top of page
Writer's pictureSathyanarayana Murthy M R V

చిన్నాన్న


'Chinnanna' New Telugu Story

Written By M R V Sathyanarayana Murthy

'చిన్నాన్న' తెలుగు కథ

రచన: M R V సత్యనారాయణ మూర్తి

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)




(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

“ఏరా శేఖర్ బాగున్నావా?”

పుస్తకం చదువుకుంటున్న నేను తల ఎత్తి చూసేసరికి ఎదురుగా చిన్నాన్న. వచ్చి నా పక్కనే కూర్చున్నాడు చిన్నాన్న. లోపలనుంచి నాన్నా, అమ్మా వచ్చారు. “ఏరా శివా, ఇదేనా రావడం?” నాన్న ఆప్యాయంగా చిన్నాన్న భుజం మీద చేయివేసి అడిగారు.

“ఇప్పుడే వచ్చాను అన్నయ్యా. నీ ఆరోగ్యం ఎలావుంటోంది? వదినా, కులాసానా?” ఇద్దర్నీ ఒకేసారి అడిగాడు చిన్నాన్న.


“ఆ ...మేం బాగానే ఉన్నాము.నువ్వు ఎలా ఉంటున్నావు? హైదరాబాద్ లో ఒక్కడివీ ఎందుకురా, మన ఊరు వచ్చేయ్. అందరం కలిసి ఉందాం” అన్నారు నాన్న.

“అవును శివా. నీ గురించి మీ అన్నయ్య అస్తమానం బాధపడుతూ ఉంటారు. వాడు ఒక్కడూ ఎలా ఉంటున్నాడా?అని. ఇక్కడికి వచ్చేయ్ .నలుగురం కలిసిఉందాం” అంది అమ్మ.


“అలాగే వదినా. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి.అవి పూర్తీ అవగానే మన ఊరు వచ్చేస్తాను. నా ఆఖరి గమ్యం మన ఊరే కదా” చిన్నగా నవ్వుతూ అన్నాడు చిన్నాన్న.

“మీరు మాట్లాడుతూ ఉండండి. నేను టీ పట్టుకు వస్తాను” అని లోపలకు వెళ్ళింది అమ్మ. చిన్నాన్న కాఫీ తాగడు , టీ తాగుతాడు. బాగ్ లోంచి ఖరీదైన స్మార్ట్ ఫోన్ తీసి నాకిచ్చాడు చిన్నాన్న. ఆ ఫోన్ చూడగానే నా కళ్ళు ఆనందంతో మెరిశాయి. నా ఫ్రెండ్స్ అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. నాకే లేదు. నాన్నని కొనమని చాలా సార్లు అడిగాను, అలాగే అని వాయిదా వేస్తున్నారు నాన్న.


వెంటనే ఫోన్ తీసుకుని “థాంక్స్ చిన్నాన్నా” అన్నాను.


“మనలో మనకి థాంక్స్ ఏమిట్రా. బాగా చదువుకో శేఖర్ ” అన్నాడు చిన్నాన్న. నేను ఫోన్ పట్టుకుని నా గదిలోకి వెళ్ళిపోయాను. నాన్నా,చిన్నాన్నా వ్యవసాయం గురించి , ఊళ్ళో విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. నేను నా ఫోన్ లోని సిం కార్డు తీసి కొత్త ఫోన్ లో వేసి మా ఫ్రెండ్స్ తో మాట్లాడ సాగాను. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది.

మధ్యాహ్నం భోజనాల దగ్గర చిన్నాన్న నా పక్కనే కూర్చున్నాడు. నేను భోజనం చేస్తున్నంతసేపు నాకేసే చాలా ప్రేమగా చూసాడు. చిన్నాన్న వచ్చిన ప్రతిసారీ నా పక్కనే కూర్చుంటాడు. మామూలగా అయితే నేనూ, నాన్నా పక్క పక్కనే కూర్చుంటాం. ఒకసారి నేను నాన్న పక్కన కూర్చోపోతే, అమ్మ “శేఖర్ , చిన్నాన్న పక్కన కూర్చో నాయనా” అంది. అప్పటినుంచీ నాకు అది అలవాటు అయిపోయింది.


చిన్నాన్న ఆరోజు రాత్రి బస్సు కి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. చిన్నాన్న మా నాన్న కంటే ఎత్తుగా ఉంటాడు. అయిదు అడుగుల పది అంగుళాలు ఉంటాడు. చాలా అందగాడు. సినిమాలలో వేషాలు వేస్తూ ఉంటాడు. ఈ మధ్య టివి. సీరియల్సు లో తండ్రి పాత్రలు కూడా వేస్తున్నాడు. చాలా క్రితమే పిన్ని చనిపోయినా, మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఒక్కడే హైదరాబాద్ లో ఉంటున్నాడు. ఎందుకో సినిమా వాళ్ళు అంటే నాకు సదభిప్రాయం లేదు. అందులోనూ విలన్ వేషాలు వేసే వాళ్ళు అంటే, మరీ చెడ్డ అభిప్రాయం ఉంది. చిన్నాన్న తెచ్చే గిఫ్ట్ లు నాకు బాగా నచ్చటం వలన ఆయన పట్ల కొద్ది సాఫ్ట్ కార్నర్ ఉంది.

