#TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ, #SripathiLalitha, #శ్రీపతిలలిత, #ChattamDharmam, #చట్టంధర్మం
'Chattam Dharmam' - New Telugu Story Written By Sripathi Lalitha
Published In manatelugukathalu.com On 24/10/2024
'చట్టం- ధర్మం' తెలుగు కథ
రచన: శ్రీపతి లలిత
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
"అన్నయ్యా! నా టికెట్ బుక్ చేశాను, వచ్చే శుక్రవారం పొద్దున్న ఫ్లైట్. నీకూ, వదినకీ ఏమన్నా తెమ్మంటావా?" అడిగిన పద్మతో
"నువ్వు అమెరికా నుంచి మాకు తెచ్చేవి ఏమి లేవు కానీ, నువ్వే పెట్టె పెద్దది తెచ్చుకో, ఇండియా నుంచి మోసుకెళ్ళేవి బోలెడు ఉంటాయి" నవ్వుతూ అన్నాడు సంతోష్.
"ఇంతకీ నువ్వు వస్తున్నట్టు అక్కకి, అనంత్ కి చెప్పావా?" అడిగిన సంతోష్ తో
"ఈ ప్రయాణం అక్క కోసమేగా, అనంత్ కి చెప్పాను, వాడు ఎయిర్పోర్ట్ కి వస్తాను అన్నాడు కానీ... మా బావగారబ్బాయి యశ్వంత్ వస్తున్నాడు, వద్దని చెప్పాను, ఎలానో నేను మా అత్తగారింటికేగా వెళ్ళేది. నేను వచ్చాక నీకు ఫోన్ చేస్తాను" అంది పద్మ.
పద్మ అన్న సంతోష్ డాక్టర్, అందరిలోకి పెద్దవాడు. సంతోష్ మామగారికి పెద్ద నర్సింగ్ హోమ్ ఉంది. మెడిసిన్ చదివిన ఒక్కగానొక్క కూతురుతో పాటు ఆసుపత్రి కూడా సంతోష్ కి అప్పచెప్పి హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు.
తరవాతి అమ్మాయి రాగిణి, ఎమ్మెస్సీ చేసింది. ఆడపిల్లల కళాశాలలో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తోంది, భర్త బ్యాంకు ఆఫీసర్. మూడోది పద్మ, నెమ్మదస్తురాలు, కార్యసాధకురాలు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న శ్రీధర్ తో పెళ్లి జరిగి భర్తతో అక్కడ సెటిల్ అయ్యింది.
అందరిలోకి ఆఖరివాడు అనంత్. బాగా తెలివైనవాడు, తప్పకుండా ఐఐటీ లో సీట్ వస్తుంది అని చాల ధైర్యంగా ఉండేవాడు, దురదృష్టం కొద్దీ ఇంటర్ చదువుతున్న సమయంలో దీపావళి ప్రమాదంలో ఒక కన్ను పోయింది. కన్నుతో పాటు జీవితం కోల్పోయినట్లు చాలా నిరుత్సాహ పడి, డిప్రెషన్లో కూరుకుపోయి ఇంజనీరింగ్ లో కూడా సీట్ రాలేదు.
ఆ సమయంలో పద్మ ఇండియా వచ్చి, తమ్ముడితో ఉండి ధైర్యం చెప్పి డిగ్రీ లో చేర్పించింది. అందరికన్నా చిన్న అని, ముందు నుంచి అనంత్ ని ఇంట్లో అందరూ ముద్దు చేసేవారు. ఇలా అయ్యాక, అనంత్ ఏమాత్రం బాధ పడకుండా ఉండాలని అందరూ విశ్వ ప్రయత్నం చేసారు. డిగ్రీ అయ్యాక బ్యాంకు లో క్లర్క్ గా చేరాడు, నెమ్మదిగా పరీక్షలు పాసయ్యి, ఆఫీసర్ గా ప్రమోషన్ తెచ్చుకున్నాడు.
