'Cheda Purugu' - New Telugu Story Written By Veluri Prameela Sarma
'చెద పురుగు' తెలుగు కథ రచన: వేలూరి ప్రమీలాశర్మ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఉక్కపోత భరించలేక బీచ్ కి వచ్చి కూచున్నాడు రాధాకృష్ణ. ఉడికించిన పల్లీలు ఒక్కోటీ నోట్లో వేసుకుంటూ, రాళ్ళమీద కూచుని ఎగసిపడుతున్న అలలవంక చూస్తున్నాడు.
'అలసట ఎరుగని అలలలాగే ఈ జీవితం కూడా!' అనుకుంటూ తనలో తనే నవ్వుకున్నాడు.
డెబ్భయి ఏళ్లు.. బాధ్యతలతో అలసిపోయి రెస్ట్ తీసుకుందా మనుకునేలోపు, అమెరికాలో ఉంటున్న చిన్నాడు, పిల్లల్ని చూడడానికి మనిషి అవసరం అంటూ ఆరు నెలల కోసం శ్యామలని తీసుకెళ్లాడు. రోజూ వీడియో కాల్ చేసి, చిన్న పిల్లాడికి చెప్పినట్టు జాగ్రత్తలు చెబుతుంది. పైకి గంభీరంగానే ఉన్నా, శ్యామల తోడు లేని లోటుని పంటి బిగువున ఓర్చుకుంటున్నాడు రాధాకృష్ణ.
దూరంగా ఇసుకలో ఆడుకుంటూ పిల్లలు విసిరిన బంతి, నేరుగా వచ్చి రాధాకృష్ణ చేతిలోని పల్లీ పొట్లాన్ని తాకింది.
"సారీ తాతగారూ! చూసుకోలేదు" అంటూ కింద పడిన పల్లీలవంక చూస్తూ చెప్పాడు ఓ ఎనిమిదేళ్ల కుర్రాడు.
"మరేం పర్లేదు బాబూ! ఇంద.. బాల్ తీస్కుని, ఆడుకోండి" అంటూ చేతికి బాల్ ఇచ్చి, అక్కడ్నుంచి లేచి మెట్ల పైనున్న పార్కులోకి దారితీసాడు రాధాకృష్ణ.
"శ్రీనివాసా గోవిందా! శ్రీ వెంకటేశా గోవిందా!!" రింగ్ టోన్ మోగుతుంటే.. జేబులోంచి ఫోను తీసి చూసాడు.
"రాధా! ఎక్కడున్నావురా? ఓసారి మా ఇంటికి రాగలవా? సావిత్రికి నిన్నటినుంచి జ్వరం ఎక్కువగా ఉంది" చెబుతున్న రమణమూర్తి గొంతులో గాభరా స్పష్టంగా తెలుస్తుంటే.. "అలాగే రా! ఓ అరగంటలో అక్కడుంటాను. కంగారుపడకు" చెప్పి ఫోన్ పెట్టేసాడు రాధాకృష్ణ.
"హు! మళ్లీ ఆ పనికిమాలిన కొడుకు, పెళ్ళాం మాటలు విని.. సావిత్రిని నానా మాటలూ అనుంటాడు" అనుకుంటూ నిట్టూర్చి, అరకు కాఫీ స్టాల్ లో ఓ స్ట్రాంగ్ కాఫీ తాగి, అటుగా వెళ్తున్న ఆటోను పిలిచి, సీతమ్మధార పోనివ్వమని చెప్పాడు రాధాకృష్ణ.
గుమ్మం ముందర ఆటో ఆగిన శబ్దానికి, తెరచివున్న తలుపుకి జారబడి కూచున్న సావిత్రి లేచి లోపలకి వెళ్లింది. చొక్కా తొడుక్కుంటూ బయటకు వచ్చిన రమణమూర్తి మొహంలో, స్నేహితుడ్ని చూడగానే ధైర్యం తొణికిసలాడింది. రాధాకృష్ణ చెయ్యి పట్టుకుని, పక్కనే ఉన్న సిమెంటు గోడౌను వెనక్కి తీసుకెళ్లాడు.
"వాడు మనిషి కాదురా! ఇంక మారడు. నిన్న మధ్యాహ్నం అన్నం తింటుంటే వచ్చి, కన్నతల్లి అనికూడా చూడకుండా, రెక్కపుచ్చుకుని కంచం ముందునుంచి లేవగొట్టాడు. నానా మాటలూ అంటూ సావిత్రిని బలంగా తోసేస్తే, గోడమీద పడింది. ఆ అదుటుకి జ్వరం తెచ్చుకుంది. వాడు మారాలని మొక్కులు మొక్కుకుంటూ ఉపవాసాలు చేస్తోంది పిచ్చిది..
