top of page

డైలీ రిపోర్ట్స్

#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #DailyReports, #డైలీరిపోర్ట్స్


'Daily Reports' - New Telugu Story Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 28/10/2024

'డైలీ రిపోర్ట్స్' తెలుగు కథ

రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ రీజనల్ మేనేజర్ సత్యమూర్తి. కొత్తగా ఆ పోస్ట్ కు ప్రమోట్ అయిన వ్యక్తి అతను.


అతను ఛార్జ్ తీసుకున్న ఆరు నెలల్లో వ్యాపారం బాగా పెరిగింది. కానీ ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. గతవారం మరింత దిగజారి, సంవత్సరం క్రితం వున్న పొజిషన్ కు వచ్చింది. నిన్ననే జీఎం అతన్ని పిలిపించి మాటలతో చిత్రవధ చేసాడు.


యాభై అయిదేళ్ల సత్యమూర్తి, జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నవాడు. పైగా ఒక ఆఫీసర్ల యూనియన్ కు జనరల్ సెక్రెటరీ. కాబట్టి ఆ తాకిడికి తట్టుకున్నాడు గానీ, కొత్తవాళ్ళైతే ఆ చీవాట్లకు ఆత్మహత్య చేసుకొనేవారు.


అతను ఆఫీసులో కూర్చొని తల పట్టుకొని ఉండగా ఇంటినుండి ఫోన్ వచ్చింది.


"ఏమండీ! అమ్మాయి దగ్గరనుండి ఫోన్ వచ్చింది. అల్లుడిగారితో ఏదో గొడవైనట్లు ఉంది. ముక్తసరిగా మాట్లాడింది. ఏమైందని అడిగితే ఏమీ చెప్పలేదు. దానికి నాకంటే మీ దగ్గరే చనువు ఎక్కువ కదా. పెళ్లయ్యాక కూడా రోజూ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు కదా. కాస్త దానికి ఫోన్ చేసి ఏమైందో కనుక్కోండి" అభ్యర్థిస్తున్నట్లుగా అడిగింది అతడి భార్య సావిత్రి.


"అలాగేలే! నేను చూసుకుంటాను. నువ్వేం బెంగ పెట్టుకోకు" భార్యకు ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేసాడు సత్యమూర్తి.


రెండు నెలల క్రితమే కూతురి పెళ్లి ఘనంగా చేసాడు. అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. మంచి సంబంధమే.


పెళ్లి అయిందని కూతురి సంగతి వదిలెయ్యలేదు తను. ఎంత పనిలో ఉన్నా ప్రతిరోజూ కూతురికి కాల్ చేసి అక్కడ ఆ రోజు జరిగిన విషయాలన్నీ తెలుసుకునేవాడు. ఏ విషయంలో ఎలా నడుచుకోవాలో సూచనలు ఇచ్చేవాడు. తనలాగా శ్రద్ధ చూపే తండ్రులు చాలా అరుదని, తనను తనే అభినందిచుకునేవాడు.


ఇంటికి వెళ్ళాక కూతురికి మర్చిపోకుండా కాల్ చెయ్యాలని అనుకున్నాడు.


ఇంతలో యూనియన్ ప్రెసిడెంట్ నుండి కాల్. 


అతను కేవలం డమ్మీ. వ్యవహారాలు నడిపేదంతా సత్యమూర్తే.


"నమస్కారం మూర్తి గారూ! నేను.. భాస్కరరావుని మాట్లాడుతున్నాను. రీజనల్ మేనేజర్ అయ్యాక బాగా బిజీగా ఉన్నట్లున్నారు..?" అన్నాడతను.


"బిజీ అయినమాట నిజమే భాస్కర్ గారూ! అయినా ప్రతిరోజూ అన్ని బ్రాంచీలకు కాల్ చేసి మన సభ్యులతో మాట్లాడుతున్నాను.వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని ఏం చెయ్యాలో చెబుతున్నాను" అన్నాడు సత్యమూర్తి.


