top of page

చుక్కల్లో చంద్రుడు

Writer's picture: Gadwala SomannaGadwala Somanna

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ChukkalloChandrudu, #చుక్కల్లోచంద్రుడు, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 17

Chukkallo Chandrudu - Somanna Gari Kavithalu Part 17 - New Telugu Poems Written By - Gadwala Somanna Published In manatelugukathalu.com On 06/02/2025

చుక్కల్లో చంద్రుడు - సోమన్న గారి కవితలు పార్ట్ 17 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


చుక్కల్లో చంద్రుడు


చక్రవర్తి చుక్కలకు

చెలికాడే కలువలకు

నింగిలోని చంద్రుడు

కారకుడే వెన్నెలకు


రాత్రిపూట వస్తాడు

కనువిందే చేస్తాడు

పౌర్ణమి రాత్రుల్లో

నిండుగా కన్పిస్తాడు


రాత్రిని ఏలు రారాజు

ముద్దొచ్చును రోజురోజు

చీకటిలో అందగాడు

చల్లదనం ఉన్నవాడు


మేఘాల్లో దాగువాడు

దోబూచులాడుతాడు

పున్నమి వేళల్లో

వెన్నెల కురిపిస్తాడు


చుక్కల్లో చంద్రుడు

గగనంలో ఇంద్రుడు

అమ్మ బొజ్జ నింపు వేళ

చందమామ అవుతాడు


మేలులెన్నో చేస్తాడు

చల్లగా చూస్తాడు

నెలవంక గా మారేను

అందరికీ ఇష్టము


















భక్తి మార్గం శ్రేష్టము

----------------------------------------

వినసొంపే సుప్రభాతాలు

మదిని దోచు భక్తి గీతాలు

ఆధ్యాత్మిక జగత్తులో

దైవార్చన విధానాలు


దైవాన్ని కొనియాడు నాలుకలు

ధ్యానించే ఆ అధరాలు

బహు ధన్యమే పరికింపగ

భగవంతుని నిలయ హృదయాలు


వింటే ఆధ్యాత్మిక సంగతులు

కడుగుకుంటే మది మలినాలు

మానవ జన్మ కడు సార్థకము

వందకు వంద శాతం నిజము


తెలుసుకొనుము భక్తి మార్గాలు

నేర్చుకొనుము జీవిత సత్యాలు

భక్తి పారవశ్యంలో మునిగిన

సుసంపన్నమే జీవితాలు
















పూజ్యులు "కన్నవారు"

----------------------------------------

కన్నవారు లోకంలో

కనిపించే ఇలవేల్పులు

వారుంటే సదనంలో

ఉన్నట్టే నాకంలో


కరిగి వెలుగు క్రొవ్వొత్తిలా

తొలి స్థానం త్యాగంలో

కాపాడే కనురెప్పలా

తల్లిదండ్రులు విశ్వంలో


కనిపెంచే ప్రేమామయులు

భువిలో అమ్మానాన్నలు

గుడి కట్టాలోయ్! మనసున

ఇల కొలవాలోయ్! గృహమున


వారి ప్రేమ బహు గొప్పది

తెలుసుకున్న మరి మంచిది

గౌరవిస్తే దీవెనలు

లేకున్నచో వేదనలు















ఉపయోగపడాలి!

----------------------------------------

కురియాలి నవ్వులా

విరియాలి పువ్వులా

నలుగురికి సాయపడి

వెలగాలి దివ్వెలా


మ్రోగాలి మువ్వలా

మారాలి బువ్వలా

చింత వీడి హాయిగా

ఎగరాలి గువ్వలా


ఉండాలి తావిలా

కావాలి తావులా

పదిమందికి మనమే

అవ్వాలి అమ్మలా


నీరున్న చెరువులా

జ్ఞానమిచ్చు గురువులా

సార్థకమవ్వాలోయ్!

ఫలాలిచ్చు తరువులా


పనికొచ్చే కుంచెలా

చేనుకున్న కంచెలా

ఉపయోగపడాలోయ్!

