top of page

చాలు

Writer's picture: BVD Prasada RaoBVD Prasada Rao

#BVDPrasadaRao, #బివిడిప్రసాదరావు, #Chalu, #చాలు, ##TeluguHeartTouchingStories

Chalu - New Telugu Story Written By BVD Prasada Rao

Published In manatelugukathalu.com On 07/12/2024

చాలు - తెలుగు కథ

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



రాత్రయ్యింది.

నాన్న మూర్ఖుడయ్యాడు.

నేను వణికిపోయాను.

పాపం అమ్మ.. నాన్న దెబ్బలకి మూలుగుతోంది.


పగలయ్యింది.

"అయ్యో.. ఒళ్లు ఎలా మగ్గిందో. చెప్తే వినవు. నేను తాగి వచ్చేక కాంగా ఉండవు." అమ్మ దెబ్బలకి కొబ్బరి నూనె రాసాడు నాన్న. 


"వేన్నీళ్లు పెట్టాను.. స్నానం చేసి రా. కాఫీ కలుపుతాను." అమ్మతో చెప్పాడు.


"స్కూలుకు టైం కావస్తోందిగా. తయారవు తల్లీ." నా తల నిమిరాడు నాన్న.


ప్రతీ రోజూ ఇదే మా ఇంటి తంతు.

నాన్న ఓ ఆఫీస్ లో క్లర్క్. అమ్మ గృహిణి. నేను సిక్స్తు క్లాస్ స్టూడెండ్ ని.


నాన్న.. పగలు అమ్మ మాట వింటాడు. ఇక తాగుడు జోలికి పోనని అమ్మకి మాటిస్తాడు. కానీ రాత్రయ్యేక వేటినీ పట్టించుకోడు. తాగి వస్తాడు. అమ్మ కేకలేస్తుంది. నాన్న కొడతాడు. నేను మూలన చేరి వణుకుతాను.


నాన్నని ఎలా మార్చాలి.. ఎలా ఐతే మారతాడు..

అమ్మమ్మ ఏడుపులు.. నాన్నమ్మ తిట్టులు.. తాతల బెదిరింపులు.. నాన్న పట్టించుకోడు.


నాన్నకి ఎప్పుడు.. ఎలా.. ఎవరితో.. అబ్బిందో తాగుడు అలవాటు.. 

నాకు తెలిసిన నుండి నాన్న తాగుతున్నాడు..

తాగినప్పుడే నాన్న మూర్ఖుడు. కానీ.. తాగనప్పుడు నాన్న మంచోడే.


పగలయ్యితే..

అమ్మని బాగా అభిమానిస్తుంటాడు. అమ్మ మాట వింటుంటాడు. అమ్మకి కావలసినవి కొని తెస్తుంటాడు. 

నన్ను బాగా పట్టించుకుంటాడు.. తెగ ముద్దు చేస్తుంటాడు.


రాత్రయ్యితేనే.. 

కింద మీద పడతాడు.

భగవంతుడా.. మాకు రాత్రి లేకుండా చేయరాదూ..

***

నాన్న పనికి వెళ్లి పోయాడు.. అమ్మ కట్టిన లంచ్ బాక్స్ పట్టుకొని.

వెళ్తూ.. 

"అమ్మకి ఒంటిలో బాగోక నిన్ను స్కూలు మానిపించి ఇంట్లో ఉంచుకుంది ఈ రోజున. ఉంచి నందుకు అమ్మని బాగా చూసుకో." చెప్పాడు నాతో.


"నేను ఆఫీస్ కి సెలవు పెడతానంటే వద్దంటావు. నువ్వు వినవు. సర్లే. ఏమైనా ఇబ్బందయితే ఫోన్ చేయ్." చెప్పాడు అమ్మతో.


నాన్న వెళ్లడమే లైటన్నట్టు.. నాన్న అలా వెళ్లగానే.. అమ్మ తయారుకు తొందరయ్యింది.


