top of page

చెదిరిన కల

#DVDPrasad, #డివిడిప్రసాద్, #చెదిరినకల, #Chedirina Kala, #TeluguCrimeStory


'Chedirina Kala' - New Telugu Story Written By D V D Prasad

Published In manatelugukathalu.com On 28/10/2024

'చెదిరిన కల' తెలుగు కథ

రచన: డి వి డి ప్రసాద్

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



కెవ్వుమని అరిచి నిద్రలోంచి లేచి కూర్చుంది రేణుక. ఆమె వళ్ళంతా చెమటతో తడిసిపోయింది. శరీరం వణుకుతోంది. ఆమె అరిచిన అరుపుకి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు రాజీవ్. ఆమె ఎందుకలా అరిచిందో ఒక్కక్షణం అర్ధం కాలేదు. టైం చూసాడు. రాత్రి ఒంటిగంట దాటింది. ఆమె చేతికి మంచినీళ్ళ బాటిల్ అందించాడు. మంచినీళ్ళు అందుకొని గటగటా తాగిందామె. ఆమెవైపు చూసాడు రాజీవ్. ఇంకా వణుకుతూనే ఉంది ఆమె.


"ఏం జరిగింది? మళ్ళీ ఏమైనా భయంకరమైన కలగన్నావా?" అదుర్దాగా అడిగాడు రాజీవ్ ఆమె నుదిటిమీద చెయ్యవేసి.

అవునని తలాడించిందామె. ఆమె మొహంలో భయం కొట్టొచ్చినట్లు కనపడింది రాజీవ్ కి.


"రోజంతా ఆలోచించడంవల్ల నీకు అలాంటి కలలే మాటిమాటికీ వస్తున్నాయి. నీ ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకో!" ఆమెను అనునయిస్తూ అన్నాడు రాజీవ్.


ఒక్కక్షణం ఆమె ఏమీ మాట్లాడలేదు. కల కలిగించిన అలజడి నుండి ఆమె ఇంకా పూర్తిగా తేరుకోలేదు. ఆమె ముఖాన్ని భయం వీడలేదు. ఖాళీ చేసిన మంచినీళ్ళ సీసా ఆమె చేతిలోంచి అందుకొని టీపాయ్ పై పెట్టాడు. 


"కళ్ళు మూసుకొని నిద్రపో! ఏమీ ఆలోచించకు, నిద్రపడుతుంది." ఆమెను సాంత్వన పర్చాడు రాజీవ్.


కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ప్రయత్నించింది రేణుక. కళ్ళు మూసుకున్నా, మళ్ళీ తను కలలో చూసిన దృశ్యమే కనపడటంతో నిద్రపట్టక మంచం మీద అటూ ఇటూ దొర్లసాగింది. పక్కకి తిరిగి చూసిన రేణుకకు భర్త రాజీవ్ అప్పటికే గాఢ నిద్రలో మునిగిపోవడం కనిపించింది. తనని అంతగా కలవరపరచిన కల గుర్తుకు రాసాగింది. 


రాత్రి వేళ! ఇంట్లో తనొక్కర్తే ఉంది. రాజీవ్ ఎటో వెళ్ళాడు. బయట ఏదో అలికిడికాగా తలుపు తెరుచుకుని బయటకు వచ్చింది తను. చాలా పెద్ద స్థలంలో విశాలంగా కట్టిన ఇల్లు, ముందుకి చిన్న తోటతో చూడ ముచ్చటగా ఉంది. నీలాకాశంలో నిండు చంద్రుడు వెన్నెల విరజిమ్ము తున్నాడు. వెన్నెల్లో మొక్కలన్నీ వింతకాంతితో మెరుస్తున్నాయి. దూరంగా గేటుకు ఇరువైపులా రెండు పెద్ద చెట్లున్నాయి. శీతాకాలం ప్రారంభం కావడంతో ఆకులన్నీ రాలి, కొమ్మలు మాత్రమే కనిపిస్తున్నాయి. అకస్మాత్తుగా కుడివైపు ఉన్న చెట్టు మీద రేణుక దృష్టిపడింది. 


