top of page
Writer's pictureBuddhavarapu Kameswara Rao

దారి తప్పితే?

#BuddhavarapuKameswaraRao, #బుద్ధవరపుకామేశ్వరరావు, #DariThappithe, #దారితప్పితే, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

Dari Thappithe - New Telugu Story Written By Buddhavarapu Kameswara Rao

Published In manatelugukathalu.com on 18/12/2024

దారి తప్పితే - తెలుగు కథ

రచన: బుద్ధవరపు కామేశ్వరరావు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



"ఏయ్, విజేతా! టైం ఏడున్నర అయ్యింది. ఇంకా ఏమిటా మొద్దునిద్ర? చూసావా? ఇదీ మీ అమ్మ పెంపకం. అందుకే ఇలా ఏడిచింది.. " తండ్రి పురుషోత్తం అష్టోత్తరం కొనసాగుతుండగా, 


"హూ.. ఈమధ్య నాన్నకు చాదస్తం ఎక్కువైంది. హమ్మయ్యా! ఈ రోజు గడిస్తే చాలు, రేపటి నుండి నాకు ఈ సాధింపులు ఉండవు. హాయిగా ఆ కిషోర్ ఒడిలో తల పెట్టుకుని బోలెడు కబుర్లు చెప్పుకోవచ్చు. అన్నట్టు, పది గంటలకు అక్కను కూడా కలవాలి కదా?" అని మనసులో అనుకుని ఒళ్లు విరుచుకుంటూ మంచం మీంచి బద్ధకంగా లేచింది విజేత. 


దంతధావనం చేసుకుంటూ, నిన్న ఇంట్లో జరిగిన సంఘటన ఒక సారి గుర్తు చేసుకుంది, విజేత. 


 ***** ***** ***** *****


"నాన్నగారూ, నా ఇంటర్ అయిపోయింది. డిగ్రీలో చేరుతా! " వాలు కుర్చీలో కూర్చొని కాఫీ తాగుతున్న తండ్రితో చెప్పింది విజేత. 


"అవసరం లేదు. ఇంతవరకూ చదివింది చాలు. ఏం మీ అక్కలా నువ్వూ కూడా చేద్దామనా? అసలు అప్పుడే నీ చదువు కూడా మాన్పించేద్దామనుకున్నా. మధ్యలో ఆపడం ఎందుకని ఈ రెండు సంవత్సరాలూ చదివించా. అర్థమయ్యిందా?" కాఫీ గ్లాసు కిందపెడుతూ చెప్పాడు పురుషోత్తం. 


"ఏమండీ, పెద్దది అలా చేసిందని ఇది కూడా అలాగే చేస్తుందని చదువు మాన్పించితే ఎలా?" కూతురికి అండగా నిలబడి చెప్పింది సావిత్రి. 


"నీ దిక్కుమాలిన సలహా వినే పెద్దదాన్ని కాలేజీలో చేర్పిస్తే, నాకు తలవంపులు తెచ్చే పనిచేసింది. అందుకే పనికిరాని సలహాలు ఇవ్వడం మానేయ్. ఇంకో విషయం ఆ పామర్రు సుబ్బరాయశర్మ గారు ఏదో పెళ్లి వేడుకలో మన విజేతను చూసారుట. వాళ్ల అబ్బాయికి కూడా ఇది బాగా నచ్చిందిట. మనం ఊ అంటే వచ్చి మిగతా విషయాలు మాట్లాడుతారుట" దినపత్రిక చూస్తూ చెప్పాడు పురుషోత్తం. 


"అలాగే నాన్నగారూ! మీ ఇష్టం" అని చెప్పింది విజేత, ఆ సంభాషణ ఇంకా పొడిగించడం ఇష్టంలేక. 


"అదీ పద్దతి అంటే! ఇంక కబుర్లు ఆపి, ఈ రోజు నుంచి పిల్లకు వంటా వార్పూ నేర్పు" భార్యకు చెప్పి, స్నానానికి లేచాడు పురుషోత్తం. 


వెంటనే పెరట్లోకి వెళ్లిన విజేత ఫోన్ తీసి, 

"కిషోర్! నాకు పెళ్లి చూపులు చూస్తున్నారు. ఇంకా ఆలశ్యం చేయడం అనవసరం. ఈ రాత్రి కానీ రేపు ఉదయం కానీ వచ్చి నన్ను తీసుకుని పోవచ్చు కదా?" అంటూ గారంగా, నెమ్మదిగా అడిగింది. 


