top of page

దాక్షాయణీ - దినఫలాలూ

#Thirumalasri, #తిరుమలశ్రీ, #DakshayaniDinaphalalu, #దాక్షాయణీదినఫలాలూ, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు, #కొసమెరుపు

Dakshayani Dinaphalalu - New Telugu Story Written By Thirumalasri

Published In manatelugukathalu.com On 14/04/2025

దాక్షాయణీ దినఫలాలూ - తెలుగు కథ

రచన: తిరుమలశ్రీ

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)



సాయంత్రం ఆఫీసు నుంచి ముఖం వ్రేలాడేసుకుని వచ్చిన భర్తను ఎగాదిగా చూసింది దాక్షాయణి.

“మీ బాస్ చేత బాగా చీవాట్లు తిన్నారా ఇవాళ?” అని అడిగింది అనుమానంగా. 


రామారావు జవాబు ఇవ్వలేదు.


“ఇవాళ మీకు పై అధికారుల చేత అక్షతలు పడే ప్రమాదం ఉందని పొద్దుటే హెచ్చరించాను నేను. తెలిసికూడా పనిలో ఆమాత్రం జాగ్రత్తగా ఉండనవసరంలేదూ?” అంది నిష్ఠూరంగా. “అయినా, ఎందుకైనా మంచిదని ఈ రోజంతా మీ బాస్ కి ముఖం చూపించకుండా తప్పించుకు తిరగమని వెళ్ళేటప్పుడే చెప్పానుగా? నా మాట వింటేనా!”


“అలా తప్పించుకు తిరిగినందుకే అక్షింతలు వేయించుకున్నది నేను!” అన్నాడు కోపంగా.


“అదెలా?” బుగ్గలు నొక్కుకుని, అతని ముఖంలో చేయి త్రిప్పుతూ అడిగింది ఆమె.


రోజూ రామారావు ఆఫీసులో స్టాఫంతా ఆఫీసరు రాగానే ఆయన ఛాంబర్ కి వెళ్ళి ఓ న’మస్కా’రం కొట్టి, ‘ఎటెండెన్స్’ వేయించుకుని వస్తారు. ఆ రోజు దినఫలాలు చూసిన దాక్షాయణి, ‘ఆఫీసర్స్ నుంచి చీవాట్ల’ యోగం ఉందనీ, బాస్ కి ముఖం చూపించొద్దనీ’ సలహా ఇచ్చింది భర్తకు. ఆమె సలహాను అనుసరించి బాస్ ని ఎవాయిడ్ చేసాడు అతను. అంతే! బాస్ నుండి పిలుపూ, వెళ్ళాక తలమునకల అక్షితలూ పడ్డాయి- ఏదో వంకతో.


“వాడి ముఖం మండ! శాస్త్రులుగారు చూడొద్దన్నారని చెప్పలేకపోయారా?” అంది దాక్షాయణి.

గుర్రుగా చూసాడు రామారావు. “ఆ సంగతి చెప్పానంటే ఆయన నవ్వడు, నమ్మడు. ఉద్యోగంలోంచి పీకిపారేసి శాస్త్రులు గారి దగ్గరకు వెళ్లి శిష్యరికం చేసుకోమంటాడు” అనేసి, విసురుగా లోపలికి వెళ్లిపోయాడు. 


దాక్షాయణి మూతి మూడు వంకర్లు త్రిప్పుకుంటూ భర్త వెనుకే వెళ్ళబోయింది. 

అంతలో బయట మోటార్ బైక్ చప్పుడు వినిపించడంతో, గుమ్మం దగ్గరకు వెళ్లింది. కొడుకు రాజా వచ్చాడు. ఇరవైమూడేళ్ళు ఉంటాయి అతనికి. సివిల్స్ కి ప్రిపేర్ చేస్తున్నాడు. కోచింగ్ సెంటర్ నుండి తిరిగివచ్చాడు.


“ఆ రోజు చాలా మంచిదనీ, టికెట్ కొన్నవారికి లాటరీలో బంపర్ ప్రైజ్ వస్తుందనీ చెప్పి నెల క్రితం నాచేత అయిదు వేలు రూపాయలు పెట్టి ఆన్-లైన్ లో దుబాయ్ లాటరీ టికెట్ కొనిపించావు నువ్వు. ఇప్పుడు చూడు, లాస్ట్ ప్రైజు కూడా రాలేదు సరికదా, కష్టార్జితం ఐదు వేలూ వేస్ట్ గా లాస్ట్!” అన్నాడు నిష్ఠూరంగా.


