#KasivarapuVenkatasubbaiah, #కాశీవరపు వెంకటసుబ్బయ్య, #Dapudu Koka, #దాపుడు కోక, #పిల్లలకథలు, #TeluguChildrenStories
Dapudu Koka - New Telugu Story Written By - Kasivarapu Venkatasubbaiah
Published In manatelugukathalu.com On 06/11/2024
దాపుడు కోక - తెలుగు కథ
రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఇడమడక అను కుగ్రామంలో మారెన్న సుంకమ్మ అనే ఒక నిరుపేద యువ దంపతులు ఉండేవారు. వారు ఏ రోజుకారోజు పని చేసుకుంటే గాని ఆరోజు గడవదు వారికి. మారెన్న తన అసమర్థత వలన, తన చేతకాని తనం వలన పేదరికాన్ని దాటలేకపోతున్న విషయం తన భార్య దగర బయటపడి ఆమె దృష్టిలో చులకన గావడం తనకు ఇష్టం లేదు. తన మాటల చతురతతో ఆమెను మభ్యపెట్టి తన అసమర్థతను కప్పిపుచ్చుకొనేవాడు. ఊరించే మాటల్తో బార్యను ఊహల్లో తేలియాడించేవాడు.
"పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు కాబట్టి ఇలా ఉన్నాను. లేకపోయింటే గనుక అప్పుడు చూపేవాడిని నా ప్రతాపమేంటో. ఊర్లో ఎవరూ నాకు సాటొచ్చేవారు కాదు" అని భార్య దగ్గర తెగ కోతలు కోసేవాడు.
అవన్నీ నిజమని అమాయకంగా నమ్మేది అతడి భార్య. "తన భర్త గొప్ప తెలివైనవాడనీ, ఎవరికీ తీసిపోని సామర్థ్యం కలవాడని, నిజంగానే పరిస్థితులు అనుకూలించక ఇలా ఉన్నాడని, అన్నీ బాగుంటే బాగా సంపాదించి నన్ను ఏ కొరత లేకుండా చూసుకోనేవాడే" అనుకుంది సుంకమ్మ.
"ఏనాటికైనా ఎదుగుతాడని, నన్ను రాణిలా చూసుకుంటాడని" అనుకొని భర్తపై అచంచలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేసేది.
ఎప్పటికప్పుడు తన మాటల గారడీతో తన భార్య కోరికలకు కళ్ళెం వెసేవాడు మారెన్న. ఆర్థిక స్థోమత లేక పండుగలు పబ్బాలప్పుడు తన భార్యకు ధర తక్కువలో నాసిరకం బట్టలు తెచ్చేవాడు. తాను కూడా ముతక గుడ్డలే తెచ్చుకొనేవాడు.
ఒక రోజు సుంకమ్మ "నాకు ఒక ఖరీదైన చీర కొనీయమని, దాన్ని పెళ్ళిళ్ళకు, పెరాటాళ్ళకు పోవడానికి మాత్రమే కట్టుకుంటానని, ఆ కోకను దాపుడుకోకగా భద్రంగా దాచుకుంటానని, ఎలాగైనా ఒక మంచి చీరను కొనీయమనీ" భర్తను పట్టు వదలకుండా పదేపదే అడిగేది.
భార్య పట్టుదల చూసి ఏమీ చెప్పాలో తెలియక సరే అన్నాడు మారెన్న. ఈ ప్రమాదం నుంచి ఎలా బయట పడాలో ఆలోచిస్తూ ఉండగా. మళ్లీ ఒకసారి జ్ఞాపకం చేస్తూ హెచ్చరించింది సుంకమ్మ.
"కోక కొనిస్తాను, కొనిచ్చేసరికి అట్లాంటిది ఇట్లాంటిది కొనియను. నీ చీరను చూసి మనవూరి ఆడవాళ్ళంతా ముక్కు మీద వేలు వేసుకోవాల. చీర అందాన్ని చూసి అందరూ అసూయ పడాల. అలాంటి చీరను కొనిస్తాను." అన్నాడు భార్యలో ఆసక్తిని రేపుతూ.
సుంకమ్మ సంబరపడిపోతూ " ఆ కోక ఎట్లుంటది" ఆతృతను భరించలేక భర్తను అడిగింది.
"ఆ కోక ఎట్లుంటదంటే, కోక పైటకు పావురాలు, అంచులకు చిలుకలు గోరువంకలు, కుచ్చిళ్ళకు వళ్ళంకి పిట్టలు పాలపిట్టలు, మధ్యలో మందార పువ్వులు, తామర పుష్పాలతో ధగధగా మెరుస్తుంటుంది. అలాంటి చీరెను ప్రత్యేకంగా నీకోసం నేపిస్తాను." భార్యకు ఊరించి చెప్పాడు మారెన్న.
సుంకమ్మ ఆనందం పట్టలేక తన భర్త కొనిస్తున్న కోక గురించి వర్ణించి వర్ణించి ఊరిలోని ఆడోళ్శందరికి గర్వంగా చెప్పింది. విన్నవారంతా "మాకు ఒకసారి కట్టుకోడానికి ఇస్తావా?" అని అడుగారు. "దాందేముందీ ఇస్తానులే " అని మాట ఇచ్చింది అడిగిన ఆడోళ్శందరికి.
