top of page
Writer's pictureLakshmi Sarma B

చిగురులు తొడిగిన జీవితం


'Chigurulu Todigina Jeevitham' written by Lakshmi Sarma B.

రచన : B. లక్ష్మీ శర్మ

'ఏమండీ ఏమండోయ్' అని రెండుసార్లు పిలిస్తేగాని వెనుతిరిగింది భారతి .

'ఎవరు మీరూ... నన్నెందుకు పిలిచారు? మిమ్మల్ని ఎప్పుడు చూసిన గుర్తు కూడా లేదు' అంది.

"భలేవారండి మీరు , మనిషిని పోలిన మనుషులుంటారంటారు కదా! మిమ్మల్ని చూస్తే మా స్నేహితురాలు గుర్తుకు వచ్చింది . అన్నట్టు మీకు పోచంపల్లిలో ఎవరైనా చుట్టాలున్నారా, అహా ఏం లేదు వూరకే అడిగాను. వుంటే చెప్పండి లేదంటే నా దారిన నేను పోతాను" అన్నాడు. ఆమె కచ్చితంగా తన చిన్నప్పటి స్నేహితురాలని మనసు పదే పదే చెబుతుంది.

కొంచెం అనుమానంగా చూసింది అతనివైపు , ఏవరైనా గుర్తుకువస్తారేమోనని. ఊహు... ఎవరో గుర్తుకు రావడం లేదు .పోచంపల్లిలో చుట్టాలుండడమేమిటి నేను పుట్టి పెరిగింది అక్కడే కదా! 'ఇవన్నీ అడుగుతున్నారంటే ఇంతకూ మీరేవరో చెప్పలేదు" అంది

"భారతి . నాకు తెలుసండి మీరు భారతిగారని, మీమ్మల్ని గుర్తుపట్టాను అందుకే అడుగుతున్నాను. మీ ఆడవాళ్ళు అందరిని మరిచిపోతారు. మేమేందుకు గుర్తుకుంటాము" నిష్టూరంగా అన్నాడు.

" అయ్యోరామ అదేంటండి. మీరేవరో చెప్పండి. గుర్తుకు వస్తుంది . పోనీ మీ పేరైన చెప్పండి గుర్తుకు వస్తుంది" అంది నొచ్చుకుంటూ .

"సరే మీరెలాగు పోచంపల్లిలో చదువుకున్నారు కదా ! నేను మీకొక చిన్న క్లూ ఇస్తాను గుర్తుకొస్తుందేమో చూడండి" అంటూ చూసాడు భారతి వైపు .

చిరాగ్గ ముఖం పెట్టి ," మీరేవరో తెలియదు మీరు క్లూ ఇవ్వడము నేను చెప్పడం

బావుంది. చెప్పండి" అంది నవ్వుతూ . తళ్ళుక్కున మెరిసిన పలువరుస బుగ్గన

సొట్టలు , అదే ముఖం చిన్నప్పటినుండి చూస్తున్నా వయసు పెరిగిందేమో కానీ

మనిషి మాత్రం అచ్చంగా అలానే వుంది అనుకున్నాడు మనసులో.

" అదిగో చూసారా అదే నవ్వు, ఆ నవ్వుకే పడిపోయేవాళ్ళు మగవాళ్ళందరు.

ఆ మాటంటుంటే చివ్వున తలెత్తి చూసింది అతనివైపు. ఇతను ఎవరసలు నా

గురించి ఇన్ని విషయాలు చెబుతున్నాడు. నా మట్టి బుర్రకు ఎందుకు తట్టడం

లేదు. సరే కానీ ఏదో క్లూ ఇస్తానంటున్నాడు కదా ఇవ్వనీ చూద్దాము అనుకుంది

మనసులో.

" ఏమిటండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. నేను ఇంకా క్లూ

ఇవ్వనే లేదు ఇవ్వమంటారా చెప్పండి" అడిగాడు . ఇవ్వండి అన్నట్టుగా

కనుబొమ్మలు ఎగురవేసింది .

"అయితే వినండి. ఒరేయ్ సుధీర్ ఈ ఆడవాళ్ళందరు రేపు పెళ్ళిళ్ళు చేసుకున్నాక మనం గుర్తుంటామా వీళ్ళకు. అడిగాడు రమేశ్ తన తోటి స్నేహితుడిని . వీళ్ళు చదువు అయిపోయాక పెళ్ళి చేసుకుని అత్తారింటికి వెళ్ళాక, మనం కనిపించినా చూసిచూడనట్టే వెళ్ళిపోతారు. ఇక్కడున్నన్నీ రోజులు మనతో కలిసి వుంటారు. తరువాత రాముడెవరో రాకాసి ఎవరో అన్నట్టుగా వుంటారు" అంటూ వుడికించాడు సుధీర్.

"అదేం కాదు మీరే మీ భార్యలొచ్చాక మమ్మల్ని కనీసం కూడా గుర్తుపెట్టుకోరు అంది భాను. మేమెప్పుడైనా ఇలాగే వుంటాము మీరే మారిపోతారు. వుద్యోగాలు వచ్చాక మీకసలు ఎవరం గుర్తుకుండము. నేనైతే నా చిననాటి స్నేహితులు ఎప్పుడు కనిపించినా మాట్లాడకుండా వుండను' అంది గలగలా నవ్వుతూ భారతి .

"చూద్దాం కదా ఎవరు ఎవరిని పలకరిస్తారో , ఎవరిని ఎవరు కలుస్తారో" అన్నాడు సారథి. చెప్పడం ఆపి భారతి ముఖంలోకి చూసాడు. ఆనందం చిందులువేస్తుంది

భారతి ముఖంలో.