సంతోష్ నర్సింగ్ హోమ్ దగ్గరని మామగారింట్లోనే ఉంటే, అనంత్ మాత్రం తల్లీతండ్రీ తో ఉండేవాడు. అనంత్ భార్య రమ చాలా మంచి అమ్మాయి. ఇంట్లో అందరినీ, ముఖ్యంగా, అత్తమామలని ఎంతో ప్రేమగా చూసుకునేది.
పద్మ, తల్లితండ్రీ ఉన్నంత వరకు ప్రతీ ఏడూ, పిల్లలని తీసుకుని నెల రోజులు ఇండియాకి వచ్చేది. అప్పుడు కనీసం రెండు రోజులన్నా సంతోష్, రాగిణి పిల్లల్ని తీసుకుని వచ్చేవారు. అందరూ, ఆరుబయట చాపలు వేసుకుని కబుర్లు చెప్పుకోవడం, మధ్యలో వంటలన్నీ పెట్టుకుని, చుట్టూ కూర్చుని భోజనాలు చెయ్యడం, పిల్లలకీ, పెద్దలకీ ఎంతో సరదాగా ఉండేది.
అప్పట్లో మాదాపూర్ లో ఉన్న ఆ ఇల్లు, ఊరి చివరగా ఉన్నట్టు ఉండేది, అప్పుడో బస్సు, అప్పుడో కార్, చుట్టుపక్కల నిశ్శబ్దంగా ఉండేది. స్థలం చౌకగా వచ్చిందని పద్మ తండ్రి వెయ్యి గజాలు కొని చిన్న ఇల్లు కట్టి, మిగిలిన స్థలంలో మామిడి, జామ, సపోటా, అరటి చెట్లు వేశారు.
రమకి చెట్లు పెంచడం చాలా ఇష్టం, తను వచ్చాక కూరగాయల మొక్కలు, పూల మొక్కలు బాగా వేసింది. ఏ కాలానికి తగ్గ పళ్ళు, పూలు, కూరలతో కళకళలాడేది ఇల్లు.
తల్లి, తండ్రి ఉన్నంత కాలం ఈ ఇల్లు ఎవరికి? ఎలా పంచాలి? అన్న మాటే ఎవరూ ఆలోచించలేదు, ఎత్తలేదు. తండ్రి పోయాక, పద్మ తల్లి మాత్రం మిగిలిన పిల్లల్తో, "అనంత్ కి అదృష్టం అనుకూలించలేదు, మీరంతా వాడిని కనిపెట్టుకోండి, మీకు ఎవరికీ డబ్బు అవసరం లేదు, అందుకే ఈ ఇల్లు వాడికి ఇవ్వండి" అనేది. అప్పుడు ఆమె చెప్పినదానికి ఎవరూ ‘కాదు’ అనలేదు.
అనంత్ అదృష్టమా అన్నట్టు, హైదరాబాద్ ఐటీ సిటీగా అయ్యాక, ఒకప్పుడు దూరంగా, అడవిలా ఉన్న మాదాపూర్లో రేట్ విపరీతంగా పెరిగింది.
తండ్రి కట్టిన ఇంటి మీద ఇంకో పోర్షన్ వేసి అద్దెకిచ్చినప్పుడు, ఇల్లు కట్టడానికి డబ్బు ఎక్కడిది అని ఎవరూ అడగలేదు, అద్దెలో భాగమూ కావాలనలేదు.
ఒకప్పుడు తండ్రి లక్షకి కొన్న వెయ్యి గజాల స్థలం, ఇరవై కోట్లు అయింది.
అటు శ్రీధర్, ఇటు పద్మ పట్టించుకోలేదు కానీ.. రాగిణికి మాత్రం అంత ఆస్తి అనంత్ ఒక్కడూ అనుభవించడం మింగుడుపడలేదు. వీలునామా లాంటిది వ్రాయకుండా తల్లి, తండ్రి పోవడంతో, చట్టప్రకారం ఆస్తిలో అందరికీ వాటా ఉంది అనే మాట అన్న, చెల్లి దగ్గర బయటపెట్టింది రాగిణి.