అమ్మ ఎందుకు హడావిడి అవుతోందో..

అమ్మ.. నన్ను తయారు చేసింది. తను తయ్యారయ్యింది.

అమ్మ ఇంటి గుమ్మం తలుపుకి తాళం పెట్టింది. నన్ను తీసుకొని వీథిలోకి వచ్చింది.


"ఎక్కడికి అమ్మా." అడిగాను.


అమ్మ ఏమీ చెప్పలేదు. అటుగా వచ్చిన ఆటోని ఆపింది. ఆటో వాడితో మాట్లాడింది.

ఆటోలోకి నన్ను ఎక్కించి.. తను ఎక్కింది.

కదిలిన ఆటో.. చాలా సేపు తర్వాత.. ఓ ఇంటి ముందాగింది.

ఆటో వాడికి అమ్మ డబ్బులిచ్చింది. నన్ను తీసుకొని ఆ ఇంటి ముందుకు వచ్చింది. ఆ ఇంటి తలుపు కొట్టింది.


ఆ ఇంటిలోంచి ఓ బక్కవాడు వచ్చాడు.

"ఆచారి ఉన్నారా." అమ్మ అడుగుతోంది.


ఆ బక్కవాడు ఏమీ చెప్పక.. మమ్మల్ని లోనికి తీసుకు వెళ్లాడు.

లోపల వాలుకుర్చీలో చేరబడి ఓ లావుపాటి మనిషి ఉన్నాడు. అతడే ఆచారి కాబోలు.

అమ్మ అతడితో.. "తమరికి తెలిసిన 'మెంబర్ కమలమ్మ' నన్ను పంపింది." చెప్పింది.


మెంబర్ కమలమ్మ మా వీథి చివరింటిన ఉంటుంది. పరమ గయ్యాళి.

అతడు సరిగ్గా కూర్చున్నాడు. "అలానా. కూర్చో." అన్నాడు బెంచీ బల్ల చూపుతూ.


అమ్మ పక్కనే ఆ బెంచీ బల్ల మీద నేనూ కూర్చున్నాను.

ఆ బక్కవాడు పక్కగా నేల మీద కూర్చున్నాడు.

"మీ గురించి విని గంపెడు ఆశతో వచ్చాను." అమ్మ నాన్న గురించి చెప్పింది.


"మీ ఆయనకి ఎన్నాళ్లుగా తాగుడు అలవాటు ఉంది." ఆచారి అడిగాడు. అతడి గొంతు గమ్మత్తుగా ఉంది.

"పదిహేనేళ్లగా." అమ్మ చెప్పింది.

ఆ వెంబడే..

"ఎప్పుడూ పగలు తాగడు. రాత్రే తాగి వస్తాడు." చెప్పింది.


"విచిత్రం. అవునులే. బుర్రకో పిచ్చి." అన్నాడు ఆచారి.

అమ్మ అతడినే ఎంతో గురిగా చూస్తోంది.

"పసర మందు ఇస్తాను. తాగించగలవా." అమ్మని ఆచారి అడిగాడు.


"ప్రయత్నించు. మూడు మోతాదులు. మూడు ఆదివారాలు తాగించాలి." ఆచారి చెప్పాడు.


ఆ వెంబడే..

"మొత్తం ఆరు వందలు." అమ్మతో చెప్పాడు.


"కమలమ్మ చెప్పింది. మూడు మోతాదులు అనీ చెప్పింది." అంది అమ్మ. చీర పైట చివరి ముడి విప్పి.. రెండు ఐదు వందలు నోట్లు తీసి ఆచారికి ఇచ్చింది.


ఆచారి ఆ నోట్లు అందుకొని.. లేచాడు. 

ఆ బక్కవాడితో.. "ఇవ్వు." చెప్పాడు. పక్క గదిలోకి నడిచాడు.

ఆ బక్కవాడు లేచి.. మరో గదిలోకి వెళ్లాడు.

