top of page
Writer's picturePandranki Subramani

చెప్పాలనుకున్నది చెప్పలేనప్పుడు...



'Cheppalanukunnadi Cheppalenappudu' written by Pandranki Subramani

రచన : పాండ్రంకి సుబ్రమణి

బాలసుబ్రహ్మణ్యం విశాఖ ఆర్టీసీ బస్టాండులో దిగి కొన్ని క్షణాలు యెక్కడివాడక్కడ కదలకుండా నిల్చున్నాడు. ఆలోచనలు పొలోమని వాల్తేరు కొండగాలుల్లా వీస్తూ మనసును ఆక్రమించాయి. ఒరుసుకుంటూ పోతూన్న తోటి ప్యాసంజర్ల తాకడిని గమనించకుండా ఆకాశంలోకి చూస్తూ గత కాలం వేపు సాగిపోయాడు. అప్పటి మాట అటుంచి తనిప్పుడు రెండవసారి మనువాడబోతున్నాడా!

మనువాడబోతున్నాడే అనుకో — పని గట్టుకుని వెళ్ళి తన బడిరోజుల గురువుగారికి ఆ విషయం చెప్పాలా! ఆ మాటకు వస్తే తను మనువాడబోయేది మొదటి సారి కాదుగా! కొత్త పెళ్ళికొడుకు కాదుగా! ఏది యేమయితేనేం అప్పటి వయసు వేరు- ఉద్వేగం వేరు. ఎంత కొని తెచ్చుకోవాలని పూనుకున్నా అప్పటి చార్మ్-వార్మ్ మళ్లీ రాదుగా. ఆరిపోయిన అత్తరు మరలా.. కాని... కాని...మళ్లీ అదే ఆలోచన. రివ్వుమన్న చిరు అలవంటి ఆ ఆలోచన వెనుక గోరంత దీపం వంటి ఆశ మిణుకు మిణుకు మంటుంది. అప్పుడూ ఇప్పుడూ అని కాదు. ఆశ రగలాలే గాని, అది అంత త్వరగా చల్లారుతుందా! రాజదర్బారుని వెలుగు వెల్లువతో నింపే దివిటీలా రాజుకుంటూనే ఉంటుంది.

కాసేపటికి అతడు తేరుకుని కదిలాడు. అతడికి సీతమ్మధారకు వెళ్ళే దారి తెలుసు. అటు వెళ్ళే బస్సు నెంబర్ కూడా తెలుసు. కాని అతడు చార్జీ గురించి ఆలోచించకుండా ఆటోరిక్షాలోకి యెక్కి కూర్చున్నాడు. మనసు మూలన చోటు చేసుకున్న సందిగ్ధావస్థను యెంత త్వరగా క్రిందకు దింపుకుంటే అంత శ్రేయస్కరం. జీవితమంటే యెంత దీర్ఘమైన ప్రయాణమని! అటు దిగంతాలవరకూ వెళ్ళి మళ్ళీ ఇటు భువికి రావద్దూ!

బాల సుబ్రహ్మణ్యానికి తెలుసు బడిపంతులు రామప్ప పంతులుగారిది ప్రాత పెంకుటిల్లని. కాని అతడికి అటువంటి ఇల్లంటేనే ఇష్టం. గతంతో ముడిపడి ఉన్నదేదైనా ఇష్టంగానే ఉంటుంది కదా! ఆ యింటితో- ఆ యింటి చుట్టూ తలలూపుతూ ఆప్యా యంగా పలకరిస్తున్నట్టున్న పచ్చటి తోటతో అతడి యవ్వన దశ యెంతగా పెనవేసుకుందని. ఒకటొక్కటిగా గుర్తుకొస్తున్నాయి.