“అయ్యో! అవన్నీ మీరు చెప్పాలా.. మీ దగ్గర ఓనమాలు దిద్దుకున్న వాణ్ణి.. నాకు తెలీదా.. కాకపోతే సభ్యులలో ఏదో అసంతృప్తి. అవతలి యూనియన్ వాళ్లకు అన్ని పనులూ జరిగిపోతున్నాయట. వాళ్ళ జిఎస్, సభ్యులకు ఎప్పుడో కానీ కాల్ చెయ్యడట. కానీ అవతల యూనియన్ మెంబర్స్ ఎప్పుడూ హ్యాపీగా ఉంటున్నారట. ఈ మధ్య అటువైపు జంప్ చేసిన మన మెంబర్స్ కూడా ఇప్పుడు హాయిగా ఉన్నట్లు చెబుతున్నారట. పైగా పెద్ద పదవిలో ఉన్న మీరు మేనేజ్మెంట్ ని గట్టిగా ఎదిరించలేరని కూడా కొందరు అనుకుంటున్నారు. అందుకని.." చెప్పడం ఆపాడు భాస్కర రావు.


"అర్థమైంది. ఇప్పటి పరిస్థితులలో నేను మేనేజ్మెంట్ తో గొడవలు పెట్టుకోలేను. ఈ పదవికి రిజైన్ చేస్తాను. జియస్ గా మీరు ఉంటానంటే నేను సపోర్ట్ చేస్తాను. 


కాకపోతే నాకు అర్థం కానిదొకటే. ఆఫీస్ కోసం రోజుకు పన్నెడు గంటలు పనిచేస్తున్నాను. బ్రాంచీలనుండి రోజూ రిపోర్ట్స్ తెప్పించుకుని వాళ్లతో మాట్లాడుతున్నాను. పక్కరోజు ఏం చెయ్యాలో సలహాలు ఇస్తున్నాను. అయినా గ్రోత్ లేదంటూ జీఎం గారినుండి ఒకటే ఫోన్లు. ఆ ఫోన్, లిఫ్ట్ చేయాలంటేనే, వణుకు పుడుతోంది.


ఇక యూనియన్ విషయానికి వస్తే..


అవతల యూనియన్ జిఎస్, ట్రాన్స్ఫర్ ల సమయంలో గానీ సభ్యులను కాంటాక్ట్ చెయ్యడు. లేదా ఎవరైనా సస్పెండ్ అయినప్పుడు జోక్యం చేసుకుంటాడు. నేనేమో వాళ్లకు లీవ్ శాంక్షన్ చేయించడంలో కూడా శ్రద్ధ తీసుకుంటాను. 


అయినా మన మెంబర్స్ కొందరు యూనియన్ మారుతామంటున్నారు. ఏమీ అర్థం కావడం లేదు. కారణం ఏమై ఉంటుందంటావు..?" ప్రశ్నించాడు సత్యమూర్తి.


"మీ గురించి విశ్లేషించే స్థాయి నాకెక్కడిది మూర్తిగారూ! అయితే నన్నే జిఎస్ గా ఉండమంటారా? ఈసీ మెంబర్ల అభిప్రాయం కనుక్కొని మీకు మళ్ళీ కాల్ చేస్తాను" అంటూ ఫోన్ పెట్టేసాడు భాస్కరరావు.


'నిజమే. భాస్కర్ పూర్తిగా తనకు ఉపగ్రహమే. యూనియన్ ప్రెసిడెంట్ గా పూర్తిగా తన కనుసన్నలలోనే ఉండేవాడు. ఇక తనకు సలహాలేమిస్తాడు? యూనియన్ పదవికైతే రాజీనామా చేస్తాడు. కానీ ఉద్యోగం విషయంలో తనకు సలహాలిచ్చేవాళ్ళు ఎవరున్నారు..' 


ఆలోచనలో పడ్డాడు సత్యమూర్తి. 


ఆలోచించగా..

తమ కంపెనీ రీజనల్ మేనేజర్ గా కర్ణాటక లో పనిచేస్తున్న శంకర్ తన వూరి వాడే. తనకన్నా ఒక సంవత్సరం సీనియర్ కూడా. ఎప్పుడో తన స్థాయికి వచ్చి తదుపరి ప్రమోషన్ కు రెడీగా ఉన్నాడు. తన ఇంటికి కూడా ఒకసారి వచ్చాడు. 


గతంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగినప్పుడు తాను అతన్ని కలిసాడు. ఆ మీటింగ్ లో తనకు వచ్చిన అభినందనలు గమనించిన శంకర్, తరువాత తనను పర్సనల్ గా కలిసాడు.