నిజానికి, ఆ విషయం తేల్చుకోవడానికే ఇప్పుడు పద్మ ఇండియా వచ్చింది.
మర్నాడు అన్న ఇంటికి వెళ్లి అన్నా, వదినలతో మాట్లాడాక, వాళ్ళు కూడా తన ఆలోచనలతో ఏకీభవిస్తున్నారని అర్థమైంది పద్మకి.
సంతోష్, పద్మ, రాగిణి ఇంటికి వెళ్లారు. వీళ్ళు వెళ్లేసరికి రాగిణి భర్త, బ్యాంకు కి బయలుదేరుతున్నారు.
"ఎప్పుడొచ్చావు పద్మా? బావున్నావా? "
అని పలకరించి "మీ అక్కకి ఈ మధ్య మతి పోతోంది, కొద్దిగా సరిచెయ్యవయ్యా డాక్టరూ!" అని సంతోష్ కి చెప్పి "మళ్ళీ కలుస్తాను" అని వెళ్ళిపోయాడు.
బావగారి మాటలకి, ఆయనకి రాగిణి ప్రస్తావన నచ్చలేదని అర్థం అయ్యింది పద్మకి.
"ఏదో పది లక్షలో, పాతిక లక్షలో అంటే నేనూ మాట్లాడేదాన్ని కాదు, ఇప్పుడు బంగారం కూడా కాదు, వజ్రాల గని ఆ స్థలం, ఒకొక్కళ్ళకీ ఎంతకాదన్నా అయిదు కోట్లకి తక్కువ రాదు, మీ బావగారికి అర్థం కాదులే, అనంత్ దగ్గర మంచివాడని బిరుదు కొడదామని..."
బలవంతంగా నవ్వుతున్న అక్కని చూస్తే, అర్థమైంది పద్మకి, అక్క కూడా మళ్ళీ ఆలోచనలో పడ్డది అని.
"నువ్వు అనంత్ తో ఈ విషయం మాట్లాడవా అక్కా?" అడిగింది పద్మ.
"అంటే, సూటిగా ఏమీ అనలేదనుకో, కానీ, వాడికి నా మనసులో మాట అర్థమైంది అనిపించింది. నేను అనుకుంటున్న దాంట్లో తప్పు ఉందా? చట్ట ప్రకారం మనకీ భాగం రావాలి కనక నేను అంటున్నాను, మీ బావగారు నా మీద చాలా కోపంగా ఉన్నారు" కళ్లనీళ్లతో అన్న రాగిణిని చూస్తే జాలి వేసింది పద్మకి.
అక్క పక్కన కూర్చుని, భుజం మీద చెయ్యి వేసి, "అక్కా! నువ్వు ఆలోచించడంలో తప్పు లేదు, నాన్న వీలునామా వ్రాసి ఉంటే ఎలా ఉండేదో మరి, ఆయన ఏమి వ్రాసేవారో తెలీదు. నువ్వన్న చట్టప్రకారం మనకి వాటా తప్పక రావాలి" పద్మని అడ్డుకుంటూ
"నేననేది అదే కదా, ఏదో భయంకరమైన తప్పు లాగా అంటారేమిటి అందరూ?" అంది రాగిణి.
"అదే అక్కా! చట్టం ఎవరికోసం? అన్యాయమైపోతున్న వాళ్ళని ఆదుకునేది చట్టం.
నువ్వు న్యాయం ఆలోచించు, అందరిలోకి చిన్నవాడైనా... అందరికన్నా తెలివిగలవాడు అనంత్, తప్పకుండా ఐఐటీ సీట్ వస్తుందనుకున్నాం. కానీ, వాడిని దురదృష్టం వెంటాడి, దీపావళి నాడు టపాకాయ మొహం మీద పేలడంతో కన్ను పోయింది. నీకు గుర్తుందా? అప్పుడు వాడు ఎంత డిప్రెస్ అయ్యాడో, ఒకసారి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసాడు.
చిన్నప్పటి ఆ హుషారైన అనంత్ ని, మనం మళ్ళీ చూడలేదు.
