చీటింగ్!
- A . Annapurna
- Mar 6
- 4 min read

Cheating - New Telugu Story Written By A. Annapurna
Published in manatelugukathalu.com on 06/03/2025
చీటింగ్ - తెలుగు కథ
రచన: ఏ. అన్నపూర్ణ
(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
“గోపీ! నాన్నకి కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయట. రోజూ డయాలసిస్ చేయాలి. ఇలా ఎంతకాలమో.. తెలియదు అన్నారు డాక్టర్. డబ్బు చాలా ఖర్చు అవుతోంది. నేను మీ ఒదిన చేసేవి చిన్న జాబ్స్. ఇంటి ఖర్చు, పిల్లల చదువుకి సరిపోతుంది. నాన్న పేరుకి సింగరేణి జనరల్ మేనేజర్ చేసాడు. పెంక్షన్ వాళ్ళ మందులకు చాలదు. నీకేం! అమెరికా వెళ్లి హాయిగా తప్పించుకున్నావు. నాకు చాలా ఇబ్బందిగావుంది.. '' అంటూ తమ్ముడు గోపీ కృష్ణకి ఫోను చేసాడు బలరాం.
''మీరందరూ కలిసి, 'అమెరికా వెళ్ళు, నువ్వేనా సుఖంగా వుండు..' అంటూ బలవంతాన పంపించారు. ఇప్పుడేమో ఇలా అంటున్నారు.'' అన్నాడు గోపీ చిన్నబుచ్చుకుని.
''అవును. చదువు కోసం పంపించాము. నువ్వు అక్కడే వుద్యోగం చూసుకుని ఉండిపోయావు. మాకేం తెలుసు ఇకరావని. జరిగిపొయిన్ది అనవసరం. జరగాల్సింది ఏమిటో చెప్పు. ''
''నువ్వే చెప్పు. నేను అమ్మానాన్నలను రెండు సార్లు - చెల్లి సుభద్ర రెండుసార్లు తీసుకువెళ్ళాము. ఇప్పుడిక వాళ్ళు రాలేము అన్నారు. డబ్బు కావాలా పంపిస్తాను. నాన్నను చూసుకోడానికి మనిషిని పెట్టు. ఆ ఖర్చుకూడా పంపుతాను. '' అన్నాడు గోపీ.
''ఆ అవును. నువ్వు పంపుతావులే.. నాన్న - అమ్మా ఉండటానికి ఫ్లాట్ కొన్నావు. అమ్మ బాగుంది అంటే నాన్న పడకేస్తాడు. ఆయన తేరుకుంటే మళ్ళీ అమ్మకి అనారోగ్యం.. డాక్టర్ ఫీజులు, ఇన్సూరెన్స్ కట్టడం.. మేము అద్దె ఇంట్లో వున్నాం. అందరం ఓకే చోట ఉండటం మంచిది.. ఖర్చు కలిసొస్తుందని తీసుకువచ్చాను. నీ ఫ్లాటుకి వచ్చే రెంటు ఇన్సూరెన్స్ కడుతున్నాను. నా పిల్లలు చదువు పూర్తిచేసి ఉద్యోగాల్లో చేరడానికి మరో నాలుగేళ్లు పడుతుంది. నీతోగాక ఎవరితో చెప్పుకోగలను?” అన్నాడు బాలు.
''ఈ విషయం చెప్పి ఉంటే ముందే నీకు పెద్ద ఫ్లాట్ కొనేవాడిని. సరే. ఇప్పుడు కొనుక్కో. ఇప్పుడే అన్నిటికి మని ట్రాన్స్ఫర్ చేస్తాను'' అన్నాడు గోపి.
వారం తిరిగేసరికి కోటి రూపాయలు బ్యాంకుల్లో చేరాయి. సగం తల్లి పేరుతొ బ్యాంకులో వేసి మిగిలిన సగం పెట్టి బ్యాంకు లోను తీసుకుని ఊరిచివర నాలుగు బెడ్ రూమ్ ఫ్లాట్ కొన్నాడు బాలు.
తండ్రికి చవకలో చిన్న డాక్టర్ని కుదిర్చాడు. ఆయనకు సేవ చేయడానికి మనిషిని పెట్టేడు. అవ్వన్నీ ఫోటోలు తీసి గోపీకి పంపాడు.
''మరీ అంత అవసరంలేదు బాలూ.. నేను అడగను. నన్ను ఎప్పుడు పిలిచినా వస్తాను..” అన్నాడు గోపి.
''ఎందుకురా. బోలెడు ఖర్చు. ఎవరు తిన్నట్టు. నాన్నకి ఏమి కాదులే.. డబ్బు పంపుతున్నావు.. చాలు. వచ్చి ఏమిచేస్తావు? వద్దు..” అనేవాడు బాలు.
'హమ్మయ్య.. ప్రస్తుతానికి శాంతించావు.. చాలు. నేను మాత్రం రావడానికి కుదురుతుందా? ఆ నెల రోజుల రాబడి నష్టపోతాను. నీకు డబ్బు పంపడమే సులువు' అనుకున్నాడు గోపి.
'వాళ్లిద్దరూ చూసుకోడం వాళ్ళ బాధ్యత. మధ్య నాకేం?’ అనుకుంది చెల్లి సుభద్ర.
బాలూ కూతురు వుత్తర చదువు పూర్తిచేసింది. కానీ వుద్యోగం చేయను.. అంటే.. ‘అయితే పెళ్లి చేసుకుంటావా’ అంది వాళ్ళమ్మ రేవతి.