రామప్ప పంతులుగారు విద్యాశాఖ సర్వీసులో ఉండగానే ఆయన భార్య మరణించింది. కాని యెందుకో మరి ఆయన మరు మనువాడ లేదు; ఎంత మంది యెన్ని విధాల నచ్చ చెప్పాడానికి ప్రయిత్నించినా-- అప్పట్నించాయన ఒక్కగానొక్క కూతురు సౌమ్య ఆలనా పాలనా చూసుకోసాగారు. సవతి తల్లి ఉనికి వల్ల ఆరంభమయే ఆరళ్ళకు భయపడేమో! ఆ తరవాత ఆయనకు తోడుగా నిలచి నీడనిచ్చే ఉసిరి చెట్టు కూతురు సౌమ్యేనని విడిగా చెప్పనవసరం లేదు.

రిక్షావాడికి కిరాయి డబ్బులిచ్చి పంపించి ఇంటి గడప వరకూ వచ్చి తలుపు తట్టాడు బాలసుబ్రహ్మణ్యం. అతడూహించి నట్లు- కాదు- అణువణువునా ఆశించినట్లే సౌమ్య తలుపు తీసుకుని బైటకు వచ్చింది- “ఎవరు కావాలండీ!“అంటూ. అతడికి కొన్ని క్షణాల పాటు మాటలు వెతుక్కో వలసి వచ్చింది. అప్పుడెప్పుడో చూసిన రూపం; నిండు పదిహేడేళ్ళ ప్రాయం ఉంటుందేమో! ఇప్పుడు ఇరవై

ఐదేళ్ళ వయసు కంచెను దాటి ఉంటుంది. అయితేనేం? తన కలను చెదరనివ్వకుండా ఊహను మసక బార నివ్వకుండా ఇంకా అలానే నిండుగా కళగా కమనీయ సుందర కావ్యంలా ఉంది. అరుదైన రూపం- అరుదైన అందం.

సౌమ్య అతణ్ణి కుదిపేలా రెట్టించి అడిగింది- “నేనడుగుతన్నది మిమ్మల్నే! ఎవరు కావాలండీ!” అతడిప్పుడు ఉలికిపాటుతో తేరుకున్నాడు.

“నేనండీ- నేను రామప్ప పంతులుగారి బడి

రోజల్నాటి శిష్యుణ్ణండీ. ఆయనున్నారండీ!”

అప్పుడామె కనురెప్పలల్లార్చింది. “మిమ్మల్నిక్కడ యెప్పుడూ చూసినట్టు గుర్తుకి రావడం లేదండీ!”

“నాకు మీరు బాగానే గుర్తున్నారండీ! నా పేరు బాల సుబ్రహ్మణ్యమండీ! అప్పుడు ఇదే వీధి చివరన మా బాబు కిరాణా దుకాణం నడుపుతుండే వారు. అప్పుడప్పుడు మీరు కూడా మీ అమ్మగారితో కలసి వస్తుండేవారు. కొంచెం గుర్తుకి తెచ్చుకోండి”

“ఓ! మీరా! సారీ? మిమ్మల్ని చూసి చాలా రోజులయిందేమో- వెంటనే గుర్తు పట్టలేక పోయాను. లోపలకు రండి” అంటూ ప్రక్కకు తొలగింది. అప్పుడామెకు తెలియకుండానే ఒక చిన్నపాటి అనుమానం మనసు ఓరన తాకింది. తండ్రిగారి అప్పటి చాలా మంది శిష్య గణంలా కాకుండా ఇతడు గురువుగారిని చూసి వెళ్ళడానికి రిక్త హస్తాలతో వచ్చినట్టున్నాడు. కనీసం చేతిలో పూల చెండూ లేదు. ప్రయాణ బడలిక వల్ల మరచిపోయుంటాడేమో!

ఇకపోతే- రామప్ప పంతులు మాత్రం అలనాటి శిష్యుణ్ణి వెంటనే పోల్చుకోగలిగాడు. “రావోయ్ రా!ఎలా గున్నావు? అప్పుడెప్పుడో సింహాచలం తీర్థ యాత్రలకెళ్ళినప్పుడు యెవరో చెప్తే విని బాధేసింది. నీతో విధి విపరీతంగానే ఆడుకుంది. బిడ్డ క్షేమంగా తల్లి కడుపునుండి బైటపడ్డా తల్లేమో బాలింతరాలిగా అసువులు బాయడం గుండెలున్నవారెవరూ తట్టుకోలేరు సుమా!” బాలసుబ్రహ్మణ్యం యేమీ అనలేదు. కాసేపు అలాగే ఉండి పోయి నోరు విప్పి అన్నాడు- “చంటాడి ఆలనా పాలనా చూసుకోవడానికైనా రెండవ మనువాడమని ఇంట్లోవాళ్ళు పోరితే ఒప్పుకోక తప్పింది కాదు పంతులుగారూ!”