ఆచారి తిరిగి వచ్చాడు. అమ్మకి నాలుగు వంద నోట్లు ఇచ్చాడు.

బక్కవాడు వచ్చి.. అమ్మకి మూడు చిన్న సీసాలు ఇచ్చాడు.


వాలు కుర్చీలోకి చేరిపోయి.. "ఇక వెళ్లవచ్చు." అమ్మతో ఆచారి చెప్పాడు.


"మళ్లీ ఎప్పుడు కలవను." అమ్మ అడిగింది.


"మూడు మోతాదులు ఇమిడిస్తే మరి రానక్కర లేదు. అలా కాకపోతే చూద్దాం." చెప్పాడు ఆచారి.

అమ్మ నన్ను తీసుకొని బయటికి కదిలింది.

దార్లో ఆటో మాట్లాడి.. నన్ను ఎక్కించుకొని.. ఇంటికి వస్తోంది అమ్మ.

"నాన్నకి ఇవేమీ చెప్పకు. చెప్తే నా సంగతి తెలుసుగా. నీ ఒళ్లు చీల్చేస్తాను." అమ్మ గట్టిగానే చెప్పింది.


నేను తలాడించేసాను. నాకు నాన్నంటే తాగుతాడని, కేకలేస్తాడని భయం. అందుకే నేను ఎక్కువగా అమ్మతోనే ఉంటాను. ఆటలకి కూడా బయటికి పోను. టివి కూడా అమ్మేస్తేనే చూస్తాను. ఫోన్ ఐతే అస్సలు ముట్టేదే లేదు. 


ఆదివారం.. ఉదయం..

పసరు మందు సీసా ఒకటి ఇస్తూ.. "నా మాట విని.. ఈ పసర తాగండి." అమ్మ అంది నాన్నతో.


నేను అక్కడే కూర్చొని హోం వర్క్ చేసుకుంటున్నాను.

నాన్న ఆ సీసా పుచ్చుకోలేదు.

వెంటనే.. "ఎందుకు." అడిగాడు.


"నా మాట వినండి. తాగండి." అమ్మ చెప్పింది.


"ముందు చెప్పు.. ఎందుకో." నాన్న అడుగుతున్నాడు.


"మీ తాగుడు ఊసు.. నా గోస పోతాయి." అమ్మ చెప్పింది.


"భలే. ఎవరి బుట్టలో పడ్డావే." నవ్వేడు నాన్న.


ఆ వెంబడే..

"తాగుడు ఆపే మందే ఉంటే.. ఇంత మంది మందు బాబులు తయారయ్యేవారా." నాన్న అన్నాడు.


అమ్మ బతిమలాడుతోంది.

నాన్న వినుకోవడం లేదు.

ఆమ్మ తగ్గడం లేదు.

నాన్న విసురుగా లేచాడు. ఆ సీసాను లాక్కున్నాడు. నేల కేసి కొట్టేసాడు.


ఆ సీసా పగిలింది. ఏదో పచ్చగా.. ముద్దగా.. సీసా పెంకులతో కలిసి నేల మీద పడి ఉంది.

అమ్మ గింజుకుంటోంది. నాన్న పట్టించుకోవడం లేదు.

అమ్మ ప్రయత్నం తుష్షే. నాన్న తాగుడు పోలే.

***

కొన్ని రోజులు తర్వాత..

"ఈ పూట పర్మిషన్ తీసుకున్నాను. పాప స్కూలుకు వెళ్లాక.. మనం మార్కెట్టుకు వెళ్దాం." నాన్న చెప్పుతున్నాడు అమ్మతో.


నేను అప్పుడే బ్రష్ చేసుకు వచ్చాను.

"మార్కెట్టుకా. ఇప్పుడు ఎందుకు. పైగా ఆఫీసుకు పోక." అమ్మ అడిగింది.


