top of page

దాంపత్య జీవితం



'Dampathya Jivitham' - New Telugu Story Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 30/07/2024

'దాంపత్య జీవితం' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


కోపం.... మంచు....

పగ.... (కాంక్రీటు) గోడ...

ఆమె పేరు వనజ...

అతని పేరు విజయ్.....

అయినారు వారిరువురూ ఆలుమగలు....


గోపాల్‍రావు రాజకీయ చతురుడు. వయసు యాభై. వారి అర్థాంగి సుమలత. వారు వనజ తల్లిదండ్రులు. సుమలత బి.ఎ పాసైంది. గోపాల్‍రావు ఎల్.ఎల్.బి, వనజ బి.టెక్. శకుంతలమ్మ గోపాలరావు గారి సోదరి. వారి భర్త ఆదినారాయణ. వారు సివిల్ కాంట్రాక్టర్. ఆ దంపతుల ప్రియ పుత్రుడు విజయ్. వీరు ఇండియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్. రెండువారాల క్రిందట వనజ, విజయ్‍ల వివాహం ఘనంగా జరిగింది.


ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం గోపాలరావు సుమలతలకు వనజ ఒక్కతే కూతురు.

అలాగే ఆదినారాయణ, శకుంతలమ్మలకు విజయ్ ఒక్కడే కొడుకు.


అన్న గోపాలరావు, చెల్లెలు శకుంతలమ్మ వనజ, విజయ్‍ల వివాహానికి ముందు ఒక ఒప్పందం చేసుకొని వారి వివాహాన్ని జరిపించారు. 


ఆ ఒప్పందం.... విజయ్, వనజలు మూడునెలలు ఆదినారాయణ ఇంట్లో, తరువాత మూడునెలలు గోపాలరావు గారి ఇంట్లో ఉండేలా నిర్ణయించుకొన్నారు.


ఆ ఒప్పందం విషయం ఆదినారాయణకు (విజయ్ తండ్రి) సుమలత (వనజ తల్లి) లకు తెలియదు.

వివాహం తరువాత వనజ అత్తగారి ఇంటికి కాపురానికి వచ్చింది. తన అమ్మా, మామల ఒప్పందం విజయ్‍కు తెలియదు. కానీ ఆ విషయం వనజకు తెలుసు.


వనజ, గోపాలరావు గారి ముద్దుల కూతురు...

విజయ్, శకుంతలమ్మకు ప్రియనందనుడు....


రెండు కుటుంబాల వారికి ధనధాన్య వస్తు వాహనాదుల విషయంలో ఏ కొరతా లేదు. ఏ పని చేయకుండా కూర్చొని తిన్నా, రెండు మూడు తరాలకు సరిపడే తరగని సంపదలు వున్నాయి. వనజ రాకెట్....


విజయ్ మతాబుపుల్ల....


మేనరికం అయినందున ఆస్తులు వేరే వారికి సంక్రమించకుండా వుండేటందుకుగా గోపాల్ రావు (అన్న) శకుంతలమ్మ (వారి చెల్లి) వనజ, విజయల వివాహాన్ని జరిపించారు.


కోడలు ఉదయం ఏడు, ఒక్కోరోజు ఎనిమిది గంటలకు నిద్రలేవడాన్ని ఆదినారాయణగారు గమనించారు. అది వారికి నచ్చలేదు. కాఫీ గ్లాసుతో తాను సమీపించిన అర్థాంగి శకుంతలను చూచి....


"కోడలు పిల్ల నిద్రలేచిందా!" అడిగాడు ఆదినారాయణ.


"లేవలేదు. కొత్తగా పెండ్లి అయింది కదా!"


"అయితే!... విజయ్ ఆరుగంటల కల్లా నిద్రలేచి తయారై ఆఫీసుపని వుందని వెళ్ళాడుగా!"


"మీరే అన్నారుగా పని వుందని!.... పని వున్నవాడు వెళ్ళాలిగా మరి!"


"శకుంతలా!...."


"ఏమిటండీ!...."


"కోడలు పొద్దు ఎక్కిన తరువాత నిద్రలేవడం సరైన పద్ధతి కాదు. నీ మేనకోడలేగా సౌమ్యంగా నచ్చచెప్పు. కనీసం విజయ్ నిద్రలేచిన వెంటనే అయినా ఆమె నిద్ర లేవాలని చెప్పు"


"అలాగేనండి!"


"తల్లితండ్రుల పద్ధతులు పిల్లలకు మార్గదర్శకాలవుతాయి. మీ అన్న తాగి పడుకొని ఉదయం ఎనిమిది, తొమ్మిది గంటలకు నిద్ర లేచినట్టుగా మన కోడలు నిద్ర లేవకూడదు. అది మన ఇంటికి, తన ఒంటికీ మంచిది కాదు" చిరాగ్గా చెప్పాడు ఆదినారాయణ.


శకుంతలమ్మ మౌనంగా తలాడించింది.


