'Dakshina Desa Yathra - 4' New Telugu Web Series
Written By Ayyala Somayajula Subrahmanyam
దక్షిణ దేశ యాత్ర చివరి భాగం
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
అరుణాచలం: పరమేశ్వరుడు అగ్నిలింగ రూపములో వెలసిన అతిమహిమాన్విత క్షేత్రం. ఈ అరుణాచల గిరిని ప్రదక్షిణ చేస్తే అనేక శుభ ఫలితాలు చేకూరుతాయి. నడక దారిన ప్రదక్షిణ చేయలేని వారు ఆటోలలో తిరిగి దండం పెట్టుకుంటారు. మేము కూడా ఆ విధంగానే చేశాము. కొంతమంది మాత్రము తెల్లవారు జామునే లేచి గిరి ప్రదక్షిణ చేశారు. ప్రదక్షిణ చేసిన పిదప స్నానము కాని, పడుకోవడము కానీ చేయరాదు. అగ్నిలింగం ఉండుట వలన ఇచ్చట వేడిగా ఉంటుంది. స్వామి స్తంభాకారములో ఉండును. అణ్ణాల్ అంటే అగ్ని. మలై అంటే పర్వతము. ఈ రెండూ కలిసి అణ్ణామలై అయింది. తిరుయనగా శ్రీ. అరుణ-ఎర్రని, చలము-కొండ. అ-రుణ యనగా పాపములను హరించునది యని యర్థము. 'అపిత కుచళాంబిక' ఇక్కడి అమ్మ వారి పేరు.
ఎక్కువమంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టమని రాత్రిపూట లేక తెల్లటవారు జామున గిరిప్రదక్షిణం చేస్తారు. ఇక్కడ నుండి రమణాశ్రమము రెండు
కిలోమీటర్ల దూరం. అక్కడకు వెళ్ళాము. ఎంతో ప్రశాంతము గా నున్నది. అంతా ఆశ్రమ వాతావరణం. ఆకులు పడితే వచ్చే శబ్దమే కానీ అంతా నిశ్శబ్దం గా ఉంటుంది. రమణాశ్రమమునకు దారిలో వినాయకుడి గుడి వస్తుంది. అక్కడ నుండి. అరుణాచలం ను చూస్తే నంది లాగా కనబడుతుంది.
1. చిదంబరం లో శివదర్శనం అంత సులువు కాదు.
2. కాశీలో చావడానికి వెళ్ళినా, అక్కడకు వెళ్ళిన
వారందరూ చావరు.
3. తిరువళ్ళూరు లో జన్మించడం మన చేతిలో లేదు.
ఈ అరుణాచలాన్ని స్మరించడం మాత్రం మన చేతిలో ఉంది. అరుణాచలం నుంచి ఉపాహారాలు సేవించి ఆంధ్రా వైపు పయనం.
పన్నెండవరోజు. మార్గమధ్యం లో కంచి కి వెళ్ళాము.
కంచి: కంచి లో మూడు ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలకు వెళ్ళాము.
శివకంచి- ఏకాంబరేశ్వరస్వామి, విష్ణుకంచి- వరదరాజస్వామి
మరియు కామాక్షి అమ్మవారు.
కంచి అనగా మొలచూల వడ్డాణం అని పేరు. అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. అమ్మ వారి నాభీభాగం ఇక్కడ పడిందని ప్రతీతి. ఇక్కడ అమ్మవారు పద్మాసనంలో యోగముద్రలో ఉండటం ఈ దేవాలయ ప్రత్యేకత. ఈ దేవాలయం ఐదు ఎకరాల స్థలం లో, నాలుగు విశాలమైన గోపురాలతో ఒక పెద్ద తటాకముతో విస్తరించ బడింది. అమ్మ వారి విగ్రహం ముందు ఉగ్రరూపం వుండి శాంతిపరచటానికి,
జగద్గురు శ్రీఆది శంకరాచార్యులు ప్రతిష్టించిన శ్రీచక్రం ఉంది.
అమ్మవారి చేతిలోన చెరుకుగడ, చిలుకను పట్టుకున్న తన కుడి చేతిలో పట్టుకుంది.
