దాంపత్య బంధపు కళ
- Nallabati Raghavendra Rao
- Mar 2, 2023
- 9 min read

'Dampathya Bandhapu Kala' New Telugu Story
Written By Nallabati Raghavendra Rao
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
''నోరు ముయ్యి..''
''అదేమిటండీ'' భయపడింది ఆనందరావు భార్య అనసూయ.
''అవును.. నీలాంటి ఆడదాన్ని కట్టుకున్నందుకు నరకం అనుభవిస్తున్నాను. పిల్ల కళగా ఉంది చేసుకోరా అని మా పెద్దవాళ్ళు పెళ్లికి ముందు అంటే.. పుసుక్కున ఒప్పేసుకున్నాను. అప్పటి నుంచి నరకం అనుభవిస్తున్నాను నీతో. అన్ని కళలలో కాస్తో కూస్తో అనుభవం ఉన్న వాడిని.. పిసరంత కూడా ఆలోచించు కోలేక పోయాను.
ఇలా కాదు.. పెళ్ళాడవలసిన ఆడదాని లో కాపురం చేసేవాడికి కావలసిన క్వాలిటీలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి మగవాడికి ఆమెతో ముందుగా మూడు నెలలు టెంపరరీ కాపురం చేసే సరికొత్త రకం చట్టం ఈ మగాళ్లంతా కలిసి సాధిస్తేనే కానీ లాభం లేదు.
మనిషిగ పుట్టిన తర్వాత ఏదో ఒక కళలోనైనా స్పెషాలిటీ ఉండాలి. అంతేకానీ ఆడదైనా మగ వాడైనా అడవిలో మానులా బతకకూడదు. అడవిలో మాను కూడా ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరికి ఏదో రూపంలో ఉపయోగిస్తూ ఉంటుంది. నీ ముఖాన ఆ అవకాశం కూడా లేదు.నూనె మడ్డిలా ఆ జిడ్డు ముఖం చూడు.. చి చి'.అంటూ ఆనందరావు భార్యకు నానా చివాట్లు పెట్టి వంటింట్లో నుంచి వరండాలోకి విసురుగా వచ్చాడు.
వరండాలో పెద్దకొడుకు మురళి ఏదో పద్యం బట్టి పడుతున్నాడు. తన పక్కగా వచ్చి కూర్చున్న తండ్రిని చూసి మరీ బిగ్గరగా చదవటం మొద లు పెట్టాడు భయంతో.
''పద్యం వచ్చింది రా?'' ప్రశ్నించాడు కొడుకుని..
''వచ్చింది డాడీ.''
''సరే ఇంకేం చెప్పారు మీ కాన్వెంట్లో.'.
''రోజులాగే కథ చెప్పారు.''
''ఏమిటది?'
"పాత కథ..రాజుగారు ఏడు చేపలు.''
''కొత్త కథలు ఈ మాస్టారులకు వస్తే కదా. రాజ గారు బూజు గారు..తప్పించి ఇంకొకటి రాదు. రేపు మీ కాన్వెంట్ కి వచ్చి మీ లేడీ టీచర్ తో కొత్త కథలు చెప్పమని.. చెప్తాలే. పడుకో.. 9 గంటలకు అవుతుంది.''
తండ్రి మాటలతో మురళి మంచo ఎక్కి వెంటనే గాఢంగా నిద్రపోయాడు. మిగతా ఇద్దరు చిన్న పిల్లలు క్రింద చాప మీద నిద్రలో కమ్మని కలలు కంటున్నారు. సామాన్లన్నీ సరిది పాల గ్లాసుతో వచ్చిన అన సూయ భర్తకు అందించి.. ఇద్దరు చిన్న పిల్లల పక్కగా పడుకుంది.. చాప మీద.
ఆనంద రావు మళ్ళీ సాధింపులు మొదలు పెట్టాడు.