వెన్నెల వెలుగులో ఆ చెట్టుకింద ఎవరో ఓ మనిషి నిలబడి ఉండటం లీలగా కనిపించిందామెకు. అయితే చెట్టు నీడవలన అక్కడెవరున్నారో స్పష్టంగా కనపడలేదు. గేటు లోపల కట్టుదిట్టంగా తలుపు తాళం వేసి ఉండగా లోపలికి ఎవరు, ఎలా ప్రవేశించారో ఆమెకర్ధం కాలేదు. సెల్ లో టార్చ్ ఆన్ చేసి అటువైపు చకచకా నడిచిందామె. చెట్టు నీడలో ఉన్న ఆకారం మీద టార్చ్ ఫోకస్ చేసిన రేణుక ఒక్కసారి ఉలిక్కిపడింది. ఆమె మరెవరో కాదు తన అక్క రాగిణి! 


మరోసారి కళ్ళు నులుముకొని మరీ చూసింది...సందేహం లేదు ఆమె రాగిణే! తను ఆఖరిసారి ఆమెను చూసినప్పుడు వేసుకున్న ఆకుపచ్చ డ్రస్ వేసుకొని ఉంది. తనకి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోందామె. నెలరోజుల క్రితం చనిపోయిన తన ప్రియాతిప్రియమైన అక్క అకస్మాత్తుగా తన ఎదుట అలా కనిపించేసరికి మతిపోయింది. వీపరీతమైన దుఃఖంతో పాటు భయం కూడా కలిగింది. అప్రయత్నంగా ఆమెవైపు రెండడుగులు ముందుకి వేసిందామె, 

"అక్కా!...అక్కా!..." అంటూ. 


హఠాత్తుగా అక్కడ అంతవరకూ నిలబడి ఉన్న రాగిణి రూపం ఉన్నట్లుండి అదృశ్యమైపోయింది. అప్పటివరకూ అక్కడ ఉన్న ఆమె ఎలా మాయమైందో అర్ధంకాక నలువైపులా చూసింది. 'తన అక్క చనిపోయాక దయ్యంగా రూపం దాల్చిందా' అన్న అనుమానం ఆమెలో కలగగానే భయంతో వణికిపోయి కేకపెట్టిందామె.


కలంతా గుర్తుకు రాగా రేణుక కళ్ళలోంచి రెండు కన్నీటి బిందువులు రాలి దిండును తడిపాయి. రాగిణి...తన అక్క ఘోరమైన రోడ్డు ప్రమాదంలో మరణించి నెలరోజులైంది. ఈ నెల రోజులలో చాలా సార్లు ఆమె తనకు కలలో కనిపించి, ఏదో చెప్పబోతోంది, అంతే! మళ్ళీ మరుక్షణం అదృశ్యమైపోతూ ఉంది. ఎంత వద్దనుకుంటున్నా రేణుక ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి.

 ******

"రేణుకా, నీకో శుభవార్త!" అని అమెరికాలో ఉన్న అక్క రాగిణి దగ్గరనుండి ఫోన్ వచ్చింది రేణుకకు.


"ఏమిటే ఆ శుభవార్త, త్వరగా చెప్పు! సస్పెన్స్ భరించలేకపోతున్నాను" అంది రేణుక ఆతృతగా.


"మీ బావగారికి మన దేశం మీదకు మనసు మళ్ళింది. ఇక్కడ ఉన్న వ్యాపారాలు, ఆస్తులు అన్నీ ఆమ్మేసి వచ్చేద్దామని అనుకుంటున్నాం. పైగా మీరున్న చోటే స్థిరపడాలని నిర్ణయించుకున్నారతను. మరిదిగారితో మాట్లాడారుట. అక్కడే పారిశ్రామిక వాడలో కావలసిన స్థలం సేకరించడం కోసం మరిదిగారు సహకరించారు కూడా." అంది రాగిణి.


అక్కా బావా భారత దేశం తిరిగి రావడమే కాకుండా, తమ ఊళ్ళోనే నివశించాలని నిర్ణయించుకోవడం రేణుకకు చాలా ఆనందం కలుగజేసింది.