చేలల్లో పనికి పోయినప్పుడు కాపామెకు చీరె విషయం ఉత్సాహంగా చెప్పింది. "నువ్వు చెపుతుంటే నాకూ ఆశగా ఉంది. నాకు ఒకసారి కట్టుకోను ఇస్తావా! సుంకమ్మ" అడుగింది కాపామె. "సరే నీకు తప్పకుండా ఇస్తాను" అంటుంది ఈవిడ.
బావికి మంచి నీళ్ళకు పోయినప్పుడు చీర సంగతి దూదేకులామెకు చెప్పుతుంది సుంకమ్మ. "నాకూ ఒకసారి ఇయ్యరాదు" అంటుంది దూదేకులామె. "ఇస్తానులే" అంటుంది ఈమె.
చాకలామె ఉతికిన బట్టలు ఇవ్వడానికి తన ఇంటికి వచ్చినప్పుడు ఆమెతో కూడా చీరకథ చెపుతుంది సుంకమ్మ. "అమ్మమ్మా! నాకు ఒకసారి ఇయ్యమ్మా" బతిమాలినట్లు అడుగుతుంది చాకలామె." ఒక్కసారే ఇస్తాను సరేనా" అంటుంది సుంకమ్మ.
సుంకమ్మ అంగడికి పోయెస్తుంటే కుమ్మరామె ఎదురు పడింది. ఆమెతోను కోక విషయం చెప్పుతుంది సుంకమ్మ. "అట్లనా! అంత అందంగా ఉంటుందా! బాబ్బాబు! నాకు కూడా ఒకసారి ఇవ్వవూ! ఒకసారి కట్టుకొని ఇస్తాను" మరీ.. మరీ.. ప్రాదేయపడి అడిగింది కుమ్మరామె. "అంతగా అడగాలా ఇందరికీ ఇస్తున్నప్పుడు నువ్వు ఎక్కువైతావా? ఇస్తాలే" అనీ సుంకమ్మ ఇల్లు చేరుకుంది.
ఆరోజు రాత్రి భర్త దగ్గరకు చేరి "నువ్వు తీపిస్తున్న దాపుడుకోక గురించి ఆడోళ్శందరికి చెప్పిన, కొందరాడోళ్ళు మెచ్చుకున్నారు, కొందరాడోళ్ళు అసూయ పడ్డారు. కొందరైతే కట్టుకోవడానికి మాకు ఒకసారి ఇస్తావా అన్నారు. ముఖ్యంగా కాపామె, దూదేకులామె, చాకలామె, కుమ్మరామె మరీమరీ బతిమిలాడి అడిగారు. నేను ఇస్తానులే అన్నాను" అని భర్తతో చెప్పింది సుంకమ్మ.
కోక తీపియలేని తన అసహాయతను కప్పిపుచ్చుకోవడానికి సమయం కోసం వేచివున్న మారెన్నకు మంచి అదును దొరికింది. ఈ అవకాశం జారవిడచ దలుచుకోలేదు మారెన్న.
కండ్లు ఎర్ర జేసీ ఉగ్రరూపం దాల్చి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు.
"ఏమే! నా కష్టాలు ఎన్ని వున్నా, నీమీద ప్రేమతో నా కష్టాలు నేను పడి నీకు అంత ఖరీదైన కోక కొనిపిస్తుంటే నువ్వు ఊరందరికీ ఇస్తావా! కోక ఏమైపోవాల. కాపామె బురద మట్టికి, దూదేకులామె దుమ్ముకు, చాకలామె చౌడుకు, కుమ్మరామె మస్సికి గబ్బుపట్టి దెబ్బతినిపోతే ఎరికె నష్టం? నేను నానా గడ్డి తిని కోక తెస్తే, నువ్వేమో ఊరందరికీ దానం చేస్తావా! కోక నేను తేను పోవే! ఇక కోక తెమ్మన్నాంటే నీ సంగతి చెప్పుతా" అంటూ మండిపడ్డాడు మారెన్న.
నవ్వుతూ పేలుతూ ఉండే మొగుడిలో ఇంత కోపం చూసేసరికి భయంతో వణికిపోయింది సుంకమ్మ.
"కోకద్దు ఏమొద్దు. నువ్వు శాంతించు సామి!. నీలో ఎప్పుడూ ఇంత కోపం ఎప్చడూ చూడలేదు. ఇంకెప్పుడూ దాపుడుకోక కొనియ్యమని అడిగను. నువ్వు ఏ గుడ్డలు తెస్తే అవే చాలుగానీ నువ్వు కోపఫడకు సామి" భయంతో చెప్పుతూ ఏడుపు ముఖం పెట్టి భర్తను చుట్టేసుకుంది.
తన ఎత్తుగడ పారినందుకు సంతోషపడ్డాడు మారెన్న.
మళ్ళెప్పుడూ దాపుడుకోక ఊసెత్త లేదు సుంకమ్మ.
-------
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
పేరు: కాశీవరపు వెంకటసుబ్బయ్య
చదువు: B.com
పుట్టిన తేది: 1960
తల్లిదండ్రులు: వెంకటసుబ్బయ్య
రచనలు: ఎద మీటిన రాగాలు కవితా సంపుటి.
అముద్రితాలు: తుమ్మెద పదాలు మని కవితలు సంపుటి, పినాకిని కథలు కథల సంపుటి.
సాహిత్య సేవ: చైతన్య సాహిత్య కళా వేదిక సంస్థను స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం.
సన్మానాలు సత్కారాలు: అనేక సాహితీ సంస్థల నుంచి సన్మానాలు సత్కారాలు పొందడం.
---------
Comments