top of page
Writer's pictureLakshmi Sarma B

దత్తపుత్రుడు - పార్ట్ 1

వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)


'Datthaputhrudu Part 1/2' - New Telugu Story Written By Lakshmi Sarma Thrigulla

Published In manatelugukathalu.com On 21/02/2024

'దత్తపుత్రుడు - పార్ట్ 1/2' తెలుగు పెద్ద కథ ప్రారంభం

రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



గిన్నెలో బియ్యం పోసి కడుగుతూ పరధ్యానంగా ఉన్న భార్యను చూసి, “ఏమిటి తులసి, నీకు ఈ మధ్యన పరధ్యానం ఎక్కువైపోయింది, ఇలా చూడు.. నువ్వు బియ్యకడుగుతూ ఎన్ని బియ్యాన్ని ఒలకపోసావో, అసలేమయింది నీకు.. ఒంట్లో బాగుండడంలేదా ? డాక్టర్ ను ఏమైనా పిలిచేదా ఇంటికి, ” అడిగాడు మురహరి. 


“అయ్యో! ఏమిటో నా మతిమండా.. నీళ్ళు వంపుతున్నాను అనుకున్నాను గానీ బియ్యం పారబోస్తున్నానని చూడడమేలేదు. దోశకోసం నానపోస్తున్నాను. నేను బాగానే ఉన్నాను, మీరేం గాబరపడకండి, ” పారబోసిన బియ్యాన్ని ఎత్తుతూ అంది. 


“ ఏమిటోనోయ్, నువ్వీమధ్య వంటలు కూడా రుచిగా వండట్లేదు. దేనిలో ఒకదాంట్లోనన్నా

ఉప్పుకారాలు ఎక్కువేస్తున్నావు. ఆ, ఆ.. నాకొకటి అర్ధమైందిలే. నిన్ను ఆ కాశీ విశ్వేశరుని దర్శనానికి తీసుకవెళతానని చెప్పి తీసుకెళ్లడం లేదని నా మీద కోపంగా ఉంటున్నావు కదూ, ” మురిపెంగా తులసి వైపు చూస్తూ అడిగాడు. 


“అబ్బా, అదేం లేదు కాదుగానీ.. మీరు త్వరగా పూజ కానిచ్చుకొండి. టిఫిన్ తయారుగా ఉంది. మీకు లేటుగా తినే అలవాటులేదు కదా, ” అంది మాట మారుస్తూ. 


“ ఇదిగో వెళుతున్నాను. మరి నువ్వు కూడా పూజచేసుకుంటే ఇద్దరం కలిసి తినొచ్చుకదా, ఇన్నాళ్ళంటే నేను పెందరాళే బడికి వెళ్లాలి కనుక తొందరగా తినేసి వెళ్ళిపోయేవాడిని.

 ఇప్పుడా హడావుడి లేదుకదా తులసి, ఉన్న ఇద్దరం కలిసి తినకపోవడమేంటి, ” నవ్వుతూ అడిగాడు మురహరి. 


“ చాల్లెండి మీ బడాయి కాకపోతే నేనెప్పుడైనా ఉదయం పూట టిఫిన్ తిన్నానా చెప్పండి? మీకు వంట, టిఫిన్ చేసి ఇచ్చి మీరు వెళ్ళిపోయాక తీరికగా పనులన్నీ చేసుకుని, పూజచేసుకునే సరికి పన్నెండవుతుంది. ఇక అప్పుడు బాలు వస్తాడు, వాడికి అన్నంపెట్టి కాసేపు వాడితో మాట్లాడి ఏకంగా భోజనం చెయ్యడమే, ” చెబుతుంటే ఆమె గొంతుకు ఏదో అడ్డంపడ్డట్టుగా బాధపడుతూ చెప్పడం ఆపేసింది. 


“అరే ఏమైంది తులసి.. ఇదిగో ఈ నీళ్ళు తాగు, ” కంగారుపడుతూ అన్నాడు. నీళ్ళు తాగి భర్తకు కనిపించకుండా కళ్ళు తుడుచుకుంది. మురహరి పూజ చేసుకుని టిఫిన్ ముగించుకునేసరికి తన స్నేహితుడు గోవిందు వచ్చాడు. కబుర్లలో పడిపోయారంటే ఇంకేమి గుర్తుకురావు మురహరికి. 


మురహరి రెండునెలలు కావొస్తుంది పదవీ విరమణ చేసి. బడిపంతులుగా మంచిపేరు తెచ్చుకున్నాడు. స్వతహాగా మంచి దానగుణం కలిగినవాడు. అతనికి తగ్గట్టుగా తులసి. ఇద్దరికిద్దరు ఇరుగుపొరుగుతో మంచిగా కలిసిమెలిసి ఉంటూ 

ఆదర్శదంపతులుగా పేరు తెచ్చుకున్నారు. 


