top of page

దాగని నేరం

#DVDPrasad, #డివిడిప్రసాద్, #దాగనినేరం, #DaganiNeram, #TeluguCrimeStory


Dagani Neram - New Telugu Story Written By D V D Prasad

Published In manatelugukathalu.com On 24/11/2024

దాగని నేరం - తెలుగు కథ

రచన: డి వి డి ప్రసాద్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో హైవేలో చెట్ల వెనుక ఎవరిదో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉందన్న సమాచారం అందుకున్న పోలీసు ఇన్సిపెక్టర్ సాంబశివరావు హుటాహుటిన తన పరివారంతో అక్కడికి చేరుకున్నాడు. జీపు దిగిన సాంబశివరావు ఆ పరిసరాలు పరిశీలించి చూసాడు. దట్టంగా అడవిలా పెరిగిన చెట్లు రోడ్డుకి ఇరువైపులా ఉన్నాయి. 


మాములుగా అయితే పెద్ద జన సంచారం లేని ప్రదేశం అది. కార్లు, బస్సులు, బైకులు తప్పించి కాలినడకన వెళ్ళేవాళ్ళు సాధారణంగా ఉండరు. అయితే అక్కడో హత్య జరిగిందని తెలుసుకున్న జనం కుతూహలం కొద్దీ అక్కడ గుమిగూడారు. కానిస్టేబుల్ కనకారావు అక్కడ గుమిగూడిన జనాన్ని చెల్లాచెదురు చేసాడు. సాంబశివరావు, కనకారావు రోడ్డుకి ఎడంవైపున ఉన్న చెట్ల మాటుకి వెళ్ళారు. రోడ్డుకి పది అడుగుల దూరంలో చెట్ల మధ్య వెల్లకిలా పడి ఉన్నాడు హతుడు. 


వయసు ముప్ఫై-ముప్ఫై ఐదు ఏళ్ళ మధ్య ఉంటుందని ఊహించాడు. మెళ్ళో ఏదో ఐడెంటిటీ కార్డ్ కనిపించడంతో హతుడి పరిచయం చాలా సులభంగా దొరికేలా ఉందని ముందు అనుకున్నాడుగానీ, ఆ సంబరం ఎక్కువ సేపు నిలవలేదు. స్ట్రాప్ అయితే ఉంది కానీ కార్డు మాత్రం లేకపోవటంతో సాంబశివరావు కించిత్ నిరాశ చెందాడు. 


హతుడి శరీరంపై పలు చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. అక్కడ నేల మీద రక్తం గడ్డకట్టి లేకపోవడం చూసి, ఇంకెక్కడో హత్య చేసి, బాడీని ఇక్కడ పారేసినట్లు ఊహించాడు. హత్య జరిగి రెండురోజులై ఉంటుందని హతుడ్ని చూస్తూనే గ్రహించాడు సాంబశివరావు. అతనితో వచ్చిన సైంటిఫిక్ టీం తమ పనిలో నిమగ్నమై ఉండగా, సాంబశివరావు చుట్టుపక్కలంతా నిశితంగా పరిశీలించసాగాడు, ఎక్కడైనా ఏమైనా క్లూస్ దొరుకుతాయేమోనని. 


ఎంత వెతికినా ఏమీ దొరకక పోవడంతో కొద్దిగా నిరాశ చెందాడు. హతుడి జేబులు వెతికితే ఓ పర్సు దొరికింది, అందులో కొంత డబ్బులు, చిల్లర ఉన్నాయి కానీ, అతని పరిచయం తెలిపే కార్డులేమీ లేవు, కనీసం ఏటిఎం కార్డు కూడా లేదు. హతుడి పేరు తెలియపరిచే ఎలాంటి క్లూ కూడా దొరకలేదు.


కానిస్టేబుల్ కనకారావుని పిల్చి రోడ్డుకి రెండోవైపు అధారాలేమైనా దొరుకుతాయేమోనని వెతకమని పురమాయించాడు. కనకారావు రోడ్డుకి కుడివైపు వెతికితే, సాంబశివరావు ఎడంవైపు వెతికాడు. 


ఓ అరగంట తర్వాత, కనకారావుకేదో దొరికినట్లుంది, "సార్!" అంటూ హడావుడిగా తిరిగి వచ్చాడు. 


అతని చేతులోని వస్తువు చూసి, "ఇదేదో కెమారాలో ఉంది!" అంటూ దాన్ని పరిశీలించి చూసాడు సాంబశివరావు. 

"అవును సార్! టివి రిపోర్టర్లు వాడే కెమెరాలా ఉంది సార్!" అన్నాడు కనకారావు. 


సాలోచనగా తలపంకించాడు సాంబశివరావు. ఎవరైనా ఆ కెమెరాని పారేసుకున్నారా, లేక అదేమైనా హుతుడిదా అన్న అనుమానం కలిగింది. ‘నికో’ డిజిటల్ కెమెరా అది. దానిపైన ఓ మూల 'కె' అన్న స్టిక్కర్ కనిపించింది, అంటే 'కె' అన్న అక్షరంతో ఆ వ్యక్తి పేరు మొదలై ఉండొచ్చు, లేదా అది అతని లక్కీ అక్షరమైనా కావచ్చు. అందులో వివరాలేమైనా దొరుకుతాయేమోనని చూసాడు, అందులో ఏమి రికార్డై ఉండేదో కానీ మొత్తం ఎవరో డిలీట్ చేసి దూరంగా విసిరేసినట్లు ఉన్నారు. 


