చిలుకమ్మ సుద్దులు
- Gadwala Somanna
- 21 hours ago
- 1 min read
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ChilakammaSuddulu, #చిలుకమ్మసుద్దులు, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 52
Chilakamma Suddulu - Somanna Gari Kavithalu Part 52 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 05/04/2025
చిలుకమ్మ సుద్దులు - సోమన్న గారి కవితలు పార్ట్ 52 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
చిలుకమ్మ సుద్దులు
----------------------------------------
అమూల్యమైనది సమయము
సద్వినియోగమవ్వాలి
చేయకూడదోయ్! వ్యర్థము
జాగ్రత్తగా వాడాలి
గతించిపోయిన కాలము
ఎంత మాత్రం తిరిగి రాదు
ఎన్ని కోట్లు ఇచ్చినా
సమయానికి సమం కాదు
నిర్లక్ష్యం చేయరాదు
కాలాన్ని మానవుడా!
వాయిదాలు వేయరాదు
క్రమశిక్షణ లేకుండా!
కాలాన్ని కాదు తప్పు
బాధ్యతరాహిత్యం ముప్పు
ఇకనైనా మేలుకో!
కాలంతో సాగిపో!

సత్యాలు మేలి ముత్యాలు
----------------------------------------
ప్రయత్నిస్తే విజయము
క్రుంగిపోతే పతనము
ఆలోచిస్తే నేస్తము
ఆనందము సొంతము
ప్రపంచంలో ప్రతిదీ
నేర్పుతుంది పాఠాలు
కొంతైనా నేర్చుకున్న
చక్కబడును జీవితాలు
సానుకూల దృక్పథము
ఎంతైనా అవసరము
అట్టి వారికి నీడలా
వెంటే ఆశీర్వాదము
కష్టాలు లేకుండా
ఉండదోయ్! జీవితము
మెరుగు పెట్టకుండా
మెరువదోయ్! వజ్రము

అమ్మ సూక్తి రత్నాలు
----------------------------------------
మభ్యపెట్టకు మాటలతో
మోసగించకు నటనలతో
బండారం బయటపడితే
తుదకు మిగిలేది అధోగతే
విసగించకు కోతలతో
గాయపరచకు చేతలతో
బంధాలకు పొడవకు తూట్లు
హద్దుమీరిన గర్వంతో
తలపెట్టకు అపకారము
విడిచిపెట్టకు ఉపకారము
ఆపద వేళ ఆశ్రయిస్తే
ఆపేయకు సహకారము
చేయకూడదు అవహేళన
చెందకూడదు ఆందోళన
పదిమందికి ఆదర్శము
పంచిపెట్టాలి ఆనందము

ఉడుత ఉపదేశం
----------------------------------------
సాధ్యమనే భావన
దృఢంగా ఉండాలి
అదే విజయ పథమున
తొలి అడుగు కావాలి
గొప్ప పనుల కోసము
సాహసమే చేయాలి
మనిషిగా పౌరుషము
యేరులై పారాలి
కన్నవారి సేవలో
ముందుడగు వేయాలి
వారు చూపు ప్రేమలో
తడిచి ముద్దవ్వాలి
జాగు చేయక పనిలో
చురుకుదనం చూపాలి
వాయిదా పద్దతికి
శుభం కార్డు వేయాలి
పని చేస్తూ పోతే
ఫలితమే వస్తుంది
దాని కొరకు ఆతృత
నీరసం తెస్తుంది
పువ్వు పుట్టగానే
సువాసననిస్తుంది
ఇల సానపెడితేనే
ప్రతిభ బయట పడుతుంది

పెద్దల పలుకులు
----------------------------------------
హానికరము ఆగ్రహము
ఎక్కువైతే అపాయము
బహు ముఖ్యము నిగ్రహము
బ్రతుకులో అతి ముఖ్యము
చిరు దీపము వెలిగిస్తే
అంధకారము మాయము
ప్రయత్నమే మొదలెడితే
పరారగును అపజయము
పెట్టుకోకు విరోధము
అభివృద్ధికవరోధము
వదలుకోకు వినోదము
త్రుంచుకోకువికాసము
కడు గొప్పది ఆత్మబలము
కల్గియుంటే అద్భుతము
గుండెలో నింపు కొనిన
మారిపోవు జీవితము

-గద్వాల సోమన్న
Comentários