“ఆ రోజు శాస్త్రులు గారు చెప్పిన దినఫలాలను బట్టేగా నీచేత లాటరీ టికెట్ కొనిపించాను నేను. బహుశా ఆ దుబాయ్ వాడికి దినఫలాల గురించి తెలిసుండదు. అందుకే నీకు ప్రైజ్ ఇవ్వలేదు” అంది దాక్షాయణి తేలికగా. 


“లేకపోతే, శాస్త్రులు గారి రీడింగ్ తప్పు కావడమే! అపచారం! అపచారం!” అంటూ చెంపలు కూడా వేసుకుంది. “మీ నాన్నగారినే తీసుకో. ఇవాళ ఆయనకు ఆఫీసరు చేత చీవాట్లు పడతాయి అని చెప్పారు. పడ్డాయా లేదా?”


“ఏమిటీ, ఇవాళ నాన్నగారిని వాళ్ళ బాస్ తిట్టాడా!?” ఆశ్చర్యంగా అడిగాడు రాజా.


గది లోంచి బయటకు దూసుకువఛ్చిన రామారావు, “ఇంకా వీధిలోకి వెళ్ళిమరీ టామ్ టామ్ వెయ్యవే…” అంటూ భార్య వంక కోపంగా చూసాడు.


దాక్షాయణికి నలభయ్ అయిదేళ్ళు వుంటాయి. జ్యోతిషశాస్త్రం అంటే పిచ్చినమ్మకం. దినఫలాలు క్రమం తప్పకుండా చూస్తూవుంటుంది. నిజానికి ఆవిడ ఉదయం లేవగానే వాటితోనే ముఖం కడుగుతుంటుంది అని చెప్పవచ్చును. 


ఓ లోకల్ టీవీ ఛానెల్ లో రోజూ ఉదయం ఆరుగంటలకు దినఫలాల కార్యక్రమం వస్తుంటుంది. దాన్ని శ్రీశ్రీశ్రీ జ్యోతిషానంద శాస్త్రులుగారు చెబుతుంటారు. శాస్త్రులుగారంటే దాక్షాయణికి గురి ఎక్కువ. ఆయన చెప్పినట్టు తు.చ. తప్పకుండా జరుగుతుంది అన్న ప్రగాఢనమ్మకం. తాను పాటిస్తుంది, కుటుంబసభ్యులను పాటించమంటుంది. అవి ఒకోసారి ఫలిస్తాయి, ఒకోసారి ఫలించకపోవచ్చును. కానీ, ఆమె నమ్మకంమాత్రం ఎట్టి పరిస్థితులలోనూ సడలదు. 


ద్రాక్షాయణి నమ్మకం వెనుక ఓ హిస్టారికల్ రీజన్ ఉంది. ఆమె తండ్రికి జాతకాలపిచ్చి. అహర్నిశలూ ఓ పాకెట్-సైజు పంచాంగం పుస్తకం జేబులో పెట్టుకుని తిరిగేవాడు. ఏ రోజు ఏ దిశ వైపు ప్రయాణం చేయవచ్చునో, ఏ రోజు ఎటువైపు వెళ్లకూడదో చూస్తేకాని ఇల్లు కదిలేవాడుకాదు. అలాగే మామూలుగా బయటకు వెళ్ళడానికి కూడా ముహూర్తాలు, దుర్ముహూర్తాలూ… వర్జ్యాలూ, రాహుకాలాలూ… శకునాలూ, శింగినాదాలూ… చూసుకునేవాడు. ‘అష్టమి-కష్టం’ అంటూ ఆ రోజున ప్రయాణాలు ఏవీ పెట్టుకునేవాడుకాదు- అత్యవసరమయినాసరే! అలాగే ‘షష్టి-నష్టి’ అంటూ ఆ రోజున కార్యక్రమాలు ఏవీ పెట్టుకోడు- కొంప మునుగుతున్నాసరే!


అదే అలవాటు దాక్షాయణికి వచ్చింది. వారం, వర్జ్యం చూస్తేతప్ప ఏ పనీ చేయదు, ఎవరినీ చేయనివ్వదు. 


‘మీ నాన్న ఆస్తికి వారసత్వం నీ అన్నలకూ, మూఢనమ్మకాలకు వారసత్వం నీకూ ఇచ్చాడు’ అంటూ ఎద్దేవా చేస్తుంటాడు రామారావు. దాక్షాయణి కోపంతో మూతి త్రిప్పుకుంటుంది.


