top of page

చెట్లను పెంచాలి!

Writer's picture: Gadwala SomannaGadwala Somanna

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ChukkalloChandrudu, #చుక్కల్లోచంద్రుడు, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 18

Chetlanu Penchali - Somanna Gari Kavithalu Part 18 - New Telugu Poems Written By - Gadwala Somanna Published In manatelugukathalu.com On 07/02/2025

చెట్లను పెంచాలి! - సోమన్న గారి కవితలు పార్ట్ 18 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


చెట్లను పెంచాలి!


పచ్చని చెట్లు నీడలో

పట్టరాని సంతోషము

ఆ తరువు తల్లి ఒడిలో

అమితమైన ఆరోగ్యము


చెట్టుకున్న ఆకుల్లో

ఔషధము లభ్యమగును

దానికున్న కొమ్మల్లో

తీయని ఫలములు దొరుకును


పంచును ప్రాణ వాయువు

పెంచును మనిషి ఆయువు

కామధేనువు వృక్షాలు

సహకారానికి సాక్ష్యాలు


తరువులెన్నో పెంచాలి

పచ్చదనమే పంచాలి

పర్యావరణ రక్షణకు

అందరు నడుం బిగించాలి
















పెద్దయ్య హితోక్తులు

----------------------------------------

అమూల్యమైన చెలిమి

ఎవరెస్టులా బలిమి

భగవంతుని బహుమతి

పెంచుతుంది పరపతి


దానవత్వము చెరుపు

మానవత్వము మలుపు

మహిలో పరికింపగ

దైవత్వమే గెలుపు


పసి పిల్లల పలుకులు

వెన్నెలమ్మ చినుకులు

జిహ్వకెంతో తీపి

జుంటితేనె ధారలు


మధురమైనది తెలుగు

జీవితాలకు వెలుగు

మాతృభాషే ఘనము

తెలుసుకుంటే నిజము

పనికిరాని గొప్పలు

చూడంగా దిబ్బలు

సర్వత్రా వినయము

సమకూర్చును విజయము
















అన్న హితవు

----------------------------------------

ఇష్టపడి చదవాలి

కష్టపడి ఎదగాలి

బద్దకం వదిలేసి

ఎద్దులా సాగాలి


బుద్ధిగా బ్రతకాలి

వృద్ధిలోకి రావాలి

హద్దులు దాటేయక

ఒద్దికగా ఉండాలి


కన్నోళ్లను చూడాలి

కన్నీరు తుడవాలి

వెన్నలాంటి మదితో

వెన్నెలై కురియాలి


పట్టుదల చూపాలి

గట్టులా నిలవాలి

వట్టి మాటలు వద్దు

చెట్టులా మారాలి















మానవులకు హితులు

----------------------------------------

మెరిసే తారలకు

కురిసే చినుకులకు

త్యాగమెంతో ఉంది

విరిసే పూవులకు


పారే యేరులకు

ప్రాకే తీగలకు

అందమెంతో ఉంది

నవ్వే పిల్లలకు


వీచే గాలులకు

వ్రాసే కలములకు

పరోపకారముంది

పుడమిపై తరువులకు


పండే పొలములకు

పచ్చని మొలకలకు

త్యాగగుణము ఉంది

మండే సూర్యునికి


త్రాగేటి నీటికి

ప్రవహించే యేటికి

భేదమసలు లేదు

మంచి వారి నోటికి


వజ్రాల ముక్కలకు

ఎదిగే మొక్కలకు

విశ్వాసం ఉంది

పెంచే కుక్కలకు




















సంకల్పంతో సాధ్యమే!

----------------------------------------

దృఢ సంకల్పముంటే

ఏదైనా సాధ్యమే!

భగీరథ యత్నంతో

అడుగడుగునా విజయమే!


భూమి పొరలు చీల్చుకొచ్చే

విత్తు మనకు ఆదర్శము

చీకటిని తరిమికొట్టే

రవి కిరణం సందేశము


బండలనూ, కొండలనూ

పెకిలించే మొక్క మనకు

మిగుల స్ఫూర్తిదాయకము

కడు ఆచరణ యోగ్యము


ప్రయత్నించి చూస్తేనే

లోతుపాతులు తెలిసేది

అడుగుముందుకేస్తేనే

గమ్యం చేరువయ్యేది


కఠిన శిలలోంచి బయటకు

వచ్చిన చెట్టును తిలకించు

దానికున్న పట్టుదల

ఇకనైనా స్వాగతించు


ప్రకృతి నేర్పును పాఠాలు

చెప్పకనే చెప్పునోయి!