"ఓహ్...నిజంగా ఇది శుభవార్తే! మనం ఇక కలిసి ఒకే ఊళ్ళో ఉండొచ్చు. అయితే, అతనికి ఈ విషయం తెలుసన్నమాట, మరి నాకు చెప్పనేలేదు." అంది రేణుక.


"పని సందడిలో మరిచిపోయి ఉంటారులే, నేనే చెప్పాలనుకొని ఎప్పటికప్పుడు ఏదో పనిపడి మర్చిపోతూ ఉంటాను." అంది రాగిణి. 


"పోనీ ఇప్పటికైనా చెప్పావు! మీ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాను. మరి...చిన్నది పింకీ ఎలా ఉంది?" అని అడిగింది.


"బాగానే ఉంది, సరే! మళ్ళీ ఫోన్ చేస్తాను, మీ బావగారు ఎందుకో పిలుస్తున్నారు." అని ఫోన్ కట్టేసింది రాగిణి.


రాజీవ్ ఆఫీసు నుండి వచ్చాక నిలదీసింది రేణుక అక్కాబావా ఇండియా వస్తున్నట్లు తనకెందుకు చెప్పలేదని.


"సారీ రేణూ...పనిలో బిజీగా ఉండి చెప్పలేకపోయాను. మీ బావ రాహుల్ పనిమీదే తిరుగుతున్నాను. నిన్ననే ఫ్యాక్టరీ సైట్ చూసొచ్చాను కూడా. మళ్ళీ సారీ...నీకు ఆనందం కలిగించే విషయం త్వరగా చెప్పనందుకు." అని ఆమెకి సంజాయిషీ ఇచ్చాడు రాజీవ్.


ఆ రోజంతా చాలా ఆనందంగా గడిపింది రేణుక. అక్క ఎప్పుడొస్తుందా, ఎంత త్వరగా వాళ్ళందర్నీ కలుసుకుంటానా అని ఎదురు చూస్తోంది ఆమె.


సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా అమెరికా వెళ్ళిన రాహుల్ ఆ తర్వాత స్వంతంగా ఓ సంస్థ ప్రారంభించాడు. అందులో మంచి ఆదాయం రావడంతో ఆటోమొబైల్ రంగంలో కూడా అడుగుపెట్టాడు. త్వరలోనే, అక్కడ ధనవంతుల జాబితాలో చేరిపోయాడు. పదేళ్ళ తర్వాత మాతృదేశం వచ్చి, ఇక్కడే ఓ పరిశ్రమ స్థాపించాలని నిర్ణయించుకున్నాడు. తన సంస్థద్వారా పలువురికి ఉద్యోగవకాశాలు లభిస్తాయని, తద్వారా తన మాతృదేశ ఋణం తీర్చుకోవాలన్న సంకల్పం కలిగింది. 

ఆ ఆలోచన వచ్చిందే తడువుగా భార్య రాగిణికి విషయం చెప్పేసరికి ఆమె సంతోషంగా అందుకు అంగీకరించింది. తన తోటల్లుడైన రాజీవ్ తో విషయం చెప్పి, తను స్థాపించబోయే పరిశ్రమకు అనువైన స్థలం సేకరించమని కోరాడు. రాజీవ్ కూడా వెంటనే స్పందించి అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ తన భుజస్కందాలపైన వేసుకున్నాడు. 


తనను భాగస్తుడిగా తీసుకోవడం వల్ల కూడా రాజీవ్ బాధ్యత మరింత పెరిగింది. రాహుల్ భారత దేశం తిరిగి వచ్చేలోగా అన్ని పనులూ పూర్తి చేయాలని, అహోరాత్రులూ శ్రమిస్తున్నాడు రాజీవ్. రేణుక కూడా భర్త పడుతున్న కష్టం గమనిస్తూనే ఉంది.


రేణుక ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఎయిర్ పోర్టులో అక్కని చూసిన రేణుక కళ్ళు చెమర్చాయి. ఆమెని తనివితీరా హత్తుకుంది.