ఓసారి ఇరుగు-పొరుగులతో కబుర్లు చెబుతూ, జ్యోతిషానందశాస్త్రులు గారి గురించీ, ఆయన చెప్పే దినఫలాల గురించీ గొప్పగా చెప్పుకువచ్చింది దాక్షాయణి. ఎవరి నమ్మకం వారిది! తమకు జాతకాలపైన నమ్మకంలేదు అని ఒకరంటే- తనకు జాతకాల ‘పిచ్చి’ లేదు అని ఇంకొకరూ… ఆమె పలుకులను కొట్టిపారేసారు. దాంతో ఆగ్రహించిన ద్రాక్షాయణి ఆ రోజు నుంచీ వాళ్ళు ఏ వస్తువు ఎరువు అడిగినా, అప్పు కావాలన్నా లేదు అనేయనారంభించింది.


అయితే, రామారావు ఆమెకు పూర్తి వ్యతిరేకం. దినఫలాలు, వారఫలాల మీద బొత్తిగా నమ్మకం లేదు. అందుకు కారణం- అతని తండ్రేనని చెప్పవచ్చును. అతని తండ్రికి జాతకాలు, జ్యోతిషాలపట్ల బొత్తిగా నమ్మకం లేదు. ‘మంచిపని తలపెట్టిన రోజే మంచిరోజు’ అన్నది ఆయన సిద్ధాంతం. దేవాలయాలకు వెళ్ళేవాడు కాదు. అలాగని, భార్య ఇంట్లో పూజలు చేస్తే అభ్యంతరం తెలిపేవాడూ కాదు. దైవంమీద కంటే స్వశక్తి మీద నమ్మకం మెండు ఆయనకు. ఆ విషయంలో వియ్యంకులు ఇద్దరూ ఉత్తర-దక్షిణ ధ్రువాలు!...


ఆ రోజు కాలేజ్ కి వెళ్ళడానికి సిద్ధం అవుతున్న కూతురి దగ్గరకు వచ్చి, “ఈ రోజు నీకు వాహనయోగం ఉందే, రాణీ!” అంది దాక్షాయణి ఉత్సాహంగా. 


“ఇవాళ కొత్తగా వచ్చేదేమిటి? అన్నయ్య రోజూ తన బైక్ మీద నన్ను కాలేజ్ దగ్గర దింపుతూనే వున్నాడుగా?” అంది రాణి. 


“ఏమో, శాస్త్రులు గారి ఉద్దేశ్యం ఏమిటో మరి?” అంది దాక్షాయణి.


ఐతే, సాయంత్రం స్కూటీ స్వయంగా నడుపుకుంటూ వచ్చిన కూతురివంక ఆశ్చర్యంగా చూసింది దాక్షాయణి.


“నా ఫ్రెండు జానీ ఊరికి వెళుతోంది. తాను తిరిగివచ్చేంతవరకు దీన్ని వాడుకోమంది నన్ను” అంది రాణి నవ్వుతూ. “నేను డ్రైవింగ్ నేర్చుకున్నది దీనిమీదే”.


దాక్షాయణి ముఖం వెలిగిపోయింది. “చూసావా, దినఫలాలు ఎలా నిజమయ్యాయో!” అంది.


నాలుగురోజుల తరువాత స్కూటీమీద కాలేజ్ కి బయలుదేరుతూన్న కూతురి దగ్గరకు వచ్చి, “రాణీ! ఇవాళ్టి దినఫలాలలో నీకు వాహనగండం అని వుంది. ఎందుకైనా మంచిది, ఇవాళ్టికి అన్నయ్య బైక్ మీద వెళ్ళు” అంది.


రాణి అదోలా నవ్వుతూ తల్లి పలుకులు కొట్టిపారేసింది.


“రానున్న ప్రమాదాన్ని తప్పించుకునేందుకు ఓ చిన్న తరుణోపాయంకూడా సూచించారు శాస్త్రులు గారు. కుక్కకు చపాతీలు పెడితే గండం గట్టెక్కుతుందట” అంది, కూతురు తన పలుకులు ఎలాగూ లెక్కచేయదు అని ఎరిగిన దాక్షాయణి.


అది ఆలకించి పడిపడి నవ్వింది రాణి. తండ్రి, అన్నగారూ కూడా ఆమెతో జత కలిపారు.


