#BVDPrasadaRao, #బివిడిప్రసాదరావు, #Chepattindi, #చేపట్టింది, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ
వారం వారం బహుమతుల పథకంలో ఈ వారం ఉత్తమ కథగా (26/01/2025) ఎంపికైన కథ

Chepattindi - New Telugu Story Written By BVD Prasada Rao
Published In manatelugukathalu.com On 23/01/2025
చేపట్టింది - తెలుగు కథ
రచన: బివిడి ప్రసాదరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ప్రతి వ్యక్తి భావోద్వేగ మద్దతు.. భద్రతాభావం కోరుకుంటారు. వీటి కోసమే బంధాలు ఏర్పర్చుకుంటారు. పొరపాటున.. గ్రహపాటున ఆ బంధాలు ఏమైనా బెడిసి కొడితే తట్టుకోలేరు.
ఆ స్థితిన ఉన్నది సన్నిహిత.
ఉదయం లేస్తూనే.. భర్త మోహన్ కి చెప్పేసింది.. తను తన పుట్టింటికి వెళ్లిపోతున్నానని.
మోహన్ ఉండమనలేదు.. వెళ్లమనలేదు.
సన్నిహిత మరింత బిగుసుకుపోతోంది. తన లగేజీతో పుట్టింటికి బయలుదేరేసింది.. ఆటోను బుక్ చేసుకొని.
సన్నిహిత వెళ్లంగానే.. వీథి ద్వారం తలుపు మూసేసి.. లోపలి గడియ పెట్టేసి.. బాత్రూం వైపు కదిలాడు మోహన్ చాలా మామూలుగా.
ఆరు గంటల తర్వాత..
మోహన్ ఆఫీస్ లో పని చేసుకుంటున్నాడు.
సన్నిహిత పుట్టింటి డోర్బెల్ నొక్కుతోంది.
తలుపు తీసిన కామాక్షి.. కూతురును చూస్తూనే విస్తుపోయింది.
తల్లిని దాటు కొని ఇంట్లోకి దూరిపోయింది సన్నిహిత.
కామాక్షి వీథి లోకి తొంగి చూస్తోంది.. అల్లుడు కోసం.
మోహన్ కానరాక పోయేసరికి.. కాస్తా తడబడుతూనే గుమ్మం డోర్ వేసుకొని హాలు వైపు వెళ్తుంది కామాక్షి.
అప్పటికే హాలులో సోఫాలోకి చేరి తన వదిన కృతితో మాట్లాడుతోంది సన్నిహిత.
"ఏంటి ఒక్క దానివే ఇలా వచ్చేసావు." కామాక్షి ఎదురు సోఫాలో కూర్చుంటూ అడుగుతోంది.
"తెలిసిందేగా.. పైగా రోజూ ఫోన్ లో మొర పెట్టుకుంటున్నానుగా. మీరు పెడ చెవుల్లో పెడతారు. ఆయన మారడు." రోషంగా అంది సన్నిహిత.
"ఇలా వచ్చేటంతగా ఏమైంది." గాభరాపడుతోంది కామాక్షి.
"ఆఫీసులకెళ్లిన నాన్న.. అన్నలు రానీ. అందరికీ ఒకే మారు చెప్తాను." చెప్పింది సన్నిహిత.
అప్పటికే వంట గదిలోకి వెళ్లిన కృతి.. కాఫీ కలుపుతోంది.
కామాక్షి మరో మారు విషయంకై గట్టిగా ప్రశ్నిస్తోంది.
"నాకు విసుగేస్తోంది. మళ్లీ మళ్లీ చెప్పలేను. మీలా ఓర్పు వహించలేను. ఆయనను వదిలేస్తాను." రేష్ గా అనేసింది సన్నిహిత.
కామాక్షి నిజంగానే నిలకడ కోల్పోతోంది.
"అయ్యో.. ఏంటే మళ్లీ మళ్లీ అదే అనేస్తున్నావు. నీ మొండితనం సరి కాదు." సర్ది చెప్పబోతోంది.