మలమూత్రాలు ఎత్తి, ఈ చేతుల్తో గోరుముద్దలు తినిపించి వాడిని పెంచి, పెద్ద చేసింది. ఇప్పుడు ఆ చేతులే తనని కొడుతుంటే తట్టుకోలేకపోతోందిరా!" ఏడుస్తూ, బటన్ లేక వేలాడుతున్న చొక్కా చేతి మడతతో కళ్ళు ఒత్తుకున్నాడు రమణమూర్తి.
"నీకు ముందే చెప్పానురా! రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం వాడి చేతుల్లో పోసావు. పెన్షన్ రాకపోతేనేం? నా కొడుకు మమ్మల్ని నెత్తి మీద పెట్టుకుని చూస్తాడు అన్నావు. ఆరోజే చెప్పాను.. మీకంటూ ఓ ఇల్లు ఉంటే, గంజి నీళ్ళైనా తాగి బతకొచ్చని.. విన్నావా? ఇప్పుడు చూడు ఏమయ్యిందో!
‘కొడుకు ఇల్లు నాది కాదా’ అంటూ వాడు ఇల్లు కట్టుకుంటానంటే డబ్బంతా పట్టుకెళ్లి వాడి చేతుల్లో పోసావు. ఆ విశ్వాసం ఉందా వాడికి? పురుగుల్ని చూసినట్టు చూస్తున్నాడు మిమ్మల్ని. ఇలా ఎన్నాళ్ళురా? అసలు వాడి ఉద్దేశ్యం ఏంటో ఇవాళ తేల్చేస్తాను" ఆవేశంగా ఇంటివైపు నడిచాడు రాధాకృష్ణ.
"గొడవపడితే తెగిపోతుందేమోరా.. తొందరపడకు. కాస్త సౌమ్యంగా మాట్లాడు" స్నేహితుడిని బతిమాలుతూ, అతని వెనకే తనూ ఇంట్లోకి నడిచాడు రమణమూర్తి.
"మా కుటుంబ విషయాల్లో కలగజేసుకోడానికి మీరెవరు? అయినా వాళ్ళ మాట పట్టుకుని నిలదియ్యడానికి వచ్చారు.. ఆవిడ ఏం చేసిందో తెలుసా? అప్పుడూ, అప్పుడూ పదీ, పాతికా తీసేసి, ఎవరికీ తెలియకుండా దేవుడి గదిలో అలమారాలో దాచేసింది. నిన్న ఉదయం గుట్టు బయటపడేసరికి ఆ మూడువేలూ దొంగతనం చెయ్యలేదని బుకాయిస్తోంది.
మా ఆవిడ నిన్న షాపింగ్ కి వెళదామని హ్యాండ్ బ్యాగ్గులో పెట్టుకున్న ఐదువేలూ కనపడ్డo లేదు. మిగతా రెండువేలూ ఎక్కడపెట్టావో చెప్పమంటే చెప్పట్లేదు. ఇప్పుడు మీరు వచ్చారుగా.. అడిగి చూడండి, ఏవైనా చెబుతుందేమో" కోపంతో ఊగిపోతున్న కొడుకు ప్రసాద్ వంక కుమిలిపోతూ చూస్తున్నాడు రమణమూర్తి.
"చూడరా! కన్నతల్లిని పట్టుకుని దొంగది అంటున్నాడు. పోనీ ఆ డబ్బు ఎక్కడిదో చెప్పమంటే, మౌనంగా నిందనైనా భరిస్తోంది కానీ, తనూ చెప్పట్లేదురా. అంతా నా ఖర్మ!" చేత్తో తల కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు రమణమూర్తి.
"వదినా! నువ్వైనా చెప్పు. ఈ డబ్బు నీకెక్కడిది? మూర్తికి కూడా తెలియకుండా ఎందుకు దాచావు? చెప్పకపోతే కొడుకు ఇంట్లోనే దొంగతనం చేశావన్న మచ్చ మిగిలిపోతుంది" ఆమె నోటివెంట ఏ నిజం వినాల్సి వస్తుందోనని భయపడుతూనే అడిగాడు రాధాకృష్ణ.