ఆ కెమెరాని మరింత నిశితంగా చూసిన తర్వాత దానిపై రక్తం మరకలు కనపించడంతో దాన్ని జాగ్రత్తగా ఉంచమని కనకారావుకి అప్పచెప్పాడు. హతుడు విలేకరి కాకపోతే, మాములు షార్ట్ ఫిల్ములు చేసే వ్యక్తిగానీ, సరదాగా ఫోటోలు తీసే అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ గానీ కావచ్చు. బహుశా, అతనివద్ద ఏమైనా అభ్యంతరకరమైన ఫోటోలో, వీడియోలో ఉండి ఉంటాయి. అందుకే అతన్ని హత్యచేసి ఆ వీడియోలో, ఫోటోలో డిలీట్ చేసి ఉండడానికి కూడా ఆస్కారం ఉంది.


 అయితే, హతుడి పరిచయం లభించనిదే ముందుకు వెళ్ళడానికి ఎలాంటి ఆస్కారం లేదు. అయితే, ఒక్క విషయం మాత్రం నిర్ధారణ అయింది సాంబశివరావుకి, అది హతుడిదై ఉంటే మాత్రం అతను తప్పకుండా ఏదో టివి రిపోర్టరో లేక కెమెరామానో అయ్యేందుకు అవకాశం ఉంది. ఇలా ఆలోచించిన మీదట నగరంలో కనిపించకుండా పోయిన విలేకర్ల గురించి ఆరా తియ్యాలి అని మనసులో అనుకుంటూనే చుట్టూ చూసాడు సాంబశివరావు, టివి వాళ్ళూ, విలేకర్లు ఎవరైనా కనిపిస్తే తన పని సుళువవుతుందని. 


సరిగ్గా అదే సమయానికి, అక్కడికి హడావిడిగా చేరిన ఒక విలేకరి హతుడ్ని గుర్తుపట్టాడు.

"అరే!...ఇతను మన కైలాసరావు!" అంటూ అరిచాడు ఆ మృత దేహాన్ని చూస్తూనే.


వెంటనే సాంబశివరావు ఆ విలేకర్ని దగ్గరకు పిలిచి, "మీకు ఇతను తెలుసా?" అని అడిగాడు.


"తెలియకపోవడమేమిటి సార్! ఇతను ‘డీ’ టివిలో కెమెరామేన్గా పని చేస్తున్నాడు సార్!" అని చెప్పాడు.


మరిన్ని వివరాలు అతని నుండి సేకరించాడు సాంబశివరావు. కైలాసరావు ఆ టివిలో కెమెరామేన్ గా పని చేస్తున్నాడు. సమాజంలో పెద్దమనుష్యులుగా చలామణీ అవుతున్న వాళ్ళ రహస్య సమాచారాలు, సంచలన వార్తలు సేకరించే టీంలో పని చేస్తుంటాడు. రాజకీయ నాయకుల చీకటి కోణాలు సేకరిస్తుంటాడని కూడా అతని మాటలవల్ల తెలుసుకున్నాడు. మిగతా వివరాలు టివి వాళ్ళనుండి సేకరించవచ్చని అనుకున్నాడు సాంబశివరావు. క్లూస్ టీం పని పూర్తైన తర్వాత, పోస్ట్మార్టం కోసం బాడీని అంబులెన్స్లో తరలించి, తను కూడా జీపెక్కాడు కనకారావుతో. 

 *************

అప్పుడే వచ్చిన పోస్ట్మార్టం రిపోర్ట్ అందిన వెంటనే దాన్ని తెరిచి చదివాడు సాంబశివరావు. అతనూహించినట్లుగానే కత్తిపోట్లు హతుడి ప్రాణాలు హరించాయి. ఎక్కడో హత్య చేసి ఏ కారులోనో, జీపులోనో తీసుకువచ్చి ఆ చెట్ల మధ్య పడేసారు హతుడ్ని. అతని మెడలో కెమరా ఉండగా హత్య జరిగి ఉండవచ్చు. కెమెరాపై ఉన్న రక్తం మరకలు హతుడి రక్తంతో కలిసాయి. బాడీని అక్కడ పడేసినప్పుడు, ఆ కెమెరా తెరిచి అందులో ఉన్న మాటరంతా డిలీట్ చేసి రోడ్డుకి రెండోవైపు విసిరేసి ఉంటాడు హంతకుడు. ఇక్కడే మరో అనుమానం కలిగింది సాంబశివరావుకి. ఈ పని ఒక్కడివల్ల జరిగి ఉండదని, ఈ హత్యతో కనీసం ఇద్దరు, ముగ్గురితో సంబంధం ఉండొచ్చని ఊహించాడు.


ఇలా ఆలోచనలతో మునిగి ఉన్న సాంబశివరావు ఎవరో వచ్చిన అలికిడైతే తలెత్తి చూసాడు. ఎదురుగా ఓ మధ్యవయస్కుడు నిలబడి ఉన్నాడు. అతనివైపు ప్రశ్నార్థకంగా చూసాడు. 