"మూర్తీ! బిజినెస్ పెంచి అప్ప్రెషియేషన్లు పొందినందుకు అభినందనలు. కానీ ఒక విషయం గుర్తుంచుకో. సిబ్బంది మీద ఒత్తిడి పెంచి ఎక్కువకాలం గ్రోత్ చూపించలేవు." అన్నాడు. 


ఆ మాటలకు సమాధానం ఇవ్వకుండా మాట దాటవేశాడు తను.


'నిజానికి తను స్టాఫ్ కు ఒత్తిడి తగ్గించాడు. డైలీ రిపోర్ట్స్ తెప్పించుకొని, ప్రతి విషయంలో ఎలా నడుచుకోవాలో వాళ్లకు కాల్ చేసి సలహాలు ఇచ్చేవాడు. ‘మొత్తానికి తన పెర్ఫార్మెన్స్ సీనియర్లకు కూడా కాస్త జెలసీని కలిగించినట్లు ఉంది' అని అప్పట్లో అనుకున్నాడు తను.


'వీలు చూసుకొని శంకర్ కు కాల్ చేయాలి' అనుకుని ఆఫీసు పని ముగించుకొని ఇల్లు చేరుకున్నాడు. 


ఇంటికి రాగానే భార్య సావిత్రి అతని దగ్గరకు వచ్చి "ఏమండీ! అమ్మాయికీ అల్లుడు గారికీ ఈ మధ్య మనస్పర్థలు పెరిగినట్లు ఉన్నాయి. ఏంచేద్దామంటారు?" అని అడిగింది.


"దానికి పెళ్ళైనప్పటినుండి ప్రతిరోజూ కాల్ చేసి మంచిచెడ్డలు కనుక్కుంటూనే ఉన్నాను. ఈమధ్య ఆఫీసు పని ఒత్తిడిలో ఒకటిరెండు రోజులు మిస్ అయి ఉంటానేమో..అయినా నువ్వు కూడా రోజూ మాట్లాడుతూనే ఉన్నావుగా..?" భార్యతో అన్నాడు సత్యమూర్తి.


"మీరన్నా మామూలు కాల్ చేస్తున్నారు. నేను రోజూ వీడియో కాల్ లో మాట్లాడుతున్నాను" చెప్పింది సావిత్రి.


"ఒకసారి అమ్మాయికి కాల్ చేస్తాను. అసలు సమస్య ఏమిటో తెలుసుకుందాం" అంటూ కూతురికి కాల్ చేసాడు.


"అమ్మా సమీరా! ఈ మధ్య కాస్త మూడీగా ఉంటున్నావట.. ఏమయిందిరా బంగారు తల్లీ.. అల్లుడు గారితో ఏమైనా సమస్యలా? నీ డాడీ దగ్గర దాపరికం ఎందుకు, విషయం చెప్పవా ప్లీజ్.." లాలనగా అడిగాడు.


కొద్ది క్షణాల నిశ్శబ్దం తరువాత "మీ అల్లుడు గౌతమ్ నన్ను చీట్ చేసారు డాడీ!" అంది సమీర.


తన గొంతులో బాధ, ఉక్రోషం గమనించాడు సత్యమూర్తి.


"ఏమైంది తల్లీ.." అడిగాడు దిగులుగా.


"లాస్ట్ వీకెండ్ లో నాకిష్టమైన సినిమాకు కాకుండా వేరే సినిమాకు తీసుకెళ్లాడు. నెక్స్ట్ వీకెండ్ తీసుకెళ్తానని ప్రామిస్ చేసాడు. కానీ రేపటికి కూడా ఏదో రిసార్ట్ కి వెళ్దామంటున్నాడు. అంటే నన్ను చీట్ చేసినట్లే కదా.." ముక్కు ఎగబీలుస్తూ చెప్పింది సమీర.


సత్యమూర్తి సమాధానమిచ్చేలోగా ఎవరో కాల్ చేస్తున్నట్లు డిస్ప్లేలో వచ్చింది.


చూస్తే ఆ కాల్, ఉదయం ఆఫీసులో తాను మాట్లాడాలనుకున్న, కర్ణాటక లో అర్ ఎం గా పనిచేస్తున్న- శంకర్ దగ్గరనుంచి అని తెలిసింది. 


"ఆర్జెంట్ కాల్ వచ్చింది బేబీ. కాసేపాగి కాల్ చేస్తాను" అని కాల్ కట్ చేసి శంకర్ కాల్ లిఫ్ట్ చేసాడు.


