top of page
Writer's pictureDr. C S G Krishnamacharyulu

చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 12



'Chejara Nee Kee Jivitham - Episode 12' - New Telugu Web Series Written By C. S. G. Krishnamacharyulu Published In manatelugukathalu.com On 06/03/2024

'చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 12' తెలుగు ధారావాహిక చివరి భాగం

రచన : C..S.G . కృష్ణమాచార్యులు 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



 జరిగిన కథ:

ఇందిరని అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు శేఖర్. పెళ్ళైన వెంటనే తను అర్జెంట్ గా జర్మనీ వెళ్లాల్సి రావడంతో, ఇందిరకు తోడుగా తన పిన్నిని, తమ్ముడు మధుని ఉంచుతాడు. 


వెంకట్ అనే వ్యక్తితో మాట్లాడుతున్న వదిన ఇందిరని వారిస్తాడు మధు. శేఖర్ గురించి మధుతో చెప్పడం ప్రారంభిస్తుంది ఇందిర.


అతను డిగ్రీ చదివే రోజుల్లో ప్రభ అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడంతో ఇందిరను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి రోజే ప్రభకు వివాహం కాలేదని తెలుసుకుంటాడు. ఇద్దరూ జర్మనీ వెళ్లి అక్కడ కలిసి ఉంటారు. 


ఇందిర చెప్పిన మాటలు నమ్మలేక పోతాడు మధు. భర్తతో విడాకులు వచ్చేవరకు మధుతో సహజీవనం చేస్తానంటుంది ఇందిర. అంగీకరించడు మధు. అన్నయ్య శేఖర్ కి కాల్ చేసి ఇండియా వచ్చెయ్యమంటాడు. ఇందిర వూహించినట్లే ఇప్పట్లో రాలేనంటాడు శేఖర్. 

గీతా మేడంని కలిసి సమస్య వివరిస్తాడు మధు. ఇందిరని తనవద్దకు తీసుకొని రమ్మంటుంది మేడం. తన కథను గీతా మేడం కి వివరిస్తుంది ఇందిర. మేడం ఇంటికి దగ్గర్లోని ఒక ఇంటికి షిఫ్ట్ అవుతారు ఇందిర, మధులు.. మ్యూజిక్ క్లాసెస్ లో చేరుతుంది ఇందిర. స్కూల్ లో టీచర్ గా చేరుతుంది. మంచి పేరు తెచ్చుకుంటుంది. తన విషయంలో ఒక నిర్ణయం తీసుకోమని కోరుతుంది ఇందిర.

ఇందిర పైన ఇష్టం చూపిస్తాడు మధు.


ఇక చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 12 చదవండి. 


ఈ ప్రొఫెసర్కి యెలా బదులిస్తే నచ్చుతుంది అన్న ఆలోచనలో పడ్డాడు శేఖర్. చివరికి మనసు ధృఢం చేసుకుని యిలా అన్నాడు. 

"ఇందిరకు, తనకు ఇష్టమయితే వారి కల్యాణం జరిపించండి. నాకు సంతోషమే. నా తమ్ముడు నాలా కాదు. నిలకడైన మనిషి. మీ అశీస్సులతో తప్పక వృద్ధిలోకి వస్తాడు. వాళ్ళిద్దరూ మంచి జంట అవుతారు" అన్నాడు శేఖర్. 


" మధూ" అని గట్టిగా పిలిచి, "ఇలా రా! మీ అన్నయ్య నీతో మాటాడాలంటున్నాడు" అన్నాడు రవి. మధుకి అర్ధమయ్యింది తనకీ సంభాషణ తెలియదన్నట్లు వుండాలని. 

"అన్నయ్యా! ఎలా వున్నావు?" 


"బాగున్నాను. నీకో విషయం చెప్పాలిరా! నేను మళ్ళీ పెళ్ళి చేసుకున్నాను. ఈమే నీ వదిన ప్రభ. సారీరా! నీకు, ఇందిరకు చాల కష్టం కలిగించాను. నాన్న మనకిచ్చిన ఆస్థిలో నీ వాటా సొమ్ము నీకు యిచ్చేస్తాను. త్వరలో ఒక యింటివాడివి కా!"


"ఇప్పుడే తొందరేముందన్నయ్యా!" అని ఆసక్తి లేనివాడిలా సమధానమిచ్చాడు మధు. 


"అలా కాదురా! నాకోసం చేసుకో. నేను ఇందిరకు చేసిన అన్యాయాన్ని సరిచేయగలవాడివినువ్వే. ఆ అమ్మాయి చాలా మంచిది. దురదృష్టవశాత్తు నేను తొందరపడి ఆమె జీవితాన్ని ఇబ్బందులలోకి నెట్టేసాను" బాధను నటించాడు శేఖర్. 


