#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #చూపులుకలసినశుభవేళ, #ChupuluKalasinaSubhavela, #TeluguKathalu, #తెలుగుకథలు

Chupulu Kalasina Subhavela - New Telugu Story Written By Neeraja Hari Prabhala Published In manatelugukathalu.com On 21/02/2025
చూపులు కలసిన శుభవేళ - తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
అప్పుడే ఒక కధ వ్రాసి కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నది పావని. ఫోన్ రింగవడంతో తృళ్లిపడి వెంటనే లిఫ్టు చేసి “హలో!” అంది.
“హలో! నమస్కారం. మీరు ప్రముఖ రచయిత్రి శ్రీమతి పావని గారేనా మాట్లాడుతున్నది?” అవతలనుంచి ఒక మహిళ స్వరం వినపడుతోంది.
“అవును. నేనే!” అంది పావని.
మేడమ్! మేము ‘స్తీశక్తి’ సంస్థ నుంచి ఫోన్ చేస్తున్నాము. నా పేరు విమల. నేను మీ గురించి, మీ రచనల గురించి చాలా విన్నాము. మా సంస్థ వార్షికోత్సవం సందర్భంగా మీ ఆర్టికల్ కావాలి. మీకభ్యంతరం లేకపోతే మీ జీవితంలో ఏదైనా సంఘటన గురించి గాని, లేదా ఏదైనా మీ దృష్టికి వచ్చిన సంఘటనైనా సరే మీరు చెపితే దానిని మేము మా సంస్థ వార్షికోత్సవం సావనీర్ లో ప్రచురిస్తాము. దయచేసి మీరు మాకోసం కాస్త సమయం వెచ్చిస్తే మేము చాలా ధన్యులం. ప్రముఖ రచయిత్రి అయిన మీరిచ్చిన ఆర్టికల్ మా సంస్థకు హైలైట్ అవుతుంది. మీరనుమతిస్తే నేను మీ ఇంటికి వచ్చి కలుస్తాను. ప్లీజ్ మేడమ్” అంది అభ్యర్థనగా విమల.
“ సరే! సాయంత్రం 5గం.. లకు రండి. ” అని తన ఇంటి అడ్రసు చెప్పి ఫోన్ పెట్టేసి తన పనులలో మునిగిపోయింది పావని.
సాయంత్రం 5గం.. కాగానే పావని ఇంటికి వెళ్లింది విమల. కాలింగ్ బెల్ వినగానే పావని తలుపు తీసి ఆమెని ఆహ్వానించింది. నవ్వుతూ నమస్కరించి ఆమెని లోపలకి ఆహ్వానించింది పావని. తనని తాను పరిచయం చేసుకుని పావని చూపిన సీటులో ఆశీనురాలైంది విమల. చక్కగా నవ్వుతూ పలకరించిన పావని మాటతీరుకు, ఆమె సింప్లిసిటీకి, వేషధారణకు చాలా ముగ్ధురాలైంది విమల.
తను గూడా కూర్చొని పనిమనుషి రంగిని పిలిచి టీ, బిస్కెట్లు తీసుకుని రమ్మంది పావని. కాసేపటికి రంగి తెచ్చివ్వగా వాటిని విమలకు మర్యాద పూర్వకంగా అందించింది పావని.
టీత్రాగుతూ విమల ఆ హాలుని పరిశీలనగా చూసి ఆశ్చర్య చకితురాలైంది. ఎన్నో అవార్డులు, సన్మానాల ఫొటోలు, ఆవిడ వ్రాసిన పుస్తకాలు షోకేసులలో అలరిస్తున్నాయి. వాటిని చూడగానే ఇంత గొప్పవ్యక్తితో తాను మాట్లాడబోతున్నందుకు చాలా సంతోషం వేసింది విమలకు.
ఇంక మొదలు పెడదామన్నట్టుగా పావని చిన్నగా దగ్గింది.
విమల పెన్ను, పుస్తకం తీసుకుని వ్రాసుకోవడం మొదలుపెట్టింది.
“చూడండి విమలా! ‘చూపులు కలసిన శుభవేళ’ అనే శీర్షికన మీరు ఈ ఆర్టికల్ వ్రాయండి. ” అంది పావని.
“సరే! మేడమ్. ” అంది విమల.
అందరికీ పెళ్లి చూపులు, వివాహము అనేది జీవితంలో మరపురాని మధురమైన ఘట్టాలు. కానీ నా జీవితంలో అవి రెండూ యాధృఛ్ఛికం.