"నమస్కారం ఇన్స్పెక్టర్గారూ! నా పేరు శివరాం. నేను ప్రభుత్వ ఉద్యోగం చేసి ఈ మధ్యే ఉద్యోగ విరమణ చేసాను. మా అమ్మాయి కల్పన రెండు రోజులనుండి కనిపించడం లేదు." అన్నాడతను.


అతని మాటలకు విస్తుపోతూ, "రెండు రోజులనుండీ అమ్మాయి కనపడపోతే ఇప్పుడా రిపోర్ట్ చెయ్యడం?" అని అడిగాడతన్ని వింతగా చూస్తూ.

"మా అమ్మాయి ఓ ప్రయివేట్ టివి చానెల్ రిపోర్టర్గా పని చేస్తోంది. పని మీద తరచూ తిరుగుతూ ఉంటుంది. రెండు రోజుల క్రితం, తన కేదో పని ఉందని, ఒక రోజు పూర్తిగా పడుతుందని చెప్పి ఇంటి నుండి వెళ్ళింది. తిరిగి రాకపోగా, ఆమె ఫోన్ కూడా స్విచ్ఆఫ్ వస్తోంది. పైగా మా అమ్మాయితో ఉన్న కెమేరా మేన్ కైలాశరావు ఫోన్ కూడా స్విచ్ఆఫ్ రావడంతో ఏం చెయ్యాలో తోచక ఇక్కడికి వచ్చాను." అన్నాడతను ఆదుర్దాగా.


సాంబశివరావుకి వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లనిపించింది. వెంటనే తన వద్ద ఉన్న హతుడి ఫోటో చూపించాడు అతనికి. ఆ ఫోటో చూసి వెంటనే పోల్చాడు శివరాం.


"ఆఁ..! ఇతనే కైలాసరావు! మీవద్దకు ఈ ఫోటో ఎలా వచ్చింది?" అడిగాడు అతను ఆతృతగా. 


"ఇవాళ ఉదయం వార్తలు చూడలేదా? హైవేలో చెట్ల మధ్య అతని బాడీ దొరికింది. హత్యకి గురైయ్యాడతను." అన్నాడు సాంబశివరావు.


ఆ మాట వింటూనే శివరాం నిలువెల్లా వణికిపోయాడు. "అయ్యో! అతనితోనే మా అమ్మాయి కలిసి వెళ్ళింది. మరి అతను చనిపోయి ఉంటే, మా అమ్మాయి ఏమైనట్లు?" చిగురుటాకులా వణికిపోతూ అడిగాడు శివరాం. అతని కళ్ళల్లో నీళ్ళు నిండాయి.

"ఇప్పుడు చెప్పండి మీ అమ్మాయి వివరాలు." చెప్పాడు సాంబశివరావు.


"మా అమ్మాయి పేరు కల్పన. మా అమ్మాయి, కైలాశరావు ఇద్దరూ కలిసి 'డీ'టివి చానెల్లో పనిచేస్తున్నారు. ఆ టివి తరఫున వార్తలు సేకరిస్తూంటారు." అంటూ వివరాలన్నీ తెలిపాడు.


"సరే! మేము దర్యాప్తు చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి." చెప్పాడు సాంబశివరావు.


"సార్! కొంచెం త్వరగా పరిశోధన చెయ్యండి!" కన్నీళ్ళతో వేడుకున్నాడు శివరాం.

 ************

గజపతినగర్లో ఉన్న టివి ఆఫీసుకి వెళ్ళాడు సాంబశివరావు వివరాలు సేకరించడానికి.


"కల్పన, కైలాశరావు ఇద్దరూ కలిసి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేస్తూంటారు. రకరకాల సెన్సేషనల్ వార్తలు సేకరిస్తూ మా ఛానెల్ రేటింగ్ పెంచడానికి సహాయ పడ్డారు. రెండు రోజుల క్రితం బయటకు వెళ్ళిన వాళ్ళిద్దరి ఫోన్లూ ఆ తర్వాత స్విచ్ఆఫ్ వచ్చాయి. కైలాసరావు హత్యబడ్డాడు కానీ మరి ఇప్పటివరకూ కల్పన గురించి మాకు ఎలాంటి సమాచారం లేదు. ఆమె తండ్రి శివరాం తన కూతురి గురించి బెంగపెట్టుకున్నారు. చాలాసార్లు ఫోన్ చేసారతను." చెప్పాడు స్టూడియో మేనేజర్ చంద్రశేఖర్.

"ఎటువంటి వార్త సేకరిస్తుంటారు వాళ్ళిద్దరూ?" అని ప్రశ్నించాడు సాంబశివరావు.


"రాజకీయ నాయకుల చీకటి కోణాలు, సినీ నటుల తెర వెనక రహస్యాలు, ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి...ఇలా రకరకాల వార్తలు సేకరిస్తూ ఉంటారు." జవాబిచాడు చంద్రశేఖర్.

"రెండు రోజుల క్రితం బయలుదేరినప్పుడు ఏ వార్త సేకరించడానికి వెళ్ళారు?'