"మీ అక్కని ఇంక వదిలేయ్ రేణూ, ఇప్పుడు మీ అక్క ఇంకెక్కడికీ పోదు. ఇక్కడే ఉంటుంది." అని ముసిముసిగా నవ్వుతూ రాహుల్ అనేసరికి సిగ్గుపడింది రేణుక.


చిన్నారి పింకిని ఎత్తుకు ముద్దాడింది. 


ఆ తర్వాత పది రోజుల వరకూ అందరూ ఒకే ఇంట్లో గడిపారు. ముందే రాజీవ్ మాట్లాడి ఉంచిన ఓ డూప్లెక్స్ కొన్నాడు రాహుల్. మంచి ముహూర్తం ఉండటంతో వెంటనే గృహప్రవేశం చేసి అందులోకి మారిపోయింది రాహుల్ కుటుంబం.


ఓ వంక ఫ్యాక్టరీ పనులు శరవేగంతో నడుస్తూంటే, తోటల్లుళ్ళిద్దరూ రాత్రీపగలూ తేడా లేకుండా పనిలో నిమగ్నమైపోయారు. చూస్తూండగానే ఆర్నెల్లు గడిచిపోయాయి. పనులన్నీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు అందరూ. ఇంకా ఇవాళో, రేపో ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేస్తారనగా జరిగిందా ఆ దుర్ఘటన. ఆ సైటుకు తీసుకెళ్ళి భార్యకు, కూతురుకు చూపిద్దామని బయలుదేరిన రాహుల్ కారును వెనకనుండి గుద్దిందో గుర్తు తెలియని ట్రక్. 


ఆ ఘోర ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. తన అక్క, బావ, పాప ఆ రోడ్డు ప్రమాదం బారినపడి మరణించిన వార్త తెలిసి రేణుక భోరున విలపించింది. వాళ్ళు ఇక్కడికి వచ్చారని, కలకాలం కలిసి ఉంటారని భావించిన ఆమె శోకానికి అంతేలేదు. ఆమె కన్న కలలు చెదిరిపోయాయి. వాళ్ళు ఇండియా రాకున్నా బాగుండేదని భావించిందామె. ఈ సంఘటన జరిగి నెలరోజులైంది. అయితే వారం రోజులుగా రేణుకకు ప్రతీ రోజూ తన అక్క గుర్తుకు వస్తోంది ఈ విధంగా.

 ******

"చనిపోయినవారిని రోజంతా తలుచుకోవడం వల్ల నీకు అలాంటి కలలు వస్తున్నాయి రేణూ. నీ బాధ నేను అర్ధం చేసుకోగలను. ఇక్కడుంటే నీకు అనుక్షణం మీ అక్కే గుర్తుకు వస్తుంది. మనం కొన్నళ్ళపాటు ఎక్కడికైనా తిరిగి వస్తే, నీ మనసుకి కాస్త ఊరట లభిస్తుంది." రేణుకను అనునయిస్తూ చెప్పాడు రాజీవ్ ఆ రోజు సాయంకాలం.


"ఎక్కడికి వెళ్ళినా ఎలా మా అక్కని మర్చిపోగలను? చిన్నారి పింకీ కూడా కళ్ళ ముందే మెదులుతూ ఉంది." కన్నీళ్ళు పెట్టుకుంది రేణుక. 


అశ్రుపూరితాలైన ఆమె నయనాలు తుడిచాడు రాజీవ్. "నిజమే! విధి చేతిలో మనమందరమూ కీలుబొమ్మలం. ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. సరే! ఓ వారం రోజులు ఊటీ వెళ్ళడానికి ప్లాన్ చేసాను. నీ మనసుకు కొంత సాంత్వన చేకూరుతుంది. 


మరో విషయం! మనం ఊరు మారితే బాగుంటుందని నా ఉద్దేశం. మీ బావ ఎలానూ లేరు. అతని సంస్థలో పని చేస్తానని చెప్పి ఎలాగూ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను కదా! ఊటీ నుండి తిరిగి వచ్చిన వెంటనే మనం విశాఖపట్నం వెళ్ళి స్థిరపడదాం. 