"కోడలు అంటే పరాయి ఇంటినుంచి వచ్చిన పిల్ల. కొడుకే నాపై నింద వేసాక.. ఇక నేను సమాధానం చెప్పి ఏం లాభం?" చెదలు పట్టిన దేవుడి పుస్తకాలు చిరిగిపోయినా వాటిని భద్రంగా దాచుకున్న సావిత్రి, ఆ పుస్తకాల చిరుగుల పేజీల మధ్యనుంచి మూడువేలూ తీసి కొడుకు చేతిలో పెట్టింది.
"హు! ఈ రోషమేదో ముందే ఉంటే ఇంత గొడవ జరిగేది కాదు" విసురుగా ఆ డబ్బు తీస్కుని, పెళ్ళాం చేతిలో పెట్టాడు ప్రసాద్.
"నానమ్మా! పొద్దున్న నీ బ్లెస్సింగ్స్ తీసుకుందామంటే.. రోజూ ఐదింటికే నిద్ర లేచే నువ్వు ఈరోజు ఎనిమిదైనా లేవలేదు. ఇప్పుడైనా దీవించు.. ఈరోజు నా బర్త్ డే అని అందరూ మర్చిపోయారు నానమ్మా!" అంటూ సావిత్రిని చుట్టేసాడు పన్నెండేళ్ల బబ్లూ.
"బబ్లూ! ఇలావచ్చి ముందు అన్నం తిను" కోపంగా కొడుకుని దూరంగా లాగేసింది శాలిని.
"ఆకలిగా లేదమ్మా! ఈరోజు స్కూల్ కి వెళ్లేముందు చిట్టిబాబు అంకుల్ వాళ్ళ బేకరీలో చాక్లెట్లు, కేకూ కొనుక్కుని ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చాను. అస్సలు ఆకలిగా లేదు. ఇప్పుడేమీ వద్దు" అంటూ బ్యాగ్గులోంచి రెండువేల రూపాయలు తీసి తల్లి చేతిలో పెట్టాడు బబ్లూ.
"ఈ డబ్బు నీకెక్కడిది?" ఆశ్చర్యంగా అడిగింది శాలిని.
"నీ హ్యాoడ్ బ్యాగ్గులోంచి నేనే తీసాను. నిన్న స్కూల్ వెళ్ళేటప్పుడు డబ్బులు తీసుకెళ్లి, చింటూ వాళ్ళ షాప్ నుంచి మా ఫ్రెండ్స్ అందరికీ సర్ప్రైజ్ గిఫ్ట్స్ తెమ్మన్నాను. ఈరోజు స్కూలుకి తెచ్చాడు. నేను కేక్, చాకోలేట్స్ కొన్నాక ఇంకా రెండువేలు మిగిలాయి. అవే ఇవి" అంటూ బబ్లూ చెబుతున్న మాటలకి ప్రసాద్ మొహంలో రంగులు మారాయి.
కోపంతో శాలిని బబ్లూని కొడుతుంటే "అమ్మకి చెప్పే తీసుకువెళ్లచ్చు కద నాన్నా!" అంటూ పిల్లాడిని దగ్గరకి తీసుకున్నాడు మూర్తి.
"అమ్మ ఎప్పుడు చూసినా ఎవరో ఒకరితో ఫోన్లు మాట్లాడుతూ ఉంటుంది. నాన్నేమో క్యాంప్ కి వెళ్లి, అప్పుడే వచ్చారు. విసుగ్గా ఉన్నారు. ఈరోజు కూడా ఆటో వచ్చే టైమ్ అయ్యాక నాకు గుర్తొచ్చి చెబుదామనుకుంటే, అమ్మా, నానమ్మా గొడవాడుకున్న విషయం అమ్మ ఎవరితోనో ఫోన్లో చెబుతోంది.
టైమ్ అయిపోయిందని వెళిపోయాను తాతయ్యా! ఈరోజు నా బర్త్ డే అని మీకు గుర్తు చేద్దామనుకుంటే, ఎవరి కోపంలో వాళ్ళున్నారు" చిన్నబుచ్చుకుని చెబుతున్న బబ్లూని దగ్గరకి తీస్కుని, ప్రేమగా తల నిమురుతూ.. "దీర్ఘ ఆయుష్మాన్ భవ" అంటూ దీవించింది సావిత్రి.
"సావిత్రీ! ఇప్పుడైనా ఆ డబ్బు నీకెక్కడిదో చెబుతావా?" దీనంగా అడుగుతున్న భర్తతో..
"ఎక్కడిదైతేనేం? ఆ రెండు వేలకీ, ఈ మూడు వేలూ కలిపితే అయిదు వేలూ లెక్క సరిపోయిందిగా" ముక్కు ఎగబీలుస్తూ చెప్పింది సావిత్రి.