పెళ్లి చూపులంటే వరుడు వధువుల చూపులు కలవడం. ఒకరినొకరు చూసుకోవడం. నిజం చెప్పాలంటే అసలు మాకు పెళ్లి చూపులు లేవు. అగ్నిని కూడా నీటితో కడిగే వంశం అయిన మా ఆత్తవారింట వరుడు వధువుని చూసే అలవాటు లేదుట. అందుకని మాకు పెళ్లి చూపులు లేవు. కానీ వరుడు రాకుండా, లేకుండా నా పెళ్లి చూపులు జరిగాయి.
అగ్రహారమైన మా ఊరిలో మా నాన్నగారు ఆ ఊరి ప్రెసిడెంట్, పోస్ట్ మాస్టర్. వ్యవసాయదారుడు. అందరిలో ఆఖరుపిల్లని నేను. మా అక్కలు, అన్నల పెళ్లిళ్లు అయ్యాయి. అక్కల పిల్లలు, నేను ఒక వయస్సు వాళ్లము. నాకు పదిహేను సం.. వయస్సు నిండగానే పెళ్లిచేయ తలపెట్టి ఎవరో తెలిసినవాళ్ల ద్వారా ఈ సంబంధం వచ్చింది. అంతవరకూ నాకోసం ఏ సంబంంధాన్ని కనీసం వెతికేప్రయత్నం కూడా చేయలేదు నాన్నగారు. ఊహతెలిసినప్పటి నుంచి నాకు చదువంటే మహా ప్రాణం. నేను బాగా చదివి మంచి డాక్టరుగా బీదలకు ఉచితంగా అందరికీ సేవచేయాలని ఎన్నెన్నో ఆశలు, ఆశయాలు.. బాగా కుగ్రామమైన మా ఊరిలో ఏ వైద్య సదుపాయం లేక నా కళ్లముందే ఎందరో తనువు చాలించడం నేను కళ్లారా చూశాను. చాలా వ్యధచెందాను. అందుకే మంచి వైద్యురాలినయ్యి అందరికీ సేవచేయాలనేది నా ధృఢ సంకల్పం. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలిచింది అన్నట్లుగా విధిరాతని ఎవరూ ఎదురించలేరు అనే దానికి నేనే నిదర్శనం.
"నాకు పెళ్లి వద్దు నాన్నా!. నేను కష్టపడి బాగా చదువుకుని మంచి డాక్టరునై అందరికి ఉచితంగా వైద్యసేవ చేస్తాను" అని ధైర్యంగా నాన్న వద్దకు వెళ్లి చెప్పాను. అప్పటికే అమ్మా, నాన్నలు 60ఏళ్ల వయసు పైబడినవారు. "మనది మధ్యతరగతి కుటుంబం. నిన్ను అంత చదువు చదివించి ఆ తర్వాత కట్నాలిచ్చి లక్షలు ఖర్చుపెట్టి పెళ్ళి చేసే స్తోమత మాకు లేదు. ఈ సంబంధం చేసి మా బాధ్యత తీర్చుకుంటాము. మేము ఒడ్డెక్కుతాము". అన్న అమ్మానాన్నల మాటలకి ఎదురు చెప్పలేక నా ఆశలు, ఆశయాలను మనసులోనే చంపేసుకుని ఈ పెళ్లికి తలొంచాను.
ఈ సంబంధం చెప్పిన తెలిసిన మనిషి ద్వారా (జాతకాల పట్టింపు బాగా ఉన్న) మా అత్తవారింట్లో నా ఫొటోని, జాతకాన్ని పంపారు నాన్నగారు. నా ఫొటో, మా కుటుంబ సంప్రదాయాలు వాళ్లకు నచ్చి వాళ్లు నా జాతకాన్ని పండితులకు చూపిస్తే జాతకాలు బాగా కలిశాయన్నారుట. మా వాళ్లు ఆయన జాతకాన్ని అడగనూలేదు. వాళ్లు ఇవ్వనూలేదు. "మాకు పిల్ల ఫొటో, జాతకాలు నచ్చాయి. మేము వచ్చి పిల్లను చూస్తాము. కానీ ఆ పల్లెటూరు మాత్రం మేము రాము, ఇంకెక్కడైనా ఏర్పాట్లు చేయండి" అని అత్తగారి కబురందగానే అమ్మానాన్నలకు చాలా కంగారేసింది. మా అత్తగారిల్లు విజయవాడే. మా పుట్టిల్లు తెనాలి దగ్గర పిడపర్రు గ్రామం.
