top of page

చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 6



'Chejara Nee Kee Jivitham - Episode 6' - New Telugu Web Series Written By C. S. G. Krishnamacharyulu Published In manatelugukathalu.com On 04/02/2024

'చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 6' తెలుగు ధారావాహిక

రచన : C..S.G . కృష్ణమాచార్యులు 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


ఇందిరని అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు శేఖర్. పెళ్ళైన వెంటనే తను అర్జెంట్ గా జర్మనీ వెళ్లాల్సి రావడంతో, ఇందిరకు తోడుగా తన పిన్నిని, తమ్ముడు మధుని ఉంచుతాడు. 


వెంకట్ అనే వ్యక్తితో మాట్లాడుతున్న వదిన ఇందిరని వారిస్తాడు మధు. శేఖర్ గురించి మధుతో చెప్పడం ప్రారంభిస్తుంది ఇందిర. 


అతను డిగ్రీ చదివే రోజుల్లో ప్రభ అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడంతో ఇందిరను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి రోజే ప్రభకు వివాహం కాలేదని తెలుసుకుంటాడు. ఇద్దరూ జర్మనీ వెళ్లి అక్కడ కలిసి ఉంటారు. 


ఇందిర చెప్పిన మాటలు నమ్మలేక పోతాడు మధు. భర్తతో విడాకులు వచ్చేవరకు మధుతో సహజీవనం చేస్తానంటుంది ఇందిర. అంగీకరించడు మధు. అన్నయ్య శేఖర్ కి కాల్ చేసి ఇండియా వచ్చెయ్యమంటాడు. ఇందిర వూహించినట్లే ఇప్పట్లో రాలేనంటాడు శేఖర్. 


గీతా మేడంని కలిసి సమస్య వివరిస్తాడు మధు. ఇందిరని తనవద్దకు తీసుకొని రమ్మంటుంది మేడం. 


ఇక చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 6 చదవండి. 


చంద్రకాంతికి కలువ వికసించినట్లు, ఇందిర స్మిత భాషణం తో మధు మనసు వుత్సాహ భరితమయ్యింది. చాలా కాలం తర్వాత అతను ప్రశాంతంగా నిదురపోయాడు. ఉదయమే లేచి జాగింగ్ చేస్తూ మరొకసారి ఇందిర గురించి ఆలోచిస్తూ, తను అనుసరించే వైఖరి మరొకసారి మననం చేసుకున్నాడు. అన్నయ్య కోరినట్లు, గీతా మేడం చెప్పినట్లు, ఇందిరతో స్నేహంగా వుంటూ, ఆమెకు ఈ కష్టకాలంలో తోడవుతాను. గీతా మేడం మాట వింటూ అనుకున్న విధంగా రిసెర్చ్ పూర్తి చేసేయాలి. ఈ లక్ష్యం నుంచి, యెంతమాత్రం విరుద్ధ దిశలో పయనించకూడదు" అని ధృఢంగా అనుకుంటూ యిల్లు చేరాడు. 


యధావిధిగా భోజనం బల్ల మీద వున్న ఫ్లాస్క్ లో పాలు తీసుకుని త్రాగుతూ దేవుని గది వైపు వెళ్ళాడు. ఆ గదిలో యెర్రంచు గోధుమ రంగు చీరలో ధ్యాన ముద్రతో ఇందిర దర్శనమిచ్చింది. ఆమె ప్రశాంత వదనాన్ని చూసి పులకితుడైన మధు ఒక నిమిషం నిశ్శబ్దంగా ఆమెనే చూస్తూ వుండిపొయాడు. ఆ తరువాత తేరుకుని తన గదికి వెళ్ళిపోయాడు. 


ఒక గంట తరువాత టిఫిన్ చేయడానికి వచ్చిన మధుకి యెన్నడూలేని విధంగా "వచ్చావా! రా! నీకోసమే ఎదురు చూస్తున్నాను" అంటూ ఇందిర యెదురొచ్చింది. మధు నవ్వుతూ    "థాంక్స్" అంటూ కూర్చున్నాడు. ఫలహారం తింటూ ఇందిర, "మేడం ఇంటికి కాస్త తొందరగా వెడదాము. నేను వంటలో సహాయం చేయడానికి వీలుంటుంది. అలాగే వెళ్ళేటప్పుడు పళ్ళు, పూలు తీసుకుని వెడితే బాగుంటుంది " అంది. ఆమె సలహా నచ్చి, మధు "సరే" అన్నాడు. మొదటి సారి కలిసి తినడం యిద్దరికీ కాస్త క్రొత్తగానే వుంది. మాటలే కరువైనట్లు మౌనంగా ఫలహారం ముగించారు. 