"స్వీటీ, రేపు చిన్న ఫంక్షన్ ఉంది. ఎల్లుండి ఉదయం ఆరు గంటలకు మీ ఇంటి బయట రెడీగా ఉండు. నేను బైక్ పై వచ్చి నా స్వీటీని తీసుకుని 'మేఘాలలో తేలిపొమ్మన్నది' అని పాడుకుంటూ తీసుకుని పోతా.. ఎల్లుండి ఉదయం.. మర్చిపోకు.. " అంటూ రెండు గాలి ముద్దులు ఇచ్చి ఫోన్ పెట్టేసాడు కిషోర్. 


ఆ తరువాత తన అక్క ప్రగతికి "అక్కా! రేపు ఉదయం కాకినాడ బస్టాండ్ వద్దకు రాగలవా? నీకో సర్ప్రైజ్. అక్కడే చెబుతాను" అని మెసేజ్ పెట్టింది. 


 కొద్ది నిమిషాలలోనే అక్క నుంచి "ఓకే" అని మెసేజ్ రాగానే, ఆనందంగా ఇంట్లోకి వెళ్లింది విజేత. 


 ***** ***** ***** *****


"ఏమే విజ్జూ, ఏం చేస్తున్నావు లోపల? కొంపతీసి అక్కడే పక్కేసావా?" అన్న తల్లి అరుపులతో గతంలోంచి వాస్తవంలోకి వచ్చింది విజేత. 


గబగబా తెమిలి

"అమ్మా! మా ఫ్రెండ్ కమలకు ఈ పుస్తకాలు ఇచ్చి వస్తా. కొంచెం ఆలశ్యం అయినా కంగారు పడకు" అని చెప్పి బయలుదేరబోతున్న కూతురితో, 


"జాగ్రత్తమ్మా! మొన్న ఇలాగే తెలియక దారి తప్పిపోయావ్. పోనీ నేను సాయం రానా?" అడిగాడు పురుషోత్తం. 


"అప్పుడు మొదటిసారి కాబట్టి అలా జరిగింది నాన్నగారూ. ఇప్పుడు అలా జరగదు" అని చెప్పి, ఓ అరగంట ప్రయాణం చేసి, కాకినాడ బస్టాండ్ కు చేరుకుంది విజేత. 


 ***** ***** ***** *****


రాజమండ్రి నుంచి వచ్చి, బస్టాండ్ లో వెయిట్ చేస్తున్న ప్రగతి, విజేతను చూడగానే, 

"ఎలా ఉన్నావే విజ్జూ, అమ్మా నాన్నగారు బాగున్నారా? ఇంతకీ ఏమిటి సర్ప్రైజ్ అన్నావ్? కొంపతీసి నాన్నగారు కానీ నా విషయంలో మనసు మార్చుకుని నన్ను ఇంటికి రమ్మన్నారా?" ఆశగా అడిగి, చెల్లెల్ని హత్తుకుంది. 


"అక్కా! ఎప్పుడైతే నువ్వు, నాన్నగారిని ఎదిరించి నీ కాలేజ్ మేట్ రమేష్ ని గుడిలో పెళ్ళి చేసుకున్నావో అప్పుడే నీకు ఆయన నీళ్లు వదిలేసారు. ఏదో మేజిక్ జరిగితే తప్ప నువ్వు ఆ గుమ్మం తొక్కడం అనేది కల్ల" తండ్రి మనస్తత్వం గురించి తెగేసి చెప్పింది విజేత. 


"మరి నన్ను రమ్మన్నది దేని గురించే?" వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ అడిగింది ప్రగతి. 


"అక్కా.. అదీ.. అది.. నేనూ, కిషోరూ ప్రేమించుకున్నాం. కానీ నాన్న నాకు సంబంధాలు చూస్తున్నారు. నీకు తెలిసిందే కదా? ఈ పెద్దవాళ్ళకు మనుషులు నచ్చితే చాలు, మనల్ని చేసేసుకొమ్మంటారు. అంతే తప్ప, మన మనసులు గురించి ఆలోచించరు. ఈ విషయంలో నువ్వు మంచి పని చేసావు. నీకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకొని హాయిగా సంసారం చేస్తున్నావు. అందుకే నేను కూడా నీ బాటలోనే పయనిద్దామని.. " అంటూ తనకూ, కిషోర్ కు మధ్య జరుగుతున్న ప్రేమ వృత్తాంతం మొత్తం చెప్పింది విజేత. అంతా విని, 


"నా సహాయం నీకు ఎప్పుడూ ఉంటుంది. సరే, ఈ కిషోర్ నీ స్నేహితురాలి అన్నగారి ఫ్రెండ్ అన్నావు, బాగుంది. ఔనూ.. ఇంతకీ ఇతను ఎవరబ్బాయే?" ఆశ్చర్యంగా అడిగింది ప్రగతి. 