******

నేను బి.టెక్. మంచి మార్కులతో పాస్ కాగానే చిన్నాన్న మా ఊరు వచ్చి నాకు ఖరీదైన వాచీ, లాప్ టాప్ ఇచ్చారు. ఆరోజు ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడమే కాకుండా, దగ్గరకు తీసుకుని కౌగలించుకున్నారు. ఆయన కళ్ళల్లో సన్నటి కన్నీటి పోర కదలాడడం నేను గమనించాను.


ఆ మర్నాడు ఊళ్ళో వాళ్ళు వచ్చి జనార్ధన స్వామి కోవెల ధ్వజస్తంభం పడిపోయి చాలా కాలం అయ్యిందని కొంచెం సాయం చేయమని అడిగితె, రెండు లక్షల రూపాయల చెక్కు వాళ్లకు ఇచ్చారు చిన్నాన్న. నేను చాలా ఆశ్చర్యపోయాను. తన స్వంత కొడుకు పరీక్షలలో విజయం సాధిస్తే ఎంత ఆనంద పడతారో అంత ఆనందం ఆయనలో నాకు కనిపించింది.


ఒక వారం తర్వాత ఉద్యోగ ప్రయత్నాలకి హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్ రూమ్ లో దిగాను. కిరణ్, సుదీర్, వేణు, నేనూ రూమ్ లో ఉంటున్నాము. ఒక ఆదివారం సుదీర్ పాత సినిమా పెడితే చూస్తున్నాం టి.వి.లో.


కాసేపటికి హీరోయిన్ ని రేప్ చేసే సీన్ వచ్చింది. అది చూసి నా గుండె దడ దడ లాడింది. ఎదురుగా చిన్నాన్న తెర మీద కనిపించాడు వికటంగా నవ్వుతూ. కాసేపటికి హీరో వచ్చి , చిన్నాన్నని తన్ని హీరోయిన్ ని రక్షించి తీసుకు వెళ్తాడు. సుదీర్ నవ్వుతూ “ఈ శివా గాడు అన్ని సినిమాలలో విలన్ వేషాలు, హీరోయిన్ లను రేప్ చేయడం వంటి వేషాలే వేస్తాడు. ఈ మధ్యన టి.వి. లలోకి వెళ్లి తండ్రి వేషాలు వేస్తున్నాడట” అని అన్నాడు. నాకు సినిమా నాలెడ్జి తక్కువ. మా రాఘవాపురం లో సినిమా హాలు లేదు. పెనుగొండ కానీ పాలకొల్లు కాని వెళ్లి చూడాలి. పైగా నాకు చదువు మీదే దృష్టి ఎక్కువ.

ఎందుకో నాకు చాలా సిగ్గుగా అనిపించింది. అదృష్టవసాతూ వారికి మా చిన్నాన్న గురించి తెలియదు. రాఘవాపురం రామచంద్రం గారి అబ్బాయి అనే తెలుసు. ఆరోజు నాకు సరిగా నిద్ర పట్టలేదు. చిన్నాన్న మీద చాలా కోపం వచ్చింది. ఇంటికి వెళ్ళాకా నాన్నతో చెప్పి ,చిన్నాన్నని మన ఇంటికి రానివ్వద్దని చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నాక, అప్పుడు నిద్ర పట్టింది.


పదిహేను రోజులకే నాకు ఓ మల్టీ నేషనల్ కంపనీ లో ఉద్యోగం రావడం, నేను బెంగుళూరు వెళ్లడం చాలా స్పీడ్ గా జరిగిపోయాయి.

****

బెంగుళూరు వచ్చి ఏడాది గడిచింది. ఈలోగా ఒక్కసారి మాత్రమే ఇంటికి వెళ్ళివచ్చాను. చిన్నాన్న కూడా వచ్చారు. కానీ నేను అంటీ ముట్టనట్టు మాట్లాడాను. ఎందుకో ఆయన ఉనికి కూడా నేను భరించలేక పోతున్నాను. బతుకుతెరువు కోసం మరీ ఇంత ఛండాలం వేషాలు వెయ్యాలా? అని నాకు చాలా కోపం కలిగింది చిన్నాన్న మీద.

ఒక రోజు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నాన్న నుండి ఫోన్ “చిన్నన్న కి ఆక్సిడెంట్ జరిగి హైదరాబాద్ లో చనిపోయాడని, బాడీ రాఘవాపురం తీసుకువస్తున్నారు, నువ్వు వెంటనే బయల్దేరి రా” అని.