అక్కడ నా స్నేహితుడు నాకో ఆఫర్ ఇచ్చాడు కూడా తన వ్యాపారంలో భాగస్వామిగా చేరమని. ఊరు మారడంతో నీకూ బాగుంటుంది." అన్నాడు.


మౌనంగానే తలూపిందామె. ఇక్కడే ఉంటే అనుక్షణం అక్క రాగిణి గుర్తుకు వస్తుంది. ఆలోచించి, ఆలోచించి తనకి పిచ్చెత్తడం ఖాయం. స్థలం మార్పు తనకిప్పుడు చాలా అవసరం. కాలమే తన మనసుకు తగిలిన గాయం రూపుమాపాలి, అని మనసులో అనుకుంది రేణుక.

 *******

ఊటీలో ఆరు రోజులు ఇట్టే గడిచిపోయాయి. రాజీవ్ మంచి ఫైవ్ స్టార్ హోటల్లో రూం బుక్ చేసాడు. చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు చూడటానికి టాక్సీ మాట్లాడాడు. ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరే రేణుక, రాజీవ్ లు మళ్ళీ రాత్రి ఏడుగంటల తర్వాతే హోటల్ కి తిరిగి వచ్చేవారు. రాజీవ్ తనపై కురిపించిన ప్రేమతో తన దుఃఖాన్ని కొంతవరకూ మర్చిపోగలిగింది రేణుక. మనసుకు ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో రేణుక మనసు కొద్దిగా తేలికైంది.


మరుసటి రోజే తిరుగు ప్రయాణం కావడంతో రేణుక రూములో ఉండి బట్టలు, సామాన్లు సర్దసాగింది. మరుసటి రోజు మధ్యాహ్నం వరకూ చూడని ప్రదేశాలు చూసి, హోటల్లో భోజనం చేసి తిరుగు ప్రయాణం చేయాలని ప్లాన్ చేసాడు రాజీవ్. రాజీవ్ బయటకు వెళ్ళడంతో ఏం చెయ్యాలో తోచని రేణుక టివి ఆన్ చేసింది.


ఇంతలో సెల్ మోగడంతో ఉలిక్కిపడి చూసింది. అది రాజీవ్ సెల్. రాజీవ్ తన సెల్ తీసుకెళ్ళడం మర్చిపోయాడని తెలుసుకొని చూసింది ఎవరివద్దనుండి ఫోన్ వచ్చిందోనని. రాజన్ అనే వ్యక్తి నుంచి వచ్చిందా కాల్. బహుశా రాజీవ్ స్నేహితుడేమో, అతను బయటకు వెళ్ళారని, తర్వాత ఫోన్ చెయ్యమని చెబుదామని సెల్ ఎత్తిందామె.

అటువైపు నుండి, "హల్లో గురూ..." అంటూ తనని మాట్లాడనీయకుండా గబగబా మాట్లేడేస్తున్న ఆ వ్యక్తి ధాటికి విస్తుపోయి అతను చెప్పింది విని ఫోన్ పెట్టేసిందామె.


ఇంటిముందు కారు ఆపి దిగారు రేణుక, రాజీవ్. తమ ఇంటిముందు పోలీసులుండటం ఆశ్చర్యం కలిగించింది రాజీవ్ కి.


"ఏ జరిగింది ఇన్స్పెక్టర్? మా ఇంట్లో దొంగతనమేమైనా జరిగిందా?" ఆదుర్దాగా అడిగాడు రాజీవ్ తనకెదురుపడిన పోలీస్ ఇన్స్పెక్టర్ని.


"ఏమీ తెలియనట్లు బుకాయించకు మిస్టర్ రాజీవ్! స్వయానా తోటల్లుడైన రాహుల్, అతని కుటుంబాన్ని చంపడానికి మీరు సృష్టించిన ఏక్సిడెంట్ గురించి మా దగ్గర పక్కా సాక్ష్యాలు ఉన్నాయి. యూ ఆర్ అండర్ అరెస్ట్." అన్నాడు ఇన్స్పెక్టర్ సాంబశివరావు.


ఒక్కసారి కోపం కట్టలు తెంచుకొంది రాజీవ్ కి.