“వాట్, మమ్మీ! కుక్కకు చపాతీలూ, పిల్లికి పూరీలూ, ఆవుకు ఆవళ్ళూ పెడితే దోషం పోతుందా!?” అన్నాడు రాజా నవ్వాపుకుంటూ. దాక్షాయణి ముఖం మాడ్చుకుంది. 


తల్లి చిన్నబుచ్చుకోవడం చూసి, “నాకిప్పుడు టైమ్ సరిపోదు. కావలిస్తే రాత్రికి పెడతాన్లే, మమ్మీ!” అంది రాణి.


“పంచాంగం జేబులో పెట్టుకు తిరుగుతూ అష్టమినాడు ప్రయాణం నిషిద్ధం అనే మీ నాన్న అష్టమినాడే అంతిమ ప్రయాణం చేసేసాడు! గుర్తుందా?” అన్నాడు రామారావు నవ్వు ఆపుకుంటూ. 


“అలాగే, ఒక్కనాడూ గుడికి వెళ్ళని మా తాతయ్య మహాశివరాత్రి రోజున పరమపదించాడు. వింతగా లేదూ?” అన్నాడు రాజా- తండ్రి తండ్రిని తలచుకుంటూ.


దాక్షాయణికి ఉడుకుమోత్తనం ఉబికి వచ్చేసింది. ముఖం మాడ్చుకుని, సణుక్కుంటూ విసురుగా వంటింట్లోకి వెళ్లిపోయింది…


ఓ గంట తరువాత కూతురు స్కూటీని ఆటోరిక్షాలో వేసుకుని ఇంటికి తిరిగిరావడం చూసి కంగారుగా ఎదురువెళ్లింది దాక్షాయణి.


“ఏమయిందే, తల్లీ? ఆ దెబ్బలు ఏమిటే? స్కూటీకి ఏమయిందే?” అని అడిగింది ఆత్రుతగా.


“ఏమీ లేదులే, లోపలికి పద” అంటూ రాణీ ఆటో డ్రైవర్ కి ఫేర్ చెల్లించి ఇంట్లోకి వెళ్ళిపోతే, అతను దెబ్బతిన్న స్కూటీని తెచ్చి వరండాలో పెట్టేసి వెళ్లిపోయాడు.


తల్లి కంగారుపడుతూంటే, కూతురు చెప్పినదిది- ‘ట్రాఫిక్ లో పడి వెళుతూంటే హఠాత్తుగా కుక్క ఒకటి అడ్డుగా పరుగెత్తుకొచ్చింది. దాన్ని తప్పించడానికని ప్రయత్నించిన రాణీ పేవ్మెంట్ ని గ్రుద్దేసి పడిపోయింది. స్కూటీ దెబ్బతింది…’


“అందుకే కుక్కకు చపాతీలు పెట్టి వెళ్లమన్నది నేను. నామాట పడనిస్తేనా! అందరూ కలసి హేళన చేసారు నన్ను. ఇప్పుడు ఏమయిందో చూడు” అంది దాక్షాయణి నొచ్చుకుంటూ. కూతురి గాయాలను చన్నీటితో కడిగి మందు పూసింది. ముఖానికీ, చేతులకూ కాళ్ళకూ దెబ్బలు తగిలాయి.


“ఆ కుక్క మూలంగానే యాక్సిడెంట్ అయింది. నేను జాగ్రత్తగానే నడుపుతున్నాను. అదే అజాగ్రత్తతో రోడ్డుకు అడ్డంగా పరుగెత్తింది. నేను ఎలర్ట్ గా లేకపోతే చచ్చుండేది” అంది రాణీ.


“శాస్త్రులుగారు చెప్పినట్టు కుక్కలకు చపాతీ పెట్టుంటే…” అంటూన్న తల్లికి అడ్డువస్తూ, “రాత్రికి పెడతాను అని చెప్పి వెళ్ళానుగా?” అంది రాణి.


“దాన్నే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటారు!” అంది దాక్షాయణి…


మర్నాడు ఉదయం రామారావు ఆఫీసుకు బయలుదేరుతూ, “యాక్సిడెంట్ అయిందని తెలిసి రాణీని చూడ్డానికి వస్తానంది మా అత్తయ్య ఇవాళ” అని చెప్పాడు భార్యతో.


“ఆఁ!” అంది దాక్షాయణి ఉలికిపాటుతో.