"తాము చాలా సీక్రెట్ మిషన్ మీద పని చేస్తున్నామని, వివరాలు పూర్తిగా సేకరించిన తర్వాతే అన్ని విషయాలు చెప్తామని, అందాకా అంతా రహస్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు." అన్నాడు చంద్రశేఖర్.


"ఓహ్...అలాగా!" అని, "వాళ్ళకి శతృవులెవరైనా ఉన్నారా?" అని అడిగిన తర్వాత తన ప్రశ్నకి తానే నవ్వుకున్నాడు.


చంద్రశేఖర్ కూడా చిన్నగా నవ్వుతూ చెప్పాడు, "ఈ వృత్తిలో అందరూ శతృవులే ఉంటారు సార్, మిత్రులు మాత్రం బహు కొద్దిమంది ఉంటారు."


"అవును, ఆ మాటా నిజమే! ఈ మధ్య వాళ్ళు ఎవరెవరి వివరాలు సేకరించి ఇచ్చారో కాస్త వివరంగా చెప్తారా?" అని అడిగాడు సాంబశివరావు.


"ఓకే!" అని కొన్ని ఫైల్స్ తీసి సాంబశివరావుకిచ్చాడు అతను. అందులో ఏ వార్తలు అప్పటికే ప్రసారం అయ్యాయో, ఏవి ఇంకా ప్రసారం కానున్నాయో చెప్పాడు. ఒక గంట సేపు ఆ ఫైల్స్ అన్నీ తిరగేసి, కొన్ని వివరాలు తన డైరీలో రాసుకున్నాడు సాంబశివరావు. 


అవన్నీ బాగా పరిశీలించిన పిమ్మట, "మరి...ఇవికాక కొత్తగా విశేషాలు ఏమైనా ఉన్నాయా! అదే ఊహా మాత్రంగానైనా ఎవరి మీద రహస్య సమచారం సేకరించడానికి పూనుకున్నారో చెప్పగలరా?" చంద్రశేఖర్వైపు చూసి అడిగాడు సాంబశివరావు.


కొద్దిసేపు ఆలోచించిన మీదట తల ఊపుతూ, "అవును...ఇప్పుడు గుర్తుకు వచ్చింది, మాత్రం కరక్ట్గా చెప్పలేను. ఈమధ్య పోలీసు ఏసిపి మిశ్రా ఇంట్లో మైనర్ బాలికను వేధించిన సంఘటన కావొచ్చు, లేదా మన మంత్రి మంగపతిగారు కబ్జా చేసిన స్థలంపైనా కావచ్చు. ఈ రెండూ వాళ్ళ లిస్ట్లో ఉండేవని వాళ్ళ మాటల్లో తెలిసింది." చెప్పాడు చంద్రశేఖర్.


"అలాగా!" అన్నాడు సాంబశివరావు సాలోచనగా, చంద్రశేఖర్ చెప్పిన వాళ్ళిద్దరూ పెద్దమనుషులే, వాళ్ళతో ఎలా డీల్ చెయ్యాలో అన్న డైలామాలో పడుతూ.

వెళ్ళబోతూ, టివి డైరెక్టర్ దయానిధిని కలుసుకుందామని అతని రూము వైపు వెళ్ళాడు సాంబశివరావు. 


బయట కూర్చున్న దయానిధి సెక్రెటరీకి చెప్పాడు అతన్ని కలుసుకోవడానికి తను వచ్చినట్లు. సెక్రెటరీ సోధన అతన్ని సోఫాలో కూర్చోమని చెప్పి, డైరెక్టర్కి ఫోన్ చేసి చెప్పింది. ఓ క్షణం తర్వాత, డైరెక్టర్ రూములోకి ప్రవేశించాడతను.


విశాలమైన ఆ గదిలో, ఓ పెద్ద టేబులు వెనుక ఏదో రాస్తూ ఉన్న డైరెక్టర్ దయానిధి తను చేస్తున్న పని ఆపి, నవ్వుతూ సాంబశివరావుని ఆహ్వానించాడు. సాంబశివరావు అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాక, "ఏం తీసుకుంటారు, కాఫీయా, టీయా లేక ఏవైనా కూల్ డ్రింక్సా?" అన్నాడు బెల్ నొక్కబోతూ.


"వద్దు! ఏమీ వద్దు! మీ కెమెరామేన్ కైలాసరావు హత్య విషయంలో పరిశోధన చెయ్యడానికి వచ్చాను. పోతూపోతూ, ఓ సారి పలకరించి పోదామని వచ్చాను." అన్నాడు.


"అవును. చాలా విచారకరమైన విషయం. పాపం, కైలాసరావు! యువకుడు, మంచి భవిషత్తు ఉండవలసినవాడు, ఇలా అర్ధాంతరంగా అతన్ని మృత్యువు కబళిస్తుందనుకోలేదు. అతని భార్య పార్వతిని చూస్తే కడుపు తరుక్కు పోతోంది. ఆమెకి నష్టపరిహారం ఈ రోజే చెల్లించి వచ్చాను. మా ఆఫీసులో ఏదైనా ఉద్యోగం ఇస్తానని కూడా హామీ ఇచ్చాను." అన్నాడు నిట్టూర్పు విడుస్తూ.


