చిలుకమ్మ సూక్తులు
- Gadwala Somanna
- 2 hours ago
- 2 min read
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ChilukammaSukthulu, #చిలుకమ్మసూక్తులు, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 64
Chilukamma Sukthulu - Somanna Gari Kavithalu Part 64 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 22/04/2025
చిలుకమ్మ సూక్తులు - సోమన్న గారి కవితలు పార్ట్ 64 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
చిలుకమ్మ సూక్తులు
----------------------------------------
తిన్నింటి వాసాలు
లెక్క పెట్టకూడదు
ఎదుటివారి లోపాలు
వేలెత్తి చూపరాదు
చేసిన మేలు బ్రతుకున
ఎప్పుడు మరువకూడదు
కృతజ్ఞతలు చెప్పుటకు
తడవు ఇక చేయరాదు
ఆదరించిన చేతికి
హాని తలపెట్టరాదు
ప్రేమించిన మనిషికి
ఇక్కట్లు తేరాదు
ఆదుకున్న వ్యక్తులకు
నమ్ముకున్న మిత్రులకు
చెరువు మాత్రం చేయకు
కంట తడి పెట్టించకు

చిన్నారి సరదాలు
----------------------------------------
గదిలోని నాన్న చెంతకు
చిట్టి పాప వచ్చింది
తలపై పూలు పెడుతూ
సరదాలే చేసింది
నాన్న ఒడిలో చేరి
ఊసులెన్నో చెప్పింది
ఎద మీద పండుకొని
ఆటలెన్నో ఆడింది
పాప చేసే పనులకు
నాన్న అడ్డు చెప్పలేదు
చిన్నారి గుండెలోని
ఆనందం ఆపలేదు
నాన్నంటే పాపాయికి
అమితమైన అనురాగము
త్యాగమూర్తి తండ్రిపై
చెప్పలేని అభిమానం

బాలల లోకం స్వర్గము
----------------------------------------
ఇంటిలో తల్లిదండ్రులు
బడిలోన గురుదేవులు
ఇదే బాలల లోకము
అదే తలపించు నాకము
వస్తువులతో ఆటలు
తాతయ్య చెప్పు కథలు
ఇదే బాలల లోకము
పరికింప బహు అందము
సున్నితమైన హృదయాలు
మధురమైన భావాలు
చిన్నారుల తలంపులు
చూడ ఆణిముత్యాలు
పరిమళించే పుష్పాలు
పిల్లల ముఖారవిందములు
అద్భుతము బాలల లోకము
అమూల్యమైనది నిజము
కల్మషం లేని స్నేహము
అమృతంబు అనురాగము
సద్గుణశీలురు బాలలు
ప్రకాశించే భానులు

చిన్నారులు వేల్పులు
----------------------------------------
శుద్ధమైన హృదయులు
దైవానికి ఇష్టులు
ఇంటిలోని పిల్లలు
మింటిలోని చుక్కలు
ముద్దులొలుకు ముఖములు
సదనానికి శుభములు
అభంశుభం ఎరుగని
అవనిలోన బాలలు
అపకారం చేయరు
అపనిందలు వేయరు
సద్గుణసంపన్నులు
పసి పిల్లలు వేల్పులు
వెన్నుపోటు పొడవరు
నిజాయితీ వీడరు
భువిలో చిన్నారులు
పరుల హాని కోరరు
కథలని బహు ఇష్టము
కన్నవారే ప్రాణము
కన్పించక పోతే
తల్లడిల్లు హృదయము
చిన్నారుల స్నేహము
శ్రేష్ఠమైన హేమము
వారు చేయరు ద్రోహము
ఎవ్వరికీ మోసము

తాతయ్య సూక్తులు
----------------------------------------
అందరితో సఖ్యత
జీవితాన సభ్యత
ఉంటే మేలు మేలు
చూపిన చాలు చాలు
దేశానికి సేవలు
గుండెల్లో ప్రేమలు
అత్యంత అవసరము
సాహసించు హృదయము
బ్రతుకులో ఎదుగుదల
ఉడుములా పట్టుదల
కల్గింటే లాభము
ధన్యమే జీవితము
కష్టించే చేతులు
ప్రేమించే మనసులు
అభినందనీయమే!
అభివృద్ధికి మూలమే!
వృద్ధి లేని బ్రతుకులు
చేతకాని మనుషులు
విజయాలకు దూరము
అక్షరాల సత్యము
-గద్వాల సోమన్న
Comments