'Chitikela Baba Chamatkaram' - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 17/09/2024
'చిటికెల బాబా చమత్కారం' తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఊళ్లోకి ఎన్నో మహిమలున్న చిటికెల బాబా వచ్చారట. ఆయన చేత్తో చిటికేసి నెత్తి మీద మొట్టితే ఎన్నో మొండి జబ్బులు నయమవుతాయట. ఆయన చెయ్యి తాకితే పాము కాటు తిన్న మనిషి లేచి కూర్చుంటారట. పిల్లలు లేని వారికి మంత్రించిన విభూతి నెల రోజులు నుదుటున పెట్టుకుంటే
ఆరు నెలల్లో పండంటి బిడ్డ ఒళ్లో ఆడుతాడుట. నల్లగా ఉన్నవారు వారిచ్చిన చూర్ణం కొబ్బరి నూనెలో కలిపి నెల రోజులు వంటికి రాసుకుంటే మల్లెపువ్వు ఛాయ శరీర రంగు వస్తుందట. ఇలా ఊళ్లో ఎవరి నోటంట విన్నా ఇవే విడ్డూరపు కబుర్లు.
అసలే నాగరికతకు దూరంగా వెనక బడిన పల్లె ప్రాంతం. సాధువులు బాబాలు ఎవరొచ్చినా భయ భక్తులతో వారేది చెప్పినా నమ్ముతారు. చెడుపు చిల్లంగి చేతబడి బాణామతి లాంటి మూఢ నమ్మకాలు, పట్టింపులు, అంధ విశ్వాసం ఎక్కువ. ఎంత ప్రాణాంతక రోగమైనా డాక్టరు దగ్గర కెళ్లకుండా నాటువైద్యాన్ని నమ్ముకుని దుర్మరణం పాలవుతుంటారు అమాయక జనం.
ఊరి చివర చింతతోపులో భారీగా పెరిగిన కొమ్మలతో దట్టంగా ఉన్న చింతచెట్టు మొదట పులి చర్మం మీద గుబురు గెడ్డం, తలమీద కొప్పు జుత్తు, నుదుటున విభూతి రేఖలు, కాషాయ వస్త్రాలు, మెడలో రుద్రాక్ష మాలతో కమండలం మీద చేతిలో తులసిమాలతో యోగ నిద్రలో కనబడుతున్నారు
చిటికెల స్వామి గారు.. వారి ఇద్దరు శిష్యులు కాషాయ వస్త్రాలు ధరించి తుప్పలతో గురువు గారి చుట్టూ పరిసరాల్ని శుభ్రం చేస్తున్నారు. గురువు గారికి కొద్ది దూరంలో మూటల్లో వస్తు సామగ్రీ ఉన్నాయి.
ఉదయాన్నే ఊరి నుంచి పట్నానికి పాలు కూరగాయలు తీసుకెళ్లే రైతు జనం వింతగా సాధువు గార్ని శిష్యులను చూసి గుసగుస లాడుతున్నారు. ఊరి సర్పంచికి దివాణం గారికి పూజారి గారికి విషయం తెలిసి సమావేశమై చిటికెల బాబా గార్ని చూడటానికి బయలు దేరారు. వారు చింతతోపులో బాబాగారు బసచేసిన ప్రదేశానికి వచ్చి చూడగా చింతచెట్టు మొదట ధ్యాన ముద్రలో బాబా, ఆయన చుట్టూ పరిసరాలు శుభ్రం చేసిన శిష్యులు మట్టి కూజా పట్టుకుని నీటి కోసం ఎటుపోవాలో
ఎదురు చూస్తున్నారు. ఇంతలో గ్రామ పెద్దలు వారి అవసరాలు తెలుసుకుని గ్రామ తలారి ద్వారా మంచినీరు, బాబా వారికి పాలు ఫలాలు తెప్పించి సమకూర్చారు. గ్రామ పెద్దలు బాబాకి సాష్టాంగ నమస్కారం చెయ్యగా బాబా చిరునవ్వుతో వారిని దీవించారు.
శిష్యులను అడిగి చిటికెల బాబా గారి వివరాలు, వారు సమయానుకూలంగా ఏమి సేవిస్తారో తెలుసుకున్నారు. మనుషులను రప్పించి చెట్టు ముందు తాటాకుల పందిరి, వెనక స్వామికి చిన్న పాక వేయించారు. చెట్టు ముందు హోమ గుండం ఏర్పాటు చేసి సదా అగ్ని రాజేస్తున్నారు. సాంబ్రాణి ధూపం పరిసరాల్ని మత్తెక్కిస్తోంది. చిటికెల బాబా గారి వార్త చుట్టుపట్ల గ్రామాలకు పాకింది.
ఒక్కొక్కరు బాబా గారు వేంచేసిన గ్రామానికి జనం వరస కట్టేరు. బాబా గారు బసచేసిన చుట్టుప్రాంతానికి ఎడ్లబళ్లు వరస కట్టేయి. టీ బడ్డీలు, గోలీసోడా తోపుడు బళ్లు, సైకిలు పంక్చరు షాపులు మొదలయాయి. ఊరంతా సందడిగా మారింది.