"నమస్తే శంకర్ గారూ! ఎలా ఉన్నారు..నేనే మీకు కాల్ చేద్దామనుకుంటున్నాను" అన్నాడు సత్యమూర్తి.


"మీ విజయవాడ కే వచ్చి ఉన్నాను.. నోవాటెల్ లో దిగాము. రేపు ఉదయాన్నే దుర్గమ్మ గుడిలో మొక్కు చెల్లించుకోవాలి. వెంటనే హైదరాబాద్ బయలుదేరాలి. ఒకసారి మిమ్మల్ని కలుద్దామని మీ ఇంటికి వస్తున్నాను" చెప్పాడు శంకర్.


"అదేమిటి.. ముందుగా ఒకమాట కూడా చెప్పలేదు ? హోటల్ లో దిగడమేమిటి.." నిష్ఠూరంగా అన్నాడు సత్యమూర్తి. 


"ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో వచ్చాము. లేకుంటే మీ ఇంట్లోనే దిగేవాడిని. వాళ్ళు బంధువుల ఇంటికి వెళ్లారు. మేము మీ దగ్గరికి బయలు దేరాం. లాస్ట్ ఇయర్ మీ ఇంట్లోనే దిగాను కదా. అప్పటి మీ హాస్పిటాలిటీ గురించి ఇప్పటికీ నేనూ మా ఆవిడా మాట్లాడుకుంటూ ఉంటాము. మీ ఇల్లు గుర్తుంది. కాస్సేపట్లో వస్తున్నాము" చెప్పాడు శంకర్. 


"రండి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాము. భోజనం చేసికానీ వెళ్ళడానికి వీల్లేదు." చెప్పి ఫోన్ పెట్టేసాడు. విషయం భార్యకు చెప్పాడు. ఆమె వెంటనే వంట ప్రారంభించింది.


మరి కొద్ది సేపటికి శంకర్, అతడి భార్య పార్వతి వచ్చారు.

కాఫీలు అయ్యాక సత్యమూర్తి, శంకరం మాటల్లో పడ్డారు. పార్వతి, సావిత్రి వంటిట్లోకి వెళ్లారు.


తను రోజుకు పన్నెండు గంటలు ఆఫీసుకే కేటాయిస్తున్నా గ్రోత్ లేదంటూ జీఎం గారు మాట్లాడటం గురించి చెప్పాడు సత్యమూర్తి. శంకరం వేరే యూనియన్ అయినా అతనికి తను సభ్యుల దగ్గరనుండి ఎదుర్కొంటున్న వ్యతిరేకత గురించి కూడా చెప్పి, అతని సలహాలు, సూచనలు అభ్యర్థించాడు.


ఒక నిముషం మౌనం తర్వాత ఇలా చెప్పాడు శంకర్.


"చూడండి సత్యమూర్తిగారూ! డైలీ రిపోర్ట్స్ తెప్పించుకొని వాటి విషయంగా కాల్ చేసి సూచనలు ఇవ్వాలన్న మీ ఉద్దేశం మంచిదే. కానీ సిబ్బంది మీద ఒత్తిడి తెచ్చి సాధించే రిజల్ట్స్ తాత్కాలికమే. మీ దగ్గర పేరు తెచ్చుకోవాలన్న తాపత్రయంతో కొందరు, ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుందోనన్న భయంతో కొందరు రేపటి బిజినెస్ ను ఈరోజే క్యాచ్ చేసి ఉండొచ్చు. కానీ అలా ఎంతకాలం? 


బ్రాంచ్ హెడ్ లుగా ఉండేవారికి స్వతంత్రంగా అలోచించి నిర్ణయం తీసుకునే సమర్ధత, అవకాశం ఉండాలి. మీ అతి ఫాలో అప్ వారిని ప్రతి విషయంలో మీమీద ఆధార పడేలా చేసింది. స్వతంత్రంగా ఆలోచించే శక్తి కోల్పోయారు. మీరు చెప్పినట్లే చేసాం కదా.. మాదేం తప్పు లేదు అనే స్థాయికి వచ్చారు. మోనిటరింగ్ ఉండాలికానీ స్పూన్ ఫీడింగ్ ఉండకూడదు. 