“అలాగా! ఎక్కడి సంబంధమట?” అతడు కళ్ళప్పగించి చూడసాగాడు నోరు విప్పకుండా-- అప్పుడు

పంతులు గారే అందుకున్నాడు- “సంబంధాలు వస్తున్నాయంటే రావూ మరి! డిప్యుటీ తహసీల్దారు ఉద్యోగమంటే మాటలా!”

“అందుకని---“అంటూ అర్ధోక్తిగా ఆగిపోయాడు బాలసుబ్రహ్మణ్యం. రామప్ప అతడి ముఖంలోకి చూసాడు- చెప్పడానికి సందేహ మెందుకు అన్నట్టు.

”అదే చెప్పబోతున్నానండీ! ఒక సంబంధమేమో చిక్కడ పల్లిది. రెండవదేమో విజయవాడది. మూడవ సం బంధమేమో మెదక్ జిల్లాది. ఇదిగో అమ్మాయిల ఫోటోలు కూడా తెచ్చాను, వాళ్ళ కుటుంబ బయోడేటాతో సహా—“ అంటూ వాటినన్నిటీనీ ఆయన ముందుంచాడు.

ఓసారి చూపు ఆనించడానికి ప్రయత్నించి రామప్ప దిగులు ముఖంతో అన్నాడు-

“నీ మొదటి పెళ్ళికి వచ్చి పచ్చ పచ్చగా పెళ్లి పందిరిలో కూర్చున్న మీ భార్యా భర్తలిద్దరినీ ఆశీర్వదించిన వాణ్ణి. అదే కళ్ళతో ఈ మూడు ఫొటోలనూ చూడటం మనసుకి సంకటంగా ఉందోయ్!”అంటూ కళ్ళ జోడుని సరి చేసుకుని చూసి- “ముగ్గురూ బాగానే ఉన్నారోయ్-” అంటూ ఫొటోలూ తదితర పేపర్లూ తిరిగిచ్చేసాడు.

ఆ లోపల మంచినీళ్ళ చెంబును అందిచ్చిన సౌమ్యనూ రామప్ప మాష్టారునీ గుటకలు మింగుతూ చూసాడు బాల సుబ్రహ్మణ్యం. కాని వాళ్ళలో ఎటువంటి ముఖభావమూ కనిపించకపోయే సరికి తనకు తను తేరుకుంటూ మంచినీళ్లు తాగి అడిగాడు- “మీరింకేమైనా చెప్పాలా మాష్టరూ!”

“ఇందులో ఇక చెప్పడానికేముంది సుబ్రహ్మణ్యం! ఫొటోలతో బాటు బయోడేటా కూడా పెట్టారుగా- ఇక యెంపిక నీది—“

బాల సుబ్రహ్మణ్యం ఇక మాట్లాడ లేదు. మౌనంగా లేచి ప్యాంటు జేబునుండి నోట్ల కట్ట తీసి- “దయచేసి వద్దనకండి మాష్ట రూ! దీనిని గురుదక్షిణగా స్వీకరించండి”అని నోట్ల కట్టను స్టూలుపైనుంచి ఆయన పాదాలకు నమస్కరించి- “ మీ ఇల్లు చూసి, మీ యింటి తోట చూసి, మీ ఇంట్లో భోంచేసి చాలా రోజులయిందండీ! అప్పటి రోజులు గుర్తుకు వచ్చి దు:ఖం తన్ను కొస్తూంది. ఆ లోపల పెరడంతా తిరిగి ఆ తరవాత కాఫీ తాగుతాను” అంటూ నడవమ్మట బైటకు నడిచాడు.

