top of page
Writer's pictureYasoda Pulugurtha

చిలక - గోరింక


'Chilaka - Gorinka' - New Telugu Story Written By Yasoda Pulugurtha 

Published In manatelugukathalu.com On 13/06/2024

'చిలక - గోరింక' తెలుగు కథ

రచన: యశోద పులుగుర్త 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


అప్పుడే సంధ్యాకాంతులు చుట్టూ అలుముకుంటున్నాయి..

హైద్రాబాద్ లో  తను పనిచేస్తున్న ఆఫీస్ కి వారంరోజులు శెలవు పెట్టేసి  వైజాగ్ వచ్చింది అమ్మా నాన్న దగ్గరకు  సింధుజ..  


ఏమిటో మనసంతా కకావికలంగా ఉంది..  తను బావకు అలా మెసేజ్ ఇచ్చి ఉండకూడదేమో ?  


మరి ఎలా ?  తన మనసులోని  బాధను అర్ధం చేసుకుంటాడనే కదా అజయ్ బావకి అలా మెసేజ్ చేసింది..  బావకు తన గురించి అంతా తెలుసనే కదా ? 


ఇంతకీ తను ఇచ్చిన మెసేజ్   " నవీన్ ప్రేమని పొందని  నేను  బ్రతకడం వేస్ట్ అనిపిస్తోంది  బావా, నేనిక్కడ ఉండలేకపోతున్నాను, చావాలనిపిస్తోంది,  అమ్మా నాన్నా దగ్గరకు వైజాగ్ వెడుతున్నా”నని ఇచ్చింది..


“అమ్మాయ్ సింధూ ఏం చేస్తున్నావే ?”  తల్లి  వసంత లక్ష్మి వచ్చింది అక్కడకు..


“వచ్చినప్పటినుండి చూస్తున్నాను..  ఏదో పోగొట్టుదానిలా అదేపనిగా ఆలోచిస్తూ,  ఎందుకు అలా ఉంటున్నావు ? ఇంకా ఎన్నాళ్లే బాబూ, ఈ   ఉద్యోగాలూ అవీనూ ?  పెళ్లి  సంబంధాలు వస్తున్నాయి నీకు..  మీ నాన్నగారేమో సింధూ ఏమైనా చిన్నపిల్లా,  అది పెళ్లి చేసుకుంటానని చెప్పేవరకు దాన్ని అలా వదిలేయంటూ నన్నే కోప్పడుతున్నారు..”


“హమ్మయ్య, నాన్న కోప్పడేది నిన్ను, నన్ను కాదుగా ?  అందుకే కొంతకాలం నా పెళ్లిగురించి మాట్లాడకమ్మా!”

  

“చాల్లే సంబడం,  మీనాన్న సపోర్టు ఉండగా నా మాట వింటావా ఏమన్నానా” అంటూ ఆవిడ లోపలకు వెళ్లిపోయింది..


“తల్లి లోపలకు వెళ్లిపోయిన తరువాత ఇంటి ముంగిట్లో ఉన్న బోగన్ విల్లే చెట్టు చుట్టూ కట్టిన సిమెంట్ చప్టాపై కూర్చుంది సింధుజ..  చుట్టూ తివాసీ పరచినట్లుగా రాలిపడిన పూల మధ్యలో అప్పుడెప్పుడో సరదాపడి కొనుక్కున్న ఆకు పచ్చని  లంగా, జాకెట్, పసుపురంగు ఓణీలో,  చెట్ల మధ్యనుండి సంధ్యాకాంతులు  సింధుజ  బుగ్గలమీద పడి ఆమె అందాన్ని మరింత ఇనుమడింపచేస్తున్నాయి..  కానీ సింధూ ఆలోచనలన్నీ తన కాలేజ్ రోజులు,  నవీన్ తో తన ప్రేమ చుట్టే తిరుగుతున్నాయి..


తనూ, అజయ్, నవీన్  ముగ్గరూ కాకినాడ  ఇంజనీరింగ్ లో క్లాస్మేట్స్.  అజయ్ తన మామయ్య కొడుకే..     అందం, చురుకుతనం ఉన్న నవీన్ అంటే  తొలిపరిచయం లోనే అతనిపట్ల ఇష్టాన్ని పెంచుకుంటూ, అతనితో సన్నిహితంగా  ఉండేది  తను.   అజయ్ కూడా  సింధూ   నవీన్ ను ఇష్టపడుతోందని  గ్రహించాడు. 