చిటికెల బాబా గారి దర్సనం, వారు మంత్రించి ఇచ్చే విభూతి పొట్లం, మంత్రించి ఇచ్చిన తావీజు, మూలికల చూర్ణం, తైలం ధరలు వివరాలు అట్ట బోర్డు మీద రాసిపెట్టారు. చిన్న బేటరీ మైకులో
ఇదివరకు చిటికెల బాబా గారి వద్ద వైద్యం చేయించుకున్న ఎందరో రోగులు వారి అనుభవాలు రికార్డు చేసినవి వినిపిస్తున్నారు శిష్యులు. ఉదయం పది గంటల నుంచిసాయంత్రం నాలుగు గంటల వరకే బాబా గారి దర్సనం లభిస్తుంది.
బాబా గారు వారి జన్మదినం రోజున ఆశ్రమంలో సంవత్సరానికి ఒకసారి అన్నదానం చేస్తారని కనుక దాతలు వారికి తోచింది హుండీలోవెయ్యవల్సిందిగా పందిరి మద్య ఒక ఇనప పెట్టె ఉంచారు.
చిటికెలబాబా గారు ఊళ్లో కొచ్చి రెండు వారాలైంది. ఈమద్యలో గ్రామ దేవత పండగ రావడం, ఊళ్లో బంధువుల తాకిడి ఎక్కువై బాబా గారి వద్ద రద్దీ పెరిగింది. ఒక్కొక్కరు బాబా వారి నుంచి మంత్రించిన విభూతి పొట్లాలు, తావీజులు, తైలాలు కొనుక్కుపోయారు. ఈ రెండు వారాల్లోనే బాబా గారి రాబడి ధన వస్తు రూపేణా బాగా వచ్చింది. ఎప్పటికప్పుడు శిష్యులు డబ్బు, విలువైన వస్తువులు వేరు చేసి మూటలు కడుతున్నారు. కడుపారా వారికి కావల్సిన భోజనం వసతి ఏర్పాట్లు బాగున్నాయి.
అప్పుడప్పుడు వారు వెంట తెచ్చుకున్న క్వార్టర్ విస్కీబాటిల్సు అర్థరాత్రి ఎవరూ లేకుండా చూసి మజా చేస్తున్నారు.
హుండీలో దాతల డబ్బు బాగానే సమకూరింది. మంత్రించిన విభూతి, తావీజులు, తైలాలు, చూర్ణాలు అమ్ముడై డబ్బులు దండిగా జమ అయాయి. తెచ్చిన సరుకులు అమ్ముడు పోయి
జల్షాలకు కావల్సినంత పైకం జమ అవడంతో ఇంక రెండు రోజులే చిటికెల బాబా ఈ ప్రాంతంలో ఉఃటారని తర్వాత కర్ణాటక శృంగేరీకి బయలుదేరుతారని శిష్యులు ప్రకటించారు.
రెండు రోజులు కార్యక్రమాలు పూర్తవగానే గ్రామస్తులు అట్టహాసంగా చిటికెల బాబాకు, శిష్య గణానికి ఘనంగా వీడ్కోలు పలికారు ఊరి జనం.
జనాలలో నిరక్షరాస్యత, అమాయకత్వం, వెనుకబాటు మూఢ నమ్మకాలు అంధ విశ్వాసం కారణంగా ప్రజల బలహీనతలను తమకు అనుకూలంగా మార్చుకుని ఇలాంటి దొంగబాబాలు, సాధువులు, స్వాముల మాయలో పడి అన్ని విధాల మోసపోతున్నారు.
చిటికెల బాబా వంటి దొంగలు ఒకచోట మకాం వేసి పది పదిహేను రోజులు వారి మాయ మాటలతో అమాయక జనాల్ని మోసగించి కావల్నిన డబ్బు సమకూరగానే బిచానా ఎత్తేసి పట్నంలో జల్షాలు చేసి డబ్బులు అయిపోగానే మరో కొత్త ప్రదేశంలో రెక్కీ నిర్వహించి అక్కడి పరిసరాలు వ్యక్తుల
గురించి ఆచూకి తీసి మాటల మాంత్రికులు శిష్యులు సాదా దుస్తులు ధరించి చిటికెల బాబా మహత్తుల గురించి జనాల్లో పబ్లిసిటీ చేసి కొద్ది రోజుల తర్వాత అక్కడ మకాం వేస్తారు.
సిటీలో రోడ్డు పక్కన రాజస్తాన్ నాటువైద్యుల వద్ద ఆకులు అనేక మొక్కల వేళ్లు కొని వాటి పని తీరు తెలుసుకుని గ్రామాలంట సాధువుల వేషంలో విగ్గులు కాషాయ వస్త్రాలు ధరించి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ మకాం వేసి అమాయక జనాలను బురిడీ కొట్టించడం వారి వృత్తి.
పల్లె ప్రజలు మేలుకోనంత వరకు ఇటువంటి దొంగబాబాలు సాధువుల మోసాలకు బలికాక తప్పదు.
ప్రసార మాద్యమాలు, పత్రికలు, పోలీసు వారు ఇటువంటి దొంగ బాబాల సమాచారం, సైబర్ నేరగాళ్లు, గుర్తింపులేని చిట్ ఫండ్స్, అధిక వడ్డీ పేరుతో నడిపే ఫైనాన్స్ సంస్థల గురించి ఎంతో ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజలు వారినే నమ్మి అన్ని విధాల నష్టపోతున్నారు.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు : శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు :
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
Comments