మధు మనసు అనందంతో వుయ్యాల లూగింది. అతను అమాయకత్వం నటిస్తూ, "నేను ఆ అమ్మాయిని చేసుకుంటే నువ్వు నా ఇంటికి వస్తావా?" 


"ఎందుకు రాను. ఒక సారి నీ భార్య అవగానే ఆమె నాకు బిడ్డలాంటిదే. వచ్చి నీ ఇంట్లో వుండి వెడతాను" అని ఆదర్శ పురుషుడిలా నమ్మ బలికాడు శేఖర్.. 


 “అలాగే అన్నయ్యా! నీ మాట యెప్పుడు కాదన్నాను" అని బదులిచ్చాడు మధు. 


 “రవి సార్ చెప్పినట్లు వినండి. మీరిద్దరూ పెళ్ళి చేసుకుని హాయిగా కాపురం చేస్తూంటే నాకు మనశ్శాంతిగా వుంటుంది.”. అని మధుకు చెప్పి " రవి సార్! మరి నాకు సెలవిప్పించండి. నా నుంచి యే అవసరమున్నా మీరు వాట్సాప్ ద్వారా తెలియ చేయండి" అన్నాడు శేఖర్ రవితో. 

"సరే శేఖర్! అవసరమయితే సంప్రదిస్తాను" అంటూ మీటింగ్ ముగించాడు రవి. 


మధు రవి దగ్గరకు వచ్చి "మీ కోపం చూసి నా గుండె దడ దడ కొట్టుకుంది, భయమేసింది" అన్నాడు. 


"ఇందిర కంట నీరు పెట్టించి, ఇప్పుడు నంగనాచి వేషాలు వేస్తున్నాడు. ప్రభపై కేసులు పెట్టి, భయ పెడితే దిగివచ్చాడు మీ అన్న. "


ఆ మాటలని రవి లాయర్ని కలవడానికి వెళ్ళిపోయాడు. మధుకి సంతోషంతో యేనుగునెక్కినట్లుంది. ఇందిర కోసం చూసాడు. పడకగదిలో గీత, ఇందిర మాట్లాడుకుంటూ కనిపించారు. చేసేదేమీ లేక సోఫాలో కూలబడ్డాడు. 

 @@@

ఇంట్లోకి వస్తున్న ఇందిర ముఖాన్ని ఆదుర్దాగా గమనించింది గీత. ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోతూండడంతో ఆమె మనసు కుదుటపడింది. ఇందిర గీతకు విక్టరీ గుర్తు చూపించింది. 

గీత ఇందిరను ఆప్యాయంగా కౌగలించుకొని, "రా కోడలా రా! మొత్తానికి మధు గుర్రం దిగేలా చేసావు" అంటూ పడకగది వైపు దారి తీసింది. 


"అంతా మీ చలువే కదా అత్తయ్యా! మీ ఫోన్ రావడం ఆలస్యం మనిషి తలక్రిందులైపోయాడు. చివరికి జీవిత భాగస్వామిగా వుండమని ప్రపోజ్ చేసాడు"


"అంతేనా! ఒక కౌగిలింత మూడు ముద్దులు.. " సరసంగా అంది గీత. 


ఇందిర బుగ్గలు యెరుపెక్కాయి. "అవీ వున్నాయి. పని మనిషిని నమ్మించడానికి ఒకే గదిలో పడుకోవాలని కూడా చెప్పాడు”. 


"ఇంక ఆ అవసరం లేదులే. రవి రూములో జూం మీటింగ్. మీరు నిజమైన దంపతులుగా జీవించవచ్చు" 


ఇందిర కళ్ళ వెంబడి నీళ్ళు. "నేను నా పూర్వ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నానో మీరు నాకు లభించారు" 


 "నీకు మేము, మాకు నువ్వు. అది భగవంతుని లీల. ఇంకనించి స్వేచ్చా జీవివి నువ్వు. మా వాడిని వదిలివేయవు కదా. వాడొట్టి అమాయకుడు" గీత హాస్యమాడింది. 


