చీరమీను
- BVD Prasada Rao
- Nov 23, 2024
- 5 min read
#BVDPrasadaRao, #బివిడిప్రసాదరావు, #Cheerameenu, #చీరమీను, ##TeluguHeartTouchingStories

Cheerameenu - New Telugu Story Written By BVD Prasada Rao
Published In manatelugukathalu.com On 23/11/2024
చీరమీను - తెలుగు కథ
రచన: బివిడి ప్రసాదరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
తోడల్లుడు పిలుపు మేరకు బుర్లంక వచ్చాను నా భార్యాపిల్లలతో.. నిన్న ఉదయం.
మూడు రోజుల క్రితమే దీపావళి పండుగకు పార్వతీపురం నుండి రాజమండ్రి అత్తవారింటికి వచ్చాం మేము.
బుర్లంక ఆతిథ్యము ముగించుకొని తిరిగి రాజమండ్రి బయలుదేరాం కారులో.
ఉదయం ఏడు దాటుతోంది. పొగమంచు పల్చగా ఉంది. శీతల గాలి మూలంగా చలి బాగా ఉంది.
వేమగిరి చేరాం.
ఆ దారిలో.. జనాల మూకలు.. జాస్తీగా కనిపించగా.. పరికించి అటు చూసాను.. కారును స్లో చేస్తూనే.
"చేపల అంగళ్ళు." చెప్పింది ఫ్రంట్ సీట్ లో ఉన్న నా భార్య లక్ష్మి.
"భలే." ముచ్చట పడుతున్నాడు నా వెనుకన.. బేక్ సీట్ లో ఉన్న.. మా ఆరేళ్ల కొడుకు సాయి. వాడు కారు బేక్ సైడ్ వ్యూ మిర్రర్ వైపు ఎగబ్రాకుతున్నాడు.
నేను కారు ఆపడం లేదు.
"అవును కదూ.. ఇప్పుడే చిట్టి చేపల సీజన్ మొదలవుతోందిగా. అవే అమ్మకాలకు పెట్టారు. కారు ఆపండి." చెప్పింది లక్ష్మి.
కారు ఆపే వీలు నాకు కావడం లేదు. అక్కడి మార్కెట్ మొత్తం రద్దీ రద్దీగా ఉంది. కారును ముందుకు నడపడమే కష్టమవుతోంది.
"కారు ఆపి దిగే వీలు లేదు." అంటూనే కారును ముందుకు పోనిస్తున్నాను.
అప్పటికే డోర్ మిర్రర్ కి కర్చుకుపోయింది.. లక్ష్మి వెనుకన.. బేక్ సీట్ లో ఉన్న మా మూడేళ్ల కూతురు జున్ను.
"ఫిష్ లు గమ్మత్తుగా ఉన్నాయి." అంటోంది.
"మీ గోదారోళ్లు పరమ తిళ్లోళ్లు." అన్నాను.
"మరే. మేమే పళ్లెం వెంబడి పళ్లెం.. నాక్కు తింటాం." చిత్రంగా అంది లక్ష్మి.
లక్ష్మి దెప్పడం నాకేనని నాకు తెలుసు. అందుకే చిన్నగా నవ్వేను.
"ఏమాటకామాట.. మీ వైపు వంటకాల రుచులు లొట్టలేయిస్తాయిస్మీ. అందుకే కక్కుర్తి పడేది." ఒప్పుకున్నాను. చిన్నగా నవ్వేసాను.
"అదీ మాట. అలా దారిలో ఉండండి. మరి మమ్మల్ని అనకండి." లక్ష్మి కూడా నవ్వేసింది.
"రేపు మా అన్నని పంపి మీకై ఈ చిట్టి చేపలు తెప్పిస్తాను లెండి." చెప్పింది.
"మామయ్యతో నేనూ వస్తాను మమ్మీ." సాయి అంటాడు.
ఆ వెంబడే..