’ఈ మనిషి మిలటరీ మనిషి... ఆ పిల్ల ఆ యింటి గారాల పట్టి. యదార్థంగా కూడా ఎనిమిది గంటలైనా నిద్రలేవకుండా ఏ ఇంట్లోనైనా పిల్లలు ఆడగాని, మగగాని వుంటారా!.... ఆయన అలా అనడంలో తప్పులేదుగా!... నేనే చెప్పాలి వనజకు, ఉదయాన్నే విజయ్ నిద్రలేవగానే తనూ లేవాలని!’ అనుకొంది శకుంతలమ్మ. 


విజయ్ బెడ్ రూములోకి వచ్చింది శకుంతల.

వనజ నిద్రలోనే వుంది.

"వనజా!...." పిలిచింది శకుంతల.


వనజకు మెలకువ రాలేదు.

చేతిమీద తట్టి "వనజా!..." కాస్త హెచ్చు స్థాయిలో అంది శకుంతల.


వనజ కదిలింది, కళ్ళు తెరిచింది. ఎదురుగా వున్న అత్తగారిని చూచింది.

"ఏమిటత్తయ్యా!.... ఉదయాన్నే నిద్రలేపారు!" చిరాకుగా అంది వనజ.


"గంట ఎంతో తెలుసా!"


"మీరు చెప్పలేదుగా!...."


"తొమ్మిది!... ఇంత పొద్దు ఎక్కేదాకా నిద్రపోకూడదమ్మా! ఈ ఇంటి ఆచారం, ఉదయం ఐదుగంటల కల్లా నిద్రలేవాలి." అనునయంగా చెప్పింది శకుంతల. క్షణం తర్వాత.....

"నా కొడుకు నిద్రలేచి తయారై ఆఫీసుకు వెళ్ళిపోయాడు!"


"ఆయన ఆఫీసుకు వెళ్ళిపోతే నేను నిద్రపోకూడదా!" శకుంతల కళ్ళల్లోకి తీక్షణంగా చూచింది వనజ.


"ముందు మంచం దిగు. రెస్టురూముకు వెళ్ళు. స్నానం చేసి బట్టలు మార్చుకొని వంట ఇంట్లోకి రా. కాఫీ తాగుదువుగాని...."


"నాకు బెడ్ కాఫీ తాగే అలవాటు!...."


శకుంతల కొన్ని క్షణాలు వనజ ముఖంలోకి చూచి క్రిందికి వెళ్ళిపోయింది.

పనిమనిషి బుజ్జిచేత వనజ వున్న గదికి కాఫీ పంపింది.

వనజకు కాఫీ అందించింది బుజ్జి.

వనజ కాఫీ సిప్ చేసింది.

"ఇది కాఫీయా!"


"అవును చిన్నమ్మగారూ!...."


"ఎవరు కలిపారు?"


"మీ అత్తమ్మగారు!"


"చక్కెర పానకంలా వుంది. తీసుకెళ్ళి స్ట్రాంగ్‍గా చక్కెర తక్కువగా వేసి తీసుకురా. నీవు నేను చెప్పినట్లు కలుపుకొనిరా!" తీక్షణంగా అంది వనజ.


"అలాగే చిన్నమ్మగారూ!" వనజ చేతిలోని కప్పును అందుకొని బుజ్జి క్రిందికి వంటగదివైపుకు వెళ్ళింది.


వనజ ’ఏం కొంపో, ఏం మనుషులో కాఫీ పెట్టడం చేతగాలే!’ రెస్టు రూంలోకి వెళ్ళింది. 


తన ఆఫీసు గది నుండి హాల్లోకి వచ్చారు ఆదినారాయణగారు. వీరి దినచర్య ఉదయం నాలుగున్నరకు లేవడం, ఇంటిచుట్టూ అరగంట జాగింగ్ చేయడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, జగత్ మాతాపితలను అరగంట పూజించడం, అప్పటికి అయిదు సమయం ఆరున్నర అవుతుంది.

శకుంతలమ్మ నిద్రలేచి స్నానం చేసి వారిని పూజామందిరంలో కలిసేది. దైవధ్యానాన్ని వారితో పాటే చేసేది.


ఆది నారాయణగారు ఆఫీసు రూముకు వెళ్ళి కూర్చునేవారు. శకుంతలమ్మ కాఫీ గ్లాసుతో వారి ఆఫీసు గదిలో ప్రవేశించేది. గ్లాసును వారికి అందించేది. ఒకరోజు.....

"శకుంతలా!.... నీవు త్రాగావా!"


"లేదండీ వెళ్ళి తాగుతాను"


"శకుంతలా!"


"ఏమిటండీ!"


"నీవు నాకు కాఫీ ఇచ్చేముందు నీవు త్రాగి నాకు ఇవ్వాలి లేదా నీవు మన ఈ ఆఫీసు గదిలో ప్రవేశించేటప్పుడు రెండు కాఫీ గ్లాసులతో రావాలి. కాఫీ తాగుతూ నేను మా ప్రోగ్రామును నీకు చెబుతాను. నేను వూర్లోనే వుంటానా!.... బయట వూర్లలో జరిగే కట్టడ పనులను చూచేదానికి వెళతానా, లేక ఎవరినైనా కలిసేదానికి వెళతానా, మధ్యాహ్నం అన్నానికి ఇంటికి వస్తానా!..... బయటనే తింటానా!.... రాత్రి ఎన్నిగంటలకు తిరిగి వస్తాను అనే విషయాలను నేను నీకు చెబుతాను. అంటే దాదాపు ఓ పావుగంట, ఇరవైనిముషాలు నీవు నా ముందు కూర్చోవాలి. కాబట్టి నీవూ నాతో కాఫీ తాగాలిగా!..." ఎంతో అనునయంగా చెప్పాడు ఆదినారాయణ.


