొచ్చాయి.. వస్తున్నాయి. అయినా తన కాపురంలో మాత్రం పెళ్ళయిన తొలినాటి అనుభవాల్లో రవ్వంతయినా మార్పు లేదు. అత్తగారిప్పుడు లేకపోయినా తండ్రిని మించి ప్రేమించే భర్త.. ఆయనకు, అత్తగారికి ప్రతిబింబాల్లాంటి కొడుకూ కూతురూ! 


తన వల్ల రవ్వంత పొరపాటు జరిగినా.. ముందు రుసరుసలాడ కానీ.. ఆ రుసరుసల వెనక ఉన్నదంతా అమ్మా నాన్నా బామ్మల ఆప్యాయతే! 


తలెత్తి భర్త వంక చూసింది శ్రద్ధ. మొద్దు నిద్రపోతున్నాడు నిశ్చింతగా. భర్త పెదాల మీద మురిపెంగా ముద్దు పెట్టుకుంటుంటే కళ్ళు రెండూ చెమ్మగిల్లాయి నలభైయ్యేళ్ళ ఇల్లాలు శ్రద్ధా అభిషేక్ కి. 

***

కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

కర్లపాలెం హనుమంతరావు -పరిచయం


రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోదీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.

 


 
 
 

1 comentário


karlapalem hanumantha rao

•1 hour ago

ధన్యవాదాలు అండీ! ❤

Curtir
bottom of page