"సరే" అని నాన్న తెనాలిలో మా మేనత్త కూతురింట్లో పెళ్లిచూపులను ఏర్పటుచేసి వాళ్లను ఆహ్వానించారు. ఆరోజున నన్ను చూసేందుకు మా అత్తారింటినుంచి 32 మంది వచ్చారు. అంతమందికీ మర్యాదలు, ఫలహారాలు, కాఫీలు, టీలు అమ్మా, నాన్న ఏర్పాట్లు చేశారు. వాటినన్నిటినీ అందరూ ఆరగించినాక నాకు పట్టుచీరకట్టి కూర్చోబెట్టారు. పదిహేనేళ్ల పిల్లని నేను. చచ్చే సిగ్గు, భయభక్తులు ఎక్కువ.
అంతమందిలో తడబడే అడుగులతో సిగ్గు, భయంతో నేను కూర్చోగానే ఇంటర్వూ మొదలైంది. అత్తగారు, పినమామగార్లు, పినత్తగార్లు రకరకాల ప్రశ్నలు. అన్నిటికీ ఓర్పుగా సమాధానాలనిచ్చాను. పాటలు పాడమన్నారు. సంగీతం అంటే ప్రాణం కనుక భయం వదిలేసి చక్కగా పాడాను. స్వరం బాగుంది, చక్కగా పాడుతున్నావు. ఇంకా ఇంకా పాడమంటే 5 పాటలను పాడాను. లేచి నడువమన్నారు. అటునుంచి ఇటు, ఇటునుంచి అటు చీరకుచ్చెళ్లు కాలికి అడ్డుపడుతుంటే తలొంచుకునే నెమ్మదిగా నడిచాను. పిల్ల నడక బాగుంది. మాటామంచీ చూశాము పిల్ల నిదానస్తురాలే అనే కితాబు వినిపించింది.
తరువాత వంటా, వార్పులను గురించి వివిధరకాలైన ప్రశ్నలు. ఆడపిల్లకు చిన్నప్పటి నుంచి ఇంటిపనీ, వంటపనీ నేర్చుకోవడం అవసరం అని అమ్మ నాకు నేర్పారు. కనుక వాళ్లడిగిన వివిధ వంటకాలలో ఏవేవి ఎన్నిపాళ్లు కలపాలో, ఎలా చేయాలో అన్నీ చక్కగా వివరించాను. అందరూ సంతృప్తి చెందారు.
కుట్లు, అల్లికలను గురించి నా తోడికోడళ్లు ముగ్గురు అడిగితే వాటిల్లో నైపుణ్యం ఉన్న దాన్ని కనుక చెప్పాను. ఇంతలో అమ్మ నేను చేసిన క్రోషియా వైరు బుట్టలు, పూసలతో డోర్ కర్టెన్లు, పూలసజ్జలు, ఫ్లవర్ వాజులు, పర్సులు, ఊలుతో చేసిన స్వెట్టర్లను అన్నిటినీ చూపించింది. అప్పడవన్నీ దాదాపు వివిధరకాలైన 150కి పైగానే వస్తువులు. చాలా కళాత్మకంగా ఉన్న వాటినన్నిటినీ చూసి ఆశ్చర్యపోయారందరూ.
ఇంతలో 50సం.. వయస్సున్న వరుసకు తోడకోడళ్లైన ఇద్దరు ఆడవాళ్లు వచ్చి నా ప్రక్కన కూర్చుని చనువుగా నా తలమీద చేతితో సుడి ఏమన్నా ఉందేమో అని చూస్తున్నామన్నారు. సుడి ఉన్న ఆడపిల్లవని పెళ్లిచేసుకోరుట. అదృష్టవశాత్తూ నాకు సుడిలేదు. సంతృప్తి చెందారు. లోపలికి వెళ్లి అందరికీ కాఫీలు. నన్ను తయారు చేసుకురమ్మన్నారు.
అమ్మ నాకు సాయంగా కూడా లేవబోతుంటే "మీరు కూర్చోండి. ఆ పిల్ల తెస్తుంది" అన్న అత్తగారి ఆర్డరుతో అమ్మ ఏమనలేక మౌనంగా కూర్చుంది. అంతమంది మధ్య నుంచి నేను లోపలికి వెళ్లి అందరికీ కాఫీలు తయారుచేసి తీసుకొచ్చాను. 'నీవే అందరికీ ఇవ్వాలి' అని పినత్తగారి ఆర్డరు. సరే అనుకుని అందరికీ ఇచ్చొచ్చాను. కాసేపటికి వాళ్లు మేము ఇంటికి వెళ్లి కబురు చేస్తామని చెప్పి వెళ్లారు.