"అతను పాలెం ప్రెసిడెంట్ గారి మేనల్లుడు. చాలా మంచి వ్యక్తి. రేపు ఈ సమయానికి అతనితో ఉంటా.. " తన్మయత్వంతో చెబుతోంది విజేత. 


చెల్లి చెప్పింది వినగానే దిగ్భ్రాంతికి లోనైన ప్రగతి 

"విజ్జూ! నువ్వెంత అదృష్టవంతురాలివే. ఒక వేటకుక్క బారి నుంచి తప్పించుకున్నావు. లేకపోతే నీ బతుకు కుక్కలు చింపిన విస్తరి అయ్యేది. అందుకే ముందు పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి నాన్నగారు తెచ్చిన సంబంధం చేసుకుని హాయిగా జీవించు" అని చెల్లికి సలహా ఇచ్చింది. 


"ఏమిటక్కా నువ్వనేది????" ఆశ్చర్యంగా అడిగింది విజేత. 


"వెర్రిపీనుగా! ఈరోజు మధ్యాహ్నం అతనికి లావణ్యతో తునిలో ఎంగేజ్మెంటే! ఇది నాకు ఎలా తెలిసింది అని అడగకు. నా మాటలు నమ్ము. కావాలంటే నువ్వే ఎంక్వయిరీ చేసుకో. ఆలశ్యం చేస్తే నాన్నగారికి అనుమానం వస్తుంది. వెంటనే బయలుదేరు" కూర్చున్న బల్ల మీద నుంచి లేస్తూ చెప్పింది. 


"అక్కా! నువ్వు చెబితే అది నాకు వేదం కింద లెక్క, దానికి మళ్లీ ఎంక్వయిరీ ఎందుకు? వాడు అంత దుర్మార్గుడు అని నాకు తెలియదే. నా కళ్ళు తెరిపించావు" అని అక్క దగ్గర శెలవు తీసుకుంది విజేత. 


 ***** ***** ***** *****


బస్సులో రాజమండ్రి తిరిగి వెళ్తున్న ప్రగతి పొద్దున్న జరిగిన సంఘటనలు ఓ సారి గుర్తు చేసుకుంది. 


"ఏంటి రమేష్? నీకు పెళ్లి అయ్యిందన్న విషయం దాచిపెట్టి, నన్ను ప్రేమించినట్టు నటించి గుళ్లో పెళ్లి చేసుకున్నావు. ఈ రెండేళ్ళలో నా మీద ప్రేమ తగ్గి, విసుక్కోవడం మొదలెట్టావు. ఇది పద్ధతేనా?" భర్తను నిలదీసింది ప్రగతి. 


"నా గురించి పూర్తిగా తెలుసుకోకుండా నన్ను ప్రేమించి నా వెనుక వచ్చేయడం నీ తప్పు. సరే, ఇప్పటికీ మించి పోయింది లేదు. నీకు ఇష్టం లేకపోతే మీ నాన్న దగ్గరకు వెళ్లి పో. నేను ఏలూరు మా ఆవిడ, పిల్లల దగ్గరకు వెళ్తున్నా. ఓ వారం రోజుల వరకూ రాను. ఇదిగో ఖర్చులకు ఉంచుకో" అని టేబుల్ మీద డబ్బు పెట్టి వెళ్తున్న రమేష్ వైపు వెర్రిగా చూస్తూ ఉండిపోయింది ప్రగతి. 


కాసేపటికి, పక్కింట్లో ఉన్న పద్మ వచ్చి, 

"ప్రగతి, ఈ ఇంటి తాళాలు నీ వద్ద ఉంచు. రేపు వస్తాం. ఈరోజు తునిలో మా చుట్టాలమ్మాయి లావణ్యకు ఎంగేజ్మెంట్" అని తాళాలు అందించింది. 


"అలాగే ఆంటీ, ఇంతకీ మగపెళ్లి వారిది ఏ ఊరు?" ఆసక్తి గా అడిగింది ప్రగతి. 


"పెళ్లి కొడుకు పేరు కిషోర్. ఆతను పాలెం ప్రెసిడెంట్ గారి మేనల్లుడు" చెప్పి బయటకు నడిచింది పద్మ. 


"టికెట్.. టికెట్.. "అంటూ వచ్చిన కండక్టర్ పిలుపుతో ఆలోచన లోంచి బయటకు వచ్చిన ప్రగతి, 

"చెల్లాయ్ ఎంత అదృష్టవంతురాలు. అనుకోకుండా భగవంతుడు దానికి సహకరించాడు. నాకు కూడా అలా జరిగి ఉంటే నా బతుకు ఎంత బాగుండేదో.. ??? " కళ్లలోంచి ధారగా కారుతున్న కన్నీళ్లు తుడుచుకుంటూ బస్సు కిటికీకి జారపడి శూన్యం లోకి చూస్తూ ఉండి పోయింది ప్రగతి. 