''నీ బతుక్కి అంతకన్నా ఏమి వచ్చును కనుక. తినడం కాళ్లు చాపుకుని పడుకోవడం మామూ లుగా కాదు గుర్రు పెట్టి మరీ పడుకోవడం. పెద్దోడు చదువుతు న్నాడు..చిన్న పిల్లలిద్దరూ రేపు ఎల్లుండో కాన్వెంట్ కి తగలాడతారు.. వాళ్లకి చదువు చెప్పాలి..అన్న ఇంగితం, ఆలోచన ఇవేవీ లేవు. అసలు నీకు అ ఆ లు అందంగా రాయడం వస్తే కదా వాళ్ళకి చెప్పడనికి.
నీలాంటి ఆడదాన్ని ఈ భూ ప్రపంచంలో ఎవ్వరు పెళ్లాడకూడదని.. నీ క్యారెక్టర్ మీద ఓ కథ రాస్తాను రచయితను కదా.. పోటీలకు పంపిస్తే ఏ సంస్థ వారైనా భలే ఉంది కథ అని పదివేల రూపాయలు ప్రధామ బహుమతి ఇస్తారు."
ఆనందరావు భార్య క్యారెక్టర్ లాంటి పాత్రతో కథ రాయడానికి మంచి ఐడియా దొరికినం దుకు దాన్ని టైపు చేసి సిస్టంలో ఈ మెయిల్ లో పంపడానికి సిద్ధంగా సిస్టం ముందు కూర్చు న్నాడు.
ఆనందరావు కథలు అల్లనూ గలడు.. రాయనూ గలడు.. వాట్లను ప్రింటింగ్ చేయించుకోనూ గలడు.. ఎందుకంటే పేరున్న రచయితల్లో అత ను ఒకడు గనుక.
అనసూయ మాట్లాడలేదు
మూగగా రోదించలేదు
శపించలేదు
కృంగిపోలేదు
కుళ్ళిపోలేదు..
అంతేకాదు పిచ్చిగా అరచి భర్త వైపు దుర్మార్గపు చూపు అసలే చూడలేదు.
మండుతున్న మనసు మీద కాసిన్ని ఎండ మావి కన్నీళ్లు పోసి నిద్రాదేవి బాహువుల్లో తనకు తెలియ కుండానే బందీ అయిపోయింది.
ఎందుకంటే ఆవిడకు ముగ్గురు పిల్లలు పుట్టడానికి మొదటి నుండి.. భర్త నుoడి ఈ రకం వేధింపులు బాగా అలవాటు.
**
ఆరోజు ఆదివారం..
ఆనందరావుకి ఒక్క నిమిషం తీరుబడి ఉండ దు. అతను ఒక పెద్ద రచయితే కాకుండా నటుడు, గాయకుడు, ..ఇంకా ఇంకా, ..
పరిషత్ నాటకంలో హీరోగా నటింప చేయడా నికి మిగిలిన ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఆనంద రావు ఇంటి మీద పడ్డారు. అతను గతంలో చాలా నాటకాలు ఆడి ఎన్నో సంస్థల ద్వారా ఉత్తమనటుడు గా మెమొంటోలు కూడా పొందాడు. రేపోఎల్లుండో బుల్లితెర హీరో ఐపోను గలడు. వెండితెర ఇంద్రుడు అయి పోయినా ఆశ్చర్యపడవలసింది ఆవగింజo తైనా లేదు.
ఆనందరావు బ్రహ్మాండమైన పోజుతో భార్యవంక చూస్తూ వాళ్లతో బయలుదేరాడు.
''నేను పెద్ద యాక్టర్ ని.. నీలా ఉప్పు లేని పప్పు చారు ముఖాన్ని కాదు. పదిమంది చేత ప్రశం సింప బడుతున్నాను. సత్కారాలు, సన్మానాలు, ప్రశంసలు, పూలదండలు, బొకేలు, మెమోo టోలు..అర్థమైందా రిహార్సిల్స్ కు వెళ్తున్నాను.. తలుపేసుకుని చావు..'' అన్నట్టుంది అతని చూపు.
ఈసారి కూడా అనసూయ మాట్లాడలేదు
అదోలా చూడలేదు
వెకిలిగా నవ్వలేదు..