"అధికారం ఉందికదా అని, నిందలు మోపకండి ఇన్స్పెక్టర్! నేనెందుకు మావాళ్ళని ప్రమాదానికి గురి చేస్తాను? అందువల్ల నాకేమి ప్రయోజనం?" అన్నాడు రాజీవ్.


చిరునవ్వు నవ్వాడు సాంబశివరావు.

"ఉంది మిస్టర్ రాజీవ్! మీ తోటల్లుడు రాహుల్ పంపిన డబ్బులన్నీ మీ పేర్న మార్చేసుకున్నారు. మీ పేర్న పవర్ ఆఫ్ ఆటర్నీ చేయించుకొని ఇక్కడ కొన్న ఆస్తులన్నీ కూడా మీ పేర్న చేసుకున్నారు. ప్రస్తుతం అవన్నీ అమ్మి, ఇక్కణ్ణుంచి శాశ్వతంగా మకాం మార్చే ప్రయత్నంలో ఉన్నారు. అందుకే రాహుల్ అడ్డు తొలగించుకోవడం కోసం అతన్నికుటుంబంతో సహా హత్య చేయించారు రోడ్డు ప్రమాదం ద్వారా." చెప్పాడు సాంబశివరావు రాజీవ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ.


అతని చూపులకి కలవరపడ్డాడు రాజీవ్.


అయినా మొండిగా, "నాకేం తెలియదు, నేనెందుకలా చేస్తాను? అయినా అందుకు రుజువులేవీ?" అన్నాడు.


"రాజన్ మా చేతికి చిక్కాడు. నువ్వూ, అతనూ కలిసి పన్నిన కుట్రంతా బయటపడింది. మీ శ్రీమతి మాకు సమాచారం ఇవ్వడం వల్ల తీగలాగితే డొంకంతా కదిలింది." అని రేణుక వైపు చూసాడు ఇన్స్పెక్టర్ సాంబశివరావు.


నమ్మలేనట్లు రేణుకవైపు చూసాడు రాజీవ్.


"అవును, నేనే ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసి అంతా చెప్పాను. మీరు బయటకెళ్ళిన సమయంలో మీ స్నేహితుడు రాజన్ ఫోన్ వస్తే ఎత్తాను. విషయమంతా బయటపడింది. అయినా, మీరిలాంటి పని ఎలా చేసారండి? మా అక్కని, బావని, చిన్నారి పింకినీ చంపించడానికి మీకు చేతులెలా వచ్చాయండీ? 


హత్యలు చేసి వాళ్ళ ఆస్తుల్ని కాజేసి మనమేమైనా సుఖంగా ఉండగలమా? నా వాళ్ళు లేకపోయాక, ఆ ఆస్తులు నాకేమైనా సుఖాన్ని ఇవ్వగలవా? చెప్పండి, ఎందుకు చేసారిలాంటి పని?" ఉగ్రరూపం ధరించిన రేణుక రాజీవ్ షర్ట్ కాలర్ పట్టుకొని ఊపేస్తోంది. 


ఆమె చూపుల్లో రాజీవ్ పట్ల అసహ్యం, కోపం మిళితమై ఉన్నాయి. ఆమె కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి. 

తెల్లగా పాలిపోయిన మొహంతో తల వంచుకు నిలబడ్డాడు రాజీవ్.


"మేడం! మీరు శాంతించండి! ఇలాంటి నీచులకు చట్టమే తగిన బుద్ధి చెప్పాలి, తగిన శిక్ష విధించాలి. అప్పుడే చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది." అంటూ రాజీవ్ చేతికి అరదండాలు వేసాడు ఇన్స్పెక్టర్ సాంబశివరావు.


నీళ్ళు నిండిన రేణుక కళ్ళముందు చెదిరిన కల, అందులోంచి తన అక్క రాగిణి రూపం కనుమరుగైపోవడం కనపడసాగింది.

 ******


దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


72 views3 comments

3 Comments


కథ బావుంది

Like


@vsnmurthy8946

4 hours ago

Very nice

Like
Replying to

Thanks

Like
bottom of page