“మా మేనత్త వస్తుందంటే అలాంటి ఎక్స్ ప్రెషన్ ఇచ్చావేంటీ!?” అన్నాడు అతను విస్తుపోతూ.

దాక్షయణి జవాబు ఇవ్వలేదు. కానీ, రాణీ నవ్వుతూ చెప్పింది- “ఇవాళ తనకు నీచులతో కలహం అని దినఫలాలు చెబుతున్నాయనీ, రోజంతా ఎవరినీ కలవననీ… పొద్దుటే తీర్మానించుకుంది మమ్మీ”.


దాంతో భార్య వంక తీక్ష్ణంగా చూసి వెళ్ళిపోయాడు రామారావు…


రోజూ జ్యోతిషానంద శాస్త్రులుగారి చేత దినఫలాలను చెప్పించే లోకల్ ఛానల్ ఆ రోజు ఎందుకో రావడం మానేసింది. దాంతో ఆ రోజుటి ఫలాలు ఎలా వుంటాయో తెలియక నానా హైరానా పడింది దాక్షాయణి. అయితే, ఆ రోజే కాదు, వరుసగా పదిరోజులుగా ఆ ఛానల్ ప్రసారం ఆగిపోయింది.


కారణం తెలియక కొట్టుమిట్టులాడింది దాక్షాయణి. భర్తకూ, పిల్లలకూ మాత్రం హాయిగా అనిపించింది- రోజూ ‘అది చేయండి…ఇది చేయకండి…’ అంటూ దాక్షాయణి పెట్టే ఆంక్షలబాధ తప్పినందుకు. 


“ఒరే, రాజా! ఆ ఛానల్ ఎందుకు రావడంలేదో కాస్త తెలుసుకుని చెప్పరా” అంది దాక్షాయణి.

రాజా కేబుల్ ఆపరేటర్ ని అడిగితే, “టెక్నికల్ ప్రోబ్లమ్ ఏదో వచ్చినట్టుంది. త్వరలోనే తిరిగి ప్రసారాలు మొదలుపెడుతుంది” అని చెప్పాడు. తల్లితో అదే మాట చెప్పాడు రాజా.


ఐతే, ఇంకో పదిహేనురోజులు గడచినా ఆ ఛానల్ రెజ్యూమ్ అవలేదు. దినఫలాలు తెలియకపోవడంతో దాక్షాయణికి గొప్ప సంకటంగా ఉంది. ఏ రోజున ఏం చేయవచ్చునో… ఏం చేయకూడదో… బోధపడక మదిలో దిగులు ఏర్పడింది. ఆమధ్య ‘నథింగ్ ఈజ్ గోయింగ్ రైట్’ అనిపించింది.


కడకు ఓ రోజున కొడుకుతో, “జ్యోతిషానంద శాస్త్రులుగారి ఇంటి అడ్రెస్ ఓసారి నోట్ చేసుకుని ఉంచుకున్నాను నేను. బోడుప్పల్ లో ఉంటారు. ఆయన ఇంటికి వెళ్ళి నెల్లాళ్ళకు సరిపడా దినఫలాలను అడిగి రాయించుకుని వచ్చేద్దాం. కాదనకురా బంగారం!” అంది బతిమాలుతూ.


తల్లి అభ్యర్థనను కాదనలేక, ‘సరే’ నంటూ ఆమెను తీసుకుని బోడుప్పల్ వెళ్ళాడు రాజా. ఎవరెవరినో అడిగి… ఎక్కడెక్కడో తిరిగి… చివరికి ఎలాగైతేనేం శాస్త్రులు గారి ఇంటిని కనిపెట్టగలిగారు తల్లీకొడుకులు.


జ్యోతిషానంద శాస్త్రులు గారి గురించి అడిగితే, ఆయన కొడుకట… ఇంచుమించు తండ్రి పోలికలోనే ఉన్నాడు… వచ్చి, “ఏం కావాలండీ?” అని అడిగాడు.


రాజా నోరు విప్పేలోపునే, దాక్షాయణి చెప్పింది- “లోకల్ ఛానల్ లో శాస్త్రిగారు చెప్పే దినఫలాలను ఆలకిస్తూ అనుసరిస్తుంటాను నేను. ఈమధ్య కొన్ని రోజులుగా ఆ ఛానల్ ప్రసారం ఆగిపోయింది. దినఫలాలు తెలియక పిచ్చెక్కిపోతోంది నాకు. శాస్త్రిగారు చెప్పే రీడింగ్స్ మీద ఉన్న నమ్మకం ఇతరులమీద లేదు. అందుకే శాస్త్రులుగారిని కలసి ఓ నెల్లాళ్ళ దినఫలాలను రాయించుకు వెళ్ళాలని వచ్చాను”.