ఇప్పుడతను పెరడు తోట మధ్యకు వచ్చి నిటారుగా నిల్చున్నాడు గొడుగులా పరచుకున్న ఆకాశంలోకి చూస్తూ— చల్ల ని గాలులు- సుగంధ గాలులు మృదు మధురమైన జ్ఞాపకాలను రెక్కలపైన మోసుకుంటూ అతడి చుట్టూ విడిచి వెళ్తున్నాయి. అతడికి తెలియకుండానే రెండు కళ్లూ చెమ్మగిల్లాయి.

బాల్యం! ఆ ఒక్క పదంలోనూ యెంతటి పసందైన ఊహ దాగిఉంది! ఒకానొకప్పుడు తనతో బాటు చదువుకున్న- చెట్టాపట్లా లేసుకు తిరగిన బాల్య మిత్రులేరీ? చెట్టుకొక పక్షిలా ఉపాధి వెతుక్కుంటూ చెదరి పోయుంటారు. మరి తను మాత్రం యేమిటంట? తను మాత్రం ఇక్కడే ఉన్నాడూ-- అతడలా పెను నిట్టూర్పు విడుస్తూ వెనక్కి తిరిగేటప్పటికి అక్కడ సౌమ్య అతడికి మిక్కిలి దగ్గరగా ఆనుకుని నిల్చుంది.

“సారీ! మీరా! ఎవరో అనుకున్నాను. కాఫీ చేసేసారా- తాగాలని ఉంది”

“చేసేసాను. అందరమూ కలిసే తాగుదాం. కాని ఇప్పటికిప్పుడు ఒకటి అడగాలని ఉంది. చెప్తారా!”

“ఎందుకు చెప్పను? అడగండి”

“మీ కళ్లు చెప్తున్నాయి మీరు చాలా బాధ పడుతున్నారని, ఆందోళన చెందుతున్నారని— మా నాన్నగారికి యేదో చెప్పాలని వచ్చారు. కాని చెప్పకుండానే వెళ్లి పోతున్నారు. ఔనా!”

ఆ మాటతో అతడికి అచిర ద్రుతి తాకినట్లయింది. ఎంతటి సూక్ష్మ గ్రాహి! సున్నిత హృదయులైన స్త్రీలకు ఇటువంటి సుకుమార భావ స్రవంతి లోలోన ఉంటుందేమో!

అప్పుడతడి ఆశ్చర్యానికి అడ్డు కట్ట వేయడానికి ఆమె అంది- “మరీ ఆశ్చర్యపోకండి సుబ్రహ్మణ్యం గారూ! ఎవరైనా గురువుగారిని చూడటానికి వచ్చినప్పుడు రిక్త హస్తాలతో రారు కదా! నాన్నగారితో సంభాషణ పూర్తయిన తరవాత తానుగా భోంచేసి వెళ్తానని చెప్పడం వల్ల తెలుస్తూనే ఉంది గా మీరిక ఇటువేపు కచ్చితంగా మళ్ళీరారని— మీ దేహభాష వల్ల నాకు తెలుస్తూనే ఉంది యేదో చెప్పడానికి వచ్చి చెప్పకుండానే వెళ్ళిపోతున్నారని. అదేదో మీరిప్పుడు నాతో చెప్తారా? మరీ పర్సనల్ ఐతే, అభ్యంతరం గాని ఉంటే చెప్పనవసరం లేదు”

“మీరు సూటిగానే అడిగారు గనుక నేనూ సూటిగానే చెప్తాను. నేను చెప్పేది ఇబ్బందికరంగా ఉంటే మీరిక్కణ్ణ్ణించి వెళ్ళిపోవచ్చు” .

ఆమె చిన్నగ నవ్వి ‘ఉఁ’ అంది.