''అదేగా అర్ధం.. నన్ను ఎవరూ ప్రేమించడానికి సిద్ధంగా లేరు. మీరే చూడాలి సంబంధం..” అంది ఉత్తర.
ఎవరో ఫ్రెండ్ ని తీసుకువచ్చి మీరు పెళ్లి చేస్తారా.. నన్ను చేసుకోమంటారా అని అంటే బాగుండును అని ఎదురు చూస్తే నెత్తిమీద భారం వేసిన కూతురిని మనసులో తిట్టుకుంది రేవతి.
తప్పదుగా అని వేట మొదలెడితే అందమా సో సో.. ఉద్యోగమా నిల్లు.. కనుక ఒక ఫ్లాట్, కారు కొనిస్తే చాలు గుళ్లో పెళ్ళి చేసినా ఒకే.. అనే సంబంధం చచ్చి చెడి కుదిరింది.
అప్పుడు రేవతి మరిదికి ఫోను చేసింది.
''ఇప్పటిదాకా కుటుంబాన్ని చాలా ఆదుకున్నావు. ఆ మనసుతోనే ఆడపిల్లలు నీకు ఎటూ లేరు కనుక, ఉత్తర పెళ్లికూడా చేసేయి. త్రీ బెడ్ రూం ఫ్లాటు, BMW కారు అడిగారు. నువ్వు సరే అంటే కుదుర్చుకుంటాం. లేదంటే దానికి ఈ జన్మకి పెళ్లికాదు. ''
''అయ్యో! అంత మాట అనకు. చిన్నాన్నను.. అమెరికాలో ఉన్నవాడిని.. ఆడ పిల్లలు లేనివాడిని.. ఉత్తరకు లోటు రానిస్తానా ''. అని మాట ఇచ్చేసాడు గోపీ.
అక్కడ అడ్డుకుంది రాధ.
''నీకు ఏమైనా మతివుందా? మీ అన్నయ్య అడిగినంతా పంపించావు. నేను ఊరుకున్నాను. పోనీలే అత్తమామలను చూస్తున్నారు.. అని.
బ్యాంకు ఒకరు, స్కూల్ టీచర్ ఒకరు చేస్తున్నారు. అవి మరీ చిన్న ఉద్యోగాలు కావు. అయినా మీ అమ్మా నాన్నల ఖర్చు పూర్తిగా నీమీద పెట్టేసారు. ఒక్క కూతురు పెళ్లి చేయగలరు. కానీ నువ్వు వున్నావుగా.. వాళ్ళు ఏది అడిగినా కాదనవు.. అని చివరికి సిగ్గులేకుండా కూతురి పెళ్లి చేయమంటే.. నువ్వు చేయడానికి నేను ఒప్పుకోను'' అంది రాధ కోపంగా.
''రాధా! ఇంతటితో.. బాలుకి నాకు సంబంధం తీరిపోతుంది. ఇక ఒక్క డాలరు ఇవ్వను. అమ్మా - నాన్నలను అమెరికా తీసుకురాలేము.. కనుక పంపించాను. 'అందుకే వాళ్ళు రాలేదు.. అమ్మ నాన్నలకు సేవ చేయలేదు.. నీకు బాధ్యత లేదా అని మనలను అనలేరు. నువ్వు వెళ్లి ఇండియా లో వాళ్లకి సేవచేయ గలవా? అది తప్పించుకోడానికి డబ్బు పంపాను. అంతే. ఇక ఉత్తర మనకూ కూతురు. గిఫ్ట్ ఇచ్చేవనుకో.
ఇంకా వాళ్లకి మనం చాలా రిచ్ అని తెలియదు. కనుక ఇంతటితో వదిలింది. రేపు అన్న కొడుకుని మన దగ్గిరకు పంపుతాను అంటె వద్దు అని చెప్పేస్తాను. నన్ను నమ్ము. ఇంతటితో ఎండ్. పెళ్ళికి కూడా వెళ్ళద్దు. తీరా నీ హోదా నగలు పట్టు చీరలు చూస్తే అవన్నీ అడిగేరకం మా వదిన. అని వెళ్ళద్దు అంటున్నా!'' అని రాధకు నచ్చ చెప్పేడు గోపీ కృష్ణ.
పెళ్లికి వెళ్ళి గొప్ప చూపించుకుందాం.. అనుకున్న రాధ.. గోపి చెప్పిన మాటకి.. ప్రయాణం ఆలోచన మానుకుంది.
అలా ఆ మాయలమారి.. ఉపాయాలు పన్ని చేసేది చేసేసాడు.
*******************
ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ
నాగురించి పరిచయం.
నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లుగారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంధకర్త. ''వారురాసిన మహర్హుల చరిత్ర'' టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. దానిమీద నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథవారి ''ఏకవీర '', శరత్ బాబు, ప్రేమ్ చంద్, తిలక్, భారతీ మాసపత్రిక. నాన్నగారు రాసిన వ్యాసాలూ ప్రింట్ అయినా తెలుగు -ఇంగిలీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్నా ;;ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ'' కి వచ్చే పిల్లల పత్రికలూ, వారం మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటు అయింది. పెళ్లి అయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు.
చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపుల తో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చారు. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమసంస్థ లో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను.. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే
వెళ్ళివస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, సాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనేవున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి అనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్ట్లలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,
ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.
(writing for development, progress, uplift)

Kommentare