కొద్దిక్షణాలు మౌనం వహించాడు అతను. తరువాత మెల్లగా ఇలా అన్నాడు- “నేను శాస్త్రిగారి అబ్బాయిని. నా పేరు పేరిశాస్త్రి. ఈ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియడంలేదు. నాన్నగారు కాలంచేసి సుమారు ఏడాదికాలం అయింది. అయినా, ఆ ఛానల్ వాళ్ళు రోజూ నాన్నగారి పాత ప్రెడిక్షన్స్ ని ప్రసారంచేస్తూ ప్రేక్షకులను మోసం చేయసాగారు. ఆ విషయం మాకు ఇటీవలే తెలిసింది. మేము పోలీసు కంప్లెయింట్ ఇవ్వడంవల్లే ఆ ఛానల్ శాశ్వతంగా మూతబడింది”.


ఫెయింట్ అయిపోతూన్న తల్లిని గబుక్కున పట్టుకున్నాడు రాజు.

*******

తిరుమలశ్రీ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం :

‘తిరుమలశ్రీ’ గారి అసలు పేరు పామర్తి వీర వెంకట సత్యనారాయణ. ఎమ్.ఎ. (సోషియాలజి), ఎల్.ఎల్.బి., సి.ఎ.ఎస్. భారతప్రభుత్వపు CSIR అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కి చెందిన వీరు, జాతీయ పరిశోధనాలయాల ‘చీఫ్ కంట్రోలర్ అఫ్ అడ్మినిస్ట్రేషన్' గా పదవీ విరమణ చేసారు…వీరి మరో కలంపేరు 'విశ్వమోహిని'. తెలుగులో వీరివి అన్ని జేనర్స్లోను, ప్రక్రియలలోను(బాలసాహిత్యంతోసహా) అసంఖ్యాక రచనలు ప్రముఖ పత్రికలన్నిటిలోనూ ప్రచురింపబడ్డాయి. సుమారు185 నవలలు ప్రచురితమయ్యాయి. పలుకథలు, నాటికలు, నాటకాలు ఆలిండియా రేడియోలోప్రసారితమయ్యాయి. కొన్ని నాటికలు దూరదర్శన్లో ప్రసారంకాగా, మరికొన్నిరంగస్థలం పైన ప్రదర్శింపబడ్డాయి. పలుకథలు బహుమతులను అందుకున్నాయి. కొన్నికథలు హిందితోపాటు ఇతర దక్షిణాది భాషలలోకి అనువదింపబడ్డాయి. ఓ మాసపత్రికలో రెండు కాలమ్స్ నిర్వహించారు. ప్రతిలిపి 'కథాకిరీటి', 'కథావిశారద', మరియు 'బాలకథాబంధు' (బాలసుధ-బాలసాహితీసంస్థ, విజయనగరం) బిరుదాంకితులు. 'కలహంస పురస్కార' గ్రహీతలు. ఆంగ్లంలో సుమారు100 కథలు, ఆర్టికల్స్ ప్రముఖ పత్రికలలోను, జాతీయ దినపత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్ని బహుమతులను అందుకున్నాయి. ఓ ప్రముఖ ఆంగ్ల జాతీయ దినపత్రికలో వీక్లీ (లిటరరీ) కాలం వ్రాసారు. ఓ జర్మన్ పబ్లిషింగ్ హౌస్ ద్వారా 20 ఈ బుక్స్ ప్రచురిత మయ్యాయి... స్టోరీ మిర్రర్ (ఆంగ్లం), ‘లిటరరీ బ్రిగేడియర్’ బిరుదాంకితులు, మరియు ‘ఆథర్ ఆఫ్ ద ఇయర్-2020’ నామినీ… హిందీలో అరడజను కథలు ప్రచురితం కాగా,ఓ బాలల నాటిక ఆలిండియా రేడియోలో ప్రసారితమయింది.

''స్టోరీ మిర్రర్- 'ఆథర్ ఆఫ్ ద ఇయర్-2020' అవార్డ్స్ (రీడర్స్ చాయిస్- ఫస్ట్ రన్నరప్ & ఎడిటర్స్ చాయిస్- సెకండ్ రన్నరప్) ట్రోఫీలు లభించాయి..."





Comments


bottom of page