top of page
Writer's pictureA . Annapurna

చివరకు మిగిలేది..



'Chivariki Migiledi' - New Telugu Story Written By A. Annapurna

Published in manatelugukathalu.com on 31/01/2024 

'చివరకు మిగిలేది' తెలుగు కథ

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)



ఆసరా రీహాబిటేషన్ సెంటర్ రూంలో ప్రాణం ఉండీ లేనట్టు బెడ్ మీద నిస్సహాయంగా పడుకుని వుంది దీప! కంట నీరుకూడా రాని మనసులోనే రోదిస్తోంది. ఎదురుగా ఉన్న కిటికీలోనుంచి కనబడే ప్రకృతి దృశ్యాలు మాత్రమే కాస్తంత ఓదార్పు నిస్తాయి ఆమెకు. 


చెట్లమీద సందడిచేస్తూ గూడు కట్టుకుని పిల్లలను సాకే పక్షులు, పూలచుట్టూ తిరిగే భ్రమరాలు, రెక్కలు ఆర్చుతూ ఎగిరే రంగు రంగుల సీతాకోక చిలుకలు జీవిత సత్యానికి

ప్రతీకలుగా తోస్తున్నాయి ఆమెకు. 


అందాలతో ఆకర్షించడం పూల తప్పా.. మకరందాన్ని కోరి చేరవచ్చిన భ్రమరానిది తప్పా! అంటే అది ప్రకృతి సహజ పరిణామం అంటారు. 


కానీ మనుషులకు కొన్ని హద్దులు, నియంత్రణలు వున్నాయి. అదే పెళ్లి అనే కట్టుబాటు. పవిత్ర బంధం ! ఆ బంధాన్ని తెంచుకున్నాను చేజేతులా.. అనుకుంది. 


ఇప్పుడు విచారించి ఉపయోగంలేదు. తిరిగిరాని అమూల్య జీవితం అది. 


''దీపా ! ఇదిగో టాబ్లెట్ వేసుకునే టైం ఐనది..” అంటూ ఇచ్చాడు శేఖర్. 


ఆలోచనలనుంచి బయటకు వచ్చి, టాబ్లెట్ అందుకుని అతడు చూడకుండా తలగడ కిందపెట్టి, నీళ్ళుమాత్రం తాగింది, తనకు ఇదే శిక్ష అనుకుంటూ. 


కళ్ళు సరిగా కనిపించక, వెన్నెముక దెబ్బతిని, నడుము వొంగిపొయి, మెల్లిగా చేయగలిగిన సేవ చేస్తున్నాడు శేఖర్.. ఆమె దగ్గిరే ఉండి. 


 ఇది మరీ నరక యాతన అనిపిస్తోంది దీపకు. అతడి మంచితనాన్ని, జాలిని, ప్రేమనూ భరించడమే కష్టంగావుంది. 


‘ఆ మంచితనానికి నేను అర్హురాలిని కాదు. దూరంగా వెళ్లిపోండి. నన్నుపశ్చాతాపంలో కాలి పోనివ్వండి.. ఒంటరిగా వదిలిపెట్టు శేఖర్ !’ అని అరవాలని ఉంది.. ఆమెకు. 

 ఏది చేయలేక నిస్సహాయంగా కళ్ళు మూసుకుంది. 


భరద్వాజకు ఇద్దరు అమ్మాయిలు. రైల్వెలో వుద్యోగం చేసే అతడికి ఉత్తర్ ప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ డివిజన్లకు మధ్య ప్రతి రెండేళ్లకు బదిలీలు ఉంటాయి. అందువలన పెద్ద కూతురు దీపను విశాఖపట్నం అమ్మమ్మ గాయత్రి దగ్గిర ఉంచాడు. రెండో కూతురు రూపకి ఇంకా ఐదేళ్లు. కూడానే ఉంటుంది. ఇద్దరికీ ఏడు ఏళ్ళు తేడా. 


 హై స్కూల్ చదువుకి దీపను విశాఖలో ఉంచాడు. తరచుగా చూసివెళ్లే వీలు ఉంటుందని. అక్కడే పీజి చేసింది దీప. గాయత్రికి గుడిలో పరిచయం వున్న అర్చకుడు ''దీపకి సంబంధాలు చూస్తున్నారా.. మంచి సంబంధం ఉంది. అబ్బాయి మెరైన్ ఇంజినీరు. మంచి కుటుంబం. ''అన్నాడు ఒకరోజు. 