"అవును! నేను ఈ ఉదయం ఆమెని కలిసాను. అయితే, మీ కెమెరామాన్ కైలాసరావుతో కలిసి పనిచేసే కల్పన గురించి ఏమైనా చెప్పగలరా? అమె కైలాసరావుతో కాక, ఇంకెక్కడికైనా వెళ్ళిందా? మీకు తెలియకుండా ఇంకేమైనా సీక్రెట్ మిషన్ మీద వెరేగా గాని వెళ్ళిందా?" అడిగాడు సాంబశివరావు.

"నో!...అలా నేనేమీ ఆమెకి వేరే పనేమీ అప్పచెప్పలేదు. ఇద్దరూ కలిసి తెచ్చే న్యూస్ కి మంచి క్రేజ్ ఉంది జనాల్లో. మా టీ.అర్.పీ రేటింగ్ వాళ్ళవల్ల బాగా పెరిగింది. కైలాసరావు లాంటి ఉద్యోగిని కోల్పోవడం మా ఛానెల్ కి పెద్ద దెబ్బ. మరి, కల్పన ఎక్కడకెళ్ళిందో నాకు తెలియదు. నేను కూడా ఆమెకి ఫోన్ చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నా నిన్నటి నుండి. స్విచ్ ఆఫ్ వస్తోంది. ఆమె ఎక్కడికెళ్ళిందో, ఏమిటో మరి!” చెప్పాడతను విచారవదనంతో.


కొత్త విశేషాలేమీ తెలియకపోవడంతో స్టేషన్ కి తిరిగి బయలుదేరాడు సాంబశివరావు. రాత్రి అతను ఇంటికి వెళ్ళేసరికి టివిలో కైలాసరావు హత్య, రిపోర్టర్ కల్పన కనిపించకుండా పోవడం సంచలన వార్తగా ప్రసారమవుతోంది. కొన్ని ఛానెళ్ళలో అయితే చర్చా కార్యక్రమం కూడా మొదలైంది. 


మీడియామీద రాజకీయ నాయకుల ఒత్తిళ్ళు, పోలీసుల నిష్క్రియత, ప్రభుత్వ నిర్లక్ష్యం, నేరస్తుల దాడుల గురించి వాడి వేడి చర్చ జరుగుతోంది. అందర్నీ దుమ్మెత్తి పోస్తున్నారు చర్చల్లో పాల్గొన్న వ్యక్తులు. ఓ అయిదు నిమిషాలు విన్న తర్వాత విసుగుపుట్టి టివి ఆపేసాడు. 

 *************

చంద్రశేఖర్ వద్ద తను సేకరించిన సమాచారం ఆధారంగా ఒకొక్కళ్ళనీ కలుసుకోవడానికి నిర్ణయించుకున్నాడు సాంబశివరావు. లిస్ట్ లో ఉన్న వసంతరావుని కలుసుకోవడానికి ముందు వెళ్ళాడు. వసంతరావు ఓ రాజకీయ నాయకుడు. 

"డీ టివి వాళ్ళు నా గురించిన వార్త ప్రసారం చేసిన తర్వాత పార్టీలో నా పరపతి బాగా పెరిగింది. ఇంతవరకూ ఈ సారి ఎలక్షన్లలో పార్టీ టికెట్ దక్కుతుందా లేదా అన్న బెంగ ఉండేది, ఇప్పుడు అధిష్ఠానం కచ్చితంగా నాకే పార్టీ టికెట్ ఇవ్వబోతున్నట్లు చెప్పింది." నవ్వుతూ చెప్పాడు వసంతరావు.


సినీ హీరోయిన్ హీరా అయితే, "వాళ్ళు ప్రసారం చెయ్యబోయే వార్తలవల్ల నా ఇమేజ్ బాగా పెరుగుతుంది. అందుకే వాళ్ళు టివిలో అవి ప్రసారం చేస్తారనేసరికి నేను చాలా అనందించాను. నేను వెంటనే ఓ పది పదిహేను చిత్రాల్లో బుక్ అవడం ఖాయం." అంది. 


అలా ఒకొక్కర్నీ విడివిడిగా కలిసి విచారించాడు, కానీ ఎక్కడా ఏ క్లూ కూడా లభించలేదు. ఏసిపి మిశ్రాని, మంత్రి మంగపతిరావునీ కలిసాడు. 


మరోరెండు రోజులు గడిచినా కేసులో ఏ విధమైన పురోగతీ లేదు. హంతకుడు దొరకలేదు, కల్పన ఆచూకీ కూడా లభ్యం కాలేదు. శివరాం స్టేషన్ కి రోజూ వస్తూనే ఉన్నాడు, సాంబశివరావుని తన కూతురు కల్పన ఆచూకీ తెలుసుకోమని ప్రాధేయ పడుతూనే ఉన్నాడు. అతనిలో తను కూతుర్ని తిరిగి చూస్తానన్న ఆశ సన్నగిల్లసాగింది. 


నిద్రాహారాలు మానేసి చాలా ఆందోళనగా కనిపిస్తున్న శివరాంని చూసి సాంబశివరావు జాలి పడ్డాడు. కల్పన గదిలో ఏమైనా క్లూ లభిస్తుందేమోనని అనిపించడంతో శివరాంతో అతని ఇంటికివెళ్ళాడు. కల్పన గది మొత్తం గాలించాడు.