**
మధ్యాహ్నం..రిహార్సల్స్ నుండి వచ్చి భోజనం చేసి నడుము వాల్చుదామనుకున్న ఆనంద రావు.. నలుగురు ఫ్రెండ్స్ ఇంటిదగ్గర రెడీగా ఉండడంతో ఉలిక్కి పడ్డాడు.
''ఈరోజు తప్పకుండా వస్తాను మీరు వెళ్ళండి.'' అన్నాడు.. ఆనందరావు కుర్చీలో కూర్చుంటూ.
''అలా కాదు గురువుగారు, మీరు మా వెంట రావాలి..మాపార్టీ స్వీకరించాలి మీ సుమధుర కంఠంతో మంచి పాటలు పాడి మా ఆడియో ఆల్బమ్ని నింపేయాలి. రోజు మీపాటలు యూ ట్యూబ్ లో విoటుంటే తెలుగువాళ్ళకి చాలా హాయిగా ఉంటుంది. మొన్న ఆ లక్ష్మణరావు సర్కిల్ వారు వచ్చి అడి గితే వెళ్లి మంచి పాటలు పాడి వచ్చారట కదా. మమ్మల్ని చూసి వాళ్లు పెద్ద పోజు కొడుతున్నారు. ఈరోజు మీరు మా వెంట రావాలి.. అప్పటివరకు కదలం.." అంటూ వాళ్ళు అక్కడే కూర్చుండిపోయారు.
ఆనందరావు చేసేది లేక వాళ్ళ వెంట వెళ్లి, వాళ్ళ ఆతిథ్యం స్వీకరించి, వాళ్ళ కోరిక తీర్చడం కోసం వాళ్లను అనుసరించాడు భార్య వైపు చిత్తు చేసినట్టు గమ్మత్తుగా చూస్తూ.
''నీలా సంగీత జ్ఞానం లేని సన్యాసిని కాదు. గొప్ప గాయకుడిని. నా గానాన్ని ఆడియో చేసుకుని 24 గంటలు వినాలని తహతహ లాడే వందలాది మంది అభిమానులు నాకు న్నారు. గతంలో రేడియోలో, టీవీలో ఎన్నో లలితగీతాలు విన్నావు కదా.. త్వరలో సినీ ప్లేబాగ్ గాయకుడ్ని కాబోతు న్నాను''..అన్నట్టుంది ఆనందరావు ఆ అదోరకం మత్తు చూపు.
అనసూయ కు మాటలు వచ్చు కానీ మాట్లాడలేదు.
అదోలా పదునైన చూపుతో వీరనారిలా చూడగలదు.. కానీ చూడలేదు.
***
రాత్రి ఏడు గంటలయ్యింది.
సోఫాలో కూర్చున్న ఆనందరావుకు అనసూయ ని చూస్తుంటే ఈమధ్య అసహ్యం బాగా పెరిగి పోతుంది.
తను గొప్ప రచయిత, ఇంకా గొప్పనటుడు, అంతకు మించి గాయకుడు ఇంకా అందగాడు.. బ్రహ్మాండమైన ఆటగాడు మంచి ఉపన్యాస కుడు. ఇంకా ఇంకా చాలా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి అతనిలో.
డిగ్రీ చదువుoది..సరిపడా ఉద్యోగం ఉంది. ఊరంతా సర్వకళాప్రపూర్ణుడు అని పిలుస్తారు.
తన భార్య మాత్రం తన దగ్గర ఏమాత్రం సరి పడని అణాకానికి ఆరువీశాలు తక్కువైనా అదోరకం సరి కొత్తరకం గ్రహంగా కనిపిస్తుంది అతనికి..దీనమ్మ జీవితం.. చ చ చి చి.. తనకు తానే నిందించుకున్నాడు ఆనందరావు.
'' ఈరోజు కాన్వెంట్లో ఏ కథ చెప్పారురా..?..''
పక్కనే కూర్చుని చదువుకుంటున్న కొడుకు మురళి వంక చూస్తూ అడిగాడు ఆనందరావు.