" ఏయ్ సారథి అంటూ కేక వేసింది చిన్నపిల్లలా. ఎన్ని ఏళ్ళైపోయింది మనం కలిసి అంటూ సారథి చేతులుపట్టుకుంది .

" భారతి నువ్వు ఏం మారలేదు అలాగే వున్నావు . అందుకే నిన్ను చూడగానే గుర్తుపట్టాను". "సారథి నువ్వు ఇక్కడున్నావేమిటి, నేను చాలా సార్లు ఈ గుడికి వస్తాను కానీ, నువ్వేప్పుడు నాకు కనిపించలేదు. నువ్వు చాలా మారిపోయావు సుమా ! ' గలగలా నవ్వుతూ, "అరెకరం జుట్టుపోయింది . పెద్ద బాన పొట్టవేసుకుని అరవై సంవత్సరాల వయసు వచ్చినవాడిలాగా వున్నావు. నిన్నెలా గుర్తుపడతాననుకున్నావు' అంది .

"ఏయ్ నన్ను అప్పుడే ముసలాణ్ణీ చేస్తున్నావా వుండు నీ పని చెబుతా" అంటూ ఆమెను పట్టుకోబోయాడు సారథి. చటుక్కున దూరం జరిగింది భారతి.

"భారతి నేను ఈ మధ్యనే హెడ్మాస్టారుగా బదిలీ అయింది ఈ వూరికి . గుడికి దగ్గరలోనే ఇల్లు దొరికింది. కుటుంబంతో సహ వచ్చేసాను. నిన్ను రెండుసార్లు చూసాను. మీ వారితో వచ్చినట్టున్నావు. నిన్ను చూడగానే అనుకున్నాను భారతిలాగే వుంది అని .కానీ పలకరించాలంటే , అవునో కాదోనని సందేహం పైగా పక్కన. మీ వారు. ఆ ఇప్పుడు చెప్పు ఎలావున్నావు, ఎక్కడుంటున్నావు పిల్లలెంతమంది చెప్పు" అడిగాడు సారథి . అప్పటివరకు

నవ్వు ముఖంతో వున్న భారతి చిన్నబోయింది.

'ఏం చెప్పమంటావు సారథి ' అనుకుంది మనసులో. "బాగానే వున్నాను ప్రస్తుతానికి పిల్లలు లేరు " అంది నిరాశగా.

"ఏమైంది భారతి నీ ముఖంలో ఏదో బాధ కనపడుతుంది. మీ వారు నువ్వు బాగానే వుంటున్నారా , చలాకిగా వుండే నీ ముఖంలో ఏదో తేడా కనిపిస్తుంది. నాకు చెప్పవా ఆత్మీయుడిగా అడుగుతున్నాను" అన్నాడు సారథి ఆప్యాయంగా . ఆ ఆప్యాయతకు కళ్ళళ్ళో నిలిచాయి భారతికి .

" చెపుతాను సారథి.ఇంత వరకు నన్నింత ప్రేమగా పలకరించిన వాళ్ళే లేరు .మన ఫ్రెండ్స్ అందరు బాగున్నారా, మీరందరు కలుస్తుంటారా ఎప్పుడైనా, నన్ను మీలో ఎవరైనా గుర్తుచేసుకుంటారా ?" మనసులో ఏదో గుర్తుకు రాగా అడిగింది.

"భారతి నువ్వు ఎవరి గురించి అడుగుతున్నావో నాకు తెలుసు" అని నవ్వుతూ , మేమందరం కలుస్తూనే వుంటాము. కానీ మీ ఆడవాళ్ళు మాత్రం ఇప్పటివరకు కలవలేదు నాభార్య తప్పా. మేమంతా కలిసినప్పుడల్లా మన ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటునే వుంటాము అన్నాడు. "అదేమిటి 'నీ భార్య తప్పా' అన్నావు ?తనెందుకు కలుస్తుంది ?'అడిగింది అర్ధం కాక.

"నా భార్య ఎవరనుకున్నావు? నీ స్నేహితురాలు భాను . తను నేను పెళ్ళి చేసుకున్నాము. వాళ్ళ వాళ్ళకు మాకు ఏవో చుట్టరికాలు వున్నాయట. అందుకే ఈ సంబంధం కాయం చేసారు. నాకు తను , తనకు నేను తెలుసు కాబట్టి సరే అనుకున్నాము . అలా సాఫిగా సాగిపోతుంది మా జీవితం . మాకు ఇద్దరు పిల్లలు" అంటూ చెప్పుకొచ్చాడు సారథి . చేతి కున్న వాచీ వంక చూసుకుని "అమ్మో చాలా టయం అయింది మళ్ళి కలుద్దాము" అంటూ లేచి నిలుచున్నాడు సారథి .

" ఏంటి భానుకి భయపడతున్నావా?" అంటూ గలగలనవ్వింది .

"నీకు తెలుసుగా తను ఎంత మొండిఘటమొ.తనేం మారలేదు భారతి " అన్నాడు సారథి. "నిజానికి నాకు చాలా ఆనందంగా వుంది. నువ్వు భానుని పెళ్ళి చేసుకోవడం, మళ్ళి మనం కలుసుకోవడం . రేపు నువ్వు వచ్చేటప్పుడు భానుని తీసుకవస్తావా" అంది .

" సరే " అంటూ వడివడిగా వెళ్ళిపోయాడు సారథి. గాఢమైన నిట్టూర్పు విడిచింది .తన సంతోషాన్ని ఎవరోలాక్కపోయినట్టుగా. వుసూరంటూ ఇంటికి వచ్చింది. రాత్రంతా ఆలోచనలతోటే గడిచిపోయింది. ఇన్నీ విషయాలు చెబుతున్నాడు గానీ, వేణు గురించి చెప్పడేం సారథి ఒక్కమాట కూడా అనుకుంది మనసులో .