వెంటనే శకుంతలమ్మ వంట గదికి వెళ్ళి కాఫీ కలుపుకొని గ్లాసుతో వారి ఆఫీసు గదిలో ప్రవేశించింది.

ఆ సంఘటన వారి ఆ ఇల్లు కట్టి ఆఫీసు రూమును ఏర్పరచుకొన్న తొలిరోజున జరిగింది. అంటే ఇప్పటికి పదహారు సంవత్సరాల క్రిందట "సార్!.... ఈ రోజు తమరి ప్రోగ్రామ్ ఏమిటి?" నవ్వుతూ అడిగింది శకుంతల.


"శకుంతలా! పదిహేను సంవత్సరాలుగా నీవు ఇదే సమయానికి నాకు కాఫీ ఇస్తున్నావ్. అవునా!..."

"అవునండీ!...."


"అలాగే నీ మన కోడలు, నా... అదే మన కొడుక్కు ఇవ్వాలిగా!...."


"ఇవ్వాలండీ!..."


"శకుంతలా!.....యదార్థంగా విజయ్‍కి వనజతో వివాహం జరుపడానికి నాకు ఇష్టం లేదు. కారణం వారి ఇంటి పద్ధతులు, మన పద్ధతులు వేరు. కానీ నీకు మీ అన్నమీద వున్న ప్రేమాభిమానాలతో వనజను నీ కోడలిగా ఆ ఆస్థి మనకు చెందాలనే ఉద్దేశ్యంతో చేసుకోవాలని నన్ను కోరారు. నీ మాటను కాదని, నిన్ను నొప్పించడం నాకు ఇష్టం లేక వారి వివాహానికి అంగీకరించాను. మరో విషయం నేను తాపీమేస్త్రిని. మీ అన్నయ్య కాకలు తీరిన సీనియర్ లాయర్, జిల్లా కోర్టులో. కాకిపిల్ల కాకికి ముద్దు. వనజను ఎంతో గారాబంగా ఆమె ఆడింది ఆటగా, పాడింది పాటగా పెంచాడు. దానికి నిదర్శనం తొమ్మిది గంటలైనా వనజ, మన కోడలు నిద్రలేవకపోవడం. ఆడవారు అంత పొద్దుఎక్కిందాకా నిద్రపోవడం ఇంటికి మంచిది కాదన్న విషయం నీకూ తెలుసు. సమస్య ప్రారంభం అయింది. దీన్ని ఆదిలోనే అణిచివేయాలి. లేకపోతే.... ఈ ఇంట ఎవరికీ మనశ్శాంతి వుండదు. అలాంటి స్థితి నీకు నాకు మన కొడుక్కు పట్టకూడదు. మన బిడ్డ అమాయకుడు, సౌమ్యుడు. కానీ నీ కోడలు... చాలా గడుసుపిల్ల. ఆమెను మన దారిలోనికి తేవడం అన్నది నీ చేతిలో పని. ఎలా చేప్తావో..... వనజలో మార్పును ఎలా తెస్తావో నీ ఇష్టం.... ఈ విషయాన్ని గురించి నేను ఆమెతో మాట్లాడటం సమంజసం కాదు. నీవే ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి" ఎంతో సౌమ్యంగా చెప్పాడు ఆదినారాయణ.


శకుంతల మౌనంగా వారి సంభాషణను విన్నది.

ఆఫీసు అకౌంటెంట్ బాలభాస్కర్ వచ్చాడు ఇరువురికీ నమస్కరించాడు.

శకుంతలమ్మ లేచింది.

"కూర్చో శకుంతలా!.... బాలభాస్కర్ కూర్చో...." చిరునవ్వుతో చెప్పాడు ఆదినారాయణ.


ఇరువురూ కూర్చున్నారు.

"శకుంతలా! నేను మీ అమ్మానాన్నల పేర ఒక అనాథ ఆశ్రమాన్ని నిర్మించి నడపాలనుకొంటున్నాను. ఆ విషయాన్ని గురించి మాట్లాడేదానికి భాస్కర్‍ను పిలిపించాను. ఈ విషయంలో నీ అభిప్రాయం?" అడిగాడు ఆదినారాయణగారు.


శకుంతల వదనంలో చిరునవ్వు "మీ ఇష్టమే నా ఇష్టం అండి వస్తాను" లేచి లోనికి వెళ్ళిపోయింది.

*

తన భర్త చెప్పిన మాటలను గురించి ఆలోచిస్తూ రాత్రి వంటను ముగించింది శకుంతలమ్మ. పనిమనిషి పనులన్నీ చేసి వెళ్ళిపోయింది. 