"లైవ్ లో ఫిష్ లు భలేగా ఉన్నాయి." గందికగా చెప్పాడు.
"అలానేలే." ఒప్పుకుంది లక్ష్మి.
జున్ను ఏమీ అనక సర్దుకు కూర్చుంది.
అతి ప్రయాసతో కారును ఆ మార్కెట్టు దాటించగలిగాను.. పది నిముషాలకి.
ఎండ తగులుతోంది. కారు సాఫీగా ముందుకు పోగలుగుతోంది.
"చిట్టి చేపలా. నేను ఇదే చూడ్డం." చెప్పాను.
"అవునా. మనం దీపావళికి వచ్చి చాన్నాళ్లు అవుతోందిగా. చిట్టి చేపలు దొరికేది ఈ సీజన్ లోనే." చెప్పింది లక్ష్మి.
ఆ వెంబడే..
"నిజానికి వీటిని చీరమీనులు అంటారు." అంది.
"చీరమీనులా." ఆశ్చర్యమయ్యాను.
"ఆఁ. మరే.. రంగు, రంగు చీరలను వలల్లా నీటిలో వేసి వీటిని పడతారు. ఇవి రంగులకు ఆకర్షింపబడతాయట." చెప్పింది లక్ష్మి.
నేను వింత పడుతున్నాను.
"ఇవి మరీ చిన్నవి. గుంపులు గుంపులుగా చీరల్లో పడి చిక్కుతాయి. చూడ్డానికి ఇంతే.. అంటే.. మూడంగుళాలలోపు సైజున ఉంటాయి. కానీ రుచిలో రారాజులివి." గొప్పగా చెప్పుతోంది లక్ష్మి.
నేను వింత పడడం కొనసాగుతోంది.
"ఇవి లభించే రోజులు.. కార్తీక మాసం లోనివైనా.. వీటి రుచికి వీటిని తినక మానరు. పైగా ఇవి ఆరోగ్యాన్ని పుష్కలంగా సమకూర్చిపెడతాయట కూడా." చెప్పడం ఆపింది లక్ష్మి.
నేను కుతూహలమయ్యాను. లొట్టలేసాను.
కారు సాఫీగా పోతోంది.
ఏమైనా గోదావరి పరిసరాల ప్రకృతే ప్రకృతి. ఇక్కడి పరిసరాలు చక్కని చిక్కని పచ్చని ఆహ్లాదపర్చేవి అంటే ఎంత మేరకూ అతిశయోక్తే కాదు.
వీలు వెంబడి చుట్టు పక్కలను పరికిస్తూ ముందుకు కారును పోనిస్తున్నాను.
అప్పుడే.. ఓ పక్కగా.. చెట్టు క్రిందన ఓ అంగడి కనిపించింది.
అక్కడే.. ఎవరో.. ఓ ముసలిది.. రమారమీగా రోడ్డు మీదికి వచ్చి చేతులు ఊపుతూ కనిపిస్తోంది. ఆమె కుడి అర చేతిలో పొడుగాటి పల్చని కర్ర ఒకటి ఉంది.
నేను కారు స్లో చేసాను.
"చిట్టి చేపలులా ఉన్నాయి. కారు ఆపండి." అంతలోనే అంది లక్ష్మి.
నేను ఆ ముసలిదానికి.. కొద్ది దూరంగా.. రోడ్డుకు పక్కగా.. కారును ఆపాను.
ముసలిది అంగడి చేరిపోయింది. చేతిలోని కర్రతో కాకులను అదిలిస్తోంది. ఆ చెట్టు కొమ్మల మీద చాలా కాకులు వాలున్నాయి.
లక్ష్మి కారు దిగేసింది. ఆ వెంబడే.. పిల్లలూ దిగేసారు. వాళ్లు ఆ అంగడి చేరేసారు.
నేను తప్పక దిగాను.