సాయంకాలం ఎప్పుడెప్పుడు అవుతుందాని ఎదిరి చూసి, వడివడిగా తయారై తనే ముందు వచ్చింది భారతి. చాలా సేపు ఎదురుచూసింది సారథి కోసం. కానీ సారథి జాడే లేదు. చూసి చూసి విసుగు వచ్చి, ఇంటికి వెళ్ళిపోయింది నిరాశతో. వారం రోజులైనా సారథి జాడ తెలియలేదు. అసలు ఏమైందో ఎందుకు రావడం లేదు. భాను రానివ్వడం లేదా , లేక నన్ను కలవడం ఇష్టం లేదా, పిచ్చిదాన్ని నేను సారథి ఇంటి అడ్రస్ తెలుసుకుని వుంటే సరిపోయింది. అని మనసులో పరిపరి విధాలుగా ఆలోచిస్తూ కలత నిద్రలోకి జారిపోయింది. "ఏయ్ సారథి, ఏంటి అలా అయిపోయావు. వంట్లో బాగాలేదా ముఖమంతా అలా పీక్కపోయిందేమిటి? నీ కోసం రోజు వచ్చి చూసి చూసి వెళ్ళిపోతున్నాను. నా మీద ఏమైనా కోపం వచ్చిందేమో అనుకున్నా" అంది ఆదుర్దగా.

"ఛ ఛ నీ మీద కోపమేంటి భారతీ, ఆ రోజు నీ దగ్గరనుండి వెళ్ళినప్పటి నుండి జ్వరం పట్టుకుంది. బయటకు రాలేని పరిస్తితి. నన్ను ఒంటరిగా వదిలి భాను రాలేకపోయింది. నన్ను క్షమించు భారతీ, నిన్ను వేదనకు గురి చేసాను "అన్నాడు బాధతో.

' అదేమిటి సారథి, నువ్వు అంత జ్వరంలో వుండి రాలేకపోయావు. దానికి క్షమాపణలు ఎందుకు. సారథి ఒక్కడివే వచ్చావా , నీరసంగా వున్నావు కదా తోడుగా భానును తీసుకరావలసింది. అయినా రెస్ట్ తీసుకోకుండా ఎందుకు వచ్చావు సారథి" అంది ఆత్మీయంగా. భాను కూడా వచ్చింది. లోపల ప్రదక్షిణాలు చేస్తుంది నాకు ఓపికలేదని ఇక్కడ కూర్చున్నాను. నువ్వు వచ్చి వెళ్ళిపోయావేమో, లేక నా మీద కోపం వచ్చీ రావేమో అనుకున్నా, అయ్యో, మీ ఇంటి అడ్రస్ కూడా తెలిదే అని బాధపడుతున్నాను అన్నాడు సారథి.

' నిన్నేప్పుడు కలుస్తానా అని కళ్ళళ్ళో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నాను. అదేమిటో నిన్ను కలిసినప్పటి నుండి నాలో ఏదో తెలియని అనుభూతి మొదలైంది. మన చిన్నప్పటి విషయాలు జ్ఞాపకానికి వచ్చి నన్ను నేను మరిచిపోతున్నాను. ఏమిటో తెలియని ఆనందం మన ఫ్రెండ్స్ నందరిని కలుస్తున్నానని' అంది భారతి.

' ఏయ్ భారతీ వచ్చావా, ఎలా వున్నావు " అంటూ వెనుకగా వచ్చి గట్టిగా కౌగిలించుకుంది భాను భారతిని .

"భాను " అంటూ మరింత దగ్గరగా అలుముకుంది భారతి భానుని.

' ఎలా వున్నావు భారతి , ఎన్ని సంవత్సరాలు అయిందో మనం కలిసి నువ్వేం మారలేదు .

నేను చూడు ఎలా తయారయ్యానో బెలూన్ లాగా అంది నవ్వుతూ.

ఎందుకవ్వవ్వూ చక్కటి భర్త , అందమైనా పిల్లలు అన్నీ సక్రమంగా వున్నాక, అదేదో పాట వుంది చూడు , ఆడది కోరుకుకునే వరాలు రెండే రెండు , చల్లని సంసారం చక్కటి సంతానం. ఇవి రెండు వున్నాక, నీ లానే వుంటారు " అంది.

'తనేం పొందలేకపోతుందో తన మనసుకు తెలుసు' అనుకుంది మనసులో.

"నీకేం తక్కువయింది సన్నగా జాజి తీగలాగా వంపు సొంపులతోటి పదహారణాల పడుచు లాగా వున్నావు. చేతినిండా డబ్బు తిరగడానికి చేతిలో కారు.అవునులే నువ్వు హాయిగానే వుంటావు. నీ కోసం అలమటించే వాళ్ళు పిచ్చి వాళ్ళై తిరుగుతున్నారు" అంది భాను ఏదో గుర్తుకు రాగా.

' ఏయ్ భాను ఏమిటా మాటలు నోటికి ఏది వస్తే అది అనేయ్యడమేనా" కసిరాడు సారథి. అతనికి అర్ధమౌతుంది భారతి పరిస్తితి ఆమె మాటలనుబట్టి . కానీ భానుకు ఇవేమి అర్దం కావు నోటికి ఏది వస్తే అది అనేస్తుంది. భారతి కళ్ళు కన్నీటి చలమలయ్యాయి.

"ఇప్పుడు భాను ఏమన్నదని దాన్ని అలా కసురుకుంటున్నావు వున్నమాటే అంది కదా సారథి " అంది భారతి.

"అదికాదు భారతీ " అంటూ ఏదో చెప్పబోయాడు సారథి.