అమ్మానాన్నలు "హమ్మయ్య" అని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ మా వారు అందులో లేరు. ఆ మరుసటి రోజు నేను అమ్మానాన్నలతో మా ఊరు వచ్చేశాము. మరలా వారానికి మా అత్తారింటినుంచి కబురు. "మాకు పిల్లనచ్చింది. మాది ఉమ్మడి కుటుంబం కనుక ఈసారి ఇంకా చూడని మా కుటుంబాలలోని వాళ్లు వివిధప్రాంతాలనుంచి వస్తారు. చూపులేర్పాటు చేయండి" అని వాళ్లు వచ్చిచూసే తేదీని కూడా చెప్పారు.
మరలా మా నాన్న హడావుడి. మేము ముగ్గురం మా మేనత్తకూతురింటికి తెనాలి వచ్చాము. ఆ మరురోజు మా అత్తారింటినుంచి చూపులకు వచ్చారు. ఈసారి 37 మంది వచ్చారు. అందులో కూడా మా వారు లేరు. మరలా క్రితం సారి లాగానే కాఫీలు, ఫలహారాల మర్యాదలు మావాళ్లు చేశాక ఇంకా వైరైటీ ఇంటర్వ్యూలు మొదలైంది. ఓర్పు, సహనం ఆభరణాలైన నేను అన్నింటికీ సమాధానాలిచ్చాను. వాళ్ళు క్రితంసారిలాగానే ఇంటికెళ్లి ఏసంగతీ చెబుతామని చెప్పారు. అక్కడే చెపితే వాళ్ల ప్రిస్టేజీ పోతుందని పెళ్లైన తర్వాత వాళ్ల మాటలలోనే మావాళ్లకు తెలిసింది.
ఆతర్వాత పదిరోజులకు మాటలకు రమ్మని వాళ్ల నుండి కబురందితే నాన్న, ఇంకో బంధువుని వెంటబెట్టుకొని వెళ్లారు. కట్నకానుకలు, పెట్టుపోతలు మాటలయ్యాక అపుడు అల్లుడిని చూశారుట నాన్న. వచ్చేవారం తాంబూలాలు అన్నారు వాళ్లు. ఈసారి ఏలూరులో తాంబూలాలేర్పాటు చేయాలన్నారు. అక్కడ మా రెండవ అక్కావాళ్లింట్లో తాంబూలాలను ఏర్పాట్లు చేశారు నాన్న.. అప్పుడు కూడా ఆయన రాలేదు. ఈసారి 150 మంది వచ్చారు. అందరికీ మర్యాదలు, భోజనాలు. వాళ్లు సంతృప్తిగా వెళ్లారు.
ఆతర్వాత 20 రోజులలో పెళ్లి. అదీ తెనాలిలో వాళ్లడిగిన పెద్ద కల్యాణమండపంలో 3 రోజుల పెళ్లిని చాలా ఘనంగా చేశారు ఎకరం పొలం అమ్మి మా వాళ్లు. మగపెళ్లి వారు 500 మంది వచ్చారు. పెళ్లిలో జీలకర్ర, బెల్లం పెట్టాక చూస్తారుట వధూవరులు వాళ్లిళ్లల్లో. ఇంతకీ మా వారు నా కంటే పదేళ్లు పెద్ద. అదికూడా నాకు పెళ్లై మా పెద్ద పాప పుట్టాక తెలిసింది. అలా పెద్దలు నిర్ణయం చేసిన పెళ్లిచూపులు కలవని పెళ్లి.
ఇదీ నా చూపులు కలిసినశుభవేళ. ” అని నవ్వుతూ ముగించింది పావని.
ఆవిడ చెప్పినదంతా వ్రాసుకుని పుస్తకం, పెన్నుని బాగ్ లో పెట్టుకుని
“నిజంగా చాలా బావుంది మేడమ్ మీ చూపులు కలసిన శుభవేళ” అని
ఆవిడకి ధన్యవాదాలు చెప్పి తన ఆఫీసుకి వచ్చింది విమల.
.. సమాప్తం ..

-నీరజ హరి ప్రభల
Profile Link
Youtube Playlist Link
Comments