అడ్డై.. "కుదరదు. అలాంటే నేను చావాలి. అంతే." సర్రున చెప్పేసింది సన్నిహిత.
అప్పుడే కాఫీ కప్పుతో అక్కడికి చేరింది కృతి.
కాఫీ కప్పును వదిన నుండి అందుకుంటుంది సన్నిహిత.
అత్త పక్కన కూర్చుంటుంది కృతి.
"ఇది మారదు కృతి. మన ప్రయత్నాలు ఇది బెడిసి కొట్టిస్తోంది." కోడలుతో అంటోంది కామాక్షి.
"మళ్లీ ఏమైంది వదినా." సన్నిహితతో అంటోంది కృతి.
"హే. ఎన్ని మార్లు చెప్పాలి. అన్నీ తెలిసి కూడా ఎన్నెన్ని మార్లు మళ్లీ మళ్లీ వినిపించుకుంటారు." చికాకు.. చిరాకు పడుతోంది సన్నిహిత.
అత్త కోడళ్లు ఏమీ మాట్లాడలేక పోయారు. సన్నిహితనే చూస్తూ ఉండిపోయారు.
సన్నిహిత కాఫీ తాగుతోంది. తను దార్లో బస్సు దిగి ఓ కాఫీ తాగింది. తను ఉదయం నిద్ర లేచిన నుండి ఇంత వరకూ గట్టి తిండి ఏమీ తినలేదు. తనకు ఆకలి అవుతోంది.
"టిఫిన్ ఏమైనా ఉందా." అడుగుతోంది.
"ఇప్పుడా.. టిఫినా.. వేళెంతో తెలుసా." అంటోంది కామాక్షి.
"దోసెల పిండుంది. వేసుకు వస్తాను." అంటూనే లేచి వంట గది వైపు వెళ్తుంది కృతి.
కామాక్షి ఏదో అడగబోతోంది.
"ఇంటి మగాళ్లు రాని. మాట్లాడుకుందాం." లేచి.. ఓ గదిలోకి వెళ్లిపోతోంది సన్నిహిత.. తన లగేజీతో.
ఆ రాత్రి..
డిన్నర్ సమయం..
"కొత్త కాపురం. పైగా పెళ్లై యేడాదే. విభిన్న మనసులు. ఇబ్బందులు ఉంటాయి. సర్దుకుపోవాలి. ట్యూన్ అయ్యేలా మెలగాలి. నీకు ఎరికేగా.. నీ అన్న, వదినల తొలి రోజుల్లోని చిటపటలు. ఇప్పుడు వాళ్లని చూడు.. ఎలా ఉన్నారు.." చెప్పుతున్నాడు తండ్రి నాగేశ్వరరావు.
అడ్డై.. "నాన్నా.. మీలా అంతా మంచివారు కాదు. మీలా గైడ్ చేసే వారు కారు మా వారి వాళ్లు. మా అత్త.. మామయ్యల మూలంగానే మా వారు రెచ్చిపోతున్నారు. వాళ్లు మారరు. నేను వేగలేను." చెప్పింది సన్నిహిత.
"అది కాదే.." కలగ చేసుకోబోతాడు అన్న రత్నాకర్.
"అన్నా.. ఊరుకో. నీలా మెసిలే మనిషి కాదు నీ బావ. నా కర్మ. మన మంచితనం అక్కడ సాగదు." ఖండితంగా చెప్పేసింది సన్నిహిత.
అక్కడి మొగుళ్లు పెళ్లాళ్లు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు.
నాగేశ్వరరావు కను సైగలతో మిగతా ముగ్గురు కూడా తగ్గారు.
వాళ్ల డిన్నర్ కొనసాగుతోంది.
మర్నాడు..
సన్నిహిత ఊళ్లోకి వచ్చిందని తెలిసి.. అదే ఊరిలో ఉంటున్న ఆమె స్నేహితురాలు రేణుక సాయంకాలం వచ్చింది.
స్నేహితురాలిద్దరూ ఓ గదిలో ముచ్చట్లాడుకుంటున్నారు.