’అవును వారు చెప్పిన ప్రతి అక్షరము సత్యమే. తన పాతిక సంవత్సరాల సంసారిక జీవితంలో వారు నన్ను కాదు కదా, తన క్రింద పనిచేసేవారిని కూడా ఏనాడూ నిర్లక్ష్యంగా అవమానకరంగా మాట్లాడింది తాను వినలేదు. చూడలేదు. అలాంటి వారికి వనజ చర్యలు బాధ కలిగిస్తున్నాయి. ఆ పిల్లల తత్త్వాన్ని మార్వాలంటే అది తన అన్న ఒక్కడికే సాధ్యం. కాబట్టి నేను అన్నయ్యతో మాట్లాడాలి.’ అని నిర్ణయించుకొంది శకుంతల. 


ఆదినారాయణ పనిమీద బయట వూరికి వెళ్ళారు. వారు రాత్రికి వస్తారు.

వనజ వారి (భార్యాభర్తల) గదిలో కూర్చుని టీవీ చూస్తూ ఉంది. కాపురానికి వచ్చి పదిరోజులైనా అత్తతో కలిసి వంట పనులు చేయాలనే భావన వనజలో కలుగలేదు.


దాన్ని అలాగే వదిలేస్తే సమస్య పెద్దదవుతుంది. దాని తత్వాన్ని మార్చాలి.

వారి బెడ్ రూములో వున్న ల్యాండ్ లైను నుంచి శకుంతల తన అన్న గోపాలరావుకి ఫోన్ చేసింది.

వారు వారి ఇంట్లో ఆఫీసు గదిలో కూర్చొని వచ్చిన ఒక పార్టీ మెంబర్స్ తో మాట్లాడి వారిని పంపించారు.


వారి సెల్‍ఫోన్ మ్రోగింది. చేతికి తీసుకున్నారు.

"హలో! అన్నయ్యా!..."


"అన్నయ్యా నేను!..."


"ఆ... ఏమ్మా ఎలా వున్నావు?... నీ కోడలు ఎలా వుంది? మీవారు, నా అల్లుడూ!...."


"అంతా కుశలమే అన్నయ్యా!"


"బావగారు ఇంట్లో వున్నారా!"


"లేరు బయట వూరికి పనిమీద వెళ్ళారు రాత్రికి వస్తారు."


"ఆ.... ఏమిటమ్మా విశేషాలు!..."


"అన్నయ్యా!....."


"చెప్పరా!"


"మన వనజ!....."


"ఏమ్మా!.... ఏమంటుంది?"


"మా ఇంటి వాతావరణానికి తగినట్లు నడుచుకోవడం లేదు. ఉదయం ఎనిమిది గంటలైనా నిద్రలేవడం లేదు. ఆ విషయాన్ని మీ బావగారు గమనించారు నాతో చర్చించారు."


"అలాగా!...."


"అవును అన్నయ్యా!...."


"నేను రేపు మన ఇంటికి వస్తాను."


"వద్దన్నయ్యా!... రేపు సాయంత్రం మన శివాలయంలో కలిసికొందాం. నీవూ వదినా రండి. దేవుణ్ణి దర్శించి అక్కడ మాట్లాడుకొందాం...."


"సరే అమ్మా!.... అలాగా నేను మీ వదిన వస్తాం!....."


"ఓకే అన్నయ్యా.... థాంక్యూ! పెట్టేస్తున్నా!"


"మంచిదమ్మా!"


శకుంతలమ్మ ఫోన్ రిసీవర్ పై పెట్టేసింది.

*

సాయంత్రం ఏడుగంటలకు విజయ్ ఆఫీసు నుండి బయలుదేరాడు. పెట్రోలు బంక్‍లో బులెట్ బండి ట్యాంక్ ఫుల్ చేసుకొన్నాడు. బులెట్‍తో రోడ్డు పైకి వచ్చాడు. మల్లెపూలు అమ్మే మనిషి అతన్ని సమీపించింది.


"అయ్యా పూలు!...."


"మూర ఎంత?"


"ఇరవై రూపాయలు సామీ!..."


"ఐదు మూరలు యివ్వు"


పూల మనిషి ఐదు మూర్ల పూలను ప్లాస్టిక్ కవర్ వేసి విజయ్‍కు అందించింది.

నూరు రూపాయల నోటును ఆమెకు ఇచ్చి విజయ్ ఇంటివైపుకు  బయలుదేరాడు. ఇరవై నిమిషాల్లో ఇంటికి చేరాడు. శకుంతల హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంది.


విజయ్ "అమ్మా! వనజ ఎక్కడ?"


"మీ గదిలో వుంది."


"ఏం తనూ ఇక్కడే కూర్చుని టీవి చూడవచ్చు కదా!"


పూలను తల్లికి అందించబోయాడు.

"నాన్నా!... ఈ పూలను నీవు వనజకు ఇవ్వు!" నవ్వుతూ చెప్పింది శకుంతలమ్మ. 


 విజయ్ వేగంగా మేడమీది తన గదివైపుకు నడిచాడు.

వనజ....