“ఏమోయ్ మాకు కాస్తా టీ ఇచ్చేదేమన్నా ఉందా? మన గోవిందు వచ్చాడు, ” ఇంటిముందు వసారాలో కూర్చొని భార్యను కేకవేసాడు. 


“ఆ తెస్తున్నాను, ” అంటూ చెప్పింది లోపలనుండి. 


“ అబ్బే ఇప్పుడెందుకురా టీ.. ఇంటినుండే వస్తున్నాను కదా,” మొహమాటపడుతూ అన్నాడు గోవిందు. 


“భలేవాడిరా.. టీ కాఫీలు ఎన్నిసార్లన్న తాగొచ్చు, ఏం మనం స్కూల్‌లో పని చేస్తున్నప్పుడు తాగకపోయేవాళ్ళమా చెప్పు, ” అడిగాడు నవ్వుతూ. 


“ఏం గోవిందన్నా .. ఇంటివైపు రావడమే మానేసారు, మనవళ్ళు మనవరాలితో తీరడంలేదా ? అవును ఈ మధ్య పద్మ కూడా కనిపించడంలేదు ఎక్కడైనా ఊరెళ్ళారా, ”

ఇద్దరికి టీ అందిస్తూ అడిగింది తులసి. 


“అదేంలేదమ్మా.. ఏమిటో నేను స్కూల్‌లో పని చేసినప్పుడే బాగుండేది, టయానికి టంఛనుగా టిఫిన్ తిని టీ తాగి బయటపడేవాణ్ణి, ఇప్పుడలా కాదు నా కోడలు పెట్టినప్పుడే తినాలి, టీ కూడా రోజులో ఒకేసారి తాగాలట ఎందుకంటే షుగర్ బీపిలు వస్తాయని ముందుచూపట, రిటైర్మెంట్ అయ్యాక పనేమి ఉండదు కదా అందుకని తిన్నది అరగించుకోవడం కష్టమని చెప్పిందమ్మా మా కోడలు, ” చెప్పాడు నవ్వుతూ. 


“మరింకేం, తిండి విషయం తగ్గింది. మరి పద్మ కాసేపు అలా బయటకు రావచ్చు కదా! కాస్త నడిచినట్టవుతుంది, నలుగురితో మాట్లాడుతుంటే మనసు కొంచెం నెమ్మదిగా ఉంటుంది” అంది తులసి. 


“అయ్యో అదేం లేదమ్మా.. నేను స్కూల్‌కు పోయినప్పుడు గమనించలేదుగానీ, పాపం తనకు ఊపిరి సలపని పని ఉంటుంది, కోడలేమో సాప్ట్ వేర్ ఇంట్లోనుండి పని చేస్తుందన్నమాటే కానీ, మీటింగులు పనితోనే సరిపోతుంది ఇంటిపని పిల్లలపని అంతా పద్మనే చూసుకునేప్పటికి క్షణం తీరిక ఉండదు, తనను చూస్తుంటే నాకే జాలి అనిపిస్తుంది

కొన్ని రోజులు ఏదైనా తీర్థయాత్రలకు వెళ్దామని అనుకుంటున్నాను, కాస్తా మనసు ప్రశాంతంగా ఉంటుందేమోనని, ” చెప్పాడు గోవిందు. 


గోవిందుకు మురహరికి ఏ విషయంలోను దాపరికాలు ఉండవు కష్టసుఖాలన్నీ మాట్లాడుకుంటారు. 


“సరే మీరు మాట్లాడుతుండండి నేను వంటచేసుకుంటాను, ” అంటూ లోపలకు వెళ్ళిపోయింది తులసి. మనసంతా భారంగా ఉంది. పిల్లలు ఉంటే ఒకరకమైన సంతోషం

కోడళ్ళు వచ్చాక ఆ సంతోషమంతా ఆవిరైపోతుంది. ఏమిటో పద్మను చూస్తుంటే చాలా బాధేస్తుంది. కడుపున పుట్టిన పిల్లలులేకపోయారని మేము బాధపడుతుంటే, కన్నపిల్లలే

తల్లితండ్రులను బాధపెడుతున్నారు ఏమిటో మనుషులు ఎవరికెవరు అర్థంకారు తనలోతానే అనుకోసాగింది తులసి. 