 @@

 అనుకున్న విధంగా ఇద్దరు బయలుదేరి పదకొండుగంటల వేళ ప్రొఫెసర్ గీతా యిల్లు చేరుకున్నారు. గీత యెదురు వచ్చి ఇందిరను ఆప్యాయంగా కౌగలించుకుని "రామ్మా!" అంటూ ఆహ్వానించింది. ఇందిర ఆమెకు పాదనమస్కారం చేసి, తను తెచ్చిన పళ్ళు పూలు, ఆమె చేతికందించింది. ఇందిర సంస్కారానికి గీత సంతోషిస్తూ, "యిలా కూర్చో! " అంటూ సోఫా చూపించింది. గీత ఆదరణ, ఇందిరలో అంతవరకు గూడు కట్టుకున్న భయాన్ని మటుమాయం చేసింది.. సోఫాలో కూర్చో కుండా "ఆంటీ! నాకు వంట చేయడం బాగా వచ్చు. ఏం చేయాలో చెప్తే చేసేస్తాను" అంది ఇందిర. 


గీత నవ్వుతూ "నవ్వు అంటీ అని కాకుండా అత్తా అని పిలు. ఆంటీ అన్న పిలుపు వినీ వినీ బొరు కొట్టేసింది" అంది. 


"అత్తా అని పిలిచినప్పుడు, మీ చేత వంట చేయించడం తప్పుకదా!. చిన్నతనం నుంచే నాకు వంట చేయడం అలవాటయ్యింది". 


"అలాగే చేద్దువు గానీ. ముందు కాసిని కబుర్లు చెప్పుకుందాం" అంటూ ఇందిర చేయి పట్టి కూర్చోబెట్టింది గీత. మధు స్టడీ రూంలోకి వెళ్ళి అక్కడ కూర్చుని లాప్ టాప్ తెరచి పనిచేసుకోసాగాడు. ఒక అరగంట సేపు పరిసరాలను మరిచి ఇద్దరూ సంభాషించుకున్నారు. గీత ముందుగా తన కుటుంబం గురించి చెప్పి, నెమ్మదిగా, ఇందిర జీవిత విశేషాలను తెలుసుకుంది. 


మాటల చివరగా ఇందిర, "అత్తయ్య, నాకు జన్మ నిచ్చిన తల్లితండ్రులెవరో తెలియదు. మతం, కులం గోత్రం తెలియవు. పుట్టించిన తల్లి తండ్రులు ఆనాడు, తాళి కట్టిన శేఖర్ ఈనాడూ వదిలేసారు. ఇలా మధుతో ఒక అయోమయంలో బతుకుతున్నాను" అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకోవడం మధు గమనించాడు. 


ఆమె మాటలకు స్పందిస్తూ గీత, ఇందిరను దగ్గరకు తీసుకుని తల నిమురుతూ, "నీకు నేను అమ్మనే" అంది. ఇందిర భావోద్వేగం నెమ్మదించిన తర్వాత, గీత లేచి, "రా వంట చేద్దాం. ఇంకో ఇద్దరు ఆడపిల్లలు.. నా స్టూడెంట్సే.. వస్తారు" అంటూ ఇందిర చేయి పట్టుకుని కిచెన్ వైపు నడిచింది. 


సరిగ్గా వంట ముగిసే సమయానికి వచ్చారు గీత విద్యార్ధినులు. ఆలు చిప్స్, వెనిలా ఐస్క్రీం, యాపిల్స్ బల్ల మీద పెట్టి మేడం కి అభివాదం చేసారు. గీత వారిని ఇందిరకు చూపుతూ, నిరుపమ, మేరీ అని, నా దగ్గర రిసెర్చ్ చేస్తున్నా రని, వారికి ఇందిరను చూపుతూ, మధు బంధువుల అమ్మాయని పరిచయం చేసింది. నిరుపమ ఇందిరతో కరచాలనం చేస్తూ, చిలకాకుపచ్చ చీరలో మీరు వనదేవతలా వున్నారని అభినందించింది. 


"మీరు చీర కట్టుకున్న విధానం బాగుంది. మీరు రోజూ చీరలే కడతారా" అని మేరీ అడిగింది. 


"అవును" అని ఇందిర జవాబు చెప్తుండగా గీత "ఇందిర వన దేవతే కాదు. ఆన్నపూర్ణ కూడా. ఈ రోజు వంట తనే చేసింది" అని చెప్పింది. 


నిరుపమ స్టడీ రూం లోకి తొంగి చూసి, మధుని "హాయ్" అని పలకరించి "మేడం! సార్ యింకా రాలేదా!" అని గీతనుద్దేశించి అడిగింది. 


"వచ్చే బుధవారం ఆయన సెమినార్. ఆ హడావుడిలో వున్నారు. లేటుగా వస్తారు. " ఆని గీత సమాధామిచ్చింది. 


"భోజనం చేద్దామా!" అని గీత అనడంతో అందరూ భోజనం ప్లేట్లు తీసుకుని యెవరికి వారే వడ్డించుకున్నారు. 


