'Chejara Nee Kee Jivitham - Episode 5' - New Telugu Web Series Written By C. S. G. Krishnamacharyulu Published In manatelugukathalu.com On 30/01/2024
'చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 5' తెలుగు ధారావాహిక
రచన : C..S.G . కృష్ణమాచార్యులు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
ఇందిరని అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు శేఖర్. పెళ్ళైన వెంటనే తను అర్జెంట్ గా జర్మనీ వెళ్లాల్సి రావడంతో, ఇందిరకు తోడుగా తన పిన్నిని, తమ్ముడు మధుని ఉంచుతాడు.
వెంకట్ అనే వ్యక్తితో మాట్లాడుతున్న వదిన ఇందిరని వారిస్తాడు మధు. శేఖర్ గురించి మధుతో చెప్పడం ప్రారంభిస్తుంది ఇందిర.
అతను డిగ్రీ చదివే రోజుల్లో ప్రభ అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడంతో ఇందిరను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి రోజే ప్రభకు వివాహం కాలేదని తెలుసుకుంటాడు. ఇద్దరూ జర్మనీ వెళ్లి అక్కడ కలిసి ఉంటారు.
ఇందిర చెప్పిన మాటలు నమ్మలేక పోతాడు మధు. భర్తతో విడాకులు వచ్చేవరకు మధుతో సహజీవనం చేస్తానంటుంది ఇందిర. అంగీకరించడు మధు. అన్నయ్య శేఖర్ కి కాల్ చేసి ఇండియా వచ్చెయ్యమంటాడు.
ఇందిర వూహించినట్లే ఇప్పట్లో రాలేనంటాడు శేఖర్. గీతా మేడంని కలిసి సమస్య వివరిస్తాడు మధు.
ఇక చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 5 చదవండి.
అన్నయ్య లో తను చూడని కోణం వెలుగులోకి వస్తూంటే నిర్విణ్ణుడయ్యాడు మధు. మెల్లగా యిలా బదులిచ్చాడు.
"మేడం. అన్నయ్య విడాకులిప్పుడే యివ్వడు. ఇందిర వేరొకరితో కాపురం చేస్తోందని తెలిసాకే యిస్తాడు”.
నేను ముందే వూహించానన్న భావము ప్రస్పుటించేలా నవ్వుతూ గీత యిలా అంది,
"ఈ విషయం అర్ధమయ్యే ఇందిర మనసు విరిగిపోయింది. తనంత తానుగా విడాకుల ప్రస్తావన తెచ్చినా శేఖర్ సానుకూలంగా స్పందిస్తాడని ఆమె అనుకోవడం లేదు. అందుకే వేచి వుండి ఈ బంధాన్ని త్రెంచుకోవాలని నిశ్చయించుకొంది. ఈ నిరీక్షా సమయం యెంత కాలమో తెలియదు. మన యూనివర్సిటీ ఇంగ్లీష్ మేడం రాధ పరిస్థితి తెలుసా. భర్త ఆమెను వదిలి వేరే అమ్మాయితో వుంటున్నాడు. విడాకులకోసం కోర్ట్ చుట్టూ గత ఆరేళ్ళనించి తిరుగుతోంది. కింది కోర్టు కాకబోతే పై కోర్టుకెడతా గాని నీకు విడాకులివ్వనని చెప్తున్న్నాడు. విడాకులొచ్చేదెప్పుడు మళ్ళీ పెళ్ళి చేసుకునేదెప్పుడు? ఆమెకు వయసయిపోతోంది. ”
"అంత దుర్మార్గమా మేడం?" విస్తుపోతూ అడిగాడు మధు.
"మీ అన్నయ్య కూడా అంతే కదా! తన మానాన తను బ్రతుకుతుంటే వచ్చి పెళ్ళి అనే మంటలో పడేసాడు. ఇప్పుడామె యేం చెయ్యాలి? ఏం చేస్తే బాగుంటుంది? ఆమె వయసుకు తగ్గ మానసిక శారీరక, అవసరాల సంగతేమిటి? మన యూనివర్సిటీ లో చూస్తున్నాం కదా!
సాయంత్రమవడం ఆలస్యం, జంటలుగా మన విద్యార్ధులు చెట్లకింద కబుర్లాడుతూ కనిపిస్తారు. స్వేచ్చ గల స్త్రీలు డేటింగ్ యాప్స్ సహాయంతో నచ్చిన పురుషులతో సంబంధాలేర్పర్చుకుంటున్నారు.
తనూ వయసులోవున్న అమ్మాయే గదా! తనకి కోరికలుండవా? సినిమాలు, టీవీ సీరియల్స్, యూట్యూబ్ వీడియోలు, మరీ అతిగా వెబ్ సిరీస్. హద్దులు లేని శృంగారాన్ని ప్రదర్సిన్స్తున్నాయి. నీలాంటి చదువు పిచ్చోళ్ళని మినహాయిస్తే అందరూ దాని బాధితులే. వికసించే ముందు రాలిపోయిన పూవులా అయ్యింది తన బ్రతుకు. ”
గీతా మేడం మాటల్లో ద్వనించిన కోపం, బాధ మధుని ఆశ్చర్య చకితుడిని చేసాయి. ఇది కదా తల్లి మనసు వేదన అనుకున్నాడు.