"అయితే మంచాలు వేరు చేయాలంటావా?"

.....   ..... ......    ........   .......

"ఓహో దానివల్ల మగాడికి అదే మన భర్తకు మనమీద గాలి అదేగా ప్రేమ పెరుగుతుందంటావా?"

.....   ..... ......    ........   .......

"మీ వారికి, నీ అనుమతి వారానికి ఎన్నిసార్లు?"

.....   ..... ......    ........   .......

రెండు సార్లేనా!" ఆశ్చర్యంగా అంది వనజ.

.....   ..... ......    ........   .......

ద్వారం దగ్గరకు చేరిన విజయ్ పై సంభాషణను విన్నాడు. ఎవరో స్నేహితురాలు... పరమకిరాతకితో వనజ సంభాషిస్తూ వుందని గ్రహించాడు.

మూసివున్న తలుపును తట్టాడు.

వనజ బెదిరిపోయింది.


"సరేలేవే! మావారు వచ్చినట్లు వున్నారు. నేను తరువాత మాట్లాడుతాను" ఫోన్ కట్ చేసి తలుపు తెరిచింది.


విజయ్ నవ్వుతూ నిలబడి వున్నాడు.

"ఎప్పుడొచ్చారు?"


"తలుపు తట్టేదానికి ఒక సెకండ్ ముందు...." గదిలో ప్రవేశించాడు చిరునవ్వుతో....

"ఫొనులో ఎవరు?"


"నా ఫ్రెండ్ మల్లి!"


"ఓహో!.... ఆమెకు వివాహం అయిందా!"


"ఆ....అయింది... సంవత్సరం క్రిందట"


"వారి భర్త పేరు?"


"దీపక్!.... మీలాగే ఇంజనీర్. మీ ఇండియన్ బ్యాంకులోనే మా నాన్న ఉద్యోగం ఇప్పించారు. ఇప్పుడే వస్తాను" వనజ రెస్టు రూములోని వెళ్ళింది.


విజయ్ ఆమె సెల్‍ఫోను చేతికి తీసుకొని మల్లి ఫోన్ నెంబరును నోట్ చేసుకొన్నాడు. వనజ ఫోనును యధాస్థానంలో వుంచాడు. ఐదు నిముషాల తర్వాత వనజ అతన్ని సమీపించింది.

తన చేతిలోని పూలను వనజకు అందించాడు.

"ఏం ఈరోజు చిత్రంగా పూలు తీసుకొని వచ్చారు."


"ఓ పేదారాలు ఎదురై కొనమని అడిగింది. కొన్నాను. తీసుకెళ్ళి అమ్మ చేతికి ఇవ్వు సంతోషిస్తుంది."


"ఎందుకు సంతోషం?"


"నీవుగా పూలు ఆమెకు ఇచ్చినందుకు. కొంత దేవుడికి తీసుకొని మిగతావి నీకు ఇస్తుంది. మా అమ్మ చాలామంచిది వనజ."


"ఓహో!.... అలాగే" వనజ గదినుండి క్రిందికి దిగింది.


విజయ్ తన హెడ్ ఆఫీసుకు ఫోన్ చేసి వేరే బ్రాంచిలో వున్న దీపక్ ఫోన్ నెంబరును తీసుకొన్నాడు. అతనికి ఫోన్ చేశారు.

"హలో!...."


"మాట్లాడేది దీపక్ గారా!"


"అవును సార్. మీపేరు?"


"విజయ్!...."


"హో విజయ్ గారా! గుడ్ ఈవెనింగ్ సార్. మీ గురించి చాలా విన్నాను"


"ఏమని?"


"చాలా స్ట్రిక్ ఆఫీసర్ అని" నవ్వారు దీపక్.


"రేపు ఉదయం ఏడుగంటలకు మన ఆఫీసు ప్రక్కనున్న గాంధీ పార్కులో నన్ను కలవగలరా?"


"తప్పకుండా వస్తాను సార్!"


"ఓకే దీపక్ థాంక్యూ!...." విజయ్ ఫోన్ కట్ చేశాడు.


విజయ్ వనజ ఫోనుతో మల్లికి ఫోన్ చేశాడు. గొంతు మార్చి వనజలా మాట్లాడాడు.

"మల్లీ!..."


"ఎవరూ?"


"నేనే వనజను"


"ఏయ్ వినీ ఏందే నీ గొంతు అలా వుంది?"


"జలుబు చేసిందే!"


"అలాగా! ఏమిటి విషయం?"


"రేపు ఉదయం ఏడుగంటలకు గాంధీ పార్కులో కలుద్దాం సరేనా"


"సరేనే వస్తాను."


విజయ్ సెల్ కట్ చేసి యాథాస్థానంలో వుంచాడు.

వవజ గదిలోకి వచ్చింది. విజయ్ తెచ్చిన పూలతో మూడోవంతు పూలు ఆమె తల్లో వున్నాయి.

"నీ తల్లో పూలు!"


"మీరు తెచ్చినవే!"


"అవి నీ తల్లోకి ఎలా వచ్చాయి?"


"మీ అమ్మగారు పెట్టారు"


"అర్థం అయిందా మా అమ్మ గుణం ఎలాంటిదో!"