 ***** ***** ***** *****


"బాబూ! ఈ ఉంగరం తీసుకుని అమ్మాయి వేలుకు అలంకరించు" పురోహితుడు చెప్పినట్లు చేసి, కూర్చున్న కిషోర్, ఫోన్లో ఏదో మెసేజ్ రావడంతో, అది ఓపెన్ చేసి చూసాడు. 


"కిషోర్, 

మా బంధువుల అబ్బాయితో నాకు పెళ్లి కుదిరింది. ఎల్లుండి తాంబూలాలు, బహుశా ఈ నెలలోనే పెళ్లి. నువ్వు నీ ఉడ్ బీ లావణ్య ను తీసుకుని తప్పకుండా రావాలి. 

మరచిపోకు. 

నీ 

స్వీటీ విజేత. 


ఆ మెసేజ్ చూసిన కిషోర్ ఒక్కసారిగా ఉలిక్కిపడి, వెంటనే విజేతకు సంబంధించిన అన్ని కాంటాక్ట్ లు తన ఫోన్ లోంచి డెలిట్ చేసేసాడు, కాబోయే భార్య లావణ్య, ఉంగరం సవరించుకుంటూ తన వైపు నవ్వుతూ చూస్తుండగా!


***** ***** ***** *****


ఇంటికి చేరుకున్న విజేత, ఎలాగైనా తండ్రిని ఒప్పించి అక్క ప్రగతిని ఈ ఇంటికి తీసుకుని రావాలని నిశ్చయించుకుని, ఒంటింట్లో ఉన్న తల్లి వద్దకు చేరుకుని ఆ విషయం చెప్పి


"అమ్మా! ఆ పామర్రు సుబ్బరాయశర్మ మావయ్య గారి అబ్బాయి పేరు ఏమిటి?" అడిగింది తల్లిని గోముగా. 


హాల్లో కూర్చుని తల్లీకూతుళ్ల సంభాషణ విన్న పురుషోత్తం, 

"అతని పేరు విష్ణుశర్మ. అన్నట్టు ఇందాకా ఫోన్ చేసారమ్మాయ్. ఎల్లుండి నిన్ను చూసుకోవడానికి వస్తున్నారు. నచ్చితే ఆ రోజే తాంబూలాలు. అలాగే వీలు చూసుకుని అక్కను కూడా రమ్మను.." తండ్రి చెబుతున్న మాటలు వింటూ, ఆనందంగా తన గదిలోకి వెళ్ళి పోతున్న విజేతను చూస్తూ ముసిముసిగా నవ్వుకున్నారు ఆ దంపతులు. 



***** **శుభం** *****


బుద్ధవరపు కామేశ్వరరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు :: బుద్ధవరపు కామేశ్వరరావు


జననం : తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం దగ్గర లో ఉన్న జగన్నాధగిరి అనే గ్రామంలో డాక్టర్ సూర్యనారాయణ రావు, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించిన 11 మంది సంతానంలో 7 వ వానిగా 1958లో.


వృత్తి : ఒక మల్టీ నేషనల్ కంపెనీలో అకౌంట్స్ మేనేజర్ గా 2016 లో పదవీ విరమణ చేసి ప్రస్తుతం హైదరాబాద్ లోని స్వగృహంలో విశ్రాంత జీవనం.


కుటుంబ నేపథ్యం: భార్య శేషుకుమారి, ఓ అమ్మాయి (సూర్యకళ, అల్లుడు వాసూరావు, వాళ్లకి ఇద్దరు పిల్లలు. పేర్లు సంకీర్త్, ష్రఘ్వి) ఓ అబ్బాయి(పేరు శశికాంత్, కోడలు శిరీష, వీరికి ఓ అబ్బాయి. పేరు శక్య)


వ్రాయడం మొదలుపెట్టింది : 2017 నుంచి

ఇంతవరకూ రాసిన కథలు : 212


ప్రచురణకు నోచుకున్నవి:

సుమారు... 98


మిగిలినవాటిలో కొన్ని వివిధ మాధ్యమాలలో పరిశీలనలోనూ,

మరికొన్ని మెరుగులు దిద్ది పంపే ప్రక్రియలో నావద్దనూ పెండింగ్ లో ఉన్నవి.



పోటీలలో బహుమతులు పొందినవి (15)


ప్రోత్సాహం ఇస్తున్న వారు:

పత్రికాధిపతులు, సంపాదకులు, సమీక్షకులు, అలాగే పాఠకులు అందరూ !


21 views0 comments

Comments


bottom of page