' నువ్వాగు సారథి", అని "భాను నువ్వంటున్నది ఎవరిగురించో నాకు తెలుసు . కానీ

ఒకమాట చెపుతావా ? వేణు వేణు పెళ్ళి చేసుకోలేదా ! అంటే తను ఇంకా నా

కోసం అలానే వున్నాడా, నువ్వు అన్నది వేణు గురించేనా , ఫ్లీజ్ నాకు నిజం

చెప్పవా ?" అడిగింది భాను రెండుచేతులు పట్టుకుని అర్ధిస్తున్నట్టుగా.

"భారతీ నీకు ఏ విషయాలు తెలియవా, నువ్వు కావాలనే వేణును వద్దన్నావనుకున్నాను. నీ చుట్టూ తిరిగినందుకు తగిన శాస్తి అయిందనుకున్నాము. కానీ వేణు నిజంగానే పిచ్చివాడిలా తయారయ్యాడు తెలుసా, నీ కోసమని పెళ్ళి చేసుకోకుండా ఎన్ని సంవత్సరాలైనా ఎదురుచూస్తానన్నాడు. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మ కోసమైనా నీ కోసం వేచి చూస్తాడట. తెలుసా, నీ కోసం ఎవరినో పంపిస్తే నాకు ఎవరు తెలియదు, నా కోసం ఎవరు రావొద్దు అన్నావట. ఇవన్నీ నీకు తెలియవా , నీకు తెలిసే నువ్వు వేణుని ఇష్టపడి తిరిగావు. అవునా కాదా "అడిగింది భాను.

వెక్కి వెక్కి ఏడుస్తున్న భారతిని ఆపడం సారథికి భానుకు సాధ్యం కాలేదు. పోనిలే తన తనివి తీరా ఏడిచాక అప్పుడు చూద్దాంలే అనుకున్నారు ఇద్దరు. ఎర్రబారిన కళ్ళతో , పూడుకపోయిన గొంతుతో అడిగింది భారతి. భాను 'ఇవన్నీ నాకు తెలిసి నేను వేణుకు దూరమయ్యాననుకున్నావా , నేను ఇప్పటికి ఎప్పటికి వేణుదానినే. నన్ను నమ్మండి నేను వేణుకోసం మాత్రమే బ్రతుకుతున్నదానిని "అంది.

ఆశ్చర్యంతో నోరువెళ్ళబెట్టారు సారథి భాను. వెంటనే పకాల్మని నవ్వింది భాను .

'బావుంది .చాలా బావుంది భారతి నువ్వు చెప్పింది. పెళ్ళిచేసుకుని దర్జాగా కాపురం చేసుకుంటూ, వేణుకోసం అని చెప్పడం. ఇది ఏమైనా సినిమా అనుకున్నావా, అయినా ఇన్నాళ్ళుగా లేనిది , ఇవాళ వేణు మీద ప్రేమ పుట్టుకొచ్చింది అంటే, మేమేమైనా అంటామనా? చూడు భారతి మేము అప్పుడే అనుకున్నాము నిన్ను చూసి. అందమైన దానివి అన్న గర్వం వుందని, నువ్వు వేణుని నీ చుట్టూ తిప్పుకుంటున్నావు, ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోతావు అని' అంది భాను.

" ఫ్లీజ్ భాను అంతంత మాటలని నా మనసును రంపపుకోత కొయ్యకు. ఇప్పటికే సగం చచ్చినదానను ఇంకా నన్ను వేదనకు గురి చెయ్యకు. అసలు వేణుకు ఏమైంది? బాగానే వున్నాడు కదా ! నేను తెలిసి తెలియని వయసులో వేణును ఇష్టపడిన మాట మాత్రం నిజం. అంతే కాదు, ఇప్పటికి వేణు అంటే నాకు పంచప్రాణాలు తెలుసా భాను" అంది.

"అదేంటి నువ్వు వేణును ఎప్పుడో మర్చిపోయావు అనుకున్నాము. పెళ్ళిచేసుకుని హాయిగా వుంటున్నావు కదా! అంది భాను. అవును భాను పెళ్ళి చేసుకున్నాను . ఆయనకు సంఘంలో గౌరవం వుండడానికి నన్ను పెళ్ళి పెళ్ళిచేసుకున్నారు. ఆయనకు భార్య అవసరముండి కాదు. డబ్బుకు ఆశపడి మా నాన్న నన్ను ఆయనకిచ్చి పెళ్ళి చేసారు. ఆయన ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్యాపిల్లలు వేరే వున్నారు"

మధ్యలోనే అడ్డు వస్తూ అడిగింది భాను. "ఆదేంటి అలా చెప్పకుండా పెళ్ళి చేసుకోవడం మోసం కదా ! అయినా మీ నాన్న ఇవేవి తెలుసుకోకుండా ఎలా పెళ్ళి చేసారు." అడిగింది ఆశ్చర్యంగా భాను.

"అది నా కర్మ . ఏం చేస్తాం , మాది మద్యతరగతి కుటుంబం . కట్నకానుకలు భారీగా ఇచ్చే స్థోమత వున్నవాళ్ళం కాదు కదా! వాళ్ళకు కానీ కట్నం అక్కరలేదు అన్నారట. అంతే మా నాన్న తెగమురిసిపోయి నన్ను ఆయనకిచ్చి కట్టబెట్టి చేతులు దులుపుకున్నారు. నాకు మాత్రం వేణు మీదనే మనుసుంది. నాన్నను చాలా సార్లు అడిగాను పోచంపల్లికి ఒక్కసారి వెళ్ళివద్దామని, అప్పుడైనా నా మనసులో మాట వేణుకు చెప్పాలని అనుకున్నా కానీ , మా నాన్న ఒప్పుకోలేదు."