రూములో ఓ అరడజను హ్యాండ్ బ్యాగులు ఉంటే అవన్నీ చెక్ చేసాడు. అలమరాలు, వార్డ్రోబ్ లూ ఏదీ వదలలేదు. ఆమె డైరీ అలమరలో ఓ మూల ఉంటే చేతిలోకి తీసుకున్నాడు. అందులో కొన్ని వివరాలు ఉన్నాయి. 


కైలాసరావు హత్య జరిగిన ముందు ఆమె ఏమైనా రాసుకుందా అని తిరగేసాడు. డైరీ ఆమెకి రాసే అలవాటు లేకపోవడం వల్ల చాలా పేజీలు ఖాళీగానే ఉన్నాయి. కేవలం కొన్ని పేర్లు, వివరాలు, ఫోన్ నంబర్లు, టూకీగా ఏవో సమాచారాలు రాసి ఉన్నాయి. తను చంద్రశేఖర్ వద్ద నుండి తెచ్చిన సమాచారంతో పోల్చాడు. అందులో లేనివి, డైరీలో ఉన్నవి మనసులో మననం చేసుకుని అక్కణ్ణుంచి కదిలాడు.

 ****************

కల్పన ఫోటోతో పాటు ఆమె వివరాలు అన్ని పోలీసు స్టేషన్లకి పంపాడు, ఎక్కణ్ణుంచైనా ఏమైనా సమాచారం తెలుస్తుందేమోనని. మరో రెండు రోజులు గడిచినా ఆమె గురించి ఎలాంటి సమాచారం తెలియలేదు. ఒకవేళ కైలాసరావుని హత్యచేసిన హంతకుడు ఆమెని అపహరించి ఎక్కడో దాచిపెట్టాడేమో, లేక ఆమెని కూడా హత్య చేసి ఉంటాడేమోనని ఓ అనుమానం తలెత్తింది సాంబశివరావు మదిలో. 


‘ఒకవేళ ఆమెని నిర్బంధించి ఉంచాడంటే, ఎందుకు నిర్బంధించి ఉంచాడు? ఎవరు ఆ దుశ్చర్యకి పాల్పడిఉంటారు? అందుకు కారణం ఏమిటై ఉంటుంది? ఆమె వద్ద ఎలాంటి రహస్యాలు ఉన్నాయి? అవిగానీ అతనికి చిక్కలేదా? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుస్తేగానీ కేసు ఏమాత్రం తేలదని ఓ నిర్ధారణకి వచ్చాడు. 


ఇలా ఆలోచిస్తూ ఉంటే, మరో సందేహం తలెత్తింది అతని మనసులో. ఏదో రహస్య సమాచారం, ఫోటోలు, వీడియో సేకరించిన తర్వాత, కైలాసరావుకి కల్పనకి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి అతణ్ణి ఆమె హతమార్చి, కావాలని అండర్ గ్రౌండ్కి వెళ్ళలేదుకదా అన్న అనుమానం కూడా ఓ వంక అతని మనసుని తొలిచేస్తోంది. అయితే, కైలాశరావు బలం ముందు, ఆమె తప్పకుండా శక్తి హీనురాలే. ఆమె అతన్ని కత్తిపోట్లు పొడుస్తూ ఉంటే ప్రతిఘటించకుండా ఉండడు కదా! పోస్ట్ మార్టం రిపోర్టు బట్టి ఆ కత్తిపోట్లు ఎవరో కైలాసరావుకన్నా బలమైన వ్యక్తి చేసినవే. 


అమెకి ఇంకెవరైనా సహకారం అందించారేమో? అలాంటప్పుడు ఆ వ్యక్తికీ, కల్పనకి మధ్య ఏమైనా సంబంధం ఉందా? ఆమె పాత్ర కూడా ఈ హత్యలో ఉందా? అలా లేకపోతే, ఏ సూచన వదలకుండా ఎందుకామె అక్కణ్ణుంచి మాయమైంది?’ అన్న సందేహాలు సాంబశివరావు మనసుని తొలిచేస్తున్నాయి. ఏ విషయమూ తేలాలంటే ముందు కొన్ని సందేహాలు తీరాలి. తను సేకరించిన సమాచారం అంతా మరోసారి విశ్లేషించాడు సాంబశివరావు.


కైలారావుకి వచ్చిన ఫోన్ల కాల్ డాటా చెక్ చేసాడు, ఏ రోజు కనపడకుండా పోయాడో ఆ రోజు ఏమేం కాల్స్ వచ్చాయో చూసాడు. ఆ రోజు ఇద్దరికే కాల్ చేసినట్లు అందులో తెలిసింది, ఒకటి కల్పనకి, మరో ఫోన్ నంబర్ చూడగానే అతని భృకుటి ముడిపడింది. అలాగే కల్పన డైరీలో చూసిన సాంబశివరావుకి ఆమె తన స్నేహితురాలు రజనికి చాలా సార్లు ఫోన్ చేసినట్లు తెలిసింది. ఆ ముందు రోజు రాత్రి ఆమె రజనికి ఫోన్ చేసింది. అమెని కలిస్తే ఫలితమేమైనా ఉంటుందేమోనని అనిపించింది అతనికి.


