చూడు! చూడు! కలువలు
- Gadwala Somanna
- 5 hours ago
- 2 min read
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ChuduChuduKaluvalu, #చూడుచూడుకలువలు, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 61
Chudu Chudu Kaluvalu - Somanna Gari Kavithalu Part 61 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 19/04/2025
చూడు చూడు కలువలు - సోమన్న గారి కవితలు పార్ట్ 61 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
చూడు! చూడు! కలువలు
----------------------------------------
అందమైన కలువలు
చెరువులోని కలువలు
అమ్మకు ఇష్టమైన
అలరించే కలువలు
నీటిపై హాయిగా
పవళించే కలువలు
విరిసిన ముఖంతోన
కన్పించు గొప్పగా
నీటిలోన స్థానము
అనునిత్యం స్నానము
చేయునట్టి కలువలు
నేర్పునోయి విలువలు
కొలనుకు సోయగాలు
తెచ్చునట్టి కలువలు
చిరు గాలి వీచగా
సంతసించు కలువలు

మా ఊరి సెలయేరు
----------------------------------------
మా ఊరి ప్రక్కనే
ఉందొక సెలయేరు
చూడగా అబ్బురము
దానికుందోయ్!జోరు
ఉరుకులు పరుగులతో
తనదైన నాట్యంతో
కనువిందు చేస్తుంది
అందచందాలతో
దాహం తీర్చుస్తుంది
పొలములు తడుపుతుంది
ఉపయోగం సెలయేరు
జన హితమే అది కోరు
మాకెంతో ఇష్టము
మా ఊరి సెలయేరు
మురిపించును హృదయము
మా సంపద సెలయేరు

పుస్తక నేస్తం!
----------------------------------------
అక్షరాలు నేర్చుకో
పుస్తకాలు చదువుకో
తలరాతలు మార్చుకొని
జీవితాన్ని మలచుకో!
నిన్ను నీవు చూసుకో
లోపాలను దిద్దుకో
మెరుగైన సేవలతో
గుండెల్లో నిలిచిపో
వ్యక్తిత్వం పెంచుకో
పదిమందికి పంచుకో
సద్గుణాలతో మహిని
చుక్కలాగ వెలిగిపో
విలువైనది పుస్తకము
వెలిగించును మస్తకము
మనసారగ నమ్మితే
చక్కబడును జీవితము
పుస్తకం నిజ నేస్తము
తలపెట్టదోయ్! ద్రోహము
మిత్రునిలా చేరదీసి
పంచును ప్రేమాతృతము

మా అమ్మ
----------------------------------------
మా అమ్మ బంగారము
ఇంటికే సింగారము
అగునోయ్! అంధకారము
ఆమె లేక కుటుంబము
మా అమ్మ మహోన్నతము
మా బ్రతుకుల్లో దీపము
సేవల్లో తొలి స్థానము
ప్రేమల్లో ఘన శిఖరము
మా అమ్మ మనసు మృదువు
చల్లదనానికి నెలవు
ఆమెను గనుక పూజిస్తే
దీవెనలెన్నో కలవు
మా అమ్మ ప్రేమసీమ
ఆమె ఉన్న స్వర్గసీమ
భగవంతుని బహుమానము
సదనానికి కడు అందము
అమ్మ యొక్క గొప్పదనము
వర్ణింపనెవరి తరము!
అనురాగ దేవత అమ్మ
అసమానము త్యాగగుణము

త్యాగమే శ్రేష్ఠము
----------------------------------------
మహనీయుల త్యాగము
మహిలో మహోదయము
సత్ఫలితాలిచ్చునది
కాదు కాదు వ్యర్థము
కన్నవారి త్యాగము
మరవరాదు నేస్తము!
మిన్న అది సృష్టిలో
స్మరించుకో మదిలో
త్యాగంలో ఉన్నది
ప్రేమగుణము అమితము
లోకంలో మిన్నది
అన్నింటా శ్రేష్టము
త్యాగానికి అర్థము
ఉంటుందోయ్! తప్పక
ఉండాలోయ్! ధైర్యము
అవడానికి త్యాగము
త్యాగానికి స్వార్థము
ఉండదు ఏమాత్రము
ఏవీ సాటి రావు
దానికి సమము లేవు
మంచిదే ఉద్దేశము
సాఫల్యం కార్యము
జీవితాన త్యాగము
చాటితే అమోఘము
త్యాగమయులు మాన్యులు
సదా పూజనీయులు
వారి చూపు బాటలో
సాగాలి జగతిలో
ఎందరో త్యాగధనులు
అందరికి వందనాలు
ఇల చిరస్మరనీయులు
అక్షరాల హారతులు
-గద్వాల సోమన్న
Comments