"భారతీ, మరి నీకెప్పుడు తెలిసింది మీ వారికి పెళ్ళైందని. ఆదుర్దా ఆపుకోలేక అడిగింది భాను. ఆ విషయం మా పెళ్ళైన మొదటి రాత్రి చెప్పాడు మనోజ్."

" ఏమని? నాకు ఇదివరకే పెళ్ళైందనా "అడిగాడు సారథి.

"అందరి ఆడపిల్లలలాగే నేను శోభనపు గదిలో అడుగుపెట్టాను. గదిలో అడుగుపెట్టానో లేదో, గదంతా సిగరెట్ల వాసనతో నిండిపోయింది. ఊపిరాడక దగ్గు తెరలుతెరలుగా వచ్చింది. అతను లేచి వచ్చాడు నా దగ్గరకు. నన్ను పొదివి పట్టుకుని మంచం దగ్గరకు తీసుకవెళ్ళి మంచినీళ్ళు ఇచ్చాడు. నాకు సిగ్గుముంచుకొచ్చింది. చేతులలో ముఖం దాచుకున్నాను. భారతి సిగ్గుపడుతున్నావా అంటూ నా ముఖాన్ని పైకెత్తి తనకు దగ్గరగా చేర్చుకున్నాడు. కౌగిలిలో బందించాడు.

'భారతీ, నీకు నాగురించి ఏమి చెప్పకుండానే పెళ్ళి చేసేసారు. నేను నీకు చెబుదామన్నా, మీ నాన్న, మానాన్న నన్ను ఏ విషయము చెప్పనివ్వలేదు "అంటూ ఆగాడతను.

చెప్పండి అన్నట్టుగా కళ్ళు పైకెత్తింది భారతి. నాకు ఇదివరకే పెళ్ళైంది. నేను ప్రేమించిన అమ్మాయినే చేసుకున్నాను. కానీ తనది కులం తక్కువని మా నాన్న వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అందుకని చస్తామని బెదిరించి నీ మెడలో మూడుముళ్ళు వేయించారు. నేను ఆమెతో వున్నా పరవాలేదట నిన్ను కూడా చూసుకోవాలని పట్టుపట్టి పెళ్ళి చేసారు. ఇందులో నా తప్పు ఏమిలేదు భారతి' అంటూ చెప్పాడు.

"పదునైన కత్తి గుండెల్లో దించినట్టుగా. ఒక్క క్షణం భూమి కంపించినట్టుగా తల గిర్రునతిరిగింది భారతికి. పిచ్చిదానిలాగా చూసింది భర్త వైపు. భారతీ నీకు అన్యాయం చెయ్యను. నీకే లోటురాకుండా చూసుకునే బాధ్యత నాది. సంఘంలో నీకే నా భార్యస్థానం. ఆస్తికి కొదవలేదు నీకు ఏం కావాలన్నా అది క్షణాల్లో నీ ముందుంటుంది. కార్లు, నౌకర్లు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నీ ఇష్టం, బంగారం పట్టుచీరలు అన్నీ నీ స్వంతమే. కానీ ! నువ్వు మాత్రం నా భార్య స్థానాన్ని వదిలివెళ్ళకు. మా అమ్మ నాన్న తట్టుకోలేరు' అంటూ చెప్పడం ముగించాడు. భారతి కళ్ళు చింత నిప్పుల్లా అయ్యాయి." చాలా బావుంది మీరు చెప్పింది. ఇదేమైనా సినిమా అనుకున్నారా నా జీవితంతో ఆడుకోవడానికి. మీకు సంఘంలో గౌరవం కోసం నా జీవితాన్ని పణంగా వాడుకున్నారా, మీకు డబ్బుంది కదా ఏదైనా చెల్లుతుంది అనుకున్నారు. చూడండి బలవంతంగా “గుర్రాన్ని నీటి దగ్గరకు తీసుకవెళ్ళగలరేమో కానీ నీళ్ళు తాగించలేరు “ అన్న సామెత మీకు తెలియదేమో. మీరు నన్ను మోసం పెళ్ళి చేసుకున్నందుకు, నేను మీ భార్యగా వుండలేను. మీ మోసాన్నీ పదిమందికి చెప్పి మీ పరువు బజారుకీడుస్తాను"అంటూ బోరుబోరున ఏడుస్తూ బయటకు రాబోయింది భారతి.

భారతి చెయ్యి దొరకబుచ్చుకుని రెండు చేతులు జోడించి, భారతీ నీకు శతకోటి దండాలుపెడతాను. నువ్వు మా ఇల్లు విడిచివెళ్ళకు. నా వల్ల మోసం జరిగినమాట నిజమే కానీ, నా కోసం కాకపోయినా మా అమ్మా నాన్నల కోసమైనా కొంత కాలం వుండి , పరిస్తితులు కుదుటపడ్డాక ,తరువాత నీ దారి నువ్వు చూసుకుందువుగానీ. అప్పటి వరకు నువ్వు నువ్వునువ్వుగానే వుండు .నీ మీద నాకే హక్కులేదు.అంటూ బ్రతిమాలాడు. భారతికి కొంచెం కనికరమనిపించింది అతని మాటలలోని నిజాయితీకి. సరే మీరన్నట్టుగా మీ అమ్మా నాన్నల కోసం వుంటాను. అందరికోసం మాత్రమే భార్య భర్తలుగా వుండాలి. అదీ హద్దులవరకే,అలుసిచ్చానని చనువు తీసుకున్నారో , నా తనువే చాలించాల్సి వస్తుంది. అంతే కాదు అన్నీ తెలిసి మా నాన్న నా గొంతుకోసారు కాబట్టి, నాకు ఆ ఇంటికి ఋణం తీరిపోయింది. అంటూ దిండు చాప తీసుకుని క్రింద వేసుకుంది పడుకోవడానికి అని. భారతీ క్రింద పడుకుంటావా, లేదు లేదు నువ్వు ఈ ఇంటి వచ్చాక కష్టపడకూడదు. ఇక్కడున్నన్నీ రోజులు నీకెలాంటి ఇబ్బంది కలిగినా నేను సహించేది లేదు". అంటూ తను పక్కనే వున్న సోఫాలో పడుకోవడానికి వెళ్ళాడు.