మరి రెండు చేతులలో పాశ, అంకుశాన్ని ధరించి ఉంటుంది.
విష్ణుకంచి: నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో ఒకటి వరదరాజస్వామి దేవాలయం. నూట ఎనిమిదిలో పదునాలుగు కంచిలోనే ఉన్నాయి. ఇక్కడే రామానుజాచార్యులు నివసించారు. సుమారు నూట ఇరవై అయిదు ఎకరాల స్థలంలో ఈ ఆలయం నిర్మిత
మైంది. ఈ ఆలయం మొత్తం మూడు ప్రాకారాలతో, ముప్పై రెండు ఉపాలయాలు, పంతొమ్మిది విమాన గోపురాలు, మూడువందల పై చిలుకు మండపాలతో శోభాయ
మానంగా విలసిల్లుతోంది. స్వామి దర్శనానంతరం వెలుపలికి వచ్చేటప్పుడు పై కప్పుకు ఒక రాతి దూలం పైన చెక్కిన బంగారు బల్లి మరియి వెండి బల్లిని తాకాలీ.
మేమందరమూ దర్శనం చేసుకుని బల్లులను తాకి వచ్చాము. వాటిని తాకిన వారు సమస్తదోషాలు, పాపాలు తొలగిపోయి ఆరోగ్యవంతులవుతారని చెబుతారు.
కంచిగరుడసేవ. ఈ ఆలయంలో భారీ ఇత్తడి గరుడవిగ్రహం ఉంది. ఈ విగ్రహం పైనే స్వామివారి ఉత్సవ మూర్తిని పెట్టి ఊరేగిస్తారు. స్వామి విగ్రహం కంటే గరుడవిగ్రహం
పెద్దదిగా ఉంటుంది. ఆ గరుడవిగ్రహానికి సేవ చేయడమనే మాట నే కంచిగరుడ సేవ అను పేరు వచ్చింది.
త్యాగయ్యగారు స్వామివారి మీద చక్కని కీర్తన రచిం
చారు. " కంచి వరదరాజ నిన్నే కోరి వచ్చితిరా, మ్రొక్కేదా"
శివకంచి: ఏకాంబరేశ్వరుడు: పంచభూతక్షేత్రాలలో ఒకటి. ఏకామ్ర. ఆమ్ర-మామిడి. అంబర- వస్త్రం., ఆకాశం అని నానార్థాలు. ఏకామ్రేశ్వరస్వామి యంటే ఒక్క మామిడి చెట్టుక్రింద వెలసిన స్వామి యని యర్థము. భూమిని సూచిస్తాడు.
అనగా పృథ్వీలింగం. ఆలయంలో నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క గాలిగోపురం 57 మీటర్లు. దేవాలయం లోపలి మండపంలో వెయ్యి స్తంభాలు ఉన్నాయి. ఆలయంలో 1008 శివలింగాలు ఉన్నాయి. ఈ దేవాలయంలో ఉన్న 3500 సంవత్సరాల మామిడివృక్షము లోని నాలుగు కొమ్మలు నాలుగు రకాల రుచిగల పళ్ళు కాస్తాయి.
కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్రీ ముత్తుస్వామి దీక్షితులు, ఈ క్షేత్రాన్ని దర్శించి 'పూర్వకళ్యాణి రాగంలో' "ఏకామ్రనాథం భజేహం" మరియు భైరవి రాగంలో ‘చింతయమా కంద మూల కందం' అను కృతులను రచించిరి.
ఈ పట్టణాన్ని వేయి ఆలయాల నగరం గా పిలుస్తారు. సాంస్కృతిపరంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన నగరం. హిందువులకు మోక్షప్రధానమైన ఏడునగరాల్లో ఒకటి. కంచి పట్టుచీరలు ప్రపంచ ప్రఖ్యాతి వహించినవి.
కంచి నుంచి బయలుదేరి తిరుపతి కి చేరుకున్నాము. రాత్రి క్రింద తిరుపతి లో బస. అక్కడ శ్రీకాళహస్తి, కళ్యాణ వేంకటేశ్వరస్వామి ని దర్శించుకున్నాము.