'' ఈరోజు ఆదివారం కదా నాన్న.. కాన్వెంట్ లేదు అమ్మే చాలా మంచి నీతి కథ చెప్పింది '' అన్నాడు మురళి.ఆనందరావుకి శరీరమంతా దురద పెడుతు న్నట్టు అయింది..
''దాని ఏడుపుకొట్టు ముఖానికి మంచి కథ కూడనా.. ఏం చెప్పిందేమిటి?''.. ప్రశ్నించాడు.
'' ఒక పండితుడు మరో ఊరు వెళ్లడానికి పడవ ఎక్కాడట నాన్న. ఆ పడక నడిపే వాడిని..
'అబ్బాయి నీకు శాస్త్రాలు తెలుసా?.. అని అడిగాడట. దానికి ఆ పడవ వాడు..
'ఏమీ తెలియని చదువురాని అజ్ఞానినయ్య'' అన్నాడట.
అప్పుడు ఆ పండితుడు 'నీలాంటి దద్దమ్మ ఈ భూ ప్రపంచం మీద బ్రతకడం అనవసరం' అన్నాడట నాన్న..
'' ఆ తర్వాత ఏం చెప్పిందిరా?''
"కాసేపటికి పడవ వాడు..' అయ్యా పండితుడు గారు ఇప్పుడు పెద్ద తుఫాను రాబోతుంది. పడవ మునిగిపోవచ్చు.. నాకు ఈత వచ్చు కనుక నా ప్రాణం రక్షించుకుంటాన..మరి మీకు ఈతవచ్చా?' అని అడిగేడట నాన్న.'''
మురళి ఇంకా ఏదో చెప్పబోతున్నాడు.
''నోరుమూయ్.. నోరుమూయ్.'' గట్టిగా అరిచాడు ఆనందరావు.
మురళి భయపడిపోయాడు.
''ఏ ఉద్దేశంతో మీ అమ్మ ఆ కథ నీకు చెప్పిందో నాకు తెలుసు. దాని పళ్ళు రాలగొడతాను.'' ఆనందరావు కోపంగా వంటింట్లోకి వెళ్లాలని పైకి లేచాడు.
భార్య ఎదురుగా వచ్చింది.
'' నీకేం తెలుసు అసలు.. వాడికి కథలు చెప్పే అంత గొప్పదానివా నువ్వు.
స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ వచ్చా నీకు, లాప్టాప్ అంటే ఏంటో తెలుసా? ఆ.. యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్.. అసలు ఒక్కదాని పేరయినా ఎప్పుడైనా విన్నావా..? ఏదో అలా అలా సర్దుకు పోతు న్నాను.
ఆఫ్ట్రాల్ టెన్త్ క్లాసు చదివావు. అసలు నీకు జకొస్లోవేకియా స్పెల్లింగ్ చెప్పడం వచ్చా. ఏది చెప్పు చెప్పు.. చెప్తే నీకు తెలివితేటలు ఉన్నాయని ఒప్పుకుంటాను.. చెప్పగలవా చెప్పు.. ఏమీ తెలియని చీమిడి ముఖం దానివి దొరికావు. పైగా నీతి కథలు చెప్పి కుర్రాడిని పాడు చేయడo..'' ఆనందరావు అరుస్తున్నాడు భార్య మీద..?
''నాన్న జకొస్లోవేకియా అంటే..?''
''అదో దేశం పేరు రా..''
''దాని స్పెల్లింగ్ నీకు తెలుసా నాన్న..?'' విచిత్రంగా చూస్తూ అడిగాడు.
''zeco..అని వస్తుంది రా''
''నేను కూడా అలాగే చెప్పాను మొన్న మాస్టారు కి..కానీ తప్పు నాన్న..Czeco.. అంటూ వస్తుందట".
''ఏడ్చావు.. నోరు మూసుకో''
''నిజమే నాన్న. నువ్వు మొన్న ఇచ్చిన డిక్ష నరీలో కూడా అలాగే ఉంది ఇదిగో..''
ఇంకా చిర్రెత్తిపోయింది ఆనందరావుకి.