“ఏమిటో గోవిందు.. నీ పరిస్థితి చూస్తే అలా ఉంది, ఇక మా తులసికి ఏమయిందో ఏంటోగానీ ఈ మధ్యలో ఎందుకో తనలోతానే కుమిలిపోతుంది ఏమిటంటే ఏమిలేదు

అంటుంది, ఏదో పరధ్యానంగా ఉంటుంది పదిసార్లు పిలిస్తేగాని పలకడంలేదు, మనిషి కూడా నీరసంగా అనిపిస్తుంది దేని గురించో మదనపడుతున్నట్టుగా అనిపిస్తుంది, అడిగితే నేను బాగానే ఉన్నాను అంటుంది, ” బాధపడుతూ స్నేహితుడితో చెప్పుకున్నాడు. 


“మురహరి .. తనకు వాళ్ళ పుట్టింటి వాళ్ళనుండి ఏమైనా ఇబ్బందులున్నాయా? ఎవరైనా తన మనసుకు ఇబ్బంది కలిగించేలా మాట్లాడరేమో, నువ్వు తనను పట్టించుకోవడం

లేదని ఏమైనా బాధపడుతుందా? అదేం అయ్యుండదనుకో, నువ్వు తనతోపాటే ఉంటున్నావు కదా, ” అడిగాడు గోవిందు. 


“అబ్బే అలాంటిదేంలేదు.. తనేప్పుడు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళదు కూడా, తన మనసుకు స్థాయిలేకుండాపోయింది పోని ఎటైనా తిరిగొద్దామాని ఉంది,” అన్నాడు. 


“మంచిమాట చెప్పావురా .. నేను అదే అనుకుంటున్నాను, మన నలుగురం కలిసి తీర్థయాత్రలకు వెళ్దాము సరదాగా ఉంటుంది, మనకు కాస్తా ప్రశాంతత దొరుకుతుంది ఏమంటావు, ” ఆత్రంగా అడిగాడు గోవిందు. 


“నిజమేరా గోవిందు.. ఎక్కడికి వెళదామో ఆలోచించు, మా తులసికి రైలు ప్రయాణమంటే ఇష్టం. అందుకని ముందే రిజర్వేషన్ చేయించుకుంటే హాయిగా వెళ్ళిరావచ్చు, అదిసరే, ఏమిటి ఇంకా మన ఊర్లో విశేషాలు, ” అడిగాడు. 


“ఆ ఏముంది ఎలక్షన్లు వస్తున్నాయి కదా అదే హడావుడి, నీకు ఈ విషయం తెలుసట్రా.. మన ఊర్లో ఉన్న బిచ్చగాళ్ళందరిని పోలీసోళ్ళు పట్టుకుపోయారట, 

పాపం ఇంటింటికి తిరిగి గుప్పెడు మెతుకులకోసం ఆరాటపడుతుండే బిచ్చగాళ్ళను ఎందుకు పట్టుకపోయినారో నాకు ఇప్పటికి అర్ధం కావడంలేదు, ” ఆశ్చర్యపోతూ అన్నాడు. 


“అరే అదేమిటి.. వాళ్ళేం చేసారు పాపం, ఎలక్షన్లు వస్తే వాళ్ళతోటి ఇబ్బంది ఏంటటా? ఎన్ని రోజులవుతుంది.. నాకు తెలియనేలేదు ఈ విషయం, ” అన్నాడు. 


“పదిహేను రోజులవుతుందనుకుంటా.. ఆ ఏముంది మినిష్టర్లు కలెక్టర్లు వస్తుంటారు కదా! అప్పుడు ఈ బిచ్చగాళ్ళందరు అడుక్కుంటూ వాళ్ళ వెంబడిపడతారని వీళ్ళ భయం. మన ఊరు ఇంత దరిద్రంగా ఉందనుకుంటారని ముందుచూపు, కానీ ఇప్పుడు ఆ బిచ్చగాళ్ళు లేకపోతే రోజు మిగిలిపోయినా వంటలు ఏం చెయ్యాలో అర్ధంకాక పెంటకుప్పలో పోయాల్సివస్తుంది, పాపం వాళ్ళకు ఇంత తిండి దొరికేది, ” చెప్పాడు గోవిందు. 


“అవును.. వాళ్ళను ఎక్కడకు తీసుకవెళ్ళారు” అడిగాడు. 


“ఇంకెక్కడికి.. జైలుకు! రెండుపూటల తిండి దొరుకుతుందని వాళ్ళకు అదే సంతోషంగా ఉండి ఉంటుంది, ” అన్నాడు. 