ఇంజనీరింగ్  అయిపోగానే  నవీన్   ఐ.ఐ.మ్ చదవడానికి  కలకత్తా కి ,  అజయ్  ఎమ్.టెక్  చదవడానికి  బెంగుళూర్,    సింధూ  హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ లో చేరిపోవడం  వెంట వెంటనే  జరిగిపోయాయి.. 


చూస్తూండగానే  రెండేళ్లు గడచిపోయాయి !      అజయ్, నవీన్  ల చదువులు పూర్తవడం,   ఇద్దరూ   ముంబాయి లో  పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగాలలో చేరిపోయారు.  


ఉన్నట్టుండి  ఒక రోజు  తను  అజయ్ కు ఫోన్ చేసింది.... “బావా, నీవు నాకొక హెల్పె చేయాలి ,  నీవు నవీన్ కు ఫ్రెండ్  వి  కదా,  నా ప్రేమ విషయం  నవీన్ కు చెప్పి  మా ఇద్దరి పెళ్లి  జరిపించవా ప్లీజ్” అంటూ  !  


దానికి  అజయ్  "మరీ అంత ఫూలిష్  గా మాట్లాడకు  సింధూ, నీ ప్రేమను నీవే  నవీన్  కు నేరుగా    ప్రొపోజ్ చేయవచ్చు కదా” అని ! 


“అంతేనంటావా,  సరే బావా” అని ఫోన్  పెట్టేసింది. 


రెండురోజుల తరువాత  సింధూ నుండి ఫోన్ మళ్లీ అజయ్ కు ..      తన ప్రేమను నవీన్ తిరస్కరించాడని, తనకి ఎప్పుడూ నా  మీద అటువంటి అభిప్రాయం లేదని చెప్పాడని ఫోన్ లో భోరున ఏడ్చేసింది..      కానీ  ఒక్క విషయాన్ని సింధూ అజయ్  తో  చెప్పలేదు.... "అజయ్ కు నీవంటే చాలా ఇష్టం  సింధూ, నీవు అతనినే చేసుకోవచ్చు కదా” అన్న  నవీన్  మాటలు ..     అజయ్  సింధుని    కాసేపు ఊరడించి  తను నవీన్ తో మాటలాడతానని నచ్చ చెప్పాడు ..


ఆ ప్రయత్నమూ   అయింది.  “సారీ రా అజయ్,  ....నాకు ఎప్పుడూ సింధుజ  మీద  ఆ అభిప్రాయం లేదు.   తను  ఎందుకు అలా ఊహించుకుందో నాకు అర్ధం కావడం లేదు.  బైదిబై... సింధూకి  నీవు బావవేగా, నీవే తనను చేసుకోవచ్చు కదా” అంటూ తేలికగా నవ్వేసాడు .    నవీన్ అన్న      మాటలన్నీ అజయ్    సింధుకి   వెంటనే తెలియ చేసాడు కానీ   ఆఖరుగా అన్న  మాటలు తప్పించి..


నిజానికి  సింధూ అంటే  అజయ్ కు చాలా ఇష్టం.    తను  చిన్నతనంలో ఎక్కువ  మామయ్య ఇంట్లోనే పెరిగాడు.  సింధూ  తను  కలసి చదువుకోవడం, ఆడుకోవడం.  ఒక మంచి స్నేహితులు లాగ  ప్రతీ విషయాన్ని  షేర్ చేసుకుంటూ  ఎంతో ఆత్మీయంగా ఉండేవారు.


సింధూకి  తన మీద ఆ అభిప్రాయం లేనప్పుడు , ఆమె మనస్సులో నవీన్ ఉన్నాడని తెలిసినప్పుడు సింధూ మీద ఆ అభిప్రాయాన్ని తుడిపివేసేసాడు పూర్తిగా..