"నిన్నెరిగిన దానిగా చెప్పుతున్నా.. నువ్వు మెతక దానివే. నువ్వు మారాలే. పేరెంట్స్ కూచీగా ఉంటే ఎలాగే. నువ్వంటూ ఆలోచించుకో." చెప్పుతోంది రేణుక.
రేణుకకు సన్నిహిత కాపురం కబురులు తెలుసు. వాళ్లిద్దరూ తరుచూ ఫోన్లో మాట్లాడు కుంటుంటారు. పైగా సన్నిహిత ఊరొచ్చినప్పుడల్లా కలుస్తుంటారు.
"పెద్దోళ్లని చెప్పుతుంటే వీళ్లు మరింత నొక్కుతున్నారే. అక్కడ ఆయన మరింత పేట్రేగిపోతున్నాడు." చెప్పింది సన్నిహిత.
"మీ ఆయన మరీ కానోడే. డబ్బు ఆశంటే సర్దొచ్చు.. కానీ.. అనుమానపు మనిషి కనుక కష్టమే." అనేసింది రేణుక.
"మరే. కాలేజీకి వెళ్లిన దానివి.. లవర్స్ లేరంటే నమ్మేది నా వల్ల కాదంటూ.. ప్చ్.. తెగ నస పెట్టేస్తున్నాడే." కన్నీళ్లు కారుస్తోంది సన్నిహిత.
"అరె. ఊరుకోవే." అంటోంది రేణుక.
"ఇలా.. ఒకటా.. ఎన్నో.. ముద్దులుతోనే ఆగావా.. ఎన్ని మార్లు ఎక్స్టెన్షన్ అయ్యావ్.. అదీ ఒకరితోనా.. ఇంకెందరితో.. అబ్బబ్బా.. చెత్త మనిషే." రుసరుస లాడుతోంది సన్నిహిత.
రేణుక ఏమీ అనలేదు. కానీ లోలోన నొచ్చుకుంటుంది.
"ఒట్లు నమ్మడు. మా వాళ్లతో చెప్పించినా వినిపించుకోడు. పైగా.. విసుగేసి.. 'నీకు లవర్స్ ఉన్నారా' అంటే.. బరితెగించానంటూ తిరగబడిపోతాడు." సన్నిహిత ఏడుస్తూనే ఉంది.
"నిజమేనే.. అతడితో వేగడం నీకు కష్టమే. నీ నిర్ణయమే సరైనది. విడాకులు తీసేసుకో." అనేసింది రేణుక.
ఆ వెంబడే..
"ఏం వయస్సు మీరాం మనం. నాతోటి దానివేగా. ఎంచక్కా మరో పెళ్లి చేసుకో." అనేసింది కూడా.
"మరో పెళ్లా.. చాల్లే.. ఈ జంజాటం చాలదా. ముందు ఆయనతో విడిపోయి నా అంతట నేను నిలదొక్కుకోవాలి. స్వేచ్ఛ.. స్వతంత్రం పొందాలి." చెప్పింది సన్నిహిత.
ఆ వెంబడే..
"మా వాళ్లు నా మాట వినరుగా. నేనేదో కొంపలు అంటించేలా ఫీలైపోతున్నారు. హు. ఇంకేం కొంపలు అంటేది." పెడసరంగా అంటోంది.
"నువ్వు ఈ సారి మొండిగా ఇక్కడే కొన్నాళ్లు ఉండిపో. మీ వాళ్లు ఎగతోసారని అక్కడికి వెళ్లకు." సలహాలా అంది రేణుక.
పదిహేను రోజుల తర్వాత..
తన తల్లిదండ్రులు.. అన్నా వదినల మాటలు లెక్క చేయక పంతంగా కన్నవారింటిలోనే ఉంటోంది సన్నిహిత.
సాయంకాలం రేణుక వచ్చింది సన్నిహిత వద్దకు. ఇద్దరూ ఈ మారు డాబా పైకి వెళ్లి మాట్లాడుకుంటున్నారు.