 కల్పన డైరీలో కనపడిన ఆమె అడ్రెస్ గుర్తు చేసుకొని రజని ఇంటికి బయలుదేరాడు. అక్కడికి చేరేసరికి ఆమె ఇంటికి తాళం వేస్తూ ఎక్కడికో బయలుదేరబోతున్నదల్లా, అప్పుడే పోలీసు జీపులోంచి దిగిన సాంబశివరావుని చూసి ఎందుకో తడబడింది.


"రజనిగారూ, మిమ్మల్ని కలుసుకోవడానికే వచ్చాను." అన్నాడు.


ఇక తప్పదన్నట్లు, అమె తాళం తీసి ఇంట్లోపలికి అడుగు పెట్టింది. అదో సింగిల్ బెడ్ రూం ఇల్లు. రజని ఓ కుర్చీలో కూర్చొని ఇబ్బందిగా కదిలింది.


"మీరు కల్పనకి మంచి స్నేహితురాలని విని వచ్చాను. అమె గత నాలుగైదురోజులుగా కనపడటం లేదని మీకు తెలుసనుకుంటాను." అమెని నిశితంగా గమనిస్తూ చెప్పాడు సాంబశివరావు.


అవునన్నట్లు తలూపిందామె. "కల్పన మీతో చాలా సేపు మాట్లాడేది కనుక మీకు అమె గురించి చాలా విషయాలు తెలుసనుకుంటాను. ఏమీ దాచకుండా చెప్పండి." అన్నాడు.


అయినా రజని పెదవి విప్పకుండా సందేహంగా అతన్నే చూస్తూ ఉండటంతో, "మీకేం భయం లేదు. మీకు తెలిసిందంతా చెప్పండి." అనడంతో నోరు విప్పిందామె. ఆమె చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు సాంబశివరావు.

 ************

"మళ్ళీ మీ వద్దకు ఇంత త్వరగా రావలసి వస్తుందని అనుకోలేదు." అన్నాడు సాంబశివరావు అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ.


"గుడ్ ఈవినింగ్ సాంబశివరావుగారూ! మీ పరిశోధన ఎంతవరకూ వచ్చింది? కల్పన గురించి ఏమైనా తెలిసిందా?" అని అడిగాడతను.


"చిక్కుముడి విడిపోయింది. మీ సహకారం ఉంటే, మిగతా అన్ని విషయాలు కూడా సులభంగా తేలిపోతాయి." అన్నాడు సాంబశివరావు కుర్చీలో వెనక్కు వాలి.


"నా సహకారమా!..." అని వింతగా చూసాడతను సాంబశివరావు వైపు.


"అవును మిస్టర్ దయనిధిగారూ! మీరే కైలసరావుని హత్య చేయించి, కల్పనని నిర్బంధించారు. అందుకు పూర్తి ఆధారాలు నాకు లభ్యమయ్యాయి." చెప్పాడు సాంబశివరావు అతని వైపు సూటిగా చూస్తూ.


ఒక్కసారి కోపంతో వణికిపోయాడు దయానిధి. "మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తోందా? కనీసం ఎవరితో మాట్లాడుతున్నారో బోధపడుతోందా? నేనో పేరుపొందిన మీడియా అధిపతిని. ఇలా మాట్లాడటానికి మీకెంత ధైర్యం?" అన్నాడు అతని మొహం కోపంతో ఎర్రగా మారగా.


అతనివైపు ఏమాత్రం బెదురు లేకుండా చూసాడు సాంబశివరావు. "మీరు వినియోగించిన కిరాయి రౌడీ నాగరాజు ప్రస్తుతం మా కస్టడీలో ఉన్నాడు. అతను అన్ని విషయాలు వివరంగా చెప్పాడు. తను చేసిన నేరాల్ని ఒప్పుకున్నాడు. మీ ఆదేశంతో అతను నిర్బంధించి ఉంచిన కల్పనని విడిపించాం. మీకు వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఇవి చాలనుకుంటాను." చెప్పాడు సాంబశివరావు నిబ్బరంగా.


నాగరాజు పేరు వినగానే దయానిధి మొహం తెల్లగా పాలిపోయింది. అతన్ని చూస్తూ సాంబశివరావు తిరిగి ఇలా చెప్పసాగాడు. 


"మీ ఆదేశంపైన కెమెరామాన్ కైలాసరావుతో కల్పనని ప్రముఖ రాజకీయనాయకుడైన ధనంజయరావుకి గల డ్రగ్స్ లింక్స్ వెలికితీయడానికి నియోగించారు రహస్యంగా. వాళ్ళిద్దరూ కలసి ధనంజయరావు రహస్యంగా సాగించే మాదక ద్రవ్యాల వ్యాపారాలు గుట్టుమట్లు కనిపెట్టారు. 


ఫోటోలు, వీడియోలతోపాటు అన్ని సమాచారాలు సేకరించి మీకు చెప్పారు. ఆ సంచలన వార్త మీ టివిలో ప్రసారం చేసి రేటింగ్ పెంచుకోవాలని మీరు మొదట అనుకున్నారు. తీరా మీరా వార్తలు సేకరించిన తర్వాత, ఆ విషయం ధనంజయరావుకి తెలిసి మీతో బేరానికి దిగాడు. 