"వదినా! నీ మీద నమ్మకం లేక కాదు.. ఇక్కడ అందరికీ నిజం తెలియడం అవసరం. ప్లీజ్.. చెప్పు" బ్రతిమాలుతున్నాడు రాధాకృష్ణ.
"ఏం చెప్పమంటావయ్యా? తెలిస్తే ఆయన బాధ పడతారనే చెప్పలేదు. రెండు రోజుల క్రిందట నా స్నేహితురాలితో వాకింగ్ కి వెళ్ళినప్పుడు, మా కాలనీలో జరిగిన రక్తదాన శిబిరంలో రక్తం ఇచ్చి వచ్చాను. అందుకు వారు ఓ సర్టిఫికెట్ తోపాటు, మూడువేలు నగదు కూడా ఇచ్చారు. ఆయన మందులకి వాడిని అస్తమానూ డబ్బు అడిగి ఇబ్బంది పెట్టడం ఎందుకని.. ఈ డబ్బు జాగ్రత్తగా దాచి ఉంచాను" చెబుతున్న భార్యకి చేతులెత్తి నమస్కరించిన రమణమూర్తి, ఏడుస్తూ తలపంకించాడు.
ఇంత జరిగినా, భార్య చెంపమీద చెళ్లుమనిపించకపోగా, కనీసం తల్లిని క్షమాపణ అడగని బండరాయిలాంటి ఆ కొడుకుని చూస్తే రాధాకృష్ణ రక్తం ఉడికిపోయింది.
"మూర్తీ! ఇక ఈ ఇంట్లో మీరు ఒక్కక్షణం కూడా ఉండొద్దు. శ్యామల ఇంకో మూడు నెలల వరకూ అమెరికా నుంచి తిరిగిరాదు. తర్వాత ఏదో ఒక ఇల్లు చూస్తాను.. ఈ లోపు మీ డబ్బు ఈ విశ్వాశ ఘాతకుడి దగ్గర్నుంచి ఎలా రాబట్టాలో నాకు తెలుసు. లాయరు ద్వారా నోటీసు పంపించి, మొత్తం రాబడతాను.
ఇంకా మీరు ఇక్కడే ఉంటే.. మీ జీవిత పుస్తకంలో ఒక్కో పేజీ నమిలేసిన చెదపురుగుగా ఈ దౌర్భాగ్యుడు మిగిలిపోతాడు. మీకు పిల్లలు పుట్టలేదనుకుని, ఇప్పటికైనా ఈ నరకం నుంచి బయటకు రండి" ఆవేశంగా చెప్పి, స్నేహితుడినీ, అతని భార్యనీ తీసుకుని బయటకి నడిచాడు రాధాకృష్ణ.
---------సమాప్తం------
వేలూరి ప్రమీలాశర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వేలూరి ప్రమీలాశర్మ
నమస్తే!
నేను రాసిన కథలను మీ పత్రికలో ప్రచురణకు స్వీకరించినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.
విశాఖపట్నం కు చెందిన వేలూరి ప్రమీలాశర్మ అను నేను, వృత్తిరీత్యా న్యూస్ రీడర్ గా, న్యూస్ కరెస్పాండెంట్ గా ఉన్నాను. నా రచనలు ఇంతవరకు ఆకాశవాణిలో 2 సీరియల్స్, పలు నాటికలతోపాటు, వివిధ పత్రికలలో వందకు పైగా కథలు ప్రచురించబడ్డాయి. తొలి ప్రచురణ "గజల్ సౌరభాలు" 2022 నవంబర్ లో రిలీజ్ అయ్యింది. కృష్ణమాలికలు శతకం అముద్రితం.
వారం రోజుల్లో 25 కథలతో కూడిన కథాసంపుటి ఒకటి ఆవిష్కరణకు రానుంది. నా భర్త వేలూరి గోపాలకృష్ణ శర్మ (విశాఖ కస్టమ్స్ మరియు సెంట్రల్ ఎక్సయిజ్ dept), మరియు నా కుమార్తెలు నిఖిత, సంహితల సహకారం, ప్రోత్సాహంతో మరిన్ని రచనలు చేయాలన్న ఆకాంక్షతో, తెలుగు సాహిత్యం పట్ల మక్కువతో ముందుకు సాగుతున్నాను. మన తెలుగు కథలు.కామ్ ద్వారా నా కథలు పరిచయం అవుతున్నందుకు మరోసారి ధన్యవాదాలు.
ఇట్లు,
వేలూరి ప్రమీలాశర్మ.
Comments