"నా రాయబారాలు పారడం లేదని.. నేను మళ్లీ చెప్పేనే మీ వాళ్లతో. వాళ్లు నా ద్వారా నీకు చెప్పించడం వీడడం లేదే." చెప్పింది రేణుక.
ఆ వెంబడే..
"సర్లే. ఇంతకీ ఈ మధ్య కబురులు ఏంటి." అడిగింది.
"మా వాళ్ల సొద కొనసాగుతూనే ఉంది. నా పెడ చెవితనం నాది." చెప్పింది సన్నిహిత.
"మీ ఆయన నుండి ఏమీ కదలిక లేదా." అడిగింది రేణుక.
"అబ్బే.. నువ్వు ఇంకా ఏమనుకుంటున్నావు. అతడు కదలడు.. మెదలడు. అతడు ఒక కొరగాని మనిషి. ఛ." సన్నిహిత జంకు ఎప్పుడో మానేసింది.
"మరి.. మీ అత్తమామలు.." అడుగుతున్న రేణుకకు అడ్డై..
"చాల్లే. వాళ్లే మనుషులైతే.. వాళ్ల బిడ్డ మనిషయ్యేవాడుగా. వాళ్లంతా దొందుకి దొందులే." విసుక్కుంటుంది సన్నిహిత.
ఆ వెంబడే..
"మా వాళ్లు.. మా ఆయనతో మాట్లాడి ఉంటారు. ఆయన ఎప్పటిలాగే తన పెద్దలతో మాట్లాడమనుంటాడు. అంతే.. ఎక్కడేసిన గొంగలి అక్కడి మచ్చులు మాదిరీలే. అటు నుండి ఒరిగేది ఏమీ ఉండదు. మా వాళ్లు తెల్చుకోలేక అవస్థలవుతున్నారు." తేలిగ్గా అనేసింది.
"మరెలా." చిత్రంగా అంటోంది రేణుక.
"నేను ఓ క్లారిటీన ఉన్నాను. నేను అటు వెళ్లను. అలాగే ఇక్కడ ఇక ఉండను. స్వతంత్రంగా నాకు నేను ఉంటాను." చెప్పింది సన్నిహిత.
"అదెలా." విస్మయమయ్యింది రేణుక.
"చదువు ఉంది. ఏదో జాబ్ సంపాదించుకుంటాను. మొండికి వేస్తాను. తప్పదు. అతడితో కాపురం మాత్రం వద్దు." తేల్చేసింది సన్నిహిత.
"అయ్యేదా. ఆలోచించుకోవే. నాన్నని ఒప్పించుకోవే. బతిమలాడుకోవే." చెప్పుతోంది రేణుక.
అడ్డై.. "కుదరదే. చచ్చినా మా వాళ్లు మారరు. నాకా అటు పొసగదు. చాలు.. ఇక కొత్త వైపు అడుగులు వేస్తాను. ఎవరికీ భారం కాను. దేనికీ జంకను." చెప్పింది సన్నిహిత.
స్నేహితురాలు కచ్చితత్వంకి విడ్డూర పడుతోంది రేణుక.
"రేణూ.. నీ కనికరం వద్దు. నేను నిలదొక్కుకున్నంత వరకు నువ్వు నాకు సాయంగా కాస్తా నిలబడవే చాలు. ప్లీజ్." అంటోంది రేణుక రెండు చేతులు పట్టుకొని.
తర్వాత..
నెల వారాలు దాటక ముందే..
రేణుక భర్త నిర్వాహణలోని కాన్వెంట్ లో ఓ టీచర్ గా సన్నిహిత చేరగలిగింది. అలానే రేణుక విల్లాలోని పెంట్హౌస్ లో అద్దె చెల్లించే పద్ధతిన మకాం పెట్టింది. అందుకు తన వాళ్లని మెడ్డించింది.. తన స్నేహితురాలిని ఆశ్రయించింది.
అప్పటికే.. మోహన్ కు డైవర్స్ కై నోటీస్ లాయర్ చే పంపించింది.
నిజమే.. సాలొచ్చినదే సానుకూలతని చేపడుతోంది.
***
బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.

Comentarios