''తింగర వెధవ.. కొన్ని కొన్ని స్పెల్లింగులు అలాగే. వెళ్లి నీ పని చూసుకో.'' అంటూ కసిరాడు.
అంతేకాదు భార్య వైపు చుర చుర చూస్తూ అసహనంతో చిందులు వేయడం మొదలెట్టాడు.
ఆమె మౌనంగా వంటింట్లోకి దారితీసింది..
ఈలోగా..
బయట తలుపులు దబదబమన్నాయి.
''ఎవరో వచ్చారు నాన్న.'' మురళి తండ్రి వైపు చూస్తూ అన్నాడు.
ఆ టైములో.. ఆ రాత్రి.. ఎవరు వచ్చారో తెలియక కిటికీలోంచి చూశాడు ఆనందరావు.
కాబూలీవాలా భరత్ కుమార్ అంబాలాల్..
నల్లని డ్రస్సు, గుబురు మీసాలు, చేతిలో రెండు అంగుళాల మందo.. 4 అడుగుల పొడవు బెత్తం.
''ఓలమ్మో.. ఓరి నాయనో..అయ్య బాబోయ్'' అదరిపడ్డాడు ఆనందరావు.
బ్యాంకు జాబు చేస్తున్నప్పటికీ అధిక ఆనందాల సుఖభోగాల కోసం అప్పు చేయక తప్పలేదు ఆనందరావుకి.
కాబూలీవాలాకు అతను ఇవ్వవలసిన అప్పు 32 వేల రూపాయలు.. పెద్దల సమక్షంలో పెట్టుకుని ఒప్పుకున్న చివరి గడువు దాటి ఈ రోజుకు వారం అయింది. పగలు తను కన పడడం లేదని పని గట్టుకుని రాత్రి సమయంలో వచ్చాడు..భరత్ కుమార్ అంబాలాల్.
ఆనందరావు వంటింట్లో ఉల్లిపాయలు తరుగు తున్న భార్య దగ్గరకు పరుగున వెళ్లిపోయాడు.
''ఏమిటండీ ఆ కంగారు.. ఆ చెమటలు ఏమిటి ఇప్పటికిప్పుడే ఏమైంది మీకు? ఇంతవరకు బాగానే ఉన్నారు కదా.'' అంటూ విస్తుపోతూ ఆదుర్దాగా అడిగింది అనసూయ.
''ఆ భరత్కుమార్ అంబాలాల్ వచ్చాడే..నాకు డబ్బులు ఇంకో నెలకు కానీ సర్దుబాటు కావు. చెబితే వాడు వినడం లేదు. తాకట్టు పెడదా మంటే ఇంట్లో బంగారాలు కూడా లేవు. నువ్వు బయటికి వెళ్లి ఎలాగోలా బతిమిలాడి నచ్చచెప్పి పంపిoచే సేయ్. నా గురించి అడిగితే అర్జెంటు పని మీద పొరుగూరు వెళ్లానని చెప్పు.''
ఆనందరావు భార్య రెండు చేతులు పట్టు కుంటూ ఆమె పైటకొంగు తో తన చెమటలు ఒత్తుకుంటూ ఇంచుమించు ఏడుపు ముఖంతో ఆమె ముఖం లోకి చూస్తూ అన్నాడు అత్యంత మిక్కిలి మహా ప్రాధేయ పూర్వకంగా.
''అలాగే నేనేదో చెప్పి పంపేస్తాగా భయపడకండి'' అంటూ వచ్చి తలుపు తీసి అంబాలాల్ గారికి నమస్కరించింది అనసూయ.
గౌరవంగా లోపలకు తీసుకువచ్చి కూర్చోబెట్టి చాలా రకాలుగా సర్ది చెప్పింది.
''నీ మొగుడు ఎంత జూట్ ఏంటమ్మా. వడ్డీ లేకుండా ముప్పది రెండు వేలు జమ చేస్తానని ఒప్పుకుని ఇవ్వకుండా ఏడిపిస్తున్నాడు. చూడ మ్మా నువ్వు తెలుగు సాంప్రదాయం పిల్లలా కని పిస్తున్నావు. నీకు ఎంత మాత్రం ఆనందరావు తగడమ్మా. మాట నిలబెట్కోలేని ఇలాంటివాడు.. వీడిని మనిషి కాదు మాను అంటాం మేము.