"అంత లేదులే అత్తయ్యా! నాకు ముక్కుపుడక కొంటున్నప్పుడు చూడాలి, అసూయ కళ్ళల్లో. ఎవరో తన సొత్తు తీసుకుపోయినట్లు"


"మగ వాళ్ళంతా అంతే. మనల్ని వాళ్ళ సొత్తు అనుకుంటారు. మనం ఎవరితో నవ్వినా, మాట్లాడినా.. భయం.. లేచిపోతామని. మామూలుగా పట్టించుకోని వ్యక్తి, వేరొకరితో మనం కాస్త చనువుగా వుంటే.. అభద్రతా భావంతో రుస రుసలు. ఈ స్వభావాన్ని గుర్తించే రవి నీకు ముక్కు పుడక, దుద్దులు కొనేటప్పుడు మధు దగ్గర వుండేలా చూసుకున్నాడు తరువాత పెళ్ళిసంబంధాల మాట. అంతటిటో అబ్బాయి ఆట కట్టు" నవ్వుకున్నారు గీత, ఇందిర. 


"అత్తయ్యా! పలహారమేదైన చేయనా?"


"ఆయన మెసేజ్ చేసారు. లాయరు దగ్గర వున్నానని. రావడానికి కనీసం అరగట పడుతుంది. మధు స్టడీ రూములో వున్నాడు. పకోడీ చేద్దాం". అంటూ గీత లేచి వంటింట్లోకి నడిచింది. ఇందిర ఆమెను అనుసరించింది. పకోడీలు తయారయ్యే సమయానికి రవి వచ్చాడు. ఆయన రాక గమనించి మధు, గీత ఆయన దగ్గరకు వచ్చారు. 

"అంతా సిద్ధం! లీగల్ వ్యవహారం కొంత సమయ పడుతుంది" 


ఆ మాట విని వంట గదిలోంచి వచ్చిన ఇందిర దగ్గరకు వెళ్ళి, "నీవు మంగళ సూత్రం తీసివేయ వచ్చు. నీకు విముక్తి పత్రం శేఖర్ వ్రాసిచ్చాడు" అని తెలిపాడు. 

"మీరు ఆ రోజు చెప్పినప్పుడే తీసేసింది" ఆని గీత చెప్పింది.


రవి "సంతోషం! అందరూ వినండి " అని యిలా అన్నాడు.. 


“త్వరలో మీ యిద్దరి పెళ్ళికి యేర్పాట్లు చేస్తాను. మధూ! ఇందాక మీ అన్నయ్యకి దీటుగా నటించావు. గుర్తుంచుకో ! ఇందిర ఆనందంగా వుంటే నీకు విందు భోజనం లేకుంటే చిప్పకూడు" 

“మా మధు అలాంటి వాడు కాదు లెండి" అని గీత మధూకి అండగా నిలబడింది. 


అందరి మనసుల్లో ఆనంద వెల్లివిరిసింది. 

 @@@

రాత్రి మధు యెదపై పడుకుని ‘ఒంటరిగా శూన్యం లోకి చూస్తూ పడుకునే నాకు ఇంత అదృష్టమా’ అని అనుకుంది ఇందిర. తలయెత్తి మధు కళ్ళలోకి చూసి "ఏదో ఆలోచన చేస్తున్నారు శ్రీవారు" గోముగా అడిగింది. 


"అదే.. మన భవిష్యత్తు యేమిటా అని” బదులిచ్చాడు. 


"ఏం తెలిసింది? " 


"వచ్చే సంవత్సరంలో వుద్యోగం. నాలుగు సంవత్సరాల తర్వాత, పాప. అచ్చు నీ అందాలే.. ఆ తర్వాత బాబు. వాడికి నీ తెలివి తేటలే" 


"అదేమిటి? మీ ప్రమేయమే వుండదా? నేనొప్పుకోను. పాప.. "


ఇందిర మాట పూర్తిచేసే లోపే “ఇది నా వూహ, నా ఇష్టం. కాదని యెదురు మాట్లాడితే శిక్ష.. " అంటూ ఇందిరను పైకిలాక్కుని ముద్దు పెట్టాడు మధు. 

 @@@


============================================================================

సమాప్తం

ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత C..S.G . కృష్ణమాచార్యులు గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.

============================================================================

C..S.G . కృష్ణమాచార్యులు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: C..S.G . కృష్ణమాచార్యులు

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. మేనేజ్మెంట్ విద్యకు సంబంధించిన అనేక పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, హిమాలయ  వంటి ప్రముఖ సంస్థల ద్వార ప్రచురించాను.   చిన్నతనం  నుంచి  ఆసక్తివున్న తెలుగు రచనా వ్యాసంగం తిరిగి మొదలుపెట్టి కవితలు, కథలు, నవలలు వ్రాస్తున్నాను. ప్రస్తుత నివాసం పుదుచ్చెరీలో.

66 views1 comment

1 Comment



Srivalli Chilakamarri

3 days ago

👌👌

Like
bottom of page