 ''మంచిమాట చెప్పారు. ఇప్పుడే నాకు ఆలోచన వచ్చింది. మిమ్ములను అడగాలని అనుకుంటున్నాను. అమ్మాయి, అల్లుడితో చెబుతాను. వివరాలు చెప్పండి” అని తెలుసుకుని భరద్వాజతో చెప్పింది. 


 ''చదువు బాధ్యత తీసుకున్నారు. పెళ్లికూడా మీబాధ్యతే.. అలాగే చూదండి !” అన్నాడు భరద్వాజ, అత్తగారితో. 

గాయత్రి, శేఖర్ తల్లి తండ్రులతో మాటాడి అన్ని సిద్ధం చేసాక భరద్వాజ వచ్చి పెళ్లి జరిపించి వెంటనే వెళ్లిపోయాడు. 


మూడేళ్ళలో ఇద్దరు పిల్లలు కలిగారు దీపకి. వాళ్ళతోనే రోజులు గడిచిపోతుంటే శేఖర్ కంపెనీలు మారినా జాబ్ ఒకటే కనుక ఎప్పటిలా సెలవు ఇచ్చినపుడు వచ్చి వెడుతున్నాడు. 


 పిల్లలు హైస్కూల్ చదువుకి వచ్చేరు. దీపకి టీవీ, బుక్స్, సినిమాలు, టైంపాస్ అయ్యాయి. ఒకరోజు మూవీ థియేటర్లో హఠాత్తుగా కనిపించాడు మధుకర్!


మధు శేఖరుకి బంధువు. పెళ్లి చూపులకు శేఖర్తో బాటు వచ్చాడు. బ్యాంకు ఆఫీసర్గా గుంటూరులో పనిచేసేవాడు.. ఆతర్వాత పెళ్ళికి వచ్చాడు. అప్పుడప్పుడు బంధువుల ఇళ్లలో శుభకార్యాలకు కలియడం జరిగేది. 


అతడికి పెళ్లి జరిగినా, భార్య సునంద లెక్చరర్ గా పనిచేయడం వలన ఇద్దరూ ఓకే వూళ్ళో వుండే అవకాశం ఎప్పుడూ రాలేదు. అతను కూడా శేఖరులాగే సెలవులకు సునంద వున్న వూరు వెళ్లడమో, ఆమె మధు వున్న చోటుకి రావడమో జరిగేది. 


 ఇలా చెరొక చోట వుండే భార్యా భర్తలు దాంపత్య జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించే అవకాశం లేకుండా పోయినది. ఉద్యోగాన్ని వచ్చే డబ్బును వదులుకోలేదు.. కానీ.. సంతోషాలను వదులుకున్నారు. డబ్బు మహిమ అది !


మధుకర్ పూల మధువును గ్రోలే భ్రమరం లాంటి స్వభావం గలవాడు. పేరు అతడికి సరిగ్గా సరిపోతుంది. ఏవూళ్లో ఉంటే అక్కడో మగువతో ఎంజాయ్ చేసేవాడు. తెలిసి, సునంద గొడవపడేది. అలా అని జాబుని వదులుకోదు. ఇప్పుడు వైజాగ్ వచ్చాడు. 


దీప సాన్నిహిత్యం లభించింది. ఒంటరిగా పిల్లలతో ఇబ్బందులు పడుతోంది. సహాయంగా వుంటాను అనుకున్నాడు. శేఖర్ గురించి పూర్తిగా తెలుసును. 


అతను అమాయకుడు. మధుకర్ వైజాగ్ రావడం నా కుటుంబానికి అండ, నాకు నిశ్చింత.. అని సంతోషించాడు. అంతేకానీ నాకూ దీపకి మధ్య బంధం సడలిపోతుందని

గ్రహించలేదు. 


అలాగే వాళ్ళ ముగ్గురి జీవితాలు గడిచి పోతున్నాయి. 

అటు సునంద, ఇటు శేఖర్ ఇద్దరూ నష్టపోయారు. ఈ విషయాన్ని సునంద త్వరలోనే గ్రహించింది. మధు బుద్ధి తెలుసుకుంది. 