"మేడం! తనవరకు ఒక సంబంధం యేర్పర్చుకోవడం న్యాయమే అన్నయ్య మోసానికది ప్రతీకారమనో లేక తన స్వేచ్చా కోరికనో అని మనం సరిపెట్టుకోవచ్చు” అన్నాడు మధు.
"అలాగైతే మరో ప్రశ్న. యెవరితో పెట్టుకోవాలి? " మధు యేం సమాధానం చెప్తాడోనన్న కుతూహలంతో అడిగింది
“తనకు నచ్చిన వ్యక్తి, తనను ఇష్టపడే వ్యక్తితో, తను ఇప్పుడే డేటింగ్ మొదలుపెడితే అన్నయ్య విడాకులిచ్చే టైంకి సంబంధం నిశ్చయం చేసుకోవచ్చు. "
"సరిగ్గా చెప్పావు. నువ్వు సినిమాలు చూస్తావు కదా. వీడినెందుకు ప్రేమించావని తండ్రి అడిగితే హీరోయిన్ మెరిసే కళ్ళతో చెప్తుంది ‘వాడు నన్ను అమ్మలా ప్రేమగా చూస్తాడు. వాడి దగ్గర వుంటే నాన్న దగ్గర వున్నట్లు భద్రంగా ఆనిపిస్తుంది’.. అలా ప్రేమ, భద్రతా భావం ఎవరు యివ్వగలరో అలాంటివాడినే ఇందిర కోరుకుంటుంది. అందులో దెబ్బతిన్న మనిషి కదా, మరి కొంచె ప్రేమ, యెక్కువ భద్రత కోరుకుంటుందని మనం భావించవచ్చు. అందుకేనేమో, ఆమె నిన్ను కోరుకున్నది"
"అలాంటి బంధం నాకిష్టం లేదు మేడం. కారణాలంటారా. ఒకటి ఆమె ఇంకా స్వేచ్చా జీవి కాదు. తరువాత, నా చదువు పూర్తయ్యే వరకు నేనిలాంటి వాటికి దూరంగా వుండాలని నిశ్చయించుకున్నాను"
"ఆమె బ్రతుకు తెలిసిన నువ్వే కాదంటే, తెలియని వాడు అవునంటాడా?"
"తను అన్నయ్య భార్య అన్న స్పృహ నన్ను వెనక్కి లాగేస్తోంది. అర్ధ చేసుకోండి మేడం"
"నిన్ను బలవంతపెట్టాలని నేనలా అనలేదు. ఇంకొకరితో నమ్మదగిన బంధం యేర్పడటమెంత కష్టమో నీకర్ధం కావాలని అన్నాను. పడక సుఖమివ్వడానికి రెడీ అనే వాళ్ళే గాని జీవితాంతం తోడుంటాననే వాళ్ళు బహు కొద్ది మంది.. అదే ఇందిర సమస్య. మధూ! నీవు ఇంతవరకు ఏ అమ్మాయిని ప్రేమించలేదా? కనీసం ఇష్టపడలేదా? "
"లేదు మేడం. నాకు మా అమ్మలాగా, మీలాగా వుండే అమ్మాయి కావాలి. అలాంటి అమ్మాయి నాకింకా కనబడలేదు. నాకు తారసపడిన ఆడపిల్లలు విలాసాలతో జీవితాన్ని గడపాలని అనుకునే వాళ్ళే. వారం వారం పిక్నిక్. ఏడాది చివర ఒక లాంగ్ ట్రిప్ వుండాలి. పిల్లలు వద్దు, అంతగా కావాలంటే పెంచుకుందాం అనే వాళ్ళే"
"అయితే నీకోసం ఒక పల్లెటూరి పిల్లని చూడాలి. లేదా బ్రహ్మ ని ప్రార్ధించాలి. నాకు పెద్ద పనే. " అని వాత్సల్యంతో పరిహాసమాడింది గీత.
మధు సిగ్గుతో తలవంచుకున్నాడు. కాసేపు ఇద్దరి మధ్య మౌనం నెలకొంది. ఆ నిశ్శబ్దాన్ని చేధిస్తూ గీత, "మధూ. ఇందిర యెలా వుంటుంది?" అని అడిగింది.
"అందంగా వుంటుంది. అందరితో స్నేహంగా వుంటుందనుకుంటా, తనని చాలా మంది పలకరిస్తారు. మృదువుగా మాట్లాడుతుంది. నేను వున్నపుడు నిశ్శబ్దంగా వంట చేసి టేబుల్ పైన పెట్టేస్తుంది. వంట రుచిగానే వుంటుంది. అంత వరకే నాకు తెలుసు మేడం!"