అతడు కాసేపు యెడబాటు ఇచ్చి చెప్పసాగాడు- “స్కూలు రోజుల్నించి మీరంటే నాకు ఇష్టం- చాలా ఇష్టం సౌమ్యా! ఎప్పుడిక్కడకు వచ్చినా మిమ్మల్ని తేరి పార చూస్తూ నిల్చునే వాణ్ణి. మా దుకాణం నుండి కిరాణా దినుసుల్ని తెచ్చిస్తుండే వాణ్ణి మిమ్మల్ని చూడగలనన్న ఆశతో—“

“అలాగా! నాకు తెలియదే--”

“ఔను న్యాయమే— మీకప్పుడు పదిహేను సంవత్సరాలుండ వచ్చు. మరీ చిన్నపిల్లలా ఆట పాటల్లో లీనమయి కనిపించే వారు. లేడిలా గెంతుతూ చాలా చురుగ్గా ఉండేవారు. జానియర్ కాలేజీలో చేరింతర్వాత కూడా యేదో ఒక నెపంతో మీ ఇంటికి వస్తుండేవాణ్ణి. మీరు నావేపు తిరిగి కూడా చూసేవారు కాదు. పలకరించడానికి ప్రయత్నిస్తే అదోలా కళ్ళెత్తి చూసి వెళ్ళిపోయే వారు. ఒక రోజు యేమైందంటే- మీరు తోటి అమ్మాయిలతో ఆడుతూన్న బంతి పల్లంలో పడిపోయింది. లోతైన పల్లమే-- నేను దానిని దూరం నుంచి చూసి చెంగున దిగి మోకాళ్లు గీరుకుపోతున్నా లక్ష్యపెట్టక దానిని అందుకుని మీకు ఇచ్చాను. మీరు థేంక్స్ చెప్పలేదు సరికదా- కనీసం నా వేపు చిర్నవ్వు కూడా విసర లేదు. ఆ రోజు చాలా నిస్పృహ చెందాను. ఎంతగా అంటే- ఇంటికి వెళ్ళి ఆపుకోలేనంతగా యేడ్చాను. అప్పుడు తీర్మానించాను, మళ్ళీ ఈ జన్మలో మీ ముఖం చూడకూడదని. అదే తీర్మా నంతో నిల్చున్నాను. పట్నం వెళ్ళి ఉద్యోగంలో స్థిరపడి

అక్కడే వివాహం చేసుకున్నాను. కాని ఆశ చూసారూ- యెన్నటికీ ఆరని అగ్ని కీల వంటిది. దురదృష్ట వశాత్తు మా ఆవిడ చేతికి పాపనిచ్చి చనిపోయింది. నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమని ఇంట్లోనూ పొరుగులోనూ ఒత్తిళ్లు. మళ్లీ అదే ఆశ- నీ గురించిన ఆశ—

అప్పుడు యెదురు చూడని సంఘటన జరిగింది. మీ పెదనాన్న కొడుకు తాతారావు నన్ను కలుసుకున్నాడు యేదో అఫీషియల్ పని పైన వచ్చి— అప్పడు మాటల సందర్భాన చెప్పాడు నువ్వు పెళ్ళి చేసుకోకుండా ఉన్నావని. కారణం అడిగితే చెప్పాడు- కట్నం కానుకల కోసం ఆశపడి వచ్చేవాడిని ససేమిరా చేసుకోనని భీష్మించుక్కూర్చున్నావని- రెండవ కారణం కూడా చెప్పాడు- మీ నాన్నను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళడం మీకు ససేమిరా ఇష్టం లేదని. మొదట మీపైన నాకు నిజంగానే అభి మానం కలిగింది. రెండవది- నాలో కొన్ని సంవత్సరాలుగా మిణుకు మిణుకుమంటూన్న ఆశ కొండంత దీపమై వెలగనారంభిం చింది. ఎదుర్కోలు పలికిన మూడు సంబంధాలను ప్రక్కన పెట్టి తిన్నగా ఇక్కడకు రెక్కలు కట్టుకుని వాలాను.