 శేఖర్ చాలా ఆలస్యంగా గ్రహించాడు. ఐనా దీపని నిలదీయలేదు. మధుని రావద్దని చెప్పలేదు. 

దీపను మందలించి పరువును పోగొట్టుకోలేడు. అందుకే తెలియనట్టు దూరంగా ఉండటం మొదలుపెట్టేడు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడిక గొడవ పడితే వాళ్ళు కూడా దూరం అవుతారు. 


విడాకులు తీసుకుంటే డబ్బూ పోతుంది. '' ఇక ఇంతే నా జీవితం'' అనుకుని మవునంగా భరించాడు. మూడు నెలలు సెలవులు ఇచ్చినా ఒకనెల మాత్రమే ఉండి వెళ్లిపోయేవాడు. 


 శేఖర్ బంధువే కాబట్టి అతను వున్నా వస్తూనే వున్నాడు మధు. అప్పుడు భోజనం, సినిమాలు, జాలీ ట్రిప్పులు.. అన్ని శేఖర్ కుటుంబంతోనే !


 శేఖర్ వచ్చినా అతడితో పరాయివాడు వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది. ఎప్పుడూ హెల్త్ బాగాలేదు అంటూ డాక్టర్స్ చుట్టూ తిరుగుతుంది. మూడేళ్లు ఇలా గడిచింది. 

మధుకర్ రిటైర్ అయ్యాక సునంద వుండే వూరిలో స్థిరపడక తప్పలేదు. 


అలాగే శేఖర్ కూడా రిటైర్ అయి వైజాగ్ వచ్చేసాడు. పిల్లలు ఉద్యోగాలకు బెంగుళూర్ వెళ్లారు. 


 వాళ్లకి నచ్చిన అమ్మాయిలను అమ్మ నాన్నలకు చెప్పకుండా లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి రావడంలేదు. ఈ కబురు తెలిసిన దీపకి హార్ట్ అట్టాక్ వచ్చింది. ఆరోగ్యం పాడైంది. కేన్సర్ అన్నారు. కొడుకులు ఇద్దరూ చూసి వెళ్లారు. 'ఇకరాలెం. వెరీ బిజీ ' అన్నారు. 


 బంధువులు 'అలా అనకూడదు. అమ్మ నాన్న పెద్దవాళ్ళు అయ్యారు. కనిపెట్టి ఉండాల్సిన బాధ్యత మీదే’ అంటె.. ‘మా అమ్మ మాకేమి చేసింది? కొడుకులా పట్టించుకుందా? లేదు. ఎప్పుడూ హోటల్ భోజనమే. నాన్నగారిని కూడా పట్టించుకోలేదు. మేము ఎందుకు పట్టించుకోవాలి?’ అన్నారు కోపంతో. 


అంతకంటే తల్లిని గురించి పబ్లిక్కుగా బైటికి చెప్పలేక. వాళ్లకి తెలుసును. మధు అంకుల్, అమ్మ.. మధ్య వుండే సంబంధం.. తండ్రి అమాయకత్వం వాళ్లకు కోపం తెప్పించేది. అమ్మని నాన్న ఎందుకు కోపగించడు.. ఎందుకు ఇంత సహనంగా ఉంటాడు.. అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండటం, దీపని ఎదిరించి మాటాడటం మొదలుపెట్టారు. ఏనాడూ ఇంటి భోజనం తినలేదు. దీపకు వంట చేయడం బద్ధకం.. ఫుడ్ ఆన్లైన్ ఆర్డర్ చేసేది. లేదంటే హోటల్స్కి వెళ్లి తినమనేది. 


ఆలా పెరిగినవాళ్లకు దీప అంటె అస్సలు ప్రేమలేదు.. శేఖర్ ఎప్పుడూ షోర్ మీదనే ఉండేవాడు. 


ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు అతనితో గడిపినదె తక్కువ. ‘డబ్బు ఇచ్చేసి బాగా పెంచుతున్నా, వాళ్లకి లోటులేదు’ అనుకునేది. డబ్బుతో ప్రేమ కొనలేనని తెలుసుకోలేదు. 

 శేఖర్ ఇక దీపకి సేవలు చేయలేక రీహాబిటేషన్ సెంటర్లో చేరిపించాడు. ఓపిక వున్నప్పుడు వెళ్లి చూసొస్తాడు.. 