"ఏమండి , అన్నీ వుండి కూడా అర్హత లేని మనిషినండి నేను. ఎన్నిఆభరణాలున్నా , కట్టుకోవడానికి పెట్టెడు పట్టుచీరలున్నా, తనను కట్టుకున్న భర్త మరో స్త్రీకి హృదయంలో చోటుందంటే, అంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటివుండదు. అవన్నీ వున్నా అస్త్రసన్యాసం పుచ్చుకున్నా ఒకటే నా దృష్టిలో. మీ పరువుప్రతిష్టలకోసం కట్టెకు కట్టినట్టుగా వుపయోగించుకుంటాను". అంది కళ్ళళ్ళో కన్నీళ్ళు నీళ్ళు జలపాతంలా వుబికిరాగా.

'భారతీ నన్ను క్షమించు. నీ మనసు అర్ధం చేసుకోలేకపోయాను. మధ్య తరగతి కుటుంబంలో నుండి వచ్చావు కదా ! ఇక్కడ సకల సంపదలతో మురిసిపోతావు. నన్ను పెద్దగా పట్టించుకోవేమోనని, నా ఇష్టంగా నేను తిరిగినా నడిచిపోతుంది అనుకున్నాను. కానీ నువ్వన్నట్టుగా భర్త వేరేవాళ్ళ సొత్తు అని తెలిస్తే ఇంత బాధగా వుంటుందని ఇప్పుడేతెలుసుకున్నాను. కానీ ! ఇప్పుడు ఏం చెయ్యలేని పరిస్తితి. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను భారతీ.

ఏమిటి అన్నట్టుగా కళ్ళేత్తి చూసింది భారతి.

"ఏమి లేదు భారతి, నీకు నచ్చిన వ్యక్తి వుంటే కనుక అతని కాళ్ళుపట్టుకుని అయినా నిన్ను అతనికిచ్చి పెళ్ళి చేస్తాను. లేదంటే నేనే మంచి సంబంధం చూసి నీకు పెళ్ళి చేసి అత్తవారింటికి పంపుతాను ఒక ఆత్మీయుడిగా. కానీ అంతవరకు మన విషయం ఎవ్వరికి తెలియనివ్వొద్దు. అంటూ మాటిచ్చాడు మనోజ్. అయోమయపరిస్తితిలో పడిపోయింది భారతి. పెళ్ళైన ఆడదాన్నీ నన్ను ఎవరు చేసుకుంటారు. ఇదంతా జరగనిపని అని మనసులో అనుకుని బాధపడసాగింది. రోజులు గడిచిపోతున్నాయి కాలక్రమేనా అన్నీ మరిచిపోయారు పెద్దవాళ్ళు. మనోజ్ కు భార్య పిల్లలు వాళ్ళతోనే సరిపోయేది. ఒక స్నేహితురాలుగా చూసుకున్నాడు తప్పా భారతిని ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. చాలా సార్లు అడిగాడు ఇష్టమైన వ్యక్తి వున్నారా అని , వున్నా అతనికి ఎప్పుడో పెళ్ళైపోయిందని చెప్పింది భారతి. జరిగిన విషయమంతా చెప్పి, ఇప్పుడు చెప్పండి నేను అదృష్టవంతురాలనా? సకలభోగాలు వుండి కూడా జీవచ్చవంలా బ్రతుకుతున్న నేను, మోసం చేసాననే అనుకుంటున్నారా, కనీసం వేణు నాకోసం ఒక్కసారైనా వస్తాడని ఎన్నీ మార్లు ఎదిరిచూసానో, తను నన్ను మరిచిపోయి పెళ్ళి చేసుకుని హాయిగా వున్నాడనుకుని తృప్తి పడ్డాను. సారథి కనిపించగానే నా ఆలోచనలన్నీ వేణు గురించే , అడిగితే ఏమనుకుంటాడోనని, తనే చెబుతాడని పిచ్చిగా ఎదురుచూస్తున్నాను రోజు. అంటూ చెప్పు భాను వేణు ఎలా వున్నాడు? నేను వేణును చూడాలి ఎక్కడున్నాడు" అంటూ భావోద్వేగంతో అడిగింది భారతి.

'భారతీ మమ్మల్ని క్షమించు నిన్ను అపార్థం చేసుకున్నందుకు. వేణు రెండుసార్లు నీ కోసం మీ వూరికి వచ్చాడట, మీ నాన్న మొదటిసారి వచ్చినప్పుడు తిట్టి వెళ్ళాగొట్టాడట. మళ్ళీ వస్తే పోలిసులకు పట్టిస్తా అని బెదిరించాడట. అయినా రెండవసారి వచ్చినప్పుడు నీకు పెళ్ళైందని చెప్పాడట, నమ్మకం కుదరక వూళ్ళో వాళ్ళను కనుక్కుంటే నిజమేనని చెప్పారట. ఇక అప్పటి నుండి పిచ్చివాడిలాగా అయిపోయాడు. మంచి వుద్యోగం వదులుకున్నాడు.తల్లి తండ్రులు ఇంత అన్నం పెడితే తిని తిరుగుతున్నాడు. ఎప్పుడు చూసినా నీ ధ్యాసనే తప్ప ఇంకో లోకం లేదు' చెప్పింది భాను.