"నువ్వు తను కలిసి భోజనం చేయడం, తను ఇంటికి కావల్సినవి నీకు చెప్పడం, ఇద్దరూ కలసి బయటకు వెళ్ళడం.. "
మధు అడ్డుతగులుతూ, "అలాంటివేం లేవు మేడం. అన్నయ్య ఫోన్ చేసిన ప్రతి సారి, శని, ఆది వారాలు తనని ఎక్కడికైన తీసుకెళ్ళమని చెప్తాడు. కానీ నాకే సంకోచం. " అన్నాడు.
"బాగుంది. మీ అన్నదమ్ములిద్దరూ ఆమె జీవితాన్ని అర్ధరహితం చేసారుగా! నా అనుమానం ఇందిరతో స్నేహంగా వుంటే ఆమెతో ప్రేమలో పడిపోతానని నీ భయం. నా అంచనా ప్రకారం ఆమె నీ స్వప్న సుందరిలా వుంటుంది. అందుకే నువ్వు ఆమెకు దూరంగా పారిపోతున్నావు. నేనొకసారి తనను కలిసి మాట్లాడాలి. రేపు వుదయం భోజనానికిద్దరూ కలిసి రండి. ఇంకోమాట. ఇప్పటినించి ఇందిరతో స్నేహంగా వుండు. గుర్తుంచుకో. పలాయనం భీరుని లక్షణం" ఆని గీత లేచింది.
"అలాగే మేడం” అంటూ మధుకూడా లేచాడు.
ఇంటికి తిరిగి వచ్చే సమయములో మధు ఆత్మ పరిశీలన చేసాడు. అతనిలో చెలరేగిన భావాల సారాంశమిది.
‘మేడమన్నది నిజమే, ఇందిరను చూస్తే నా గుండె ఝల్లుమంటుంది. ఇప్పటికీ నీలగిరులలోని తోడాలలో అన్నదమ్ములందరు ఒకే భార్యను పంచుకుంటారు. అలా చేయడం చట్ట్తవిరుద్ధమైన నాగరిక సమాజం లో వున్నాను నేను. ఈ మధ్య పరస్పర అంగీకారంతో భార్యలని బదిలీ చేసుకోవడం వింటున్నాం. నేను వారిలాంటి వాడిని కాదు. అలాగని నేనేమి గొప్పవాడినికాదు. నా బలహీనతతో ఇందిరను వొంటరిని చేసాను. ఇందిరతో స్నేహం చేస్తూ, హద్దులలో వున్నప్పుడు కదా నా మానసిక శక్తి వెల్లడయ్యేది. నేను ఇందిరతో స్నేహం గా వుండాలి’.
మధు ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చేటప్పటికి ఇల్లు వచ్చేసింది. మధు రాకను గమనించిన ఇందిర టీవీ కట్టేసి, తన గదిలోకి వెళ్ళబోయింది.
"లేవకు, నీతో ఒక మాట చెప్పాలి" అన్నాడు మధు వీలైనంత ప్రసన్నత చూపిస్తూ. ఒకింత ఆశ్చర్యపడి, కూర్చుంది ఇందిర.
"నేను నా ప్రొఫెసర్, తెలుసు కదా, నాకు అమ్మలాంటిది. ఆమెను కలిసి మన విషయం చెప్పాను. ఆమె నిన్ను రేపు భోజనానికి తీసుకు రమ్మన్నారు. నీకు ఓకే నా!"
"అమ్మ మాట కాదనకూడదు. తప్పకుండా వెడదాం" అని ఆనందంగా బదులిచ్చింది ఇందిర.
"ఇంకో మాట. నన్ను నీతో ఒక మంచి స్నేహితుడిలా వుండమని చెప్పారు"
"నాకున్న ఒకే స్నేహితుడివి నువ్వు, నువ్వు మౌనమూర్తిగా వుండడం వల్ల బాధగా వుండేది. నేను నీకు కానిదానని, ఒక గుదిబండనని దిగులు పడే దాన్ని" మనసులో మాట చెప్పింది ఇందిర. ఆమె మాటలకు మధు మనస్సు చివుక్కుమంది.
"సారీ! నువ్వన్నట్లు అమ్మ లేదు, అక్కా చెల్లెళ్ళు లేరు. చివరికొక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. అందువల్ల జరిగింది ఆ పొరబాటు" అని సమాధాన పర్చాడు మధు.
ఇద్దరూ సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్నాక యెవరి గదికి వారు వెళ్ళిపోయారు. తన జీవితంలో జరుగుతున్న మంచికి కాస్త ఆనందపడినా, రేపు మేడంతో యెట్లా వుంటుందోనన్న బెంగతో నిద్రకుపక్రమించింది ఇందిర.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
C..S.G . కృష్ణమాచార్యులు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: C..S.G . కృష్ణమాచార్యులు
శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. మేనేజ్మెంట్ విద్యకు సంబంధించిన అనేక పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, హిమాలయ వంటి ప్రముఖ సంస్థల ద్వార ప్రచురించాను. చిన్నతనం నుంచి ఆసక్తివున్న తెలుగు రచనా వ్యాసంగం తిరిగి మొదలుపెట్టి కవితలు, కథలు, నవలలు వ్రాస్తున్నాను. ప్రస్తుత నివాసం పుదుచ్చెరీలో.
Comments