వారిని ఎదగనివ్వండి. అందుకు కావలసిన సహకారం అందించండి. సిబ్బందిని అదిలించడానికి వెచ్చించే సమయంలో పదోవంతు మీ స్థాయిలో తీసుకోవలసిన నిర్ణయాలకు వెచ్చిస్తే ఖచ్చితంగా అభివృద్ధి ఉంటుంది.


ఇక యూనియన్ వ్యవహారాలు..


మీకు మీ సభ్యుల పట్ల అమితమైన శ్రద్ధ ఉంది. కాదనను. కానీ రోజువారీ వ్యవహారాల్లో మీ జోక్యం వారిని ఇబ్బందికి గురి చేస్తుంది.


ఉదాహరణకు స్టాఫ్ ఎవరికైనా లీవ్ కావాలంటే వాళ్ళ బ్రాంచ్ హెడ్ అనుమతి తీసుకుంటారు. అందుకు తగ్గ రాపోర్ట్ వాళ్ళు తమ బాస్ తో మైంటైన్ చేసుకుంటారు. కానీ ఆ లీవ్ వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకోవడం వలన మీ మెంబర్ అయిన ఆ స్టాఫ్ కి, ఆ బ్రాంచ్ హెడ్ కి మధ్య గ్యాప్ ఏర్పడటం జరుగుతోంది. గోటితో పోయే పని గొడ్డలి దాకా రావడం అనేలా జరుగుతోంది. సాధారణంగా జరిగే పనులు కూడా మీరు పోరాడి సాధించినట్లు అవుతోంది.


నేను చెప్పింది మీకు అర్థం అయి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ప్రతి విషయంలో మితిమీరిన మీ జోక్యం వల్ల అవతలివారు స్వతంత్రంగా ఆలోచించలేరు. సరైన నిర్ణయం తీసుకోలేరు" చెప్పడం ముగించాడు శంకర్.


"అర్థమైంది శంకర్ గారూ! మీరు ఈరోజు మా ఇంటికి రావడం నిజంగా నా అదృష్టం. నా పొరపాటు తెలుసుకున్నాను" చెప్పాడు సత్యమూర్తి తేలికపడ్డ మనసుతో.


శంకర్ దంపతులకు వీడ్కోలు చెప్పక హాల్లో సోఫాలో పక్కపక్కన కూర్చున్నారు సత్యమూర్తి, సావిత్రి.


"ఆఫీస్ విషయంలో శంకర్ గారి మాటలు నాకెంతో తెరిపిని ఇచ్చాయి. చాల రోజుల్నించి వేధిస్తున్న రెండు సమస్యలు తీరాయి" ఆనందంగా చెప్పాడు.

 

"వంటిట్లో వున్నా మీ మాటలు మాకు వినిపిస్తూనే ఉన్నాయి. అమ్మాయి విషయంలో కూడా మనం రోజూ తనతో మాట్లాడుతూ, ప్రతి విషయంలో కల్పించుకుంటూ ఉండటం వల్ల పొరపాటు జరుగుతుందేమోనని అనిపిస్తూ ఉందండీ. పార్వతి గారితో మాట్లాడాను. వాళ్ల రెండో అమ్మాయికి కూడా ఈ మధ్యే పెళ్లి జరిగిందట. అనవసరంగా ప్రతి దాంట్లో జోక్యం చేసుకోరట. అబ్బాయి పేరెంట్స్ కూడా అంతేనట. వీళ్ల అవసరం వుంటే మాత్రం వెనుకాడరట. పిల్లల హనీమూన్ కి వీళ్లు టికెట్స్ బుక్ చేస్తే హోటల్ రూమ్స్ వాళ్ళు బుక్ చేశారట. మన జోక్యం కొత్త దంపతులు దగ్గరయ్యేలా ఉపయోగపడాలేగానీ వాళ్ల తగాదాలకు సహకరించేలా ఉండకూడని చెప్పారావిడ" అంది సావిత్రి.


"నిజమే సావిత్రీ. అమ్మాయి దగ్గరనుండి డైలీ రిపోర్ట్స్ తెప్పించుకోవడం, రోజూ మాట్లాడానికి విషయాలు లేకపోవడంతో అమ్మాయి ప్రతి చిన్న విషయాన్నీ మనకు చెప్పడం, మనం మనకు తోచిన సలహా చెప్పడం.. ఇన్నాళ్ళూ జరుగుతోంది. మన అమ్మాయికి అల్లుడు గారితో మెలగడం అలవాటు కాకుండా పోయింది. మనం మన పద్దతి మార్చుకోవాలి. అమ్మాయి కష్టసుఖాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని రోజూ ఫోన్లు చేశామే కానీ మనల్ని రోజూ గుర్తు చేసుకోవాలని కాదు". అన్నాడు సత్యమూర్తి.