అందరికి మనమిలా















అక్షరాలు సత్యాలు-ఆణిముత్యాలు

----------------------------------------

మూర్ఖులతో సహవాసము

వారితో వాగ్వివాదము

మిగిలేది జీవితంలో

కఠినమైన వనవాసము


వదరుబోతు మాటలలో

ఉండదోయి! గట్టిదనము

పిరికి వారి మనసులలో

పండదోయి! ధైర్యగుణము


నీతి లేని వారిలో

ఖ్యాతి ఎండమావి సమము

చమురు లేని దివ్వెలో

వెలుగులిక గగనకుసుమము


ఆకులు రాలిన చెట్టులో

అగుపించదిక అందము

గాయపడిన గుండెలో

ఆనందము మటుమాయము











పసివారు వేల్పులు

---------------------------------------

పాలలాంటి ప్రాయము

పూలలాంటి స్వభావము

చిన్నారులకున్నది

వెన్నలాంటి హృదయము


పల్లెసీమ అందము

వల్లి వంటి బంధము

పిల్లలలో ఉన్నది

మల్లెలాంటి పరిమళము


మితిమీరిన ద్వేషము

లేదు మదిని దోషము

బాలలలో ఉన్నది

పవిత్రమైన స్నేహము


ఉందోయ్! మంచితనము

లేదోయ్! చెడ్డ గుణము

పసి పిల్లలు దూతలు

ప్రేమ పంచు దాతలు


ఉండు నోట సత్యము

పలుకుతారు నిత్యము

వారుంటే కళకళ

తారల్లా మిలమిల


ప్రవహించే యేరులు

విహరించే ఖగములు

చిన్నారులు వేల్పులు

ఉదయించే భానులు









చదువే ముఖ్యము

---------------------------------------

చదువెంతో ముఖ్యము

పంచునెంతో హాయి

చేస్తుంది జీవితము

పండు వెన్నెల రేయి


చదువిచ్చును సౌఖ్యము

ప్రసాదించు భాగ్యము

తరుమును అజ్ఞానము

పెంచును విజ్ఞానము


మార్చునోయ్! తలరాత

చదువుకో! అంచేత

చదువుకుంది ఘన పాత్ర

సృష్టించును చరిత్ర


శక్తి ఉన్నది చదువు

విజ్ఞానానికి నెలవు

చదువుకుంటే మాత్రము

మేలులెన్నో కలవు


అందరూ చదవాలి

బ్రతుకులో గెలవాలి

విజ్ఞానవంతులై

దేశ ఘనత నిలపాలి


చదువు మూల బిందువు

అందరికీ బంధువు

విజ్ఞానపు సింధువు

మిత్రమా! ఏమందువు!


















జాగరుకత అవసరము

---------------------------------------

మానితే కలహాలు

మనశ్శాంతి దొరుకుతుంది

వీడితే వ్యసనాలు

బాగుపడును కుటుంబాలు


తరిమితే బేధాలు

హైయిగుండు జీవితాలు

ఆదిలోనే త్రుంచితే

చాలు వితండవాదాలు


ముదిరితే వివాదాలు

బంధాలకు విఘాతము

అభివృద్ధికవరోధాలు

కావున ఉండుము దూరము


గుండెలోని భారాలు

దించుకుంటే క్షేమము

పెంచుకుంటే దూరాలు

దెబ్బతినును స్నేహాలు












తల్లి సుద్దులు-- దిద్దు బుద్ధులు

---------------------------------------

కొన్నిసార్లు ముఖ్యము

జీవితాన మౌనము

ప్రతిదినము అవసరము

విలువైనది ధ్యానము


బుసలుగొట్టు సర్పము

అవధి లేని కోపము

ఆదిలో అణచితే

అమితమైన క్షేమము


శ్రేష్టమైన శాంతము

బ్రతుకులోన స్వర్గము

సృష్టించుకో! మదిని

అవుతుందోయ్! దుర్గము


భ్రమరమే మన మనసు

అది అందరికి తెలుసు

అదుపులోన పెడితే

అగునోయ్! పసిడి గొలుసు














అందరి బాధ్యత

---------------------------------------

కోపతాపాలు సహజము

ఉంచకోరాదు సతతము

తెలుసుకో! ఈ సత్యము

సరిచేసుకో! జీవితము


అంధకారమే గర్వము

హద్దు దాటితే పతనము

ముమ్మాటికీ నిక్కమే!

వదులుకొనుట అగత్యమే!


రాగద్వేషాలు విడుచుట

ప్రేమానురాగాలు చూపుట

మానవ జీవితాన ముఖ్యము

కలసిమెలసి జీవించుట


విశ్వశాంతి కోరుకొనుట

దేశభకి కల్గియుండుట

అందరికుందోయ్! బాధ్యత

దేశకీర్తి నిలబెట్టుట


-గద్వాల సోమన్న


14 views0 comments

Comments


bottom of page