"మీ అమ్మ నాకు మేనత్త" వెటకారంగా అంది వనజ.


"ఓహో అలాగా. నాకు తెలీదులే!...." సరదాగా నవ్వుతూ డ్రస్ విప్పి టవల్ చుట్టుకొని స్నానానికి రెస్టు రూముకి వెళ్ళాడు విజయ్. వనజకు మల్లి ఫోన్ చేసింది.


"వనీ!.... రేపు ఉదయం ఏడుగంటలకు గాంధీ పార్కుకురా. అక్కడ మనం...." మల్లి సెల్‍లో బ్యాటరీ డౌన్ అయ్యి సెల్ ఆగిపోయింది.


రాత్రి భోజనానంతరం వనజ రెండు సార్లు మల్లి ఫోనుకు ట్రై చేసింది. కానీ మల్లి కాల్‍ను రిసీవ్ చేసుకోలేదు.

*

మరుదినం విజయ్ ఆరున్నరకు రెడీ అయినాడు. విజయ్‍కు విచిత్రం అనిపించేలా అతనికన్నా ముందు లేచి వనజ రెడీ అయ్యింది. 

"ఏమిటీ విశేషం, ఆరున్నరకల్లా రెడీ అయ్యావ్?"


"గాంధీ పార్కుకు వెళ్ళాలి. నా ఫ్రెండును కలవాలి!"


"నేను అటువైపే వెళుతున్నాను. నాతో వస్తావా!"


"అక్కడ మీకేం పని?"


"నేనూ నా ఫ్రెండును కలవాలి"


"కారా..... బుల్లెట్టా!"


"బులెట్!"


విజయ్, వనజలు క్రిందికి దిగారు.

ఆ సమయంలో జంటగా వారిరువురిని చూచిన శకుంతలమ్మ ఆశ్చర్యపోయింది.

"ఏరా విజీ!... ఇంత ఉదయాన్నే మీ ఇరువురూ!...." ఆమె పూర్తి చేయకముందే.....

"గాంధీ పార్కుకు వెళుతున్నాం అమ్మా!" చెప్పాడు విజయ్.


"జాగింగుకా!"


"ఆ.....ఆ... అలాగే అనుకో" నవ్వాడు విజయ్.

"వెళ్ళివస్తాం అమ్మా!"


"మంచిది నాన్నా!"


"అత్తయ్యా!....." వనజ పూర్తిచేయకముందే....

"చాలా మంచిదమ్మా వెళ్ళిరండి" అంది శకుంతల.


ఆఫీసు గదిలో కూర్చుని వున్న ఆదినారాయణ వారి సంభాషణను విన్నాడు.

’కోడలు పిల్లలో మార్పు వచ్చిందా!’ అనుకొన్నాడు.


విజయ్, వనజలు బులెట్‍పై గాంధీ పార్కుకు బయలుదేరారు.

*

మల్లి, దీపక్‍లు ఒకరికి తెలియకుండా ఒకరు పార్కుకు చేరారు. ముందు దీపక్, తరువాత మల్లి. దీపక్, విజయ్ కోసం నిరీక్షణ. మల్లి వనజ కోసం వెయిటింగ్.


విజయ్ బులెట్‍ను గాంధీ పార్కు ముందు ఆపాడు.

వనజ దిగి " థాంక్యూ!" వేగంగా లోనికి వెళ్ళిపోయింది.


విజయ్ బులెట్‍ను పార్కుచేసి దీపక్‍కు ఫోన్ చేశాడు. దీపక్ పార్కులో తాను ఏ వైపున ఎక్కడ వున్నదీ విజయ్‍కు చెప్పాడు. విజయ్ ఆ దిశగా మెల్లగా నడవసాగాడు.

వనజ మల్లికి ఫోన్ చేసింది. తాను ఎక్కడ వున్నదీ మల్లికి వనజకు తెలియజేసింది.

గోపాలరావు గారి ఇంటి ప్రక్కనే గాంధీపార్కు. వారు ప్రతిరోజూ ఆ పార్కులో ఆరు గంటలకు ప్రవేశించి ఒక గంటసేపు జాగింగ్ చేయడం వారి అలవాటు.


పార్కులో ప్రవేశించిన తన కూతురు వనజను, అల్లుడు విజయ్‍ను వారు చూచారు. ఆ ఇరువురూ వేరేవేరే దిశలో ఎవరినో వెతుకుతున్నారన్న విషయాన్ని గమనించారు. వారు ముందు వనజను ఫాలో చేశారు. వనజ మల్లిని కలవడం చూచారు. తర్వాత విజయ్‍ను ఫాలో చేసి అతను దీపక్‍ను కలవడం చూచారు.


కూతురు అల్లుడూ ఆ సమయంలో వేరువేరుగా ఆ పార్కుకు ఎందుకు వచ్చినట్లు? వారు కలిసిన స్త్రీ పురుషులు ఎవరు? ఏమిటి కథ?... గమనించాలని నిర్ణయించుకొన్నారు.