నువ్వు సరిది చెప్పి మమ్మల్ని చల్లపరిచావు కనుక ఆగుతున్నాం.
మనుషుల్ని తెప్పించి నిమిషంలో సామాన్లు ఎత్కొని పోగలం. నీ ముఖం చూసి మూడు నెలల నుంచి నిలదుక్కుకున్నాం. నీ మాట మీద ఇంకా ఒక్కనెల ఆగుతాo. మీ ఆయన వంటింట్లో ఉన్నాడా వీధిలో ఉన్నాడో మాకు తెల్వాదు. అసలు మడిసికి ఒక మాట గొడ్డుకి ఒక దెబ్బఅంటారు. వీడిది వంద దెబ్బలు కొట్టిన సిగ్గులేని జన్మ. నీ యొక్క మంచి మాట. నెమ్మది తనంతో వెళ్ళి పోతాను.
మాది వ్యాపారమే.. మేము పిల్లకాయలతో బ్రతకాలి కదా. దయాదాక్షిణ్యంగా తక్కువ వడ్డీ కానీ చక్రవడ్డీల మీద చక్రవడ్డీల బిజినెస్ కాదమ్మాయి మనది. నీ మొగుడికి లాస్ట్ వార్నింగ్.మళ్లీ నెల తర్వాత బాకీ చెల్లు చేయకపోతే.. లక్ష రూపాయలు ఇవ్వాలి అని పోలీస్ కేసు పెట్టి జబర్దస్త్ చేస్తాం.'' అంటూ ఒక నిమిషం ఆగకుండా విసురుగా వెళ్లి పోయాడు కాబూలీవాల భరత్ కుమార్ అంబాలాల్.
అతని మాటలు మొత్తం విన్న ఆనందరావు అత ను వెళ్ళిపోయాక వంటింట్లో గ్యాస్ స్టవ్ వెనుక నుండి నెమ్మదిగా పిల్లిలా బయటకు వచ్చాడు. వీధి తలుపు వేసి లోపలికి వచ్చింది అనసూయ.
'' అమ్మయ్య..ఇప్పటికి గండం గడిచింది.'' అను కుంటూ..ఆయాస పడుతూ కుర్చీ మీద కూర్చున్నాడు.. ఆనందరావు.
అనసూయ లోపల నుండి గ్లాస్ తో మంచినీళ్లు తెచ్చి అతని కళ్ళల్లోకి చూస్తూ.. తాగండి..
అంటూ అందించింది.
''ఏవండీ.. అన్ని విద్యలు తెలిసిన సర్వ కళా పరిపూర్ణులు అనుకున్నాను.. ఈ విద్య మాత్రం తెలియదా మీకు పాపం. మనిషిని ఎప్పుడూ కించపరచకండి. మీకు వచ్చిన విద్యలు నాకు రావు. అలాగే నాకు వచ్చిన విద్యలు మీకు రావు. ప్రపంచంలో ఇప్ప టికీ సర్వ కళాపరి పూర్ణులు ఎవరు పుట్టలేదు.. పుట్టబోరు..!
మీలో ఓ స్పెషాలిటీ ఉంటే నాలో మరో స్పెషా లిటీ ఉంటుంది..అదే దేవుడు మానవజాతికి ఇచ్చిన..స్పెషాలిటీ!!!'' అని.. అనసూయ అనలేదు.
అర్థవంతమైన ఎగతాళి చూపూ చూడలేదు.
భర్త ప్రక్కగా కూర్చుని నాలుగు ధైర్యవచనాలు చెప్పింది.
ఎందుకంటే..
సర్వకళలకు మించిన.. అరువది ఐదవ కళ ''దాంపత్య బంధపు కళ'' పూర్తిగా తెలిసిన
ఆడది కనుక!
***
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Podcast Link
Twitter Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు
Comentarios