చివరికి మీ ఇద్దరి మధ్య బేరం కుదిరింది. దాంతో మీరు ఆ సమాచారం మీకు నేరుగా అందివ్వమని కైలసరావుకి, కల్పనకి చెప్పారు. మీరు ధనంజయరావుతో చేసుకున్న రహస్య ఒప్పదం వాళ్ళకి తెలిసింది. మీ నిజ స్వరూపం వాళ్ళకి బోధపడింది. అందుకే ఆ సమాచారమంతా రహస్యంగా ఒక చోట దాచారు. వాళ్ళిద్దరూ మీకు లొంగకుండా మీ ప్రత్యర్థి టివిని సంప్రదించారు. ఆ విషయం తెలిసి, నాగరాజు సహాయంతో వాళ్ళిద్దర్నీ బంధించారు. 


ఎంతకీ లోంగకపోగా పౌరుషంగా మాట్లాడిన కైలాసరావుని అంతమొందించారు. కల్పనని మాత్రం ఇంకా బంధించే ఉంచారు. ఆమెకూడా మాట వినకపోతే ఆమెకి కూడా అదే పరిస్థితి ఎదురై ఉండేది. ఈలోపు నాగరాజు మాకు చిక్కాడు, కల్పన అతని నిర్బంధం నుండి బయటపడింది. వాళ్ళిద్దరూ సేకరించిన రహస్య సమాచారం కూడా మా చేతిలోకి వచ్చింది. దాన్ని సంబంధించిన నార్కోటిక్ డ్రగ్స్ అధికార్లకు అందించడం జరిగింది. 


ఈపాటికి ధనంజయరావు కూడా వాళ్ళ కస్టడీలో ఉండి ఉంటాడు. ఇప్పుడు మీ వంతు వచ్చింది. నిజాన్ని నిర్భయంగా బయటపెట్టడానికి మీరు టివి ఛానెల్ ప్రారంభించినా, నేరస్తులతో లాలూచీపడి ఇలాంటి హేయమైన పని చేయడం సిగ్గుచేటు. దేశంలోని యువతని నిర్వీర్యం చేసే మాదక ద్రవ్యాల వ్యాపారం చెయ్యడమే ఓ పెద్ద నేరమైతే, అలాంటి నేరస్తుడితో లాలూచీ పడటం కూడా నేరమే! అలాంటి నేరంలో భాగస్వామి అయిన మిమ్మల్ని న్యాయస్థానానికి అప్పచెప్పడం నా విధి. 


సంచలన రహస్య వార్తలు సేకరించే కైలాసరావు, కల్పనకి శత్రువులు చాలా మందే ఉంటారు కనుక, మీ మీద అనుమానం రాదని మీ ధీమా. ఎంతోమంది అనిమానితులు ఉండగా, వాళ్ళని ఆ పనిలో వినియోగించిన మీపై ఎవరికీ అనుమానం రాదని మీరనుకున్నారు. చివరికి ఏసిపి మిశ్రాపైకి, మంత్రి మంగపతిరావుపైనా మా అనుమానాన్ని మళ్ళించారు, అయినా నిజం మాత్రం దాగదు. నేరం దాగదు. 


నేరస్తుడు సమాజంలో ఎంత పెద్ద వ్యక్తిగా గుర్తింపు పొందినా చట్టానికి మాత్రం చిక్కక తప్పదు, తగిన శిక్ష పడకుండా కూడా తప్పదు." అని ముగించాడు సాంబశివరావు.


సాంబశివరావువైపు చూడటానికి మొహం చెల్లక తలవంచుకున్నాడు దయానిధి.


తను ఏ పనిలోకి దిగినా స్నేహితురాలు రజనితో చర్చించడం కల్పనకి అలవాటు. అలాగే ధనంజయరావు డ్రగ్స్ వ్యవహారం, ఆ తర్వాత దయానిధితో జరిగిన సంభాషణ కూడా వాళ్ళ మాటల్లో వచ్చింది. కల్పన మాయమైన తర్వాత రజని ముందు పోలీసుల్ని కలుసుకోవాలని భావించినా దయానిధి, ధనంజయరావు తననేం చేస్తారో అన్న భయం వల్ల నోరు మెదపలేదు. 


సాంబశివరావు అభయమివ్వడంతో తనకు తెలిసినదంతా అతనికి చెప్పేసి కల్పనని ఎలాగైనా కాపాడమని ప్రాధేయపడింది. తన వద్ద కల్పన దాచి ఉంచిన పెన్ డ్రైవ్ అతనికి అందించింది. ఆమె నుంచి సేకరించిన సమాచారంతోనే సాంబశివరావు తీగను కదిలించేసరికి డొంకంతా బయటపడింది.


హత్యానేరంపై దయానిధి, నాగరాజు అరస్టయ్యారు. ధనంజయరావు జూడిషియల్ రిమాండ్లోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు సంబంధిత అధికారులు.


 ****************


దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


55 views0 comments

Comments


bottom of page