అమూల్య జీవిత సత్యాలు

అవసరమైన విషయాలు















విలువైనది విశ్వాసము

---------------------------------------

దేవునిపై విశ్వాసము

భక్తికదే ఆధారము

దండలోని దారంలా

గుండెకు రక్షణ కవచము


నమ్మకమే లేకుంటే

అంతా అతలాకుతలము

బంధాలకు విఘాతము

అభివృద్ధికి అవరోధము


అవిశ్వాసం పెనుభూతము

చేయును బ్రతుకులు నాశనము

అనుబంధాలు అంతమై

అగును శిథిలం సమస్తము


ఎదిగేందుకు విశ్వాసము

అగును విజయ సోపానము

సాహస కార్యాలకదే

మృత సంజీవని సమము


అన్నింటికీ కేంద్రము

అవనిలోన విశ్వాసము

అదే గనుక క్షీణిస్తే

సృష్టి అగును సమాప్తము














అవధులు రక్షణ కవచాలు

---------------------------------------

ఉంటేనే! అవధులు

బాగుపడును బ్రతుకులు

అవి రక్షణ కవచాలు

తప్పించును ప్రమాదాలు


హద్దులు లేకుంటే

సముద్రం సృష్టించును

ఇల అల్లకల్లోలము

సునామీలే తెచ్చును


పద్ధతిగా ఉండును

అవధులతో బ్రతుకులు

క్రమశిక్షణ నేర్పును

నడవడినే దిద్దును


గీత దాటి సీతమ్మ

కష్టాలు తెచ్చుకొనెను

హద్దు మీరి రావణుడు

ప్రాణాలు కొల్పేయెను


ఇవి చరిత్ర నేర్పే

ఘన జీవిత పాఠాలు

ఆచరిస్తే గనుక

మిగులునోయ్! జీవితాలు














చిట్టి పాపాయి-పండు వెన్నెల రేయి

---------------------------------------

పాపాయి పలికితే

మధువులే కురియును

ముద్దుగా పాడితే

కోయిల గానమగును


చిన్నారి ఆడితే

నెమలమ్మ నాట్యమగును

నట్టింట నడిచితే

శుభములే వెల్లువగును


బుజ్జాయి నవ్వితే

పువ్వులై వికసించును

వదన వనంలోన

కాంతులై విరజిమ్మును


పాపాయి ఇంటిలో

తారమ్మ మింటిలో

కనుపాప రీతిలో

కన్నోళ్ల కంటిలో















అమ్మ చురుకైన సూచనలు

---------------------------------------

దరహాసము బహు అందము

పంచుతుంది ఆరోగ్యము

సున్నితమైన హాస్యము

మదికెంతో ఆహ్లాదము


చదువుకుంటే సౌఖ్యము

పెరుగుతుంది విజ్ఞానము

తొలగుతుంది అజ్ఞానము

మారుతుంది జీవితము


సగము బలం సంతోషము

ఆయస్సుకు ఆధారము

అనవసరపు విషయాలు

మానుకుంటే ఉత్తమము


స్వేచ్ఛకు భంగము దాస్యము

హానికరము నైరాశ్యము

అహం అణచుకో! కొంచెము

అది పతనానికి మూలము














దైవాన్ని తలచిన మేలు

---------------------------------------

మనసులో తలచిన

భక్తితో కొలిచిన

ఆలకించు దైవము

ప్రేమతో పిలిచిన


నామాన్ని జపించిన

ఎలుగెత్తి పాడిన

దీవించు దేవుడు

బాగుపడును జీవుడు


ఆసక్తి చూపిన

అనురక్తి చాటిన

ప్రసన్నుడు దేవుడు

మది పూలవనమున


చేతులెత్తి మ్రొక్కిన

జిహ్వతో స్తుతించిన

ఎన్నెన్నో మేలులు

దైవాన్ని వేడిన


-గద్వాల సోమన్న


11 views0 comments

Comments


bottom of page