విజయ్.... వనజలకు చెట్ల చాటున  కొద్దిదూరంలోనే వున్నారు. వారికి కనబడకుండా ఏపుగా పెరిగిన మొక్కల మాటున దాగి వారి సంభాషణను వినాలనుకొన్నారు గోపాలరావుగారు.

"సార్!... మీరు విజయ్ సార్ కదూ!...."


"అవును దీపక్ నేనే! ఆ సిమెంట్ బెంచి మీద కూర్చుందాం రండి" ఇరువురూ కూర్చున్నారు.


"మిస్టర్ దీపక్ సార్!.... నేను మీకన్నా చిన్నవాడిని. నేను చెప్పే విషయాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. ముందుగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. జవాబు చెప్పాలి!" చిరునవ్వుతో అడిగాడు విజయ్.


"అడగండి సార్!...."


"మీరూ మీ భార్యామణి అన్యోన్యంగా వుంటున్నారా?"


దీపక్, విజయ్ ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయాడు.

"సార్!"


"చెప్పండి. మరోమాట. మనలాగే మీ ఆవిడ మా ఆవిడా ఇదే పార్కులో ’భర్తలను ఎలా కంట్రోలులో పెట్టుకోవాలి’ అనే సబ్జెక్టుపై డిస్కర్షన్ చేస్తూ ఏదో ఒక ప్రక్క వున్నారు. ఆ సభాధ్యక్షురాలు మీ శ్రీమతిగారు" చిరునవ్వుతో చెప్పాడు విజయ్.,


"నా భార్య అదో టైపు సార్!"


"అంటే...!"


"తన మాటే చెల్లాలి, నెగ్గాలనే మొండి ఘట్టం, భర్తంటే గౌరవం లేదు సార్!" విచారంగా చెప్పాడు దీపక్.


"బ్రదర్! వారి తత్త్వాన్ని మనం మార్చాలి. వారి తప్పును వారు తెలుసుకొని వారి పంధాను మార్చుకొనేలా చేయాలి. దానికి మనలో సౌమ్యత, నిగ్రహం వుండాలి. మీ భార్య, నా భార్యకు ఇచ్చిన సలహా, మంచాలను వేరు చెయ్యి, వారానికి రెండు రోజులు మాత్రమే పక్కను, పక్కతో కలుపమంది సార్!" విచారంగా చెప్పాడు విజయ్. 


రెండు క్షణాల తర్వాత....

"దీపక్ సార్! మనలను కన్న తల్లిదండ్రులు మనమీద ఎన్నో ఆశలను పెట్టుకొని బ్రతుకుతుంటారు. మనకు వచ్చిన ఇల్లాలు మన మనోతత్త్వాన్ని గ్రహించి అత్తామామలతో, వారి తల్లిదండ్రులతో ఎలా వుంటారో ఆ రీతిగా నడుచుకోవాలి. వారు మన అమ్మానాన్నలను తమ తల్లిదండ్రులుగా భావించాలి. అభిమానించాలి, ఆదరించాలి దీనికి మీరేమంటారు?"


"మీ మాట అక్షర సత్యం సార్! కానీ నా భార్యకు అలాంటి భావన లేదు" విచారంగా చెప్పాడు దీపక్.

"దీపక్ సార్! డోంట్ వర్రీ. మనం ఇప్పుడు మన అర్థాంగుల మహా సభలో అనాహ్వాన అతిధులుగా ప్రవేశించబోతున్నాము. నేను మీ అర్థాంగిగారికి గట్టిగా ఓ క్లాస్ కండెక్ట్ చేస్తాను. ఆవిడ మనోతత్త్వంలో మార్పు రావాలన్నదే నా ఆశయం. మీరు నాతో సహకరించాలి!.... ఏమంటారు?"


"ఓకే బ్రదర్! ప్లీజ్ ప్రొసీడ్!" చిరునవ్వుతో చెప్పాడు దీపక్.


"పదండి..."


ఇరువురూ లేచి వనజ, మల్లి కూర్చుని ఇక ఇక పక పకలతో చర్చను సాగిస్తున్న సిమెంట్ బెంచీని సమీపించి, వారి ముందు నిలబడ్డారు. వారిని చూడగానే వనజ, మల్లీల నవ్వులు ఆగిపోయాయి. ఆవేశంగా ముందుకు నడిచిన దీపక్ మల్లి చెంపపై కరుగ్గా కొట్టాడు. ఆ క్షణంలో అతని నయనాలు చింత నిప్పుల్లా వున్నాయి.

మల్లి కళ్ళల్లో నీళ్ళు.....

వనజ బిత్తరపోయింది.


గోపాలరావు గారు చెట్లచాటు నుండి అంతా గమనిస్తున్నారు.


"నా జీవితాన్ని నరకం చేసినట్లు ఈ విజయ్ బాబు జీవితాన్ని నరకం చేయాలని నీ రాక్షస ఉపదేశాలను ఆ అమ్మాయికి చేస్తున్నావా!" మరలా చేతిని పైకెత్తాడు దీపక్.


విజయ్.... అతని చేతిని పట్టుకొని ఆపాడు.