"రండమ్మా.. తాజా వేటవి. కండ పట్టిన సీరమీనాలు."
అంటూనే ఆ ముసలిది.. చేపల మీది కప్పిన వల ముక్కలను తొలిగిస్తోంది.
అక్కడ.. ఒక బకెట్ నిండగా.. ఒక వెదురు రేకుల గంప నిండగా.. చేపలు ఉన్నాయి. అవి చూడ్డానికి సన్నని సేమియాల పాయసంలా ఉన్నాయి. లక్ష్మి చెప్పేలా అవి అంగుళం.. మూడంగుళాల లోపు సైజుల్లో ఉన్నాయి.
"ఎలా." అడుగుతోంది లక్ష్మి.
"సేరు మూడేళ్లు." చెప్పింది ముసలిది.
"సేరా.. మూడేళ్లా.." నేను తికమకవుతున్నాను.
"అదే.. సేరంటే శేరు.. అంటే సుమారు కేజీ. మూడేళ్లు అంటే మూడు వేలు." చెప్పింది లక్ష్మి.
"అబ్బో. జాస్తీయే. ఇంత కాస్ట్లీయా." అనేసాను.
లక్ష్మి ఏమీ అనలేదు.
కానీ, ఆ ముసలిది.. నా మాటలు పట్టించుకున్నట్టు ఉంది..
"నేను సెప్పింది రివాజీ రేటే అయ్యా. ఏమ్మా.. మీరు ఇటుపోళ్లులా ఉన్నారు. మీకు తెలుస్తుందిగా. నేను బేరాల రేటు సెప్పడం లేదు." చెప్పింది ముసలిది.
నేను లక్ష్మిని చూసాను. లక్ష్మి చేపల్ని పరిశీలిస్తోంది.
అప్పుడే.. "ఆడ బజారున వేగ లేననే ఈడ నిలిసాను. పైగా నా సరుకు తక్కువ. పెద్ద పెద్ద బుట్టల చోటునే బేరాలు సాగుతాయి. నేను ఆడ మెసలలేననే ఈడ పడ్డా. అలా అని నావి నాసైనవి కావు. సూసుకోండి." ఆ ముసలిది అంది.
"నీది మారు అమ్మకమా." లక్ష్మి అడుగుతోంది.
నాకు లక్ష్మి ప్రశ్న అర్థం కాలేదు. నేనే అడగబోతుండగా..
"అవును తల్లీ. ఇవి దొరికే కాలం కదా.. నాలుగు పైసలకై అవస్త. మా పేటలో ఒకడి నుండి వీటిని కొన్నాను. కొద్ది లాభంకి అమ్ముకుంటున్నాను." ముసలిది చెప్పింది.
అప్పటికి లక్ష్మి ప్రశ్న అర్థమయ్యింది.
"ఇంత వయస్సులో నువ్వు ఇంత అవస్థ పడుతున్నావు. నీకు ఎవరూ లేరా." లక్ష్మి అడిగింది.
"లేకేమమ్మా. కొడుకు పుట్టాడు. ఇంటాయన పోయకే.. కొడుకు కొరివయ్యాడు. ఒకదాన్ని లేపుకొని ఎటో పోయాడు." చెప్పింది ముసలిది.
ఆ వెంబడే..
"సావలేనమ్మా. బతకాలి కదమ్మా." అంటోంది.
లక్ష్మి జాలవ్వడం నేను గుర్తించాను.
"శేరు ఇవ్వు." చెప్పేసింది.
"అరె.. ఆగు. బేరమాడు. మరీ ఎక్కువ చెప్పుతున్నట్టు లేదా." అడ్డై అనేసాను గమ్మున.
"వీటి రేటు అంతే." తేలిగ్గా అనేసింది లక్ష్మి.
"సంతోసమ్మా. అమ్మా.. మొత్తం రెండు సేర్లే. తీసుకోండమ్మా. మల్లీ మల్లీ ఇలాంటివి దొరకవు. నాదామి. బాగుంటాయి." చెప్పింది ముసలిది.