నా మనసు చాలా బాధపడింది. వెంటనే బస్సు కి టికెట్ తీసుకుని రాఘవాపురం బయల్దేరాను. చిన్నాన్నతో గడిపిన సందర్భాలు మధురమైన జ్ఞాపకాలు గుర్తుకొచ్చి గుండె బరువెక్కింది. కానీ ఆయన వెండితెర జీవితం గుర్తుకొచ్చి నిర్వేదం కలిగింది. తెల్లవారి ఇంటికి వచ్చేసరికి ఇంటి నిండా జనం కనిపించారు. అమ్మ నన్ను కౌగలించుకుని ‘నా శివుడు వెళ్ళిపోయాడు రా. వదినా..వదినా ..అంటూ నా చుట్టూ తిరిగే నా బిడ్డ వెళ్ళిపోయాడు’ అని ఘొల్లు మంది. నాన్న ఆమెని ఓదార్చారు. నాకేసి తిరిగి ‘నువ్వు బట్టలు మార్చుకుని రా నువ్వే చిన్నన్నకు అంత్యక్రియలు చేయాలి’ అని అన్నారు నాన్న.


ఆయన మాటలకు నాకు కోపం వచ్చింది, ‘”చూడండి నాన్న. ఈయన వేషాలు తెలిసాక, ఈయనంటే నాకు అసహ్యం వేస్తోంది. సారీ. ఆ పని మాత్రం నేను చేయలేను” నిష్కర్షగా అన్నాను. నా మాటలకు నాన్నా, అమ్మా నిర్ఘాంత పోయారు. రెండు నిముషాలు నాకేసి అలా చూస్తూనేఉండిపోయారు.


“చూడు శేఖర్. చిన్నాన్న వెండితెర మీద చెడ్డ పాత్రలలో నటించినా, అవన్నీ వృత్తిలో ఒక భాగమే. నా తమ్ముడు ఏ బురదా అంటని స్వచ్ఛమైన తెల్లకలువ. ఏ చెడు అలవాట్లు లేని నిక్కమైన స్వాతిముత్యం. వెండితెర మీద అయినా స్టేజి మీద అయినా చెడ్డపాత్రలు వేసేవారు దుష్టులు, దుర్మార్గులు కాదు. గయ్యాళి పాత్రలు పోషించి ఖ్యాతి పొందిన నటీమణి, నిజ జీవితంలో చాలా సాత్మీకురాలు.ఎంతోమందికి ఉపకారం చేసిన గొప్ప మహిళ. నా తమ్ముడికిచ్చిన మాట కోసం ఒక నిజం దాచాను. ఇప్పుడు చెబుతున్నాను విను. నువ్వు మా కన్నబిడ్డవి కాదు”..


నాన్న మాటలకు నేను అయోమయంగా ఆయన కేసి చూశాను.

నాన్న నా భుజం మీద చేయివేసి, నా కళ్ళల్లోకి చూసి ‘అవును’ అన్నట్టు తలాడించారు.

“నువ్వు నా తమ్ముడు శివా కొడుకువి. మీ అమ్మ నీ చిన్నప్పుడే చనిపోతే నిన్ను మాకు ఇచ్చి మా బిడ్డగా పెంచమని చెప్పాడు. తన వృత్తి పరమైన నీడ నీ మీదపడితే, నీ భవిష్యత్తు ఎక్కడ దెబ్బ తింటున్దోనని ఈ జాగ్రత్త తీసుకున్నాడు. ఈ ఊరి ఎలిమెంటరీ స్కూల్ కి కొత్త బిల్డింగ్ కట్టించాడు, తన పరపతి ఉపయోగించి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మంజూరుచేయించి ఆ భవనాన్ని కూడా మీ నాన్నే కట్టించాడు. ఈ ఊరు బాగుకోసం ఎంతో ఖర్చుపెట్టాడు. తన వాటాకి వచ్చిన పొలాన్ని కూడా నాకు ఇచ్చేసాడు. నేనూ, నా భార్యా సుఖంగా ఉన్నామంటే కారణం మీ నాన్నే. మీనాన్నని అపార్ధం చేసుకోకు” ఆవేదనగా అన్నాడు పెదనాన్న.


నా కళ్ళకు అడ్డుపడుతున్న అనుమానపు మేఘాలు తొలగిపోయాయి. నా కళ్ళముందు ఒక మహోన్నత మూర్తి కనిపించాడు.


నేను వేగంగా నడిచి నాన్న పార్ధివదేహం ముందు కూలబడి పోయాను. నా కళ్ళ నుండి కన్నీళ్లు ధారగా కారి నాన్న పాదాల్ని అభిషేకించాయి.

*****

M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.




89 views1 comment

1 Kommentar


Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
05. Apr. 2023

mrvs murthy • 1 hour ago

ధన్యవాదాలు సార్. రచయిత భావాలను మీ గొంతులో చక్కగా పలికించారు..

Gefällt mir
bottom of page