"చూడండి మల్లిగారూ!...... మా తల్లిదండ్రులు మాకు జన్మనిచ్చి పెంచి పెద్దచేసి మన చిటికెన వ్రేళ్ళు కలిసేలా చేశారు. మా యింటి మా అమ్మస్థానంలో మిమ్మల్ని ప్రతిష్టించారు. మీరు మీ ఉనికి స్థానాన్ని తెలుసుకొని, మాతో, మా కుటుంబ సభ్యులతో కలిసిపోయి, మాకు మావారికి ఆనందాన్ని పంచి, మీరు మా జీవితాంతం వరకు మాతో ప్రేమాభిమానాలతో వర్తించాలి. మా ఇంటి ఆచార వ్యవహారాలను గౌరవించాలి, పాటించాలి. సంతతికి నేర్పాలి. మీ మనస్సు.... వనజా!.... నీవూ జాగ్రత్తగా విను. మీ తల్లిదండ్రుల కుటుంబంపై మీకు ఏ భావన వుంటుందో అదే భావన మీ అత్తగారి ఇంటి వారిపైన, మీ భర్త పైనా వుండాలి. ఒక్కమాట గుర్తుంచుకోండి ఉభయులూ, మగవాడు ఏ తప్పు చేసినా అది వాడికి అంటదు. అదే ఒక స్త్రీ తప్పు చేస్తే ఆమెకు ఏర్పడే పేరు వేరే!... ఆ కళంకాన్ని ఆమె మాపుకోలేదు. కనుక ధర్మం అన్నది అమ్మ ఇంట అత్త ఇంటా ఒక్కటే అనే సత్యాన్ని తెలుసుకొని, మీ జీవిత భాగస్వాములతో ఆనందంగా సంసార జీవనాన్ని గడపాలని కోరుకోండి. మీమీద మాకున్న ప్రేమను చంపకండి. పెంచండి. మీరు ఆనందంగా వుండండి. మీవారందరికీ ఆనందాన్ని పంచండి. అదే మంచి మానవత్వం" ఆవేశంగా చెప్పుకొచ్చిన విజయ్ ఆగిపోయాడు.


వనజ, మల్లి కళ్ళల్లో కన్నీరు. తలలు దించుకొన్నారు.

దీపక్ నయనాల్లో ఆనంద భాష్పాలు.

విజయ్‍ను గట్టిగా కౌగలించుకొన్నాడు.

"శెభాష్ సోదరా శెభాష్!" పరవశంతో అన్నాడు దీపక్.


"బ్రదర్ దీపక్! మీటింగులు ముగిశాయిగా ఇక ఇళ్లకు బయలుదేరుదామా!"


"యస్ బ్రదర్. థాంక్యూ వెరీమచ్!"


నలుగురూ వాహనాల స్టాండును సమీపించారు. దీపక్, విజయ్ వదనాల్లో ఆనందం. వనజ, మల్లి మస్తిష్కాల్లో ఆలోచన... వేదన. మనస్సులో గోపాలరావు "మై సన్ ఈజ్ గ్రేట్ గ్రేట్" ఆనందంగా నవ్వుకొన్నాడు.

*

ఆ సాయంత్రం గోపాలరావు శివాలయంలో తన సోదరి శకుంతలను కలుసుకొన్నాడు.

"అన్నయ్యా!..." ప్రీతిగా నవ్వుతూ గోపాలరావును సమీపించింది శకుంతల.


ఇరువురూ దైవదర్శనం భక్తితో చేసుకొన్నారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయం ప్రక్కన వున్న మండపంలో కూర్చున్నారు.


"అమ్మా శకూ! నిన్న ఉదయం గాంధీ పార్కులో నేను నా అల్లుడిని వనజను, అల్లుడి స్నేహితుడు దీపక్, అతని భార్య మల్లిని చూచానమ్మా! నా అల్లుడు వారికి చెప్పిన మాటలను విని నా ఒళ్ళు పులకించింది. అహంకారపు అంధకారంలో వున్న వనజ, మల్లీలకు గీతోపదేశాన్ని చేసి వారి కళ్ళను తెరిపించాడమ్మ నీ కొడుకు. వారి పెండ్లికి ముందు మనం అనుకొన్న షరతును నేనే రద్దు చేస్తున్నాను. దాంపత్య జీవితం అనేదాన్ని భార్యాభర్తలు వారి సహాజీవనంలో ఒకమాట మీద ఏరీతిగా ముందుకు సాగాలో మన విజయ్ విశదీకరించిన విధం అద్భుతం. నీ కోడలిలో నీవు, మా బావగారు కోరే మార్పును మీరు రేపటి నుండి చూడబోతారు. లే.... పద. ఇంటికి వెళదాము."


"అన్నయ్యా! మీ మాటలు...." శకుంతల పూర్తిచేయకమునుపే.....

"నగ్నసత్యాలు చెల్లీ!...." ఆనందంగా నవ్వుతూ చెప్పాడు గోపాలరావ్.

ప్రీతిగా సంతోషంతో తన అన్నయ్య కళ్ళల్లోకి చూచింది శకుంతల.


సమాప్తి


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.




83 views0 comments

Comments


bottom of page