గీత, "మధూ! నువ్వు కూడా రా, మీ సార్ యెప్పుడొస్తారో తెలియదు" అని పిలవగా మధు కూడా వచ్చి వారితో కలిసి భోజనం చేసాడు. ముఖ్యంగా యూనివర్సిటీ రాజకీయాలు, రిసెర్చ్ కష్టాలు, సినిమా విశేషాలు వాళ్ళ సంభాషణలో చోటు చేసుకున్నాయి. ఇందిరకి తెలియని విషయాలు కావడంతో తను దాదాపు మౌనంగా వారి మాటలు వింటూ వుండిపోయింది. 


అది గమనించిన మేరీ ఇందిర వైపు చూసి, "మీరేం చదివారు? ఇప్పుడేం చేస్తున్నారు?" అని అడిగింది. 


ఆ ప్రశ్నలకు ఇందిర యేం సమధానం చెప్తుందో వినాలని చెవులు రిక్కించాడు మధు. 


"నేను బీకాం చేసి ఆ తర్వాత రెండేళ్ళు ఒక స్టార్ హోటల్లో అసిస్టెంట్ మేనేజరుగా వున్నాను” అని ఇందిర బదులిస్తూండగా గీత కలగచేసుకుని “తనకు సంగీతం వచ్చు. ఇప్పుడు మన సంగీతం ప్రొఫెసర్ సరస్వతి దగ్గర సంగీతం నేర్చుకోవాలని వచ్చింది" అని చెప్పింది. 


"వాహ్! సంగీతం కోసం వుద్యోగం వదిలి వచ్చారంటే మీరు గ్రేట్" అంది నిరుపమ. 


“అయితే ఈ రోజు మీరు మాకోసం ఒక్క పాటైన పాడాలి" అంది మేరీ. 


"తప్పకుండా పాడుతుంది" అని ఇందిర బదులుగా జవాబిచ్చింది గీత. 


భోజనాలు ముగిసిన తర్వాత అందరూ సోఫాల్లో కూర్చున్నారు. 


నిరుపమ, "ఇందిరా! అందరం మీ పాట కోసం ఎదురుచూస్తున్నాం. మీకు ఏ శ్వాసలో చేరితే.. అన్న పాట వస్తే పాడండి" అని కోరింది. 


ఇందిర ఎక్కువ బెట్టు చేయదల్చుకోలేదు. తన ప్రతిభ చూపే అవకాశమిచ్చినందుకు గీతకు మనసులో కృతజ్ఞతలు చెప్పింది. గొంతు సరి చేసుకొని, మనసు పెట్టి, శ్రావ్యంగా పాడింది. 


"సూపర్బ్" అంటూ చప్పట్లు కొడుతూ లోనికి వచ్చాడు గీత భర్త రవి.. 


"ఇంత బాగా పాడుతావనుకోలేదు" అని గీత, "ఒక నిమిషం మమ్మల్ని మేము మరిచిపోయాం" అని నిరుపమ, మేరీ పొగడ్తలతో ముంచెత్తారు. మధు యేమనాలో తెలియక మౌనంగా చూస్తూ వుండిపోయాడు. 


"ఈ గాన సరస్వతి యెవరు?" అని కుతూహలంగా ప్రశ్నించాడు రవి.


"మధుకి బంధువు. మనకు కోడలు" అని గీత జవాబు చెప్తుండగా ఇందిర రవి పాదాలంటి నమస్కరించింది. 


“ఆ సరస్వతి కటాక్షం నీకు నిండుగా వుండాలి. " అని ఇందిరని ఆశీర్వదించాడు. కొద్ది సేపైన తరువాత, గీత దగ్గర సెలవు తీసుకుని నిరుపమ, మేరీ బయలు దేరారు. మధు వారిని సాగనంపడానికి వారిని అనుసరించాడు. మేరీ స్కూటర్ స్టార్ట్ చేసింది. 


నిరుపమ స్కూటరెక్కబోయేముందు మధుతో " నీవు చాలా లక్కీ. " అంది చిలిపిగా. 


మధుకు యేమనాలో తెలియ లేదు. తనది ఇతరులు ముచ్చట పడేంత అదృష్టమా ? లేక జాలి చూపేంత దౌర్భాగ్యమా? అని మధనపడుతూ లోనికి నడిచాడు. 

========================================================================

ఇంకా వుంది..


========================================================================

C..S.G . కృష్ణమాచార్యులు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: C..S.G . కృష్ణమాచార్యులు

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. మేనేజ్మెంట్ విద్యకు సంబంధించిన అనేక పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, హిమాలయ  వంటి ప్రముఖ సంస్థల ద్వార ప్రచురించాను.   చిన్నతనం  నుంచి  ఆసక్తివున్న తెలుగు రచనా వ్యాసంగం తిరిగి మొదలుపెట్టి కవితలు, కథలు, నవలలు వ్రాస్తున్నాను. ప్రస్తుత నివాసం పుదుచ్చెరీలో.


53 views0 comments

Comments


bottom of page