"వేణు వేణు" అంటూ తలకొట్టుకుంది." నేను వేణుని చూడాలి నన్ను వేణు దగ్గరకు

తీసుకవెళ్ళండి ఫ్లీజ్" అంటూ సారథి రెండు చేతులుపట్టుకుని బ్రతిమాలింది.

"భారతీ వూర్కో , నిన్ను తప్పకుండా వేణు దగ్గరకు తీసుకవెళతాను. అంతే కాదు

ఇన్నాళ్ళుగా మీరు పోగొట్టుకున్న మీ ప్రేమను మీకు దక్కేలా చేస్తాను" అంటూ

వూరడించాడు సారథి.

"భారతీ, ఈ ఆదివారం మన ఫ్రెండ్ ప్రసాద్ వాళ్ళమ్మాయి పెళ్ళికి మేము

వెళుతున్నాము.నువ్వు మాతో వచ్చావంటే వేణును కలవొచ్చు. వేణు నువ్వు

మాట్లాడుకున్నారంటే, మీ ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత మాది." అని చెబుతూ,

"ఏమంటావు భాను" అడిగాడు భార్య వైపు చూస్తూ.

" ఏమంటాను తక్షణ కర్తవ్యంగా వీళ్ళ పెళ్ళి చేసి , పిల్లపాపలతో కళకళలాడుతూ వుండమంటాను" అంది నవ్వుతూ.

భారతి మనసంతా ఆనందంతో నిండపోయింది. ఎప్పుడెప్పుడు వేణును చూస్తానా అని మనసు నిలవనీయడం లేదు. మనోజ్ కు చెప్పింది వేణు విషయం విని చాలా సంతోషించాడు. దగ్గర వుండి ఇద్దరికి ఘనంగా పెళ్ళి జరిపిస్తానన్నాడు .

మోడువారిందనుకున్న తన జీవితం, తిరిగి చిగురిస్తుంది అనుకుంటుంటే ఎంతో సంతోషంగా వుంది భారతికి. అనుకున్నట్టుగానే ఆదివారం రోజు భారతి మనోజ్ ఒక కార్లో , భాను సారథి పిల్లలు ఒక కార్లో వెళ్ళారు. ముందుగానే ఫ్రెండ్ కు ఫోన్ చేసి, వేణును ఎలాగైనా పెళ్ళికి తీసుకరమ్మని చెప్పాడు సారథి. భారతి వస్తున్నట్టు చెప్పలేదు రహస్యంగా వుంచాడు. చిన్ననాటి మిత్రులందరిని కలవబోతున్నామన్న ఆనందం ఒకవైపు, తన హృదయ కవాటంలో పదిలపరుచుకున్న తన ప్రాణమిత్రున్ని కలుస్తున్నానన్న ఆనందం ఒకవైపు నిలువనీయడం లేదు భారతి మనసు. బాజా భజంత్రీల చప్పుళ్ళతో, కమ్మని కమనీయ పాటలతో , పడుచు పిల్లల సయ్యాటలు , పట్టుచీరల రెపరెపలు , ప్రాపంచిక విషయాలలో మునిగితేలుతున్న మగరాయుళ్ళు, పురోహితుల మంత్రాలతో ఒక్కటైన ఆ జంట చూడ ముచ్చటగా వుంది.

చిన్నప్పుడు చూసిన స్నేహితులను గుర్తు పట్టలేకపోయారు భారతి స్నేహితులు. ముఖ్యంగా ఆడవాళ్ళు మగవాళ్ళు చెబితే తప్ప గుర్తుపట్టలేకపోయారు. భారతిని గుర్తు పట్టారు తను ఆనాడు ఎలా వుందో ఈనాడు అలానే వుంది. కాకపోతే వయసు వచ్చినదానిలాగా వుంది. అందరూ పలకరింపులు చేసుకున్నారు . ఒకరిమీద ఒకరు జోక్స్ వేసుకుంటున్నారు చిన్ననాటి ముచ్చటలు గుర్తుచేసుకుంటూ పగలబడి నవ్వుతున్నారు. కానీ భారతి కళ్ళు మాత్రం వేణుకోసం వెతుకుతూనే వున్నాయి. ఇంత మందిలో వేణు కనిపించడేం, అసలు వచ్చాడా లేదా, లేక నన్ను గుర్తు పట్టడం లేదా, లేక నేనే గుర్తుపట్టడం లేదా అని తపించిపోతుంది.

" ఏయ్ భారతి నువ్వెవరికోసం వెతుకుతున్నావో మాకు తెలుసులేమ్మా. నువ్వు మాతో మాట్లాడుతున్నా నీ కళ్ళు మాత్రం వేణుకోసం ఎదురుచూస్తూనే వున్నాయి. ఇంకా రాలేదా నీ ఇష్టసఖుడు' అంటూఆటపట్టించసాగింది భాను.

" అబ్బా నీకు తెలియదులే భాను ఎదురుచూపులో వున్న ఆనందం" అంటూ వచ్చాడు "సారథి. సారథి, నిజంగా వేణు వస్తానన్నాడా , వస్తే నాకు కనిపించడేం నా మీద కోపంగా వున్నాడా చెప్పు సారథి "అంటూ అడిగింది ఆత్రుతగా భారతి.

"చూడు భారతి మీ ప్రేమ గట్టిదైతే నీ వేణు నిన్ను వెదుక్కుంటూ వస్తాడు. మీ ప్రేమలో ఎలాంటి స్వార్థం లేకపోతే మీ ప్రేమే మిమ్మల్ని కలుపుతుంది. ఇక్కడే ఎక్కడైనా వున్నాడేమో అన్నాడు' సారథి.