ఇంతలో కూతురు సమీర నుండి కాల్ వచ్చింది.

"సారీ బేబీ. అనుకోకుండా గెస్టులు రావడంతో కాల్ చెయ్యలేక పోయాను. ఇందాక ఏదో చెబుతున్నావ్.."


"అదే నాన్నా! సినిమాకి తీసుకెళ్తానని చెప్పి చీట్ చేసిన విషయం చెబుతున్నాను" అంది సమీర.


"అల్లుడిగారి సంగతి సరే.. ముందు మీ అమ్మ సంగతి చూడు. నాకిష్టమైన కంది పచ్చడి చెయ్యకుండా నెలనుండి చీట్ చేస్తోంది" చెప్పాడు సత్యమూర్తి.


"దానికే అమ్మను అంత పెద్ద మాట అనేసారా నాన్నా" అంది సమీర.


భర్త చేతినుండి ఫోన్ అందుకున్న సావిత్రి "మీ నాన్న మాత్రం తక్కువా.. చంద్రహారం చేయిస్తానని పెళ్ళైన కొత్తలో ప్రామిస్ చేసి ఇప్పటిదాకా కొనకుండా చీట్ చేసారు" అంది ఉక్రోషం నటిస్తూ.


"అదేమిటమ్మా! నీకు నాన్న చేయించినన్ని నగలు మన బంధువుల్లో వాళ్ల భార్యలకు ఎవ్వరూ చేయించలేదని నువ్వే ఎన్నోసార్లు చెప్పావు.." ఆశ్చర్యంగా అడిగింది సమీర.


"ఎన్ని కొనిస్తే మాత్రం.. నేనడిగిన చంద్రహారం కొనివ్వలేదు కదా" అంది సావిత్రి.


"అర్థం అయింది అమ్మా! ఇద్దరూ చేరి నన్ను ఆట పట్టిస్తున్నారు కదూ" అంది సమీర. 


"కాకపోతే మరేమిటి? నిన్ను కాకుండా మరో అమ్మాయితో సినిమాకో రిసార్ట్ కో పోతే చీటింగ్ అనే మాట వాడాలి. నువ్వడిగిన సినిమాకు తీసుకోక పోతే చీటింగ్ అంటావా?" కోపంగా అంది సావిత్రి.


"మరి మీరు పూటపూటా ఫోన్ చేసి విశేషాలడిగితే ఏం చెప్పను. ఆ టైం కి నాకు అనిపించింది చెప్పాను. బట్ ఐ లవ్ గౌతమ్" చెప్పింది సమీర.


"మీ పెళ్లయ్యాక లీవ్ లేదంటూ హనీమూన్ కి వెళ్ళలేదు. అల్లుడిగారిని కనుక్కొని డేట్స్ చెబితే టికెట్స్ బుక్ చేస్తాను" అన్నాడు సత్యమూర్తి.


"అవన్నీ గౌతమ్ చూసుకుంటాడు నాన్నా! హి విల్ టేక్ కేర్. మీరు అమ్మ చంద్రహారం సంగతి చూడండి" అంటూ నవ్వుతూ ఫోన్ పెట్టేసింది సమీర.


"అమ్మాయి చివర్న చెప్పిందేమిటో వినపడలేదు. నీకేమన్నా వినపడిందా?" అన్నాడు సత్యమూర్తి భార్య వంక నవ్వుతూ చూస్తూ.


"అదే.. మీకు రేపు కంది పచ్చడి చెయ్యమంది. చిన్న విషయాలు మనసులో పెట్టుకోవడం మీనుండే దానికి వచ్చిందట" అంది సావిత్రి తనూ నవ్వూతూ. 


"మరి రేపు భోజనాలయ్యాక జ్యూవెలరీ షాప్ కు వెళదామా చంద్రహారం కోసం.." అన్నాడు సత్యమూర్తి భార్యను దగ్గరికి తీసుకుంటూ. 


శుభం 


మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము.

 (అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).









56 views0 comments

Comments


bottom of page