తీరా ఇక్కడకు వచ్చిన తరవాత విషయాన్ని యెలా ప్రస్తావించాలో యెప్పుడు ప్రస్తావించాలో తెలియక ఆధారం అందక కుడితిలో పడ్డ యెలుకలా కొట్టుకుంటూ తిరుగు ప్రయాణానికి సిధ్ధ పడ్డాను”

“మరి నన్ను అడక్కుండానే యెందుకు వెళ్లిపోతున్నారు?“

“ఎలా అడగను? నాది రెండవ మనువు. అందులో ఇంట్లో పాప ఉందిగా- మీకు ఇష్టం ఉండకపోవచ్చుగా! మాష్టారుగారు స్వయంగా పనిగట్టుకుని నా తరపున మీకు చెప్తే- అది వేరే విషయం-- అప్పుడు మీరు నా వేపు తిరిగి నా గురించి ఆలోచించవ చ్చు. అలా యేమీ జరగలేదు. అందుకే ఇక మరు చూపు లేకుండా వెళ్లి పోతున్నాను”

అంతావిన్న సౌమ్య సన్నగా నిట్టూర్చింది. కాసేపు బాల సుబ్రహ్మణ్యం వేపు తిరిగి తేరిపార చూస్తూ అంది- “ఇప్పుడు నాకు బాగా గుర్తుకి వస్తూంది- మీ అమ్మగారు మా ఇంటికి వచ్చి తులసి తోటలోకి వెళ్లి హనుమంతుడి పూజ కోసమని- శ్రీ మహా విష్ణువు పూజ కోసమని తులసీ దళాలను తీసుకు వెళ్లేది. వెళ్ళేటప్పడు మీ అమ్మగారికి నేను పారిజాతాలు కనకాంబరాలు కూడా కోసి ఇచ్చేదాన్ని. ఎంత మధురమైన రోజులవి- ఎంత స్వఛ్చమైన ఊహలవి.

సరే- నేనిప్పుడు సూటిగా విషయానికి వస్తున్నాను. రేపు నాకు అదృష్టం ఉండి నాకు నచ్చిన వాడు- నేను మెచ్చిన వాడు తోడుగా దొరక వచ్చు. కాని మీలా ఇంతగా మనసిచ్చి ప్రేమించిన మగ పురుషుడు ఈ జన్మలో నాకు దొరకడేమో--. అందుకే చెప్తున్నాను- మనసిచ్చి చెప్తున్నాను- నేను మీ బిడ్డకు తల్లిగా మారడానికి సిధ్ధం. మీరు నన్ను మీ సతీమణిగా స్వీకరించడానికి ఇష్టమా!”

అతడు కొన్ని క్షణాల వరకూ నమ్మలేనట్టు కళ్ళప్పగించి చూస్తూండి పోయాడు. ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ఇంకా అలానే కనురెప్పలార్పకుండా చూడసాగాడు.

“ఇప్పటికైనా చెప్పదలచుకున్నది చెప్ప వచ్చుగా!” సౌమ్య అడిగింది.

“చెప్తాను. తప్పకుండా చెప్తాను. నిన్ను పెళ్లి చేసుకున్న తరవాత నేను నిన్నూ మాష్టరుగారినీ మాతో కలుపుకుంటాను. సరేనా“

ఆ మాట విన్నంతనే సౌమ్య అరమోడ్పు కళ్ళతో అతడికి హత్తుకు పోయింది. ఇప్పుడతనికి ఆకాశ వీధులమ్మట బుజ్జిగాడి కేరింతలు వినిపిస్తున్నాయి- “అమ్మేదీ! అమ్మేదీ! అమ్మెప్పుడొత్తాదేమిటి?“అని అడుగుతున్నట్లుంది. ”వస్తుంది. తప్పకుండా వస్తుంది. త్వరలోనే వస్తుంది నీకు జోలపాట పాడి, వెన్నెల గీతం పాడి గోరుముద్దులు తినిపించడానికి---” బాలసుబ్రహ్మణ్యం గుండె నుండి హృదయ నాదం వినిపించసాగింది. బహుశః అతడి గుండెలోని ఆ హృదయ నాదం అతడి చిన్నారి బుజ్జిగాడికి మాత్రమే వినిపిస్తుందేమో!

***శుభం***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.




54 views0 comments

Comments


bottom of page