‘నేను డబ్బు సంపాదించాను. జీవితాన్ని పోగొట్టుకున్నాను. తప్పు నాదే! ఆవుద్యోగం మానుకుని వేరే జాబ్ చేయవలసింది. నా కుటుంబానికి అన్ని ఇచ్చాను అనుకున్నాను. వాళ్లకు నేను అక్కరలేకుండా పోయాను’ అనుకున్నాడు. 


 దీప ఇప్పుడు విచారిస్తోంది. అందరూ ఉండి ఎవరూ లేనట్టు అయ్యానని కుమిలిపోతోంది. 


కొడుకుల ప్రేమకు దూరమై బాధ పడుతోంది. శేఖరుకి తీరని ద్రోహం చేసానే అని దుఃఖ పడుతోంది. 


అనారోగ్యం పట్టి పీడిస్తోంది. ‘మధు, సునందాలు హాపీగా వున్నారు. నష్టపొయిన్ది నేనే’ అని తెలుసుకుంది. 

స్కూల్ల్లో కాలేజీలో అందరూ ‘నువ్వు చాలా అందంగా ఉంటావ్..’ అనేవారు.. దీపని. తల్లి తండ్రి దూరంగా ఉండటం వలన స్వేచ్ఛగా స్నేహితులతో గడిపేసేది. అమ్మమ్మకి ఆస్నేహితులు మగవారని తెలియదు. ఇల్లు తప్ప ఏమి తెలియదు ఆవిడకు. 


పెళ్లి చూపులకు శేఖర్తో బాటు వచ్చిన మధు చాలా అందగాడు. ఆరోజే అతను దీపను ఆకర్షించాడు. 

‘నేను అతడిని చేసుకుంటాను’ అని అమ్మమ్మతో చెప్పింది. ఆవిడ చీవాట్లు పెట్టింది. 


''నీకు మతిపోయినదా? శేఖరుకి నెలకి అయిదు లక్షలు జీతం. మధుకి పాతికవేలు. మనిషి బాగుంటే చాలా! సంపాదన ముఖ్యం. శేఖర్ నే ఒప్పుకో.. అని నచ్చచెప్పింది. 

దీపకి నేను నచ్చాను. శేఖర్ కాదు.. అని ఆనాడే గ్రహించిన మధు చాలా సులువుగా ఆమెను లొంగదీసుకున్నాడు. 

ఆతర్వాత శేఖర్ లేకపోడం మధు తన అవకాశాన్ని వినియోగించుకోడం జరిగిపోయాయి. 


నీ అందం వయసు వృధా చేసుకోకు. అని పొగిడి లొంగదీసుకుని తన అవసరం గడుపుకున్నాడు మధు. తప్పు ఎవరిదీ అంటె ముగ్గురిదీ! 


'ఎదుటివారిని లొంగదీసుకునే చాతుర్యం మధుది. సులువుగా పడిపోయే బలహీనత దీపది. ఎదుటివారిని కనిపెట్టలేని అమాయకత్వం శేఖర్ ది. '


అందుకే ఇద్దరూ భార్యా భర్తలుగా సుఖపడలేక నష్టపోయారు. శారీరక సుఖాలు, అందం శాశ్వతం కాదు. అందమైన జీవితం, కుటుంబంలో సుఖ శాంతులు నిలబెట్టుకోలేని మనుషులు, చివరికి ఒంటరిగా మిగిలిపోతారు. అదీ అనారోగ్యం కూడా ఉంటే, ఇక నరకమే! అనైతిక సంబంధాలు, అవసరం గడుపుకునే తాత్కాలిక ఆకర్షణలు! అవి జీవితాలను ఛిద్రం చేస్తాయి. 


 ప్రేమ, అనురాగం, ఒక బంధం, బాధ్యత, ఏర్పడేది.. కట్టుబాటు వున్నప్పుడే. ఎండమావులవంటి ఆకర్షణ జీవితాన్ని కూలదోస్తుంది. ఈ విషయం గ్రహించేసరికి ఏదీ మిగలదు.  

ఇప్పుడు ఏం లాభం! పోగొట్టుకున్నది తిరిగిరాదు. 


సమాప్తం. 

***************************************************************************


ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ


నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)





63 views0 comments

Comments


bottom of page