వాడు, జీవితంతో రాజీపడ్డాడు, అదృష్టం కొద్దీ వాడి పిల్లలు బాగా చదువుతున్నారు, వాళ్ళన్నా ఐఐటీలో చదివితే వాడి కల నెరవేరుతుంది.
అమ్మ ఎప్పుడూ అనేది గుర్తుందా? మీకెవరికీ అవసరం లేదు, ఇల్లు అనంత్ కే ఉండనివ్వండి అని, అది నాన్న కోరిక కూడా అయ్యే ఉంటుంది.
మన ముగ్గురికీ, మన సంపాదన అవనీ..అత్తగారి వేపు నుంచి వచ్చిన ఆస్తి కానీ.. ఏ లోటూ లేకుండా ఉన్నాం. వాడికి ఆ పరిస్థితి కూడా లేదు, రమ వేపు నుంచీ పైసా కలిసొచ్చే అవకాశం లేదు.
మనమంతా అమ్మా, నాన్న పిల్లలం, అన్నివిధాలా సమానంగా ఉండాలిగా!
నాన్న కొన్న స్థలం విలువ పెరిగి, వాడు లాభ పడితే, అది భగవంతుడి సంకల్పం అనుకుంటాను నేను. ఒకచోట ఇవ్వనిది, ఇంకో చోటే ఇస్తున్నాడేమో!"
పద్మని అడ్డుకుంటూ రాగిణి, "అయితే మీరేమంటారు? నేను వాటా అడగడం తప్పంటారా?" అంది.
ఈ సారి సంతోష్ మాట్లాడాడు.
"తప్పు అనను, ధర్మం కాదేమో అంటాను. చట్టం వేరు, ధర్మం వేరు. నాన్న వీలునామా వ్రాసి ఉంటే, నీకు ఈ ఆలోచన వచ్చేది కాదు, వచ్చినా చేయగలిగేదీ లేదు.
కానీ అనంత్ మన తోబుట్టువు, వాడి పట్ల మనకి ధర్మం ఉంది. ఈ రోజు వరకు వాడు మనని ఏనాడూ ఒక్క రూపాయి అడగలేదు.
అమ్మా, నాన్నా ఉన్నప్పుడు కానీ, వాళ్ళకి ఆరోగ్యం బాగాలేనప్పుడు, నాన్న పోయినప్పుడు, అమ్మ పోయినప్పుడూ.. నేను అడిగినా నా దగ్గర ఉంది అన్నయ్యా అనేవాడు కానీ, నేనే ఎందుకు అమ్మానాన్నని చూడాలి అన్న మాట మాత్రం వాడి నోటి నుంచి నేను వినలేదు.
ఏ అవసరమున్నా అడగమని నేనూ, మీ వదినా, రమకి కూడా చెప్పాము, కానీ తనుకూడా ఎప్పుడూ అడగలేదు. ఇప్పుడు వాటాలు పంచుకుని వాడిని ఆ ఇంటినుంచి వెళ్లగొట్టడం ధర్మంగా అనిపించడంలేదు” స్పష్టంగా అన్నాడు సంతోష్.
వీళ్ళిలా మాట్లాడుతుంటే అనంత్, సంతోష్ కి ఫోన్ చేసాడు.
"చెప్పరా అనంత్!"
"పద్మక్క వచ్చిందిగా, రేపు, మీరు అందరూ మా ఇంటికి రండి" అన్న అనంత్ తో "మేము రాగిణి దగ్గర ఉన్నాం, స్పీకర్ లో పెడతాను, ఉండు" అంటూ ఫోన్ స్పీకర్ లో పెట్టాడు సంతోష్.
"అన్న ఇప్పుడు నన్ను మీ ఇంట్లో దింపుతాడు" అంటున్న పద్మ మాటలకి అడ్డు వస్తూ
"పద్మ ఈ పూట ఇక్కడే ఉంటుంది, రేపు మేమిద్దరం కలిసి వస్తాం" అంది రాగిణి.