పిల్లలు.. చేపలను ఇంకా విడ్డూరంగానే చూస్తూ ఉన్నారు.
నేను తల తిప్పాను.
లక్ష్మి నన్ను చూస్తోంది.
"అంత పెట్టి కొనాలా. పైగా ఇన్నెందుకు." అనేసాను.
"శేరు తీసుకుంటాను." చెప్పింది లక్ష్మి.
నేను చెప్పబోయేలోగా..
లక్ష్మి కారు వైపు కదిలేసింది. బహుశా ప్లాస్టిక్ కవర్ కోసమేమో.
అంతలోనే గట్టి మూలుగులాంటి శబ్దం వినిపించగా.. గబుక్కున అటు చూసాను.
ఆ ముసలిది ఇసుక కుప్పలా కూలిపోతోంది..
నేను అతృత పడ్డాను. "లక్ష్మీ.." అనేసాను గట్టిగానే.
పిల్లలు.. నా వెనుక్కు చేరిపోయారు.
లక్ష్మి మా వైపు చూస్తూనే.. కారు వైపు నుండి వచ్చేసింది.
ఆ ముసలిది నేలన పడిపోయింది. గుండెను అదిమి పట్టి.. చెమటలు కక్కేస్తోంది.
"ఏమైందవ్వా." లక్ష్మి గాభరా పడుతోంది. ఆవిడ దరిన.. సర్రున ముడుకుల మీద కూర్చుండి పోయింది.
పిల్లలు బెదురుతున్నారు.
"ఏమండీ.. అవ్వకు గుండె పోటు వచ్చినట్టు ఉంది." లక్ష్మి అంటోంది.
నేను అయోమయంలో పడ్డాను. చుట్టూ చూసాను. దరిదాపున ఎవరూ కనిపించడం లేదు.
ఏమీ తోచక మా సొదల్లో మేము తచ్చాడుతుండగా.. అప్పుడే.. అటు ఓ లారీ వస్తోంది.
నేను లారీ ఆపే ప్రయత్నం చేసాను.
ఆ లారీవాడు.. అడ్డంగా చేయాడించేస్తూ.. లారీ ఆపకుండానే వెళ్లిపోతున్నాడు.
"అయ్యో.. ఏంటండీ ఇది. మార్కెట్టు వైపు వాళ్లని పిలవాలంటే.. చాలా దూరం వచ్చేసామాయే." లక్ష్మి కంగారయ్యిపోతోంది.
నేను తెములుకున్నాను.
"ఈవిడను వదిలి పోవడం సరి కాదు. దార్లో ఓ హాస్పిటల్ కు తొలుత తీసుకు పోదాం. తర్వాతది తర్వాత ఆలోచిద్దాం." హడావిడిగా చెప్పాను.
ఆ తోవనే.. లక్ష్మి సాయంతో ఆ ముసలిదిని ఎత్తి.. కారు వెనుక సీటులో పడుకో పెట్టాను. అవ్వ తల వైపున సాయిని కూర్చో పెట్టాను.
లక్ష్మి ఫ్రంట్ సీటున కూర్చుంది. ఆమె ఒడిలో జున్ను కూర్చుంది.
నేను కారు స్టార్ట్ చేసేసాను.
ఆ చీరమీనులను అక్కడే వదిలేసాం.
"అవ్వ మూట ఒకటి అక్కడ ఉండడం చూసాను. అదైనా పట్టుకు రావలసింది." నేనన్నాను.
ఆ వెంబడే.. కారు ఆపాను. నేనే దిగాను. పరుగులాంటి నడకతో అవ్వ అంగడి చేరాను.
అప్పటికే బోలెడు కాకులు అక్కడ చేరిపోయి ఉన్నాయి. అవి ఆ చేపల్ని పొడుచుకు తినేస్తున్నాయి.