ఒక్క వుదుటున కుర్చీలో నుండి లేచి గబ గబా పెళ్ళి మండపం పైనకు వెళ్ళి పురోహితుడి చేతిలోనుండి మైకు అందుకుంది భారతి. అందరూ దిగ్భ్రాంతిగా చూస్తున్నారు ఏం చెబుతుందోనని. అందరు నన్ను క్షమించాలి. ఒక్క ఐదు నిమిషాలు నాకు మాట్లాడడానికి టైం కావాలి అంది అందరి వైపు చూస్తూ. సరే అన్నట్టుగా తలూపారు అక్కడున్నవారు.

"వేణు నిన్ను ఇంతమందిలో ఎక్కడున్నావో నాకు తెలియడం లేదు. నిన్ను చూసి చాలా ఏళ్ళు అయింది నిన్ను గుర్తుపట్టలేకపోతున్నానేమో. నా మీద కోపంగా వున్నావా, నేను నీకెప్పుడు అన్యాయం చెయ్యలేదు. ఇన్నాళ్ళుగా నీ కోసమే ఎదురుచూస్తున్నాను. నువ్వు ఎప్పటికైన నా వేణుగా నా దగ్గరకు వస్తావని ఎదురుచూస్తునే కాలంగడిచిపోయింది. ఇంకా నాకు ఎదురుచూసే ఓపిక లేదు వేణు. నీకు నామీద ఏ మాత్రం ప్రేమ వున్నా , ఇంకా నీ మనసులో నాకు స్థానం వుంటే వచ్చి నా చెయ్యి అందుకో. లేదంటే ఇదే నా చివరి ఎదురుచూపుగా అనుకుంటాను. వచ్చే జన్మంటూ వుంటే, ఆ భగవంతుడిని నిన్నే నాభర్తగా ప్రసాదించమని వేడుకుంటాను' అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది భారతి.

పరుగు పరుగునా వచ్చారు సారథి భాను మనోజ్ మిగతా స్నేహితులు.అందరికన్నా ముందు వచ్చి భారతిని రెండు చేతులతో లేవదీసి , "భారతీ భారతీ ఇలా చూడు నీ కోసం నీ వేణు వచ్చాడు చూడు అంటూ భారతిని అటు ఇటు వూపుతూ లేపాడు. మెల్లగా కళ్ళు తెరిచి చూసింది భారతి. మాసిన గడ్డం మట్టికొట్టుకుపోయిన బట్టలతో ,చూడటానికి పిచ్చివాడిలా వున్న వేణు వైపు చూసింది నమ్మలేనట్టుగా .

"నేనే భారతీ నీ వేణును. గుర్తు పడుతులేవు కదూ! ఇన్నాళ్ళుగా నీ కోసం ఎదురు చూసి చూసి, పిచ్చివాడిలా తయారయ్యాను . ఇక ఈ జన్మకు ఇంతే అనుకున్నాను. కానీ ఏ దేవుడు నా మొరవిన్నాడో మళ్ళి నిన్ను నా చెంతకు చేర్చాడు. ఇక మనలను వ్వరు వేరు చెయ్యలేరు భారతి అంటూ అక్కున చేర్చుకున్నాడు . దొరకదనుకున్న పెన్నిధి దొరికినందుకు గట్టిగా హత్తుకుపోయింది భారతి.

గట్టిగా చప్పట్లు వినిపించడంతో పట్టువదిలి చూసారిద్దరు. సిగ్గుతో ముడుచుకుపోయింది భారతి. ఇక్కడింత మందిమి వున్నామన్నా ఆలోచనకూడా లేకుండా ఎంత సేపు వుండిపోతారు అంటూ గిలిగింతలు పెట్టారు చుట్టు మూగి స్నేహితులందరు. దూరంగా నిలబడి చూస్తున్నాడు మనోజ్. తన హృదయభారం తీరినందుకు, తన వల్ల మోడువారి పోయిందనుకున్న భారతి జీవితం తిరిగి చిగురిస్తుందన్న ఆనందంతో .

" ఏయ్ వేణు చూసావా, మీ ప్రేమ ఎంత గొప్పదో, నేను చెప్పానా నీ కోసం భారతి ఎంతగా తపించిపోతుందో, నేను తెలియక చేసిన పొరబాటుకు మీ ఇద్దరు శిక్ష అనుభవించారు. అందుకు పరిష్కారంగా నా ఆస్తిలో సగభాగం భారతికి ఇచ్చేస్తున్నాను. అని చెబుతూ సారథి ఇచ్చిన రెండుపూలమాలలు వారి చేతికి ఇచ్చాడు మనోజ్. భారతి, నీ ప్రేమ వేణుకు చూపించడం కోసం ఇంత సేపు నీ దగ్గరకు రాకుండా నేనే ఆపాను. కానీ నీ ఆవేదన, నిండైనా నీమనసులో దాగిన నీ ప్రేమకు వేణు ఆగలేకపోయాడు.

ఇంత చక్కటి ప్రేమికులను కలిపినందుకు మనసారా ఆ దేవుడికినమస్కరిస్తున్నాను అంటూ వాళ్ళ మీద పూల వర్షం కురిపించాడు మనోజ్మిగతా స్నేహితులు కూడా హర్షధ్వానాలతో ఇద్దరిని ఒకటి చేసారు. భారతి చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దుపెట్టుకున్నాడు వేణు. పులకించి పోయింది భారతి.

గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


రచయిత్రి పరిచయం : B.లక్ష్మి శర్మ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి, నాకు ఇద్దరమ్మాలు ఒక బాబు, అందరూ విదేశాల్లోనే వున్నారు,ప్రస్తుతం నేను మావారు కూడా అమెరికాలోనే వుంటున్నాము


146 views0 comments

Comments

Couldn’t Load Comments
It looks like there was a technical problem. Try reconnecting or refreshing the page.
bottom of page