మర్నాడు అందరూ, అనంత్ ఇంట్లో కలిసారు, మళ్ళీ పాత రోజుల్లో లాగా నవ్వుతూ, కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసారు.
అందరూ హాల్లోకి చేరాక, అనంత్ నెమ్మదిగా విషయంలోకి వచ్చాడు.
"అన్నా! ఈ ఇల్లు ఎలా పంచుకుందాం?" గొంతులో ఒక దుఃఖపు జీర వినిపించింది.
సంతోష్, పద్మ రాగిణి వేపు చూసారు.
రాగిణి బాధగా మొహం పెట్టి, మీరే చెప్పండి అన్నట్టు, వాళ్ళిద్దరినీ చూసింది.
సంతోష్ గొంతు సవరించుకుని " నేను పెద్దవాడిని కనుక నేను చెప్పిన ప్రతిపాదనకి మీరందరూ ఒప్పుకోవాలి" ముగ్గురినీ చూసాడు, రాగిణి తల వంచుకుంటే, అనంత్ ఆత్రంగా చూసాడు, పద్మ నవ్వుతూ చూసింది.
"నేను చెప్పేదేమంటే, ఈ ఇంటి మీద పూర్తి హక్కులు నాన్న మనవలు అందరికీ సమానంగా పెడదాం, అంటే మన నలుగురి పిల్లలకి అన్నమాట. మన తదనంతరం, మన పిల్లలు ఈ ఇంటిని ఏమి చెయ్యాలో ఆలోచిస్తారు.
అప్పటి వరకు దీన్ని జాగ్రత్తగా కాపాడాలి. అందరి పిల్లలకూ హక్కు ఉంది కనక, దీన్ని కాపాడే బాధ్యత కూడా మన అందరిదీ.
పైన అద్దెకి ఇచ్చిన వాటా ఖాళీ చేయిస్తే, దాన్ని నేనూ, పద్మ,కొన్ని మార్పులు చేయిస్తాము.
ఇంకనుంచి, ప్రతీ ఏడూ సెలవలకి మన పిల్లలు అందరూ కలిసి, ఒక పది రోజులన్నా ఈ ఇంట్లో గడుపుతారు. మనకి కుదిరినప్పుడు మనం వస్తాం.
అనంత్ ఈ ఇంటికి కేర్ టేకర్ గా ఉంటాడు. ఈ వాటాని జాగ్రత్తగా చూసుకోడానికి అయ్యే ఖర్చు, ఒకోసారి ఒకళ్ళం చొప్పున అనంత్ కి ఇద్దాం. తను మొత్తం మెయింటనెన్స్ చూడాలి.
లాయర్ తో నేను ఆ విధంగా డాక్యుమెంట్స్ చేయిస్తాను, అందరం ఒక కాపీ పెట్టుకుందాం" అంగీకారం కోసం చెల్లెళ్ళ వంక చూసాడు.
పద్మ సంతోషంగా "నాకు ఓకే!" అంది, అనంత్ రాగిణి వంక చూస్తే, ఆమె కూడా"ఓకే " అంది.
ఆశ్చర్యంగా సంతోష్ వంక చూసాడు అనంత్.
"ఇది అక్క కోరికే, అమ్మానాన్నల ఇల్లు, మన కంటే, మన పిల్లలు అనుభవించాలి అని అనుకుంది, అంతేగానీ, నువ్వు అనుభవిస్తున్నావని బాధ కాదు" చెప్పిన పద్మని చూసి కళ్ళు తుడుచుకుంది రాగిణి.
రాగిణిని చెడ్డ చెయ్యకుండా, అనంత్ బాధపడకుండా, అందరు మనవలకీ ఆ ఇంటి మీద హక్కు ఉండేటట్టు వ్రాసుకోమని పద్మ మామగారు చెప్పిన సలహా ఇది.
అందుకే అన్నారు, 'పెద్దవాళ్ల మాట చద్ది మూట అని' అనుకుంది రాగిణి.
***
శ్రీపతి లలిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.
నేను ఆంధ్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.
నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.
నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.
అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.
నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.
ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.
నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.
పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.
Comments