నా అలికిడికి అవన్నీ గమ్మున ఎగిరిపోయాయి. ఆ చెట్టు కొమ్మల మీదనే వాలిపోయి.. పొంచి ఉన్నాయి.
నేను ముసలిది మూటను తీసుకొని కారు వైపు కదిలాను.
ఆ కాకులు జోరుగా ఆ చేపలపై తిరిగి వాలిపోతున్నాయి.
మూటను డిక్కీలో పెట్టేసి.. కారును స్టార్ట్ చేసేసాను.
నా తొందర నాది.
అర గంటలోపే ఓ హాస్పిటల్ అగుపించింది. అక్కడ కారు ఆపాను.
స్టాప్ ను పిలుచుకు వచ్చాను.
ఆ ముసలిది హాస్పిటల్ లోకి చేర్చబడింది.
పరీక్ష చేసేక డాక్టర్ వచ్చాడు.
"ఐసిలో పెట్టాలి. టెస్టులు చేయాలి. చాలా నీరసంలో ఉంది. ప్రస్తుతానికి ఫ్లూయిడ్ ఎక్కిస్తున్నాం." చెప్పాడు.
అంతలోనే.. స్టాఫ్ ఒకరు వచ్చి.. నన్ను రిసెప్షన్ వైపు తీసుకు వెళ్లాడు.
"తొలుత పది వేలు కట్టండి." చెప్పాడు.
నా పక్కనే ఉన్నా.. లక్ష్మిని నేను చూడలేదు.. అడగలేదు..
పర్స్ తీసి.. ఆ పది వేలు.. కార్డుతో చెల్లించేసాను.
ఇప్పుడు.. అది ఒక పెద్ద మొత్తంగా నాకు తోచలేదు..
తన లభ్యం లాగే.. మనిషితనాన్ని ఎరికపర్చిన చీరమీనులకు మనసులోనే కృతజ్ఞతలు తెల్పుకుంటున్నాను..
అంతలోనే.. లక్ష్మి నన్ను గట్టిగా కౌగలించుకుంటోంది.. ఎందుకో..
***
బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.

ఈ కథ చీరమీను మన తెలుగు కథల అందం, సాంస్కృతిక నేపథ్యం, మానవీయ విలువల నాటి సరళమైన ప్రతీక. బివిడి ప్రసాదరావు గారి రచన శైలిలో ఆత్మీయత, సందర్భానికి తగిన హాస్యం, హృదయాన్ని కదిలించే మానవీయ స్పర్శ గోచరిస్తుంది.
ఈ కథలో ప్రధానంగా మన జాతి సంప్రదాయాలు, పరిసరాల్లోని సౌందర్యం, మానవ సంబంధాల్లోని స్నేహభావం వ్యక్తమవుతుంది. కథానాయకుడు కుటుంబంతో వెళుతూ గోదావరి పరిసర ప్రాంతాల సహజ అందాలను ఆస్వాదిస్తాడు. అక్కడ చోటుచేసుకునే "చీరమీనులు" (చిట్టి చేపలు) ప్రత్యేకత మన ఆహార సంస్కృతిలోకి తీసుకువస్తూ, కథ మలుపు తీసుకుంటుంది.
ముసలిదైన ఒక ఆడవారి దయనీయ జీవిత పరిస్థితి కథలోని హృదయమును తాకే ముఖ్య అంశం. ఆమె జీవన పోరాటం, ఆపదలో పడినప్పుడు కథానాయకుడు తన బాధ్యతను గుర్తించి ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లడం ఒక గొప్ప మానవతా స్పృహను ప్రతిఫలిస్తుంది.
ఈ కథకు ఉన్న గాఢత మనసును కదిలిస్తుంది. బివిడి ప్రసాదరావు గారి రచన చదువరులకు మనసులో మానవత్వం, సహృదయతని నింపుతుంది.