శ్రీకాళహస్తి: ప్రొద్దున్నే బయలుదేరి శ్రీకాళహస్తికి వెళ్ళాము. పదమూడవ రోజు. గురువారము. ( 21. 07. 2022) పంచభూతలింగాలలో ఒకటిగా ప్రసిద్ది చెందిన వాయులింగం. స్వయంభూనాథుడు. ఈ లింగానికి ప్రాణం ఉందని అంటారు.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. అద్భుతమైన వాస్తుకళకు ఈ నిర్మాణశైలి అద్దం పడుతుంది. చెక్కుచెదరని రీతిలో కనిపించే వేయికాళ్ళ మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణ. ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్నా శివలింగం ఎదురుగా ఉండే అఖండజ్యోతి మాత్రము ఎల్లప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. వాయులింగంగా కొలువైన స్వామివారి ఉచ్వాస నిశ్వాస గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్ముతారు.
మరొక విషయమేమిటంటే ఇక్కడ శివలింగాన్ని అర్చకులతో సహా ఎవరూ ముట్టుకోరు. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ. స్వామివారు పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తారు. దేశంలోని అతి పురాతన దేవాలయాల్లో ఒకటి. ధూర్జటి మహాకవి స్వామివారి మీద కాళహస్తీశ్వర శతకం రచించెను. ఇచ్చట స్వామివారికుండే నవగ్రహకవచం ద్వారా రాహుకేతువులతో బాటు గ్రహాలన్నీ స్వామి అదుపులో ఉంటాయని నమ్ముతారు. ఇక అమ్మవారికి కూడా కేతువు వడ్డాణం గా ఉంటాడు. అందువలన రాహుకేతు శాంతి పూజలు ప్రముఖంగా రోజూ జరుగు తుంటాయి. సాధారణంగా శైవక్షేత్రాల్లో నవగ్రహమండపం విడిగా ఉంటుంది. కానీ ఇక్కడ నవగ్రహాలన్నిటికి కాకుండా శనీశ్వరుడికి మాత్రమే మంటంపం ఉంది.
అక్కడ దర్శనాలు పూర్తి చేసుకుని తిరుపతికి బయలుదేరాము.
కళ్యణవేంకటేశ్వర స్వామి: కలియుగ దైవమైన వేంకటేశ్వరస్వామి కొలువైన క్షేత్రం తిరుపతి. భక్తుల పాలిటి కొంగు బంగారం గా ప్రఖ్యాతి గాంచినది. అయితే తిరుమలలో
శ్రీవారి ఆలయంతో పాటు శ్రీనివాసమంగాపురం ఆలయం కూడా అంతే ప్రసిద్ది చెందినది. ఈ ఆలయంలో స్వామివారు శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామిగా పూజలందుకుంటూ భక్తుల కోర్కెలు తీరుస్తున్నాడు. స్వామివారు నిలువెత్తు విగ్రహం చూడువారలకు చూచిన కొద్దీ చూడాలనిపించే నయనానందకర రూపము.
ఈ క్షేత్రాన్ని ఎవరైతే దర్శిస్తారో వారికి సకల సౌఖ్యాలు, పెళ్ళికాని వారికి కళ్యాణ సౌభాగ్యాన్ని వరంగా తిరుమలేశుడు ఇచ్చాడని పురాణ కథనం. "కళ్యాణవేంకటేశ్వర స్వామి” దర్శనంతో మా యాత్ర కళ్యాణవంతంగా ముగిసినది.
మన ఆలయాల శిల్పకళానైపుణ్యము ఎంత రాసినా, ఎంత చెప్పినా తక్కువే.
మహాకవి యన్నట్లు " శిలలపై శిల్పాలు చెక్కినారు మనవారు, సృష్టికే అందాలు తెచ్చినారు" లా ఉన్నాయి కళాఖండాలు. శిల్పుల చేతిలో శిల్పలు ఒక వెన్నముద్ద వలె
అమిరిపోయేవట. ఆ నాడు వారు సోప్‌స్టోన్ వాడేవారట. అది చెక్కిన పిదప గట్టి పడిపోతుందట. "21 నాడు తిరుపతి లో బయలుదేరి 22 నాటికి సికింద్రాబాద్" చేరుకున్నాము.
_________________________శుభంభూయాత్_________
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Comments