సింధూ ఇచ్చిన మెసేజ్ చదువుకున్న  అజయ్ కి  సింధూ మీద చాలా కోపం వచ్చింది..  సింధూ నవీన్ ను ప్రేమించి ఉండచ్చు, కానీ నవీన్ కు ఆ అభిప్రాయం లేనప్పుడు  సింధూ  డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం, చచ్చిపోవాలని ఉందని తనకు మెసేజ్ ఇవ్వడం మూర్ఖత్వం..  సింధూ ని కలసి  ధైర్యం చెప్పాలని, పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకొమ్మని చెప్పాలనుకుంటూ  నిద్రకు   ఉపక్రమించాడు..


ఆరోజు ఆదివారం..

అప్పుడే తూర్పురేఖలు నెమ్మదిగా విచ్చుకుంటున్నాయి..  పూల చెట్లమీద వాలిన  పిట్టల కుహు కుహు రాగాలు వింటూ ఓ, అప్పుడే  తెల్లవారిపోయిందా అనుకుంటూ సింధుజ  నిద్ర లేచింది..  అమ్మా నాన్న రాత్రి ఎవరిదో బంధువుల ఇంట్లో పెళ్లి ఉందని వెళ్లారు..  తననీ రమ్మనమంటే రానని ఇంట్లో ఉండిపోయింది..  రాత్రి సరిగా నిద్ర పట్టలేదు   ఎందుకో పదే పదే  బావ గుర్తొచ్చాడు, అలాగే నవీన్ అన్నమాటలు  కూడా .. 


"అజయ్ కి నీవంటే చాలా ఇష్టం సింధూ, మీ బావేగా చేసుకోవచ్చుకదా" అని అనడం..

నిజంగా బావకి తనంటే అంత ఇష్టమా ?  అయ్యో బావా , ' నీ ప్రేమను గుర్తించనే లేదు సుమా' ?   సరికదా నాకూ నవీన్ కూ మధ్య  రాయబారాలు నడిపే  ఒక సాధనంగా వాడుకున్నాను.. పశ్చాత్తాపంతో సింధుజ మనస్సు నిండిపోయింది..   ఒక నిర్ణయానికి వచ్చింది..


ఒక అరగంట తరువాత  కాలింగ్ బెల్ మోగింది..  ఒకటి... రెండు క్షణాలు గడచిపోయాయి.  

ఇంతలో   ఎవరో  డోర్ దగ్గరకు మంద్రంగా  నడచొస్తున్న ధ్వని.........   

తలుపు తెరుచుకుంది..


తన కళ్లు తనని మోసం చేయడంలేదు కదా ?  నిజంగా బావేనా ?  తన అజయ్ బావేనా ? 

అజయ్  కూడా ఊహించలేదు, సింధూనే తలుపు తెరుస్తుందని..


"ఎదురుగా సింధూ " ! తన ప్రియమైన మరదలు..


 తలంటుపోసుకున్న  ఒత్తైన  పొడవాటి కురులను ఆర బెట్టుకుంటూ,  నుదిటి మీద చిన్న కుంకుమ  బొట్టుతో,  సన్నని ఎర్రని పెదవులపై చిరునవ్వు మెరుపులతో...  తనను చూస్తూ  బావా అంటూ   అజయ్ గుండెల్లో  గువ్వలా ఒదిగిపోయింది.  అతని చెవిలో  మంద్రమైన  స్వరంతో గుస గుసగా   ‘నన్ను క్షమించవూ బావా, నీ ప్రేమను గుర్తించలేకపోయా’నంటూ  ఆర్తిగా అతనిని అల్లుకుపోయింది!  


చిన్నప్పట్నుంచీ చిలుకాగోరింకల్లా"  పెరిగిన ఆ  జంట  ఒకరినొకరు విడిచి ఉండలేనంత ఆర్తితో ఒకరి కౌగిలిలో మరొకరు ఒదిగిపోయారు..  నెమ్మదిగా అతని కౌగిలి నుండి విడివడి అతని కనులలోకి చూస్తూ అర్ధ్రంగా  "బావా,  ప్రేమించడం గొప్పకాదు , ప్రేమింప బడడం లోనే  అసలైన ప్రేమ ఉందని తెలుసుకున్నాను. నన్ను క్షమించవూ ?”   అంటూ   అతని పాదాలను సృశించింది.  బావామరదళ్ల  అపురూప కలయికను చూస్తూ  తొలి ఉషస్సు ముచ్చటపడింది !

***

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :  

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.










45 views0 comments

Comments


bottom of page