"రేపు నీ పుట్టిన రోజు కదా. నీకు బట్టలు తీస్తాను." సరదాగా ఉన్నాడు నాన్న.


అమ్మ ఆగింది. ఏమనుకుందో ఏమో.. కానీ..

"నాకు బట్టలు వద్దు." చెప్పింది.


ఆ వెంబడే..

"ఈ పుట్టిన రోజుకు నాకు బట్టలు వద్దు." అంది.


"మరేం కావాలి." నాన్న అడిగాడు.


"మీరు రేపటి నుండి మందు మానేయాలి." అమ్మ ఆశ పడుతోంది.


నాన్న వెంటనే.. "అది కుదరదు." అనేసాడు.

"నాకు ఏ బహుమతి వద్దు." అమ్మ మూతి ముడిచింది.


"సరే. అలానే." అనేసాడు నాన్న. 


అమ్మ ఏదో అనబోయింది.

"నాకు లంచ్ బాక్స్ కట్టేసి." టక్కున చెప్పేసి.. బాత్రూంలోకి దూరిపోయాడు నాన్న.


అమ్మ డీలా పడిపోయింది.

అయ్యో.. అమ్మ.. మరో మారూ బోల్తా పడి పోయింది.

***

పండగ సెలవు కావడంతో.. నేను.. నాన్న ఇంట్లోనే ఉన్నాం.

అమ్మ టిఫన్ గా ఉప్మా చేసి.. పెట్టింది.

నాన్నతో పాటు నేను, అమ్మ తింటూ.. టివి చూస్తున్నాం.

టివిలో వార్తలు వస్తున్నాయి.


ఎవరో అమ్మాయి.. ఆత్మహత్యతో.. చనిపోవడం చూపిస్తూ.. వార్త చెప్పుతున్నారు.


ఆ అమ్మాయి చావుకి కారణం.. ఆమె తండ్రే నట.. 

అతడు తాగుడు మైకంలో.. కూతురుపై అత్యాచారం చేసాడట..


"అత్యాచారం అంటే.." నేను అమ్మని అడగబోయాను.


అంతలోనే.. 

ఘల్లుమన్న శబ్దం ఒక్క మారుగా వినబడడంతో..


నేను తుళ్లు పడ్డాను. అటు చూసాను. ఉప్మా ప్లేట్ కింద పడి.. గిరి గిరా తిరుగుతోంది..


ప్లేట్ ఎవరిది.. నా చేతిలో ప్లేట్ ఉంది.. అమ్మ చేతిలో ప్లేట్ ఉంది..


మరి.. చూస్తే.. నాన్నది.. కుర్చీలో నాన్న.. రెండు చేతుల్లో తల పెట్టుకొని వేలాడిపోయి అగుపించాడు.


ఏమైంది.. అమ్మ లేచి నాన్న వైపు వెళ్తోంది.. నేనూ లేచాను..


నాన్నని అమ్మ పట్టుకుంది.

నాన్న వెర్రి వెర్రిగా చూస్తున్నాడు..


నాన్నని తన మీదకి వాల్చుకొని.. తన అర చేతులతో నాన్న గుండెని రుద్దుతోంది అమ్మ..


నాకు అక్కడ ఏమౌతుందో తెలియడం లేదు..

ఆ తర్వాత..

నాన్న రాత్రులు తాగకుండా ఇంటికి వస్తున్నాడు..

నాన్న పగలు మాదిరిగానే రాత్రులూ మాతో ఉంటున్నాడు..


నాన్న ఇలా ఎందుకు మారాడో నాకు తెలవదు.. కానీ..


నాన్న మారాడు.. నాన్న తాగుడు మానాడు.. చాలు.


***

బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.










178 views2 comments

2 Comments


Surekha Arunkumar
Surekha Arunkumar
Dec 08, 2024

కథ బాగుంది.

Like
BVD Prasadarao
BVD Prasadarao
Dec 09, 2024
Replying to

ధన్యవాదాలండి..

Like
bottom of page