“గోవిందు .. నువ్వు చెబుతుంటే నాకొక ఆలోచన వస్తుంది, మా తులసి దేని గురించో బాధపడుతుంది అన్నాను కదా! నాకు ఇప్పుడర్ధమౌతుంది, ఎందుకంటే మా తులసికి ఆ బిచ్చగాడు బాలు ఉన్నాడు చూడు, అమ్మో వాణ్ణి బిచ్చగాడు అంటే తులసి విన్నదంటే చాలా కోపం వస్తుంది, ” అంటూ అటు ఇటు చూసి. “వాడంటే తులసికి చాలా అభిమానం

రోజు వాడిని కూర్చోబెట్టుకుని కడుపునిండా తిండిపెట్టి, కాసేపు ఏదో లోకాభిరామాయణం మాట్లాడందే తనకు తోచదు, అంతలా పెనవేసుకుంది వాడిమీద ప్రేమ ఇప్పుడు వాడు కనిపించకపోయేసరికి మనసు వ్యాకులత పడుతున్నట్టుంది, అందుకే అలా పరధ్యానంగా ఉంటుంది” అసలు విషయం తెలిసిపోయిందన్నట్టుగా ఊపిరి పీల్చుకున్నాడు మురహరి. 


“అదేంట్రా అడుక్కునే వాడిమీద ప్రేమ అంటున్నావు, వాళ్ళు ఒకచోట కాకపోతే ఇంకోచోటకు వెళతారు. అంతేగాని వాళ్ళమీద మనం అభిమానం పెంచుకోవడాలు, వాళ్ళు కనిపించకపోతే ఏదో కోల్పోయినట్టు బాధపడడం నాకేం అర్ధం కావడంలేదు, ” వ్యంగ్యంగా అన్నాడు గోవిందు. 


“అదికాదురా గోవిందు.. బాలు చూడడానికి ముద్దుగా ఉంటాడు ఎవరి కన్నబిడ్డో గానీ, పాపం ఒక కాలు కుంటుతూ నడుస్తాడు. ఎవరిపాపమో వాడికి శాపంగా మారింది.

వాడు రావడం కాస్తా లేటయిందంటే చాలు వాడికోసం తినకుండా ఎదురుచూస్తూ కూర్చుంటుందట. కానీ నేనెందుకు గమనించలేదు ఇంట్లోనే ఉంటున్నాను, తులసి నాతో కలిసి తింటుందని సంతృప్తిపడుతున్నాను గానీ, తను బాలు కోసం బాధపడుతుందని ఆలోచించలేక పోయాను గోవిందు, నేనిప్పుడే తులసికి ఈ విషయం చెప్పి వస్తాను, ” అంటూ లేచాడు మురహరి. 


“సరే మరి, నేను వెళతాను. మళ్ళి కలుస్తాను” వెళ్ళిపోయాడు గోవిందు. 


“తులసి .. ఏం చేస్తున్నావు ? నీకో విషయం తెలుసా, మన బాలు రావడంలేదని నాతో చెప్పనేలేదు.. వాడెక్కడున్నాడో తెలుసా, ” అడుగుతూ వంటచేస్తున్న తులసి దగ్గరకు వచ్చాడు. 


 భర్త నోటినుండి బాలు పేరు వినగానే చేస్తున్న పని ఆపి. “బాలు.. బాలు మీకు కనిపించాడా ? ఎక్కడున్నాడు వాడు? మనింటికి ఎందుకు రావడంలేదట, ఈ అమ్మమీద

కోపం వచ్చిందటనా వాడికి? వాడిని చూడకుండా ఎలా ఉంటాననుకున్నాడు.. ” ఆనందం, బాధ ధ్వనించే స్వరంతో అడిగింది భర్తను. 


“తులసి .. ఎందుకే నీకు బాలు అంటే అంతపిచ్చి.. వాడేదో నీ స్వంతం అన్నట్టుగా అంత ప్రేమపెట్టుకున్నావు. వాడికి ఎక్కడ తిండి దొరికితే అక్కడికి వెళ్ళిపోతాడు. నువ్వు ప్రేమతో పెడుతున్నావని ఇక్కడే ఉంటే వాడికి జరుగుబాటు కావద్దు? దేనికైనా పట్టువిడుపు అంటూ ఉండాలి కానీ, మరీ వాడే లోకం అంటే ఎలా, ” భార్యను దగ్గరకు తీసుకుని బుజ్జగిస్తూ మాట్లాడాడు, పోలీసులు తీసుకవెళ్ళారంటే ఎంత బాధపడుతుందోనని. 


“ఇంతకు, బాలు మీకు కనిపించాడా లేదా, ” విసుగును ప్రదర్శిస్తూ అడిగింది. 


“వస్తున్నా, అక్కడికే వస్తున్నా.. నేను చెప్పేది నువ్వు ప్రశాంతంగా విను. ఆ తరవాత ఏం చేద్దామనేది నేను చెబుతాను, ” అన్నాడు. తులసికి ఏదో అనుమానంగా ఉంది మనసులో, బాలుకు ఏమన్నా జరగరానిది జరిగిందా ఆందోళనపడుతూ. 

========================================================================

ఇంకా ఉంది..

========================================================================

లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు. 






57 views0 comments

Comments


bottom of page